కైంకర్యము-9

4
2

[box type=’note’ fontsize=’16’] ఒక మామూలు మనిషి, ఒక ఆధ్యాత్మిక శక్తిగా ఎదిగే ప్రక్రియను ప్రదర్శించే ఆధ్యాత్మిక నవల సంధ్య యల్లాప్రగడ రచించిన కైంకర్యము. చదవండి. [/box]

[dropcap]1[/dropcap]949 -మార్గశిరము.

మార్గశిరాన్ని ధనుర్మాసమంటారు వైష్ణవులు. ఈ మాసమంతా హరికి ఎంతో ప్రియమైన నెల(మాసమ)ని వైష్ణవుల నమ్మకం. ధవళేశ్వరములో గోదావరి నెమ్మదిగా ప్రవహిస్తుంది, బ్యారేజు ప్రక్కనే కాబట్టి. ఆ నది పక్కన పొలాల పచ్చదనానికి, భూమి ఎప్పుడూ పులకరిస్తూ ఉంటుంది. ఊరికి కొంత దూరంగా, అక్కడక్కడ పొలాల మధ్య ఇళ్ళు. చూడగానే చుక్కలను మరిపిస్తూ, మురిపిస్తూ ఉంటాయి.

అలా ఉన్న ఇళ్ళలో, ఒక పెంకుటిల్లు నుంచి ద్రవిడ పాశురాల గానం మధురంగా వినపడుతోంది.

“భూతం సరస్చ మహదాహ్వాయ భట్టనాథ

శ్రీ భక్తిసార కులశేఖర యోగివాహాన్;

భక్తాంఘ్రీ రేణు పరకాల యతీంద్ర మిశ్రాన్

శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యమ్” అంటూ ఆళ్వారుల పేర్లతో మొదలయ్యే ఆరాధన వినపడుతోంది.

నిష్ఠాగరిష్ఠుడు, పరమభక్తుడు, భగవతోత్తముడైన వరదాచారి ఇల్లది.

ఆ ఊరి కోవెలలో రంగనాథుని కొలిచే అర్చకస్వామికి స్వయంగా అన్నగారు, ఈ వరదాచారి. ధవళేశ్వర నివాసి, పరమ వైష్ణవుడాయన.

ఉదయం, ఆ ఊరి పిల్లలకు, ఆసక్తి ఉన్న పెద్దలకందరికీ ఆయన పాశురాలు నేర్పుతాడు. పాశురాలంటే ఆళ్వారులు రచించినవి. ఆళ్వారులు విష్ణుభక్తి పారవశ్యంలో మునకలేసివారు. విష్ణువును గురించి సంస్కృతంలోనూ, తమిళంలోనూ స్తోత్రాలు రచించారు. తమిళంలో రచించిన స్తోత్రాలను ‘పాశురాలు’ అంటారు. పాశురాల సంకలనాన్ని ‘ద్రవిడ వేదం’ అంటారు. ఆళ్వారులు పన్నెండు మంది. ఆళ్వారులు అంటే లోతులను చూసిన వారని ఒక అర్థం.

విశిష్టాద్వైత మతాన్ని వ్యాప్తిలోకి తెచ్చిన ఆచార్యత్రయం అంటే శ్రీనాథముని, యామునాచార్యులు, రామానుజాచార్యులు ముగ్గురూ ఆళ్వారుల వల్ల ప్రభావితులైన వారే (ఆచార్య త్రయాన్ని మునిత్రయం అని కూడా అంటారు). ఆళ్వారులు స్పష్టంగా ఫలానా కాలం వారని చెప్పడానికి ఆధారాలు లేవు కాని, నిస్సందేహంగా ఆచార్య త్రయానికి ముందువారే. వీరు వ్రాసిన పాశురాలు మొత్తం 4000 పైచిలువ ఉంటాయి.

‘వేదాంత దేశికులు’ 1268 నుండీ, 1369 వరకూ శతాయుష్మంతులై జీవించిన పరమ భాగవతోత్తముడు, రామానుజ శిష్యుడు. తమిళంలో, సంస్కృతంలో, ప్రాకృతంలో మొత్తంగా 125కు పైగా రచనలు చేసిన ఘనుడు. ఈయన వ్రాసిన హంససందేశం మేఘసందేశమంత గొప్పది. రాముడు లంకలో ఉన్న సీత కోసం ఒక హంస ద్వారా సందేశాన్ని పంపడం ఇందులోని వృత్తాంతం. అందులోని ప్రతీ శ్లోకమూ ఒక మణి. ‘సంకల్పసూర్యోదయ’మనే దేశికుల నాటకం ఎంతో ప్రత్యేకమైనది. ‘రఘువీర గద్యం’ చాలా ప్రసిద్ధి పొందింది. అందరి నోళ్ళలో నానుతూనే ఉంటుందీ గద్యం.

ఇవన్నీ ఒక ఎత్తైతే, దేశికుల రచనల పాదుకాసహస్రమ్ ఒక్కటీ ఒక ఎత్తు. ఇది శ్రీరంగనాధస్వామి పాదుకలపై 32 భాగాలలో చేయబడిన వేయి శ్లోకాల బృహద్రచన. ఒక పండితుడు రాత్రంతా కూర్చుని, స్వామి పాదాలపైన 500ల శ్లోకాలతో ‘పదకమల సహస్ర’మని వ్రాసాడట. ఆ పండితుడు దేశికుల ‘కవితార్కికసింహ’ అన్న బిరుదును హేళన చేసాడట. దానికి ప్రతిగా దేశికులు కేవలం మూడు గంటలలో స్వామి పాదుకలపై వేయి శ్లోకాలతో చేసిన రచన ఇది. ఇది సంపుటి చేసుకొని కైవల్యము పొందిన వైష్ణవులున్నారని నమ్మకము ఉంది. ఇందులో ప్రతీ శ్లోకము ఒక ఆణిముత్యం. మరీ ముఖ్యముగా ఒక శ్లోకము ఒక్క అక్షరముతో సాగుతుంది.

అది “యాయాయాయా యాయాయాయా

యాయాయాయా యాయాయాయా

యాయాయాయా యాయాయాయా

యాయాయాయా యాయాయాయా” దీని అర్థము భగవంతునికి అలంకారమైన ఈ పాదుకలు మనకు అన్ని శుభాలు కలిగిస్తాయి. సర్వరోగాలనూ హరిస్తాయి. నిరంతరం అతని సన్నిధిలో ఉండాలనే మన కోరిక సఫలము చేసే జ్ఞానాన్ని చేకూరుస్తాయి. ఈ పాదుకల వలన మనము అన్ని ప్రదేశాలకు చేరుకోవచ్చు. అటువంటి మహిమాన్వితమైన ప్రభుపాదుకలకు వందనం.

వేదాంత దేశికుల రచనలు సంస్కృతము, తమిళము ప్రాకృతము కాబట్టి, వాటిని తెలుగువారికి అందించాలని వరదాచారి కోరిక. వరదాచార్యులు తమిళము, సంస్కృతములలో దిట్ట. ఆయన వేదముతో పాటూ ఈ ద్రవిడ వేదము కూడా నేర్చాడు.

వేదాంత దేశికుల గురించి తలుచుకుంటే భక్తితో నిలువెల్ల పులకరిస్తాడు వరదాచారి. అందుకే, వేదాంత దేశికుల రచనలలో కొన్నింటిని అచ్చ తెలుగులోకి తెచ్చాడు వరదాచారి. దివ్య ప్రబంధత్రయమైన తిరుప్పల్లాండి, తిరుప్పళ్లిఎళుచ్చు, కణ్ణిక శిరోత్తాంబు అనే ప్రబంధాలకు వరదాచారి సున్నితమైన తెలుగు సేత రచించాడు. అందులో తిరుమంత్ర వివరణ కూడా ఉంది. ఆయన రచనలను భాగవతోత్తములే కాక ఆ ఊరి ప్రజలూ అభిమానిస్తారు. ఆయన చెప్పే ప్రవచనాలకు వారంతా ముగ్ధులవుతూ ఉంటారు. ఎవరికే సందేహమొచ్చినా వారు వరదాచారిని సంప్రదించము మాములే. ఆయన జ్యోతిషమంటే అందరికీ గురి కూడాను.

ధవళేశ్వరానికి దాదాపు నలభై మైళ్ళ దూరములో ఉన్న అప్పన్నపల్లెలో ఉన్నశ్రీపీఠములో ఉంటాడు వరదాచారి అన్న ముకుందాచారి. ముకుందాచారి ఆ పాఠశాల వేదాచార్యుడు. అందుకే వరదాచారి తన ఇద్దరు కొడుకులను అక్కడే శ్రీపీఠ వేదపాఠశాలలో ఉంచాడు.

***

సూర్యప్రభకు ఎనిమిదవ మాసము నడుస్తోంది. తొమ్మిది వచ్చేసిందేమో కూడా. ఆమె వరదాచారి ఇల్లాలు.

సూర్యప్రభకు ఆడపిల్ల కావాలని ఉంది. ఇద్దరు మగపిల్లలూ వేదపాఠశాలలో ఉంటారు. కనీసము ఒక్క ఆడపిల్ల ఉంటే, ఇంట్లో తిరుగుతూ ఉంటుందని ఆమె ఆశ.

ఆమెకు నెలలు నిండుతున్నాయని ఆమె అప్పగారు తోడుగా ఉంటోంది. ఆ అప్పగారు వితంతువు. అప్పగారికీ ఒక్కడే కొడుకు. వాడూ, సూర్యప్రభ పిల్లలతో కలసి శ్రీపీఠంలో వేదం నేర్చుకుంటున్నాడు.

చంద్రబింబం లాంటి సూర్యప్రభ ముఖము వడలింది ఆనాడెందుకో.

“ఈ రోజు ఏంటో కొద్దిగా నలతగా ఉన్నావు?” అంది అప్పగారు సూర్యప్రభను చూస్తూ.

ఆమె నెలలు నిండిన భారముతో నెమ్మదిగా లేచి, “కొద్దిగా నొప్పిగా ఉంది అక్కాయి…”

“ఎక్కడమ్మా? నడుమేనా… నెయ్యితో మర్దనా చెయ్యనా?”

“నడుము కన్నా, కాళ్ళు ఎక్కువ నొప్పులు…”

“నిన్న, నిన్నుమరిదిగారు మరీ నడిపించేశారమ్మాయి. అంత అంత సేపు నడవకు. అలసిపోతావు…”

“పర్వాలేదులే అక్కాయి. ధనుర్మాసము మొదలయి ఎన్ని రోజులిప్పటికి?”

“ఐదు రోజులేగా అమ్మాయ్…”

“అంటే నాకు తొమ్మిదొచ్చింది అక్కాయ్… మన ఇంటికి గోదమ్మ వేంచేస్తుందంటావా?”

“నీ వాటం చూస్తుంటే, నీవు నేడో రేపో కానిచ్చేలా ఉన్నావు. మరి ఈ మాసం ఆ తల్లి రాక ఇంకెవరెస్తారు చెప్పు?”

“నాకే కాదు, వారికీ ఆడపిల్లే కావాలని ఉంది అక్కాయి. గోదాదేవని పేరెట్టుకోవాలి. కళ్ళకు కాటుకా, కాళ్ళకు పారాణితో పట్టు పరికిణీ వేసుకున్న గోదా దేవిని నేను అనునిత్యము ధ్యానిస్తున్నాను…”

“ఆండాళ్‌ తిరువడిగళే శరణం… తప్పక గోదాతల్లి వేంచేస్తుంది. నీవు హైరానా పడకమ్మాయి…”

“హైరానా ఏమీ లేదక్కాయి. నాకు ఆడపిల్లని పెంచాలన్న కోరిక పెరుగుతోందనుకో…”

“నీవు నెమ్మదించు. తప్పక ఆండాళ్ళు తల్లే వస్తుందిలే…”

“ఈ నాటి పాశురము పాడక్కాయి…” అడిగింది అక్కను, ఆయాసము దాచుకుంటూ.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here