[ఆచార్య అనుమాండ్ల భూమయ్య గారి ‘కైవల్య’ అనే పుస్తకానికి శ్రీ ఏల్చూరి మురళీధరరావు అందించిన ముందుమాట]
[dropcap]అ[/dropcap]ఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీ వేంకటేశ్వరస్వామి దివ్యమహిమను కాంతాయతనమైన వాగర్థలీలతో వర్ణిస్తున్న ఈ గీతపద్యమణిగణనికరం భక్తమణి భూమయ్య గారి నవీనతమ రమణీయ రచనం. తమ కృతులన్నింటినీ నివృత్తిపథాభిముఖంగా అనుసంధిస్తూ భూమయ్య గారు ఒక్కొక్క కావ్యాన్నీ ఒక్కొక్క కమనీయ కైవల్యకళికగా రూపొందిస్తున్న తీరు ఎంతైనా మెచ్చదగినది. ఆ క్రమసంగతిలో ఇదొక అభినవోద్యమం. భగవద్దర్శనాపేక్షి అయిన ఒక భక్తుని మనస్సులో తన ఆరాధ్యదైవతం పట్ల ఆత్యంతికప్రేమ ఎన్నెన్ని విధాలుగా రూపుదిద్దుకొనేదీ కన్నులకు కట్టటమే ఇందులోని వస్తువు.
“శ్రీకైవల్యపదంబుఁ జూచుటకునై శ్రీకృష్ణు ధ్యానించెదన్” అన్న ఆణిమవాక్యంతో ఈ కావ్యారంభంలోనే ప్రతిపాద్యవస్తునిర్దేశం చేయబడుతున్నది. ఆ కైవల్యం పోతన్న గారి దృష్టిలో బ్రహ్మాత్మైక్యాన్ని నిర్గుణోపాసన వలన పొందే జీవన్ముక్తావస్థ. జ్ఞానసిద్ధులు కనుక ఆయన దానిని చేరుటకునై చింతించెదన్ అన్నారు. భూమయ్య గారి దార్శనికతలో అది శ్రీకృష్ణ నివేశనస్థానమైన భూమవిశేషం. అందువల్లనే దానిని చూచుటకునై ధ్యానించెదన్ అన్నారు. సగుణబ్రహ్మోపాసకులు కర్మశేషం తీరిన తర్వాత నిర్గుణధ్యానసిద్ధులై మోక్షపదాన్ని చూరగొంటారు. ఇద్దరూ భగవత్కవులే.
“శ్రీకైవల్యపదంబుఁ జూచుటకునై శ్రీకృష్ణు ధ్యానించెదన్” అనటంలో కృతిప్రతీతమైన ఇంకొక సాధ్యనిర్దేశం కూడా ఉన్నది. ఆ శ్రీకృష్ణ పరబ్రహ్మమే కలియుగంలో శ్రీ వేంకటేశ్వరాభిధానంతో సప్తాద్రిశిఖరాన భక్తులకు కొంగుబంగారమై వెలసింది. “శ్రీమహిముఖ్యదివ్యమహిషీ నయనోత్పల చారుదీధితి,స్తోమ మనారతం బగుచుఁ జొప్పునఁ బర్వుట నాఁగ మేచక,శ్రీ మెయిఁదోఁప నొ ప్పలరు శేషధరాగ్రనికేతనుండు భ,క్తామరపాదపోత్తమ ముదారఫలప్రతిపాది గావుతన్” అని పద్యాంధ్రవ్యాకరణంలో చిన్నయసూరి ప్రార్థించినది ఆ స్వామినే. ఆ శేషధరాగ్రనికేతనుడే భూమయ్య గారి ఈ శతకకావ్యంలో ప్రతిపాదితుడైన జగన్నాయకుడు. “ప్రేమాంజనచ్ఛురితభక్తివిలోచనేన, సన్త స్సదైవ హృదయేఽపి విలోకయన్తి, యం శ్యామసున్దర మచిన్త్యరూపం, గోవిన్ద మాదిపురుషం త మహం భజామి” అని శ్రీ వల్లభాచార్యుల వారు ఆ కైవల్యప్రదాతను సన్నుతించారు.
అక్షరాక్షరం ఆధ్యాత్మికత ఉట్టిపడుతున్న ‘కైవల్య’ అన్న కావ్యశీర్షికను చూడగానే పారాయణికులకు ఇందులో చిత్రితమైన కైవల్యపు స్వరూపజిజ్ఞాస కలగటం సహజమే. కైవల్యమంటే నిరస్త మిథ్యాజ్ఞానమైన బ్రహ్మాత్మైక్యం. మిథ్యాజ్ఞానానికే అవిద్య అని పేరు.
ఆ అవిద్య అపారమార్థికము, సదసద్విలక్షణము, జడము, సవికారము, సావయవము, అనాది, సాంతము, అజ్ఞానరూపము అయినట్టిది. అవిద్య వల్లనే జీవికి రాగద్వేషాలు కలుగుతాయి. రాగద్వేషాల వల్ల కర్మలు ప్రేరేపింపబడుతున్నాయి. ఆ కర్మలు సాగుతున్నంతవరకు జీవి జన్మమరణపరంపరలో కొట్టుమిట్టుకలాడటం తప్పదు. జన్మల వల్ల దుఃఖాలూ తప్పవు. మిథ్యాజ్ఞానమైన అవిద్య నశించినప్పుడు సత్యజ్ఞానానందాత్మకము, నిర్వికారము, నిరవయవము, విభువు అయిన బ్రహ్మము యొక్క అపరోక్షజ్ఞానం సిద్ధిస్తుందని శాంకరీయ దర్శనం. ఆ బ్రహ్మాత్మైక్యమే కైవల్యసిద్ధి. కైవల్యము అంటే సర్వోపాధులను వర్జించిన భావమని అర్థం. కాగా, “దుఃఖ జన్మ ప్రవృత్తి దోష మిథ్యాజ్ఞానానా ముత్తరోత్తరోపాయే త దన్తరాయాపాయా న్మోక్షః” అని న్యాయదర్శనం. తత్త్వజ్ఞానం లభించినట్లయితే మిథ్యాజ్ఞానం తొలగిపోయి, దోష ప్రవృత్తి జన్మ దుఃఖాలు నశించి పరమశ్రేయస్సు అయిన మోక్షం చేకూరుతుందని పూర్వాచార్యులన్నారు. చార్వాక దర్శనం, లోకాయతికం అన్యపరతంత్రము కాని స్వాతంత్ర్యమే జీవికి మోక్షమన్నాయి. శ్రీమద్రామానుజుల వారు శ్రీభాష్య ప్రార్థనాశ్లోకంలో “భవతు మమ పరస్మిన్ శేముషీ భక్తిరూపా” అని భక్తిమార్గాన్ని ప్రబోధించారు. సకల జగత్కర్త, సర్వజ్ఞుడు, సర్వశక్తిసంపన్నుడు, నిఖిలహేయప్రత్యనీక కల్యాణగుణాకరుడు అయిన పరమాత్మ యొక్క ప్రసాదం మూలాన జీవి బంధవిముక్తుడై అర్చిరాదిమార్గం గుండా అప్రాకృతనిత్యవిభూతిని పొంది, ఆవిర్భూత గుణాష్టకస్వరూపుడై, నిరంతర భగవదనుభవ నిమగ్నుడై జన్మ మరణ సంసార చక్రభ్రమణంలో పునరావృత్తిని పొందకుండటమే మోక్షం. మోక్షానికి ముఖ్యసాధనం భగవత్ప్రసాదం. దానికి ఉపాయం భక్తి. విశిష్టాద్వైత దర్శనంలో జ్ఞానము, ధ్యానము, ఉపాసన, భక్తి – అన్నవి పర్యాయపదోపమాలు. సామీప్యం, సాలోక్యం, సారూప్యం, సాయుజ్యం అన్నవి ముక్తావస్థలు. మోక్షప్రాప్తి నొందినవారు వైకుంఠంలో సాయుజ్యపదవిని చూరగొంటారు. సాధకుల దృష్టితో చూసినట్లయితే పరబ్రహ్మతత్త్వజ్ఞానాన్ని తారక సాంఖ్య అమనస్క యోగాచార్యుడైన శ్రీరామచంద్రుని ద్వారా పొందిన తర్వాత “దేహబుద్ధ్యాస్మి దాసోఽహం జీవబుద్ధ్యా త్వదంశతః, ఆత్మబుద్ధ్యా త్వమేవాహ మితి మే నిశ్చితా మతిః” అని హనుమంతుడు చెప్పినదానికంటె మనము కొత్తగా చెప్పగలిగినదేమీ ఉండదు. కేవలం ఉపాధిసంలగ్నమతి కలవారికి శ్రీ మధ్వాచార్యుల వారు బోధించిన దాస్యభక్తి గ్రహణీయమని, సాధనారాజ్యంలో కొంత ముందడుగు వేసి తమయందు జీవబుద్ధి కలవారికి శ్రీరామానుజ మతం ఉపాదేయమని, తమను తాము ఆత్మగా గుర్తింపగలవారికి శ్రీమదాదిశంకరప్రోక్తమైన బ్రహ్మతత్త్వం పరమాచరణీయమని కొందరంటారు.
ఏది చరమసత్యం? అంటే, జీవితంలో చరమసత్యమన్నది వాక్కులకు అందేది కాదు. శబ్దబ్రహ్మం ఆ పరబ్రహ్మానికి వ్యంజకం మాత్రమే కాగలదు. కేవలానుభవానందస్వరూపము, నిర్వర్ణనీయము అయినది అద్వైతమని, దానిని వాక్కుతో అభివ్యక్తం చేయవలసినప్పుడు విశిష్టాద్వైతం, కార్యరూపంలో ఆచరింపవలసినప్పుడు ద్వైతధర్మమూ మన జీవితాలలో అనువర్తిల్లుతుంటాయని పెద్దలంటారు. ఆచార్యప్రోక్తాలైన ఆ ధర్మోపదేశాలలో ఏ ఒక్కటీ పరిత్యాజ్యం కాదు. అనుభూతిసంపన్నులైన ఆ ఆచార్యులు ఆయా దేశకాలపరిస్థితులను బట్టి సాధకులకు తత్తస్వభావోచితమైన బోధను లోకానికి అనుగ్రహించారు. భక్తి ఒక్కటే సాధనోపాయమని, భక్తియే ముక్తిని ప్రసాదిస్తుందని నింబార్కులవారన్నారు. భక్తికి ఫలం భక్తేనని భాగవతం అంటున్నది. వల్లభాచార్యులవారి పుష్టివాదాన్ని మధుర రతిగా పరిపుష్టం చేసిన శ్రీ బలదేవ విద్యాభూషణులు; భగవానుని అచింత్యశక్తిసిద్ధాంతాన్ని ప్రవచించిన నింబార్కులు; భేదాభేదతత్త్వాన్ని ఉపస్థాపించిన జీవగోస్వామి వంటివారు “తత్త్వమసి” అంటే “తస్య త్వమసి” అన్నారు. మోక్షార్థులైన సాధకులు తమ యిష్టాచారం, శిష్టాచారం, కులాచారం, గృహాచారం, గురూపపదేశం మొదలైనవాటిని దృష్టిలో ఉంచుకొని పరస్పర విరోధం లేకుండా ఆత్మోద్ధరణకు, లోకశ్రేయానికి దీక్ష వహించాలి. ఆచార్యులు ప్రతిపాదించిన కైవల్య స్వరూపాన్ని ఆత్మసాత్కరించికొని ఆ నిండువెలుగులో ముందుకు సాగాలి.
భక్తకవి భూమయ్య గారి శతకకావ్యాన్ని అధ్యయనించే ఆత్మీయ పాఠకులకు ఇందులో ఆద్యంతమూ గోచరీభవించే సమన్వయ తత్త్వాన్ని అక్షరీకరించాలని ఈ పురోవచనిక ఉద్దేశం.
కవితా నౌకపై హంసయానం
భూమయ్య గారి భావధార కొంత అమనస్క యోగానికి, అచల ప్రబోధానికి, ఉపనిషత్ప్రచోదితమైన తత్త్వభూమికకు సన్నిహితంగా కనబడుతుంది. నిత్యాభ్యాస మనన ధ్యానశీలిత వల్ల నిద్దమైన ముత్యాల వింతవన్నెలొలికే తరళమైన శైలిలో గంభీరమైన వేదాంత దర్శనాన్ని వ్యక్తీకరింపగలగటం వారికి అలవడింది. తెలుగుదనం విశదప్రభావంతో ఉట్టిపడే తేటగీతిచ్ఛందం వారి కవిత్వాభివ్యక్తికి సమర్థమైన ఆధారభూమిక అయింది. అపురూపమైన పూర్వోత్తరసంహితతో కావ్యోపకల్పనకు పూనుకొన్నారు. ఆ కల్పనలోని క్రమిక వికాసం వారి ప్రతిభకు అద్దం పడుతుంది. గులాబీ మొగ్గలపై పరచుకొన్న మంచు బిందువులు బాలభానుని లేలేత కిరణస్పర్శతో కరిగి పువ్వురేకులు ఒక్కటొక్కటిగా విచ్చుకొన్నట్లు సన్నివేశాలు ఉత్తరోత్తరాన్వయంతో ముందుకు సాగుతూ అచ్చెరువు గొలుపుతాయి.
‘కైవల్య’ కావ్యం ఒక సాధకుడు భగవత్ప్రసాదలబ్ధి వల్ల సమకూడిన కవితానౌకను అధిరోహించి, విజ్ఞానదీపగృహం వెలుగులో ఈశ్వరాభిసంధికై బయలుదేరటంతో మొదలవుతుంది.
నీ వొసగిన “కవిత” యను నావ నెక్కి
వచ్చుచుంటిని నీ వైపు; “స్వాగతింప
ర” మ్మనను కాని, స్వామి! ద్వారము నొకింత
తెరచియుంచుమీ! హృదయమ్ము తెరచి అట్లె.
అని సాధకుడు స్వామికి విన్నవించటం జరుగుతుంది. సంసృతిసాగరంలో కెరటాలు జీవిని ముంచెత్తుతుంటాయి. అది ఒక నిరాలంబ మహాచిత్సముద్రం. సాధకునిలో ఒక తన్మయత్వం నిండి ఉంటుంది. జీవబ్రహ్మాత్మైక్యసంధానరూపమై ఇంద్రియరాజ్యంలో మనఃక్షేత్రాన పరిచ్ఛిన్నభావంతోనే ప్రయాణం కొనసాగుతుంది. భగవత్స్వరూపం పూర్ణానుభవానికి రాక, భగవదన్వేషణరూపమైన వెతుకులాటలోనూ ఒక ఆనందం ఉన్నదేమో. ఆ ఆనందమయస్థితిలో జీవుడు పరమేశ్వరునితో భావానుసంధానం చేస్తుంటాడు. ఒక నిరాలంబ సత్త్వదిశగా ప్రయాణం చేస్తున్నప్పుడు స్వామి కరుణిస్తాడు. తన హృదయకవాటాన్ని రవ్వంత తెరుస్తాడు. ఆ నిరతిశయ కారుణ్యానుభవం వల్ల సాధకునికి ఆత్మప్రకాశం కలుగుతుంది. అతనిలో సాక్షిత్వాభ్యాసప్రజ్ఞ మేలుకొంటుంది. స్వప్రకాశమై, చిదానందరూపమైన ఆత్మవస్తువు “సోఽహమ్” అన్నది “హంస” రూపమై మనస్సుకు తెలిసివస్తుంది. “ఆకారేణ బహిర్యాదిః సాకారో విశ్వతః పునః, హంస హంసేతి యన్మన్త్రం, జీవో జపతి సర్వదా” అన్నప్పటి స్థితి అది.
ప్రార్థనాద్వారమును దాటి వచ్చినంత
స్వామి కరుణించి హృదయకవాటమును ర
వంత తెరచెనో! కంటి విశ్వాంతరాళ
మందు నే నొక తెల్లని హంస నగుట.
అన్న స్వస్వరూపాభిజ్ఞానంతో కావ్యం ముగుస్తుంది.
వేంకటాద్రి శిఖరాలు
అంతర్ముఖీనమైన ఆధ్యాత్మికాధ్వాయనం మొదలుపెట్టిన సాధకుడు ఒక్కొక్క కొండగా ఏడుకొండలపై పురోగమిస్తాడు. శేషాద్రికి అభిముఖంగా ప్రయాణిస్తున్నప్పుడు సాధకునికి భగవంతుని ప్రేమతత్త్వం స్వానుభవగోచరం అవుతుంది. నీలాద్రిపై ఉండగా అప్రమేయమైన ఆత్మతత్త్వపు అభిజ్ఞానం కలుగుతుంది. అది అజ్ఞానావరణ తొలగిపోతున్న దశ. అక్కడి నుంచి గరుడాద్రికి ప్రస్థానిస్తుండగా నీలాద్రి శిఖరారోహణ వేళ “గర్వ మను పెద్ద గోడను కట్టుకొంటి” అని చెప్పిన “గర్వము” గర్వం కాదని, అది గర్వపర్యాయమైన అహంకారం కాక, పంచవింశతి మహాతత్త్వాలకు కారణమైన తత్త్వమని, ఆ తత్త్వం గురూపదేశం వల్ల బోధపడుతుందని వివరింపబడింది. “సచ్ఛబ్దవాచ్య మవిద్యాశబలం బ్రహ్మణోవ్యక్తం – అవ్యక్తాన్మహత్ – మహతోహఙ్కారః – అహఙ్కారాత్ పఞ్చతన్మాత్రాణి – పఞ్చతన్మాత్రేభ్యః పఞ్చమహాభూతాని – పఞ్చమహాభూతేభ్యోఖిలం జగత్” అని శ్రీమదాదిశంకరులు.
నీ వొసంగిన బీజము నేటి దినము
వరకు మొలకెత్తలే, దిప్డు గురువు వచ్చె
గాలి, నీరు, మట్టి, వెలుగై కరుణ తోడ
నేను మొలకెత్తి చెట్టునై నింగి గంటి.
అంజనాద్రి శిఖరారోహణకు ఉద్యమించినప్పుడు సాధకునికి సత్సంగత్వ మహిమ స్ఫురణకు వస్తుంది. అది “సత్” జనుల గూడి మెలగిన “సకల” మమరు” అనిపించిన స్థితి. ఈ కావ్యంలో సర్వేసర్వత్ర ఉపనిషత్ప్రతీకలతో అత్యంత గంభీరమైన భాగం ఇది. సాధకునికి వాసనాగ్రంథులు విచ్ఛిన్నమౌతున్న తరుణం. ముండకోపనిషత్తులోని గంభీరమైన వాతావరణం అలముకొని ఈ అధ్యాయం వేదాంతముక్తావళిగా రూపుదిద్దుకొన్నది. జీవేశ్వరతత్త్వనిరూపకమైన అంతరాగ్ని విద్యాప్రస్తావంతో ఈ సన్నివేశం పరాకాష్ఠకు చేరుకొన్నది. పాఠకులు గుర్తింపగలరని ఇక్కడ విపులీకరించటం లేదు. జీవకృతాలైన సుఖదుఃఖభోగాల సాక్షిత్వం ఈశ్వరనిష్ఠమని బోధిస్తున్న అధ్యాయం ఇది.
ఆ తర్వాత నారాయణాద్రి శిఖరారోహణవర్ణనారూపమైన అధ్యాయమంతా ‘బ్రహ్మము’, ‘ఈశ్వరుడు’, ‘జీవాత్మ’, ‘విశ్వము’, ‘మోక్షము’ అన్న భావనలకు విశదిమగా రూపొందింది. ఇది వేదాంత యోగసూత్రాల మిశ్రాధ్యాయం. సంసారసముద్రంలో చిక్కుకొన్న చేపకు తానున్నది సముద్రమని తెలియదు. సముద్రమంటే ఏమిటో తెలియదు. సాధకుని దశకూడా అటువంటిదే.
తనను తానెరుగని ఆవరణలో చిక్కుకొన్న జీవికి భగవదనుగ్రహం సంప్రాప్తించింది. ఎటువంటి దుష్కర్మఫలాలనైనా నిరస్తం చేయగల మహానుగ్రహ సంపద అది. యుగయుగాంతరానుగత కర్కశ సమస్యలన్నింటికీ పరిష్కారం. భగవత్కరుణానుభవఫలం.
ప్రార్థనా ద్వారమును దాటి వచ్చినంత
స్వామి కరుణించి హృదయకవాటమును ర
వంత తెరచెనో! కంటి విశ్వాంతరాళ
మందు నేనొక తెల్లని హంస నగుట.
పరమాత్మస్వరూపమైన బ్రహ్మమే ‘సోఽహం’ అని, ‘హంసోఽహమ్’ అని, ‘అహం బ్రహ్మాస్మి’ అని అధిష్ఠాన చేతన బ్రహ్మము ఉపాధిలోనికి సూక్ష్మరూపంలో ప్రవేశించి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించినప్పటి దశ ఇది.
ఈ విధంగా విజ్ఞాన నౌకను అధిరోహించిన ఒక సాధకుడు అజ్ఞానకల్పితమైన సంసారసాగరాన్ని దాటి కైవల్యానికి ప్రతిబంధకాలైన కోరికలను తెగటార్చి తాను “హంస”నని గుర్తించటంతో ఈ కావ్యం పరిపూర్ణం అయింది.
‘కైవల్య’ ఒక అపురూపమైన వేదాంత సూత్ర వివృతికావ్యం. అంతర్ముఖీనుడైన ఒక సాధకుని యాత్రాచరిత్ర. ఒక శ్రుత్యంత వివేక ప్రబంధం. ఎవరికివారు అంతరంగంలో ఆవిష్కరించుకోవలసిన శ్రీ వేంకటేశ్వర భక్తి రచన.
తెలుగులో ఇటువంటి గంభీర తాత్త్విక రచనలు ఎంతో అరుదుగా ఉంటాయి. ‘కవిరాజహంస’ శ్రీ భూమయ్య గారికి నమస్సులు.
***
రచన: ఆచార్య అనుమాండ్ల భూమయ్య
ప్రచురణ: ఎ. మనస్వినీదేవి, 401, శ్రీ రాఘవేంద్ర రెసిడెన్సీ, స్వరూప్ నగర్, రోడ్ నెం.5, ఉప్పల్, హైదరాబాద్-500039. ఫోన్: 8897073999.
వెల: రూ. 80/=
ప్రతులకు: నవోదయ బుక్ హౌస్, కాచిగూడ క్రాస్ రోడ్స్, హైదరాబాద్-500027. ఫోన్: 040-24652387.
విశాలాంధ్ర బుక్ హౌస్ అన్ని శాఖలు.