Site icon Sanchika

కాకతీయ ద్వారం, చార్మినార్ నిలిచి ఉండే సత్యాలు

[శ్రీ మాడభూషి శ్రీధర్ రచించిన ‘కాకతీయ ద్వారం, చార్మినార్ నిలిచి ఉండే సత్యాలు’ అనే రచనని అందిస్తున్నాము.]

కాటుక కంటి నీరు చనుకట్టు పయింబడ నేల యేడ్చెదో

….నిను నాకటికిం గొనిపోయి యల్ల కర్ణాట కిరాట కీచకుల కమ్మ త్రిశుద్ధిగ నమ్ము భారతీ!…

పోతన్న సాక్షాత్కరించి శారద కన్నీరు కారుస్తున్నారట. కంటికి పెట్టుకున్న కాటుక, కన్నీటికి కరిగిపోయి రవికపై పై చుక్కలు తడిసినప్పుడు ఆ తల్లి చూసి పోతన (పోతనదీ పురిటి గడ్డ) ఆశ్చర్యపోయాడు. తెలుగు భాగవతాన్ని రాచరిక నియంతలైన ప్రభువులు తమకే ఇచ్చెయ్యాలని వత్తిడిచేస్తున్నారు. అమ్మా నిన్ను తీసుకుపోయి అంగట్లో ఆ కర్ణాట కిరాట కీచకులకు అమ్ముకుంటానా తల్లీ అని నమ్ము అని నిశ్చయంగా అనుకున్నారాయన. అది అద్భుతమైన చాటువు వచ్చింది, మహాభాగవతం సృష్టించింది. ఇతర శతాబ్దాలకు ముందు కూడా ఇటువంటి రాచకీయులు ఇటువంటి పనులు చేసారు.

యుగయుగాలు నిలిచే సంస్కృతి ఆవిర్భవించిన వరంగల్లు ఇది, కాకతీయ నేల ఇది. తెలంగాణ తల్లి ఇది. ఆ గొప్ప నాగరికతలో వెలుగులు చూపించే కాకతీయ ద్వారం తెలంగాణ చిహ్నానికి ఉండకూడదా? ఎంత మాట? తెలంగాణకు, వరంగల్లుకు, ఏకశిలానగరానికి, రామప్పకు, పోతన్న భాగవతంతో సమానమైన వ్యాస భాగవతాన్ని దేశమంతా కీర్తిస్తూ ఉంటే ఆలోచించడం లేదా? ఇది రాచరిక లక్షణమట. కనుక పనికి రాదు కాకతీయానికి అన్యాయమట. పాపం పోతన్న బాధ ఆవేదన ఎవరికి తెలుస్తుంది? తొలి ప్రజాకవి పాలకుర్కి సోమన్న, రాజ్యాన్నే థిక్కరించి రాములోరి గుడిని కట్టి… వారిని ఆవేదన ఎవరికి తెలుస్తున్నది. కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప గోలుకొండ భాగ్యనగరి గొప్ప వెలుగు చార్మినారు జై తెలంగాణ జైజై తెలంగాణ… ఆవేదన ఆగ్రహం కాబోదా?

పదేళ్లు ప్రజలకు ఉపయోగపడిన కాకతీయ ద్వారం, చార్మినార్ పనికి రాకుండా పోయిందా? రాచరిక చిహ్నం ఏం పాపం చేసారు? తెలంగాణకు గర్వకారణమైన ఈ మంచి చిహ్నాలను వద్దనుకోవడానికి ఒక్క కారణమైన, అదీ సమంజమైన హేతువాదం ఏదైనా ఉందా? భారతీయ రాష్ట్ర సమితి ఎన్నికల్లో ఓడిపోయినా, లక్షలాది గెలిపించుకున్న జయం సాధించిన ఎంఎల్యేలు శాసనసభలో ఉండరా, ప్రశ్నించరా? కొత్త ప్రభుత్వం రాగానే మరో చరిత్ర అవసరం వచ్చిందా? చిహ్నాలు మరిచిపోవలసినదా? కారణం లేకుండా పాలకులు చేసిన నిర్ణయాలేవీ నిలబడవు. తెలంగాణకు నష్టమైన, స్పష్టమైన తొందరబాటు అవుతుంది. ఎన్నికలలో నిర్ణయాలు రాకముందే ఒక ప్రభుత్వం ఏక పక్షంగా నిర్ణయిస్తే ఎవ్వరినైనా నిలదీసి అడిగితీరాలి కదా?

ప్రపంచమంతా కీర్తించిన రామప్ప దేవాలయం యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద, కాకతీయ వేయిస్తంభాలు, ఓరుగల్లు కోట, విరిగిపోయి నిలిచిన శిల్పాలు రాచరికతా ప్రతినిధిలా? కాకతీయ ద్వారం రాచరికం అయితే, పార్లమెంటు, రాష్ట్రపతి నిర్మాణాలు బ్రిటిష్ రాచరిక, నియంతృత్వ, దుర్మార్గం అంటూ కూల్చిపోదామా? కాంగ్రెస్ నియంతృత్వంతో ఒకనాడెప్పుడో తప్పులు చేసినట్టు, రాచరిక ప్రభువులంతా ఆప్పటికాంగ్రెస్ ను ఎవరూ ఇప్పుడు నిందించడం లేదుకదా. దశాబ్ది పాత నిర్ణయాలన్నీ తీసేద్దామా? ‘రాజముద్ర’లో రాచరిక ముద్రలేదా? అంటే అక్కడ ప్రజా ముద్రలేదన్నమాట, కొందరికి ఇష్టం కాలేదు, మరికొందరికి చాలా ప్రియమైందని నిర్ణయాలు తీసుకోవడం ప్రజాస్వామ్యమా?

తెలంగాణానికి ఎంతో గర్వమైన కాకతీయ చిహ్నాల్ని వ్యతిరేకించడానికి శాసనసభలో ఆనాటి ప్రతిపక్షమైన కాంగ్రెస్ వారు కూడదని విమర్శించారా? ప్రభుత్వానికి, గవర్నర్ కు, ప్రధానమంత్రికి లేదా కేంద్ర ప్రభుత్వానికి ఏదైనా కాలంలో కాంగ్రెస్ ఎప్పుడైనా వద్దని వాదించిందా? బంద్ చేసిందా? రోడ్ రోకో, రైలో రోకో బస్సుల రోకో ఏదైనా చేసారా? కాంగ్రెస్ పార్టీ లో, ప్రతిపక్షాలతో, మిత్రపక్షాలతో చర్చించారా? ఒక్కో జిల్లా చొప్పున కొత్తగా ఈ ఎజెండాతో సదస్సులు సంప్రదింపులు లేకుండా నిర్ణయాలు తీసుకోవడం తప్పు.

తెలంగాణాను సాధించిన కాంగ్రెస్ పార్టీ ఘనత వారిదే. నిజమే. ముఖ్యంగా సోనియాగాంధీ వల్ల సాధ్యమైంది. ఇటీవలిదాకా తెలంగాణం వద్దని కుట్రలు దుర్మార్గాలు చేసిన పార్టీ తెలుగుదేశమే అని విమర్శిస్తున్నారు కదా? ఆ పార్టీకి చెందిన ప్రతినిధులైన చాలామంది ఎంఎల్యేలయి రాజ్యం చేస్తున్నారు కదా? ఆ పార్టీ ఈ పార్టీకి సంబంధం లేకుండా మన చరిత్రను నాశనం చేద్దామా; మన కాకతీయ ద్వారం చిహ్నం కూడా ఉండకూడదా? మొదటి ముఖ్యమంత్రి తెలంగాణా అవతరణకు కారకుడైన వారిలో అగ్రగామి అయిన కే చంద్రశేఖరరావు చరిత్ర సృష్టించిన వారు అని కాదంటారా? 5 దశాబ్దాలకు పైగా పోరాడిన జనానికి ఈ చిహ్నలు ఉండడం తప్పా? లక్షలాది మంది కాంగ్రెస్ అభిమానులు, వ్యతిరేకించే కేంద్ర రాష్ట్రాలలో నడిపే కాంగ్రెస్ మళ్లీమళ్లీ అవే తప్పులు చేస్తారా? కేంద్రం తెలంగాణ వస్తుందని ప్రకటించిన తరువాత కూడా కాంగ్రెస్, తెలుగుదేశం వంటి పార్టీలు కూడా దారుణంగా వ్యతిరేకంచారే కదా? వందలాది మంది ప్రాణాలు పోగొట్టుకున్న తరువాతే తెలంగాణ సాధ్యమైంది. ప్రొఫెసర్లు జయశంకర్, కోదండరాం, వరంగల్లునుంచి కాళోజీ, జనధర్మ పత్రికనుంచి 1958 నుంచి తెలంగాణ కోసం పోరాడిన ఎం ఎస్ ఆచార్య ఎందరో సాధించిన తెలంగాణకు ఈ చిహ్నలు తొలగించుకోవడం ఎంతవరకు న్యాయం. వేలాది లక్షలాది ప్రాణాలు బలిచేసిన వారి చర్చ లేకుండా తెలంగాణ స్థాపన చరిత్ర వస్తుందా? కాంగ్రెస్ విజయం, భారతీయ రాష్ట్ర సమితి ఓటమి తరువాత కొత్త ప్రభుత్వం తెలంగాణ అస్తిత్వాన్ని సవాల్ చేస్తారా?

రచయిత పాత్ర ఇదా?

‘జయజయ తెలంగాణ’ సాహిత్యానికి నిలబెట్టిన నిలువు అందెశ్రీ విలువైన కవి, గొప్ప రచయిత. అందులో చిహ్నాలను మార్చడంలో ఆ రచయితకు ఏ పాత్ర కూడా లేదు, కూడదు. రాచకీయ పెద్దలు వద్దంటే, ‘కాకతీయ వైభవం గోలుకొండ గొప్పదనం, ప్లేగు బాధితులకు స్మారకం దువా ఇచ్చే చార్మినార్ కీర్తన’ చరణాలను తొలగించడం న్యాయమా? కనీసం వ్యతిరేకించి నిరసన చేసే బాధ్యత రచయితలకు లేదా? ఇదివరకు ప్రభుత్వంలో ఈ రచయిత గేయాన్ని కొన్ని సవరణలు సూచించారు. కాని ఒప్పుకోలేదు. ఫరవాలేదు. ఇప్పుడు ఈ చరణాలను తొలగించడానికి రచయిత ఒప్పుకోవడం కూడా అన్యాయం. తొలగించిన ఆ పదాలతో మిగిలిన గీతం తయారు చేయడం అందెశ్రీగారికి కూడా అన్యాయమే. ఆత్మగౌరవం సామస్య కాదా? (ఈ పదాలు ఇటీవల తొలగించాలని నిర్ణయించారని తెలిసింది)

ఇది రాచకీయం, రాజకీయం, రాజ్యాంగ వ్యతిరేకం, జనంముందు చర్చించకుండా, ఏ కారణం లేకుండానే ప్రభుత్వాలు ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం ‘అసమానత’ అని రాజ్యాంగం ప్రకారం ఆర్టికిల్ 14కు వ్యతిరేకం అని సుప్రీంకోర్టు తీర్పుల్లో ఎన్నోసార్లు ప్రకటించిందని చదువుకోవడం ముఖ్యం.

కొన్ని శతాబ్దాలు నుంచి సజీవమైన రామప్ప కాకతీయ శిల్పాలు, చార్మినార్, గోలుకొండ.. వంటివెన్నో సుప్రసిద్ధమైన కట్టడాలను, గతించిన చరిత్రను ప్రతిధ్వనించే ప్రతిబింబించే ప్రతినిధులై నిలిచి ఉన్నాయని అర్థం చేసుకోకుండా ఈ పదేళ్ల వర్తమాన పనికిరాని రాజకీయానికి, మన వందల ఏళ్ల నాగరికతకు ముడివేస్తారా? పార్టీ మారిందని, ప్రభుత్వం మారిందని, ఆలోచన మారిందని ఈ నేలమీద పుట్టి పెరిగి ఇప్పడికీ ఉన్న శాశ్వతమైన చిహ్నాలను రూపుమాపలేరు. అది తెలంగాణ అస్తిత్వం, ఆస్తి. శిల్పాలలోనే కాదు, సాహిత్యంలో, పోతన కావ్యాల్లో, ఆధునిక రచనల్లో కానీ, ఈ నేలమీద నింగిని చూస్తూ చరిత్రను తలపిస్తూ వస్తున్న సత్యాలు. వాటిని ఎవరూ రూపు మాపలేరు.

~

కాళోజీ ఒప్పుకునే వాడ్రా?

(కాళోజీ బతికుంటే ఈ పనిజేస్తివని బాధపడి హ్రుదిని ఆవేదనల కవిత ఇట్లా రాసుకునేదుండె అనే ఊహ ఇది)

రాకరాక తెలంగాణాకొస్తె, ‘కాకతీయ కాక’ తీసేస్తుంటిరి,
అన్యాయం అన్యాయం, ఎందుకురా ఇంత పనిని జేస్తుంటివి.
‘అక్షరం రూపం దాల్చినదీ ఒక్క సిరాచుక్క, లక్ష మెదళ్లకు కదలిక’
అనుకున్నమని బోయె గాని, మరేమీ పని లేక మెదళ్లకు కదలికే లేదా?

‘నమ్ముకొని అధికారము ఇస్తే నమ్మకము పోగొట్టికుంటివి
పదవి అధికారము బూని పదిలముగా తల బోడిజేస్తివి
దాపునకు రాననుచు చనువుగా టోపి పెడితివి లాభపడితివి’
అని ఎన్ని సార్లు తిట్టిపోస్తివి, అందుకు లాభపడితివి.

కాకతీయ ద్వారం నిన్నేమన్న జేసెనా, చార్మినార్ ఎందుకొద్దురా నీకు
రాజులు వద్దు వద్దు అంటున్నరు గాని, రామప్పగోపురం నిన్నేమన్నది.
‘గిట్టని వానిని కొట్టుటకే కదా, మట్టిగొట్టిన విగ్రహాలు నిన్నేమన్నయి?
తోచిన కాడికి దాచుటకే కదా…పొగిడి మన్ననలు పొందుటకే కదా’.

కాకతీయ శిల్పాలు, నిన్నేమన్నయి? అసలు ఎందుకు జేస్తున్నర్ర.
ప్రపంచమంత మెచ్చిన రామప్పను ఎందుకుబెట్టలేదు చెప్పు?
కాటన్ గోదావరి ఆనకట్ట వల్ల ఆంధ్రలో జనానికి బువ్వపెట్టినోడివలె
రామప్పలక్నవరం గొలుసు పొలాల బువ్వ నిచ్చిన కనబడకపాయె

ఇదివరకు ఇన్నేళ్లు ఎప్పుడున్నా జైతెలంగాణమన్న వింటివా?
తెలంగాణ పోరాటంలో పొగలు బెట్టి, మంట బెట్టి, అధికారం రాగానే<
‘జయ జయహే తెలంగాణ’ జిందాబాద్, ‘కాకతీయ వైభవం’ వద్దెందుకు?
చార్మినార్ నిన్నేమన్నది, తెలంగాణ గీతం నీకు వద్దెందుకు?

‘మనిషి ఎంత చెడ్డవాడు బతికున్న వాని మంచి
గుర్తించడు గాని, వాని చెడుని వెతికి మరీ గెలుకుతాడు’ అన్నట్టు
మన రామప్ప ప్రపంచ పటంలో కనపడటం లేదా?
‘అవకతవకలు సవరింపలేనప్పుడు ఎందుకో నా హ్రుదిని ఇన్ని ఆవేదనలు’

అందుకే కాళోజీ ఇదివరకే అన్నడు గదరా
‘నిన్నుఎన్నుకుంటె వెలగటెట్టడం.. కాదు
ఇంక ఇప్పటిదాకా ఏం చేశినవో చూడు..
పెట్టుకునే టోపీ కాదు, పెట్టిన టోపీ చూడు’

కాకతీయ కళా ప్రభల కాంతిరేఖ రామప్ప
గోలుకొండ నవాబుల గొప్ప వెలుగు చార్మినార్
మెచ్చుకుంటే నీకెందుకు, నొచ్చుకునే బాధనాకెందుకు?
ఓరుగల్లు పోతన్న కావ్యం ఇక్కడుంటే నీ ముళ్లేం బోయె.

ఆ గీతంలో రద్దులెందుకు, నా గేయానికి గాయాలెందుకు
ఎందుకింత పనిచేస్తివి. నిన్నేమన్న రామప్ప గొట్టిందా
‘నమ్ముకొని అధికారము ఇస్తే నమ్మకము పోగొట్టుకుంటివి’
ఏంచేయలేకపోతే, పోనీ, పేర్లు మార్చుకుంటే అదో గొప్పతనమా?

Exit mobile version