Site icon Sanchika

‘కాకతీయ యుగంలో స్త్రీల సామాజిక స్థితిగతులు – ఒక పరిశీలన’-10

[డా. మంత్రవాది గీతా గాయత్రి గారు 1995లో పిహెచ్‍డి పట్టా కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖకి సమర్పించిన సిద్ధాంత వ్యాసాన్ని సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము.]

ప్రకరణం 3 కాకతీయుల కాలంనాటి సమాజము – స్త్రీలు – రెండవ భాగం:

సానులు

[dropcap]కా[/dropcap]కతీయులనాటి శాసనాలలో మున్నూర్వురు సానులు, సానిమాన్య నిబంధకారులు, డాకరేమి మున్నూటి సాని, కొండిక మున్నూటి సాని, గుడిసాని, సంప్రదాయం సానులు అన్నపదాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సాని అన్న పదానికి ఈనాడున్న వేశ్య, వెలయాలు అన్న నీచార్థాలు ఆనాడు లేవని శాసనాలు పరిశీలిస్తే తెలుస్తుంది.

సానిపదం – పుట్టుపూర్వోత్తరాలు:

దొరసాని, మంత్రసాని అన్నపదాలలోని సాని శబ్దానికి ఈనాడు కూడా నీచార్థం లేదు. సమాసంలో ప్రయుక్తమైనదాన్ని బట్టి సాని శబ్దానికి మొదట గౌరవార్ధమే ఉండేదని ఊహించవచ్చును.

కాకతీయుల కాలంలో స్త్రీల పేర్లకు చివర సాని ప్రయుక్తమైనది. బ్రాహ్మణ క్షత్రియ, వైశ్య శూద్ర స్త్రీలందరి పేర్ల చివర సాని వాడబడేది. క్రీ.శ. 1140 నాటి ద్రాక్షారామ శాసనంలో శాలంకాయన వంశజుడైన వెన్నయ సోమయాజి భార్య నాగాంబికను సంగమసాని అని కూడా పేర్కొన్నారు. బెజవాడలోని కనకదుర్గ గుడిలోని క్రీ.శ. 1213 నాటి ఒక శాసనంలో నెగడాల అన్నిసెట్టి అన్న వ్యక్తి భార్య బొల్లాసాని. ఒక ద్రాక్షారామ శాసనంలో పెనుంగోటి చెంద్రిరెడ్డి కోడలు కామనరెడ్డి భార్య గౌరాసాని ప్రసక్తమైనది.

సూర్యరాయాంధ్ర నిఘంటువులో సాని శబ్దానికి స్త్రీ, అధిపురాలు, రాణి, భార్య, వేశ్య, స్త్రీల పేర్ల చివర వచ్చు ప్రత్యయము అని అర్థాలీయబడినాయి. తెలుగు పరిశోధన పత్రికలో దొరసాని శబ్ద చర్చ చేసిన డా. ముక్తేవి భారతి గారు సానిశబ్దం మొదట గౌరవవాచకంగా వాడబడి క్రమంగా దేవదాసీలకు మాత్రమే వాడబడి, గౌరవ స్త్రీల గుర్తింపు నుండి తొలగిపోవడంతో సాని శబ్దానికి కూడా అర్థవిపరిణామంలో నీచార్థమే స్థిరపడినట్లు తేల్చారు. కానీ మొదట పెద్దకుటుంబాల స్త్రీలకు ఈ సాని అన్న పదం నామాంత్యంగా ఎందుకు వాడబడినదీ వారు కారణం చెప్పలేదు. స్వామి అనగా యజమాని. యజమాని భార్య యజమానురాలు, స్వామిని అనబడుతుంది. ఈ స్వామిని శబ్దభవమే సాని శబ్దం.

ఈ సాని అన్న పదం కేవలం తెలుగు స్త్రీల పేర్లకు మాత్రమే నామాంత్యంగా ఉన్నది. ఇతర ప్రదేశాల స్త్రీల పేర్లకు తల్లికి పర్యాయ పదాలయిన అంబ, అంబిక, అమ్మ, అక్క, అవ్వ, బాయి, తాయి అన్నవి నామాంత్య పదాలుగా ఉండగా పది పదకొండు శతాబ్దాలలోని తెలుగు స్త్రీలకు సాని నామాంత్య పదంగా ఎక్కువగా వాడబడింది. దీనికి కారణం బహుశా తెలుగుదేశం మొదట మాతృస్వామ్య వ్యవస్థలో ఉండటమే కావచ్చు. అప్పుడు కుటుంబానికి తల్లి పెద్ద, యజమానురాలు కనుక యజమానిని అనే అర్థంలో ఆ స్వామిని శబ్దభవమైన సాని అన్న పదం ఆమె పేరు చివర బిరుదుగా ప్రయుక్తమై ఉంటుంది. తరువాత అది నామాంత ప్రత్యయంగా మారి రాజు, రావు, రాణి, దేవి అన్న విధంగా ప్రయుక్తమై ఉంటుంది. ఆ కారణంగానే ఆనాడు తెలుగుదేశంలోని స్త్రీల అచ్చ తెనుగు పేర్ల చివర సాని చేర్చబడి  ఉంటుంది.

ఈ సాని పదం ఒకప్పుడు అధిపురాలు అనే అర్థంలో గౌరవవాచకంగా ఉండి ఆ తరువాత వేశ్య అనే నీచార్థంలోకి ఎలా మారినదీ మనం కాకతీయుల నాటికి ముందు వెనుకగా ఉన్న కాలంలోని శాసన కావ్య సాహిత్యాలను పరిశీలిస్తే తెలుసుకోగలము.

కాకతీయుల కాలానికి ముందున్న చాళుక్య చోడుల కాలంలోనూ, కాకతీయుల కాలం మొదట్లోనూ శాసనాలలో చాలా చోట్ల మున్నూర్వురు సానులు, సానిమాన్య నిబంధకారుల గురించి ప్రస్తావించబడింది.

క్రీ.శ. 1221 నాటి ఒకానొక జుత్తిగ శాసనంలో కొలని మాండలికుని బంటు దండపలకల బొమ్మయ అనే వ్యక్తి వాసుకి రవి సోమీశ్వర మహాదేవరకు అఖండవర్తి దీపానికై యాభై ఇనపయెడ్లని దానమిచ్చి నిత్యం మానెడు నెయ్యి దేవరకర్పించవలసినదనీ, ఈ ధర్మాన్నిడుత్తిక స్థానాధిపతులు నడపాలనీ, శ్రీకరణం, సానిమున్నూర్వురు నిబంధకారులు రక్షింపవలసిందని శాసనం వేయించాడు. ఈ శాసనాన్ని బట్టి డుత్తిక వాసుకి రవి సోమీశ్వరాలయంలో సానిమున్నూర్వురు నిబంధకారుల సంఘం ఉండేదని, దేవాలయ ధర్మకర్త కార్యకలాపాలను పర్యవేక్షించే అధికారం వారికుండేదని తెలియడమేకాక, సంఘంలో ప్రజలకు వారిపట్ల గల గౌరవం, భక్తి, విశ్వాసాలు తెలుస్తాయి.

సానిమున్నూర్వురు – ప్రసక్తమైన శాసనాలు:

చాళుక్య చోడుల కాలంలోను, కాకతీయుల కాలం మొదట్లోనూ సానిమున్నూర్వుర ప్రసక్తి ఉన్న శాసనాలు ఎన్నో ఉన్నాయి. కులోత్తుంగ చోడుని కాలానికి సంబంధించిన ఘంటశాల (చోళపాండ్యపురము) లోని శాసనంలో పోలిశెట్టి అనే వ్యక్తి విశ్వేశ్వరునికి అయిదు కులోత్తుంగ మాడలు సానిమున్నూర్వుర వశంలో పెట్టినట్లు ఉన్నది. క్రీ.శ. 1255 నాటి జుత్తిగ శాసనంలో యెఱువ కొమ్మినాయకుని మనుమలు భండారి కొండప నాయకుడు అతని కొడుకు వీరభద్ర నాయకుడు డుత్తిక వాసుకి రవి సోమీశ్వర మహాదేవునికి చక్రవర్తికి ధర్మంగా ఉమాసహితం కరవాల భైరవ మండపమును, పదునాలుగు మాడల మట్టలు సమర్పించి ఈ ధర్మాన్ని స్థానాపతులు, శ్రీకరణం, సానిమున్నూర్వురు, సమస్త నిబంధకారులు నడపవలసినదిగా శాసనం వేయించారు. క్రీ.శ. 1163 నాటి క్రాంజ శాసనంలో క్రాంజ నరేంద్రేశ్వరునికి సంధ్య దీపానికి నావన బోయుడు కొండ్యబోయుడనే వాడు వలయుచుట్టిన బింద్య (అంటే బహుశా చుట్టూ అంచు ఉన్న బిందెను) సాని మున్నూర్వుర వశంలో ఉంచారు.

ఇదేవిధంగా డుత్తిక వాసుకి రవి సోమేశ్వర దేవుని ఆలయానికి ఇవ్వబడిన దానాలన్నిటిని ఆ దేవస్థానానికి సంబంధించిన స్థానాధిపతులు, సానిమున్నూర్వురు సమస్త నిబంధకాండ్రు రక్షించేవారని తెలుస్తున్నది.

దాక్షారామ భీమేశ్వరాలయంలోనూ సానిమున్నూర్వురు ఉండేవారని, క్రాంజ నరేంద్రేశ్వరాలయంలోనూ, సిరిపురం రామేశ్వరాలయంలోనూ సానులు మానులు ఉండేవారని అక్కడి శాసనాలను బట్టి తెలుస్తున్నది.

క్రీ.శ. 1170 నాటి మ్రోంపత్తి శాసనాన్ని బట్టి చోడేశ్వరాలయంలో త్రిసంధ్యలు కొలిచే సానులుండేవారు అని తెలుస్తున్నది. వెలనాటి చోడరాజు పడవాలు చోడుని భార్య గోకాంబిక మ్రోంపత్తి చోడేశ్వర దేవరను త్రిసంధ్యల కొలిచే సానులకు వృత్తులను ఇచ్చింది.

సానిమాన్య నిబంధకాఱులు : మానులు- సానులు:

దేవాలయానికిచ్చే దానాలను రక్షింపవలసిన వారిలో సానులతో పాటు మానులు కూడా ఉన్నారు. మాని అంటే బ్రహ్మచారి అని సూర్యరాయాంధ్ర నిఘంటువులో ఉన్నది. కానీ మానులు బ్రహ్మచారులు కారు. క్రాంజ నరేంద్రేశ్వరాలయ శాసనాలలో ఇవ్వబడిన దానాలు వారి సంతతి క్రమంగా నడపాలనీ, మాని తిక్కభడర కొడుకు భరువన, వేమభడర కొడుకు సూరె పుత్రానుపౌత్రికము నడపాలనీ ఉన్నది. కనుక మానులు బ్రహ్మచారులు కాదనీ, వివాహం చేసుకొని సంతానం పొందేవారనీ తెలుస్తున్నది.

సానులు కూడా వివాహితలే. ‘ఇందుల సాని కొడుకు బుమ్మన’ అని కొల్లూరి శాసనంలో ఉన్నది. క్రీ.శ. 1089 నాటి పై కొల్లూరి శాసనంలో అక్కడి అనంతీశ్వర మహాదేవుని ఆలయంలోని సాని కొడుకు బుమ్మన తన తండ్రి మాలిసెట్టికి, తల్లి కొసనసానికి ధర్మంగా అఖండవర్తి దీపానికై ఏడురూక మాడలిచ్చాడు. దైవకార్యానికై నియోగింపబడిన దేవాలయాలలోని అంగరంగ భోగాలను జరిపేవారు సానులు. వీరినే తరువాత కాలంలో అంగభోగము వారు, రంగభోగమువారు, అర్చన భోగమువారు అంటూ శాసనాలలో పేర్కొనేవారు. (చూడుడు ప్రకరణం స్త్రీలు – వృత్తులు).

అంగభోగము వారు అంటే ధూపదీప స్నానవసనాభరణ గంధ పుష్పనైవేద్యాది వైభవాలు జరిపేవారు అని శాసనశబ్దకోశంలో అర్థం చెప్పారు. అంగభోగమంటే విగ్రహానికి సంబంధించిన సేవలనే అర్థంలో శాసనాలలో ప్రయోగించారని దుర్గి శాసనాన్ని బట్టి తెలుసుకోవచ్చును. చామరం వీచడం, తాంబూలం అందించడం, ఛత్రం పట్టడం కూడా ఈ విగ్రహానికి చేసే సేవలే. క్రీ.శ. 1112 నాటి దాక్షారామ శాసనంలో పెదమున్నూటి సాని జయమ అనే చామరి, క్రీ.శ. 1115 నాటి కొప్పరం శాసనంలో ఎఱియక అనే చామరిక, క్రీ.శ. 1133 నాటి నాదిండ్ల శాసనంలో గొడవుకామె అంటే ఛత్రం పట్టుకొనే కామె అనే స్త్రీ ప్రసక్తమైనారు.

అంగభోగమంటే శారీరక సౌఖ్యాన్ని కలిగించడం అన్న అర్థంలో అన్వయించుకొని కొందరు చరిత్ర పరిశోధకులు ఈ సానులు దేవాలయ అధికారులకు పూజారి, స్థానపతి వంటి వారికి ఆ విధమైన సేవలందించేందుకు ఉన్నారని అందుకై వీరికి మాన్యాలివ్వబడినాయని అభిప్రాయపడ్డారు.

“Though our source material very rarely explicitly states so, the underlying promise of why temple girls were thus patronized with property, wealth etc. was predominantly because of the sexual functions they performed for the elites of the time”

కానీ ఆనాటి శాసనాలలో అంగభోగం అంటే విగ్రహానికి చేసే సేవలు అని స్పష్టంగా చెప్పబడింది. క్రీ.శ. 1251 నాటి దుర్గి శాసనంలో శ్రీకరణాధిపతి నామదేవ పండితులు దుర్గి పట్టణంలోని వంకేశ్వరునికి, నాగేశ్వరునికి పరివార దేవతలకు ధూపదీపతాంబూల నైవేద్యాది భోగాలకై దానంచేసే సందర్భంలో అంగభోగాలకు వృత్తులనిచ్చినట్లు ఉన్నది. వృత్తుల వివరాలలో దానగ్రహీతలు చేసే సేవల వివరాలున్నాయి. దాన్నిబట్టి అంగభోగం, రంగభోగం, పాత్రభోగం, అర్చనభోగం అనే పేర్లతో దేవునికి చేసే సేవలను దేవాలయాధికారులకు, పూజారి వంటివారికి చేసేవిగా అన్వయించి పరోక్షంగా ఆ దేవాలయాలలో వ్యభిచారం చేయడానికి భక్తులు దానాలిచ్చినట్లు భావించడం అన్యాయం, అసంబద్ధం అని చెప్పాల్సి ఉంటుంది.

దేవాలయాలలోని సాని – ప్రత్యేకత:

దేవాలయాలలో వంశపారంపర్యంగా అంగరంగభోగాలు చేసే కుటుంబాలలో స్త్రీలేకాక తరువాతి కాలంలో కొందరు వ్యక్తులు తమ మొక్కులు చెల్లించుకొనేందుకు స్త్రీలను స్వామి సేవలకై అర్పించేవారు. వారిని సంప్రదాయానుసారం భగవంతునికిచ్చి కళ్యాణం చేసేవారు. స్వామి అంటే దేవునితో వివాహం అయిన తర్వాత ఆ స్త్రీ స్వామినిగా సంభావించబడేది. దాని తద్భవ రూపమైన సాని పదం ఆ స్త్రీకి ప్రయుక్తమై ఉంటుంది.

దేవాలయాలలోని సానులందరూ సానిమున్నూర్వురు నిబంధమనే సంఘానికి చెంది ఉండి ఉంటారు. ఏ దేవాలయంలోనైనా సానులుగా నియమించాలంటే సానిమున్నూర్వురు వంటి సంఘాల నుండే ఎన్నుకొనేవారు. పైన చెప్పబడిన దేవాలయాలలోని దానాలు సానిమున్నూర్వురు నిబంధకారులు రక్షించాలన్నారు. కానీ ఆయా దేవాలయాలలో మూడు వందల మంది సానులు లేరని ఆయా శాసనాలలో వారికీయబడిన వృత్తుల పట్టికను బట్టి చెప్పవచ్చును.

దేవాలయాలలోని సానులు సంఘాలు:

సానులు ప్రసక్తమైన శాసనాలను పరిశీలించినట్లయితే ఈ క్రింద పేర్కొనబడిన దేవాలయాలలో ఆ ఆలయాలకు సంబంధించిన సానుల సంఘాలు ఉండేవని తెలుస్తుంది.

  1. డుత్తిక వాసుకి రవి సోమేశ్వరాలయం – డుత్తిక సానిమున్నూర్వురు
  2. క్రాంజ నరేంద్రేశ్వరాలయం – సానిమున్నూర్వురు
  3. వేల్పూరి రామేశ్వరాలయం – సానులు-మానులు
  4. చాంచులూరు (సాతులూరు) రామేశ్వరాలయం – సానులు-మానులు
  5. ద్రాక్షారామ భీమేశ్వరాలయం – పెద్దడాకిరేమి సాని మున్నూర్వురు, కొండిక మున్నూర్వురు
  6. చట్టిపురం చోడీశ్వరాలయం – సాని మున్నూరు (SII X, 173)
  7. మ్రోంపత్తి చోడీశ్వరాలయం – త్రిసంధ్యల కొలువంగల సానులు
  8. సిరిపురం రామేశ్వరాలయం – సానులు-మానులు
  9. నాదిండ్ల మూలస్థానేశ్వరాలయం- సామాన్య నిబంధకారులు
  10. గుంటూరు అగస్త్యేశ్వరాలయం – సానులు-మానులు
  11. కొమ్మూరి అగస్త్యేశ్వరాలయం – కొమ్మూరి సాని మున్నూర్వురు
  12. కొల్లూరు అనంతేశ్వరాలయం – సానులు-మానులు
  13. ఘంటసాల (చోళపాండ్యపురం) విశ్వేశ్వరాలయం – సాని మున్నూర్వురు
  14. ధనదవ్రోలి చోడనారాయణపురం – మహేశ్వర పరివార స్త్రీలు
  15. ధనదవ్రోలి పణ్డీశ్వర దేవరాలయం- సానులు
  16. శ్రీకూర్మస్వామి దేవాలయం – సంప్రదాయం సానులు
  17. చందలూరి గ్రామం – కేశవనాథుని ఆలయం – తిరువీధి సానులు
  18. శ్రీగోకీశ్వర దేవాలయం – పాత్రభోగమువారు

ద్రాక్షారామ భీమేశ్వరాలయంలోని చాలా శాసనాలలో మున్నూటిసాని, డాకరేమి మున్నూటిసాని అని పేర్కొనడం వల్ల వీరు ప్రథమంగా ద్రాక్షారామ భీమేశ్వరాలయంలో ఒక ప్రత్యేకశాఖగా సానులలో ఏర్పడినారనీ, క్రమంగా తక్కిన దేవాలయాలలో సానులు నియుక్తమైనపుడు ఈ మున్నూటి సాని కులం నుండి గ్రహింపబడెడివారని డా. అల్లాడి వైదేహిగారు తమ ఆంధ్రుల సాంఘిక ఆర్ధిక చరిత్రలో తెలిపారు. ఈ మున్నూర్వురు సానుల సంప్రదాయం దాక్షారామ భీమేశ్వరాలయంలో ఎలా ప్రారంభమైనదో విచారించాలి.

దాక్షారామ భీమేశ్వరాలయం:

క్రీ.శ. 10వ శతాబ్దిలో సామలకోట భీమవరం రాజధానిగా ప్రాగాంధ్ర దేశాన్ని పాలించిన చాళుక్య బీముడు తన పేర భీమవరం, ద్రాక్షారామాలలో లింగాలను స్థాపించి దేవాలయాలు కట్టించడం వల్ల ఆ రెండు లింగాలకూ భీమేశ్వరుడన్న పేరు వచ్చిందని చరిత్రకారుల అభిప్రాయం.

ఈ విధంగా వారూహించడానికి మల్లపదేవుని పిఠాపుర శాసనం ఆధారమని చెప్పవచ్చును.

తదాతుర్విక్రమాదిత్యస్య తనయశ్చాళుక్యభీమః
షష్ట్యుత్తరం యస్త్రిశతం రణానాం
జిత్వా స్వనామ్నా ప్రధితం విధాయ
చాళుక్య భీమేశ్వర దేవహర్మ్యం
త్రింశత్సమా భూతల మన్వరక్షత్

విక్రమాదిత్యుని కుమారుడు చాళుక్యభీముడు. అతడు మూడువందల అరవై యుద్ధాలు చేసి, తన పేర చాళుక్య భీమేశ్వర దేవుని ఆలయంగా ప్రసిద్ధికెక్కునట్లు చేసి ముప్పదేండ్లు భూమిని పాలించాడని పై శ్లోకాల భావం. ఆ విధంగా చాళుక్య భీముడు కట్టించిన ఆలయానికి పురాణగాథల్ని జోడించి దానికి ప్రాచీనత్వాన్ని ఆపాదించారు. కానీ దాక్షారామంలో చాళుక్యభీముని ముందుకాలం నాటి శాసనాలేవీ లేవు కనుక ఇది చాళుక్య భీముని కాలం నాటిదే అని చెప్పవచ్చును.

ద్రాక్షారామం శివాలయంగా మారడానికి ముందు బౌద్ధారామమని చరిత్ర పరిశోధకుల అభిప్రాయం. వారి అభిప్రాయం ప్రకారం ఆరామాలన్నవి బౌద్ధులకే ఉండేవి, దాక్షారామం, అమరారామం, క్షీరారామం, కుమారారామం లేక భీమారామం, సోమారామం అన్నవి నాటి పంచారామాలు. వీటిలో బౌద్ధులకు సంబంధించిన శాసనాలు ప్రాకృత భాషలో రచింపబడినవి దొరికినాయనీ, అంతేకాక ఆరాధింపబడే ఈ శివలింగాలు తెల్లని స్ఫటిక లింగాలు అనీ, ఇవి బౌద్ధుల ఆయక స్తంభాలవలె ఎత్తుగా ఉన్నాయనీ, గోదావరీ కృష్ణా నదీ తీరాలలో శాతవాహనుల పరిపాలన సమయంలో బౌద్ధమతానికి సంబంధించిన నిర్మాణాలు జరిగినాయని చారిత్రకులు నిర్ణయించారు. అంతేకాదు దాక్షారామంలో శివలింగమని చెప్పబడే స్తూపం పైన శాసనాలు చెక్కబడి ఉన్నాయి. అవి దేవనాగరి లిపిలో వ్రాయించబడిన బౌద్ధ ధర్మసూత్రాలు కావచ్చును.

దాక్షారామం – సానులు–మానులు:

శాతవాహన, ఇక్ష్వాకు రాజుల కాలంలో తెలుగుదేశంలో వర్థిల్లిన బౌద్ధమతం శాలంకాయనులు పల్లవులు, కదంబులు మొదలైన తరువాతి రాజుల కాలంలో క్షీణించసాగింది. పల్లవ త్రినేత్ర బిరుదాంకితుడైన ఒక ప్రాచీన పల్లవరాజు ప్రారంభించిన వైదిక ధర్మోద్ధరణ కార్యక్రమం అమరావతి ప్రాంతంలో వర్ధిల్లిన బౌద్ధమత నిర్మూలనకై ఉద్దేశించబడి దాని ప్రభావం రెడ్డిరాజుల వరకు సాగింది. అంతేకాక పురాణ వాఙ్మయం వర్థిల్లి సామాన్య ప్రజలలో వైదిక సంస్కృతి ప్రచారం పొందింది. బౌద్ధమతంలో వజ్రయానమనే శాఖ వర్థిల్లి దానికనుగుణమైన తాంత్రిక విధానాలు ప్రబలి భిక్షువులు, భిక్షుకులు ఇతరులు తమ శీలాన్ని శంకించే విధంగా ప్రవర్తించేవారు. దీనితో పవిత్రస్థానాలుగా ప్రసిద్ధిపొందిన బౌద్ధవిహారాలు ప్రజల చేత అపవిత్రాలని బహిష్కరింపబడినాయి. క్రమంగా అవి శిథిలాలై దిబ్బలుగా రూపొందాయి. ప్రజలు వాటిని లంజదిబ్బలని పిలిచేవారు. చాళుక్య భీముని కాలంలో శైవమతం విజృంభించడంతో ప్రజల నిరాదరణకులోనై, తమ మతం క్షీణదశకు రావడం వల్ల దాక్షారామాది ప్రాంతాలలో బౌద్ధ బిక్షువులు భిక్షుకులు శైవాన్ని ప్రతిఘటించకుండా ఆ మతాన్ని స్వీకరించి ఉండవచ్చు. వీరికి బౌద్ధారామాల ద్వారా సంక్రమించిన ఆస్తులు నిలుపుకోవడానికి ఆరామాలు శైవాలయాలుగా మారిన సందర్భంలో తాము అందులో సానులు- మానులుగా రూపాంతరం చెంది ఉంటారు.

వీరే కాకుండా దేవాలయ సేవచేసే కుటుంబాలలోని స్త్రీలు, నాట్య సంగీతాది కళలనభ్యసించి రాజులను ధనికులను అలరించి జీవనం గడిపే స్త్రీలను దేవాలయంలో అంగరంగ భోగాది కార్యక్రమాలు నిర్వర్తించడానికి దానధర్మ కార్యాలు అమలుజరపడానికి చాళుక్య భీముడు భీమేశ్వరాలయానికి ధారాదత్తం చేసి ఉండవచ్చు. వీరందరూ మొదట మూడువందలమంది మున్నూటిసాని సంఘంగా ఉండి ఉంటారు. తరువాత వీరి సంఘంలోని వ్యక్తుల సంతానాన్నే మిగిలిన దేవాలయాలకు అంగరంగ భోగార్ధమై నియమించడం వల్ల మరొక మూడువందల మంది సంఘంగా తయారయి వుంటారు. కనుక మొదటి సాని సంఘంలోని వారిని పెద్దడాకిరేమి పెదమున్నూటి సానులనీ, తరువాతి వారిని పెద్ద డాకిరేమి కొండిక మున్నూటి సానులని వ్యవహరించి ఉంటారు. ఈ రెండు మున్నూటి సానుల సంఘాల వారినే శ్రీనాథుడు తన కావ్యం భీమేశ్వర పురాణంలో వారవధూ త్రిశతద్వయమని పేర్కొని ఉంటాడు.

సురపతి మార్గశీర్షమున శుద్ధ చతుర్దశినాడు రోహిణిం
బొరసిన సిద్ధయోగమున భూతలమిచ్చె బయోధిగౌతముల్
గరుసుగ దుల్యభాగయను గండ్రెడు లోనుగ దక్షవాటికా
వరునకు భీమనాథునకు వారవధూత్రిశతీద్వయమ్ముతోన్

ఈ సానులకు సంఘంలో గౌరవాదరాలు ఉండటం వల్లను, ఆర్థికంగా మంచి దశలో ఉన్నందువల్ల సంఘంలో క్రింది వర్గాలవారు వారి కుటుంబాలలోని ఆడపిల్లలను దేవాలయాలలో సానులుగా చేర్పించి ఉంటారు.

దేవాలయాలలో సానులకున్న విశిష్టత:

దేవాలయాలలోని సానులకు సంఘంలో గౌరవం ఉండేదని వారికి శాసనాలలో ఉపయోగించిన విశేషణాలను బట్టి తెలుస్తుంది.

దేవాలయాలలోని సానులకు వాడబడిన విశేషణాలు:

దేవాలయాలలోని సానులను ఆనాటి శాసనాలలో గౌరవంగానే పేర్కొన్నారు. కానీ వారికి వాడిన విశేషణాలు కులసతులకు వాడిన విశేషణాలకు భిన్నంగా ఉన్నాయి. కులసతులకు అనింద్య చరిత, పతిహితారుంధతి, సతీ, పతివ్రతా, అని ఉంటే సానులకు వారి సౌందర్యాన్ని, దాతృత్వాన్నీ తెలిపే విధంగా ఉండేవి.

అవనిగడ్డలోని లక్ష్మీనారాయణ దేవాలయంలో క్రీ.శ. 1154 నాటి శాసనంలో గుండమ అనే స్త్రీని వికసితాంభోజాతానన, అగణ్యపుణ్యవ్రత, అని పొగిడారు. అక్కడే లభించిన మరొక శాసనంలో మేడమ అన్న స్త్రీని మదనాంగి, సుమధ్య, పుణ్యదోహలి అని, నరలోక రంభ అని ప్రశంసించారు. ఈమెకు పడిహారి ముత్తనకు జన్మించిన నూంకమను లతా లలితాంగి, సుమధ్యమ, మత్తపికభాషిణి, గోత్రపవిత్రమై ఒప్పునది అని పొగిడారు. శాసనం చివర సానినూంకమ అని ఉన్నది కనుక ఆమె ఆ దేవాలయంలోని సాని అని తెలుస్తున్నది. పడిహారి ముత్తనకు మేడమకు జన్మించిన మరొక పుత్రిక కొమ్మమ. ఈమెకు అంబుజోజ్వలదలలోలనేత్రి, మదసామజయాన, లతాసుమల్లికా మిలితసుగస్థి అనే విశేషణాలు ప్రయుక్తమైనాయి.

ఈ దేవాలయానికి సంబంధించిన మరొక స్త్రీ చోడాంబ గంగమారాయని కూతురు. శాసనంలో నటతనయాం అనడం వల్ల ఈమె నాట్యం చేసేవాని కూతురనీ, పక్వబింబాధరోష్ఠి, చంద్రబింబోపమ ముఖకమలా, శ్యామలా, కోమలాంగీ అనే విశేషణాలవల్ల సౌందర్యవతి అనీ తెలుస్తున్నది. జాయపసేనాని నృత్తరత్నావళిలో ఉత్తమ నర్తకికి నిర్దేశించిన లక్షణాలు పై విశేషణాలలో స్ఫురిస్తున్నాయి. బహుశా వీరు ఉత్తమ నర్తకులై ఉండవచ్చును.

ఎనమదలలోని ఒక శాసనంలో ముత్తసాని అన్న స్త్రీని శ్రీమతు ముత్తసాని అని గౌరవ సంబోధన చేశారు. వారి చెల్లెలు దెన్నసాని అని, వారి మఱది సూరపనాయకుడు అని గౌరవ పురస్సరంగా చెప్పటం వల్లను, వీరందరూ కోటబేతరాజుల ధర్మార్థంగా రుద్రేశ్వర దేవరను ప్రతిష్ఠ చేసి భూములను దానం ఇవ్వడం వల్లను ఈ ముత్తసాని యనమదలలోని సానిమాన్య నిబంధంలోని స్త్రీ కావచ్చునని ఊహించవచ్చును.

నాదెండ్లలోని ఒక శాసనంలో దామమ అన్న స్త్రీని అమిత గుణాభిరామ, సుగుణాభరణాభిరామ అని ప్రశంసించి, ఆమె వరపుత్రి అయిన బుద్ధన సూరమను లక్ష్మీదేవి వంటి రమణీయమైన రూపం గలదని, మహోదార, ధర్మగౌరవకులనిస్తార, అనీ దానగుణం కలదనీ, బుధాధార అనగా పండితులకాధారమైనదనీ, ప్రియవచోరమ్య అని అభివర్ణించారు. సనదవ్రోలి పండీశ్వర దేవర నర్తకి సొక్కమ అనే స్త్రీని భావజరాజ్యాన్విత లక్ష్మి అని శరీర సౌందర్యంలో రంభను పోలినదనీ, శీలంలో మానవీతతిని అధఃకరించినది అంటే స్త్రీలందరినీ మించినదనీ, త్రివర్గఫలశ్రీకర, సురవనితా విలాస అని శాసనంలో ప్రశంసించారు.

ఈ విశేషణాలన్నిటిని బట్టి దేవాలయాలలో సానులుగా ఉన్నవారు సౌందర్యవతులే కాక గుణవతులు, దానధర్మపరాయణలు, చక్కగా మాట్లాడగలిగినవారు, పాండిత్యం కలవారు, నాట్యకళా కౌశలం గలవారు అని తెలుస్తున్నది. ఇటువంటి విశేషమైన లక్షణాలుండి నిరంతరం భగవంతుని సేవలలో జీవితాన్ని తరింపజేసుకొంటూ తమ కుటుంబ సభ్యులతో కలిసి నీతినియమాలతో జీవించేవారిని సామాన్య వేశ్యల నీచజీవితంతో పోల్చి హీనంగా చూడడం అన్యాయం అనిపించకమానదు.

సానులు – కులము:

సానులు – మానులు అన్నవారు ఒకే కులానికి చెందిన వారు కారు. వీరు అన్ని కులాల నుండి, ముఖ్యంగా సంఘంలో క్రింది వర్గాల నుండి వచ్చేవారు.

క్రీ.శ. 1262 నాటి మల్కాపుర శాసనం (గోళకీమఠం)లో సానులకు వృత్తులిచ్చిన వివరాలు ఉన్నాయి. అందులో పేర్కొనబడిన సానులను గూర్చి పరిశీలిస్తే వారే కులాలనుండి వచ్చారో గ్రహించవచ్చు.

నల్లదేవి సెట్టి కూతురు నల్లమరసాని – బలిజకులం స్త్రీ?

సమయమంత్రి విశ్వేశ్వర మాణిక్యం – బ్రాహ్మణ స్త్రీ

ఆండరి కూతురు గోళగిరి మాణిక్యం

వేమన జీయని కూతురు కామసాని – పూజారి కూతురు

ప్రోలెబోయ కూతురు కొనుసాని- బోయజాతికి చెందిన స్త్రీ

త్రుట్ట పాము కొమ్మసాని

త్రుట్టపాము గుడ్డసాని – వీరిద్దరూ పాములు పట్టే వారికులానికి చెందిన స్త్రీలు కావచ్చు.

క్రీ.శ. 1241 నాటికి చెందిన ఒక శాసనంలో మల్లేశ్వర దేవరగుడి పాత్ర (నర్తకి) సూరమ అనే కోమటి ప్రసక్తమైంది.

క్రీ.శ. 1237 నాటి దాక్షారామ శాసనంలో పెంకేటి వీరపరెడ్డి అని పెద మున్నూంటి వంశానికి చెందిన వ్యక్తికి వరాంగన లక్షమకు జన్మించిన బిమ్మసాని అన్నసాని గూర్చి చెప్పబడింది.

క్రీ.శ. 1139 నాటి నాదిండ్ల శాసనంలోని సానుల పేర్లను, వివరాలను బట్టి వారు విభిన్న కులాలనుండి వచ్చారని చెప్పవచ్చును. ఆ శాసనంలో బసవిసెట్టి కూతురు బోచక, బోయుబుద్ధన సూరక, మాదిరాజు మారక, దాడపోజు (కంసాలి, అగసాలి) మన్మరాలు ముప్పై, పెద్దన బోయుని మన్మఱాలు అయితక, కొట్యమ నాయకు మన్మఱాలు చెన్నక అనే సానులున్నారు. 101 వీరు ఏ కులాల నుండి వచ్చారో వారి తండ్రుల తాతల పేర్లను బట్టి తెలుసుకోవచ్చు. రెడ్డి, బోయ, కంసాలి, నాయక, వంటి కులాలనుండి వచ్చేవారని పై శాసనాలను బట్టి చెప్పవచ్చును.

సాధారణంగా వేశ్యల కులాన్ని బట్టి వారి సంతానం కులం నిర్ణయించబడుతుంది. కానీ సానుల, భోగస్త్రీల సంతానం విషయంలో వారి తండ్రులను బట్టే కులాలు నిర్ణయించబడతాయి. దాన్ని బట్టి కూడా సానులన్న వారు వేశ్యలకంటే భిన్నమైనవారు అని చెప్పవచ్చును.

క్రీ.శ. 1241 నాటి యనమదల శాసనంలో శ్రీమతు ముత్తసాని అన్న దేవాలయసాని కొడుకులు కాటమరెడ్డి, బైరెడ్డి అనేవారయితే ముత్తసాని చెల్లెలు దెన్నసాని కొడుకు ఎఱ్ఱ గొమ్మినాయుడు, ఆమె భర్త సూరపనాయుడు. (శాసనాన్నిబట్టి ముత్తసానికి మఱది అని చెప్పటం వలన చెల్లెలి భర్త అని గ్రహించాలి) అన్న వారు ప్రసక్తమైనారు. ఆ శాసనాన్నిబట్టి తండ్రిని బట్టి సంతానం యొక్క కులం నిర్ణయింబడుతుందని చెప్పవచ్చు.

పైన చెప్పిన దాన్ని బట్టి సానులు రకరకాల కులాలనుండి వచ్చేవారని, ప్రతీ వారు తమ తల్లిదండ్రుల పేర్లు చెప్పుకోవడం వల్ల వారు గౌరవ ప్రదమైన కుటుంబాల నుంచి వచ్చి దేవాలయ సేవలు నిర్వర్తించేవారని చెప్పవచ్చును.

మున్నూర్వురు సానుల కుటుంబ సభ్యులు:

దేవాలయాలలో తాతలు తండ్రులు ఇతరులు అర్పించగా వచ్చిన స్త్రీలేకాదు. ఎంతో కాలంనుండి కుటుంబాలు కొన్ని దేవాలయాల నాశ్రయించుకొని ఉండేవి. కనుకనే శాసనాలలో అక్కచెల్లెళ్ళు, తల్లీ కూతుళ్ళు, అత్తా కోడళ్ళు అయిన స్త్రీల గురించి ప్రస్తావన కనిపిస్తుంది. దాక్షారామ శాసనాలలో ఎఱియక, కాడప ప్రోలి అనే అక్కాచెల్లెళ్ళు, పెదమున్నూటి సాని సందరాసాని, ఆమె కూతురు సూరాసాని, పెద్దమున్నూటి సాని చామరి అయిన జయమ, ఆమె కోడలు ప్రోలాసాని, పెద్దమున్నూంటి ప్రేకేటి వీరపనాయకుని కూతురు అక్కాసాని, ఆమె సోదరి బిమ్మాంబిక మొదలైన కుటుంబ సభ్యులు పేర్కొనబడినారు.

మున్నూరు సానుల కుటుంబాలలో పురుషులు:

సానుల కుటుంబాలలో పురుషులు కొందరు యుద్ధాలలో పాల్గొనేవారు, కళలలో కూడా ఆరితేరి ఉండేవారు. మున్నూర్వురు సానుల కుటుంబాలలోని వారెందరో పురుషులు కొన్ని ఊళ్ళకు నాయకులై యుద్ధాలలో పాల్గొనేవారని తెలుస్తుంది.

దాక్షారామ శాసనంలో గుద్దవాదినాంటి, పెద్దడాకిరేమి, పెద్దమున్నూటి సమర మొదలి బేతి నాయకుని ప్రసక్తి ఉన్నది. ఇతను పెద్దమున్నూటి వంశానికి చెందిన వాడని మేలునాయకుని వంటివాడని తెలుస్తున్నది. సమరమొదలి అనటంవల్ల ఇతడు యుద్ధాలలో పాల్గొనేవాడని మొదలి అంటే ప్రధాని అని అర్థమున్నది కనుక ఇతడు యుద్ధంలో సేనా నాయకుడిగా బాధ్యత నిర్వహించి ఉంటాడని తెలుస్తున్నది. దేవాలయ వృత్తులు సంపాదించిన వారికే ఈ పెద్దమున్నూటి, పెద్దడాకిరేమి వంటి పదాలు ఉపయోగిస్తారు. ఇతర రాజోద్యోగులకు ఇటువంటి పదాలు వాడరని శాసనాలు పరిశీలిస్తే తెలుస్తుంది. రేచెర్ల రుద్రుడు, రాజనాయకుడు, చెఱకు సామంతులు మొదలైన వారి పేర్లముందు, పదవుల ముందు ఇటువంటి పదాలు ప్రయుక్తం కాలేదు.

ఈ సమర మొదలి బేతినాయకుని కూతురు జయమ కులోత్తుంగ చోడదేవర అనుంగు అని పై శాసనాన్ని బట్టి తెలుస్తున్నది. ఈమె అంగరంగ భోగాదికాలు నెరవేర్చేదేవాలయ సానుల్లో ఒకరని ఈమెకు సంబంధించిన మరొక శాసనంవల్ల తెలుసుకోవచ్చును. ఆ శాసనంలో గుద్దవాదినాంటి, పెద్ద డాకిరేమి, పెద్దమున్నూంటి సాని అయిన జయమ చామరి అని చెప్పబడింది. బహుశా తండ్రి తరువాత అతనికి సంబంధించిన ఆలయవృత్తి ఆమెకు లభించి ఉంటుంది. ఆమె చామరాన్ని వీచే పదవిని చేపట్టి దేవాలయ మాన్యాన్ని పొంది ఉంటుందని నిర్ధారించవచ్చును. దీన్ని బట్టి దేవాలయ సేవలు చేస్తూ ఆలయ మాన్యాలు పొందేవారిలో కొందరు ఊళ్ళకు నాయకత్వం వహించి యుద్ధాలలో పాల్గొనేవారని గ్రహించవచ్చును. ఆ కాలంలో ఒక వైపు కళలను పోషిస్తూ, మరొక వైపు యుద్ధనైపుణ్యం చూపించ గలవారు అనేకులుండేవారు. వారిలో జాయపసేనాని, అతని గురువు గుండామాత్యుడు, వారి ప్రభువు కాకతి గణపతి దేవుడు ముఖ్యులు.

కాకతిగణపతి దేవుడు తనకు ప్రియమైన మఱిది జాయపను చిన్ననాటనే దగ్గరకు తీసుకొని గుండామాత్యునికి తనను ఇంద్రుడు బృహస్పతికి జయంతునివలె అప్పజెప్పి శ్లాఘనీయమైన కళను నేర్పించాడని జాయప తన గ్రంథమైన నృత్త రత్నావళిలో చెప్పాడు.

ఈ విధంగా నాయకులుగా ఉన్నవారి ప్రసక్తి కొన్ని ద్రాక్షారామ శాసనాలలో కానవస్తుంది. కొండికమున్నూటి అడప, మత్యవంశ తిలకుడైన ఒడ్డాది జయంతి రాజు కొడుకు అర్జున దేవుని దేవి అక్కమాంబకు తండ్రి గడియపసెట్టి వీరపనాయకుడు. ఇతడు దేవాలయంలో మాన్యాలను పొందిన వాడనీ, నాయకుని పదవిని నిర్వహించేవాడనీ గ్రహించవచ్చును.

కులోత్తుంగ చోడ గొంక రాజుల మఱిది దండనాయకుడైన చోడప నాయకుని తల్లి కొమ్మసాని దాక్షారామంలో వేయించిన శాసనంలో ఈమె కూతురు కులోత్తుంగ చోడగొంకరాజుల ప్రియవల్లభ, గుణాన్విత అని వర్ణించబడింది. అంటే ఈమె పట్టపురాణి లేదా కులపత్నికాక భోగసతి అయి వుంటుందని చెప్పవచ్చు. ఆమె సోదరుడు కులోత్తుంగ చోడుని వద్ద దండనాయకుడు వీరి తల్లి కొమ్మసాని దేవాలయసాని అని శాసనాన్ని బట్టి గ్రహించవచ్చును.

(సశేషం)

Exit mobile version