Site icon Sanchika

‘కాకతీయ యుగంలో స్త్రీల సామాజిక స్థితిగతులు – ఒక పరిశీలన’ -11

[డా. మంత్రవాది గీతా గాయత్రి గారు 1995లో పిహెచ్‍డి పట్టా కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖకి సమర్పించిన సిద్ధాంత వ్యాసాన్ని సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము.]

ప్రకరణం 3 కాకతీయుల కాలంనాటి సమాజము – స్త్రీలు – మూడవ భాగం:

నాయకురాలు:

[dropcap]కా[/dropcap]కతీయుల కాలానికి చెందిన శాసనాలలో ముఖ్యంగా శ్రీకూర్మ ముఖలింగ దేవాలయ శాసనాలలో సాని అనే పదం బదులు నాయకురాలు అన్న పదం కనిపిస్తుంది. ఈ నాయకురాలు మేళనాయకురాలు కావచ్చును. ఆనాటి మేళాలు రెండు విధాలుగా ఉండేవని అంటారు. ఒకటి నట్టువ మేళం రెండవది నాట్యమేళం అనేవి. నట్టువమేళంలో స్త్రీగాని, పురుషుడుగాని ఒకరే ఉంటారు. తక్కిన వారు గీత వాద్యాల వారై ఉంటారు. నాట్యమేళంలో నర్తకులు ఎక్కువ మంది ఉండవచ్చును. కాని సాధారణంగా నట్టువ మేళానికి నర్తకే నాయకురాలు బహుశా అటువంటి నట్టువ మేళాల నాయకురాళ్ళకు గ్రామాలు వృత్తులుగా ఇవ్వడం వల్ల వారిని ఆ ఊరి నాయకురాళ్ళుగా శాసనాలలో చెప్పి ఉంటారు. ఆత్మకూరుకు చెందిన క్రీ.శ.1238 నాటిది అయిన ఒక శాసనంలో పాతువోతారం నాయిక కూచాంబ ప్రసక్తమైంది. ఆమె కొడుకు కేతినాయకుడనే వాడు తనను కాకతి లక్ష్మణాగ్ర తనయుడనని, పాతువోతారం నాయిక కూచాంబ నందనుడనని చెప్పుకొన్నాడు. అతడు తన తండ్రి పేరు మీద లక్ష్మీశ్వరుని ఆతుకూరులో ప్రతిష్ఠించి విమానం (గోపురం) కట్టించాడు. ఈతని తల్లి నట్టువమేళానికి నాయిక అయి పాతువోతారం అనే ఊరు మాన్యంగా పొంది ఉంటుంది. ఆమె తనయుడికి ఆ గ్రామం వారసత్వంగా వచ్చిఉంటుంది. కనుకనే కాకతి లక్ష్మణునికి అగ్రతనయుడైనా తనను కూచాంబానందనుడు అని శాసనంలో పేర్కొన్నాడు.

ఇదే విధంగా ముఖలింగంలోని మధుకీశ్వరాలయంలోని శాసనాలలోనూ, శ్రీ కూర్మంలోని శాసనాలలోనూ నాయకురాలు అనే పదం ప్రసక్తమైంది.

1). చోడగంగదేవర శ్రాహి 37 న పోతమ నాయకుడాలి కొడ్కు ఈ కుడి (మే)లు నాయకు పెరు(ద్ర) ర గంగ్గ విడ్పర యత్తైన పసాయి కొమ్మినాయకుణ్ణు (క్రీ.శ.1111)

2). మధుకీస్వర దేవరకు ప్రోలినాయకుని పెండ్లము బేత మనకుఱాలు (నాయకుఱాలు) క్రీ.శ. 1098

3).తొలచి సొమినాయకు మాంక

మనాయకుఱాలి కొడుకు సూరెప్రధాని

తమ్ముండు పురుషోత్తమ మండలికుణ్డు క్రీ.శ.1187

4). శ్రీ మదనన్త వర్మ దేవర ప్రవర్ధమాన విజయరాజ్య 64 శ్రాహి శక సం. 1061

శ్రీ మధుకీశ్వర దేవర కలోలెప అ

రాయనికి మేడమ నాయకుఱా

లి కొడుకు గజసాహిని కుప్పన

వీరలకు ధమ్మువుగా 4 క్రీ.శ. 1139

5) పిష్టపురమున

శక. సం. 1100

దండమ నాయకుని పెం

డ్లము సుందామ నాయకుడాలి కూం

తుఱు సింహపురమున బనపతి

పెగ్గడ పెండ్లము ఎఱకమ నాయ

కుఱాలు శ్రీమధుకీశ్వ దేవరకుం

బెట్టిన 5 ( క్రీ.శ. 1178)

6) సెట్టివాడ ఎఱ

పోతనాయకుని కన్న

మ నాయకుఱాలికూ

౦తుఱు ముదిసెలి

నూంకమ

నాయకుతాలు వె

ట్టిన అఖండ దీపము (క్రీ.శ.1156)

7) సోమినాయకు సూరమ నాయకుడాలి కొడుకైన

నకరు వాడపురవరి కామన

పై శాసనాలను విశ్లేషించి కొన్ని విశేషాంశాలను గ్రహించవచ్చును.

1.నాయకుతాలు పదవి దేవాలయ సేవలకు సంబంధించినది.

2.ఇది వంశపారంపర్యంగా లభిస్తుంది నాయకుఱాలి కొడుకు మేలినాయకుడుగానో మరొక పదవిలోనో ఉండి మాన్యాన్ని అనుభవించవచ్చు లేదా కూతురు నాయకురాలు కావచ్చును.

“పోతమ నాయకుఱాలి కొడుకు ఈ కుడి మేలునాయకుడు”

“సుందామనాయకుఱాలి కూంతుఱు.. ఎఱకమ నాయకుఱాలు”.

కన్నమనాయకుఱాలి కూంతుఱు

ముదిసెలి నూంకమ నాయకుఱాలు

3.ఈ నాయకుఱాలి పదవి ఉన్న స్త్రీల కొడుకులు రాజోద్యోగులు కావచ్చును.

మేడమనాయకుఱాలి కొడుకు గజసాహిని కుప్పన

మాంకమ నాయకుఱాలి కొడుకు సూరె ప్రధాని

సూరమ నాయకుఱాలి కొడుకైన నకరపువాడ పురవరికామన.

ఆవనిగడ్డలోని లక్ష్మీనారాయణుని దేవాలయంలోని క్రీ.శ. 1154 నాటి శాసన మొకదానిలో సాని నూంకమ అనే స్త్రీ ప్రసక్తమైంది. ఆమె పడిహారి ముత్తనకు మదనాంగి, సుమధ్య పుణ్యదోహలి అని ప్రశంసింపబడిన మేడమకు జన్మించింది.

ఈ ప్రతిహారి ముత్తన వెలనాటి గొంకని భృత్యుడు, కొల్లూరి విభుడు అయిన చింతమనాయకునికి వికసితాంభోజాతానన అగణ్య పుణ్యవ్రత అని పొగడబడిన గుండమకు జన్మించిన వాడు. పై శాసనంలోని అంశాలను బట్టి దేవాలయ సాని నూంకమ వెలనాటి రాజవంశానికి వంశపారంపర్యంగా భృత్యులుగా ఉన్న ప్రతీహారుల కుటుంబంలోని వ్యక్తి అని ఆ కుటుంబంలో స్త్రీలు దేవాలయాలలో సానులుగా సేవలు చేస్తే పురుషులు రాజోద్యోగులుగా పనిచేసేవారని గ్రహించవచ్చు.

మున్నూర్వురు సానుల సంప్రదాయం – క్షీణదశ

తెలుగుచోడుల కాలంలోనూ, కాకతీయుల కాలం ప్రారంభంలోనూ మున్నూర్వురు సానులకున్న గౌరవ మర్యాదలు తరువాతికాలంలో క్రమంగా తగ్గనారంభించినాయి. పాల్కురికి సోమనాధుని కాలానికి బహుశా మున్నూర్వురు సానులు మామూలు వేశ్యల స్థాయికి దిగజారిపోయి ఉండవచ్చునని బసవ పురాణంలోని ముగ్ధసంగయ్య కథ ద్వారా తెలుస్తుంది. ముగ్ధసంగయ్య అందరు జంగములలాగా తానూ లంజెరికం కోసం వెడతానని వేశ్య యింటికి వెళ్ళి ఏ గురు సంప్రదాయానికి చెందినవారు అని ప్రశ్నిస్తే ఆమె శ్రీ గిరి, దాక్షారామాలలోని వారు మా గురువులు అని చమత్కరించింది

తలప మాగురు సంప్రదాయమువారు
గలరు శ్రీ గిరి యాదిగా నెల్లయెడల
నధిప సాక్షాజ్జగదం బాసమాన
లధికంబు గలరు దాక్షారామమునను

ఆమె ఆ విధంగా జవాబు చెప్పడానికి కారణం వేశ్యలకు మతపరంగా మద్దతు లభించి సంఘంలో గౌరవం లభించడం వల్ల కావచ్చు లేదా మొదట గౌరవ స్థానం సంపాదించిన మున్నూర్వురు సానుల సంప్రదాయానికి గౌరవం తగ్గి సామాన్య వేశ్యల స్థాయికి వారు దిగజారి పోవడము కావచ్చును.

మున్నూర్వురు సానులకు ఇచ్చేవృత్తులు వారి పుత్రులకో పుత్రికలకో వంశపారంపర్యంగా లభించేవి. అయితే ఈ వృత్తులననుభవించేవారు ఆ సంప్రదాయానికి వారసులై వారి పూర్వులవలె దేవాలయాన్ని ఆశ్రయించుకొని సేవించవలసి ఉన్నది. తరువాత కాలంలో సానుల కూతుళ్ళకు కాక కొడుకులకే మాన్యాలు చెందడం శాసనంగా చేయటంవల్ల సానుల కూతుళ్ళు మండలాధీశులకు, రాజోద్యోగులకు భోగస్త్రీలుగా మారవలసివచ్చి ఉంటుంది. క్రీ.శ. 1316 నాటి పెదకొండూరు శాసనంలో “ఈ వ్రిత్తి సానికొడుకులు అనుభవించగలవారు” అని ఉండటంవల్ల సానుల వృత్తులు కొడుకుల పరం కావడం ప్రారంభమైందని గ్రహించవచ్చును. సాని కుటుంబంలోని స్త్రీలు రాజులకు, మండలాధికారులకు భోగస్త్రీలయితే వారి కుటుంబంలోని పురుషులు ఆ స్త్రీల ద్వారా సన్నిహితులై సైనికాధికారి వంటి పదవులు నిర్వహించేవారు. ధాన్యవాణీవరవృత్తిపరుడు, మేలు నాయకుడు అయిన పోతయనాయకుని కూతురు, సనదవ్రోలి పండీశ్వర దేవాలయంలో నర్తకి అయిన సొక్కమకు కామిదేవి అనే కూతురు, కాముడు, సరణుడు అనే పుత్రులు దేవతావరం వల్ల జన్మించారు. కామిదేవి గొంకమహీశుని దేవి కాగా సరణయ గొంక మహీశుని తరపున యుద్ధాలలో పాల్గొని గెలిచి, గొంకరాజును మెప్పించి కొండపడుమఱి రాజ్యంలోని జేవరాన్ని బహుమతిగా పొందాడు. ఇతడు కులోత్తుంగ గొంక రాజుకు ఇష్టభృత్యుడు కామిదేవికి ఇంకొక సోదరుడు కాముడు కంజెఱ్వుల కోట యుద్ధంలో గణపతి సైన్యంతో పోరాడి మరణించాడు. ఈ వివరాలు క్రీ.శ.1161 నాటి తిమ్మాపురం శాసనంలో ఉన్నాయి. 120 దీన్నిబట్టి దేవాలయాలలో అంగరంగ భోగాలు నిర్వహించే స్త్రీలందరూ మొదట సంఘంలో గౌరవం పొందడంవల్లనే వారి భర్తలు, కొడుకులు తండ్రులు ఆ స్త్రీలతో తమ బంధుత్వాన్ని గర్వంగా ప్రకటించుకొని వారి పేరుమీద అఖండదీపదానాలు చేసి శివలింగ ప్రతిష్ఠలు చేసి చెరువులు కట్టించారు. తరువాతి కాలంలో ఆర్ధికంగా వెనుకబడ్డ వర్గాలవారు డబ్బుకోసం కొందరు మూఢనమ్మకాల వల్ల కొందరు, దేవుని మీద భక్తి, మతం పట్ల అభిమానం పెరిగి కొందరు, రాజుల వద్ద సైనికులై క్షతగాత్రులవడం వల్లనో, మరణించడం వల్లనో, కుటుంబంలోని వారు ఆడపిల్లలను భారంగా భావించడం వల్లనో తమ కుటుంబాల స్త్రీలను దేవాలయాలకు అర్పించి ఉంటారు. వీరినే తరువాతి కాలంలో దేవదాసీలనేవారు.

దాక్షారామ భీమేశ్వరాలయంలో సాని స్థానం:

శ్రీనాథుడు రచించిన భీమేశ్వర పురాణానికి పీఠిక రచించిన శ్రీ చిలుకూరి పాపయ్యశాస్త్రి గారు ఆ దేవాలయ సంప్రదాయ సేవలలోని ఏకాంతసేవ గురించి ఈ విధంగా వివరించారు.

దాక్షారామ భీమేశ్వరాలయంలోని పూజావిధులలో ఒకటి ఏకాంతసేవ. ప్రతి ఏకాదశికి భీమనాధ దేవునికి ఏకాంత సేవ జరుపుతారు. ఆ సేవకు భీమేశ్వరుని ప్రాసాదం నుండి క్రిందికి సపరివారంగా మాణిక్యాంబిక ఉన్నచోటికి తీసుకొని వచ్చేవారు. ఈ లోపున ఎనిమిది అష్టకాలు చదువుతారు. అందులో మాణిక్యాంబిక భోగపురంధ్రియైనట్లు, ఆమె ప్రణయకుపిత అయినట్లు దూతీ సంప్రేషణాదికం జరిగినట్లు ఉంటుంది. ఈ అష్టకపఠనమైన తరువాత మాణిక్యాంబికా భవనంలో భీమేశ్వర స్వామికి మాణిక్యాంబికా సమేతంగా పవ్వళింపు సేవ జరుగుతుంది. ఈ సందర్భంలో జోలపాటలు, లాలిపాటలు పాడటంతో ఏకాంతసేవ అర్ధరాత్రి వరకు జరుగుతుంది. ఈ విషయాన్నే శ్రీనాథుడు భీమఖండంలో భీమనాధుడు ధూర్తవిటునివలె అర్ధరాత్రి అంతఃపుర కన్యలకు కనుచాటుచేసి సానివాడకేగినట్లు (వక్రోక్తి) చమత్కరించాడు.

మొదట్లో దేవాలయ సానికి దేవుని భార్యకు (దేవి) ఇచ్చినంత గౌరవం తరువాతి కాలంలో క్రమంగా తగ్గిపోయింది. సానిమాన్య నిబంధం స్థానాధిపతి, శ్రీకరణం వంటి వారితో సమంగా దేవాలయ ధర్మకర్తృత్వం నిర్వహించే స్థాయి నుండి భోగం వారిగా, మండలాధీశులకు భోగస్త్రీలుగా మారి వంశపారంపర్యంగా నృత్యనాట్యాది కళలను ఆధారం చేసుకొని జీవించి క్రమంగా వారి వృత్తులు కొడుకులకు చెందడం వల్లనో, మండలాధికారులను ఆశ్రయించడం వారి అధికారం అంతమైనపుడు ఆధారం పోవడం వల్లనో సంఘాన్ని ఆశ్రయించారు. తమ ఆటపాటలతో సాంఘికంగా ఒక ప్రత్యేక స్థానాన్ని పొంది అన్ని శుభకార్యాలలోనూ కులస్త్రీలతో సమంగా పాల్గొన్నారు. క్రమేపీ ఈ భోగాలవారు తాము ఆశ్రయించిన ధనికుల ప్రాపు తగ్గిన తరువాత సామాన్య వేశ్యల స్థాయికి దిగజారి ఆటపాటలతో రూప యౌవన విలాసాదులతో విటులను ఆకర్షించి ధనార్జన చేయడంతో వారికి అంటే సానుల సంఘాలకు పూర్తిగా గౌరవం తగ్గి సంఘంలో వారి పట్ల ఏహ్యత కలగడంతో సాని పదం వేశ్య అన్న అర్ధంలో స్థిరపడి పోయింది. ఈ పరిస్థితి ఎంత నీచంగా మారిందంటే కొన్ని సంవత్సరాల క్రిందటి వరకు సంసారులైన స్త్రీలు అలంకరించుకున్నా, పూలు పెట్టుకున్నా, ఇంటిముందు నిలబడినా సానిదానిలాగా ఆ సింగారమేమిటి, పూలెందుకు పెట్టుకొన్నావు వీధిలో ఎందుకు నిలబడ్డావు అని భర్తలు, ఇంట్లో మగవారు గద్దించేవారు. ఈనాటికీ ఉత్తర హిందూ స్థానంలో చాలా ప్రాంతాలలో స్త్రీలు పూలుపెట్టుకున్నా, పెళ్ళిగాని పిల్లలు కుంకుమతిలకం, గాజులు, కాటుక వంటివి ధరించినా వారిని వేశ్యలను చూచినట్లు చూస్తారు.

దేవదాసీలు:

రాజాంతఃపురాలలో సంపన్నుల గృహాలలో దాసీలుగా వారాంగనలున్నట్లే దేవాలయాలలోనూ సేవా కార్యక్రమాలు నిర్వహించే వారాంగనలుండేవారు. వీరిని దేవదాసీలనేవారు. ప్రాచీన కాలంనుండి దేవాలయాలలో ఈ సంప్రదాయం ఉండేదని చారిత్రకుల అభిప్రాయం. వీరు ముందు చెప్పబడిన మున్నూర్వురు సానులు సానిమాన్యనిబంధకారుల కంటె భిన్నమైన వారు. వీరు రకరకాల కారణాల వల్ల దేవాలయ సేవకు చేరతారు. ప్రాచీనకాలంలో దేవదాసీలు ఏడు విధాలుగా ఉండేవారని డా. అల్లాడి వైదేహి గారు ఆంధ్రుల సాంఘిక ఆర్థిక చరిత్ర అనే తమ సిద్ధాంత గ్రంథంలో ఈ క్రింది విధంగా వర్గీకరించి వివరించారు.

  1. దత్త: దేవాలయానికి దత్తగా ఇవ్వబడింది.
  2. విక్రీత: దేవాలయ సేవకై ధనమిచ్చి కొనబడి అర్పించబడినది.
  3. భృత్య: తన కుటుంబం శ్రేయస్సుకై దేవాలయ సేవకై తనంతట తానే అర్పించుకున్నది.
  4. భక్త: దేవునిపై భక్తి చేత సేవకై చేరినది.
  5. హృత: బలవంతంగా ఎత్తుకొని పోబడి దేవాలయమున కీయబడినది.
  6. అలంకార: నృత్య నాట్య విద్యలయందు సుశిక్షితురాలై ప్రవీణయై రాజుల సామంతులచే సమస్తాభరణాలతో దేవాలయానికి సమర్పింపబడినది.
  7. రుద్రగణిక లేక గోపిక :- దేవాలయంలో వేత నం గ్రహించి పాటలు పాడుతూ నాట్యం చేసే స్త్రీ.

“ఆగమనిగ మోక్తి నవ్వామదేవ యోగిచే శివదీక్ష యొప్పంగబడసిన” వారు ఈ రుద్రగణికలు

ఈ విధంగా దేవాలయానికి అప్పగించబడిన స్త్రీ వివాహం లేకుండా భగవంతునికి అర్పించబడుతుంది. ఇటువంటి వారిని శైవాలయాలలో శంకరి లేదా పార్వతి అని పూర్వం, బసివి అని ఇటీవలి కాలంలోనూ పిలిచేవారు. దాక్షారామానికి సంబంధించిన ఒక శాసనంలో ఈ విధంగా దేవదానమైన స్త్రీ బిజ్జువశంకరి గురించి ప్రస్తావన ఉన్నది. ఈమె గంగకొండ చోడవలనాంట గుద్దవాది నాటి పెద్దడాకిరేమి భీమేశ్వరునికి దేవదానమైన సాని. దాక్షారామంలోని మరొక శాసనంలో నాగా శంకరి అనే స్త్రీ డాకరేమి మున్నూటి సానిగా ఉన్నదని తెలుస్తుంది. అక్కడే లభ్యమైన మరొక శాసనంలో కల్లవ శంకరి అన్న సాని గురించి ఉన్నది. ముందు చెప్పినట్లు శంకరి అన్నది ఈ నాటి బసివి వంటిది. ఈ కల్లవ శంకరి డాకరేమిసాని కొమ్మవ కూతురు. అయితే ఈమెను కొమ్మవ శంకరి అనలేదు కల్లవశంకరి అనడంవల్ల కల్లవ ఆమె పేరనీ శంకరి అన్న పదం వల్ల ఆమె దేవదత్తమని, కేవలం ఆలయానికి సంబంధించిన పూజారులు, జంగములకు మాత్రమే ఆమె అంకితమనీ మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో వెనక బడ్డకులాల స్త్రీలను బసివిగా చేసి ఊరి వారి భోగం కోసం విడిచిపెడతారని, వారు వివాహాలు లేక ఊరివారికి భోగ్యంగా ఉంటుందని మనకు తెలిసిందే. ఈ ఆచారం ఆనాడు బహుశా శంకరి అన్నపేరుతో మొదలై ఉంటుంది. శంకరి అనే కాక పార్వతి అనే పేరుతో గూడా సానులున్నట్లు శాసనాల వల్ల తెలుస్తుంది. సిరిపురం శాసనంలో చెవ్వాసాని పార్వతి అన్నసాని ప్రసక్తి ఉన్నది. తక్కిన సానులందరూ ఇంతకుముందు చెప్పినట్లు వివాహితలై వంశపారంపర్యంగా వృత్తులు అనుభవిస్తూ ఉండేవారు. కనుకనే వారి కొడుకులు, కూతుళ్ళ గురించి శాసనాలలో ప్రసక్తి కానవస్తుంది. కాని ఈ స్త్రీలు అవివాహితలుగానే ఉండిపోయేవారు. ఈ ఆచారమే క్రమక్రమంగా జరిగిపోయి సంఘంలో అట్టడుగు కులాలలో అతి పేదలైన కుటుంబాలవారు తమ ఆడపిల్లల్లలను బసివిరాళ్ళుగాను దేవదాసీలుగాను, జోగినులుగా చేసి ఊరి వారందరికీ భోగ్యవస్తువుగా చేయడానికి కారణమైంది.

విక్రీత:

దేవాలయ సేవకై భక్తులు ధనమిచ్చి కొని దేవుని సేవకు అర్పింపబడినది కుటుంబంలో తండ్రి గానీ పురుషుడుగానీ తమ వ్యవసనాలలో, అవసరానికో ఇంట్లోని స్త్రీలను దాసీలుగా అమ్మేవారు. ఇతిహాసకాలంనాడు హరిశ్చంద్రుడు చంద్రమతిని అమ్మినట్లు మన చారిత్రక కాలంలో కూడా స్త్రీలను అమ్మేవారు. తమకంటూ ఆస్తిగానీ, భూమి మీద హక్కు గానీ లేని నిరుపేద కుటుంబాల స్త్రీలకు పురుషుల్ని కాదనే అధికారం లేదు. వేశ్యలకు ధనం ఇవ్వడం కొరకుగూడా పురుషులు స్త్రీలను అమ్మేవారు అని కేతన దశకుమార చరిత్రలో మాధవసేన అనే వేశ్యమాత మాటలవల్ల తెలుస్తుంది.

‘ఆలిరోయిడి తల్లి నాగి బిడ్డల నమ్మి

ధనము లార్జించి మిండాటమునకు జొచ్చి’

క్రీ.శ. 1254లో కోట బయ్యలదేవి పుత్రుడు గణపతి దేవరాజు అనే మండలేశ్వరుడు భండారము అక్కమ అనే స్త్రీని వేల్పూరి రామేశ్వర దేవరకు సానిగా ఇచ్చి వృత్తుల నేర్పరచాడు. అతడు ఈమెను ధనమిచ్చికొని ఉండవచ్చు. ఈమెనే ఆలంకార అనే దేవదాసిగా కూడా పరిగణించవచ్చును. ఈమె హృత అన్నసానిగా డా. అల్లాడి వైదేహిగారు పరిగణించారు. గానీ పై శాసనంలో అందుకు ఆధారం ఏమిలేదు గనుక ఆమె అపహరింపబడి దేవాలయానికి ఇవ్వబడిన స్త్రీ కాదని చెప్పవచ్చును.

దేవదాసీలు పవిత్ర జీవనాన్ని గడిపేవారని, దేవదాసి కావలసిన బాలికను పదేండ్ల ప్రాయంలోనే దేవాలయానికి అర్పించేవారని, అప్పుడు దేవునితో ఆమెకు పెండ్లి జరుగుతుందని, ఆమె అప్పటినుండి దేవునిసేవకు అంకితమై దేవదాసిగా వ్యవహరింపబడుతుందని బార్బోసా వ్రాసిన వ్రాతలు కాకతీయుల కాలంలోని సానులకు కూడా వర్తిస్తాయి. దేవదాసీలు అస్ఖలిత బ్రహ్మచారిణులవడంచేత దేవదాసి కులము అనేది ఏర్పడే అవకాశం లేకపోయింది. కానీ క్రమంగా ఆ నిష్ఠ తగ్గిందనీ, దైవసేవ కంటే మానవసేవకు ఎక్కువ ప్రాధాన్యత కలిగిందని, తత్ఫలితంగా, వారాంగనా కులమొకటి ఏర్పడిందని శ్రీ సంతోష్ ఛటర్జీ గారు ‘దేవదాసి’  అన్న వ్యాసంలో తెలిపారు.

దేవదాసీలు కుటుంబ శ్రేయస్సుకోరి చేరినవారు, కుటుంబ సభ్యులు అర్పించగా చేరినవారు, వేతనాలు గ్రహించి, గాన, నృత్యాదుల ద్వారా దేవుని సేవచేసేవారు అయివుండేవారు. శాసనాలలో తగిన ఆధారాలు లేకపోవడంవలన పైన చెప్పిన వర్గీకరణను నిరూపించడం కష్టం.

వీరిలో బసివి, శంకరి, పార్వతి, జోగిని అన్న పేర్లతో ఈనాటికీ వ్యవహరింపబడుతున్న స్త్రీల జీవితాలు నికృష్టమైనవని చెప్పవచ్చును. ఇంతకు ముందు సానుల గురించి చెప్పే సందర్భంలో వారు వివాహాలు చేసుకొని మామూలు జీవితాలు గడపగలిగేవారని సంఘంలో ప్రత్యేకస్థానాన్ని సంపాదించారనీ చెప్పడమైంది. కానీ ఈ బసవి, దేవదాసి సంప్రదాయానికి చెందిన స్త్రీలు ఊరి వారందరి దయాదాక్షిణ్యాలపై ఆధారపడి, అందరికీ భోగవస్తువులుగా ఉపయోగింపబడతారు. ఇటువంటి వారి సంతానానికి తండ్రి పేరు చెప్పుకొనే హక్కు ఉండదు. శంభుని ప్రసాదమనీ, భగవంతుని అనుగ్రహంవల్ల గానీ జన్మించినట్లు చెప్పుకొంటారు. బసవన్న సోదరి నాగాంబ బహుశా ఈ విధంగా అవివాహితగా దేవాలయానికి అర్పితమై ఉంటుంది. బసవన్న వివాహితుడేగానీ బసవన్న సోదరి వివాహితురాలు కాదని సోమనాధుని బసవపురాణాన్ని బట్టి తెలుస్తుంది. ఆమె కొడుకు చెన్న బసవడిని నాగాంబ వరతనూభవుడు అనీ, బసవ కారుణ్యహస్త సంభూత ప్రశస్త దేహుడు అని సోమనాధుడు పేర్కొన్నాడు. దాన్ని బట్టి ఆమె బసివిగా ఆలయానికి అర్పితమై ఉంటుందని, బహుశా ఈ బసివి సంప్రదాయం నాగాంబ నాటి నుండే ప్రారంభమై ఉంటుందని భావించవచ్చు కాకపోతే నాటి శాసనాలలో ఇటువంటి స్త్రీలు కొద్ది మంది ఉండేవారు. పైగా నాగాంబ తన యిష్టం మీదనే తల్లిదండ్రుల ఇల్లు వదలి సోదరునితో వచ్చి దేవునికి అంకితమైనది. నాగాంబ పరమేశుని భక్తి ప్రాణంగా తలచేది. ఆనాడు తమ ఇష్టంతో స్వేచ్ఛగా దేవుని సేవకు అర్పితమయేవారు. సంతానం కలిగితే గర్వంగానే చెప్పుకొనేవారు. వెలనాటి రాజేంద్ర చోడయరాజుల దేవి గోకాదేవి ఆమె తల్లి సుగ్గలాంబకు అమ్మాండి యమ్మా పెర్మలు అనే శంభుని వరప్రసాదం వల్ల జన్మించిందనీ భీమనాధుని చరణాలను భక్తితో కొలిచేదని చెప్పుకొన్నది. ఆనాటి బసివి వంటి సుగ్గలాంబకు కూతురైన గోకాదేవి ఒక మంలేశ్వరునికి దేవి లేక భోగశ్రీ అయితే, ఈనాటి బసివిరాండ్ర సంతానం ఊరివారి అసహ్యానికి నిరాదరణకు గురి అవుతున్నారు.

11 వ శతాబ్దం నుంచి 15 వ శతాబ్దం వరకు దేవదాసీల, సానుల ప్రసక్తికల శాసనాలను పరిశీలిస్తే ఒక విషయం అవగతమౌతుంది. చాళుక్య చోడయుగంలోనూ, కాకతీయ గణపతి దేవుని కాలం వరకు ఉన్న శాసనాలలోను దేవాలయాలలోని స్త్రీలను మున్నూటిసానులనీ, మహేశ్వర పరివార స్త్రీలనీ పేర్కొనేవారు. వారి సౌందర్యం, కళానైపుణ్యం, దానవితరణ, ధర్మశీలత తెలిపేవిధంగా వారికి విశేషణాలుండేవి. శైవ మతానికి సంబంధించిన దేవాలయాలలో ఈ విధంగా ఉండేది. క్రమంగా శైవమత ప్రాబల్యం తగ్గి వైష్ణవమతానికి రాజకీయంగా మద్దతు లభించిన తరువాత మొదట గౌరవంగా సానులు అని సంబోధించిన స్త్రీలనే సంప్రదాయము వరుసలంజలు అని, భోగస్త్రీలు, దేవులు అని గౌరవించిన స్త్రీలను లంజియ, లంజ పెండ్లము అనీ వ్యవహరించారు. క్రీ.శ. 1307 నాటి ఒక శాసనంలో సంప్రదాయము వరుసలంజలు ప్రసక్తమైనారు. వీరు దేవాలయ సేవికలే మొదట్లో వీరిని సానులనే అనేవారు. వీటిని బట్టి కాల క్రమేణా దేవాలయాలలోని స్త్రీలకు గౌరవం తగ్గిందనీ భగవంతుని సేవకు కాక భక్తుల సేవకు గురు, జంగమ, రాజోద్యోగుల భోగానికి వీరు అర్పితమైనారని మనము గ్రహించవచ్చును. భగవంతునికి అంకితమై పవిత్రంగా ఉన్నప్పుడు వారికి లభించిన మన్నన భక్తులకు భాగ్యంగా మారగానే తగ్గక మానదు. అయితే ఈ మార్పుకు కారణం స్త్రీలు కాదు మతాధికారులు, స్త్రీల కుటుంబ సభ్యులు, రాజోద్యోగులు మొదలైన వారు ఈ స్త్రీల పతన స్థితికి కారకులని చెప్పవచ్చును.

భోగస్త్రీలు

కాకతీయుల కాలంలోని సమాజంలో కులస్త్రీలు, వేశ్యలుకాక భోగస్త్రీలు అనేవారు కూడా ఉన్నట్లు శాసనాలను బట్టి తెలుస్తుంది. భోగస్త్రీ అంటే పట్టాభిషిక్తురాలు కాని రాజు భార్య అని, భోగమహిషి అంటే భోగిని, పట్టపురాణీ కాని రాజు భార్య అని శాసన శబ్దకోశంలో అర్ధాలు చెప్పారు.

“శ్రీ మన్మహా మండలేశ్వర కోటకేతరాజుల భోగస్త్రీయైన గుండదేవులు” అని శక సం 1131 నాటి వేల్పూరు శాసనంలో ఉన్నది. ఆ సంవత్సరానికి చెందిన మరొక వేల్పూరు శాసనంలో కసది సూరమదేవి అన్న కోటకేతరాజుల భోగస్త్రీగా పేర్కొనబడింది. కోటకేతరాజుకు ఈ గుండదేవి, సూరమదేవి అన్నవారే కాక అరమ, కేతమ అనే భోగస్త్రీలు కూడా ఉండేవారు అని శక సంవత్సరం 1135 నాటి ఎర్రబాలెం శాసనాన్ని బట్టి తెలుస్తుంది. ఈ భోగస్త్రీలు అన్న పదం కావ్యసాహిత్యంలో ఎక్కడా కనిపించదు. అక్కడ వేశ్యలు, పణ్యపుణ్యాంగనలు అన్న వారే ప్రసక్తమైనారు. ఎక్కువగా ఈ భోగస్త్రీలు దేవాలయాలలో అఖండ దీపదానం చేసి శాసనాలు వేసినవారే. ఎక్కువగా వారు తమకు, తమ తల్లిదండ్రులకు ధర్మార్ధం దానం చేసేవారు.

ఈ భోగస్త్రీలకు కులస్త్రీల తరువాత స్థానమీయబడింది. వీరిని దేవులు అని సంబోధించడం శాసనాలలో గమనిస్తాము. కోటకేతరాజు భోగశ్రీ గుండదేవిని గుండదేవులు అని పైన చెప్పిన వేల్పూరు శాసనంలో సంబోధించారు. దాక్షారామానికి చెందిన శక సం. 1125 నాటి శాసనంలో వరాంగన లక్షమకి, పెదమున్నూంటి వంశానికి చెందిన ప్రేంకేటి వీరపరెడ్డికి కూతురైన బిమ్మాంబికను మహామండలేశ్వర కోన రాజేంద్ర చోడండైన వెన్న చోడయరాజు మహదేవి అని ఒక దాక్షారామ శాసనంలో చెప్పడాన్ని బట్టి ఈ భోగస్త్రీలకు గౌరవం ఉండేదని తెలుస్తున్నది.

భోగస్త్రీలు కులస్త్రీలకంటే భిన్నమైనవారు. సంఘంలో ఉన్నత స్థానం వహించి రాజులు, సామంతులు, సేనాధిపతులను ఆశ్రయించి జీవితాన్ని గడిపేవారు. ప్రాచీనకాలంలో గ్రీకుదేశంలో ఇటువంటి స్త్రీలుండేవారు, వారిని హెటైరాలని అనేవారు. సంగీతం, నృత్యం, వంటి కళలను నేర్చుకొని ప్రావీణ్యం సంపాదించి దేవాలయాలను రాజాస్ధానాలను ఆశ్రయించి జీవిస్తూ ఉండేవారు. అయితే పైన పేర్కొన బడిన స్త్రీలు మొదట దేవాలయాలను ఆశ్రయించుకొన్నవారే. అంగరంగ భోగాలకై నియుక్తులైన సానులను భోగస్త్రీలనవచ్చును. అయితే భోగస్త్రీ అనే పదం ఇప్పుడున్నట్లు నీచార్థంలో ప్రయుక్తం కాలేదు. తమ కళా ప్రావీణ్యంలో ఉన్నతస్థాయికి చేరుకొని రాజులను మెప్పించి వారి రాణులలో సమానమైన స్థానాన్ని సంపాదించేవారు. రాజులు సామంతులు వీరిని పెండ్లి చేసుకొనేవారు. ఇటువంటి వారిని లంజ్య పెండ్లము అని కూడా పిలిచేవారు. “శ్రీ మన్మహామండల కోట దొడ్డభీమ రాజు లంజ్య పెండ్లము ప్రోలాసాన్కి తమ తండ్రి సోమినాయకునికిం దల్లి మల్లాసానికి ధర్మార్ధముగాను” అని శాసనంలో ఉన్నది.

లంజ్యపెండ్లము అంటే భోగస్త్రీ అని శాసన శబ్దకోశంలో అర్థమీయబడింది.

ఈ భోగస్త్రీలకు కులపత్నులతో సమానమైన స్థానమిచ్చేవారు అని ఈ క్రింది శాసనం బట్టి తెలుస్తుంది.

‘శ్రీ మన్మహ మండలేశ్వర నాగ వంశోద్భవులైన నుంగ్గవాటి సెమ్మంగ్లి రాజునకు శ్రీ భోగమహిషియైన ఎఱక్కమ మహదేవులకు నగ్రపుత్రుండును వంశ నిస్తారకుండు మన్నేరు సంక్యరాజు తన తండ్రి సెమ్మంగ్లి రాజునకు ధర్మార్థముగా తమ నిజవృత్తియైన పొత్తపినాణ్ణిలో నడుపూరు చతుస్సీమమును గుమారారామంలోని చాళుక్యభీమేశ్వరునికి అముదు పడికై దానం చేశాడు’. ఈ శాసనంలో సెమ్మంగ్గి రాజుకు భోగమహిషి అయిన ఎఱక్కమ మహదేవులని పేర్కొనడమే కాక ఆమె కుమారుని ఆగ్రపుత్రుడనీ, వంశనిస్తారకుడు అనీ చెప్పటం జరిగింది. దీన్ని బట్టి భోగస్త్రీలకు ఆ కాలంలో సమాజంలో ఉన్న స్థానం తెలుసుకోవచ్చును.

భోగస్త్రీల వంశంలోని పురుషులు వారి గురించి గర్వంగా చెప్పుకొనేవారు. (శక సంవత్సరం 1139) క్రీ.శ. 1217 నాటి మాచపూరు శాసనంలో కాంతమధుక వంశానికి చెందిన వెన్నపరెడ్డికి ఇద్దరు భోగస్త్రీలు గౌరమాంబిక, ముద్దమాంబిక అనే వారు. వారిని సజ్జన భోగసతులు అని శాసనంలో పేర్కొన్నారు కనుక వారు భార్యల లాగే పాతివ్రత్యంతో ఉన్నారని భావించవచ్చును.

ఈ భోగస్త్రీలను ప్రియతమ అని, కూడా శాసనాలలో వ్యవహరించే వారు. దాక్షారామ శాసనమొక దానిలో (కాలం తెలిపేచోట శిధిలమైంది.) గంగ అనే స్త్రీ పెద్ద డాకిరేమి కొండిక మున్నూటి పెర్మడి నాయకుని కూతురు మల్ల మహీపతికి ప్రియతమ అని చెప్పబడింది.

కొన్ని శాసనాలలో భోగస్త్రీలకు అనుంగు అని వాడేవారు. అనుంగు అంటే ప్రియురాలు, ఇష్టురాలు, ననుపకత్తె అని శాసనశబ్ద కోశంలో అర్థాలు ఇవ్వబడినాయి. ననుపకత్తె ఆంటే ఉంపుడుగత్తె అని అర్థం. కానీ శాసనాలలో ఎక్కడా ననుపకత్తె, ఉంపుడుగత్తె అనే పదాలు వాడలేదు.

శ్రీ కులోత్తుంగ్గ చోడదేవర అడువులొత్తెడి నంగ్గాణ్ణి కుంత్తుఱు ఉయ్యమ కూంత్తుఱు (కోన) రాజేంద్ర చోడయరాజుల అనుంగ్గు పెరియాణ్ణి అని శక.సం 1054 నాటి దాక్షారామ శాసనంలో పేర్కొన బడింది.1489 పెరియాణ్ణి కోనరాజేంద్ర చోడరాజుల భోగస్త్రీయని అనుంగు అని అనడం వల్ల ఆమె ఆ రాజుకు ఎంత సన్నిహితురాలో ఊహించగలము.

చక్రవర్తి శ్రీ కులోత్తుంగ చోడదేవర అనుంగు, గుద్దవాది నాణ్ణిపెద్ద డాకిరేమి పెద్దమున్నూటి సమర మొదలి బేతినాయకు కూతుఱు జయమ అని శక సంవత్సరం 1009 నాటి దాక్షారామ శాసనంలో పేర్కొనబడింది.

శక సంవత్సరం 1051 నాటి కొమ్మూరు శాసనంలో కందూరి చోడ మహరాజు అయిన పెర్మాడి దేవని అనుంగు రేకమ దేవి అనే శ్రీని పేర్కొన్నారు.

భోగస్త్రీలను ద్వితీయలక్ష్మీసమానలని మన్నించడం శాసనాలలో గమనించవచ్చును.

‘మన్మహా మండలేశ్వర బీరగొట్టమున కజ్జియ బయ్యరాజు ద్వితీయ లక్ష్మీసమానురాలైన కొమ్మమ మహదేవులు’ అని ఆమె దాక్షారామభీమేశ్వరునికి దాన మిచ్చిన సందర్భంలో శాసనంలో ప్రసక్తమైనది.

భోగస్త్రీలను “అభ్యుదయ పరంపరావిభవ భోగములందమని” ఆశీర్వదించేవారు. క్రీడాభిరామంలో మంచెనశర్మ మధుమావతిని పై విధంగా ఆశీర్వదించాడు. ఆ విధంగానే “ఆనవరత కల్యాణాభ్యుదయ సహస్రఫల భోగభాగిణి” అని శాసనాలలో భోగస్త్రీలకు విశేషణంగ వాడేవారు.

క్రీ.శ. 1164 నాటి కాజ కోదండరామ స్వామిదేవాలయంలోని శాసనంలో పిన్నమజియ్య అనే శ్రీని మహామండలేశ్వర కులోత్తుంగ రాజేంద్ర చోడ మన్మచోడ్రాజుల అనవరత కల్యాణాభ్యుదయ సహస్రఫల భోగ భాగిణి అని, ద్వితీయ లక్ష్మీసమానులనీ చెప్పారు. ఈ పిన్నమ జియ్య ‘ తమ యేలికలగుచున్న కాంజ కల్యాణకేశవ దేవరకు’  అనటంవల్ల ఆమె ఆ దేవాలయంలో నాట్యకత్తె గానీ, జియ్య అనటంవల్ల పూజ చేసే స్త్రీ అని గానీ భావించవచ్చు. ఏమైనా ఈమె అంగ రంగ భోగాలకు చెందిన స్త్రీ అన్నది స్పష్టం. దీన్ని బట్టి భోగస్త్రీలకు ఆనాడు ఎంత గౌరవం ఇచ్చేవారో తెలుసుకోవచ్చును.

ఈ భోగస్త్రీలు వేశ్యల లాగా విటులను మార్చక ఒకరినే నమ్ముకుని జీవితం గడిపేవారు. కనుకనే వారికి సంఘంలో గౌరవస్థానం ఇవ్వబడింది.

తమ నాథులు మరణిస్తే వారు వైధవ్యాన్ని పాటించేవారని అంటారు. కోటకేతరాజుకు భోగస్త్రీలైన అరమకేతమ అనేవారు వారి తండ్రి ఎర్రమ నాయకునితో కలిసి ‘ తమ్మునేలిన ప్రభువు’  (కోటకేతరాజు) ధర్మార్థం ఉండవెల్లి దేవస్థానానికి ఒక ఉత్సవ విగ్రహన్ని కొంత భూమిని ఇచ్చారని శక సం. 1135 నాటి ఎర్రబాలెం శాసనంలో ఉన్నది.

కొండిక మున్నూంటి ఆట్య, గడియపసెట్టి వీరపనేని కూతురు, మత్స్యకులతిలకుడు ఒడ్డాది జయంతిరాజు కొడుకు అర్జున దేవరాజు దేవి అయిన అక్కమదేవి శక సంవత్సరం 1209 దవన పర్వమి డోలోత్సవము నాటి హలిర్బల్యర్చనలకు ఒడ్డాదిలోని మఱువాడ అనే ఊరును, భీమేశ్వరునికి, బంగారు తోడుగును దేవికి అర్పించింది. ఈ మఱువాడ అనే ఊరును ఆమె అంతకు ముందు మత్స్యరాజు అర్జునుని నుండి పొందిందని క్రీ.శ. 1275 నాటి దాక్షారామ శాసనంలో ఉన్నది. ‘మేనాదేవీ విషాదం శమయతుమనిశం మత్స్యవంశార్జునేశః’ అని శాసనంలో చెప్పటం వల్ల బహుశా పై శాసనకాలానికి అంటే క్రీ. శ. 1287 నాటికి ఒడ్డాది మత్స్యరాజు అర్జున దేవుడు మరణించాడని అతని పుణ్యం కొరకు ఆక్కసాని అనే అతని భోగస్త్రీ పై ఊరును దానం చేసిందనీ గ్రహించవచ్చును.

దీన్ని బట్టి భోగస్త్రీలు వేశ్యల వలె ధనం కోసం విటుల్ని మార్చేవారు కాదని, తమ ప్రభువుల నుండి సంక్రమించిన ధనం గానీ భూమి గానీ, వారికి సంబంధించిన పుణ్యకార్యాలకి కూడా ఉపయోగించేవారని చెప్పవచ్చును. పైన చెప్పబడిన స్త్రీలందరూ దేవాలయాలకు సంబంధించిన వారే కనుక వారు సానిమాన్య నిబంధాలకు సంబంధించిన లేదా దేవాలయ అంగరంగ భోగాలకు సంబంధించిన వారనీ, కనుక వారిని భోగస్త్రీలని పేర్కొన్నారనీ భావించవచ్చును. వీరు దేవాలయాలకు చేసిన దానాలను బట్టి భోగస్త్రీలు ఐశ్వర్యవతులనీ, దైవ ధర్మకార్య తత్పరలై భూరి దానాలనొసగేవారని తెలుస్తున్నది.

ఆ కాలంలో యుద్ధాలు తరచుగా జరిగేవి. ఆ యుద్ధాలలో పాల్గోనేందుకు సామంతులు, సేనాధిపతులు, దండనాయకులుగా వివిధ ప్రాంతాలకు వెళ్ళేవారు. ఒక్కొక్కపుడు వారి స్వగృహాలను, ఊళ్ళను వదిలి దూర ప్రాంతాలలో నెలల తరబడి ఉండవలసి రావచ్చును. గృహకార్య నిర్వహణ బాధ్యత వారి కులపత్నులు వహించి స్వగృహాలలో ఉన్నపుడు, తమ విలాసానికై ఆయా ప్రాంతాల భోగస్త్రీలను పోషించటం జరిగేది. బహుశా అందుచేతనే కోటకేతరాజుకు వేల్పూరులో సూరమ, గుండమ దేవులనే భోగస్త్రీలు ఎర్ర బాలెంలో అరమకేతమలనే భోగస్త్రీలు ఉండేవారు. ఈ స్త్రీలు గుణవతులు. సకల కళాకోవిదలై తమ ప్రభువులను విశ్వాసంతో భర్తలుగానే భావించి కొలిచేవారు.

భోగస్త్రీలు మొదట దేవాలయ సానుల కుమార్తెలుగా ఉండి తమలో ఒకరు లేక ఇద్దరు దేవాలయంలో సానులుగా వృత్తులను స్వీకరించగా మిగిలినవారు రాజులకు భోగస్త్రీలుగా ఉండటానికి కారణం. వారు భోగస్త్రీలుగా సంఘంలో గౌరవస్థానం గాంచడం. వేశ్యావృత్తిని పాటించడానికి ఇష్టపడకపోవటం కావచ్చు.

దాక్షారామంలోని భీమేశ్వరాలయంలోని సుగ్గలాంబకు అమ్మాండి యమ్మా పెర్మలు అనే శంభుని వర ప్రసాదం వల్ల జన్మించిన గొంకమాంబ భీమనాధుని చరణాలను భక్తితో కొలిచేదనీ, భీమనాధ పుర స్త్రీ, స్వర్గలోకపు స్త్రీల వంటి సౌందర్యం కలదనీ చెప్పిన దాన్ని బట్టి ఆమె భీమనాధపుర దేవాలయానికి చెందిన స్త్రీ అనీ, తెలుస్తుంది. ఆమె తరువాత మహామండలేశ్వర వెలనాటి గొంక భూపతి కొడుకు రాజేంద్ర చోడ రాజుల దేవి అయింది. అంటే ఆమె బహుశా దేవాలయ సానిగా తల్లి నుండి సంక్రమించిన వృత్తిని కొనసాగించి ఉండదు. ఈమెను గోకమహదేవి అని కూడా శాసనంలో పేర్కొన్నారు బహుశా రాజేంద్ర చోడరాజులకు భోగస్త్రీ అయిన తరువాత ఆమెకు ఈ మన్నన లభించి ఉంటుంది. ఇంతకు ముందు వేల్పూరి శాసనంలో చెప్పబడిన కోటకేతరాజుల భోగస్త్రీ కసది సూరమదేవి తన తల్లి అమర సాని ధర్మార్థం అఖండ దీప దానం చేసింది. అమరసాని వేల్పూరి రామేశ్వరాలయంలో సాని అయివుంటుంది. ఆమె కూతురు కోటకేతరాజుకు భోగస్త్రీ అయింది. భోగస్త్రీలుగా రాజాశ్రయం పొందడం వల్ల వారి కుటుంబ సభ్యులకు కూడా రాజాశ్రయం లభించేది. ధాన్యవాణీ వర వృత్తిపరుడు మేలునాయకుడు అయిన పోతయ నాయకుడు దూబవాడుకు అధిపతి. అతని కుమార్తె సొక్కమ సనద వ్రోలి పండీశ్వర దేవర ఆలయనర్తకి. ఆమెకు ఇద్దరు కొడుకులు. ఒక కూతురు. కూతురు కామిదేవి గొంక మహీపతికి దేవి అయింది. ఈమె సోదరులలో ఒకడు కాముడు కంజెఱ్వుల కోట యుద్ధంలో గణపతి సైన్యంలో పోరాడి మరణించాడు. ఇంకొక సోదరుడు సరణయ గొంకరాజు కొలువులో చేరి యుద్ధాలలో పాల్గొని గెలిచి, గొంక రాజును మెప్పించి కొండ పడుమటి రాజ్యంలోని జేవరమును బహుమతిగా పొందాడు అని తిమ్మాపురానికి చెందిన శకసంవత్సరం 1083 నాటి శాసనంలో చెప్పబడింది.

అవనిగడ్డలోని శక సంవత్సరం 1076 నాటి ఒక శాసనాన్ని బట్టి ఈ భోగస్త్రీల కుటుంబ సభ్యులు రాజుల వద్ద పదవులు నిర్వహించేవారని తెలుస్తున్నది. వెలనాటి గొంకని భృత్యుడు కొల్లూరి విభుడు అయిన ప్రతిహారి చింతమనాయకుని శ్రీ గుండమ. వీరికి జనించినవాడు పడిహారి ముత్తన నాయకుడు. ఇతనికి మదనాంగి, సుమధ్య, నరలోకరంభ అని పొగడ్తలందుకున్న మేడమకు జనించిన వారు కొమ్మమ నూంకమ అనేవారు. శాసనం చివర సాని నూంకమ అని ఉన్నది కనుక పైన చెప్పిన స్త్రీలు దేవాలయంలో సానులనీ, వారి కుటుంబ సభ్యులు సేనానాయకాది రాజోద్యోగాలు నిర్వహించారనీ తెలుస్తున్నది. వారు తమ కుటుంబాలలోని స్త్రీల గురించి గర్వంగా చెప్పుకొనేవారు. భోగస్త్రీకి పుట్టినవారిని సుపుత్రులని, వారి వంశంలో పుట్టిన ఆడపిల్లలను సుపుత్రి, కులదీపకురాలు అని కూడా చెప్పుకొనేవారు. వీరు రాజాశ్రయంలోనే ఉండేవారు.

క్రీ.శ. 1239 నాటి వేల్పూరు శాసనంలో కోట దొడ్డకేతరాజుకు భోగశ్రీ కొమ్మసాని వంశవర్ణన చేయబడింది. ఆమె కొడుకు గోకినాయునికి ఐతసానికి కలిగిన సుపుత్రులలో ఒకడు నాగినాయుడు. ఆ నాగి నాయునికి బ్రమ్మసానికి సుపుత్రి కులదీపకురాలు ఐతసాని ఈ ఐతసాని కాకతి గణపతి దేవుల శ్రీపాద పద్మోపజీవి. ఐతసాని వల్ల భుడు సోమరౌతు. వీరిద్దరు శకసంవత్సరం 1161 వికారి సంవత్సర భాద్రపద శుద్ధత్రయోదశి ఆదివారం కాకతి గణపతి దేవమహరాజు ధర్మార్థంగా వేల్పూనూరి రామేశ్వరదేవునికి ఆఖండవర్తి దీపానికై దానం చేశారు.

పై శాసనాన్ని బట్టి భోగస్త్రీల గురించి, వారి పరివారం గురించి కొన్ని విశేషాలు తెలుసుకోవచ్చును. భోగస్త్రీల కుటుంబంలోని స్త్రీలందరూ భోగస్త్రీలుగా ఉండే నియమం లేదు. వారు మామూలుగా పెండ్లిండ్లు చేసుకొనేవారు. ఆ కుటుంబాలలోవారు భోగస్త్రీలుగా ఉన్నా వారి గురించిగానీ, వారియింట్లో కలిగిన పుత్రికా సంతానాన్ని గురించిగానీ హీనభావం ప్రకటించక, గర్వంగా చెప్పుకొనేవారు. పుత్రికని సుపుత్రి, కులదీపకురాలు అని మన్నించారు. ఈ శాసనం వేయించిన స్త్రీ, ఆమె వల్లభుడు ఉన్న విషయాలను గొప్పగా భావించే శాసనం వేయించారు కనుక భోగస్త్రీలు వారి కుటుంబాలంటే సంఘంలో హీనభావం లేదని చెప్పవచ్చును. కోట సామంతునికి భోగస్త్రీ అయిన కొమ్మసాని కొడుకు మనుమరాలు, ఆమె భర్త కాకతీయ గణపతిదేవుని కొలువులో (పాదపద్మోప జీవి) సేవకులు. భోగస్త్రీ కుటుంబంలోని స్త్రీలు రాజుల కొలువులో ఛత్రచామరాలు వీచేవారిగా, నాట్యకత్తెలుగా, సేవికలుగా ఉంటే పురుషులు ప్రతీహారి, సేనానాయకుడు వంటి పదవులు నిర్వహించేవారు అని చెప్పవచ్చును.

రాజ పదవులు నిర్వహించే వారికి భోగస్త్రీలుగా ఉన్న వారు అర్హతలను బట్టి తమ నాధుల పదవుల వంటివే నిర్వహించేవారు అని క్రీ.శ. 1121 నాటి శాసనం బట్టి అనుకోవచ్చును.

శ్రీ మన్మహా పధ్రానం బాణసవెగ్గ డ

వె(గ్గ)డ దణ్ణనాయకం అనంతపాలయ్యంగల పట్టమహదేవులు (స్వస్తి) (1)

అ (నంతానంత) పరమ కల్యాణా భ్యుదయ సహస్ర ఫల భోగభాగిని ద్వితీయ్యలక్షీ సమాన మహదేవి దణ్ణనాయకు అలు జేష్ట మాసమున శుక్లపక్ష

(బృహ) స్వతి వా(రము) (వ్య) తియిపాతనిముత్యమునం పెద్దడాకిరేమి.

సామంతాధిపతి, మహప్రచండ దండనాయకం, సాహసోత్తుంగం అయ్యన సింహ నామాది ప్రశస్తిసహిత మహాప్రధాని బాణస వెగ్గడ (పుత్రుడు) – పెగ్గడ దండ నాయకునికి ద్వితీయలక్ష్మీ సమానురాలు అయిన మహదేవి దండనాయకురాలు. ఈమెను అనంతానంత పరమకల్యాణాభ్యుదయ సహస్ర ఫల భోగ భాగిని, అని ద్వితీయలక్ష్మీ సమానురాలు అనటం వల్ల భోగస్త్రీ అని చెప్పవచ్చును. దండ నాయకునికి భోగస్త్రీ అయిన మహదేవి దండనాయకురాలి పదవి నిర్వహించిందని తెలుస్తున్నది. ఈమె నాట్యకత్తె అయి ఉండదు. యుద్ధ విద్య నేర్చి శాసనంలో ప్రసక్తమైన పట్టమహదేవులకు దండనాయకురాలిగా నియమింపబడి ఉంటుంది. పైన చెప్పిన శాసన కాలంలో ఆమె అనంతపాలుని పట్టమహిషితో అంగరక్షగా వచ్చి ఉంటుంది.

వీటన్నింటిని బట్టి మనం భోగస్త్రీల గురించి ఈ విధంగా తీర్మానించవచ్చును. భోగస్త్రీలు దేవాలయాల నాశ్రయించు కున్న రంగ భోగాల కుటుంబాలలోనివారు. వారికి కులస్త్రీల కున్నంత గౌరవం లభించేది. వేశ్యలవలె విటులను మార్చక ఒక పురుషునే నమ్ముకుని ఉండేవారు. ఆ పురుషుడు మరణించినపుడు వైధవ్యం పాటించేవారేగాని ఇంకొక పురుషునితో సంబంధం పెట్టుకొనేవారు కాదు. తమ కుటుంబాలలోని కులవృత్తి అయిన దేవాలయ సేవలు చేసే అవకాశం లేని స్త్రీలు, లేదా సేవ చేసినప్పటికీ కొంత కాలం పిదప రాజ, సామంత దండాది నాధులను ఆశ్రయించుకొని తాము సంఘంలో ఉన్నతస్ధానం పొందడమే కాక తమ కుటుంబాలలోని పురుషులకు కూడా రాజాశ్రయం, పదవులు లభించేటందుకు కారకులయేవారు. భోగస్త్రీలను ద్వితీయ లక్ష్మీ సమానులనీ, గౌరవ పురస్సరంగానూ, అనుంగు అని ప్రేమ పూర్వకంగానూ సంబోధించేవారు. భోగస్త్రీల కుటుంబాలలోని వ్యక్తులు తమ తల్లులు లేదా ఇతర స్త్రీలు భోగస్త్రీలు అన్న విషయాన్ని గర్వించదగ్గ విషయంగా చెప్పుకోవడమేకాక ఆ యింట్లో పుట్టిన ఆడపిల్లలను సుపుత్రి, కులదీపకురాలు అని మన్నించి శాసనాలలో ప్రకటించేవారు. ఈ భోగస్త్రీలు తమ ప్రభువుల ధర్మార్థం దేవాలయాలలో అఖండ దీపదానం చేయడం దేవరభోగాలకై దానాలివ్వడం వంటి పుణ్యకార్యాలు చేసేవారు.

దీన్ని బట్టి కాకతీయుల కాలంలో ఈ భోగస్త్రీలనే వారు కళలు నేర్చి రాజాశ్రయం పొంది ధర్మ కార్యాలు చేస్తూ ఒకే పురుషుని నమ్ముకుని పవిత్రంగా జీవితం గడిపి ఆనాటి సంఘంలో గౌరవప్రదమైన స్థానాన్ని పొందారు అని చెప్పవచ్చును.

(సశేషం)

Exit mobile version