Site icon Sanchika

‘కాకతీయ యుగంలో స్త్రీల సామాజిక స్థితిగతులు – ఒక పరిశీలన’ -15

[డా. మంత్రవాది గీతా గాయత్రి గారు 1995లో పిహెచ్‍డి పట్టా కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖకి సమర్పించిన సిద్ధాంత వ్యాసాన్ని సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము.]

ప్రకరణం 4 కాకతీయులనాటి సమాజంలో స్త్రీల స్థానం – మూడవ భాగం:

కుటుంబంలో స్త్రీ స్థానం:

కుటుంబంలో స్త్రీల బాధ్యత – దినచర్య:

[dropcap]ఆ[/dropcap]నాడు సంపన్న కుటుంబాల స్త్రీలకు దాసీలుండేవారు. కానీ తక్కిన స్త్రీలందరూ గృహకార్య నిర్వహణలో నిమగ్నులై ఉండేవారు. అత్తమామలకు, భర్తకు సేవ చేయడమే కాక ఇంటికి వచ్చిన అతిథి అభ్యాగతుల నాదరించడం భారతీయ సమాజంలో అనాదిగా గృహిణులు ఆచరించే ధర్మం.

స్త్రీలు చేసే పనులను ఇంట్లో ఉన్న బాలికలు తమ ఆటలలో అనుసరిస్తారు. నన్నెచోడుని కుమారసంభవంలో పార్వతి శైశవ క్రీడల వర్ణన సందర్భాన్ని బట్టి ఆనాటి బాలికలు ఆడే ఆటలు తద్వారా ఆనాటి గృహిణుల నిత్యకృత్యాలు తెలుసుకోవచ్చును.

తరుణులు చిల్క బొమ్మలును దంతపు బొమ్మలు మేలి గాజు బ
న్నరులును మ్రాని చొప్పికలు నల్గడనోలిన పేర్చి లీలచే
కుర బొమరిండ్ల జేయనగు కూళ్ళును వండుచు బొమ్మపెండ్లిమా
సరమున జేసియాడ నగజాత శివార్చన సేయునయ్యెడన్

ఆనాటి బాలికలు చిలుక బొమ్మలు, దంతపు బొమ్మలు, మేలి గాజు బన్నరులు మ్రాని చొప్పికలను పేర్చి బొమ్మరిండ్ల నలంకరించేవారు. అదేవిధంగా గృహిణులు మకర తోరణాలు, గాలి పడగల వంటి వానితో గృహాలనలంకరించేవారు. బాలికలు బొమ్మరిండ్లలో వంటలు వండేవారు. అదేవిధంగా గృహిణులు రకరకాల పిండివంటలు చేసేవారు. పర్వదినాలలో ప్రత్యేకమైన శ్రద్ధతో గృహాన్ని అలంకరించడం, పిల్లలను జాగ్రత్తగా పెంచడం, గృహోపకరణాలు స్వయంగా తయారుచేసుకోవడం నాటికీ నేటికీ గృహిణుల విధులలో ముఖ్యమైనవే. పండుగలు ఉత్సవాల సమయాలలో చక్కగా అలంకరించుకొని దేవాలయాలకు, పేరంటాలకూ వెళ్ళేవారు. ఈ దినచర్య నాటినుండి నేటివరకూ గృహిణులు ఆచరిస్తూ ఉన్నారు.

కుటుంబంలో తల్లిగా స్త్రీ స్థానం:

అనాదిగా భారతదేశంలో కుటుంబంలో తల్లికి అత్యున్నత స్థానమిచ్చారు. ధర్మశాత్రకారులు స్మృతికర్తలు కవులు కూడా మాతృమూర్తిని కీర్తించారు.

గురువులలో ఆచార్యుడు పెద్ద. ఆచార్యుల కంటె అధికమైనది తల్లి అని గౌతముడు అన్నాడు.

“ఆచార్య శ్శ్రేష్ఠో గురుణాం, మాతేత్యేకే” (గౌ-256)

తల్లి కొడుకు కోసం ఎన్నో పాట్లు పడుతుంది. కనుక ఆమె పతిత అయినప్పటికీ పుత్రుడు ఆమెకు సేవ చేయాలి అని ఆపస్తం ధర్మసూత్రం చెబుతుంది.

మాతా పుత్ర త్వస్య భూయాంసి కర్మాణ్యారభతే
తస్యాం శుశ్రూషా నిత్యాపతితాయామపి

పతిత అయిన తల్లితో మాట్లాడక పోయినా ఆమెను పుత్రుడు పోషించాలని బౌద్ధాయన ధర్మసూత్రకారుడు నిర్దేశించాడు.

పతితామపి తు మాతరం భిభ్రం యాదన భిభాషణ మాణః

తండ్రి పతితుడైతే అతనిని వదిలివేయవచ్చుగాని తల్లి పతిత అయినప్పటికీ పుత్రుడికి ఆమె పరిత్యజించదగినది కాదు. పుత్రునికి తల్లి ఎన్నటికీ పతిత కాదు అని వశిష్ఠ ధర్మసూత్రం.

ఉపాధ్యాయుల కంటె ఆచార్యుడు గొప్ప. వందమంది ఆచార్యుల కంటే తండ్రి అధికుడు. వేయిమంది తండ్రులను మించినది తల్లి అని మనువు చెప్పాడు. (మను II 145). శంఖలిఖితుడు – తల్లితండ్రుల మధ్య జరిగే కలహంలో పుత్రుడు ఎవరి పక్షము వహించకూడదు. కావాలంటే అతడు తన తల్లి పక్షము వహించవచ్చు. ఎందుకంటే తల్లి అతడిని నవమాసాలు మోసి కన్నది. అతడు జీవించినంత కాలం తల్లి ఋణము తీర్చలేడు – అన్నాడు.

యాజ్ఞవల్క్యుడు (I-35) తల్లి గురువు కంటె, ఆచార్యుని కంటె, ఉపాధ్యాయుని కంటే ఉత్తమమైనది అన్నాడు. అందరూ తల్లి తండ్రి కంటె అధికురాలని, తల్లిని మించిన గురువులేదని భావిస్తారు.

ఇవన్నీ పరిశీలిస్తే హిందూ సమాజంలో మేధావులు స్త్రీల విలువ, ప్రత్యేకత గుర్తించారు కనుకనే శీలం అన్నది స్త్రీకి అతివిలువైన గుణంగా భావించారని గ్రహించవచ్చును. ముఖ్యంగా తల్లిగా స్త్రీకి ఉన్నత స్థానమిచ్చారు.

కాకతీయుల కాలంలో తల్లి స్థానం:

కాకతీయుల కాలంలో కూడా ఈ ధర్మశాస్త్రాల ప్రభావం ఉన్నదని చెప్పవచ్చును. తల్లిగా స్త్రీకి కాకతీయుల కాలంలో కూడా ప్రాముఖ్యం ఇవ్వబడింది.

గురుడు, ఆచార్యుడు, ఉపాధ్యాయుడు, ఋత్విజుడు వీరందరూ గర్భాది సంస్కారం మొదలు వేదవేదాంగాలు చదివించి యాగక్రియలకు తోడ్పడేవారు. వీరందరికంటే తల్లి ఎక్కువ పూజింపదగినది. అందరికీ పూజ్యుడైన సన్యాసికి తల్లి పూజ్యురాలు కనుక తల్లిని వేరే పొగడనక్కరలేదు అని కేతన విజ్ఞానేశ్వరీయంలో చెప్పాడు.

కాకతీయుల కాలంలోని శాసనాలలోనూ, కావ్యాలలోనూ తల్లి పేరు చెప్పుకొని తరువాత తన పేరు చెప్పుకొన్న వ్యక్తులు కనిపిస్తారు. ఈ సంప్రదాయం మొదట శాతవాహనులు, ఇక్ష్వాకులలో కనిపిస్తుంది. గౌతమీపుత్ర శాతకర్ణి, వాసిష్ఠీపుత్ర పులోమావి, యజ్ఞశ్రీ శాతకర్ణి, మాఢరీపుత్ర వీరపురుషదత్తుడు మొదలైనవారు ఆ కోవకు చెందినవారు. కాకతీయుల కాలంలో వ్యక్తులు కూడా తమ తల్లి పేరు చెప్పుకొని తమ పేరు చెప్పుకొనేవారు. మైలమ కామరాజు, శీలమ బ్రహ్మన, జానమసిద్ధశౌరి, అన్యమ తిక్కన, కోట బయ్యలదేవి గణపదేవ రాజులు అని చెప్పుకున్నట్లు ఆనాటి మన సాహిత్యంలో కనిపిస్తుంది. కాకతీయల కాలానికి ముందు, కాకతీయల కాలం తర్వాత కాలంలో ఈ విధంగా తల్లి పేరు ముందు చెప్పి తమ పేరు చెప్పుకొన్న వ్యక్తులు ఉన్నట్లు కనిపించదు. బహుశా దీనికి మాతృకారాధన కారణం కావచ్చును. శాతవాహనులు, ఇక్ష్వాకులు, వైదిక, బౌద్ధమతాలను అనుసరించినా కుమరి, హరీతి వంటి స్త్రీ దేవతలను కూడా ఆరాధించారు. అలాగే కాకతీయుల కాలంలో శక్త్యారాధన ఎక్కువగా ఉండేది. ఏకవీర, కాకతమ్మ, మాహురమ్మ, ముసానమ్మ, నూకనమ్మ, బ్రోసినమ్మ, నీరుగలసాని, కావవల్లీ వంటి దేవతలకు గుడులుండేవి. జాతరలు, ఉత్సవాలు చేసేవారు. ఈ విధంగా శక్తిని ఆరాధించేవారు తప్పక తల్లికి ఉన్నతస్థానమిచ్చి ఉంటారు. కులస్త్రీలు, పతివ్రతలు, రాణుల పుత్రులే కాక సానుల పుత్రులు కూడా ఈ విధంగా తమ పేరుకు ముందు తల్లిపేరు చెప్పుకోవడం కద్దు. క్రీ.శ. 1171 నాటి సిరిపురం శాసనంలో కొమ్మసాని మార, మారాసాని పడ్ల, అయ్యసాని బయ్య, ప్రోలాసాని చామ మొదలైన వారు పేర్కొనబడ్డారు. ఈ విధంగా తల్లిపేరు కొడుకులు చెప్పుకొని తమపేరు చెప్పుకోవడానికి కారణాలు ఈ క్రిందివై ఉండవచ్చును.

  1. తండ్రికి భార్యలు ఒకరికంటే ఎక్కువగా ఉన్నపుడు తల్లిపేరు ముందుచెప్పి కొడుకు పేరు తర్వాత చెప్పడం. ఉదాహరణకు – పలనాటి వీరచరిత్రలో అనుగురాజు భార్యలు మైలమాదేవి, వీరవిద్యలదేవి, భూరమాదేవి అనేవారు. అందరికీ కుమారులు ఉన్నారు కనుక ఏ తల్లి కొడుకో తెలియడానికి అలా పేర్కొని ఉంటారు. ఉదా. నలగామరాజును మైలమ కామరాజు అని పలనాటి వీరచరిత్రలో పేర్కొన్నారు.
  2. దేవాలయాలలో మాన్యాలున్న స్త్రీల కొడుకులకు ఆ మాన్యాలు లభించినపుడు వారసత్వానికి సంకేతంగా తల్లిపేరు వ్యక్తి పేరుకు ముందు చెప్పుకొని ఉండవచ్చును. పైన ఉదహరించినట్లు సిరిపురం శాసనంలోని కొమ్మసాని మార, మారాసాని పడ్ల, అయసాని బయ్య అటువంటివారు కావచ్చును.
  3. సంఘంలో ఉన్నతమైన స్థానాన్ని పొంది ఉన్న స్త్రీ వల్ల ఆ తల్లిపై పుత్రుడికి గౌరవం ఉండడం వల్ల ఆమె పుత్రుడి పేరుకు ముందు ఆమె పేరు వచ్చి ఉండవచ్చు. ఉదాహరణకు బ్రహ్మనాయని తల్లి శీలమ రాజనీతి తెలిసిన స్త్రీ. బ్రహ్మనాయుడు పలనాటి వారికందరికీ నాయకుడు. దైవసమానుడు. అటువంటి వ్యక్తి తన తల్లికి ఎంతో గౌరవమిచ్చేవాడు. అందుకే అతడు శీలమ బ్రహ్మనగా పేర్కొనబడ్డాడు.
  4. ఖడ్గ తిక్కన భార్య జానమ. ధీరురాలిగా, పతివ్రతగా పేరుగాంచింది. ఆమె కొడుకును ‘జానమ సిద్ధశారి’ అని కేతన దశకుమార చరిత్రలో పేర్కొన్నాడు. తిక్కనను ‘అన్యమ తిక్కన’ అని కూడా సంబోధించాడు. ఇది ఆనాటి వారి మాతృభక్తికి తార్కాణమని చెప్పవచ్చును.
  5. బ్రహ్మనాయుని తల్లి శీలమ పేరుమీదుగా ఆతని వంశం ప్రసిద్ధి చెందింది. బ్రహ్మనాయుని వంశం శీలమవారి వంశంగా పలనాటి వీరచరిత్రలో పలుచోట్ల ప్రశంసించపబడింది. బహుశా అతని వంశం మాతృస్వామ్య వ్యవస్థ పాటించిన వంశమై ఉండి ఉంటుంది. జాగ్రత్తగా పరిశీలిస్తే ఈనాడు కూడా కొన్ని యిండ్ల పేర్లలో స్త్రీల ప్రాధాన్యం కానరావచ్చు. ఇది వారి వ్యక్తిగతమయిన గొప్పతనానికి సంకేతంగా గ్రహించవచ్చును.

పెంపుడు తల్లి:

కుటుంబంలో తల్లి కెంత ప్రాముఖ్యముందో ఇంతకు ముందు తెలపడమైంది. కన్న పిల్లలను పోషించి, రక్షించి పెంచి పెద్ద వారిని చేసి విద్యా బుద్ధులు, సంస్కారం నేర్పే బాధ్యత తల్లిది. అయితే ఏ కారణం వల్ల నైనా తల్లికి దూరమైన బిడ్డను దగ్గరకు తీసుకొని ఆలన పాలన చూసి పెంచి పెద్ద చేసే స్త్రీని ఆ బిడ్డకు పెంపుడు తల్లి అని వ్యవహరిస్తారు. ఆ తల్లి సవతి తల్లికావచ్చు లేదా దగ్గరి బంధువు కావచ్చు. తల్లిలేని పిల్లల బాధ్యతను స్పీకరించి కన్న బిడ్డలకంటె ఎక్కువగా చూసుకునే తల్లి కన్న తల్లి కంటే గొప్పది. కనుకనే కన్న ప్రేమకంటె పెంచిన ప్రేమ గొప్పదంటారు.

మధ్యయుగంలో, ముఖ్యంగా కాకతీయుల కాలంలో యుద్ధాలు ఎక్కువగా జరిగి వీరులు చనిపోవవడం వల్ల, వారి పత్నులు సహగమనాలు చేయడం వల్ల, ప్రసవ సమయంలో బిడ్డలను కని తల్లులు మరణించడం వల్ల శిశువులకు తల్లి ప్రేమ కరువయేది. అయితే ఆనాడు పెంచిన ప్రేమకు ఎంతో విలువ నిచ్చేవారు. అటువంటి పెంపుడు తల్లి కథ బసవపురాణంలో స్ధానం సంపాదించింది. తల్లి లేని శిశువు ఎంత బాధ చెందుతాడో, అతడి పెంపకంలో ఎంత లోపం ఉంటుందో బసవ పురాణంలోని బెజ్జమహాదేవి కథ ద్వారా కవి మనకు తెలిపాడు.

ఆనాథులైన పిల్లలను ప్రేమతో ఆదరించక గాలికి వదిలిపెడితే వారు సరియైన శిక్షణ లేక, విద్యాబుద్ధులు లేక చెడుమార్గాలు పట్టి, సంఘానికి చేటు తేవచ్చును లేదా సహజంగా తెలివి తేటలున్నా, ఆదరణలేక తామే అనామకులుగా నశించిపోవచ్చును. బిడ్డ ఆలన పాలన చూసి పెంచిన తల్లికి ఆ బిడ్డ ఎప్పుడూ ఋణపడి ఉంటుంది. కాకతీయుల కాలంలోని శాసనాలలో కొందరు పెంపుడు కొడుకులు తమ పెంపుడు తల్లుల పేర్లు తమ పేర్లకు ముందు చెప్పుకోవడం కనిపిస్తుంది.

కాకతిరుద్రుని మంత్రిరేచర్ల రుద్రుడు క్రీ. శ. 1213 నాటి పాలంపేట శాసనంలో తనను కామాంచి కానందమడని చెప్పుకొని, తన తల్లి తండ్రుల పేర తన పేర కామేశ్వర, కాటేశ్వర, రుద్రేశ్వర దేవరలను ప్రతిష్ఠించాడు. కాని అతని ప్రధాని రాజనాయకుడు క్రీ.శ. 1236 నాటి గొడిసెల శాసనంలో రేచర్ల రుద్రుని గురించి చెప్పే సందర్భంలో గుణగణాలం కారుడునైన కాట్రెడ్డికి సౌభాగ్య సౌందర్య చాతుర్యంబులు గలిగి పరగిన పతివ్రతయైన బెజ్జమాంబకు ప్రియనందనుడు అని చెప్పడం వల్ల రేచర్ల రుద్రుని తల్లి బెజ్జమాంబ అని అనుకోవచ్చు. బహుశా ఈమె రేచర్ల రుద్రుని పెంచిన తల్లి అయివుంటుంది. కన్న తల్లి కామాంబ మరణించాక ఈమె రేచెర్ల రుద్రుని పెంచడం వల్ల అతడు బెజ్జమ తనయుడు అని శాసనంలో ప్రశంసించబడినాడు. తన పెంపుడు తల్లి పేరు తన పేరుముందు చెప్పుకొన్న మరొకవ్యక్తి డెంద్దేటి గ్రామ వాస్తవ్యుడు గుడ్డనాయకుడు. ఇతని కన్న తల్లి సూరమ అని తస్య గుణాంకా సూరమాప్రియ తనూభవ(చ్చ) డెంద్దేటి గ్రామవాస్తవ్య అనే శాసనవాక్యాన్ని బట్టి తెలుస్తున్నది. కాని ఇతడు తనను డెంద్దేటి కుప్పిదేవి పోతమ కొడ్కు గుడ్డనాయకుణ్ణు అని చెప్పుకొని తన తల్లి సూరమ ధర్మార్ధం భీమేశ్వరునికి అఖండదీపం సమర్పించాడు. పై విషయాలను బట్టి గుడ్డనాయకుని కన్న తల్లి సూరమ అనీ, అతనిని డెంద్దేటి కుప్పిదేవి పోతమ అనే స్త్రీ పెంచిందని అతడు తన పెంచిన తల్లి పేరు ముందు చెప్పుకొని తన పేరు చెప్పుకొన్నాడని గ్రహించవచ్చు. దీన్ని బట్టి పెంచిన ప్రేమను, పెంపుడు తల్లిని కూడా ఆనాటి వారు గౌరవించారని చెప్పవచ్చును.

భార్యగా స్త్రీ స్థానం:

భార్యకు కుటుంబంలో ఉన్న బాధ్యతలు, హక్కులు:

మన పురాణాలు ధర్మపత్ని అయిన స్త్రీకి ఉండవలసిన ధర్మాలను గురించి ఈ క్రింది విధంగా నిర్దేశించాయి. పద్మపురాణంలో

కార్యేషు దాసీ కరణేషు మంత్రీ రూపేచ లక్ష్మీ క్షమయా ధరిత్రీ
భోజ్యేషు మాతా శయనేచ రంభా షట్కర్మయుక్తా నిజధర్మపత్నీ

ప్రాచీన ధర్మశాస్త్రాలు గృహిణులకు చెప్పిన ఈ ధర్మాలను స్త్రీలు తరతరాలుగా పాటిస్తూ ఈనాటివరకూ భారతీయ సంస్కృతిని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.

పైన చెప్పిన ధర్మాల గురించి వివరించాలి. భార్య పురుషునికి దాసిలాగా సేవ చెయ్యాలి. మంత్రిలా మంచి చెడ్డలను గురించి చర్చించి సలహా ఇవ్వాలి. భూదేవి కున్నంత సహనంతో ఓర్పుతో భర్తగానీ, కుటుంబ సభ్యులు గానీ చేసే తప్పులను క్షమించాలి. రూపంలో లక్ష్మీలాగా కళకళలాడుతూ ఉండాలి. భోజన సమయంలో తల్లిలాగా ఇష్టాయిష్టాలను గుర్తించి, అన్నపానాదులను వేళకు అమర్చి, ఆప్యాయంగా, ఆదరంతో వండి వడ్డించాలి. శయనించే వేళ రంభలా భర్తను మోహపరవశుడిని చేసి తృప్తి పరచాలి. ఈ విధమైన షట్కర్మలూ ధర్మపత్ని ఆచరించవలసినవి.

ఈనాటికీ స్త్రీ విధులను గురించి చర్చించే పెద్దలు ఈ శ్లోకాన్ని ఉటంకించి ఆదర్శ గృహిణిగా ప్రతి స్త్రీ ఉండాలని ఆశిస్తారు. కానీ భర్త అయిన పురుషుడికి మాత్రం ఏ విధులు ఉన్నట్లు చెప్పరు. కానీ మన ధర్మశాస్త్రాలలో భర్తలకు కూడా భార్యల పట్ల కొన్ని విధులున్నాయి. వాటిని అతడు పాటించవలసిందే. స్త్రీలను ఏ విధంగా ఆదరించాలో యాజ్ఞవల్క్యుని స్మృతిలో ఈ విధంగా చెప్పబడింది.

ఎక్కడ స్త్రీలు గౌరవనీయులుగా ఉన్నారో అక్కడ దేవతలు సంతోషంతో ఉంటారు. ఎక్కడ స్త్రీలు గౌరవింపబడరో అక్కడ దైవిక కర్మలు ఫలమునీయవు. ఏ గృహంలో బంధువులు మహిళలను తగిన విధంగా సమ్మానింపరో ఆ ఇల్లు వారిచ్చు శాపానికి గురి అయి, గారడీవాని మాయ వలె ఆ గృహమే నాశనమై పోతుంది. వారి వారి సంక్షేమం కొరకు పురుషులు స్త్రీలకు నగలు, బట్టలు, ఉత్సవ సమయాలలో మంచి ఆహారము, విహారము సమకూర్చాలని యాజ్ఞవల్క్యుడు చెప్పినది కాకతీయులనాటి వారు పాటించారని ఆనాటి స్త్రీల వేషభూషలు, వస్త్రధారణ, స్త్రీలు చేసిన దానధర్మకార్యాలు మొదలైనవాటిని బట్టి గ్రహించవచ్చును. ఆనాటి సాహిత్యంలో ఎక్కడా స్త్రీలను శారీరకంగా హింసించినట్లు కనపడదు.

“కులకాంత తోడ నెప్పుడు
గలహింపకు, వట్టి తప్పు ఘటియంపకుమీ
కలకంఠ కంఠి కంట కన్నీ
రొలికిన సిరియింట నుండ నొల్లదు సుమతీ”

అన్న సుమతీ శతకకారుడు ఆ కాలం నాటి వాడే.

ఇరవైయవ శతాబ్దంలో కూడా భార్య భర్తను పల్లెత్తు మాట అనలేదు. ఈనాటికీ సంసారం నడిపే విషయంలోగానీ, బయటి వ్యవహారాలలో గానీ స్త్రీలు భర్తలకు సలహా ఇవ్వడం అనూహ్యం.

ఈ విషయాన్ని గురజాడ అప్పారావుగారు కన్యాశుల్కం ద్వారా బాగా చూపారు. స్త్రీలు తమ సంతానానికి సంబంధించిన విషయంలోకూడా తమ సలహాలు ఇవ్వడానికి గానీ, నిర్ణయాలు చేయడానికి గానీ భయపడేవారు. కూతురి భవిష్యత్తు నాశనమౌతుందనుకునే పరిస్థితులలో కూడా కన్యాశుల్కం నాటి స్త్రీకి మాట్లాడే హక్కులేదు. అగ్నిహోత్రావధానులు చిన్నకూతురికి కన్యాశుల్కం తీసుకుని ఒక ముసలివాడికి కట్టబెట్టే ప్రయత్నం చేసినప్పుడు అతని పెద్దకూతురు బాలవితంతువైన బుచ్చమ్మ, భార్య వెంకాయమ్మ ఈ వివాహం చేయవద్దని బతిమాలుకున్నారు. తన మనోవర్తి భూమినమ్మి చెల్లెలికి కట్నం ఇచ్చి పెళ్ళి చెయ్యమన్న బుచ్చమ్మ సలహాకి అగ్నిహోత్రావధానులు మండిపడి ఆడముండల సలహా అక్కరలేదని కసిరికొట్టాడు. గుడ్లనీరు కుక్కుకుని ఏడ్చేవారితో “తాంబూలాలిచ్చేశాను తన్నుకు చావండి” అని ఒక్కమాటతో వారి ఆలోచనలనూ, భావాలనూ వెలిబుచ్చబోయిన అభిప్రాయాలనూ కొట్టిపారేశాడు. మగవారి తొందరపాటు చర్యలకు బాధలనుభవించవలసిన వారే మౌనంగా తమ దురదృష్టాన్ని నిందించుకుంటారే గానీ, ధైర్యంగా పురుషుల దోషం అని చెప్పలేరు.

కానీ కాకతీయుల కాలంలో భర్త చేసేది తప్పని భావించిన భార్య ఆ విషయం చెప్పడానికి జంకలేదు. ధైర్యంగా భర్తలో తప్పులు ఎత్తిచూపేది. సవరించుకోమని సలహా ఇచ్చేది. నన్నెచోడుని కుమార సంభవంలో శివుని తపోభంగం చేయడానికి ఉద్యుక్తుడైన మన్మథునికి రతీదేవి చేసిన హితబోధ తొందరపాటుతో కయ్యానికి దూకి ఆపదలకు గురి అవబోయే భర్తలకు ఆనాటి భార్యలు చేసే హితబోధకు ఛాయవంటిదే. రంగనాథ రామాయణం, భాస్కర రామాయణాలలో మండోదరి రావణునికి చేసిన బోధ కూడా అటువంటిదే. అంతేకాదు ఆనాటి స్త్రీలు తమకు అవమానం జరిగినా, భర్తవలన గానీ సవతుల వల్లగానీ అన్యాయం జరిగితే, ముఖ్యంగా పిల్లలకు కీడు జరిగినా ఏ మాత్రం సహించేవారు కాదు. రంగనాథ రామాయణంలో రావణుడు పాతాళహోమంలో నిమగ్నుడై ఉన్నప్పుడు అంగదుడు రావణుని హోమం భగ్నం చేయడానికి అతని రాణి మండోదరి జుట్టుపట్టుకొని ఈడ్చి రావణుని ముందుకు తీసుకురాగా ఆమె మనసులో శోకాగ్నులు రగులుతూ ఉండగా ఈ విధంగా భర్తతో పలికింది. “ఇంద్రుని గెలిచిన బలమెక్కడికి పోయింది, చంద్రహాసం వాడి తగ్గిపోయిందా, శివునితో గూడా కైలాసాన్ని ఎత్తిన గర్వం అణిగిందా, ముల్లోకాలు గెలిచినవాడివి ఈనాడెందుకు నిర్వీర్యుడిలాగా ఉన్నావు” అని రోషంతో ప్రశ్నించింది. తన దుస్థితి చూచి కూడా ఏమీ చెయ్యలేకపోయాడని రావణుని నిందించింది.

“ఇంద్రుగెల్చిన సత్త్వమెక్కడ బోయె, జంద్రహాసము వాడి సమసెనేనే డు
ఫాలలోచనుతోడ బ్రమథుల తోడ గైలాసమెత్తిన గర్వమెందణిగె
మూడు లోకంబులు మునుమిడి గెలిచి, నేడేల తూలెదు నీపేర్మివిడిచి
యింద్రజిత్తుండు నన్ను నిట బాఱవైచి, యింద్రలోకంబునకేగకయున్న
నన్నిట్లు చూచునే నా కొడుకున్న, నిన్నీచ దుర్దశలేను బొందుదునే
సిగ్గు లజ్జయు లేని చెనటిలో నన్ను, బగ్గించు చున్నారు పగతులిబ్భంగి
నీ హోమమేటికి నిష్ఠయేమిటికి, నాహుతుల్నిన్ను బూర్ణాహుతి జేసె
బటు బుద్ధివై రాము బాణాగ్ని బడుము, కుటిల క్రియల కింక గొలది గాదుడుగు”

తన కొడుకు ఉంటే ఈ నీచదశ తనకు ఉండేది కాదు. సిగ్గు లజ్జ లేని వాడు కనుక తనను ఈ విధంగా శత్రువులు హింసిస్తూ ఉండే భర్త అయివుండి ఏమీ చేయలేకపోయాడు. తనకు ఇంత అవమానం జరిగినపుడు, ఇంకా హోమమెందుకు, నిష్ఠయెందుకు అని ప్రశ్నించించి. ఆహుతుల్నిన్ను పూర్ణహుతి జేసె, బటు బుద్ధివై రాము బాణాగ్ని బడుము అని ఇంక ఆ కుటిల క్రియలు మానమని అన్న మండోదరి మాటలు కులసతులు, సాధ్వులు, పతివ్రతలు అయిన స్త్రీలు అనదగ్గ మాటలు అనిపించుకోవు. ఈ మాటలు పతివ్రతలు ఉండవలసిన విధం చెప్పిన ధర్మశాస్త్రకారుల ఆదేశాలకు విరుద్ధం. పైగా భారతనారి భర్త ఎంత దుష్టుడైనా అతని చావుకోరదు. కానీ మండోదరి రావణుడు భగవంతుడైన రాముని చేతిలో మరణించడం మంచిదన్న భావనలో ఉన్నట్లు ఉన్నది. వైదికమతం వారి ప్రభావం కన్న నాటి వీరశైవ ప్రభావం హెచ్చుగా ఉన్న స్త్రీ మనకు మండోదరిలో కనిపిస్తుంది. శైవుడు కాని భర్తను వదిలేయగలిగిన వైజకవ్వ, శివార్పణం కావలసిన పిండివంటను నమిలిన కొడుకును చంపిన నిమ్మవ్వవంటి స్త్రీల ప్రభావం మండోదరి మాటలలో, చేసిన నీతిబోధలలో కనిపిస్తుంది.

మార్కండేయ పురాణంలో కౌశికుడనే విప్రుని భార్య మహాపతివ్రత. ‘అత డెంత యలిగి తిట్టిన, మతి గింకిరి పడక యెపుడు మాతాడక యానత యగుచు నప్పతివ్రత, యతని నతిశ్రేష్ఠు గా గ నాత్మ దలచుచున్’.

భర్త ఎంత దుర్మార్గుడైనా అతనిని శ్రేష్ఠునిగా భావించాలని, భర్త మాటకు పతివ్రత అయిన స్త్రీ ఎదురాడకూడదని పురాణ కవులు స్త్రీలను ఇటువంటి కథల ద్వారా ఆదేశించారు. స్కాందపురాణాన్ని తెనిగించిన శ్రీనాధుని కాశీఖండంలో బృహస్పతి, లోపాముద్రకు చెప్పే పాతివ్రత్య ధర్మాలలో భర్తకు కోపం వస్తే మారుపలకకూడదన్నది ముఖ్యమైనది.

ధవుడు రోషితుడైన తఱి వాడియుండుదు
పతికి నెప్పుడు మాఱుపలకవీవు, మొగమెత్తనేరవు మగని యెదుట

ఈ పురాణ కవులు ఆశించినట్లు కాకతీయుల తరువాతి కాలంలో స్త్రీలున్నారు. కానీ కాకతీయుల కాలంలో ఎవరూ అంతగా పాటించినట్లు కనబడదు. బహుశా వీరశైవ మతప్రభావం వల్ల ఆనాటి స్త్రీలు భావస్వాతంత్య్రం వాక్స్వాతంత్ర్యం కలిగి ఉండేవారని ఊహించవచ్చును. బసవ పురాణంలో కల్యాణకటకం ప్రవేశిస్తున్న బసవని చూచే వేడుకతో పుణ్యపణ్యాంగనలందరూ వీధులలోనికి వచ్చారు. ఒకరినొకరు హెచ్చరించుకుంటూ నాథునికి తెలిస్తే ఊరుకుంటాడా అని ఒక స్త్రీ అంటే పతి ఏమైనా వాగనీ అని ఇంకొక స్త్రీ బదులు చెప్పింది.

“పతిగన్న సై చునే పడతి నిన్ననుచు
బతిగని యెట్లైన బదరనిమ్మనుచు”

వీధులలోకి వచ్చిన స్త్రీలు వివాహిత స్త్రీలే కానీ పై మాటల వల్ల వారి భర్తలంటే వారికి నిర్లక్ష్యమని భావించకూడదు. ఆ రోజుల్లో బసవన రామానుజాచార్య, మధ్యాచార్యుల ఉపదేశాల వల్ల అన్ని మతాలలోనూ కర్మకాండల కంటే భక్తికి ఎక్కువ ప్రాధాన్యం వచ్చింది. ఆ భక్త్యావేశమే శూద్రులకూ స్త్రీలకూ స్వాతంత్ర్యాన్నిచ్చింది. దానివల్ల ఆయా మతాలకు చెందిన భక్తురాండ్రే కాక సంఘంలో స్త్రీలందరూ అంతో యింతో స్వేచ్ఛ ననుభవించారు. అదే ఆనాటి సాహిత్యంలోని స్త్రీ పాత్రచిత్రణలో ప్రతిబింబించింది.

కాకతీయుల కాలంలో స్త్రీకి తల్లిగా ఉన్నతస్థానం ఇవ్వబడింది. ఆనాటి స్త్రీలను కొడుకులు ఎంతో గౌరవించేవారు. అదే విధంగా కొడుకులకు ఏ కష్టం వచ్చినా తల్లులు సహించేవారు కాదు. ఇది భారతీయ సమాజంలోని కుటుంబాలలో అనూచానంగా ఉన్న విషయమే కానీ కొడుక్కి తన భర్త వల్ల కష్టం కలిగితే భర్తను నిందించడానికీ, విమర్శించడానికీ ఈనాటి స్త్రీకి ధైర్యం లేదేమో కానీ, కాకతీయుల నాటి స్త్రీ కొడుకు కోసం భర్తను ధిక్కరించగలిగేది. రంగనాథ రామాయణంలో కౌసల్య రాముని వనవాసానికి పంపించిన దశరథుని నిందించింది. కైక అడిగిన వరాల వల్ల వనవాసానికి వెళ్ళే శ్రీరామునికై పరితపించిన దశరథుని కౌసల్య ఎత్తి పొడిచింది. రాముని కోసం అతను ఏడ్చే ఏడుపు నటన అని తనకు తెలుసునన్నది.

హారామ హారామ హారామ యనుచు, శ్రీరాము పలుమాఱు జింతింపనేల
ఏల నటించెదవేల యీశోక, మేల తాల్చెదవంత యెఱు గనే నేను
నీవు లోకములలో నిందకు వెఱచి, ఆవల కైకేయి కన్నియు గఱపి

రామునికి పట్టాభిషేకం చేసి భూమినేలిస్తానని నీ ఆలితో చెప్పి అడవులలోకి పంపించిన నీకు ధర్మము ఉన్నదా. కైక తిట్లకు భయపడి పట్టాభిషేకం మాన్చి పంపించిన నువ్వు కైక రాముని చంపమంటే చంపడానికి కూడా వెనకాడవు అని దూషించింది. చాలాకాలం పిల్లలు లేక నోములెన్నో నోచి చివరకు ఒక్కణ్ణి కని, నేను మనశ్శాంతితో ఉంటే (యేను గొంత యుడుకారి యున్నచో నుండనీవైతి) అలా ఉండనివ్వకపోయావు అని దశరథుని కౌసల్య దూషించింది. ఈ విధంగా కౌసల్య దూషించడం వాల్మీకి రామాయణంలో లేదు. కానీ భాస్కర రామాయణంలో కూడా ఇదే అభిప్రాయాన్ని కౌసల్య వెలిబుచ్చింది.

రాముని వనవాస ఘట్టంలో కౌసల్య భర్త దశరథుని మనసులో లేని శోకం తన ఎదుట నటించవద్దనీ చిరకాల తపం వల్ల కలిగిన రామునికి లోకం కోసం పట్టం కడతానని అందరి ముందర పలికి పెద్ద సంభ్రమం చేసి, ఆ తరువాత కైకేయితో కలసి కపటవిధంగా కొడుకును పిలిపించి అడవులకు వెళ్ళమని అన్నవాడికి కరుణ ఎక్కడున్నది, పరలోకమెక్కడున్నది, నిజం, న్యాయమన్నవి ఏం తెలుసు అని నిందించింది.

దీన్నిబట్టి ఇతిహాసాలలో ప్రసిద్ధంగా ఉన్నదానికి విరుద్ధంగా ఆనాటి స్త్రీ మనస్తత్వం ప్రతిబింబించే స్త్రీల పాటలలో కథలలో వృత్తాంతాన్ని బట్టి ఈ ఘట్టాన్ని, కౌసల్య మాటలను రచించినట్లు అనిపిస్తుంది. వీరశైవ వాఙ్మయంలో భర్తను దూషించడం అంత పెద్ద నేరంగా పరిగణింపబడక పోవచ్చుగానీ, పురాణ వాఙ్మయంలో ఈ విధంగా భర్తను దూషించడం చాలా తప్పుగా భావించబడుతుంది. ఈ విషయాన్నే కళాపూర్ణోదయంలో సుగాత్రి ద్వారా భర్త శాలీనుడికి ఈ విధంగా చెప్పించారు.

పెన్వాజి దనర్చు నా చనవునన్ మిమునిమ్మెయి నంటిగాని
యేనాడును ఋణ్య సాధ్వికి గుణంబిది గామి యెఱుంగుదున్ మదిన్

కాకతీయుల అనంతర కాలంలో స్త్రీకి భర్త దగ్గర స్నేహం, చనువు పోయింది. ఇంతకుముందు చెప్పినట్లు కాశీఖండం వంటి పురాణాల ప్రభావం వల్ల భర్తను దైవంగా పూజించడం, భయభక్తులతో సేవచెయ్యడం వంటి ధర్మాలను పాటించడం వల్ల భర్త దైవంగా పై స్థాయికి, భార్య చరణదాసిగా క్రిందిస్థాయికి చేరారు.

భర్తతో సహపంక్తి భోజనం:

కాకతీయుల కాలంలో పురుషులు భార్యతో సహపంక్తిన భోజనం చేసేవారనీ, అది ఉత్తరాదిలో తప్పుగా భావించినా, దక్షిణాదిలో జరిగేదనీ కేతన విజ్ఞానేశ్వరాన్ని బట్టి చెప్పవచ్చును.

అనుపనీతుతోడ నాలితో బొత్తునం
గుడువ జెల్లు బ్రాచి కుడువ జెల్లు
మేనమామ కూతు మేనత్త కూతును
ద్వాహమగుట చెల్లు దక్షిణమున

ఉత్తరాదికీ, దక్షిణాదికీ ఆచార వ్యవహారాలలో కూడా మొదట తేడా ఉండేది. ధర్మశాస్త్రకారులు, పురాణకవులు వైదిక సంస్కృతిని ఆంధ్రదేశంలో ప్రవేశ పెట్టజూస్తే, అధిక సంఖ్యాకులైన స్త్రీ శూద్రాదులు ఆదరించిన జైన, బౌద్ధ, శైవ మతాలు దక్షిణంలో ఉన్న ప్రాంతీయాచారాలనీ పాటించేవారు. కనుకనే కేతన ప్రాంతీయాచారాలని ఆ విధంగా పేర్కొన్నాడు.

ఆనాటి స్త్రీ భర్తను బానిస ప్రభువును కొలిచినట్లు కొలవక, సహధర్మచారిణిగా భర్తతో చనువుగా స్వతంత్రంగా, స్నేహంతో వ్యవహరించిందని, తరువాతి కాలంలో స్త్రీలకు ఆ స్వాతంత్ర్యం పోయిందని అనిపిస్తుంది. ఈనాడు స్త్రీలకు ఎక్కడికైనా వెళ్ళాలంటే తండ్రినిగానీ, అత్తమామలను గానీ, భర్తను గానీ అనుమతి అడగందే వెళ్ళే స్వాతంత్ర్యం తక్కువ. కానీ కాకతీయులనాడు స్త్రీలు ఇప్పటికంటే ఎక్కువ స్వేచ్ఛను అనుభవించారు. కారణం ఈనాడు స్త్రీకి రక్షణ లేకపోవడం కావచ్చును. పలనాటి వీరచరిత్రలో బాలచంద్రుడు బొంగరాలాట ఆడే వేడుకను చూచేందుకు అక్కడి వైశ్య విప్రకాంతలు ఉబలాటపడ్డారు.

వనితలు తండ్రుల పతుల పుత్రులను
అత్తమామల నడుగుట మాని
సంసారభావంబు చాలించి యంత
ఒక్కరినొక్కరు నొగి బిల్చికొనుచు
తమలోన ముచ్చటల్ తగ చెప్పికొనుచు
రయమున బోయిరి రావులకడకు

దీన్నిబట్టి ఇంట్లోవారి అనుమతి తీసుకోవలసిన ధర్మం ఉన్నా అప్పుడప్పుడు దాన్ని మీరడం అన్నది పెద్ద అపరాధంగా భావించేవారు కాదేమో.

అత్తాకోడళ్ళ సంబంధాలు:

అత్తాకోడళ్ళు ఎప్పుడూ పోట్లాడుకుంటారన్నది అందరికీ తెలిసిన విషయమే. జానపద గేయాల్లో కూడా అత్తాకోడళ్ళ కయ్యాల ఇతివృత్తంతో ఎన్నో పాటలున్నాయి. అత్తాకోడళ్ళు పోట్లాడుకోకుండా సఖ్యంగా ఉండడం అన్నది అరుదైన విషయంగా లోకంలో భావించడం జరుగుతున్నది. అన్ని దేశాలలో, అన్ని ప్రాంతాలలో ఈ అత్తాకోడళ్ల కయ్యాల గురించిన ప్రహసనాలు, కథలు, పాటలు ప్రచారంలో ఉన్నాయి. “అత్తలేని కోడలుత్తమురాలు, కోడలు లేనత్త గుణవంతురాలు” అన్న సామెత కూడా ఉన్నది. అయితే కాకతీయుల కాలంలో సాహిత్యంలో ఎక్కడా అత్తాకోడళ్ళ మధ్య పోరు ఉన్నట్లు అనిపించదు. అత్తాకోడళ్ళు ఒకరితో ఒకరు ఆప్యాయంగా వ్యవహరించినట్లు ఆనాటి సాహిత్యాన్ని బట్టి తోస్తుంది. కోడలికి సమస్య వస్తే అత్త సలహానిచ్చి పరిష్కారం చేస్తుంది. అత్తకు సమస్య వస్తే కోడలు తీరుస్తుంది. అత్త మాటను కోడలు మన్నిస్తుంది. కోడలి మాటకు అత్త విలువనిస్తుంది. కోడలికి, ఆమె పుట్టింటివారికీ అత్తగారు కానుకలిస్తే కోడలు అత్తగారికీ, ఆమె తరఫువారికీ ఆభరణాలు వస్త్రాలు ఇచ్చి మర్యాద చేస్తుంది. ఈనాటి కోడలికి అత్తగారంటే భయం. అత్తగారికి కోడలంటే లోకువ. కాకతీయులనాటి అత్తగారికి తమ వంశాంకురాన్నిచ్చే కోడలిపై ప్రేమ, ఆదరం ఉన్నాయి. ఈ విషయాలు పలనాటి వీరచరిత్రను బట్టి గ్రహించవచ్చును.

బ్రహ్మనాయుని తల్లి శీలమను కోడలు ఐతాంబ అడగనిదే ఏ పనీ చేయదు. ఏ సమస్య వచ్చినా అత్తగారు తీర్చవలసిందే. యుద్ధానికి తనను ఆశీర్వదించి పంపమన్న బాలచంద్రుని కోరిక విని ఐతాంబ బాధపడింది. అత్త శీలమ్మతో చెప్పింది. ఆమె బాలచంద్రుని అతని భార్య మాంచాల దగ్గరికి పంపమని, ఆమె సౌందర్యం చూస్తే యుద్ధానికి వెళ్ళడం మానేస్తాడన్నది. ఐతాంబ బాలచంద్రుని యుద్ధానికి వెళ్ళే ప్రయత్నం మాన్చమని మాంచాలను అడిగింది. మాంచాల అందుకు ప్రయత్నిస్తానని చెప్పింది.

“సాధ్వి ప్రేమయె పతికి సకల సాధకము
కావున మనసున కరుణయునుంచి
నేరంబుల తనిపై నిలుపకుమిపుడు” అని అర్థించిన అత్తకు
“కాముని పగదీర్చుటకును
పోయెదనని యెడు బుద్ధిమాన్పింతు”

అని కోడలు సమాధానంతో తృప్తిపరచింది.

మాంచాలను చూడడానికి వచ్చిన ఐతాంబ “పుత్తడి నీరు చీరలు రత్నకాంచన మయమైన ఘనభూషణములు ఇచ్చింది”. మాంచాల తమ యింటికి వచ్చిన ఐతాంబకు, ఆమె తోడికోడళ్ళకు కస్తూరి పునుగు కలిపిన అగరు, గంధం పూసి చేకట్లు, కడియాలు, మాణిక్యమయమైన భూషలు ఇచ్చింది. అత్తగారికి కోడలిమీద ప్రేమ అత్తాకోడళ్ళకు ఒకరంటే మరొకరికి అభిమానం ఉండడం పలనాటి వీరచరిత్రలోనే కాక భాస్కర రామాయణం, రంగనాథ రామాయణాల వంటి కావ్యాలలో సీతా కౌసల్యల సంభాషణలను బట్టి కూడా గ్రహించవచ్చును.

భాస్కర రామాయణంలో శ్రీరామునితో వనవాసానికి వెళ్ళబోతున్న సీత అత్త కౌసల్యకు మొక్కింది. ఆమె బాధపడుతూ సీతను అక్కున చేర్చుకుని “మీ తండ్రి, శ్రీరాముడు విశాల సామ్రాజ్యాన్ని ఏలగలడనుకొని నిన్ను ఇచ్చి వివాహం చేశాడు. కానీ కైక వల్ల ఈ విధంగా కీడు మూడుతుందని ఆయనకు తెలియదు కదా” అన్నది. అతివలు ధన విరహితులైన భర్తలను వదిలేస్తారు కానీ రాజ్యహీనుడైన భర్తతో అడవులకు వెళ్ళే నిన్ను పేర్కొని అటువంటి స్త్రీలను తలవనైనా తలవకూడదు అన్నది. తన కోడలి గొప్పతనాన్ని గుర్తించడమే కాక ప్రశంసించడానికి కూడా వెనుకాడలేదు ఆనాటి అత్త.

అతివలు ధన విరహితులగు
పతులను దిగవిడుతున్నిభంగుల, ధర్మ
స్థితి దలపరు, తాదృగ్విధ
సతులను నిను జెప్పి చెప్ప జనునే సాధ్వీ

వనవాసం ముగిసి రావణుని వధించి అయోధ్యకు వచ్చిన సీతారాములను కౌసల్య కౌగిట చేర్చుకున్నది. ఆమె శ్రీరాముని ఘనత కంటే కోడలి మహత్తునే ప్రశంసించింది.

అత్తఱి సీతయత్తలకు నందఱకుం దగ మ్రొక్కియున్న, వా
రత్తర లాక్షినెత్తి ప్రియమారగ గౌగిట జేర్చి, సాధ్వి, నీ
యుత్తమ సచ్చరిత్రమున యుద్ధమునన్ రఘువల్లభుండు దా
దత్తదుదగ్రదానవుల దర్పమడంచె, విపద్విదూరుడై

నీ ఉత్తమ చరిత్ర వల్లనే అంటే అత్యుత్తమమైన నీ శీలం వల్లనే రాఘవుడు ఆపదలు కలుగకుండా దానవులను సంహరించగలిగాడు అని సీతను ప్రశంసించిన కౌసల్యలో కోడలి సుగుణాలను ప్రశంసించే కాకతీయులనాటి అత్త కనిపిస్తుంది. రంగనాథ రామాయణంలోనూ కౌసల్య వనవాసానికి వెళ్ళబోయే సీతను చూచి బాధపడింది. చక్రవర్తి కొడుకని రామునికి నీ తండ్రి కోరి నిన్నిచ్చి వివాహం చేశాడు. దైవయోగం వల్ల ఈ విధంగా జరిగిందని చెప్పి

“పతి పేదవా డైన బాయంగరాదు
సతులకు నిదియు విచారించి నడుపు” అని హితబోధ చేసింది.

ఈనాటి అత్తగారు కొడుకుకు ఏ కీడు జరిగినా, ధనం పోయి పేదవాడైనా ఆ దౌర్భాగ్యం కోడలివల్లనే కలిగిందని నిందిస్తుంది కానీ వచ్చిన కష్టానికి కోడలికి ఓదార్పుగా ఒక్కమాటైనా అనదు.

యుద్ధంలో కొడుకులు చనిపోతే వీరమాతలు బాహాటంగా దుఃఖించరు. కానీ కొడుకు చనిపోయిన దానికంటే కోడలు విధవ అయిందన్న బాధ ఆనాటి అత్త అనుభవించేది. తిక్కన రచించిన మహాభారతంలోని స్త్రీపర్వంలో గాంధారి కొడుకు చావుకంటే కోడలి బాధను చూడలేకపోయింది.

కొడుకు చావుకంటె గోడలి యడలున
బెరి గి శోకవహ్ని దరికొనంగ
నంతరంగ మెప్పు డగ్గల మెరియంగ
దొడగె దీనికేది తుదియు పేంద్ర

కొడుకుకు ఏ ఆపద వచ్చినా కోడలి వల్లనే జరిగిందనే అత్తలు నేటికీ ఉన్నారు.

గొడ్డొచ్చిన వేళ, కోడలొచ్చిన వేళ అని సామెత చెప్పేవారున్నారు. కొడుకు చనిపోతే చెట్టంత కొడుకును మింగేసిందని శాపనార్థాలు పెట్టే అత్తలున్నారు కానీ కోడలికి కలిగిన దుఃఖానికి అలమటించి పోయే అత్తలు ఈనాడు లేరు. దీన్నిబట్టి ఆ కాలంలో అత్తాకోడళ్ళ మధ్య ఎటువంటి అనుబంధం ఉండేదో, అది ఈనాటికీ ఎంత ఆదర్శప్రాయమో మనం గ్రహించాలి. ఆనాటి అత్తలు కోడళ్ళ మధ్య అనుబంధానికి కారణాలు, ఆనాడు జరిగే బాల్యవివాహ సంప్రదాయం వల్ల అతి చిన్నవయసులోనే అత్తవారింటికి వచ్చి పుట్టింటివారికంటె అత్తింటివారికే ఎక్కువ సన్నిహితమవడం, తనకంటూ స్త్రీ ధనం ఉండడం వల్ల ఆర్థికంగా అత్తింటిపై ఆధారపడకపోవడం, కొడుకు చనిపోతే సహగమనం చేసే సంప్రదాయం అమలులో ఉండడం కావచ్చును. ఏది ఏమైనా అత్తాకోడళ్ళు పరస్పరం నిందించుకోక ఆప్యాయతానురాగాలతో మెలగడమన్నది అన్ని కాలాలలోనూ అభిలషణీయమే.

కుటుంబంలో కుమారైగా స్త్రీ స్థానం:

మాతృస్వామ్య వ్యవస్థ అమలులో ఉన్న ఆదిమ జాతులలోను వేశ్యాకులంలోనూ కూతురికి ప్రాముఖ్యం ఉంటుంది. కానీ పితృస్వామ్యం అమలులో ఉన్న సమాజంలోని కుటుంబాలలో ఆమె స్థానం ఎప్పుడూ కొడుకు తరువాతదే. కూతురు పుట్టాలని కోరుకోవడం, పుట్టినపుడు వేడుకలు చేసుకోవడం అన్నది అరుదైన విషయం.

వైద్యవిజ్ఞానం పురోభివృద్ధి చెందిన ఈ కాలంలో ఆ శాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని గర్భస్థ శిశువు ఆడదని తెలియగానే గర్భస్రావం చేసి ఆడపిల్ల పుట్టకుడా చేస్తున్నారంటే, మూఢాచారాలను, పాత సంప్రదాయాలను అనుసరించేవారు, ఆడపిల్లలు పుడితే ఏడ్చారన్నా, పిల్ల పుట్టగానే చంపేసేవారన్నా ఆశ్చర్య పడనక్కరలేదు.

రాజస్ధానులో స్త్రీలు – ఆడపిల్లల గురించి పరిశీలించి నివేదికను సమర్పించిన యునైటెడ్ నేషన్స్ ఛిల్డ్రన్స్ ఫండ్ సంస్థ ఆడపిల్లల గురించి అక్కడి వారు వెలిబుచ్చిన అభిప్రాయాలు ఈ క్రింది విధంగా వెల్లడి చేసింది.

“ఆడపిల్ల అనగానే అంతకంటె అవమానం, దుఃఖం కలిగించే విషయం ఏముంటుంది? కన్న వారింటి తిండి తిని వారి ఖర్చుతో పెరిగి పరాయి యింటికి అంటే భర్త యింటికి వెళ్ళి వారికి ఉపయోగపడుతుంది. పైగా వివాహమయే దాకా ఆమె శీల రక్షణ గురించి అస్తమానం చింతపడి ఆమెను జాగ్రత్తగా కాపాడాలి. పెళ్ళి చేస్తే కట్నంరూపంలో తండ్రి కష్టపడి సంపాదించి కూడబెట్టినదంతా చేజారిపోతుంది. ఆడపిల్లెవరికి కావాలి? అందుకే ఆడపిల్లని ఎంత తొందరగా ఇంటినుంచి పంపి బాధ్యత వదిలించుకుంటే అంతమంచిది”. ఇదీ పితృస్వామ్య వ్యవస్థలో ఆడపిల్ల గురించిన అభిప్రాయం. ఈ అభిప్రాయం ఈనాటిదే అయినా కొన్ని శతాబ్దాల నుంచి భారతదేశంలో ఎక్కువ ప్రాంతాలలో ఉన్నదే. అయితే దక్షిణ భారతదేశంలో ఆడపిల్లలను అంత తీవ్రంగా గర్హించరు. కుటుంబంలో మొదట ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందనే అభిప్రాయం ఆంధ్ర దేశంలో ఉన్నది. కానీ ఆడపిల్ల విలువ అంతవరకే. ఇంట్లో మగ పిల్లాడికిచ్చిన ప్రాముఖ్యం, అతడి పెంపకం పట్ల చూపే శ్రద్ధాసక్తులు ఆడపిల్లలపైన చూపించరు. ఆధునిక యుగంలో రోజులు మారి ఆడపిల్లలు కూడా అన్ని రంగాల్లో రాణిస్తున్నప్పుడు కుటుంబనియంత్రణ అమలులో పెట్టవలసినప్పుడు ఎవరైనా ఒకటేనని సమాధాన పడుతున్నారు. పుట్టిన తరువాత ఏమీ చెయ్యలేకపోయినా కూతురు పుట్టాలని కోరుకునేవారు తక్కువ. అయితే కాకతీయుల కాలంలో కుటుంబంలో కూతురుగా ఆమెకున్న స్థానమేమిటి అన్నది పరిశీలించవలసిన విషయం. ఎందుకంటే కాకతీయుల కాలానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఆ కాలంలో స్త్రీ పురుషులకు సమాన ప్రతిపత్తినిచ్చిన వీర శైవం అత్యుత్తమ దశలో ఉన్నది. స్త్రీని సామ్రాజ్ఞిగా చేసిన కాకతీయ వంశం విశాల సామ్రాజ్యాన్నేలుతున్నది. వివాహసంబంధాలకు రాజకీయంగా ప్రాముఖ్యం ఏర్పడింది. శక్త్యారాధన విశేషంగా ఉండేది. ఈ కారణాలవల్ల ఆనాటి సమాజంలో కుటుంబంలో కూతురికి ప్రత్యేకమైన స్థానం ఉండటానికి ఆస్కారమున్నది. కాకతీయుల కాలంలోని సాహిత్యంలో గానీ, శాసనాలలో గానీ కూతురుని చిన్నచూపు చూసినట్లు గానీ, ఆమె పుట్టినందుకు బాధ పడినట్లు గానీ ఆధారాలు లేవు. నిజానికి పుత్రికను సుపుత్రి, కులదీపకురాలు అనీ, కులభూషణమనీ ప్రస్తుతించటం శాసనాలలో చూడవచ్చును.

కాకతిగణపతి సేనాని మల్యాల చౌండ సేనాని భార్య, విర్యాల అన్నయ ఐతమల కుమారై మైలమను కాటకూరు శాసనంలో కులభూషణమని, “కులస్యభూషాయ మాణా మథ మైలమాఖ్యాం” అన్న వాక్యంలో ప్రశంసించారు. క్రీ.శ. 1239 నాటి వేల్పూరు శాసనంలో కాకతిగణపతి దేవుని శ్రీ పాద పద్మోపజీవి అంటే సేవకురాలు ఐతసానిని సుపుత్రి, కులదీపకురాలు అని పేర్కొన్నారు.

“నాగినాఇనికి బ్రమ్మసానికి సుపుత్రి కులదీపకుతాలైన యైతసానియు”

క్రీ.శ. 1248 నాటి వేల్పూరు శాసనంలో “వేల్పూరి వ్రిత్తి మంతులైన కూచెమనాహినికి బసెట్టికి సుపుత్రియైన అమరసానికి ఎఱ్ఱమనాహినికి సుపుత్రకులదీపకుణాలైన లోకసానికి”.

పైన చెప్పిన శాసన వాక్యాలలో దేవాలయ వృత్తులు నడిపే కుటుంబాలలోని స్త్రీలను రాజోద్యోగాలు చేసే స్త్రీలను సుపుత్రి కులదీపకుణాలు అని అనడం సమంజసం. వారి వల్లనే మాన్యాలు వంశపారంపర్యంగా కొనసాగుతున్నాయి.

ఆ రోజుల్లో స్త్రీలు దానాలు చేసి శాసనాలు వేయించినపుడు భర్త వంశ వర్ణనే కాక తమ పుట్టింటి వారి వంశాన్నీ వర్ణించేవారు. వారి దాతృత్వంవల్ల ఆ స్త్రీల తల్లిదండ్రుల వంశాలకీ శాశ్వతమైన కీర్తి లభించేది. కాకతి మైలమ దానాలనేకం చేసి వేయించిన శాసనాలవల్ల కాకతీయ వంశావళి వివరంగా తెలుస్తున్నది. ఆమె వేయించిన బయ్యారం శాసనం కాకతీయుల గురించి పరిశోధించేవారికి అమూల్యమైనది. కుందమాంబ, గణపాంబ మైలమ మొదలైన స్త్రీలెందరో వారి తల్లిదండ్రుల వంశాలను వారి దాన శాసనాలలో వర్ణించి ఆయా వంశాలకు చరిత్రలో చిరస్థాయి కల్పించడం వల్ల వారిని కులభూషణాలనీ, కులదీపకురాళ్ళనీ ప్రశంసించడం సమంజసం.

ఈనాడు వంశగౌరవాన్ని నిలబెట్టేవాడు కొడుకు అంటారు. కానీ ఆనాడు కీర్తైనా అపకీరైనా కొడుకు, కూతురు ఇద్దరి వల్లా కలుగుతుందని భావించేవారు.

కొడుకుచే నైనను గూ తు చేనైన
నడరి కీర్తియ కాని యపకీర్తి గాని
వచ్చు గోత్రమునకు వడి బెద్దలకును
జెచ్చెర గని జనుల్చెప్పెడి దెల్ల!

రంగనాథ రామాయణంలో రావణనితో అతని తల్లి కైకసి అతడు అపహరించిన సీతను రామునికి అప్పగించమని, యుద్ధం మానమని హితబోధ చేసే సందర్భంలో పై మాటలన్నది. అనేక దానధర్మాలు చేసి కీర్తిగడించిన కుప్పాంబకు తండ్రియైన గోన బుద్ధారెడ్డి కుమార్తెను దృష్టిలో పెట్టుకొనే కైకసి పాత్ర ద్వారా పైవిధంగా అనిపించి ఉండవచ్చు.

వంశం పేరు ప్రతిష్ఠలు నిలబెట్టడంలో కూడా కొడుకుకి, కూతురికి సమానమైన బాధ్యత ఉన్నదని ఆనాటి వారు గుర్తించారు కనుకనే కూతురి పెంపకంలోనూ ఆమెకివ్వవలసిన స్త్రీ ధనం విషయంలోనూ వారు శ్రద్ధవహించి ఉంటారని, వారు ఈనాటి వారి లాగా కూతురు పుట్టిందని బాధపడేవారు కాదు అని చెప్పవచ్చు.

పైన చర్చించిన అంశాలను బట్టి కాకతీయుల కాలంలో స్త్రీలు వారే వర్గానికి చెందినా సమాజంలో పురుషులతో సమానమైన స్థానాన్ని పొందారని, కుటుంబంలోనూ ఉన్నతస్థానాన్ని పొందారని చెప్పవచ్చును.

(సశేషం)

Exit mobile version