‘కాకతీయ యుగంలో స్త్రీల సామాజిక స్థితిగతులు – ఒక పరిశీలన’ -19

0
1

[డా. మంత్రవాది గీతా గాయత్రి గారు 1995లో పిహెచ్‍డి పట్టా కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖకి సమర్పించిన సిద్ధాంత వ్యాసాన్ని సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము.]

ప్రకరణం 6 – స్త్రీలు – విద్యలు – కళలు: మోదటి భాగం

[dropcap]ప్రా[/dropcap]చీన భారతదేశంలో విద్య రెండు విధాలుగా ఉన్నదని చెప్పవచ్చును. ఒకటి ఆధ్యాత్మిక విద్య, రెండవది లౌకిక విద్య. ఆధ్యాత్మిక విద్య అంటే వేదాలు, వేదాంగాలు, పురాణేతిహాసాలు, స్మృతులు, న్యాయం, ధర్మం నీతి మొదలైన వాని ననుసరించిన విద్య. ప్రాచీన కాలంనుండి వీటినన్నింటినీ నియతంగా అధ్యయనం చేయడం వల్ల ఆధ్యాత్మిక విద్య సజీవమై భారతీయ సంస్కృతికి ఆధార భూతమై నిలిచింది.

లౌకిక విద్య సంఘంలోని ఆర్థిక జీవనానికి సంబంధించినది. సంఘంలో ప్రతివ్యక్తి ఏదో ఒక విద్య నేర్చుకుని దాని నాధారం చేసుకొని జీవనం సాగించడాన్ని వృత్తి అని చెప్పవచ్చును. ఆ వృత్తికి కావలసిన పరికర సామగ్రీ, వాటి నుపయోగించే విధానం కూడా నేర్చుకోవాలి. దాన్ని నేర్పే విద్యనే వృత్తి విద్య అంటారు. వీటిని కూడా శాస్త్రాల మూలంగా నేర్చుకోవచ్చును. పూర్వకాలంలో విద్యాస్థానాలలో ఈ శాస్త్రాలు కూడా బోధింపబడేవి. కొన్ని వృత్తులు వంశపారంపర్యంగా సంఘంలోని ఆయా వృత్తి వర్గాలకు సంక్రమించేవి.

ప్రాచీనకాలంలో ఆధ్యాత్మిక విద్యకు అగ్రస్థానం లభించినట్లే కాకతీయుల కాలానికి కూడా వాటికి అగ్రస్థానమీయబడింది. ఆధ్యాత్మిక విద్యను బోధించే అగ్రహారాలు బ్రహ్మపురులు, ఘటికాస్థానాలు, దేవాలయాలు మఠాలు వంటి వాటికి రాజులు ప్రజలు కూడా దానాలు విరివిగా చేసి ప్రోత్సహించేవారు. అయినప్పటికీ సంఘంలో అధిక సంఖ్యాకులు, స్త్రీలు, శూద్రులు కనుక వీరికి సంబంధించిన లౌకిక విద్యకు కూడా ఆనాడు ప్రాధాన్యత ఇవ్వబడింది.

ఆధ్యాత్మిక విద్యను కొంత మంది మాత్రమే తమ ఆధీనంలో ఉంచుకొనడం వల్ల ఆ శాస్త్రాలవల్ల సంఘానికి గానీ ప్రజలకు గానీ ఎక్కువ మేలు జరుగలేదు. కానీ స్త్రీలు, శూద్రులు అవలంబించిన వృత్తి విద్యలు వంశపారంపర్యంగా నేర్వడం వల్ల క్రమంగా మార్పుచేర్పులతో కొత్తదనాన్ని సంతరించుకొని నిపుణత్వాన్ని సాధించినాయి. సంఘానికి ఉపయోగకరమైనాయి.

విద్య:

కాకతీయుల కాలంలోని స్త్రీలు విద్యనేర్చేవారా? ఏ ఏ వర్గాల స్త్రీలు విద్యనేర్చేవారు? ఏ విధమైన విద్యలను లేదా కళలను స్త్రీలు ప్రత్యేకంగా నేర్చేవారు? ఎక్కడ నేర్చుకొనే వారు? ఏ వయసులో నేర్చుకొనేవారు? వారు నేర్చుకొనే విద్య వారికి ఆర్థికంగా ఉపయోగపడినదా? అన్న ప్రశ్నలకు ఆ కాలంలోని శాసన సాహిత్యాధారాల సహయంతో జవాబులు తెలుసుకొవచ్చును.

కాకతీయుల కాలంలో స్త్రీలు విద్య నేర్చారని ఆనాటి శాసనాలను బట్టి చెప్పవచ్చును. కానీ వారందరూ రాజ సామంత కుటుంబాల స్త్రీలు, కాకతీయులలో పూర్వరాజులు మొదటి ప్రోలరాజు వరకు జైన మతాన్ని ఆదరించిన వారు. జైనులు విద్యాప్రియులు. ముఖ్యంగా ఆంధ్రదేశంలో వర్ధిల్లిన యాపనీయ శాఖ జైనులు స్త్రీ పురుషులకు విద్యాబోధ చేసేవారు. ఆనాటి ప్రముఖ విద్యా కేంద్రాలలో ఆలంపూరు కూడా ఒకటి. అక్కడి బ్రహ్మేశ్వరాలయానికి చెందిన క్రీ.శ. 1101 నాటి శాసనాలలో విద్యావతులైన స్త్రీల ప్రసక్తి ఉన్నది. అందులో ఒక శాసనం రాణీ మన్నాదేవి వేయించిన శాసనం. ఈమెకు అభినవ సరస్వతి అన్న బిరుదున్నట్లు శాసనంలో చెప్పబడింది. ఇంకొకటి రాణి చందలదేవి వేయించిన క్రీ.శ. 1107 నాటి శాసనం. ఈమెకు కూడా అభినవ సరస్వతి అన్న బిరుదున్నట్లు పై శాసనంలో ఉన్నది. దాన్ని బట్టి ఆలంపూరులో ఉన్న విద్యా సంస్థలో వీరు విద్య నేర్చి పండితురాండ్రై అభినవ సరస్వతి అన్న బిరుదులు సంపాదించారని చెప్పవచ్చును.

తెలంగాణంలోని ప్రాచీన జైన క్షేత్రాలలో హనుమకొండ ఒకటి. ప్రస్తుతం పద్మాక్షిగుట్ట అని పిలవబడే ప్రదేశంలో పూర్వం అంటే కాకతి రెండవ ప్రోలుని నాటికి ‘కడలాలయ’ బసది ఉండేది. అక్కడ జైనదేవత పద్మావతి అనే పార్శ్వనాధ జైన తీర్థంకరుని శాసనదేవి ప్రతిమ ఉండేది. ఈ బసదిని కాకతి ప్రోలుని మంత్రి బేతదండాధి నాధుని భార్య మైలమ కట్టించింది. ఆమె భర్త బేతన ఆ బసదికి దానాలు చేశాడని క్రీ. శ. 1171 నాటి హనుమకొండ శాసనాన్ని బట్టి తెలుస్తున్నది. ఈ బసది విద్యా కేంద్రంగా కూడా ఉండేది. ఇటు వంటి బసదిని కట్టించిన మైలమ విద్యాధికురాలు అయి ఉండేదని ఊహించవచ్చును. జైనులు విద్యాప్రియులవడం, మైలమ జైన బసదిని కట్టించడం, ఆ బసది విద్యాకేంద్రం కావడం పై ఉహకు హేతువులు. కాకతీయులు మొదట జైన మతాభిమానులు కనుక కాకతీయుల ఆడపడుచులు కూడా విద్య నేర్చి ఉంటారని చెప్పవచ్చును. విద్య నేర్చిన స్త్రీలు స్వతంత్రంగా ధర్మకార్యాలు చేయడం, కవులను పోషించడం చేయగలుగుతారు. తమకు విద్య లేకపోతే ఆ స్త్రీలు కవులను పండితులను ఆదరించడం జరగదు. కాకతీయుల నాటి శాసనాలలో కొందరు స్త్రీలను పండితులు ప్రశంసించే వారనీ ఉన్నది.

పానుగల్లు శాసకులైన భీమ, గోకర్ణ, ఉదయాదిత్యుల తల్లి అయిన మైలాంబను విబుధులు ‘వాగ్దేవి’ అని కీర్తించారు.

క్రీ.శ. 1170 నాటి మోపఱ్ఱు శాసనంలో పడవాలు గొంకని భార్య గోకాంబిక తల్లి సూరమాంబ ‘సూరివినుతా’ అంటే ‘పండితులచేత పొగడబడేదానా!’ అని ప్రశంసింప బడింది. వెలనాటి గొంక నృపతికి సేవకుడైన పడాలుచోడుని భార్య కట్టాంబ పండితులను పోషించింది. ఆమెను ‘బుధజన పోషణరతా’ అని అక్కడే ఉన్న మరొక శాసనంలో ప్రశంసించారు.

కాకతీయుల ఆడపడుచు, కాకతి గణపతిదేవుని సోదరి అయిన కాకెత మైలమాంబ తన గురువైన ధర్మశివాచార్యులకు కోటగడ్డలో కొంత భూమిని దానం చేసి శాసనం వేయించింది. దాన్ని బట్టి ఆమె గురువు నుండి ఉపదేశం పొంది శైవాగమ విద్య నేర్చిందని గ్రహించవచ్చును.

కాకతి గణపతి దేవుని, గురువైన విశ్వేశ్వరశివాచార్యులు స్థాపించిన గోళకి మఠము ప్రసిద్ధమైన పాశుపత కేంద్రమే కాక వేద శాస్త్ర ఆగమ విద్యాలయంగా కూడా ప్రసిద్ధి చెందినది. కాకతి రుద్రమకు దీక్ష నిప్పించిన గురువు విశ్వేశ్వర శివాచార్యులకు ఆమె మందడ గ్రామాన్ని విద్యార్థులకు, అధ్యాపకులకు వసతులు, సత్రము నిర్మించడానికై దానం చేసింది. రుద్రమ విద్యాధికురాలే కాక విద్యాభివృద్ధికై పాటు పడిందని పై విషయాలను బట్టి చెప్పవచ్చును.

రాజకుటుంబాల స్త్రీలు – విద్య:

అంతే కాదు రాజకుటుంబాల స్త్రీలు విద్యలు నేర్చేవారని కూడా గ్రహించవచ్చును. బ్రాహ్మణ స్త్రీలు రామాయణ భాగవతాది గ్రంథాలు, పురాణాలు చదివేవారు. ఉన్నత వర్గాల స్త్రీలు ముఖ్యంగా క్షత్రియ స్త్రీలు విద్యనేర్చేవారు. రాజ, సామంత కుటుంబాల స్త్రీలు రాజనీతి యుద్ధవిద్య నేర్చేవారు. పై శాస్త్రాలు చదవాలంటే వారికి సంస్కృత భాషా జ్ఞానం తప్పని సరి కనుక వారు విధిగా సంస్కృతము, పైన చెప్పిన శాస్త్రాలు నేర్చేవారని ఊహించవచ్చును. కనుకనే ఆనాడు ఆ కుటుంబాలలోని స్త్రీలు వేయించిన శాసనాలు సంస్కృతంలో ఉన్నాయి. ఆ స్త్రీలు దానాలు చేసి శాసనాలు వేయించినపుడు రాజభాషలో లేదా తమకు అర్థమయే భాషలో వేయించటం కద్దు వారు సంస్కృతంలో శాసనాలు వేయించారు కనుక, వారిని సంస్కృతం నేర్చి ఉంటారని గ్రహించవచ్చును.

కాకెత మైలమ వేయించిన బయ్యారం, ఇనుగుర్తి, కోటగడ్డ నామాల పాడు, త్రిపురాంతకం శాసనాలు కుందమాంబ (కాకతిగణపతి దేవుని సోదరి) వేయించిన నిడిగొండ కుందవరం శాసనాలు, గోన బుద్ధారెడ్డి కూతురు, మల్యాల గుండన భార్య అయిన కుప్పమాంబ వేయించిన బూదపూరు శాసనం, కోటగణపాంబ వేయించిన యనమదల, మొగలుట్ల శాసనాలు, మల్యాల చౌండసేనాని భార్య మైలమ వేయించిన కటకూరు శాసనం. సంస్కృతభాషలో రచింపబడి, చక్కటి కవిత్వంలో కూడుకొన్నవి. వీటిని రచించిన వారు ఆనాడు పేరుగాంచిన విద్వత్కవులు. మైలమాంబ వేయించిన శాసనాల రచయిత రామదేవుడు. కుందమాంబ వేయించిన శాసనాల కవి బాల భారతి. కుప్పాంబ వేయించిన బూద పుర శాసనకర్త రెండవ ఈశ్వర భట్టోపాధ్యాయుడు. కాకతి రుద్రాంబ వేయించిన మల్కాపుర శాసనం సంస్కృతంలో రచింపబడినదే.

రాజకుటుంబాల స్త్రీలు, ఉన్నత వర్గాలకు చెందిన స్త్రీలు రాజనీతి, యుద్ధ విద్య అశ్వారోహణం నేర్చుకొనే వారని ఆనాటి సాహిత్యాన్ని బట్టి చెప్పవచ్చును. పలనాటి వీర చరిత్రలో నాయకురాలు నాగమ్మ యుద్ధ తంత్రంలో, రాజనీతిలో ఆరితేరిన మహిళ నలగామరాజుకు సలహాలు చెప్పి, మంత్రాంగం నిర్వహించి, స్వయంగా అశ్వాన్నధిరోహించి కత్తిని పూని యుద్ధం చేసింది. ఆశ్వికులను, దళాలను సిద్ధం చేసింది. పొరుగున ఉన్న రాజులందరీకీ లేఖలు వాసి సహాయం కోరి, నలగామరాజు పక్షాన వారందరూ యుద్ధం చేసే విధంగా ఏర్పాటు చేసింది. ఈ రాజనీతి కుశలత, యుద్ధవిద్య అధికారం సంపాదించగానే ఒక్కసారిగా వచ్చేవి కావు. చిన్నప్పటినుంచి అభ్యసించవలసినవే, కనుక ఆ నాటి స్త్రీలు కొందరు పై విద్యలను చిన్నప్పటి నుండే అభ్యసించేవారిని భావించాలి. బ్రహ్మనాయని తల్లి శీలమ కూడా రాజనీతి తెలిసిన స్త్రీయే. పలనాటి బ్రహ్మ నాయుడు ఏ కార్యానికైనా ముందర తల్లి అనుజ్ఞ సలహా తీసుకోనిదే చేయడు. ఆ కారణం చేతనే కోడలు ఐతాంబ కూడా అత్త శీలమను అడగనిదే ఏ పనీ చేయలేదు. నాయకుడు, మంత్రి అయిన బ్రహ్మనాయనికి రాజనీతి నుపదేశించ గలిగిన శీలమ రాజనీతికి సంబంధించిన శాస్త్రాలను అభ్యసించి ఉండాలి. చదువులేని స్త్రీ ఆ విధంగా రాజనీతిని బోధించలేదు.

అశ్వారోహణ కూడా ఉన్నత రాజ కుటుంబాల స్త్రీలు నేర్చేవారు. రుద్రమదేవి స్వయంగా అశ్వాన్నధిరోహించి యుద్ధాలలో పాల్గొన్న దన్నది ప్రసిద్ధమైన విషయం. నాయకురాలు నాగమ్మ అశ్వాన్ని అధిరోహించి యుద్ధం చేసిందని, నలగామరాజు కుమారై అలరాజు భార్య పేరిందేవి భర్త శవాన్ని పల్లకీలో ఉంచి అశ్వారూఢయై గుడిపాడు వెళ్ళిందని పలనాటివీరచరిత్రలో ఉన్నది. దీన్ని బట్టి ఆ కాలంలో రాజకుంటుంబాల స్త్రీలు రాజ్యం చేసినా చేయకపోయినా అశ్వారోహణ నేర్చుకొనేవారని తెలుస్తున్నది.

ఆ రోజుల్లో కొందరు స్త్రీలు గజసాధన, గజారోహణం వంటివి కూడా నేర్చి ఉండవచ్చు. రామప్ప దేవాలయంలో దీర్ఘ చతురస్రాకారపు శిలాఫలకాలపై చెక్కబడిన బొమ్మలలో ఒక స్త్రీ ఏనుగులతో పోరాడినట్లు, ఒక చేతిలో కత్తి, మరొక చేతిలో డాలుతో నిగ్రహించినట్లు ఉన్నది.

రాజకన్యలకు సామాన్యంగా బాలికలు నేర్వదగిన విద్యలు మొదట నేర్పి, ఆ తర్వాత యుద్ధవిద్య, రాజ్యపాలనలలో శిక్షణ ఇచ్చి ప్రవీణలనుగా చేసేవారు. రాణీ రుద్రమదేవి, కోట గణపాంబలకు కాకతి గణపతిదేవుడు అటువంటి శిక్షణ ఇవ్వడం వల్లనే వారు సమర్థతతో రాజ్యాన్ని ఏలారు. తండ్రి వలె రుద్రమ కూడా ప్రజాహిత కార్యాలను చేపట్టి ప్రజారంజకంగా పాలించి పాశ్చాత్యుల మన్ననలను పొందగలిగిందంటే ఆనాడు బాలికలకు ఏ విధమైన విద్య నేర్పేవారో గ్రహించవచ్చును.

బ్రాహ్మణ కుటుంబాలలో స్త్రీలు – విద్య:

బ్రాహ్మణ బాలికలకు చిన్న తనంలోనే వివాహం జరిగేది. ఆ కాలంలో బాల్య వివాహలు ఎక్కువగా జరిగేవి. అందునా బ్రాహ్మణ బాలికలకు చిన్న వయసులోనే జరగాలని ధర్మశాస్త్రకారులు నిర్దేశించారు. చదువు పూర్తి చేసుకున్న పురుషుడు బాలికను వివాహం చేసుకొనేవాడు. ఇంతకుముందు స్త్రీలకు ఉపనయనానికి బదులుగా వివాహం జరిగేదని చెప్పడమైంది. గురువు వద్దకు శిష్యుడు వెళ్లినట్లు బ్రాహ్మణ స్త్రీ భర్త ఇంటికి వెడుతుంది. ఎనిమిదేళ్ళ వయసులోనే వివాహం జరగడం వల్ల విద్య నేర్చే అవకాశం లేదు. కానీ ఆనాడు విద్యలు ముఖతః నేర్చుకొనేవారు. తండ్రి గానీ భర్త గానీ శిష్యులకు బోధించే సమయంలో బహుశ విని నేర్చుకొనే వారేమో? రామాయణ, మహభారతాది కథలు చదవడం పురాణాలు చదివి అర్థం చేసుకోవడం వంటివి వారు నేర్చిన విద్యలు. క్రీడాభిరామంలో ఒకరాయ వితంతువు విద్ధికంచి రామాయణం ఆరుకాండలూ అచ్యుతజాగరణ వేళ మనోహరంగా పాడిందని ఉన్నది.

స్త్రీలు – కవిత్వం:

ప్రతాపరుద్ర చరిత్రలో కుమ్మరి మొల్ల ప్రసక్తి వచ్చింది. ప్రతాపరుద్రుని సభకు కుమ్మరి మొల్ల వచ్చి తాను రచించిన వచన రామాయణ కావ్యాన్ని చదువుతానని అందులో ఒక పద్యాన్ని చదివింది. అక్కడి వారికి ఆమె కవిత్వం శూద్ర కవిత్వం కనుక నిషిద్ధమైంది. కానీ ఆ కావ్యం రాసింది స్త్రీ కావటంలో ఆ సభవారు ఆశ్చర్యం ప్రకటించలేదు. ఆ కారణంగా దాన్ని కాదనలేదు. అంటే ఆనాటి స్త్రీలు విద్యావతులు, కవయిత్రులు కూడా అయివుండేవారు. కానీ వారి పాండిత్యం, కవిత్వం రాజసభల వరకు రాక ఎక్కువగా గృహసీమలకే పరిమితమై ఉండేది. పైగా వారి విద్య మౌఖికంగానే ఉండేది కాబోలు. జానపదగేయాలు, దంపుళ్ళపాటలు, జాజర పాటలు, హరతి పాటలు ఇత్యాది రూపాల్లో మనకు స్త్రీల కవిత్వం కనిపిస్తుంది.

ఆ రోజుల్లో కవులు వేరు, లేఖకులు వేరుగా ఉండేవారు. స్త్రీలకు వారి గృహకార్య నిర్వహణలో సమయం చిక్కక లేఖనం నేర్చుకొనే అవకాశం లేక వారి కవిత్వాన్ని గ్రంథస్థం చేసి ఉండరుగానీ స్త్రీలలో కవయిత్రులు లేక కాదు. ఆనాటి స్త్రీల రామాయణం పాటల్లోనూ, జోలహారతి పాటలలోనూ, వారి కవిత్వం పాండిత్యం ప్రతిబింబిత మౌతుంది. వారు స్వయంగా గ్రంథస్థం చేయకపోయినప్పటికీ వారి పుత్రులు కవులు, పండితులైనపుడు వారి తల్లుల ద్వారా విన్న కథలనుసరించి పాండిత్యాన్ని తమ కావ్యాలలో నిక్షిప్తం చేసి ఉండవచ్చును.

భాస్కర రామాయణంలో శ్రీరాముడు వనవాసానికి తల్లి అనుజ్ఞ వేడినపుడు కౌసల్య అతనికి రక్ష గట్టి హారతి ఇచ్చి దీవెనలిచ్చినప్పటి కవిత్వంలో ఆనాటి స్త్రీల మంగళ హరతి పాటల ఛాయలు కనబడతాయి.

అఖిల దేవతలు వృత్రాసురు గెలువ బో
నెస గంగ నింద్రునకొసగు శుభము
నమృతంబునకు నే గునప్పుడు
వినత విహంగాధి పతికిచ్చు మంగళంబు
ఘనత సురలెల్లనాత్రివి క్రమున కెలమి
మహిమనిచ్చిన యట్టి యామంగళంబు
నింపు సొంపార పుత్ర గానిమ్ము నీకు

రంగనాధ రామాయణంలోనూ ఈ సందర్భంలో కౌసల్య ఇదే విధంగా రామునికి మంగళం చెప్పింది.

పలనాటి వీర చరిత్రలో ఐతాంబ బాలచంద్రుని దీవించిన విధము.

“సురనాధు విభవంబు సొంపొప్పగలుగు
వీర భద్రుని సాటి విజయంబు గలుగు
వినత పుత్రుని వంటి వేగంబుగలుగు
రఘరాముకెన యైన రాజసమెప్పు
పవన పుత్రుని వలె బలియుడవగుము”

పైన ఉదహరించిన కవిత్వం సీసపద్యంలోనూ ద్విపద రూపంలోనూ ఉన్నది. స్త్రీల పాటలు ఎక్కువగా లయ ప్రధానమైనవి. అవి ద్విపద, తరువోజ, సీస పద్యాలలో చక్కగా ఒదుగుతాయి. పై కావ్యాలు రచించిన కవులు తమ తల్లుల మంగళ హరతి పాటల వంటి వాటినే గ్రహించి పై విధంగా గ్రంథస్థం చేసి ఉండవచ్చు.

బ్రాహ్మణ స్త్రీలు పాడుకునే అక్కల కామేశ్వరీ పాటలో కూడా చక్కని కవిత్వం, లయ జ్ఞానం ప్రకటితమౌతాయి.

“పొడవైన మెఱు గుల ప్రోవు చందమున
పెడతల జనియించె బెరవాణియన గ
శిరమున జనియించె శివవాణియన గ
కొప్పున జనియించె కొండ వాణన గ
ఒకరిపై మోహించి యూరక బ్రమసి
తిక మకలను బొంది తిరుగుచుండుదురు
కోమలి యిటువంటి కూతులేమిటికి
పోదము రమ్మనీ పుర హరుండప్పుడు
మవ్వంపు జీరెలు మంచి సొమ్ములును
పువ్వులు గంధ కర్పూరంబు లొస గి”

పై కామేశ్వరి పాట స్త్రీలు అక్కల కామేశ్వరి వ్రత సందర్భంగా పాడుకునే పాట కనుక ఈ కవిత్వం కూడా స్త్రీలు అల్లినదేనని భావించవచ్చును.

రణ తిక్కన తల్లి ప్రోలమ, భార్య జానమ కూడా కవయిత్రులేనని, శత్రువులకు వెన్ను చూపి యుద్ధరంగం నుంచి మరలి ఇంటికి వచ్చిన తిక్కనను పరుషంగా మాటలని అతనికి పౌరుషం తెప్పించి యుద్ధోన్ముఖుని చేశారని ఐతిహ్యం ప్రచారంలో ఉన్నది. ఈ సందర్భంగా వారు చెప్పినవన్న పద్యాలు ఇవి:

తిక్కన భార్య జానమ భర్తతో

‘పగఱకు వెన్నిచ్చినచో
నగరే నిను మగతనంపు నాయకులెందున్
ముగురాడ వార మైతిమి
వగపేటికి జలక మాడ వచ్చిన చోటన్’.

~

ప్రోలమ కొడుకు తిక్కనతో

‘అసదృశముగ నరి వీరుల
మసిపుచ్చక విఱిగి వచ్చు మగ పందక్రియన్
కసవున్ మేయగ బోయిన
పసులున్ విఱిగినవి తిక్క పాలున్ విఱిగెన్’

అని అన్నది. పై పద్యాలు ఆశువుగా, యుద్ధానికి ప్రేరణనిచ్చే విధంగా చెప్పగలిగారంటే వారిద్దరూ బాగా కవిత్వం పాండిత్యం నేర్చిన వారని భావించవచ్చును.

మధ్యయుగంలో సాంసారిక జీవితం గడిపే సామాన్య స్త్రీలకు బ్రాహ్మణ క్షత్రియులు తప్ప తక్కిన జాతుల స్త్రీలకు విద్య అనవసరమనే అభిప్రాయం వ్యాప్తిలో ఉండేది.

వాత్స్యాయనుడు తన ‘కామసూత్ర’మన్న గ్రంథంలో స్త్రీలు కామ సూత్రాలు, దానికి సంబంధించిన అంగాలు (అంటే చతుషష్టి కళలు) యుక్తవయసు రాకముందే నేర్వాలని అన్నాడు. కన్యగా తండ్రి ఇంట్లో ఉన్నపుడు లేదా వివాహమైతే భర్త అనుమతితో ఈ విద్యలు నేర్చుకోవాలని అతడు నిర్దేశించాడు. వీటన్నిటిని వేశ్యల మాతలు వేశ్యలకు యుక్తవయసు రాక ముందే నేర్పించేవారని కేతన దశకుమార చరిత్రలో మాధవసేన అనే వేశ్యమాత రాగమంజరి అనే తనకుమార్తెను పెంచిన విధం చెప్పిన ఉదంతాన్ని బట్టి తెలుస్తుంది.

అయితే వాత్స్యాయనుడు వీటిని స్త్రీలందరూ నేర్వాలని నిర్దేశించాడు. ఆ విద్యలలో గానం, నృత్యం చిత్రకళ మొదలైన వానితో పాటు ప్రహేళికలు, పుస్తక వాచన, కావ్య సమస్యా పూరణాలు, నిఘంటువు, ఛందస్సు వంటి వాటిలో జ్ఞానాన్ని స్త్రీలు సంపాదించాలని అతను నిర్దేశించాడు. పై వానిలో జ్ఞానాన్ని సంపాదించడమంటే విద్య నేర్చు కోవడమే గాదు కొంత పాండిత్యం కూడా అవసరమే. దీన్ని బట్టి పూర్వ కాలంలో స్త్రీలు విద్య నేర్చినవారేగానీ బ్రిటిష్ ఇండియా నాటి స్త్రీలలాగా విద్యాగంధం లేనివారు కాదు.

కాకతీయుల కాలానికి వాత్స్యాయనుని కామసూత్రలో చెప్పిన దాన్ని నుసరించి రాజ సామంతాది ఉన్నత వంశాల కుల స్త్రీలు, బ్రాహ్మణ స్త్రీలు, వేశ్యలు, దేవాలయాలలోని సానులు పై విద్యలను నేర్చారని నాటి సాహిత్యం బట్టి తెల్లమౌతుంది.

కామ సూత్రాలలో వాత్స్యాయనుడు స్త్రీలు నేర్చుకొన దగినవని తెలిపిన విద్యలు:

  1. చదువు
  2. వ్రాత
  3. గణితము
  4. సంగీతము
  5. నాట్యము
  6. వాద్యప్రవీణత
  7. చిత్ర లేఖనము
  8. చేతి పనులు

~

  1. విగ్రహాలను పూవులతో అలంకరించి, నైవేద్యం పెట్టటం
  2. నేలపై పిండితో విగ్రహములేర్పరచటం (ముగ్గులు పెట్టడం)
  3. దంతాలకు, వస్త్రాలకు, తలవెండ్రుకలకు, గోళ్ళకు శరీరానికి రంగులు వేయడం (శరీరంపైన మకరికా పత్రాలు రచించటం కూడా అటువంటిదే అయివుంటుంది.)
  4. జపమాలలు, పూలమాలలు హరాలుగా గుచ్చటం
  5. దారంతో గానీ, నారితోగానీ చిలుకలను పువ్వులను, గుత్తులను తురాయిలను, తలగడ కుచ్చులను తయారు చేయటం.
  6. బొమ్మలను విగ్రహాలను నిర్మించడం
  7. పానీయాలు, వంటలు తయారు చేయటం
  8. ఆభరణాలు వస్త్రాలు ఇతరులకి అలంకరించటం
  9. మాట్లాడటంలో మెలకువలు గ్రహించటం
  10. సాధారణ పరిజ్ఞానం
  11. పొడుపుకథలు, పద్యాలు నేర్వటం, వినోదక్రీడలు
  12. శరీర వ్యామాయం, కత్తి కర్ర, విల్లు, బాణము వీనినుప యోగించే నేర్పు సంపాదించటం

పైన చెప్పిన విద్యలలో చదువు అన్నది కాకతీయుల కాలానికి కూడా రాజ సామంత కుటుంబాల వారే నేర్చేవారు. సంగీతం, నాట్యం, వాద్య ప్రవీణత, చిత్రలేఖనం అన్న విద్యలు భోగస్త్రీలు, వేశ్యలు నేర్చేవారు. చేతి పనులు అన్నవి దాసీ వృత్తిని చేపట్టినవారు నేర్చేవారు. ఈ పనులను వృత్తులుగా స్వీకరించిన స్త్రీలు ఆనాడు చాలామంది ఉండేవారు. వీటిని గురించి ‘స్త్రీలు- వృత్తులు’ అన్న ప్రకరణంలో వివరించాను. శరీర వ్యాయామం, కత్తి, కర్ర విల్లు బాణం వంటి వాని నుపయోగించే విద్య రాజకుటుంబాల స్త్రీలు నేర్చేవారు. అంతఃపురాలలో కావలి కాచే స్త్రీలు బహుశా నేర్చి ఉండవచ్చును. వ్రాత గణితం అన్నది, విగ్రహలను నిర్మించడం కాకతీయుల కాలంలో స్త్రీలు నేర్చినట్లు సాహిత్యంలో ఎక్కడా కనిపిచదు. మాట్లడటంలో మెలకువలు గ్రహించడం, పొడుపుకథలు, పద్యాలు నేర్వడం, వినోదక్రీడలు వంటివి రాజ కన్యలకు చెలికత్తెలుగా ఉండే వారు నేర్చేవారని ఊహించవచ్చును. దీనిగురించి ‘స్త్రీలు- వృత్తులు’ అన్న ప్రకరణంలో నిరూపించాను.

నృత్యం:

కాకతీయుల కాలంలో సాహిత్యంలో మార్గ దేశి భేదాలున్నట్లే సంగీత నాట్యాదులలో కూడా మార్గ దేశి పద్ధతులుండేవి. ఎప్పుడూ విద్వాంసులు మార్గ పద్ధతిని, సామాన్య ప్రజానీకం దేశ పద్ధతిని అభిమానిస్తారు. కాకతీయుల కాలంలో సంగీత నృత్యాలలో దేశి పద్ధతులకే ఎక్కువ ప్రోత్సాహం లభించింది. కాకతీయ చక్రవర్తులు ప్రజారంజకులు, శైవమతావలంబులు అవడం అందుకు కారణం కావచ్చును. శైవ మతం జైన బౌద్ధ మతాలవలె పురుష వివక్షలేని, కులవర్గ రాహిత్య సమసమాజ నిర్మాణానికై చేసిన ప్రయత్నంలో భాగంగా కవిత్వ, సంగీత, నృత్యాదికళల్లో దేశి పద్ధతికి ప్రోత్సాహం లభించింది. విశ్వేశ్వర శివాచార్యుల వంటి శైవ మతగురువులు, కాకతీయ చక్రవర్తులు వారి మాండలికులు ఈ దేశ సంప్రదాయాల్ని ప్రోత్సహించడం వల్ల ప్రజాసామాన్యం స్త్రీ పురుష భేదం లేకుడా అందరూ ఈ కళలను నేర్చి తమ వృత్తులుగా చేసుకున్నారు. తర తరాలనుంచీ క్రింది వర్గాలలో ప్రజల ఆదరణకు అభిమానానికి పాత్రమైన ఎన్నో కుటుంబ విద్యలు కాకతీయుల కాలంలో మాన్యత పొందినాయి. దేవాలయాలు ప్రజల ఆధ్యాత్మిక జీవనానికే కాక అన్నికళలకు వృత్తులకు ఆధార కేంద్రంగా ఉండేవి. ఆనాటి శైవ మఠాలు కూడా ఈ దేశి ప్రక్రియకు చెందిన కళలను ప్రోత్సహించాయి. కాకతీయ గణపతి దేవుని బావమఱది జాయపనాయకుడు తన గ్రంథం ‘నృత్త రత్నావళి’లో ఎన్నో దేశీ ప్రక్రియలకు చెందిన నృత్యాలను పేర్కొన్నాడు. అదే విధంగా ఆ నాటి కావ్యాల్లో కూడా మార్గ దేశి ప్రక్రియకు చెందిన నృత్య సంగీత భేదాలు పేర్కొన బడినాయి.

ముఖ్యంగా దేశి ప్రక్రియకు చెందిన నృత్యాలుగా జాయపసేనాని పేర్కొన్న నృత్యాలు ఆనాటి సాహిత్యంలోనూ ఎక్కువగా ప్రసక్తమైనాయి. మొదటగా నృత్యం గురించి వివరించబడుతుంది. నర్తకి లక్షణాలు నర్తకులలో భేదాలు వారికీయవలసిన శిక్షణ నృత్యం చేయదగిన సమయం మొదలైన అంశాలు ఆ తరువాత అభినయం నృత్తనృత్యాలకు నిర్వచనాలు, మార్గదేశీ నృత్తాలకు ఉన్న భేదం వివరించబడుతుంది.

నర్తకి లక్షణాలు:

నర్తకినే పాత్ర అని కూడా శాసనాలలో పేర్కొనేవారు. పిల్లలమఱ్ఱి శాసనంలో పాత్రలకు ఇళ్లను ధారాదత్తం చేసినట్లు కానవస్తుంది. రూపము, యౌవనము, లావణ్యము, నృత్తవిద్య వీనికి ఆశ్రయమై ఉండడంచేతను, నేత్రానందమనే అమృతం తాగవలసిన పాత్రమవటంవల్ల నర్తకిని పాత్రమంటారని జాయన నృత్తరత్నావళిలో పేర్కొన్నాడు.

రూప యౌవన లావణ్య నృత్త విద్యాశ్రయత్వతః
నేత్రానంద సుధాపాన భాజన త్వాచ్ఛ నర్తకీ
ఉపచార ప్రయోగజ్ఞేః పాత్ర మిత్యభిధీయతే

ఉత్తమ నర్తకికి ఉండవలసిన లక్షణాలు:

పలచని (సన్నని) దేహం కలిగి, ప్రాయం, లావణ్యం, భాగ్యం సౌభాగ్యం అనే వాటికి నెలవై ఉండాలి. సత్కులంలో పుట్టి, రూపం, సంపద కలిగి గ్రహణధారణలలో సమర్థత, ప్రతిభ కలిగి రసభావాలు తెలిసి, ఉత్సాహం, కుతూహలం కలిగి ఉండాలి. కళలు తెలిసినది, విధేయములైన అవయవములు కలిగినది అంటే శరీరావయవాల్ని సునాయాసంగా కదిలించ గలిగి ఉండాలి. తియ్యని కంఠస్వరం కలిగి, సత్తువ కలిగి ఉండాలి.

దేహవర్ణం చామనచాయ లేదా బంగారుచాయ కలిగి ఉండాలి. ఆరోగ్యవతియై చక్కని కనుపాపలు కలిగి ఉండాలి. లాఘవం కలిగి, శ్రమలేకుండా, సభలో ధైర్యంగా, తాళగ్రహాలలో చతురురాలై, గీతవాద్యాలలో నేర్పరియై, అవధానం కలిగి ఉండాలి. ఎక్కువ లావుగానీ, సన్నంగానీ కాక, ఎక్కువ పొడుగు, పొట్టి కాని శరీరంతో, వినయం, ఔదార్యం, లజ్జ వంటి మంచిగుణాలతో అలంకృతయై ఉండాలి. మంచి మనసు, శుద్ధమైన లక్షణాలు కలిగి, నవ్వుతూ మాట్లాడగలదై ఉండాలి.  నాట్యవిద్యలో నేర్పరియై అంటే అంగాలు, ఉపాంగాలు, చారులు, స్థానకములు, మండలాలు, పాటములు, అంగహారాలు, లాస్యాంగాలు, భ్రమరులు, కరణాలు, మార్గదేశి పద్ధతుల ప్రయోగాలు ఇవన్నీ స్పష్టంగా తెలిసినదై ఉండాలి. కోరిన ప్రయోగాన్ని అప్పటికప్పుడే చేసి చూపగలదై ఉండాలి.

పైన చెప్పిన లక్షణాలు ఉన్న నర్తకి ఉత్తమ నర్తకిగా భావించబడి మన్ననలనందుకుంటుంది. కొప్పరం కోదండ రామాలయంలోని శాసనంలోని నర్తకి పద్మావతి ఇటువంటి నర్తకి కావడం వల్లనే ఆమెకు నర్తకీ తిలకమనే బిరుదు, తక్కిన వారికంటే ఎక్కువ భూమి లభించాయి. ‘

నర్తకులలో భేదాలు:

నర్తకి అయిన శ్రీ గాయని కూడా అయితే ఆమె భోగిని అవుతుంది. కాకుంటే ఆమెను పాత్ర అంటారు.

నర్తకీ గాయనీ స్యాచ్చేత్ భోగినీ, పాత్రమన్యథా (?)

నృత్తారంభం – శిక్షాపద్ధతి

నృత్యం చేయదగిన ప్రదేశాలు:

జాయప తన నృత్యరత్నావళిలో ఏ ఏ ప్రదేశాలలో నృత్యం చేయవచ్చునో తెలిపాడు.

సౌధే కేలివనే రమ్యే శాద్వలేనృత్య వాశుభే
స్థానే యోగ్యా విధాతవ్యా, వితానాది విచిత్రితా
స్థిరా శ్లక్ణా సమాగౌరీ కృష్ణావా రంగ భూర్మతా

మేడలో, కేళీవనంలో, రమ్యమైన పచ్చిక బయలులో, శుభమైన ఏ చోటనైనా గానీ అభ్యాసం చేయవచ్చును. రంగభూమి మేల్కట్టు మొదలైనవానితో అలంకృతమై గట్టిదై, నున్ననై, సమమై, తెలుపు నలుపులలో ఏదో ఒక వన్నె కలిగి హేమంత శిశిరాలలో వెచ్చగానూ, వసంత గ్రీష్మాలలో చల్లగానూ, వర్షశరదృతువులలో సామాన్యంగానూ ఉండాలి.

నాట్యశిక్షణ ప్రారంభం:

బాలికకు ఆరేడేళ్ళ ప్రాయం ఉండాలి. రజోదర్శనం లేని గౌరి లేదా రజోదర్శన ముపక్రమించిన రోహిణి అయిన కన్యకకు దిట్టమైన అర్థోరుకం అంటే చల్లడాన్ని తొడిగించి సాధన నేర్పాలి. స్తనోద్గమమైన బాలికకి రవిక తొడిగించాలి.

రిక్తతిథి తప్ప అన్ని తిథులలోనూ, బుధ, గురు, శుక్రవారాలు, హస్త, శతభిష, పుష్యం, అనూరాధ, ఉత్తర, ఉత్తరాషాఢ, ఉత్తరా భాద్ర, ధనిష్ఠ, రేవతి, జ్యేష్ఠ, అనే నక్షత్రాలు, నృత్తారంభానికి ప్రశస్తమైన రోజులు.

గణపతిని, బ్రహ్మ, విష్ణువు మొదలైన దేవతలను, సరస్వతిని, చండికను, సప్తమాతృకలను, ఇలవేల్పును, అన్ని వాద్యాలను, తాళమును, దండికను, రెండు కంబాలను, రంగభూమిని, ఉపాధ్యాయుని, కన్యకను, యథావిధిగా తెల్లని గంధపుష్పాక్షలతో, వస్త్రాలతో, ధూపాలతో, ఆరతి దీపాలతో పలువిధముల నైవేద్యాలతో బ్రాహ్మణుని చేత పూజ చేయించాలి.

హస్తాభ్యాం దండికాం ధృత్వా నర్తకీ స్థైర్యసిద్ధయే
ఆచార్యస్యోపదేశేన మార్గదేశీ విభాగతః
స్థానాదీన్ సుకరానాదౌ ప్రయోగాన్ దుష్కరాన్ తతః
అభ్యస్యేత్ శనకైర్నిత్యం యథాశ్రాంతిర్నజాయతే
బుద్ధ్వాసిద్ధాన్ ప్రయోగాంస్తాన్ తాలైః సంయోజయేత్ పునః
అథైతాన్ వక్తవాద్యేన గీతేనాపిక్రమాత్ తతః

నర్తకి స్థైర్యం సిద్ధించడానికి దండికను రెండు చేతులతో పట్టుకొని, ఆచార్యుడు ఉపదేశించినట్లు, మార్గదేశి విభాగాన్ననుసరించి మొదట సులభంగా ఉండే స్థానకములు మొదలైన ప్రయోగాలను తరువాత కష్టమైనవానిని నెమ్మదిగా అలసట కలుగకుండా ఉండే విధంగా అంటే సునాయాసంగా నర్తించే విధంగా ప్రతిదినం అభ్యాసం చేయాలి. పై ప్రయోగాలు సిద్ధములైనవని తెలుసుకొన్న తరువాత తాళంతో ముఖవాద్యంతో, పాటతో వరుసక్రమంలో కలిపి నృత్తాన్ని అభ్యాసం చేయాలి. ముఖవాద్యమంటే నోటితో తధిగిణ మొదలైన వాద్యాల జతులను పలుకడం. తాళానికి, జతులకు అనుగుణంగా నృత్తాన్ని చేయడం నేర్చిన తరువాత పాటకనుగుణంగా చేయడం అభ్యాసమౌతుంది.

ఈ విధంగా అభ్యాసం పూర్తయిన తరువాత ఒక శుభదినాన తన జట్టుతో కూడి గురువును సువర్ణ వస్త్రాదికములతో సంతోషపరచి, మొదట చేసినట్లే పూజ చేసి, వాద్యాలు వాయించేవారితో నిండుజట్టుతో నర్తకి సాధన చేయాలి.

నర్తకి పాటలో, వాద్యంలో, నర్తనంలో నేర్పరి అయిన తర్వాత ఆచార్యుడు ఆదరపూర్వకంగా ఈ క్రింది ఐదున్నర శ్లోకాలలో ఉన్న విద్యారహస్యాన్ని ఆమెకు ఉపదేశించాలి. ఇది అభ్యాసంలో వచ్చేది కాదు. పరంపరాగతమైనది.

గీతస్యావ యవానంగైః భావాన్ దృష్టి విచేష్టితైః
హస్త్రైరర్ధంలయం పద్భ్యాం వర్ణాన్ పాటైః ప్రదర్శయేత్
గీతాక్షరసమం వాద్యవవాద్యం గీతమేవవా
లాస్యాంగైః పాదహస్తాద్యైః తన్మిత్రైః (శ్రైః) నృత్తమానయేత్
ప్రాణేశం భావయంతీ స్వం మానసేన సభాపతిమ్
గీతార్థాపతితాన్ భావాన్ వ్యంజయంత్యనురంజయేత్
యేషుయేషు ప్రయోగేషు ప్రేక్షకాణాం రుచిర్భవేత్
సమ్యక్ జ్ఞాతేంగి తా కామం భంగ్యాతాంస్తాన్ ప్రదర్శయేత్
రసానాం వినియోగేషు యతో హేతోః కరోభవేత్
దృష్టిర్మనశ్చ భావశ్చ తతఏవ భవేత్ క్రమాత్
రసానాం పునరుతృర్భావైర్భవతి భావితైః

గురువు ఉపదేశించిన నాట్య విద్యా రహస్యంలోని భావం:

గీతంలోని భాగాలను అంగాలతో, భావాలను దృష్టి, చేష్టలతో అర్థాన్ని హస్తాలతో, లయను అడుగులతో, వర్ణాలను పాటములతో చూపాలి. గీతాక్షరాలకు సరియైన వాద్యాన్ని, వాద్యంలేని గీతాన్నైనా లాస్యాంగాలైన పాదాలు, హస్తాలు మొదలైనవాని మిశ్రమంతో నృత్తంలో తీర్చాలి. తన ప్రాణనాధుని మనస్సులో భావన చేస్తూ గీతార్థం వలన కలిగే భావాన్ని పైకి తెలియజేస్తూ సభాపతిని రంజింపజేయాలి. ఏఏ ప్రయోగాలు చూసేవారికి ఆసక్తిని కలిగిస్తాయో బాగా తెలుసుకొని ఆయా ప్రయోగాలు ఇచ్చవచ్చిన రీతిలో చూపాలి. రసాల వినియోగంలో హస్తాలు, దృష్టి, మనస్సు, భావం క్రమంగా ప్రసరించాలి. భావించిన భావాలచేత రసం ఆవిర్భవిస్తుంది.

నాట్యబృందము:

పాత్రము (నర్తకి) నకు కుడిప్రక్క, మొదలు ముఖరి నిలిచి ఉండాలి. ఎడమ ప్రక్క మృదంగాల వారుండాలి. వారి వెనుక, హుడుక్క, శంఖం, దేశిపటహం, కరట, కాహళం, కంచుతాళాలు వాయించేవారు వరుసగా ఉండాలి. ఈ విధంగా ఎడమ వైపు ప్రతిముఖరి, అతని అనువాదకులు మొదలైనవారు ఉండాలి. నర్తకి వెనుక ముఖ్యమైన పాటకత్తెలిద్దరు ఉండాలి. వారి రెండువైపుల కళలలో నేర్పరులై తాళం వేసేవారు, వారి వెనుక పిల్లనగ్రోవి వారు, కంచు తాళాలు ధరించిన అనుగాయికలు ఉండాలి.

పైన చెప్పిన బృందంలో స్త్రీలు పురుషులు కూడా ఉన్నారు. కానీ విలాస శీలుడైన రాజు విద్యావంతుల సమక్షంలో గానీ తన వైభవం ప్రకటించుకోవడానికి గానీ బృందమంతా ఆడవారే ఉండేటట్లు చేయవచ్చును.

రంగమంటపము:

రంగస్థలంలో చతురస్రాకారంలో నాలుగు స్తంభాలుండి రత్నకాంతులీనే చిన్న మంటపం కట్టాలి. అది రెండు మూరల వెడల్పుగా ఉండి, దాని యెత్తు నర్తించే పాత్రల కొలత కంటె ఒక మూర మాత్రమే ఎక్కువ ఉండాలి. దాని వెలుపలి చట్టం రంగురంగుల మణులతో వెలుగుతూ ఉండాలి.

నాట్యప్రదర్శన:

రంగమంటపం మధ్యలో ఇరుప్రక్కల చామరాలు, వీచోపులు పట్టుకొని స్త్రీలు కొలుస్తూ ఉండగా విమానంలో ఉన్న దేవకాంతలాగా నర్తకి నిలిచి ఉండాలి. ఆమె ముందర ఇద్దరిద్దరుగా స్త్రీలు తెరల అంచులు పట్టుకొని నిలిచి ఉండాలి. వారు ఒకరికొకరు సమానమైన రూపం, వయస్సు, వన్నె, కొలత గలవారు అయి ఉండాలి. నిర్దుష్టమైన చీరలు, సొమ్ములు మొదలైనవి ధరించి ఉండాలి. వక్షోజాలను చక్కటి పొట్టి కుప్పుసాలతో కప్పుకొని ఉండాలి.

స్త్రీలు పట్టుకొన్న తెరలు ఎనిమిది మూరల వెడల్పు, నాలుగు మూరల పొడవు కలిగి, చక్కటి కుట్టుపనితనంతో వింత వింతలుగా ఉండాలి. ఆ తెరలు మూడుగానీ అంతకెక్కువ గానీ వాద్యాలను బట్టి ఉండవచ్చును.

తరువాత పుష్పాంజలికి ముందు ఆ యిద్దరు స్త్రీలు పాట బంధాలతో క్రమంగా నర్తకికెదురుగా ఉన్న మొదటి తెర తప్ప తక్కినవాటిని తొలగించాలి.

కర్పూరపు పొడి వంటి తెల్లని వలిపము మరుగున నర్తకి అప్పుడే స్వయంవరానికై పాలసముద్రంలో నుంచి వెడలిన మహాలక్ష్మిలాగా నిలిచి ఉండాలి. పాట బంధాల శబ్దం చివరలో వాద్యాలన్నీ ఒక్కసారే చెవులకింపుగా మోగుతూ ఉండగా మూడవ తెర తొలగించాలి.

నర్తకికి సన్మానం:

నాట్య ప్రదర్శన సమాప్తం అయిన తరువాత నర్తకిని ఆమె బృందాన్నీ సువర్ణ, రత్నమయమైన ఒడ్డాణము, అందియలు, కడియాలు మొదలైన సొమ్ములు, బంగారు జరిగల వస్త్రాలు, శ్రీగంధం, అగరు, కుంకుమపువ్వు మొదలైన వాటితో కలహాలను బహుమతిగా ఇచ్చి సన్మానించాలి. ఏనుగులు, అశ్వాలు మొదలైన కానుకలను శక్త్యనుసారంగా ప్రభువులు ఇవ్వాలి.

బహుమాన సంపద బరువుతో, ప్రభువు మెప్పు, గౌరవం పొందడం వల్ల ధన్యురాలైన ఆ నర్తకిని ఆ రాజు అలసినావు, ఇంటికిపోయి విశ్రమించమని పంపించాలి.

జాయన నృత్తరత్నావళిలో నృత్య శిక్షణ ప్రారంభం నుండి శిక్షణాంతం వరకు చెప్పినదాన్ని బట్టి నర్తకి నృత్యం కేవలం ఒక కళలా కాక తపస్సులా సాధన చేయవలసి ఉంటుందని అర్థమౌతున్నది. ఈ నాట్యాన్ని తపస్సుగా భావించి దేవాలయంలో ఈశ్వరుని ముందు ఆరాధనా కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తారు కనుకనే స్త్రీలకు అంత మాన్యత, దేవాలయ మాన్యాలు లభించేవి. నృత్యం అన్నది ఈనాటి వేశ్యలు చేసే చౌకబారు డాన్సుల వంటివి కావు. వీటిని నేర్వడానికి సాధన చేయడానికి ఎంతో నేర్పు, శ్రద్ధ, భగవంతునిపై భక్తి, తాముచేసే నృత్యం కళలో ఏకాగ్రత కావాలి. దేవాలయాలలో రంగ భోగంలో భాగంగా దేవుని ముందు నృత్యాన్ని చేసే స్త్రీలు పవిత్రంగా ఉంటే తప్ప ఆ విధిని వారు నిర్వహించలేరు. రాజసభల్లో నర్తించే నర్తకీమణులైనా ఏకాగ్రత, రాజభక్తి, నియమనిష్ఠలు, తమ కళపై భక్తి లేకపోతే రాణించలేరు. ఈ కారణాల వల్లనే దేవాలయాలలో నృత్యం చేసే నృత్యాంగనలు లేదా పాత్రలు అనేవారికి సానులు దేవదాసీలు అనే పేర్లతో మన్నన లభించింది. రాజసభలలో నర్తించే వారికి రాజనర్తకి అనే పదవి, గౌరవం లభించాయి.

దేవాలయాలలో ఎనిమిదవ ఏటనుంచే నర్తకులు కావలసిన బాలికలకు శిక్షణ ప్రారంభిస్తారు. వీరిని సంప్రదాయ సానులంటారు. వీరికి మాన్యాలిచ్చేవారని జాయపసేనాని చేబ్రోలు శాసనాన్ని బట్టి తెలుస్తుంది.

నృత్తం చేయదగిన సమయం:

నృత్తం ఏఏ సమయాలలో సందర్భాలలో చేయాలో జాయన ఈ క్రింది విధంగా తెలిపినాడు.

యాగోద్వాహ మహాభిషేక నగరీవేశ్మ ప్రవేశోదక
క్రీడాసుప్రియ సంగమ వ్రత మహాదానాత్మజోత్పత్తిషు
యాత్రా పర్వపరీక్షణోత్సవ జయానంద ప్రతిష్ఠేహిత
ప్రాప్తిష్వభ్యుదయాయ నృత్తముచితం స్యాద్దేవ పూజాదిషు

యజ్ఞము, పెండ్లి, పట్టాభిషేకము, నగర ప్రవేశము, గృహప్రవేశము, జలక్రీడ, ప్రియసంగమము వ్రతము, మహాదానము, పుత్రజననము, యాత్ర, పండుగ పరీక్షణము (విద్యాపరీక్షణము) ఉత్సవము, విజయానందము, (దేవాలయాది) ప్రతిష్ఠ, ఇష్టార్థసిద్ధి, దేవపూజ – మొదలైన సందర్భాలలో అభ్యుదయానికై నృత్తాన్ని ఏర్పాటు చేయదగును.

అభినయం నాలుగు విధాలు:

ఆంగికము, వాచికము, ఆహార్యము, సాత్త్వికము. నాట్యకళ అంతా దీనిలోనే ఇమిడి ఉంటుంది.

ఆంగికో వాచికాహర్యౌ సాత్త్వికశ్చేత్య సౌ పునః
చతుర్థా కలితోయత్ర సర్వం నాట్యం ప్రతిష్ఠితమ్

శారీరము, ముఖజము, చేష్టాకృతము అని మూడు విధాలుగా అంగోపాంగాల చేత నెరవేర్చబడేది ఆంగీకం. భాషారూపమైన అభినయం వాచికం. అది సంస్కృత, ప్రాకృతాలను ఆశ్రయించి రెండు విధాలుగా ఉంటుంది. రంగస్థలానికి కావలసిన సాధన సామగ్రి లేదా సంభారాలను సమకూర్చటాన్ని ఆహార్యం అంటారు. అందులో అలంకారం అంటే సొమ్ములుగా మూల్యములుగా ఉంటాయి.

సత్త్వం చేత నెరవేర్పదగిన భావాల మూలంగా కలిగే అభినయం సాత్త్వికం. ఇవి ఎనిమిది విధాలు. స్తంభము, ప్రస్వేదము, రోమాంచము, స్వరభేదము, వణకు, వివర్ణత, కన్నీరు, ప్రళయము. వీనినన్నిటినీ అభినయించుటనే సాత్త్వికం అంటారు. పైన చెప్పిన ఆంగిక, వాచిక, ఆహార్య, సాత్త్వికాభినయాలలో పరిపూర్ణమైనదే నాట్యం. ఇటువంటి నాట్యాన్ని నేర్చుకొనే నర్తకులకి ఎంతో శ్రద్ధ, పాండిత్యం, శిక్షణ అవసరం.

నృత్తము – అంటే పాట వాద్యాలు మొదలైన వానితో కలిసి లయను మాత్రం ఆశ్రయించి అభినయం లేకుండా అంగాలను ఆడించడం నృత్తం అంటారు.

నృత్తం:

‘గీతవాద్యాది మిలితం లయమాత్ర సమాశ్రయం
అంగవిక్షేపణం నృత్తం భవేదభినయోక్జితమ్’ అని జాయప నృత్తాన్ని నిర్వచించాడు.

నృత్యం:

‘ఇదానీం ప్రకృతం యథాలక్షణముచ్యతే
భవేత్ భావాశ్రయం నృత్యం పదార్థాభినయాత్మకమ్’

భావాలనాశ్రయించినది, పదార్థాల నభినయించే స్వరూపం గలది నృత్యము అని నృత్యానికి జాయపలక్షణం చెప్పాడు. శరీరాన్ని విక్షేపించటమే దాని ప్రయోజనం కనుక నృత్తంలో ఆంగికాభినయం ఎక్కువగా ఉంటుంది.

మార్గదేశీ భేదాలు:

మార్గం:

నాట్యవేదం నుండి వెలువడినది, మహర్షులు వెదికి తీసినది, సజనులు ప్రచారం చేసినది కనుక దీనిని బుధులు మార్గము అంటారని జాయప నిర్వచించాడు.

నాట్యవేద ప్రవృత్తత్వాత్ మార్గితత్వాత్ మహర్షిభిః
సద్భిః సంచారితత్వాచ్చ మార్గమాహురిదం బుధాః
నృత్యం శ్రీగదితాదిస్యాత్ నాట్యం తన్నాటకాదికమ్

శ్రీగదికము మున్నగునది నృత్యము, నాటకము మొదలైనది నాట్యము అని జాయప వర్గీకరించాడు.

దేశి:

అభినయం లేకుండా లయనాశ్రయించి అంగాలను ఆడించే నృత్తానికి గల ప్రయోజనం నాట్యంలోనూ, అభినయంలోనూ కలిగే కొరతలను కప్పిపుచ్చడమే. ఇది ఆయాదేశాల జనుల యిష్టానుసారం చెల్లేది కనుక దేశి అని ప్రసిద్ధమైంది.

మార్గపద్ధతి నృత్యాలు భరత, నందికేశ్వరాది ముని ప్రోక్తాలు. వాటి గురించి వివరించడం పరిశోధనాంశానికి అంత ఉపయోగించదు. పైగా విషయం విస్తృతమౌతుంది. కాకతీయుల నాటి స్త్రీలు ఎక్కువగా ఆదరించినట్లు సాహిత్యంలో ఆధారాలు కనిపించేవి దేశినృత్యానికి సంబంధించినవే కనుక నృత్యాలకు సంబంధించి ఆనాటి సాహిత్యాధారాలను బట్టి ఆనాటి స్త్రీలు చేసిన దేశి నృత్య రీతుల గురించి ఈ ప్రకరణంలో వివరించ బడుతుంది.

ఆనాడు రాజాస్థానాలలో నృత్యం చేసే నర్తకీమణులు మార్గదేశి సంప్రదాయాలకు సంబంధించిన నృత్యాలు నేర్చుకోవలసి ఉన్నది.

నన్నెచోడుని కుమార సంభవంలో శివపార్వతీ కళ్యాణం అయిన తరువాత ఆ స్థానంలో రంభ నాట్యం చేసింది. ఆ నాట్యం ఈ నాడు కూడా సభలలో నర్తకులు చేసేదిగా గమనించవచ్చు.

అలతులు నిల్వ హస్తమున, హస్త విలాసముతో బెనంగ జూ
డ్కులు, చెవి చూడ్కులం, దెలమి గూడి రమింప మనంబు, తన్మనో
బలమున నుల్లసిల్ల నిజభావము, భావవిశేష సంపదల్
వెలయ రసంబులం దభినవించె రసంబులు సాంగకంబుగాన్.

రెండు చేతులలో దీపాలుంచి చేతులు కదిలిస్తూ, ఆ హస్త విలాసాని కనుగుణంగా కనులు తిప్పుతూ మనోభావాలు కళ్ళ ద్వారా తెలుపుతూ ఆ భావాలలో రసాలను ఒలికింపజేస్తూ దానికనుగుణంగా అన్ని అంశాల ద్వారా రసాభినయాన్ని చేస్తూ రంభ నాట్యం చేసింది. ఈ నాట్యం ఆనాటి మార్గ పద్ధతి నృత్యానికి ఉదాహరణగా చెప్పవచ్చును.

‘భవంతి ధరణీపాలాః ప్రాయేణాభినయ (వ?) ప్రియాః
అతస్త త్ప్రీతయే అద్యాపి యద్యదు త్పాద్యతే నవమ్
నృత్తం తతః స్మృతం దేశీతత్తద్దేశాను సారతః’

సామాన్యంగా రాజులకు కొత్త కొత్త విషయాలలో ఆసక్తి అధికం కావటంవల్ల వారి తృప్తి కోసం కొత్త కొత్త నృత్య విధానాలు కల్పింప బడేవి. అవి దేశి అని పిలవబడినాయి అని నృత్తరత్నావళిలో జాయసేనాని చెప్పాడు. అయితే దేశి నృత్తాలు కూడా కొంతకాలానికి శాస్త్ర ప్రమాణాన్ని సంపాదించి మార్గంలో కలిసి పోయేవి. ఈ విషయం మనకు పల్నాటి వీరచరిత్రలో నలగాముని కొలువులో నర్తకి చేసిన దేశినృత్య రీతులని బట్టి, విరాటపర్వంలో బృహన్నల రాజకుమార్తెకు నాట్యం నేర్పుతానని, తనకు వచ్చిన నాట్యాల గురించి చెప్పిన దాన్ని బట్టి స్పష్టమౌతుంది. రాజకుటుంబాల స్త్రీలు, దేవాలయాలలోని స్త్రీలు మార్గ, దేశి పద్ధతులు రెండింటినీ నేర్చేవారు. దేవాలయాలలో రంగమంటపాలలో స్త్రీల సమూహాలు చేసే నృత్యాలకు శాశ్వతత్వాన్ని కల్పించారు. ఇప్పటికీ రామప్ప దేవాలయం వంటి కాకతీయులనాటి దేవాలయ కుడ్యాలపైన రంగమంటప స్తంభాలపైన చెక్కిన నర్తకీసమూహాల శిల్పాలను బట్టి నాటి దేశి నృత్య రీతులు కొన్నిటిని గ్రహించవచ్చును.

ఆ కాలంలో రాజసభల్లో నాట్యం చేసే నర్తకీ మణులు కూడా దేశినృత్యాన్ని ప్రదర్శించేవారు. పలనాటి వీర చరిత్రలో నలగామరాజు కొలువులో నాట్యం చేసిన నర్తకి చూపిన నాట్యాలు ఈ క్రింద ఇవ్వబడినాయి:

  1. తొమ్మిది విధాలైన భూచారి నాట్యం
  2. పదహారు విధాలైన ఆకాశచారి నాట్యం
  3. అంగహారమనే తొమ్మిది విధాల నాట్యం
  4. గతిచారి భేదాలు
  5. భ్రమర సంహిత గతులు
  6. పాణి భేదాలు, పద భేదాలు
  7. పేరణి, దేశిని, ప్రేంఖణ, శుద్ధ, దండికా, కుండలి, బహు చారి అనే సప్త తాండవాలు.

ఈ దేశి నాట్య విశేషాల గురించి జాయపనేనాని రచించిన నృత్తరత్నావళి అనే గ్రంథంలో వివరంగా ఉన్నది. ఈ మొదటి భాగం మార్గ పద్ధతిని, రెండవభాగం దేశి పద్ధతిని వివరంగా తెలిపే నృత్తరత్నావళి ఆ కాలంలోనే ప్రసిద్ధి ప్రామాణ్యం సంపాదించిన గ్రంథం. ఈ గ్రంథం ప్రాచుర్యాన్ని బట్టి ఆ కాలపు స్త్రీలు నృత్యకళకు ఎంత ప్రాధాన్యం ఇచ్చేవారో, సంఘంలో సంగీత నృత్యాది కళల నభ్యసించే వారు ఎంత సముచితమైన స్థానాన్ని పొందారో మనం ఊహించవచ్చును.

తిక్కన రచించిన విరాట పర్వంలో అర్జునుడు బృహన్నల రూపంలో విరాటుని కొలువు చేరి, రాజకుమారి ఉత్తరకు నాట్యం నేర్పుతానని చెప్పి తాను నేర్చిన నాట్యాల గురించి ఈ విధంగా తెలిపాడు:

ఒండు పనులకు సెలవులేకునికి జేసి
యభ్యసించితి శైశవమాదిగాన
దండలాసక విధమును గుండలియును
బ్రెక్కణంబు, తెలుంగును, బేరణంబు

పైన చెప్పిన దండలాసకం, కుండలి, ప్రెక్కణము (ప్రేంకణము) పేరణి అన్నవి దేశి నాట్యపద్ధతులే. పాల్కురికి సోమనాధుడు పండితారాధ్య చరిత్రలో కూడా స్త్రీలు నేర్చిన నాట్య పద్ధతులను గురించి తెలిపాడు. తెలుంగు అన్నది ప్రత్యేక పద్ధతి నాట్యం కావచ్చు.

అందులో చిందు, కోడంగి ఆట, భ్రమరములు, సాళెములు, బయకములు, పంచాంసి ప్రేరణి అన్నవి దేశినృత్యరీతులేనని చెప్పు సోమనాథ ‘బ్రన్నని నిజదేశ భాషల జాతుల కన్ని కోడంగాటలాడెడువారు’ అన్న సోమనాథుని వాక్యాలను బట్టి గ్రహించవచ్చును.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here