‘కాకతీయ యుగంలో స్త్రీల సామాజిక స్థితిగతులు – ఒక పరిశీలన’-2

0
2

[డా. మంత్రవాది గీతా గాయత్రి గారు 1995లో పిహెచ్‍డి పట్టా కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖకి సమర్పించిన సిద్ధాంత వ్యాసాన్ని సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము.]

ప్రకరణం 1 కాకతీయులు – రెండవ భాగం:

విరియాల కామసాని:

[dropcap]కా[/dropcap]మసాని ధీరవనిత. రాజ్యపాలన చేయగల దక్షత, సామర్థ్యం కలది. ఎఱ్ఱన మరణించిన తరవాత గరుడబేతని వెంటబెట్టుకొని పశ్చిమ చాళుక్య చక్రవర్తి సమక్షానికి వెళ్ళింది. పశ్చిమ చాళుక్యుల తరఫున రాష్ట్రకూటులతో యుద్ధం చేసి తమ సామ్రాజ్య విస్తరణలో తోడ్పడ్డ విరియాల ఎఱ్ఱన పైన అతని కుటుంబం పైన చక్రవర్తికి సానుభూతి, కరుణ ఉండటం వలన కామసానికి కూడా రాజానుగ్రహం కలిగి ఉంటుంది. సోదరుడు కాకర్త్య గుండనను సంహరించి అతని ఆధీనంలో ఉన్న కొరవిని ముదిగొండ చాళుక్యుల కిప్పించినట్లే బేతరాజుకు అనుమకొండ విషయాన్ని ఇప్పించవలసిందిగా అర్థించి ఉంటుంది. ఈ విషయాన్నే గూడూరు శాసనంలో

అరుదగునట్టి యెఱ్ఱనృపునంగన కామసాని యొక్క మే

ల్గరుడని బేతభూవిభుని గాకతి వల్లభు బిన్నవాని దా

బరగగ జేతబట్టి ఘను బల్లవరాయని యన్వయాబ్జ భా

స్కర నిభు చక్రవర్తి గని కాకతి నిల్పుట కోటిసేయదే

అని చెప్పారు.

ఆనాడు చక్రవర్తి కొలువులో స్త్రీలకు ప్రవేశం ఉన్నట్లుగా కనిపించదు. కనుకనే చక్రవర్తి కొలువులో ధైర్యంగా ప్రవేశించి తన మేనల్లునికి రావలసిన రాజ్యం గురించి చక్రవర్తికి నివేదించి, అతనిని మెప్పించి, ఒప్పించిన కామసాని యొక్క వాక్చాతుర్యం, రాజనీతి కుశలత ఆమె అరుదగునట్టిదన్న ప్రశంసకు పాత్రురాలిని చేశాయి.

కాకర్త్య గుండ్యన రాష్ట్రకూటులకు విధేయుడు. కాని గరుడబేతని రాజ్యం పశ్చిమ చాళుక్య చక్రవర్తి అనుగ్రహం వలన లభించింది. కనుక కామసాని మేనల్లుని రాజ్యం సుస్థిరంగా ఉండటానికి పశ్చిమ చాళుక్యులకు విధేయురాలై శత్రువులు రాజ్యాన్ని కబళించకుండా జాగ్రత్త వహించింది. సిద్ధేశ్వర చరిత్రను బట్టి గుజరాష్ట్ర మహారాష్ట్ర ఘూర్జర యవన రాజుల పై యుద్ధం ప్రకటించి వారినోడించి ధనాన్ని అప్పనంగా గ్రహించినట్లు తెలుస్తున్నది. దీనికి శాసనాధారాలు ఇప్పటికి లభ్యం కాలేదు. ఏమైనప్పటికీ కామసాని తన సాహసాన్ని రాజనీతి కుశలతని నిరూపించుకొని తరువాతి తరంలోని స్త్రీలైన కోట గణపాంబ, కాకతి రుద్రమ, విరియాల నాగసానమ్మ వంటివారికి మార్గదర్శకురాలిగా నిలిచింది.

అప్పటి నుండి విరియాల వంశం వారు కాకతీయుల చక్రవర్తులకు బాసటగా నిలిచి వారి విశాల సామ్రాజ్య సుస్థిరతకి తోడ్పడ్డారు. ఆ తరువాత కాకతీయులు రాష్ట్రకూటుల మీద అభిమానం వదలి, చాళుక్యులకి విధేయ సామంతులైనారు. ఇది క్రీ.శ.1000 సంవత్సరాలకి పూర్వపు కాకతీయుల చరిత్ర. ఈ వంశంలో తరువాత వచ్చిన రాజుల గూర్చి ఇకముందు తెలుపబడుతుంది.

బేతరాజు (క్రీ.శ.995- 1052):

ఇతనినే గరుడబేతరాజుగా వ్యవహరించారు. చాలా గడ్డు పరిస్థితుల్లో విరియాల కామసాని సహాయంతో అధికారానికి వచ్చి సుమారు యాభై సంవత్సరాల పాటు సామంతరాజుగా అనుమకొండ విషయాన్నేలినాడు. ఇతనికి సహాయం చేసిన వాళ్ళలో విరియాల సూరడు ముఖ్యుడు. ఇతని కాలంలోనే రేచెర్ల రెడ్లు కాకతీయుల వద్ద సేవాధిపతులుగా చేరారు.

ఆనాడు ఇతడేలిన అనుమకొండ విషయము నేటి వరంగల్లు జిల్లాలో కొంత భాగము, కరీంనగర్ జిల్లాలోని శనిగారము వరకు వ్యాపించి ఉండేది. ఇతని శాసనము శనిగరంలోనిది క్రీ.శ.1051 నాటిది లభించినది కనుక ఇతడు ఆనాటి వరకు జీవించి ఉన్నాడని తెలిసింది.

మొదటి ప్రోలరాజు (క్రీ. శ. 1052 – 1076):

గరుడ బేతరాజు తరువాత అతని కుమారుడు మొదటి ప్రోలరాజు అనుమకొండకు రాజైనాడు. బయ్యారం చెఱువు శాసనంలో ప్రోలునికి అరిగజకేసరి అనే బిరుదు ఉన్నట్లు, అతడు (వరంగల్లుకు యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న కేసముద్రము అని ప్రస్తుతం పిలువబడే ప్రదేశంలో) ఒక చెరువు కట్టించి దానికి కేసరి తటాకమని పేరు పెట్టినట్లున్నది. అది బహుశ కాకతి రెండవ ప్రోలుని హనుమకొండ శాసనంలో ప్రసక్తమైన కేసరి సముద్రం కావచ్చును. కాకతి ప్రోలుని మనుమడు దుర్గరాజు రచించిన (శాసనం) కాజీపేట దర్గా శాసనంలో కాకతిప్రోలుని విజయాలు, విశేషాలు మనకి ఎక్కువగా లభ్యమౌతాయి. ఈ శాసనాన్ని బట్టి కాకతిప్రోలుడు చాళుక్య త్రైలోక్య మల్లుని దండయాత్రలలో పాల్గొని చక్రకూటాన్ని, కొంకణాన్ని జయించినట్లు తెలుస్తున్నది. ఇరుగు పొరుగున ఉన్న వేములవాడ, కాడ్పర్తి మొదలైన ప్రాంతాలను జయించి తన అనుమకొండ విషయంలో చేర్చుకొన్నాడు. తూర్పు చాళుక్యుల చివరిరాజు భద్రంగుడిని ఓడించి మండలాన్ని తన వశము చేసుకొన్నాడు. ఈ పొరుగు రాష్ట్రాలతో కూడిన అనుమకొండ విషయాన్ని శాశ్వత సామంత రాజ్యంగా త్రైలోక్య మల్ల చక్రవర్తి నుండి శాసనము పొందాడు. తన తండ్రి కాలంలో అస్థిరంగా ఉన్న ఆధిపత్యాన్ని ప్రోలుడు స్థిరపరచి కాకతిరాజ్య స్ధాపనాచార్య అన్న బిరుదునకు అర్హుడైనాడు. చాళుక్యుల రాజ చిహ్నమైన వరాహముద్ర నుపయోగించటానికి అనుమతిని, ఆ ముద్రతో నాణాలు ముద్రించే అధికారాన్ని సంపాదించాడు. అంతకుముందు గరుడ లాంఛనముతో పాటు చాళుక్యుల సామంతునిగా వరాహముద్రను కూడా ఉపయోగించ సాగాడు.

రెండవ బేతరాజు (క్రీ.శ. 1076-1108):

మొదటి ప్రోలుడు కాకతి రాజ్య స్థాపకుడైతే, అతని కుమారుడు బేతరాజు తన రాజకీయ చతురతతో తన అనుమకొండ రాజ్యానికి చాళుక్య సామ్రాజ్యములో విశిష్ట స్ధానాన్నార్జించాడు. క్రీ.శ. 1068లో త్రైలోక్యమల్ల చక్రవర్తి మరణించగానే చాళుక్య సింహాసనానికై వివాదం రేగింది. పెద్దకొడుకు భువనైక మల్ల సోమేశ్వరుడు రాజయినాడు. కానీ అతని తమ్ముడు విక్రమాదిత్యుడు సోదరుడి కంటే అన్ని విధాల సమర్థుడవటం చేత రాజ్యాధికారం కొరకు ప్రయత్నాలు సాగించాడు. బేతరాజు విక్రమాధిత్యునే సమర్ధించాడు. చివరకు విక్రమాధిత్యుడే త్రిభువన మల్లదేవుడనే పేరుతో క్రీ.శ. 1076లో చాళుక్య సింహాసనము నధిష్టించాడు. ఆ విజయ సూచకంగా తనకు అనుకూలుడైన సామంతరాజు కాకతి బేతరాజునకు తనకు చెల్లే రెండు బిరుదులనిచ్చాడు. అందులో ఒకటి విక్రమ చక్రి. రెండవది త్రిభువన మల్ల. అప్పటినుండే చాళుక్య సామ్రాజ్యంలో అనుమకొండ రాజ్యానికి విశిష్ట స్థానమేర్పడింది. అంతేకాక అతడు తన మంత్రి అయిన వైజదండ నాయకుని రాజనీతిజ్ఞత వలన సబ్బిసహస్రాన్ని పొందినాడని మైలమ వేయించిన అనుమకొండ పద్మాక్షి గుడిశాసనం వలన తెలుస్తున్నది.

దుర్గరాజు (క్రీ.శ.1108-116):

దుర్గరాజు రెండవ బేతరాజు పెద్దకొడుకు. ఇతడు యువరాజుగా ఉన్నపుడు తండ్రి లాగా త్రిభువనమల్ల బిరుదు వహించి, తమ గురువైన రామేశ్వర పండితునికి దేవాలయము కొరకై దానం చేసినట్లు అతడు వేయించిన ఖాజీపేట దర్గా శాసనం క్రీ.శ.1098 నాటి దానిలో ఉన్నది. తండ్రి రెండవ బేతరాజు శివపురాన్ని కట్టించి బేతేశ్వరునికి ఆలయం కట్టించాడని, కాలాముఖ శివాచార్యుడైన రామేశ్వర పండితునికి కాళ్ళు కడిగి, అతని శిష్యులకు ఒక గ్రామాన్ని (శివపురం) అక్కడి నిధుల వల్ల, పన్నుల వల్ల వచ్చే ఆదాయాన్ని సర్వ మాన్యంగా సమర్పించిన సందర్భంలో కొడుకు దుర్గరాజు ఈ శాసన స్తంభాన్ని నిలిపాడు. రెండవ బేతరాజు శనిగరం శాసనమును బట్టి క్రీ.శ.1107 వరకు జీవించినట్లు తెలుస్తున్నది. ఈ శాసనం బహుధాన్య సంవత్సరం క్రీ.శ.1098 ఉత్తరాయణ సంక్రాంతి కాలంలో వేయించ బడినది. కనుక దుర్గరాజు యువరాజుగా ఉన్నపుడే ఈ శాసనము వేయించినట్లు తెలుస్తున్నది. ఇది తప్ప ఇంక ఏ ఇతర శాసనాలలో గానీ, సాహిత్యంలో గానీ దుర్గరాజు ప్రసక్తి లేదు. ఇతడు ఎక్కువకాలం పరిపాలించినట్లు కనబడదు. ఇతడు రెండవ బేతరాజుకు అగ్ర తనయుడే కాని కాకతి రెండవ ప్రోలుడే రాజ్యానికి వచ్చాడని పద్మాక్షి గుడిశాసనము క్రీ.శ.1117 నాటి దాన్ని బట్టి తెలుస్తున్నది. బహుశ దుర్గరాజు క్రీ. శ 1108 నుండి 1116 వరకు పాలించి ఉండవచ్చును. అముద్రితమైన గణపతిదేవుని కాలంనాటి కొత్తపల్లి శాసనంలో కాకతి రెండవ ప్రోలుడు ఎంతో దయగల వాడని, అతని సోదరుని కొడుకు శరణు వేడితే కరుణించాడని ఉన్నది. ఏదో కారణం చేత దుర్గరాజును సింహాసనం నుండి దింపి కాకతి రెండవ ప్రోలుడు రాజ్యాధికారాన్ని గ్రహించాడు. ఇది పశ్యిమ చాళుక్య చక్రవర్తికి, దుర్గరాజుకు గురువైన రామేశ్వర పండితునికి కూడా అంగీకారమేనని పై శాసనం వల్ల, అనుమకొండలలో ఉన్న శిధిలమైన శాసనం వలన ఊహించ వచ్చును.

కాకతి రెండవ ప్రోలరాజు (క్రీ.శ.1116 – 1157):

హనుమ కొండలోని పద్మాక్షి గుడి వద్ద ఉన్న శాసనాన్ని బట్టి ఈ ప్రోలరాజు క్రీ.శ.1117కు ముందే అధికారంలోనికి వచ్చినట్లు తెలుస్తున్నది. ఇతడు కాకతి రాజ్యస్థాపకుడిగా కీర్తించ బడ్డాడు.

క్రీ.శ.1137లో భూలోక మల్ల సోమేశ్వరుడు మరణించాడు. అతని పెద్ద కొడుకు జగదేక మల్లుడు కల్యాణి సింహాసన మెక్కాడు. అప్పటికే ప్రోలుడు పానుగల్లు నాక్రమించుకొన్న గోవింద దండనాయకుని బంధించి గోకర్ణుని కొడుకు ఉదయ రాజును పానుగంటి సింహాసనమెక్కించాడు. కల్యాణి చక్రవర్తులకు విధేయుడిగా ఉండి తెలంగాణాలో చక్రవర్తికి విరుద్ధంగా తిరుగుబాటు చేసిన సామంతులందరితో పోరి పొలవాసలోని మేడరాజు అతని తమ్ముడు గుండరాజు, బంధువు ఏడరాజు మొదలైనవారి నణచినాడు. చాళుక్య తైలపుని నాయకత్వంలో చక్రవర్తికి ఎదురు తిరిగిన వారి నందర్నీ ఓడించాడు. శ్రీశైలం చేరి మల్లికార్జునుని సేవించి విజయస్తంభం నాటించి తిరిగి వచ్చాడు. మంథెన లోని గుండరాజును పట్టుకొని తల గొరిగించి రొమ్ముపైన కల్యాణి చాళుక్యుల వరాహ ముద్రను చిత్రించి ఊరేగించి శిరస్సు ఖండించాడు. గుండరాజు అన్న మేడరాజు, భీమచోడుడు పారిపోయారు. ఏడరాజు యుద్ధంలో ఓడిపోయాడు. కాకతి ప్రోలుని ఈ విజయాలను కాకతి రుద్రదేవుని క్రీ.శ.1163 నాటి అనుమకొండ శాసనంలో విపులంగా వర్ణించి కీర్తించారు. ఈ విధంగా ప్రోలుడు తెలంగాణంలోని విప్లవాలను అణచి చాళుక్యాధికారానికి ఊపిరి పోశాడు. తక్కిన సామంతుల వలె తిరుగుబాటు చెయ్యక చక్రవర్తికి విధేయుడిగా ఉండి తిరుగుబాటు నణచటం వల్ల అతడు చక్రవర్తి అభిమానాన్ని సంపాదించడమే గాక తెలంగాణంలో కాకతి ప్రోలుని మించిన యోధాగ్రేసరులు లేరని సామంతులలో కీర్తిపొందాడు. ఇదే ఇతని అసమానమైన రాజనీతిజ్ఞత. ఈ రాజనీతిజ్ఞతే రెండు దశాబ్దాలలో ఏర్పడబోయే స్వతంత్ర కాకతీయ రాజ్యావతరణకు పునాది వేసింది. అందుచేతనే కాకతి రెండవ ప్రోలుడు కాకతి రాజ్య స్థాపనాచార్య అన్న బిరుదుకు అర్హుడైనాడు. కాకతీయులు బలవంతులైన తోటి సామంతులతో బాంధవ్వాన్ని ఏర్పరచుకొని అధికారమును సుస్ధిరం చేసుకొన్నారు. కాకతి ప్రోలుడు నాటి సామంతులలో శక్తిమంతులైన నతవాటి వారి వంశంలోని ముప్పమాంబను వివాహ మాడాడు. ఇతనికి అయిదుగురు పుత్రులున్నట్లు వేర్వేరు శాసనాన్ని వలన తెలుస్తున్నది. కాకతి మైలమ వేయించిన త్రిపురాంతక శాసనమును బట్టి ప్రసిద్ధులైన రుద్రదేవ మహదేవులే కాక హరిహరుడు, గణపతి మొదలైన వారు కూడా అతని పుత్రులని తెలుస్తున్నది. ఒకానొక దాక్షారామ శాసనంలో రేపొల్ల దుర్గ భూపతి ప్రోలుని కుమారుడుగా చెప్పబడ్డాడు. సిద్ధేశ్వర చరిత్రలోను, ప్రతాప చరిత్రలోను కాకతి ప్రోలుడు అతని జ్యేష్ఠ కుమారుడు రుద్రదేవుని ఖడ్గాని కెరయై మరణించినట్లున్నది. కాని ఆ కథ చారిత్రకంగా సత్యదూరమైనది. దాక్షారామంలోని ఒక శాసనంలో వెలనాటి రెండవ చోడరాజును కాకతిప్రోల నిర్దహనుడని పేర్కొన్నారు.

రుద్రదేవుడు (క్రీ.శ.1158 – 1195):

కాకతి రెండవ ప్రోలుని తరువాత అతని పెద్దకొడుకు రుద్రదేవుడు అనుమకొండకు రాజైనాడు. తండ్రివేసిన పునాదిపై స్వతంత్ర రాజ్యస్థాపన చేసి కాకతీయ సామ్రాజ్యంగా విస్తరింపజేసిన మహాయోధుడు. ప్రతిభావంతుడు రుద్రదేవుడు. ఇతడిని మొదటి ప్రతాపరుద్రుడని కూడా అంటారు. ఇతడు రాజ్యానికి వచ్చేనాటికి ఆంధ్రదేశంలో రాజకీయ పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నాయి.

చాళుక్య సామ్రాజ్యం వారసుల చేతుల్లో ముక్కలైనది. వీరిలో ఎవరూ సామ్రాజ్యాన్ని వెనుకటివలె కొనసాగించగల సమర్థులు కారు. కాకతి రుద్రుడు తటస్థంగా ఉండి సమయం కోసం వేచి ఉన్నాడు. మేడరాజు, దొమ్మరాజులు రుద్రుని ఎదుర్కొనే ప్రయత్నం చేసినప్పుడు మంత్రి గంగాధరుడి వ్యూహం వల్ల దొమ్మరాజును ఓడించాడు. తరువాత కలచురి బిజ్జలుని సేనాపతి మైళిగిని తరిమి దొమ్మరాజును ఓడించి రుద్రుడు సైన్యాన్ని పొలవాసకు తరలించి, పొలవాస మేడరాజుకు అతని కుమార్తెను తనకిచ్చి వివాహం చేసి సంధి చేసుకొమ్మని వర్తమానం పంపి, అతడందుకంగీకరించనందు వలన సైన్యాన్ని అతని రాజ్యం మీదకి నడిపాడు. మేడరాజు రాజ్యం వదలి గోదావరి దాటి అరణ్యంలో తలదాచుకున్నాడు. రుద్రుడు నగునూరు పొలవాస రాజ్యాలతో నున్న సబ్సినాటినంతటినీ కాకతీయ రాజ్యంలో చేర్చుకొన్నాడు. మైళిగిని కల్యాణకటకం వరకు తరిమి, అటువైపు తెలుగుదేశం ఉన్నంతవరకు రుద్రుడు హద్దులేర్పరచాడు. ప్రక్కరాజ్యంలో విజృంభించిన కందూరు భీమునిపై దండెత్తగా అతడు తన బంధువులతో సహా వర్ధమానపురమును వదిలి పారిపోయినాడు. యాత్రలో చెరకు వంశం వారైన కేత, మారసేనానులు, విరియాల సూరసేనాని పాల్గొని రుద్రునికి విజయం చేకూర్చారు. పానుగల్లు పైకి దండెత్తిన రుద్రుడుకి రాజు ఉదయచోడుడు తన కూతురు పద్మావతి నిచ్చి వివాహం చేసి సంధి చేసుకొన్నాడు. ఈ విజయంతో రుద్రుని రాజ్యం దక్షిణాన శ్రీశైలం వరకు వ్యాపించింది. గోదావరి నది ఉత్తరం గాను, బీదరు నగరు పశ్చిమం గాను, శ్రీశైలం దక్షిణం గాను రుద్రుని రాజ్యానికి హద్దులయినాయి. తండ్రి ప్రోలుని విజయాలను, తాను ఇంతవరకు సాధించిన విజయాలను వర్ణించే కావ్యం వంటి విజయశాసనాన్ని తాను కట్టించిన వేయిస్తంభాల త్రికూటాలయంలో వేయించినాడు.

నలగామరాజుకు అతని సవతి తమ్ముడు మలిదేవరాజుకు పలనాటి సీమ రాజ్యభాగం విషయంలో జరిగిన యుద్ధంలో నలగామరాజు కాకతి రుద్రదేవుని సహాయం కోరగా అతడు మల్యాల, కొమరవెల్లి, విప్పర్ల, నతవాడి నాయకుల నాయకత్వంలో సైన్యం పంపించాడు. పరస్పర కలహాలతో బలహీనమై పోతున్న తీరాంధ్ర సామంతులైన కోట, కొండపడుమటి రాజ్యాధిపతుల్ని ఓడించి వెలనాటిలో ముఖ్య భాగాన్ని తన వశం చేసుకున్నాడు. వెలనాటి పృధ్వీశ్వరుడి అధీనంలో ఉన్న గోదావరి మండలం తప్ప తక్కిన తీరాంధ్ర ప్రదేశాన్ని కాకతీయ సామ్రాజ్యంలో కలుపుకొన్న రుద్రదేవుడు క్రీ.శ.1195 లో జైతుగి అనే యాదవ రాజుపై దండెత్తి ఆ యుద్ధంలోనే మరణించాడు అని చరిత్రకారులు అభిప్రాయపడ్డారు.

కాకతి రుద్రుని భార్య చోడోదయుని కుమార్తె అని హనుమకొండ వేయిస్తంభాల గుడి శాసనం వల్ల తెలుస్తున్నది. అతనికి ఇంకొక భార్య దన్నల దేవి అని దాక్షారామ శాసనం వల్ల తెలుస్తున్నది. భార్య లిద్దరు ఉన్నప్పటికీ రుద్రుడు సంతాన హీనుడనే ఆనాటి సాహిత్యం వలన తెలుస్తున్నది. కనుకనే రుద్రుని తరువాత అతని తమ్ముడు మహాదేవుడు రాజైనాడు. సంతానం లేని రుద్రుడు మహదేవుని సంతానాన్ని తన సంతానంగా భావించి పెంచి ఉండవచ్చును. కుందమాంబ తాను వేయించిన నిడిగొండ కుందవరం శాసనాలలో రుద్రుని గొప్పగా ప్రశంసించింది. హేమాద్రి తన వ్రత ఖండంలో గణపతిదేవుని రౌద్రుడుగా అనగా రుద్ర పుత్రునిగా పేర్కొన్నాడు. కాటయ నాయకుని ఉప్పర పల్లి శాసనంలో గణపతిదేవుడు రుద్రుని కుమారునిగా పేర్కొనబడ్డాడు. కనుక రుద్రుడు గణపతిని పుత్రునిగా భావించి ఉండవచ్చు లేదా దత్తత తీసుకొని ఉండవచ్చును.

రుద్రదేవ, మహదేవుల తల్లి ముప్పమాంబ పుట్టింటి వారైన నతవాడి కుటుంబంతో బంధుత్వాన్ని మరింత పటిష్టం చేసేటందుకు కుందమాంబను దుర్గభూపతి మనుమడు బుద్ధ భూపతి పెద్దకొడుకు అయిన రుద్ర భూపతికి ఇచ్చి వివాహం చేయడంలో రుద్రుని పాత్ర ఉండి ఉండవచ్చు. ఈ వివాహం కారణంగా నతవాడి సామంతులు కాకతీయులకి సన్నిహితులై భావి సామ్రాజ్య విస్తరణకి సుస్థిరతకి తోడ్పడ్డారు అని భావించ వచ్చును. కాకతి రుద్రుడు కళా పోషకుడు, పండితుడు కూడా. ఇతడు దేవాలయాలనేకం కట్టించాడు. ఓరుగల్లు కోట నిర్మాణం రుద్రుని కాలంలోనే ఆరంభమైనది. ఇతడు సంస్కృతంలో రచనలు చేశాడనీ, రాజనీతి తెలిసిన వాడనీ, సంస్కృతంలో నీతిసారం అనే గ్రంథం రచించాడనీ నీతిశాస్త్ర ముక్తావళి అనే గ్రంథం వ్రాత పతులలో ఒక దాంట్లో ఒక పద్యం వల్ల తెలుస్తున్నదని శ్రీ మానవల్లి రామకృష్ణ కవిగారు ఆ గ్రంథం ముద్రిత ప్రతి పీఠికలో వ్రాశారు. ఆ పద్యం –

పరువడి నాంధ్ర భాషగల బద్దెన నీతియు, సంస్కృతంబులో

బరగ బ్రతాప రుద్ర నరపాలునిచే రచియింపబడ్డ యా

నరవరు నీతిసారము వినం జదువం గడు మంచిదంచుజె

చ్చెరగని నీతి పద్ధతులు చేసె వినోదము బాల బోధకున్

ఈ పద్యంలో చెప్పబడ్డ ప్రతాపరుద్రుడు కాకతీయులలోని ఆఖరి చక్రవర్తి కాదని క్రీ.శ.1150-1195 మధ్య కాలంలో పాలించిన రుద్రదేవుడే అని పండితులు గుర్తించారు. రుద్రదేవుని కాలంలో కూడా అనుమకొండ నగరమే రాజధానిగా ఉన్నది. ఆ నగరం అనేక సుందర భవనాలు దేవాలయాలతో వైభవంగా ఉండేది.

రుద్రుడు మహాయోధుడు, కాకతీయ సామ్రాజ్య స్థాపకుడు. మంచి రాజనీతిజ్ఞుడు. కల్యాణి చక్రవర్తులకు విధేయ సామంతునిగా ఉండి, వారి సామ్రాజ్యం క్షీణించినపుడు తన రాజనీతినీ, యుద్ధ చాతుర్యాన్ని ప్రదర్శించి, తక్కిన సామంతుల నందరినీ సామదాన దండో పాయాలతో వశం చేసుకొని విశాల కాకతీయ సామ్రాజ్యానికి పునాది వేశాడు. ఇతని రాజనీతినీ, యుద్ధ చాతుర్యాన్ని ఒరవడిగా గ్రహించి కాకతీయ చక్రవర్తుల కీర్తి ప్రతిష్ఠలను, సామ్రాజ్యాన్నీ ఇనుమడింప జేసినవాడు కాకతీయ గణపతిదేవ చక్రవర్తి.

మహాదేవుడు (క్రీ.శ.1196 – 1198):

కాకతీయ రుద్రదేవుని తరువాత అతని తమ్ముడు మహాదేవుడు రాజ్యాధికారానికి వచ్చాడు. ఇతడు తన అన్న రుద్రదేవుని చంపి తనకు పట్టం గట్టమని అడిగినట్లు ప్రతాపరుద్ర చరిత్రలో ఉన్నది. సామంతులు అతడు రుద్రదేవుని చంపడం వల్ల రాజ్యానికి అర్హుడు కాడని, రుద్రదేవుని పుత్రుడైన గణపతికి పట్టంగట్టి అతనిని యువరాజుగా ఉండమన్నారు. సిద్ధేశ్వర చరిత్రలో సామంతులు ఇతడు స్వామిద్రోహం చేసాడు. భ్రాతృదోహిని వధించినా పాపం లేదని అన్నట్లు, అందుకు మహాదేవరాజు గణపతికి రాజ్యమిచ్చి, యువరాజ్య పట్టము తనకు కట్టి తరువాత చూడమని వారిని అర్ధించగా వారందుకు అంగీకరించినట్లు ఉన్నది.

ఈ రెండు గ్రంథాలలో మహాదేవుడు రుద్రదేవుని చంపినట్లు ఉన్నప్పటికీ వీటికి చారిత్రకాధారం లేదు. మహాదేవుని కుమార్తె కుందమాంబ వేయించిన కుందవరం శాసనంలో గానీ, రేచెర్ల రుద్రుని పాలంపేట శాసనంలో గానీ మహాదేవుడు అన్నను చంపినట్లు పేర్కొనలేదు. కుందమాంబ కుందవరం శాసనంలో రుద్రదేవుని ప్రశంసించింది. తన తండ్రికి పెద తండ్రికి వైషమ్యాలుంటే ఆమె తన పెత్తండ్రిని కీర్తించేది కాదు. మహాదేవుడు రుద్రదేవుని తరువాత రాజ్యం పాలించినట్లు అముద్రిత శాసనమైన కుమ్మరికుంట శాసనాన్ని బట్టి చెప్పవచ్చును.

  1. స్వస్తి సమస్త రాజన్య మస్త
  2. కన్యస్త మకుట రచిత రత్నమరీ
  3. చి రంజిత పాదారవింద కాకతీ
  4. య పుర వరాధీశ్వర హనుమకొండాది
  5. నానాదేశా ధీశ్వర చలమర్తి గండ
  6. సంగ్రామ వీర సమస్త ప్రశస్తి స
  7. హితం శ్రీమన్మహా మండలేశ్వర
  8. కాకతీయ మహాదేవ మహారా
  9. జులు రాజ్యాభి వృద్ధిం దనరు చుం
  10. డంగ స్వస్తి సమధిగత పంచ
  11. మహాశబ్ద మహా సామంత వీరలక్ష్మీ
  12. కాంత పరశ్రీ వర్ణిత బహుగుణా
  13. దిత్య తాడికొలని ఆది మహా
  14. రాజ పెనుంగొండ కవచ కొండప
  15. ల్లినాంటి కోట కొరవి పురా
  16. ధీశ్వర సత్యమార్తాండ మిత్ర
  17. చింతామణి వనితామనోజవైరి
  18. గజకేసరి కొట్టపుగొంగ కొమ
  19. రంక మల్లండును, మహాదేవ మ
  20. హారాజుల దివ్యశ్రీ పాదా
  21. రాధ కుండుము నైన శ్రీ మన్మహా సా
  22. మంత కుసుమ నాయకుని నిజవ్రి
  23. త్తి యైన తేపూండి యందు

ఈ శాసన కాలం క్రీ.శ. 1197 కనుక మహాదేవుడు క్రీ.శ.1195 నుండి 1198 వరకు పాలించాడన్న చరిత్రకారుల అభిప్రాయం సమర్థించదగ్గది. సిద్ధేశ్వర, ప్రతాప చరిత్రలలో ఉన్నట్లు మహాదేవుడు యువరాజుగా కాక మహారాజుగా పాలించినట్లు మనకు పై శాసన భాగం వల్ల తెలుస్తున్నది.

తాను రాజ్యానికి వచ్చి మూడేళ్ళు కాక మునుపే మహాదేవుడు తన అన్న రుద్రదేవుని మరణానికి కారకులైన యాదవులపై దండెత్తాడు. ఇతడు గజయుద్ధంలో నేర్పరి. యాదవ రాజ్యం పైన దండెత్తిన మహాదేవరాజు మార్గంలో ఉన్న కల్యాణ కటకాన్ని లోబరచుకొని యాదవ రాజధాని యైన దేవగిరిని ముట్టడించాడు. ఆ సందర్భంలో ఏనుగుపైన యుద్ధం చేస్తూ శత్రువు చేతిలో మరణించాడని రెండవ ప్రతాప రుద్రుని ఖండవల్లి తామ్ర శాసనంలో ఆలంకారికంగా చెప్పబడింది. కటక చూరకార అను బిరుదు మహాదేవునకున్నది. కుమ్మరి కుంట శాసనంలో కాకతీయ పురవరాధీశ, చలమర్తి గండ, సంగ్రామ వీర అన్న బిరుదులు మహాదేవునికున్నట్లు తెలుపబడింది. ఇతని భార్య బయ్యమాంబ. వీరికి గణపతిదేవుడు పుత్రుడు. కుందమాంబ, మైలమాంబ అనే కుమార్తెలు ఉన్నారు.

మహదేవుని కుమార్తెలైన కుందమాంబ మైలమాంబలు వారు చేసిన దానాల వల్ల శాసనాల ద్వారా ప్రసిద్ధులైనారు. వీరికి ముందున్న కాకతీయుల ఆడపడుచుల గురించి అంతగా తెలియటం లేదు. వీరిద్దరు తమ స్త్రీధనం నుండి దాన ధర్మకార్యాలు నిర్వహించారని వారు వేయించిన శాసనాల వల్ల తెలుస్తున్నది.

కుందమాంబ, మైలమాంబ:

గణపతిదేవుని కాలంలో ఎన్నో ప్రజోపయోగకరమైన కార్యాలను చేపట్టి తమ వంశాలకి వన్నె తెచ్చిన స్త్రీలందరికీ ఆదర్శప్రాయులన దగ్గవారు కాకతీయుల ఆడపడుచులైన కుందమాంబ, కాకతి మైలమాంబ అన్నవారు. వీరిద్దరూ కాకతి మహదేవునికి బయ్యమాంబికకు జన్మించినవారు. గణపతిదేవుని సోదరీమణులు. ఇద్దరూ నతవాడి వంశపు కోడళ్ళు.

రుద్రుని కాలంలోని స్వతంత్రరాజ్యం సామ్రాజ్యంగా మారడానికి వీరివురి ద్వారా బలవంతులైన నతవాడి వంశంలో కాకతీయులకి ఏర్పడ్డ వైవాహిక సంబంధమే కారణం. కాకతి ప్రోలుని భార్య, రుద్రదేవ మహదేవుని తల్లి అయిన ముప్పమాంబ నతవాడి దుర్గభూపతి సోదరి. అయినప్పటికీ తీరాంధ్ర దేశంలో వెలనాటి చోడుల ప్రాబల్యం తగ్గినపుడు కోట, నతవాడి, కొలను, చాగి మొదలైన వంశాలవారు విజృంభించారు. వీరితో వైవాహిక సంబంధాలు ఏర్పడితేగానీ కాకతీయ సామ్రాజ్యానికి సుస్థిరత్వం లేదని రుద్రుడు తన తమ్ముని కూతురు కుందమాంబను నతవాటి రుద్రునకిచ్చి వివాహం చేయటానికి ప్రోత్సహించి ఉండవచ్చు. ఏమైనప్పటికీ కాకతీయులకూ, నతవాటి వంశంవారికీ అప్పటినుంచీ వైవాహిక సంబంధాలు కొనసాగుతూ వచ్చాయి. మేనరికాలు చెయ్యడం అన్నది ఈ రెండు వంశాలలో విరివిగా జరిగింది. బయ్యారం, ఇనుగుర్తి శాసనాల వల్ల వీరి పరస్పర సంబంధ బాంధవ్యాలు ఈ క్రింది విధంగా ఉన్నాయని తెలుస్తున్నది.

బయ్యారం చెఱువు వద్ద మేలమాంబ వేయించిన శాసనాలు ఐదు ఉన్నాయి. కోటగడ్డ, నామాలపాడు, ఇనుగుర్తిలోనూ, త్రిపురాంతకంలోనూ ఈమె వేయించిన శాసనాలున్నాయి. కోటగడ్డ శాసనంలో మైలాంబ పుట్టినింటివారైన కాకతీయ వంశావళి అతి విస్తారంగా వర్ణించబడింది. ఇందులో మైలాంబ శకసంవత్సరం 1105లో జన్మించినదని నతవాటి దుర్గభూపతి మనుమడు, బుద్ధభూపతి పుత్రుడు ఐన రుద్రుని పెండ్లాడినట్లు ఉన్నది. బయ్యారం చెఱువు వద్ద ఉన్న శాసనంలోనూ ఈ వివరాలున్నట్లు తెలుస్తున్నది.

గణపతిదేవుని సోదరి కుందమాంబ. ఈమె మైలమాంబ కన్న పెద్దది. మేలమాంబ, కుందమాంబ ఇద్దరూ నతవాడి బుద్ధభూపాలుని పుత్రుడైన రుద్రుణ్ణి వివాహమాడినట్లు వీరి శాసనాలను పరిశీలించినవారు ప్రకటించారు. కుందమాంబ, మేలమాంబ ఇద్దరూ మహదేవునికి బయ్యమాంబకు పుట్టినవారైనా వారిద్దరూ తమ తమ శాసనాలలో ఒకరినొకరు పేర్కొనలేదు. ఇద్దరూ తోబుట్టువులై ఒకే పురుషుణ్ణి వివాహమాడినప్పుడు, తమ శాసనాలలో పుట్టింటివారినీ, అత్తింటివారినీ పేర్కొన్నపుడు అక్కచెల్లెళ్ల ప్రసక్తి తీసుకురాకపోవడానికి సపత్నీ మాత్సర్యము కారణమనిపించక మానదు. వారిద్దరూ ఒకే వ్యక్తి కావటానికి వీలులేదు. కుందమాంబ సుతుడు మాధవ మహాదేవుడు. మైలమాంబకు ముగ్గురు పుత్రులు రుద్ర, మహాదేవ, గణపతి అనేవారు. వీరిద్దరూ అక్కచెల్లెళ్ళనీ, దుర్గభూపతి కొడుకులు రుద్రభూపతి, ఎక్కడి మల్లరుద్రుడనే వారిని పెళ్ళాడారని మైలమ త్రిపురాంతకం శాసనం, కుందమాంబ కుందవరం శాసనం బట్టి తెలుస్తున్నది. డా. నేలటూరి వెంకటరమణయ్య గారనుకున్నట్లు వారు ఒకే వ్యక్తిని వివాహ మాడలేదు. కుందమాంబ తన కుందవరం శాసనంలో శ్రీనాతవాటి వంశం సకాకతీశ స్వకులానురూపం అని నాతవాటి వంశం గురించి దుర్గాధినాధుని పుత్రుడు బుద్ధభూపాలుడని ‘తత్సుతో బుద్ధ భూపాలో (..ర్మతిర్ధృతిః కులస్త్రీయ కలాస్సర్వాన్ (..వి) లాసినః’ అన్న శ్లోక పదాలని బట్టి బుద్ధ భూపాలునికి మతి ధృతి కులస్త్రీలు గాను, సర్వకళలు విలాసినీ జనులుగా ఉన్నాయని వర్ణించి ‘ఆసీద్రు ద్రనృపస్తదగ్రతనయో విద్విష్ట విత్రాస కృద్ధోర్టర్పా(రి) గండ భైరవ ఇతి ప్రఖ్యాతనామా భువి’ అంటే ఆ బుద్ధ భూపాలుని అగ్రతనయుడు రుద్రనృపుడు తన భుజబలంతో అరిగండ భైరవ అని బిరుదును సంపాదించాడు. ‘అస్మై కుందలదేవీం రుద్రనృప.. దదాన్మహాదేవ నృపః’. శాసనం అక్కడక్కడ శిధిలమైనప్పటికి తాత్పర్యం స్పష్టము. బుద్ధ భూపాలుడి అగ్రతనయుడు రుద్రభూపతి కుందమాంబ భర్త. ఇక మైలమాంబ వేయించిన త్రిపురాంతకం శాసనంలో ‘యాంచ స్వయంవర సమాహృత రాజలోకాం లోకోత్త మా ముదవహత్ప్రధితాన్వశ్రీ ద్వితీయ సుత (ఎ)క్కడి మల్ల రుద్రః’ అని ఉన్నది. మేలమాంబ తన స్వయంవరానికేతెంచిన రాజులలో కెల్ల ఉత్తముడు, ప్రసిద్ధి చెందిన వంశమునకు చెందిన నతవాడి విషయాధిపుడైన బుద్ధ భూమిపాలుని రెండవ కుమారుడు ఎక్కడి మల్లరుద్రుని వివాహమాడినట్లు పై శాసన పంక్తులను బట్టి తెలుస్తున్నది.

కాకతి మైలమ స్వతంత్ర భావాలు గల వ్యక్తిగా ఆధునిక మహిళ కంటే అభ్యుదయ భావాలు, స్వాభిమానం ఉన్న స్త్రీగా తోస్తుంది. తన వివాహం స్వయంగా ఎంచుకున్నవానితో జరిపించుకున్నది. త్రిపురాంతకం శాసనంలో ఉన్నట్లు ఆమె వివాహమై అనురాగవతియైన పత్నిగా ఉన్నప్పటికీ, తనను కాకతి మైలమగానే చెప్పుకొన్నది. త్రిపురాంతకం శాసనంలో దాతలు మైలమాంబ కొడుకులు నతవాటి రుద్రమహారాజుల, కాకెతమైలలు మహాదేవుల కొడుకు లనే చెప్పుకొని దేవాలయానికి అఖండ దీపానికి గోవులనిచ్చారు. దీన్నిబట్టి ఆమె పెళ్ళి అయిన తర్వాత భర్త యింటి పేరుతో కాక ఆమె జన్మించిన వంశనామంతోనే వ్యవహరింపబడిందని తెలుస్తున్నది.

కాకతీయ సామ్రాజ్యం సుస్థిరంగా సుభిక్షంగా ఉండటానికి వీరిరువురి ద్వారా నతవాటి సామంతులతో బాంధవ్యం, వీరు నిర్మించిన చెరువులు, గ్రామాలు కూడా కారణమని చెప్పవచ్చు.

గణపతిదేవ చక్రవర్తి:

మహదేవుడు వీర మరణం చెందాక అతనితో యుద్ధానికి వెళ్ళిన గణపతిదేవుడు చెరసాలలో బంధింప బడ్డాడు. కాని రుద్రుడి నాటి నుండి కాకతీయులకి విధేయులుగా ఉన్న సేనానులు, మంత్రులు కాకతీయ రాజవంశం అంతరించి పోకుండా కాపాడారు.

అటువంటి వారిలో ముఖ్యుడు రేచెర్ల రుద్ర సేనాని. కాకతి రుద్ర దేవుని మరణానంతరం శత్రువులు అవకాశం చిక్కించుకొని రాజ్యాన్ని ఆక్రమింపబోగా రుద్ర సేనాని నాగతి భూపాలుని, ఇతర శత్రురాజులను ఓడించి కాకతీయ రాజ్యాన్ని కాపాడినట్లు రేచెర్ల రుద్రుని పాలంపేట శాసనం వలన తెలుస్తున్నది.

పై సంఘటన గురించి సిద్ధేశ్వర చరిత్రలో ఇంకొక విధంగా చెప్పారు. మహదేవరాజు, గణపతిదేవుడు దేవగిరిపై దండెత్తినపుడు ఆ యుద్ధంలో మహదేవరాజు మరణించాడని, గణపతిదేవరాజు యాదవరాజును చంపగా, దేవగిరి రాజ బంధువులు కానుకలు, కట్నాలుగా పద్మరాగాలు ఆణిముత్యాలహారాలు అర్పించి రుద్రమ అనే కన్యనిచ్చి కల్యాణం చేసినట్లు ఉన్నది. ప్రతాపరుద్ర యశోభూషణానికి వ్యాఖ్య వ్రాసిన కుమార స్వామి సోమపీధి కూడా రుద్రమను గణపతి దేవుని భార్యగా పేర్కొన్నాడని, మార్కోపోలో కూడా ఈ విషయంలో పొరపడ్డాడని సిద్ధేశ్వర చరిత్ర పీఠికలో ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం గారు వ్రాశారు. కానీ బాగా పరిశీలిస్తే వారు చెప్పింది కొంత వరకు సత్యమని అనిపిస్తుంది. రుద్రదేవ మహదేవులను యుద్ధంలో సంహరించిన జైతుగి గణపతి దేవుని పై జాలి పడి బంధవిముక్తుణ్ణి చేసి సింహాసన మధిష్ఠింప చేశాడు అని యాదవ చంద్రుని పైధాన్ శాసనాన్ని బట్టి తెలుస్తుంది.

కారాగారాత్సమానీయ కరుణావరుణాలయః

ప్రియం వదాన్య మకరోత్ క్షితేర్గణపతిం పతిం”

తనను కారాగార విముక్తుణ్ణి చేసిన జైతుగిపైన గణపతి దేవుడు దండెత్తి ఉండడు. మహదేవరాజును యుద్ధంలో పరిమార్చిన జైతుగి గణపతిని బంధించినపుడు కాకతీయ మంత్రులు సామంతులు సంధి ప్రయత్నాలు చేసి యాదవరాజకన్య (బహుశ జైతుగి కుమార్తె కావచ్చును) రుద్రమను గణపతి దేవునకిచ్చి వివాహం చేసి కయ్యాన్ని వియ్యంగా మార్చి ఉంటారు. బహుశా రేచర్ల రుద్రసేనాని ఈ రెండు రాజ్యాల మధ్య సామరస్య సాధనకు ప్రయత్నం చేసిన వారిలో ముఖ్యుడై ఉంటాడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకునే రేచర్ల రుద్రసేనానికి కాకతి రాజ్య భార ధౌరేయ, కాకతి రాజ్యసమర్ధ అని బిరుదులు కలిగి ఉండవచ్చు. అయితే ఈ డా. పి. వి. పరబ్రహ్మశాస్త్రి గారు ఈ విషయంలో సందేహం వెలిబుచ్చారు. మైలాంబ వేయించిన బయ్యారం చెఱువు శాసనంలో గణపతి దేవుని వివాహం, మైలాంబ వివాహం మహదేవరాజు జరిపించాడని ఉన్నది కనుక గణపతి దేవునికి వివాహం దేవగిరి దండయాత్రకు ముందే అయిందని, యాదవ రాజకుమార్తెతో వివాహం జరిగి ఉండక పోవచ్చునని ఆయన అభిప్రాయ పడ్డారు. ఆ రోజుల్లో రాజులు బహుభార్యత్వం పాటించారన్నది తెలిసిన విషయమే. గణపతి దేవునికి ముగ్గురు భార్యలు, సోమలదేవి, నారమ, పేరమలు ఉన్నట్లు శాసనాధారాలున్నాయి. కనుక గణపతిదేవుడు యాదవ రాజకన్యను వివాహమాడాడనటంలో విప్రతి పత్తి ఉండకూడదు.

కాకతీయ రుద్రదేవుని, మహాదేవుని చంపిన జైతుగి గణపతిదేవునిపై కనికరం చూపడం, ఆయన రాజ్యపాలన కాలంలో యాదవులు దండెత్తక పోవటం జైతుగి, భిల్లమల వంశానికి చెందిన సింఘన కుమారుడు విజయ పెర్మాడి అన్న రాజు గణపతి దేవుని రాజ్యంలోని బ్రాహ్మణులకు స్థలం దానం చేయడం ఎందరో యాదవ రాజకుమారులకు గణపతి దేవ చక్రవర్తి తన కొలువులో ఆశ్రయం ఇవ్వడం వంటి అంశాల గురించి ఆలోచిస్తే సిద్ధేశ్వర చరిత్రలో చెప్పినట్లు గణపతి దేవరాజు యాదవరాజు పుత్రి రుద్రమను పెండ్లాడి ఉండవచ్చునన్న ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనంగారి అభిప్రాయం సమంజసమని తోస్తున్నది.

గణపతిదేవుని భార్య యాదవ రాజకుమారి రుద్రమ అనడానికి ఇంకొక ఆధారం ఉన్నది. కాకతీయ రుద్రమదేవికి రుద్రమ అనే కుమార్తె ఉన్నది. అమ్మమ్మపేరు మనుమరాలికి, తాతపేరు మనుమడికి పెట్టడం ఆనాడూ, ఈనాడూ కూడా ఆనవాయితీగా ఉన్నది. ముఖ్యంగా కాకతీయుల కాలంలో ఎక్కువగా ఉండటం శాసనాలలో గమనించవచ్చును.

గణపతిదేవుని కూతురు రుద్రమకు రుద్రదేవుని పేరు, కుందమాంబ కొడుకుకు మాధవ మహదేవ అని మాతామహాడు మహదేవుని పేరు, మైలమాంబ కూతురు బయ్యల మహదేవికి మైలమాంబ తల్లి బయ్యమాంబ పేరు ఉండటం గమనించవచ్చును.

ఇదే విధంగా కాకతి రుద్రమకు పినతల్లి లేదా పెదతల్లి అయిన యాదవ రాజకుమారి రుద్రమ పేరు మనుమరాలికి పెట్టి ఉండటానికి ఆస్కారం ఉన్నది. అంతేకాదు రుద్రమ దేవి రెండవ కూతురైన రుద్రమనే యాదవరాజు కుమారుడైన యెల్లణదేవునికిచ్చి వివాహం చేశారు. యెల్లణదేవుడు భిల్లమ, జైతుగి వంశానికి చెందిన రాజకుమారుడే. కనుక కాకతి రుద్రమ దేవి తన సవతి తల్లి, యాదవ రాజకుమారి అయిన రుద్రమ వంశానికి చెందిన రాజ కుమారుడు ఎల్లణదేవునికి తన కూతుర్నిచ్చి వివాహం చేసిందని అనుకోవడం సమంజసం. లేకుంటే కాకతీయ సామ్రాజ్యాన్నేలే రుద్రమదేవి రాజకీయంగా ఉన్నతస్థితిలో లేకుండా తన సామంతులుగా ఉన్న యాదవ వంశపు రాజకుమారునికి తన కుమారైనిచ్చి వివాహం చేయవలసిన అవసరం లేదు. పైగా ఈ ఎల్లణ దేవుడు రుద్రమపై దండెత్తివచ్చిన యాదవరాజు మహదేవునికి సన్నిహితుడు కాడు. దేవగిరిని వదలి కాకతీయులనాశ్రయించి ఆంధ్ర దేశంలో స్థిరపడిన యాదవరాజు వంశం వాడు. బహుశా పెండ్లి అయినపుడు యాదవ రాజకుమారితో ఆమెకు ఆప్తులైన వారు దేవగిరిలో రాజకీయంగా బలవంతులు కాని వారు, ఆమెతో వచ్చి ఆంధ్రదేశంలో స్థిరపడి ఉంటారు. వీరి గురించి డా. పి.వి. పరబ్రహ్మశాస్త్రిగారు తమ గ్రంధంలో ఈ విధంగా తెలిపారు.

నల్గొండ జిల్లాలోని ఒక అముద్రిత శాసనంలో విశ్వనాధదేవ అన్న మాండలికుడు జైత్రపాలుని (జైతుగి) యాదవ వంశానికి చెందిన వాడని, గణపతిదేవుని వెలనాటి దండయాత్రలో పాల్గొన్నాడని పృధ్వీశ్వర శిరః కందుక క్రీడావినోద అని బిరుదు సంపాదించాడని ఉన్నది. చక్రనారాయణ వంశానికి చెందిన సారంగ దేవుడనే వాడు గణపతిదేవుని సామంతునిగా ఇప్పటి ప్రకాశం జిల్లాలోని ప్రాంతాన్ని పాలించేవాడు. కరీంనగరు జిల్లాలోని ఒక తామ్ర శాసనంలో అక్షయ చంద్ర దేవుడనే యాదవ వంశపురాజు ఆ ప్రాంతాన్ని ఏలుతున్నట్లు ఉన్నది. పేరూరు శాసనంలో విజయ పెర్మాడి దేవుడనే యాదవ సామంతుడు, పానుగల్లు శాసనంలో సారంగపాణి దేవుడనే యాదవరాజు బిదరు కోట శాసనంలో సింద వంశానికి చెందిన మహమండలేశ్వర భైరవుడనే యాదవ సామంతుడు పేర్కొనబడ్డారు.. వీరందరూ రుద్రమదేవికి సామంతులే. దీన్ని బట్టి సిద్ధేశ్వర ప్రతాపచరిత్రల కర్తలు, మార్కొపోలో, కుమారస్వామి సోమపీధి మొదలైనవారు చెప్పినట్లు యాదవరాజుకుమార్తె రుద్రమదేవి గణపతి దేవుని భార్య అన్నది నిజమేనని భావించవచ్చు.ఎప్పుడూ శత్రుత్వంతో ఉన్న రెండు ఉన్నత రాజవంశాలు ఈమె వల్ల యుద్ధాలు లేకుండా, సఖ్యంగా ఉండి ఉంటాయి.

అతి చిన్నవాడుగా రాజ్యాధికారానికి వచ్చి తన భుజబల పరాక్రమంతో, రాజనీతి దక్షతతో, మత సహనంతో, సాంఘిక సంస్కరణాభిలాషతో సువిశాలమై సుసంపన్నమైన సామ్రాజ్యాన్ని ఏకచ్ఛత్రంగా పాలించిన తెలుగు చక్రవర్తి కాకతి గణపతిదేవుడు.

రాజకీయ చరిత్ర: మహాదేవుని తర్వాత గణపతిదేవ చక్రవర్తి క్రీ.శ.1199 నుండి 1262 వరకు అంటే సుమారు అరవై మూడేండ్లు రాజ్యాన్ని పరిపాలించాడు. కాని అతడు క్రీ.శ.1268 వరకు జీవించినట్లు చరిత్రకారులు భావిస్తారు. గణపతిదేవుడు తన రాజ్యపాలన రాజకీయంగా ప్రతికూలమైన పరిస్థితులలో మొదలు పెట్టాడని రేచెర్ల రుద్రుని పాలంపేట శాసనం వలన తెలుస్తున్నది. గణపతిదేవుడు రాజ్యానికి వచ్చిన వెంటనే వెలనాటి పృధ్వీశ్వరుడి ప్రాబల్యం అణచడానికి ప్రయత్నించాడు. క్రీ.శ.1201-2లో గణపతి సేనానుల్లో ముఖ్యుడు చౌండసేనాని దివి సీమపైన దాడి చేసి పృధ్వీశ్వరుడి సామంతుడైన పినచోడి రాజుని ఓడించాడు. పినచోడి నాయకుని దగ్గర ఉన్న పృధ్వీశ్వరుని మణిమయ నిక్షేపాన్ని వశం చేసుకొని చౌండసేనాని గణపతిదేవుని కోశాగారాన్ని నింపాడని అతని కొండపర్తి శాసనం వల్ల తెలుస్తున్నది. చౌండసేనాని దివిసీమ పైకి దండెత్తి గెలవడం వల్ల అతడికి ద్వీపీలుంటాక అని బిరుదు కలిగినట్లు పై శాసనంలో ఉన్నది. ఆనాడు దివిసీమను అయ్య వంశానికి చెందిన పినచోడి నాయకుడు పాలించినట్లు అతని కొడుకు జాయపసేనాని గణపేశ్వరం శాసనం వల్ల తెలుస్తున్నది. పినచోడి రాజును ఓడించినప్పటికీ, ఆ రాజ్యాన్ని ఆక్రమించక అతని కుమార్తెలు నారమ, పేరమ అనే వారిని వివాహమాడి వారి సోదరుడైన జాయప నాయకుని చేరదీసి యుద్ధ ప్రావీణ్యం కలిగించి తన గజసేనకు అధిపతిగా నియమించాడు. క్రీ. శ. 1206-08 మధ్యలో వెలనాటి యుద్ధంలో తెలుగు చోడరాజు, తిక్కభూపాలుడు మొదలైన వాళ్ళ సహాయంతో గణపతిదేవుడు పృధ్వీశ్వరుని హతమార్చి వెలనాటిని తన వశం చేసుకున్నాడు. ఈ రాజ్యభాగానికంతటికీ జాయపను మహామండలేశ్వరునిగా నియమించాడు. కాకతీయులకు సామంతులైన రాజులలో కోట బేతరాజుకు తన కూతురు గణపాంబను ఇచ్చి వివాహం చేశాడు. నెల్లూరును ఆక్రమించిన తమ్ముసిద్ధిని తరిమి తనకు సహాయం చేసిన తిక్కభూపాలుని నెల్లూరు సింహాసన మెక్కించాడు. ఈ సందర్భంలో కాకతీయ సైన్యాలు చోళ సైన్నాన్నేకాక వారికి సహాయంగా వచ్చిన సేవుణ, కర్ణాట, లాట సైన్నాన్ని కూడా పారద్రోలాడు. దీనికి ప్రతిఫలంగా తిక్కభూపాలుడు తన రాజ్యంలో భాగమైన కడప మండలాన్ని గణపతిదేవుని రాజ్యంలో కలిపాడు. గణపతిదేవుడు ఈ మండలానికి కాయస్ధసేనాని గంగయ సాహిణిని సామంతునిగా నియమించాడు.

గణపతిదేవుని అధీనంలోని వెలనాటి రాజ్యంలో గోదావరి మండలాన్నేలే కొలని కోన, చాళుక్య రాజులు గణపతిదేవుని వద్ద సామంతత్వాన్ని అంగీకరించలేదు. అందువల్ల రేచెర్ల రుద్రుని కొలువులో ఉన్న రాజ నాయకుడు ఇందులూరి సోమ మంత్రి, సైన్యాన్ని కళింగంపైకి నడిపారు. జాయపసేనాని కూడా కాకతీయ సైన్యాన్ని నడిపాడు. వీరు చాలామంది గాంగ సామంతుల నోడించారు గానీ గణపతిదేవునికి వేంగీ మండలం మాత్రమే మిగిలింది. గణపతి దేవుడు ఇందులూరి సోమయమంత్రిని కొలని రాజ్యానికి అధిపతిని చేశాడు. చాళుక్య ఇందుశేఖరునితో సంధి చేసుకొని అతని కుమారుడు చాళుక్య వీరభద్రునికి తన కుమార్తె రుద్రమనిచ్చి వివాహం చేశాడు. అప్పటి నుంచి నిడుదవోలు చాళుక్యులు కాకతీయులకు సామంతులైనారు.

కానీ కళింగ రాజ్యం మాత్రం కాకతీయుల వశం కాలేదు. క్రీ.శ.1248లో నెల్లూరిలో తిక్క భూపాలుడి మరణానంతరం రాజకీయంగా చాలా అల్లర్లురేగి దక్షిణంలో గణపతిదేవుని అధికారం పలుకుబడి తగ్గింది. మనుమసిద్ధి తన రాజ్యం చేజారిపోతుందని తన ఆస్థానకవి తిక్కన సోమయాజిని గణపతిదేవుని వద్దకు పంపి అతడి సహాయం కోరినట్లు ప్రతాపచరిత్ర సిద్ధేశ్వర చరిత్రలలో ఉన్న విషయం చారిత్రక సత్యం. గణపతిదేవుడు సైన్యాన్ని దక్షిణం వైపుకు నడిపాడు.

కాకతీయ సైన్యానికి, ద్రావిడ కర్ణాటక సైన్యాలకు గొప్ప యుద్ధం జరిగింది. కాకతీయులకే విజయం కలిగింది. మళ్ళీ దక్షిణం దేశం కాకతీయుల వశమైంది. తరువాత కాకతీయ సైన్యం మనుమసిద్ధితో పాటు రక్కస గంగ పైకి దాడిచేసి ఆతడాక్రమించుకున్న మార్జవాడిని మళ్ళీ స్వాధీనం చేసుకున్నది. అశ్వసైన్యాధ్యక్షుడైన గంగయ సాహిణిని మళ్ళీ ఆ రాజ్యానికి పాలకునిగా గణపతిదేవుడు నియమించి అతణ్ణి బాహత్తర నియోగాధిపతిగా చేశాడు.

గణపతిదేవుని అవసానదశలో జటావర్మ సుందర పాండ్యుని నాయకత్వంలో పాండ్యులు నెల్లూరు మండలంపై దండెత్తి జయించడంతో నెల్లూరు రాజ్యంలో కాకతీయుల పలుకుబడి పూర్తిగా నశించింది. అరవై మూడేళ్ళు నిర్వక్ర పరాక్రమంతో రాజ్యమేలిన గణపతిదేవ చక్రవర్తి పరిపాలనా భారాన్ని అతిసమర్థురాలైన తన కుమార్తె రుద్రమదేవిపై ఉంచి తాను రాజ్యభారం నుండి విశ్రాంతి తీసుకున్నాడు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here