Site icon Sanchika

‘కాకతీయ యుగంలో స్త్రీల సామాజిక స్థితిగతులు – ఒక పరిశీలన’ -20

[డా. మంత్రవాది గీతా గాయత్రి గారు 1995లో పిహెచ్‍డి పట్టా కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖకి సమర్పించిన సిద్ధాంత వ్యాసాన్ని సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము.]

ప్రకరణం 6 – స్త్రీలు – విద్యలు – కళలు: రెండవ భాగం

దేశీ నృత్తరీతులు

రాసకము:

[dropcap]పిం[/dropcap]డి మొదలైన బంధాలను కట్టుబాట్లను ఆశ్రయించి నాయికలు పదహారు మందిగానీ, పన్నెండు మందిగానీ, ఎనిమిది మందిగానీ చేసే నృత్తం రాసకమనబడుతుంది.

నట్టువ కత్తెలు చీరను గానీ, చల్లడాన్నిగానీ, కుబుసాన్ని గానీ, రవికను గానీ, కొప్పును గానీ, జడనుగానీ ఆయా దేశపద్ధతి ననుసరించి దాల్చవచ్చును. వేషం సొగసుగా ఉండి చేతి కడియాలు, కాలందియలు గలగల చేసేవి కావాలి. ఊరుకటిస్తనాలు లావుగాగల మనోహర ప్రాయంలో ఉండేవారయి ఉండాలి. ఇట్టివారు క్రమంగా జంటలుగా వాద్యంతో సరిగా సాగునట్టి చారి మొదలైన వాటితో తెరలో నుంచి రంగస్థలానికి రెండువైపుల నుండి రావాలి.

చర్చరి:

రాసకంలో నాయికలు వర్ణతాళాలతో కూడిన వాద్యంతో మధురంగా చర్చరినిగానీ, ద్విపదిని గాని పాడుతు ప్రవేశించి, శృంగార వీరరసాలతో నాయకుని గుణాలను, కీర్తిని వర్ణిస్తూ వసంతోత్సవంలో మండలాకారంలో నర్తిస్తే దాన్ని చర్చరి అంటారు.

నాట్యరాసకం:

నాయికలు యౌవనాసవ మత్తలై వసంతఋతువులో దేశి ఉయ్యాల పాటలు పాడుతూ రాజుగారి చరిత్రను పదార్థాభినయంతో చూపటం నాట్యరాసకమనబడుతుంది.

దండరాసకం:

నర్తకులు దండరాసకంలో ఎనిమిది నుంచి అరవైనాలుగు మంది వరకు ఉండవచ్చు. రెండు రెండు సరిజట్లుగా ఏర్పడాలి. రెండు చేతులతో రెండు కోలలు ధరించాలి. వాదకులు వాయించుతూ ఉండగా అందమైన దాట్లతో ఎడమ కుడి ప్రక్కల చక్రము వంటి తిరుగుడులతో, చప్పుడుతో ఐదు దెబ్బలు వేస్తూ పరస్పరం కోలలను కలుపుతూ నర్తించాలి.

శివప్రియం:

మృదంగం, కరణ, కంచుతాళం, కాహళము వాయించేవారు తమ తమ వాద్యాలలో యతి ప్రహరణం మొదలలైన వాద్య ప్రబంధాలు వాయిస్తూ ఉండగా పురుషులు గానీ, స్త్రీలు గానీ కంచుతో గానీ రాగితో గానీ చేసిన పాములను ధరించి లయానుసారంగా కిరికిటి అనే శబ్దం స్ఫురించేటట్లు వాయిస్తూ, రుద్రాక్ష సొమ్ములు దాల్చి శివుడినే ధ్యానిస్తూ, బంతులు దీరి శివుని పాటలు పాడుతు, యధోచితాలైన అంగాలతో, పాటలతో, గతితో కూడిన లాస్యాంగాలతో ఒకప్పుడు ఒకరికొకరు ఎదురెదురుగా రెండుగా ఏర్పడుతూ మరొకప్పుడు మండలంగా తిరుగుతూ రకరకాలుగా నర్తించాలి. శివునికి ప్రియమైన ఈ నృత్తము శివోత్సవాలలో చెయ్యదగినది.

చింతు నృత్తము:

చక్కని వేషముతో ఉన్న యువతులు యతి, ప్రహరణము మొదలైన పాటాలను తాళచ్ఛందాన్ననుసరించి వాద్యాలందు, నోట, కరతాళలయతో కూడా పలికిస్తూ లలితాలైన లాస్యాంగాలతో, పాదాలతో, చారులతో, గతులతో, ద్రావిడదేశంలో పుట్టిన చింతు అనే పేరున్న ద్విపదలు పాడుతూ, అభినయిస్తూ, అందమైన లయగల కిత్తు అనే లాస్యాంగం ప్రయోగిస్తూ నాట్యం చేయడం చింతు అనబడుతుంది. ఇది తమిళులకు చాలా ప్రియమైన నాట్యం. బహుశా తమిళ దేశంనుండి వచ్చి తెలుగుదేశంలో స్థిరపడిన శైవుల వల్ల తెలుగుదేశంలో ప్రచారమై ఉండి ఉంటుంది.

‘వేడుకతో చిందువాడంగనుచ్చి

కోడంగి యాటల గునిసెడివారు’

కందుక నృత్యము:

ఇది బంతితో చేసే నృత్యం దీనినే కందుక క్రీడ అంటారు. వాద్యాలు పద్మబంధం, గోమూత్రికాబంధం, నాగబంధ చక్రబంధం మొదలైన వాటితో కూర్చబడిన గీతాలను వాయించుతూ ఉంటే యువతులు వివిధ పదవిన్యాసాలతో, బంగారు, వెండి కంచు లేదా కర్యతో చేసిన బంతులతో ఆడతారు. ఈ బండి డొల్లగా ఉండి లోపల గంట అమర్చబడి ఉంటుంది. బంతి ఆడించగానే బంతిలోని గంట ధ్వని చేస్తుంది. వాద్య స్వర సమ్మేళనానికనుఘుణంగా ఎగరవేయటంతో పాటు యువతులు తమ అంగ విన్యాసాలతో చూపులతో సామాజికుల నాకర్షించాలి. ఈ కందుక నృత్యం లేదా క్రీడ గురించి క్రీడాభిరామంలో ఉన్నది.

భాండిక నృత్తం:

ఇది భండులు – అంటే హాస్యగాళ్ళు చేసేది. ఇది కూడా గుంపుగా చేసే నృత్యమే. వాద్యాలు మ్రోగుతుండగా దానికనుగుణంగా చప్పట్లు కొడుతూ యువకులు కుంటివారిని, మఱుగుజ్జులను, ఏనుగ, వానరాలను అనుకరిస్తూ చేసే నృత్యం. ఈ నృత్యం చేసేవారు నెమలి, సీమకోడి, గాడిద, ఒంటె వంటి పశుపక్ష్యాదుల ధ్వనులని అనుకరిస్తారు. ఇందులో పాల్గొనేవారు రకరకాలుగా హాస్యకరమైన పనులు చేస్తూ జనాన్ని ఆకర్షిస్తారు.

ఘటి – సణి నృత్తం:

ఇది హుడుక్కా అనే వాద్యంతో చేయబడే నృత్యం. వేణువు నూదుతూ గాత్రగానం కొందరు చేస్తుండగా వికృత వేషాలతో ఉన్న స్త్రీ పురుషులు మద్దెల, కంచు తాళం, బాకా వంటి వాద్యాల సహకారంతో శివుడి కిరాతలీలను ప్రదర్శిస్తారు.

చారణ నృత్తము:

సౌరాష్ట్ర దేశంవారైన చారణులు ఊరూరు తిరుగుతూ గేయాలు పాడే వృత్తిగల వారు రకరకాల అనుప్రాసలతో, మధురమైన దోహకాలను తగిన రాగాలతో పాడుతూ, భ్రమరములతో అందమైన గట్టి పాదవిన్యాసాలతో నర్తించే నృత్తము చారణ నృత్తము. నర్తించేవారు స్త్రీలైతే కట్టుచీర కొంగులతో ముసుగు వేసుకొని నృత్యం చేయాలి.

బహురూప నృత్తం:

రాజవంశం గానీ, లోక ప్రసిద్ధమైన చరిత్రను గానీ అభినయింపతగును. నాట్యంలో ప్రత్యక్షంగా చూపగూడని వస్తువును ఇందులో కృత్రిమంగా చూపవలసి ఉంటుంది. అసభ్యకరమై విషయాలు, భాష బహురూపంలో ఉండరాదు. ఇది త్రివిధాభినయాలతో ఒకే వ్యక్తి జంతువుల పక్షుల వేషాలతో, మానవుల వివిధ రూపాలను వేషాలలో అనుకరిస్తూ చేసే నృత్తం. ఈ బహు రూప నృత్తం చేసేనటకుడు ఆశువుగా, అనేక విషయాలు చెప్పగలిగిన సమర్ధుడై ఉండాలి. ఇది పురుషులు చేసే నృత్తం.

కొల్లాట నర్తనం:

ఇది అద్భుత రసాన్ని ప్రదర్శించే నృత్తము. ఇందులో తప్పుట కంచు తాళాలు, మద్దెల, జయఘంట, భేరీ, తమ్మటం వాద్యాలుగా ఉపయోగిస్తారు. పొడుగు వెదురు గడలో నాట్యం చేస్తూ ఒకరి నొకరు కొట్టుకొనే సమయంలో దెబ్బతగలకుండా తప్పించుకుంటూ చేసే ఒక విధమైన యుద్ధరంగ నృత్తం.

కైవార కోవిదం:

వివిధాలైన వినోదవేషాలతో విచిత్ర సంభాషణలతో ప్రదర్శించే నృత్యం.

పైన చెప్పిన దేశి నృత్యాలు శ్రీ పురుషులు శివరాత్రి వంటి పర్వదినాలలో జాతరలలో ఉత్సవాలలో కలిసి చేసేవారు. సంఘంలో క్రింది వర్గాల ప్రజలు తమ శ్రమను మరచి, స్త్రీ పురుష వివక్ష లేకుండా అందరూ కలిసి ఆటపాటలతో గడపడము, తమకు వచ్చిన సంగీత నాట్య జ్ఞానంతో దైవాన్ని కొలిచి తద్వారా ఆనందాన్ని పొందేవారు. వేశ్యలు నేర్చుకొనే మార్గ పద్ధతి నృత్యాలేకాక వేశ్యావాటికలో, దేవాలయ ప్రాంగణాలలో మందిరాలలో ఉద్యాన వీధులలో చేసే నృత్యాల ప్రస్తావన క్రీడాభిరామంలో ఉన్నది.

పుష్పగంధికా నృత్యం:

నారికేళపు మధువు తాగిన స్త్రీలు మందిరో ద్యాన వీధుల్లో ఈ పుష్పగంధికా నృత్యం చేసేవారు.

లాస్యాంగం:

మందిర ప్రాంగణంలో విచిత్ర శ్లోకాలు అనేకరాగాలలో కూర్చి లాస్యాంగం అభినయించేవారు.

మందిరాంతరాంతరాలలో ప్రచ్ఛేదన, సైంధవ, ద్విమూడక స్థిత పాఠ్యాది మార్గాభినయ భేదాలు రసభావం ఉట్టిపడేలాగా అభినయించేవారు.

దీన్నిబట్టి కాకతీయుల కాలంలో స్త్రీలు, యీ సామంత కుటుంబాల స్త్రీలు, దేవాలయ భోగస్త్రీలు, వేశ్యలు వీరందరూ నృత్యాన్ని అభిమానించి నేర్చి ఆ కళను పోషించారనీ మార్గ, దేశి సంప్రదాయాలు నేర్చినా దేశి నృత్యాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారనీ చెప్పవచ్చును. సామాన్య స్త్రీలు సైతం నృత్యాన్ని తమ నిత్యజీవితంలో ఒక భాగంగా దైవారాధనకు మార్గంగా మలచుకోవడంవల్ల తెలుగు సంస్కృతి సుసంపన్నంగా పరిధివిల్లిందని చెప్పాలి.

అపి స్వ పరదేశీయాన్ నానావిధ కలానిధీన్

ప్రస్తుత స్తుతి వాచాలాన్ నమ్యాన్ విద్యావతో ఖిలాన్

పరమండలినో శేషాన్ కవీన్ కీర్తివిధాయినః

అ(భ్యర్చ్యాపి) యథాకామం సువర్ణాభరణాంబరైః

కృతార్ధాన్ పార్థివః కుర్యాత్.. కీర్తిలంపటః

కీర్తికాశపడే రాజు తన దేశంవారైనా, పరదేశం వారైనా నోరారా పొగడే నానావిధ కళానిధులైనవారిని, మాననీయులైన విద్యావంతులను, కీర్తిని కలిగించే ఇతర మండలాల కవులనందరిని వారివారి కోరికకు తగినట్లు బంగారుతో, సొమ్ములతో, వస్త్రాలతో పూజించి కృతకృత్యులుగా చేయదగును.

అని జాయప చెప్పినట్లు ఆనాడు కళలను పోషించిన నానా దేశాల కళాకారులను, కవులను పోషించిన కాకతీయ చక్రవర్తుల, మల్యాల గుండన వంటి సామంత ప్రభువులను, అంగరంగ భోగాలకై విరివిగా దానాలిచ్చి ఆ కళలను పోషించి ఆనాటి స్త్రీ పాటించిన తెలుగు సంస్కృతికి మెరుగులు దిద్ది చరిత్రలో శాశ్వతమైన స్థానాన్ని సంపాదించారనడం అతిశయోక్తి కాదు.

సంగీతం:

కాకతీయుల కాలంలో నృత్యాది ఇతరకళలలో లాగా దేశి పద్ధతిలో సంగీతం ప్రోత్సహించబడింది. ఈ విషయం మనకు నన్నెచోని కుమార సంభవం, పండితారాధ్య చరిత్రలవల్ల తెలుస్తున్నది.

నన్నెచోడుని కుమార సంభవంలో పలుచోట్ల స్త్రీలు ఎన్నో దేశిరాగాలలో సంగీతం ఆలపించినట్లు గమనించవచ్చును.

అంకమాలికలు:

పార్వతి చిన్ననాటనే ఈశ్వరుని స్తుతించే సమయంలో అంకమాలికలు గానం చేసేదని ఆ విధంగా వాటిని గానం చేస్తూనే పలురీతులు గీతభేదాలను నేర్చినదని అందులో ఉన్నది.

లీల నీశ్వరు నంక మాలికల్ వాడుచో

గీత భేదంబుల రీతులెఱిగె

అంకమాలికలు అంటే బిరుదులు గానంచేసే విధములైన గీతాలు.

శివపార్వతీ వివాహ సమయంలో స్త్రీలు అంకమాలికలు, సాహుళి, ఫలమంజరము, పౌరాళి, ఆందోళి భైరవి, నాట రాగాలలో పాడి హారతులిచ్చినట్లు నన్నెచోడుని కుమారసంభవాలలో చెప్పబడింది. పాడిన వారు ఆస్థాన గాయనీ మణులు కారు. శివభక్తి గలిగిన స్త్రీలే. ఈ రాగాలన్నీ దేశిరాగాలని మతంగుడు తన బృహద్దేశిలో చెప్పాడని డా. అల్లాడి వైదేహిగారు తెలిపారు. ఎఱుకు లేమలు, శబర వనితలు వంటి ఆటవిక స్త్రీలు పాడే పాటల గూర్చి కూడా ప్రస్తావించబడింది. పార్వతి శివుని గూర్చి తపస్సు చేసుకొనేందనుకు అడవికి వెళ్ళినపుడు ఆమెకు ఎందరో ఆటవిక స్త్రీలు పాడుతూ కనిపించారని చెప్పిన సందర్భంలో పేర్కొనబడ్డ గీతాలన్ని దేశ సంగీతానికి సంబంధించినవేనని చెప్పవచ్చు.

గౌడుగీతాలు:

ఎఱుకు జాతి స్త్రీలు జీఱిక కల్లు తాగి వనంలో ఆడుతూ గౌడు గీతాలు పాడుతూ రమించేవారు.

రోకలిపాటలు లేదా దంపుడు పాటలు:

శబరి వనితలు పటికపు రోట్లో వెదురు బియ్యం దంచుతూ పలురకాలైన రాగాలతో పాటలు పాడేవారు. ‘జీఱిక కల్లు ద్రావి మదసింధుర గామినులన్ని కేఱియల్ వాఱుచు గౌడుగీతములు వాడుచు బొల్పుగ గ్రాలి’

‘పటికపు ఱోల ముల్వెదురు బ్రాలొగి బోయుచు గౌరుకొమ్మురో

కటగొని దంచుచున్ శబర కామని వెక్కులు రాగముల్ రసోత్కటముగ బాడె’

‘వీనుల కింపెసగ నెఱుకు వెలదులు ప్రీతిన్ వాణీధరు బ్రాడిరి’

ద్విపదకు తరుపోజకు మూలం దంపుళ్ళు పాటలే పాల్కురికి సోమనాధుడు తన బసవ పురాణంలో ఈ పాటలే తన కవిత్వానికి ఆధారమైనవని చెప్పాడు.

ఊయల పాటలు:

హిమగిరి ప్రాంతంలో వనాలమధ్య వనపాల బాలికలు ఉయ్యాలలూగుతూ పాటలు పాడేవారు.

క. గ్రాలుచు వనపాల బాలికలు నవలతికాం

దోలముల వేడ్క సలుపుచు

నాలతులొగి జేసి పాడి రభినవ లీలన్

ఈ ఊయలపాటలు వసంత మాసంలో ఎక్కువ పాడేవారు కుమార సంభవంలో వసంతఋతు వర్ణన సందర్భంలో నన్నెచోడుడు స్త్రీలు ఊయెల పాటలు పాడేవారని తెలిపాడు. దీన్ని బట్టి ఊయలపాటలు దేశి సంగీతానికి చెందిన వని చెప్పవచ్చును.

కిన్నరగీతాలు:

కిన్నర గీతాల ప్రసక్తి కూడా కుమార సంభవంలో ఉన్నది.

‘కలయన్ గిన్నర గీతి గూడ మృదు రేఖంబాడు మత్తాళి’

పాల్కురికి సోమనాధుడు పండితారాధ్య చరిత్రలో శివుని పూజ చేసి వారు పాడే పదముల గురించి ప్రస్తావించినాడు. అవి తుమ్మెద పదాలు, ప్రభాత పదాలు, పర్వత పదాలు, ఆనందపదాలు, శంకర పదాలు, నివాళి పదాలు, వాలేశు పదాలు, గొబ్బిపదాలు, వెన్నెల పదాలు, సంజవర్ణ గుణవర్ణన పదాలు. వీనిని గురించి డా. అల్లాడి వైదేహిగారు తమ ఆంధ్రుల సాంఘిక ఆర్ధిక చరిత్ర అన్న గ్రంధంలో క్రింది విధంగా వివరించారు.

  1. తుమ్మెద పదాలు: ఇవి శృంగారాత్మకాలు. విరహిణి అయిన నాయకి తుమ్మెదతో తన ఆవస్థలు తెలపడం ఈ పదాల రూపంలో ఉంటాయి. వీటినే తరువాత భ్రమరగీతలు అనేవారు.
  2. ప్రభాత పదాలు: (మేలుకొలుపులు) ఇవి ప్రాతఃకాలంలో పాడదగిన భూపాల, బౌరాళి మొదలైన రాగాలతో పాడేవారు. ఇది దేవుని, రాజుని మేల్కొల్పు సమయంలో పాడేవి.
  3. పర్వత పదాలు: ఇవి శ్రీశైలక్షేత్రం గురించి పాడే పదాలు
  4. నివాళి పదాలు: అలతులు, హారతులు, లేక నీరాజనపు పాటలు దేవునికి కర్పూర హారతి నీరాజన మిచ్చేసమయంలో పాడేవి. పెండ్లి కుమార్తె పెండ్లి కొడుకులకు దృష్టి దోషపరిహారార్ధానికై పాడేపాటలు.
  5. గొబ్బిపదాలు: కన్యకలు గొబ్బి నోము లేక గొబ్బి వ్రతం చేసే సమయంలో ఆడి పాడే పాటలు. గొబ్బి అన్నది గోపికా శబ్ద భవం. ధనుర్మాసంలో గోపికలు శ్రీ కృష్ణుని గురించి పాడే పదాలే గొబ్బిపదాలు. క్రమంగా ఇవి కేవలం నోము పాటగా పరిణమించినాయి. ఈ పాటలు కుమ్మి కోలాటం అనే నాట్యాలలో కూడా పాడతారు. బతుకమ్మ పండుగకు ముందు గొబ్బెమ్మలు పెట్టి గొబ్బెమ్మ పండుగ నిర్వహించే ఆచారం తెలంగాణాలో ఉన్నది. దీన్ని కన్నెపిల్లలే చేస్తారు.
  6. వెన్నెల పదాలు: ఇవి శృంగార రసాత్మకాలు. వెన్నెలను సంబోధిస్తూ విప్రలంభ అయిన నాయిక పాడే పదాలు ఇవి. చంద్రుని సంబోధించినపుడు చందమామ పదాలని అంటారు.
  7. సంజవర్ణన పదాలు: సూర్యాస్తమయంలో ప్రకృతి శోభను తెలుపు పదాలు.
  8. గుణవర్ణన పదాలు: దేవుని లేదా వీరుల గుణవర్ణన చేసే పాటలు.

శ్రీశైలంలో శివరాత్రి మహోత్సవాలలో ప్రజలు యక్షవేషం ధరించి ఆడిపాడేవారు.

పైన వివరించబడిన పదాలన్ని సామాన్య ప్రజలు స్త్రీలు, పామరులు తమ పనులలోని శ్రమను మరచి పోయేటందుకు పాడుకునే పాటలే. పర్వత పదాలు శివరాత్రి వంటి పర్వదినాలలో భక్తులు శ్రీశైలం పర్వతం ఎక్కినపుడు అలసట తెలియకుండా పాడుకుంటారు. నివాళి పదాలు అంటే హారతి పాటలు నాటినుంచి నేటిదాకా స్త్రీలందరూ పాడుకునేవి, కాలాలు మారినా, మతాలు మారినా సందర్భాన్ని బట్టి స్త్రీలు ఈ హారతి పాటలలో మార్పులు చేర్పులు చేసి పాడుకుంటారు. అందుకే ఆ పాటలు నిత్య నూతనంగా ఉంటాయి. గొబ్బిపదాలు ఇప్పటికీ పల్లెటూళ్ళలో బాలికలు, యువతులు పాడుకుంటూ ఉంటారు.

పల్నాటి వీరుల కధ – ద్విపద ప్రబంధం:

క్రీడాభిరామంలో కూడా ఎందరో స్త్రీలు గానం చేసినట్లు పలుచోట్ల ప్రస్తావించబడింది. మంచెనశర్మ టిట్టిభిసెట్టి అనువారు ఓరుగల్లు కంతదోవలో తిరిగే సమయంలో పల్నాటి వీరుల కథ పాడేస్త్రీని, ఆ పాటకు తగినట్లుగా తాళంవేసి ఊగుతూ వీర కృత్యాలు ప్రదర్శించే యువకులను చూశారు.

ఈ పల్నాటి వీరుల గాథ పాడే యువతి మార్గపద్ధతిలో సంగీతం నేర్చినది కాదు. కుటుంబంలో అనుచానంగా వస్తూ ఉన్న, వంశపారంపర్యంగా నేర్చుకునే దేశి సంగీత ప్రక్రియ ద్విపద ప్రబంధమైన ఈ పల్నాటి వీర గాథ క్రీడాభిరామం కంటే ముందు కాలంనుంచీ జనసామాన్యంలో ప్రచారంలో ఉన్నది.

మ. దృతతాళంబున వీర గుంభితకదుంధుంధుం కిటాత్కారసం

గతి వాయింపుచు నాంతరాళికయతిగ్రామాభిరామంబుగా

యతి గూడం ద్విపద ప్రబంధమున వీరానీ కముంబాడెనొ

క్కత ప్రత్యక్షరముం కుమారకులు ఫీట్కారంబునం దూలగన్

ఈ పాట వీరావేశంతో లయప్రధానంగా పాడేపాట బహుశా ఇటువంటి పాటలను స్త్రీలు పాడుతూ ఉంటే పురుషులు తగినట్టు అభినయించేవారు అని పై పద్యాన్ని బట్టి ఊహించవచ్చును.

ఏకవీరాదేవి గీతం:

క్రీడాభిరామంలో ఓరుగల్లు పురంలో ఒక మాలెత ఏకవీరాదేవి కథను గానం చేసిందని ఉన్నది.

అలరుంబోడి జనంగమ ప్రమద మధ్యానద్ధఘంటాధ్వనుల్

చెలగం బాడె సమస్తలోక జననిన్ శ్రీ యేక వీరాంబికన్

వలరాజొక్కక మూర్ఛనా స్వరమునన్ బ్రాణంబు గల్పింపగా

గలకంఠీకలకంఠ కోమల కుహూకారంబు తోరంబుగన్

ఒక మాల స్త్రీ మధ్యలో కట్టబడిన గంటలు మోగుతూ ఉండగా మూర్ఛనా స్వరం ఆలాపించుతూ కోకిల కంఠంతో లోకజనని యైన ఏకవీరాదేవిని గానం చేసింది కాకతీయుల కాలంలో మాహరమ్మ లేక ఏక వీరాదేవి కధను బవనీలు, మాదిగ స్త్రీలు వీరావేశంతో చెప్పేవారు.

కామవల్లి లేక అక్కల కామేశ్వర కథ:

ఈ కథను జక్కుల పురంధ్రి గానం చేస్తూ ఓరుగల్లు వీధులలో మంచన శర్మ టిట్టిభసెట్టి అనే వారికి కనిపించినట్లు క్రీడాభిరామంలో ఉన్నది. ఈ జక్కులు పాడే ఆటపాటలే యక్షగానాలని పంచాగ్నుల ఆదినారాయణశాస్త్రిగారు తమ యక్షగానములు అనే వ్యాసంలో తెలిపారు. యక్షగానములనగా క్రీడాభిరామం నాటి కాలమున జక్కుల పాటలేయనియు, నాకాలమందు పర్వదినములలో సంతాన కాంక్షులగు శ్రీమంతులు శుభార్ధులై జక్కులను పిలిపించి వారిచేత పాటలు పాడించు నాచారముండెడిదని తెలియుచున్నది.

అయితే కామేశ్వరి పూజ వ్రతం బ్రాహ్మణుల ఇళ్ళలో చేస్తారు. కొన్ని కుటుంబాలకు కామేశ్వరి ఇలవేల్పు కామేశ్వరీ వ్రత కథ పాడేవారు బ్రాహ్మణ స్త్రీలే గానీ జక్కుల పురంధ్రి కాదు. ఈ విషయం క్రీడాభిరామం లోనే చెప్పబడింది. జక్కుల పురంధ్రి కేవలం కథను పాటగా కట్టి పాడింది.

అక్కలు పాడే కామేశ్వరి వ్రత కథ:

తెల్లపట్టు చీరకట్టుకుని ఉపవాసంతో చిక్కిన నడుముతో ఉరుము చప్పుళ్ళకు, పిల్లదురుల మ్రోతకు అంతకంతకు ఆవేశం ఎక్కువ కాగా పీటలపై కూర్చున్న ఏడుగురు అక్కలలో ఒకతె లేచి నాట్యం చేసింది అని క్రీడాభిరామంలో చెప్పబడింది. అందరూ వీరావేశంతో పాడేపాట అక్కలకామేశ్వరి పాట.

చిత్రకళ:

ఆనాటి స్త్రీలు చిత్రకళను బాగా అభిమానించేవారని ఆనాటి సాహిత్యాన్ని బట్టి తెలుసుకోవొచ్చును.

అయితే ఇది ధనికవర్గాలకు చెందిన స్త్రీలు ఆదరించిన కళ స్వయంగా వారు చిత్రలేఖనం నేర్చుకున్నారన్నది సాహిత్యంలో స్పష్టంగా లేకపోయినా వారి గృహాలను వారి వారి అంతస్తుకు అభిరుచికి తగినట్లు చిత్రాలతో అలంకరించేవారని చెప్పవచ్చును.

పలనాటి వీరచరిత్రలో బాలచంద్రుడు మాంచాలను చూడటానికి వెళ్ళినపుడు వారి యిల్లు ఎంతవైభవంగా ఉందో వర్ణించే సందర్భంలో ఈ చిత్రాల ప్రసక్తి వచ్చింది.

ఘనతర శృంగార కలితమై యొప్పు

గండువారల గృహము కనుగొను వేళ

మాణిక్య తోరణమండి తంబైన

ద్వారంబు చొరబడి వచ్చుచు జూచె

ఘన చిత్రకళ కర్మ కలిత పటాలి

గోడలు కానరాక గుప్తమౌనట్లు

చేసి వితానంబు చెలువొప్పగట్టి.

మాంచాల పడకగది చిత్తరువులతో అలంకరించబడి ఎంత అందంగా ఉండేదంటే దాన్ని చిత్తర్వు మేడ అని అనేవారు. ఆనాటి వారు పడక గదులను ఇంటి పై భాగంలో నిర్మించేవారు. మాంచాల బాలచంద్రుని తన పడక గదికి తీసుకువెళ్ళి అతకిని మంచి చిత్రాలను చూపించింది.

బాలచంద్రుని తోడ బహు మోదమునను

మేడమీదికి పోయి మేలైన యట్టి

చిత్తర్వు జూపుచు చిలకల చదువు

వేశ్యలు కూడా చిత్రకళను అభిమానించారని ఆ కాలంలోని సాహిత్యాన్ని బట్టి తెలుస్తుంది. పలనాటి వీరచరిత్రలో బాలచంద్రుని వేశ్య సబ్బాయి మేడ కూడ అందమైన చిత్తరువులలో వెలిగిపోయేది.

సౌందర్యఖని యైన సబ్బమ యపుడు వివిధ చిత్తరువుల వెలుగుచునున్న మేడపై నెక్కి యామేలిమి గనియె.

క్రీడాభిరామంలో వారాంగన మాచల్దేవి భవనంలో ప్రత్యేకంగా చిత్రశాల నిర్మించబడింది. ఆ చిత్రశాలా ప్రవేశం మాచల్దేవి ఎంత ఆర్భాటంగా జరిపించిందో, ఆ చిత్రశాలలో ఉన్న చిత్రాలెటువంటివో, వారకాంతలెటువంటి చిత్రాలను అభిమానించేవారో క్రీడాభిరామాన్ని బట్టి తెలుస్తుంది.

మాచల్దేవి చిత్రశాలా ప్రవేశం చేయబోయిన సందర్భంలో ఆమె భవనం ముందు చందనంతో కలయంపి జల్లి కాశ్మీరంతో ముగ్గులు పెట్టారు. ఇందురజముతో రంగవల్లులు తీర్చి స్తంభాలకు తోరణాలు కట్టి అలంకారం చేశారు. చిత్రశాలా ప్రవేశం ఇంత ఘనంగా ఉందంటే, చిత్రశాలలో చిత్రాలు మరింత గొప్పగానూ, శృంగార రసోత్కటంగానూ ఉండి చిత్రశాల ‘చిత్తజుని శౌర్యం’ ఎఱిగించేదిగా ఉండేది.

వేశ్యాగృహాలలో ఎలాంటి చిత్రాలను అలంకరించేవారో మాచల్దేవి చిత్రశాలలోని చిత్రాలను బట్టి చెప్పవచ్చు. దారువనభూమిలో ఋషిపత్నులతో ఉన్న శివుడు, సరస్వతి చతుర్ముఖుల శృంగార క్రీడలు, యమునానదీ తీరంలో గోపికలతో రాసలీలలాడే కృష్ణుడు, పర్ణశాలలో అహల్య, ఇంద్రుడు, బృహస్పతి భార్య తారతో నున్న చంద్రుడు, సత్యవతీ పరాశరులు, మేనకావిశ్వామిత్రులు వీరి శృంగార క్రీడలు చిత్రాలలో ప్రతిబింబించినాయి.

సాహిత్యంలోనే కాక శాసనాలలో కూడా స్త్రీలు చిత్రకళనభిమానించినట్లు ఆధారాలున్నాయి.

కాకతీయ గణపతి సోదరి కాకెతమైలమ ఇనుగుర్తిలో చిత్రరూపవిలసితమైన గోపాలకృష్ణాలయాన్ని కట్టించినట్లు క్రీ.శ. 1221 నాటి ఇనుగుర్తి శాసనం వల్ల తెలుస్తున్నది.

‘పార్శ్వోల్లా సీత చిత్ర రూప విలసదోపాల కృష్ణాలయం’

ఆనాటి స్త్రీలు స్వయంగా చిత్రకళను అభ్యసించి కుంచెతో రంగులుపయోగించి చిత్రాలను చిత్రించినట్లు సాహిత్యాధారాలు లేవుగానీ, చిత్రకళను అభిమానించి పోషించినట్లు పైన చూపించిన ఆధారాలను బట్టి తెల్లమౌతుంది. ఓరుగల్లులో చిత్తరువులు వ్రాసే వారి ఇళ్ళు 1500 ఉన్నట్లు ఏకామ్రనాధుని ప్రతాప చరిత్రను బట్టి తెలుస్తున్నది. దీన్ని బట్టి ఆనాటి వారు ముఖ్యంగా స్త్రీలు చిత్రకళను పోషించారని తెలుసుకోవచ్చును.

ముగ్గులు పెట్టటం, రంగవల్లులు తీర్చటం:

గృహ ప్రాంగణాన్ని, అలికి ముగ్గులు పెట్టి రంగవల్లులు తీర్చడం ప్రత్యేకించి, స్త్రీలకు అనూచానంగా అబ్బిన విద్య. కస్తూరి కలయంపి జల్లటం, ముక్తాఫలాలతో ముగ్గులు తీర్చడం, కాశ్మిర, మంజిష్ట, హరినీల, గరుడపచ్చ రంగులలో రంగవల్లులు తీర్చడం కాకతీయుల కాలం స్త్రీలు ఒక కళగా అభ్యసించారు. వివిధ పర్వాలలో, సందర్భోచితంగా స్త్రీలు రాజప్రాసాదాలను, గృహప్రాంగణాలనూ అలంకరించేవారు. ఈ గృహాలంకరణ పురవీధుల అలంకరణ ఆనాటి స్త్రీలు ఏ విధంగా చేసేవారూ, విదేశీయులు కూడా మెచ్చుకొనే విధంగా ప్రతీ వేడుకా, పర్వము వైభవోపేతంగా ఉండే విధంగా చేయటంలో స్త్రీలు ఎంతముఖ్యమైన పాత్ర వహించేవారో ఆనాటి సాహిత్యాన్ని బట్టి తెలుసుకోవచ్చును. కాకతీయులనాటి స్త్రీలు చేసే శరీర సౌందర్యపోషణ గృహలంకారణ, పురవీధుల అలంకరణ అనే శీర్షికల ద్వారా తెలుపబడతాయి.

పురవీధుల అలంకరణ:

రాజుల పట్టాభిషేకాలు, రాజుల, రాజకుమారుల వివాహ సందర్భాలలో, ఉత్సవాలలో పురవీధుల అలంకరణ ఎక్కువగా స్త్రీలే చేసేవారు. రంగనాథ రామాయణంలో శ్రీరాముని పట్టాభిషేకం సందర్భంగా పురాన్ని ప్రజలు, ముఖ్యంగా స్త్రీలు అలంకరించారు. గంధం, కస్తూరి కలిపిన కలయంపితో అన్ని మార్గాలను అలికి చీనీ చీనాంబరాలతో, మణి తోరణాలతో, అరటి పోక వృక్షపు కాండాలతో ద్వారాలన్నీ అలంకరించి, రంగవల్లులలంకరించారు. మణి హేమ కుంభాలతో సౌధగోపుర శిఖరాగ్రాలను అలంకరించారు. మాణిక్యదీపాలతో, సాంబ్రాణి, ధూప, పుష్పాలతో పురాన్ని అలంకరించి, అంతఃపురాన్ని అలంకరించారు.

నన్నెచోడుని కుమార సంభవంలో పార్వతి కళ్యాణం సందర్భంలో శివుడు హిమవంతుని నగరి ప్రవేశించే ముందు హిమవంతుడు పురాలంకరణ చేయించాడు తోరణాలు రకరకాలవి వ్రేలాడదీశారు. బంగారు, మణులు కూర్చిన తోరణాలు (మణి హేమ రచిత తోరణాలు) మామిడి వంటి వృక్షాల చిగుళ్ళతో తయారుచేసిన తోరణాలు (పల్లవ తోరణాలు), వస్త్ర తోరణాలు, మకర తోరణాలు, అద్దాల తోరణాలు (ముకుర తోరణాలు) పుర వీధులలో అలంకరింపబడినాయి. వాత పూరణాలు అంటే గాలి బుడగలు వంటివి, కేతనాలు, కలువడలు అన్ని చోట్ల వేలాడే విధంగా అమర్చారు. కస్తూరి కలిపిన నీటితో కలయంపిజల్లి, కర్పూరం, ముత్యాల రంగవల్లులతో అంగణాలను అలంకరించారు.

తిక్కన రచించిన భారతంలో విరాటపర్వంలో ఉత్తరభిమన్యుల వివాహ సందర్భంలో పెళ్ళిమంటపాన్ని అలంకరించేటందుకు విరాటరాజు చతుర పుణ్యాంగనలను నియమించాడు. వాళ్ళు రత్నదీపాలను మెరుగుపెట్టి, మణిస్తంభాలకు కొత్త జిగి, తళుకు వచ్చేవిధంగా శుభ్రంచేసి విచిత్ర వితానాలు కట్టి, కొత్త ముత్యాల హారాలతో, పూల మాలికలు గుచ్చి వ్రేలాడేటట్లు అమర్చినారు. మంగళం కలిగించే వృక్షాల (మామిడి వంటివి) చిగుళ్ళ తోరణాలు కట్టారు. చందనంతో పెళ్ళి మంటపం అలికి ఆణి ముత్యాలతో ముగ్గు పెట్టారు. క్రంతలలో మణిగణాలు, వస్త్రతోరణాలు, పుష్పపుంజాలు (గుత్తులు) పళ్ళ గుత్తులు (ఫలప్రచయం) అలంకరింఫబడినాయి.

శాంతిపర్వంలో ధర్మరాజు కరినగరం ప్రవేశించినపుడు పురాన్ని కలువడము, తోరణాలు, క్రముకకదళీస్తంభాలు, పూర్ణకుంభ స్థానాలు, మొదలైన వాటితో అలంకరించారు. కస్తూరితో కలయంపి బల్లి, కర్పూరంతో ముగ్గులుపెట్టి, పుష్పోపహారాలతో ప్రాలంబ మాలికలతో పురాన్ని అలంకరించారు.

పైన చెప్పిన అలంకరణలన్ని స్త్రీలు చేసేవారు. పురవీధుల అలకంరణ, గృహాల అలంకరణ, రాజకుమార్తెలకు ప్రత్యేక సందర్భాలలో అలంకరణ ఇవన్నీ ఆనాటి స్త్రీలు ఒక ప్రత్యేకమైన కళగా అభ్యసించేవారు. ఈనాడు కూడా గొప్పవాళ్ళు వచ్చినపుడు, పర్వదినాల్లోనూ నగర వీధుల్ని అలంకరించడం ఉన్నది. పెళ్ళి మంటపాల అలంకరణ బహిరంగ సభలలో వేదికల అలంకరణ చేస్తున్నారు. అయితే వీటిని పురుషులే చేస్తున్నారు కానీ స్త్రీలు చేయటంలేదు. కాకతీయుల కాలంలో స్త్రీలు ఈ అలంకరణ చేసేవారని ఆనాటి సాహిత్యాన్ని బట్టి తెలుస్తుంది.

వేశ్యల గృహాల్ని కూడా వేశ్యాగృహాలలో ఉండే దాసీలు అలంకరించేవారని పాల్కురికి సోమనాధుని బసవపురాణాన్ని బట్టి తెలుస్తుంది.

స్ఫటిక సోపానాలున్న హాటక కుట్టిమ హర్మ్యస్థలంలో కస్తూరి కలయంపిజల్లి ముత్యాలతో ముగ్గులు పెట్టేవారు. కంభకట్లు మేలుకట్లు ఉన్న పుష్పకాగారంలో రత్నమాలికలు కట్టి మణిదీపాలు అలంకరించేవారు. పట్టెమంచంపైన హంసతూలికా తల్పాన్ని అమర్చేవారు. వివిధ సౌరభాలతో నింపేవారు. నేలపైన కంబళీ పరచేవారు. ఈ ఏర్పాట్లన్నీ బసవపురాణంలో ముగ్ధసంగయ్య అనే భక్తుడు వేశ్యగృహానికి వెళ్ళిన్పుడు అక్కడి పరిచారికలు చేశారని బసవపురాణంలో ఉన్నది.

ఈ విధంగా ఆనాటి స్త్రీలు గృహాలంకరణ పుర వీధుల అలంకరణ, శరీరాలంకరణ అంటే ఈనాటి మేకప్ వంటి కళలు అభ్యసించి వాటిని వృత్తులుగా స్వీకరించి జీవనంగడిపే వారు. వారు చేసే ప్రతిపనీ ఎంతో నైపుణ్యంతో, శ్రద్ధతో శాస్త్రీయమైన పద్ధతిలో చేసి ఈ నాటివారికి మార్గదర్శకులైనారని చెప్పవచ్చును.

స్త్రీల శరీర సౌందర్య పోషణ – అలంకరణ

కాకతీయుల కాలంలోని సాహిత్యం ద్వారా, నాటి శిల్పాల ద్వారా ఆనాటి స్త్రీల అలంకరణ ప్రియత్వాన్ని గురించి మనం తెలుసుకోవచ్చు కేవలం తమ హోదాను ప్రకటించుకొనేందుకు ఆభరణాలు ధరించడం అని కాకుండా శరీరాన్ని అందంగా, అరోగ్యంగా ఉంచేందుకు ఎన్ని జాగ్రత్తలు పాటించేవారో అలంకరణ, సౌందర్యపోషక సామగ్రిని ఎంత బాగా ఉపయోగించేవారో నాటి సాహిత్యం వల్ల వెల్లడవుతుంది.

ఆనాటి స్త్రీల శారీరక సౌందర్య పోషణ ఈనాటివారు కూడా అనుసరించవలసిన విధంగా ఉండేది. మనం ఈనాడు దిగుమతి చేసుకొనే కృత్రిమ సౌందర్య పోషక సామగ్రి కాక ప్రతి ఇంట్లో లభించే సహజ సిద్ధమైన మూలికలనుపయోగించి వారు లేపనాలు, తైలాలు, అభ్యంగన సామగ్రి తయారు చేసుకొనేవారు. అంటే వారికి ఆయుర్వేద ప్రకృతి చికిత్సావిధానాలు తెలిసి ఉండేవని చెప్పవచ్చు.

ఆ కాలం స్త్రీలు ఉపయోగించే సౌందర్య పోషక సామగ్రి (అంటే మేకప్ సామగ్రి) ఈ క్రింది విధంగా ఉండేది.

అభ్యంగన సానానికి ముందు నలుగు పెట్టటం – కుంకుమ కస్తూరి, గోరోచనం, సంకుమదం, వాసన గందపుపొడి కలిపి నలుగు పెట్టేవారు. కురులకు సంపెంగ నూనెతో తల అంటేవారు. హరి చందనంతో ఆటకలు అంటే నలుగు పెట్టేవారు. స్నానానికి వాడే నీటిలో ఘన సారం (కర్పూరం) సురభి కలిపిన గోరువెచ్చని నీటితో స్నానం చేయించేవారు. స్నానాలైన తరువాత పచ్చకర్పూరం, పన్నీరు పచ్చికస్తురి కలపము చేర్చిమైపూతగా రాసేవారు. ఈ విధంగా రంగనాధ రామాయణంలో, సీతారాముల వివాహ సందర్భంలో పెళ్ళి కూతుళ్లకు మంగళస్నానం చేయించారు. పై సందర్భాలలో అభ్యంగన స్నానాలకి, నలుగులకి వాడిన సుగంధ ద్రవ్యాలలో ప్రాచీనకాలం నుంచి ప్రసిద్ధంగా వాడే పసుపు లేదా దానికి బదులుగా హరిచందనం ఉన్నది. ధనవంతులు బహుశా పసుపు బదులు చందనం గంధం వంటివి వాడేవారేమో. సామాన్యులు పసుపు వాడేవారని క్రీడాభిరామంలో ఒక పడతి ఇంటి ముందు పసుపు నూరింది అని ఉండటం వల్ల అనుకోవచ్చును.

స్నానంతో సంబంధం లేకుండా, అవసరమైనప్పుడు మైపూతగా పన్నీటిలో కుంకుమ కలిపి పూసేవారు. రంగనాథరామాయణంలో సీత సిగ్గుతో ఉండగా ఒక చెలికత్తె ‘పన్నీట కుంకుమ పదనిచ్చింది’. తట్టు పునుగు తగినంత చందనం కలిపి దట్టంగా మైపూతగా పూసేవారు.

కర్పూరము, అగురు, కస్తూరి, తక్కోలము, అనేవాటిని సమభాగాలుగా చేర్చి చేసిన కలపము అనే దాన్ని యక్షకర్ధమము అంటారు. ఈ కలపాన్ని ఆనాటివారు వాడేవారని ఆనాటి సాహిత్యాన్ని మట్టి తెలుస్తుంది. ఇవి ఎవరికి వారు తయారు చేసుకొని వాడేవారు కాదు. ప్రసాధికలు, సైరంధ్రులనే అలంకరణ నిపుణులు మాత్రమే వాడేవారు.

కలపములు గూర్ప బహువిధ

తిలకంబులు వెట్ట వింతతెరువున బలుపు

వ్వులు గట్టి కట్టి ముద్దుగ

దలముడువగ సరులు గ్రువ్వ దద్ధయు నేర్తున్

అని సైరంధ్రి వేషంలో ఉన్న ద్రౌపది తనకు తెలిసిన విద్యలను గురించి విరాటుని పట్ట మహిషితో చెప్పింది. దాన్ని బట్టి సైరంధ్రులు ఈనాటి బ్యూటీషియన్స్ వంటి వారని చెప్పవచ్చు. కాకపోతే ఈనాడు శరీర సౌందర్య పోషణకు కృత్రిమ సాధనాలు వాడితే కాకతీయుల కాలంలో ప్రకృతి సిద్ధమైన, సుగంధద్రవ్యాలను వాడేవారు. ఇందులో కొన్నింటిని దిగుమతి చేసుకొనేవారు. గణపతిదేవుని కాలంనాటి ఒక వరంగల్లు శాసనంలో ఉభయవానాదేశి అనే (ఎగుమతి దిగుమతి వ్యాపారం చేసే) వర్తక సంఘం వారు వ్యాపారం చేసే వస్తువులలో కస్తూరి, చందనం అనే దినుసుల ప్రసక్తి ఉన్నది. దాన్ని బట్టి ఈ వస్తువుల వాడకం బాగా ఎక్కువగా ఉండేదని చెప్పవచ్చు.

స్నానానికి హంసోదకము, సుగంధోదకం అంటే పన్నీరు కలిపి వాడేవారు. హంసోదకమంటే ఏలకి కాయలు కలిపి చేసిన మద్యవిశేషం అని, ఎండకు వేడిచెంది, వెన్నెలకు చల్లబడే ఉదకమని సూర్యరాయాంధ్ర నిఘంటువులో అర్ధాలున్నాయి.  కుమార సంభవంలో పార్వతికి వివాహాత్పూర్వం చేయించే మంగళ స్నానానికి ఈ హంసోదకం, సుగంధ జలం కలిపి వాడారు.

తలస్నానం తరువాత శిరోజాలకు అగరుధూపం వేసేవారు. వంటికి కస్తూరి, కాశ్మీరం, కర్పూర మలయజం (గంధం) కలిపి పూసేవారు. పల్నాటి వీరచరిత్రలో మాంచాలకు చెలికత్తెలు పై సుగంధద్రవ్యాలన్నీ కలిపి మైపూతగా పూశారు.

శిరోజాలంకరణ :

శిరోజాలను దువ్వి ముడివేసేవారు. ఆ రోజుల్లో స్త్రీలు జుట్టు దువ్వి ముడివేసేవారు. దీన్నే కబరి అనేవారు. రకరకాల ముడులు వేయటం, పూలు రకరకాలుగా గుచ్చి అందంగా అమర్చటం సైరంధ్రికలు చేసేవారు. ఆనాటి స్త్రీలు జుట్టు విప్పుకొని ఉండటం, ముడివీడి ఉండటం, జుట్టు చెదిరి ఉండటం అశుభానికి గుర్తుగా భావించేవారు. భర్తలు చనిపోయిన విధవ స్త్రీలు జుట్టు విరబోసుకొని ఉండేవారు. సాధారణంగా నాగరిక స్త్రీలనుండి పామర స్త్రీల వరకు శ్రీలందరూ జుట్టు దువ్వుకొని కొప్పుపెట్టుకొనేవారు. రంగనాథ రామాయణంలో సైరంధ్రికలు సీత, ఊర్మిళ మొదలైన పెళ్ళికూతుళ్ళకు శిరోజాలు దువ్వి కొప్పులు పెట్టి, విరజాజి పువ్వులు అలంకరించారు. కుమార సంభవంలో పార్వతికి శిరోజాలు దువ్వి కబరికి హంసతిలకం అనే ఆభరణాన్ని అమర్చారు. జాజి పువ్వులు ముడిచారు.

ఆ రోజుల్లో స్త్రీలు చేసుకొనే శిరోజాలంకరణ విధాలు, రకరకాల సిగలు ఆనాటి దేవాలయ శిల్పాలలో చూడవచ్చును. రామప్ప దేవాలయం గోడలపై ఉన్న నర్తకీమణులు, స్త్రీలు చేసుకొన్న రకరకాల శిరోజాలంకరణ పద్ధతులు మనమీనాడు చూడవచ్చు.

స్త్రీలు వారి దేశాచారాలను బట్టి జడలువేయడం ముడి వేయడం చేసేవారు. సైరంధ్రీజాతి స్త్రీలు జడను అల్లి ముడిగా చుట్టి, కుడివైపుకు వచ్చేట్లు వేసుకొనే వారు. విరాట పర్వంలో ద్రౌపది సైరంధ్రీజాతి వారి వేషానికి సముచితంగా ఉండే విధంగా పై విధమైన శిరోజాలంకరణ చేసుకున్నది.

కేశాలంకరణలో వేణిధారణము ఒకటి కానీ ఆనాటి వారికి పొడవైన జడలున్నట్లు కనిపించదు. క్రీడాభిరామంలో కర్ణాటాంగన వేణియవటూ దేశంబుపై రాయగా ఏతెంచింది. అంటే ఆమె వేణి కేవలం మెడవరకు మాత్రమే ఉన్నట్లున్న సంపంగి నూనె నమ్మే కరణ కాంత విజ్జోడు పడనిడ్డ వెండ్రుక జందెము రొమ్మువరకు మాత్రమే ఉన్నది. ఆ కాలం వారు ఎక్కువగా ముడి కబరి వేసుకొనేవారు. సవరాలు వాడేవారు. దాన్ని బట్టి ఆనాటివారి జుట్టు ఎక్కువ పొడవు పెంచుకొనే వారు కాదని, శిరోజాలంకరణ కూడా ఎక్కువ మెడపైభాగాన ఉండే విధంగా చేసుకొనేవారని భావించవచ్చును.

కుంకుమ – కస్తూరి రేఖలు:

ఆనాటి స్త్రీలు ఫాలభాగంలో కుంకుమరేఖ నలంకరించే వారు. కనుబొమల మధ్య కస్తూరి బొట్టు పెట్టేవారు. కస్తూరితో చెక్కిలిపైన మకరికా పత్రాలు రచించేవారు. ఱొమ్మపైన కూడా మకరికా పత్రాలు రచించేవారని నృసింహమహర్షి రచించిన సిద్ధోద్వాహం అనే శిలాశాసన కావ్యాన్నిబట్టి తెలుస్తుంది.

పెదవులకు సింగారం:

ఆనాటి స్త్రీలు పెదవులకు రంగునిచ్చేటందుకు తాంబూల సేవనం చేసేవారు. రంగనాథ రామాయణంలో సీత పెదవులు ఎర్రబడేందుకు చెలికత్తెలు తాంబూలం ఇచ్చారు. కొందరు పెదవులకు (లత్తుక) వన్ను పూసేవారు. కుమార సంభవంలో పార్వతిని అలంకరించే చెలికత్తెలు ఆమె పెదవులకు లత్తుక పూశారు. ఈనాటి నాగరిక స్త్రీలు లిప్‌స్టిక్ పూసినట్లే ఆ రోజుల్లో నాగరిక స్త్రీలు రాజకుటుంబాలలోని స్త్రీలు పెదవులకు లత్తుక పూసుకొనేవారు. కేతన రచించిన దశకుమార చరిత్రలో కూడా ఈ లక్తకము (లత్తుక) స్త్రీల శృంగార సాధనాలలో ఒకటిగా పేర్కొనబడింది. లత్తుక పెదవులకే కాక పాదాలకు కూడా పూసేవారు. పలనాటి వీరచరిత్రలో మాంచాలకు చేసిన సింగారంలో పాదాలకు లత్తుక పూయటం కూడా ఒకటి. కళ్ళకు కాటుక, కాళ్ళకు గోరింటాకు పెట్టటం ప్రాచీనకాలం నుంచి నేటివరకు ఉన్నది. పాదాలకు పారాణి రాయడం, పసుపు రాయడం ఈనాటికీ ఉన్నది కానీ కాకతీయుల నాటివలె పాదాలకు లత్తుక పూయడం లేదు. ఆనాటి సాహిత్యంలో పారాణీ ప్రసక్తి రాలేదు.

ఇక అనులేపనాలు, మంజనాలు వంటివి చేసి చర్మ సౌందర్యాన్ని ఇనుమడింప చేసుకొనేవారు నాటి స్త్రీలు. ఇప్పుడు ఆధునికులు ఫేస్ పాక్ అంటే ముఖానికి కప్పు వలె పూసుకొనే లేపనం వాడినట్లు, ముఖానికి మర్దనం చేయించుకొన్నట్లు ఆనాటి స్త్రీలు అనులేపనాలు, మండనాలు చేయించుకొనేవారని, అయితే బ్రాహ్మణ తావసకన్యలు ఇవేమీ చేసుకోకుండానే వారి శరీరపుఛాయ మెరిసేదని కుమారసంభవంలో వర్ణనని బట్టి తెలుస్తుంది’.

పైన వ్రాసినదాన్ని బట్టి ధనవంతులైన స్త్రీలు భోగరాసిక్యత, సౌందర్యపిపాస ఉన్నవారనీ, అలంకరణకు ఎక్కువ ధనాన్ని, కాలాన్ని కూడా వెచ్చించేవారని తెలుస్తుంది. సామాన్య కుటుంబాల స్త్రీలు కూడా అలంకరణ విషయంలో కొంత శ్రద్ధ చూపేవారని చెప్పవచ్చును. కేవలం వేశ్యలే కాక కులస్త్రీలు కన్యలు, వివాహితలు కూడా చక్కగా అలంకరించుకొని తిరిగేవారని ఆనాటి సాహిత్యాన్ని బట్టి తెలుసుకోవచ్చు. కాలక్రమేణా కేవలం వేశ్యా స్త్రీలు మాత్రమే పురుషులనీ ఆకర్షించేందుకు అలంకరించుకోవాలనీ, సంప్రదాయ కుటుంబాలలోని స్త్రీలు శృంగారించుకోవడం అలంకరించుకోవడం తప్పనీ భావించడం ప్రారంభించారు. నలభైయాభై ఏళ్ళ క్రిందవరకు గృహిణులెవరైనా చక్కగా సింగారించుకున్నా, వీధిలో నిలబడినా ‘సానిదానిలాగా ఏమిటా సింగారం’ అని భర్త గద్దించడం, కుటుంబంలో పెద్దలు విమర్శించడం జరిగేవి. కాలం మారి, స్త్రీలు విద్యాధికలై, ఆర్థిక స్వాతంత్య్రము వాక్స్వాతంత్ర్యము వచ్చి, సంఘంలో స్త్రీలు అలంకరణ విషయంలో, వస్త్రధారణ విషయంలో ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. తద్వారా ఎన్నో పరిశ్రమలకు, ఎంతమందికో జీవనోపాధి కలగడం జరుగుతున్నది.

(సశేషం)

Exit mobile version