Site icon Sanchika

‘కాకతీయ యుగంలో స్త్రీల సామాజిక స్థితిగతులు – ఒక పరిశీలన’ -22

[డా. మంత్రవాది గీతా గాయత్రి గారు 1995లో పిహెచ్‍డి పట్టా కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖకి సమర్పించిన సిద్ధాంత వ్యాసాన్ని సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము.]

ప్రకరణం 7 – కాకతీయుల కాలం నాటి మతసంప్రదాయాలు – స్త్రీలు: రెండవ భాగం

కాకతీయుల నాటి స్త్రీలు-ధర్మకార్యాలు:

[dropcap]కా[/dropcap]కతీయుల కాలంలో స్త్రీలు దైవకార్యాలు చేయటంలోను, దానధర్మకార్యాలు చేయటంలోనూ స్వాతంత్య్రం చూపినట్లు కనిపిస్తుంది. ఈనాడు ఉద్యోగినులైన స్త్రీలు కూడా తండ్రి లేదా భర్త అనుమతి లేకుండా స్వంతానికి ఖర్చు చేయడానికి వెనుకాడతారు. ఇక దానధర్మాలన్నవి అనూహ్యం. అటువంటిది దాదాపు ఏడెనిమిది వందల సంవత్సరాల వెనుక కాకతీయుల కాలంలో స్త్రీలు ఆలయాలు కట్టించి, చెరువులు తవ్వించి, సత్రాలు, చలివేంద్రాలు పెట్టించి సంఘానికి ఉపయోగించే పనులు స్వతంత్రంగా చేశారంటే ఆశ్చర్యం కలుగక మానదు. మహారాణులు మొదలుకొని సామాన్య స్త్రీల వరకు ఎందరో ఈ దానాలు చేసి శాసనాలు వేయించారు. స్త్రీలు ఆ కాలంలో దానాలు ఎక్కువగా చేయడానికి కారణాలు ఏమిటి? ఏ విధమైన దానాలు చేసేవారు? ఈ దానాలు చేయడానికి వారికి ధనం ఏ రూపంలో లభించేది? ఏ ఆశయంతో వారు ఈ దానాలు చేసేవారు? ఏ వర్గపు స్త్రీలు ఎక్కువ దానాలు చేసేవారు? అన్న ప్రశ్నలకు సమాధానాలు ఆకాలంలో ఆ స్త్రీలు వేయించిన శాసనాలు బట్టి గ్రహించవచ్చును.

మధ్యయుగంలో ముఖ్యంగా చాళుక్య చోడయుగంలోనూ కాకతీయుల కాలంనాటికీ క్రతుకర్మాదికాలకు ప్రాధాన్యత తగ్గి పౌరాణిక ధర్మ వ్యవస్థకు ఆదరం హెచ్చింది. ధర్మ సంప్రదాయాలు ద్విజులే కాక చతుర్థ కులాలవారు కూడా పాటించసాగారు.

పౌరాణిక మతోద్ధరణం వల్ల ప్రజలలో పౌరాణిక ధర్మజ్ఞానం పట్ల పురాణ దేవతారాధన పట్ల భక్తి శ్రద్ధలెక్కువైనాయి. పురాణాలలో చెప్పబడిన దానాది విషయాలను పాటించసాగారు. అందులో సప్తసంతానాలకు ప్రాముఖ్యం ఇవ్వబడింది. పరలోకగతులైన ఆత్మీయులకు బంధువులకు, ప్రభువులకు ధర్మార్థంగా అఖండ దీపదానం చేయడం, మరణించినవారి జ్ఞాపకార్థం శివలింగ ప్రతిష్ఠ, ఆలయనిర్మాణం ప్రజలు వారివారి శక్తికొద్దీ చేయసాగారు. ఆనాడు స్త్రీలకు కూడా దానాలు చేయడంలో స్వాతంత్య్రం ఉన్నది కనుకనే ఆ కాలంలో దానాలు చేసి, శాసనాలు వేయించిన స్త్రీలు అధికంగా ఉన్నారు. వారిలో రాజుల, సామంతుల కుటుంబాల స్త్రీలు ఎక్కువ. వారు ఈ సప్తసంతానాలకు ప్రాధాన్యతనిచ్చినట్లు శాసనాల ద్వారా నిర్ధారితమౌతుంది.

సప్తసంతానాల గురించి నన్నెచోడుడు కుమారసంభవంలో ఈ విధంగా చెప్పాడు.

పూని మహాగ్రహార వర పుత్ర సమున్నతి దేవతాలయో

ద్యాన తటాక సత్కృతి నిధానము లాశశి తారకంబు సు

స్థానములై మహింబరగ జంగమ మల్లయపేర సప్తసం

తానములొప్ప నిల్పుదు ముదంబున దత్ప్ర భునాజ్ఞ పెంపునన్

అగ్రహారం, పుత్తుడు, దేవాలయం, ఉద్యానవనం, తటాకం, సత్కావ్యం, నిధి అనేవానిని ఆనాడు సప్తసంతానాలుగా పరిగణించేవారు అని పై పద్యాన్ని బట్టి గ్రహించవచ్చును. కాకతి రుద్రదేవుని మంత్రి వెల్లకి గంగాధరుడు క్రీ.శ. 1171 నాటి కరీంనగర్ శాసనంలో ఈ సప్తసంతానాలుగా ఈ క్రిందివానిని పేర్కొన్నాడు.

‘తన పెంచిన సన్తానముందన,

సన్తానంబుం గృతియు దనన,

ల్లిల్లిను వనము నుం జెఱువును,

గుడియునుం జన వినుతము,

లైన సప్తసంతానంబులు’

తాను పెంచిన సంతానము, తన సంతానము, కావ్యము, అగ్రహారము, వనము, చెఱువు, గుడి అనేవాటిని గంగాధరుడు సప్తసంతానాలుగా పేర్కొన్నాడు. మహారాజులు, సామంతులు, మంత్రులు వంటివారు, ధనవంతులైన పురుషులే కాక స్త్రీలు కూడా సప్తసంతానాలకు ప్రాముఖ్యాన్నిచ్చారని ఇంతకుముందు చెప్పడమైనది.

ఈ సప్తసంతానాలలో ముఖ్యమైన ఆలయ ప్రతిష్ఠ, చెరువులు తవ్వించడం అన్నవి స్త్రీలు చేశారు. సంతానం కోసం నోములు, పూజలూ వంటివి చేసేవారు. నిజానికి సంతానం కలిగి ఉండడం లేదా సప్తసంతానాలను కలిగి ఉండాలనేది పురుషుడి ఆశయం. కానీ కాకతీయుల కాలంలో స్త్రీలు కూడా ప్రత్యేకంగా తమ ధనం నుంచి ఖర్చు పెట్టి తమ పేరుమీద ఆలయాలు కట్టించి, చెరువులు తవ్వించి, పూదోటలను భగవంతునికి అర్పించి కీర్తినిధిని సంపాదించి, పూజలు నోములు చేసి పుత్రుని పొంది, సప్తసంతానాలను పొందినట్లు చెప్పవచ్చును. ఆనాటి స్త్రీలు వేయించిన శాసనాలలో మెట్టినింటి వంశవర్ణనే కాక తప్పనిసరిగా పుట్టినింటి వంశవర్ణన ఉండేది. వారు చేసిన ఈ ప్రజోపయోగ కార్యాలవల్ల ఆ స్త్రీలకే కాక వారి పుట్టినింటికీ, మెట్టినింటికీ కూడా శాశ్వతమైన కీర్తి లభించింది. కాకతి మైలమ, కుందమాంబ, గోన బుద్ధారెడ్డి కూతురు కుప్పాంబ, కాటకూరు మైలమ, కాకతిప్రోలుని మంత్రి బేతన భార్య మైలమ, పిల్లలమఱి రేచెట్లు బేతిరెడ్డి భార్య ఎఱకసానమ్మ, వెలనాటి మన్మగొంక భూపతి భార్య జాయాంబిక, మొదలైన శ్రీలందరూ వారి శాసనాలలో పుట్టినింటినీ, మెట్టినింటినీ కీర్తించినవారే. కనుక కాకతీయుల కాలంనాటి స్త్రీలను వారి తల్లిదండ్రులు, భర్తవైపు బంధువులు గౌరవంగా చూసేవారని, ఆ స్త్రీలకు ఆర్థిక స్వాతంత్ర్యం ఉండేదని చెప్పవచ్చు.

కాకతీయుల కాలంనాడు అంటే పరిశోధనాంశానికి చెందిన కాలంలో (క్రీ.శ. 1100 నుండి 1323 వరకు) ఉన్న శాసనాలలో దానాలు చేసిన స్త్రీలలో అగ్రహారాలు, చెఱువులు, ఆలయాల నిర్మాణం వంటి మహాకార్యాలు చేసిన స్త్రీలను గురించి ఈ ప్రకరణంలో ప్రస్తావించబడుతుంది.

ముప్పమాంబ, నతవాడి (క్రీ.శ. 1104):

నతవాడి దుగ్గభూపతి భార్య ముప్పమాంబ. ముప్పేశ్వర దేవరను ప్రతిష్ఠించి ఆలయం కట్టించింది. చాళుక్య విక్రమవర్షం 29 (క్రీ.శ. 1104) తారణ సంవత్సరం ఉత్తరాయణ సంక్రాంతి సమయంలో ముప్పేశ్వర దేవరకు అంగభోగార్థం, పూజారి ఆహార నిమిత్తం ముప్పమాంబ భర్త నతవాడి దుగ్గభూపతి రట్టసముద్రం వెనుక రెండు మర్తుర్లు వరిభూమి, ఇరవై మర్తుర్లు కరంబం దానమివ్వగా ముప్పమాంబిక గుండెనిబండ లోని నెరపుంగుంట దానమిచ్చింది.

జాయాంబిక (క్రీ.శ. 1186):

మహామండలేశ్వర కులోత్తుంగ మన్మగొంక భూపతి భార్య, కొండపడమటి రాజకుమార్తె (పర్వతామర వంశ) అయిన జాయాంబిక హరి భక్తురాలు. ఈమె పిఠాపురంలో కుంతీమాధవ దేవాలయంలో ఇంద్రనీల కాంతులతో వెలిగే స్తంభాలతో ఆస్థాన మండపం కట్టించింది. ప్రాకారాన్నీ, గోపురాన్నీ నిర్మించింది. కమలాయ (లక్ష్మీ)ని ప్రతిష్ఠించి, విష్ణువుతో లక్ష్మీని కూడా పూజించి కోరిన వానిని పొందింది. గోపురాలపై సువర్ణకలశాలను ప్రతిష్ఠించింది. కుంతీమాధవునికి శక సం. 1108, మేషసంక్రాంతి నాడు ప్రోలునాడులోని నవఖండవాడ అనే ఊరు గృహాలు, పొలాలు, భూములు, తోటలతో సహా ధూపదీప నైవేద్యాలకు, నైమిత్తిక మాసోత్సవ, సంవత్సరోత్సవాదుల కొరకు గీతనృత్తవాద్యాది వివిధ భోగార్థం దానం చేసింది.

గుండాంబిక (క్రీ.శ. 1171):

మహామండలేశ్వర బుద్ధరాజుల అగ్రమహిషి గుండమదేవి శక సం. 1068 నాటి శాసనాన్ని బట్టి నాదిండ్ల దక్షిణంలో తాను కట్టించిన గుండసముద్రాన్ని నాదిండ్ల మూలస్థాన మహాదేవునికి నైవేద్యానికై, ఆచంద్రతారార్కంగా ఇచ్చింది. శక సం. 1093 (క్రీ.శ. 1171) న నాదిండ్ల మూలస్థాన మహేశ్వరునికి అఖండదీపం సమర్పించింది.

గోకాంబిక ( క్రీ.శ. 1170):

పడవాలు గొంకని భార్య, ముచ్చన నాయకుని కూతురు గోకాంబిక, ఆమె భర్త పడాలు గొంక శక సం. 1092లో మ్రోంపత్తి చోడేశ్వర దేవరకు రెండు అఖండ దీపాలను సమర్పించి, ఆలయంలో దేవరను త్రిసంధ్యల కొలిచే సానులకు పూజారులకు భూములను వృత్తిగా ఇచ్చారు.

కుందమాంబ (క్రీ.శ. 1219):

కాకతి మహాదేవుని కూతురు, కాకతి గణపతి దేవుని చెల్లెలు అయిన కుందమాంబ. తన వివాహ సమయంలో తండ్రి హరిదార్థం అంటే (పసుపుకై) శ్రీధనంగా ఇచ్చిన వేములతోంట అనే గ్రామంలో కొంతభాగాన్ని తన భర్త పేరుమీద రుద్రేశ్వరునికి, తండ్రి పేరుమీద మాధవమహదేవునికి, సూర్యునికి, అన్న గణపతిదేవుని పేరుమీద గణపతిని ప్రతిష్ఠించి దానం చేసింది. తక్కిన స్థలాన్నంతా కుందవరం అనే అగ్రహారంగా చేసి బ్రాహ్మణులకు దానం చేసింది. హిడింబాచలం పైన కాలేశ్వరంలోను, జీడికల్లు, శ్రీశైలం మంత్రకూటం అనే ప్రదేశాలలో శివునికి ఆలయాలు కట్టించి, గోదావరీ తీరంలో నున్న కుందవరం అనే గ్రామాన్ని అగ్రహారంగా చేసి బ్రాహ్మణులకు దానమిచ్చింది. (వరంగల్లు జిల్లా జనగామ తాలూకాలో ఒక కుందవరం, ఆదిలాబాదు జిల్లాలో గోదావరీతీరంలో మరొక కుందవరం ఉన్నాయి.) ఈమె కుందసముద్రమనే చెరువును కట్టించింది. కుందేశ్వరాలయం కట్టించింది. ఈమె చేసిన ధర్మకార్యాలన్నీ ప్రస్తుతిస్తూ కావ్యరూపంలో నిడిగొండ, కుందవరం శాసనాలను వెలయించిన కవి బాలభారతి. ఈ శాసనాలను కృతులుగా భావిస్తే కుందమాంబ సప్తసంతానాలుగా చెప్పబడినవాటిలో అగ్రహారం, దేవాలయం, పుత్రులు, తటాకం, కృతి అనేవానిని కలిగి ఉన్నదని చెప్పవచ్చును.

కాకతి మైలమాంబ (క్రీ.శ. 1209):

కాకతి మైలమాంబ గణపతిదేవుని రెండవ చెల్లెలు. బయ్యారం శాసనాన్ని బట్టి ఈమె శక సంవత్సరం 1108న (క్రీ.శ. 1183) జన్మించినదని తెలుస్తున్నది. కాకతి మహదేవునికి, బయ్యమాంబికకు జన్మించింది. ఈమె దానధర్మాలెన్నో చేసి పుణ్యకీర్తి అని ధర్మకీర్తి అని బిరుదులు పొందినట్లు త్రిపురాంతక శాసనం, కోటగడ్డ శాసనాలను బట్టి తెలుస్తున్నది. ఈమె తన తల్లి బయ్యాంబిక పేరుమీద ఒక శివాలయాన్ని, బయ్యవరం అనే గ్రామాన్ని నిర్మించింది. ఆ గ్రామమే నేటి బయ్యారం. ఇక్కడ లభ్యమైన ఇతర శాసనాల వల్ల మైలాంబ అనేకమైన ఆలయాలను చెఱువులను నిర్మించిందని తెలుస్తున్నది. ఈమె కట్టించిన బయ్యసముద్రమనే చెరువు నేటి బయ్యారం చెఱువుగా ప్రసిద్ధమైనది. తన పేరుమీద ధర్మకీర్తిపురమనే గ్రామాన్ని కట్టించిందని, కోటగడ్డలోని మరొక శాసనంలో శివాలయం కట్టించి ధర్మశివాచార్యునికి కొంత భూమిని దానం చేసిందని చెప్పబడింది.

నామాలపాడు శాసనంలో మైలమ గణపతి దేవరాలయం అనే శివాలయాన్ని, రామనాధునికి మరొక ఆలయం కట్టించిందని తన రెండవ కొడుకు గణపతి పేరుమీద గణప సముద్రమనే ఊరును, చెరువును కట్టించిందని తెలుస్తున్నది. పై శాసనాలను బట్టి శ్రీశైలాది క్షేత్రాలలో శివ ప్రతిష్ఠలు చేసిందని, తండ్రి పేరున మహదేవపురం నిర్మించినదనీ తెలుస్తున్నది. మైలమ సాంఘిక సంక్షేమ కార్యక్రమాల మీద అత్యంతాసక్తి ఉన్నదని ఆమె కట్టించిన ధర్మకీర్తి పుర వర్ణనను బట్టి తెలుస్తుంది. ఆ నగరంలో నానాదేశాల నుండి వచ్చే రోగులకు ప్రత్యేక రోగ చికిత్సాలయాలు ఉండేవి, దీనులకు ఆశ్రయమిచ్చే గృహాలు, అశ్వశాలలుండేవి. సంగీత గోష్ఠులు, కావ్యగోష్ఠులు జరపడానికి ప్రత్యేక ప్రదేశాలుండేవి.

క్రీ.శ. 1221 నాటి ఇనుగుర్తి శాసనాన్ని బట్టి మైలమ ఇనుగుర్తిలో శివునికి వస్త్రాలంకారాలు, గోవులు, భూమి, పుష్పవనం అర్పించింది. రకరకాల శిల్పాలతో అలంకరింపబడిన పర్వతగుహలో జలంధరేశ్వర భైరవుని ప్రతిష్ఠించింది. సోపానాలు కలిగిన బావిని, గాయనులకు గృహాలను కట్టించింది అని తెలుస్తున్నది. చిత్రరూపాలతో విలసిల్లే గోపాల కృష్ణాలయాన్ని కట్టించి కాకెత మైలమ హరిహరాద్వైత భావాన్ని ప్రకటించింది.

మేలమాంబ వేయించిన శాసనాలను బట్టి ఆమె అగ్రహారాలను, చెరువులను, ఆలయాలను, నిర్మించిందని పుష్పవాటికలు సమర్పించి పుత్రసంతానం కలిగి, ధర్మకీర్తి, పుణ్యకీర్తి అనే కీర్తినిధులని కలిగి రామదేవుడనే కవిచక్రవర్తి చేత విరచితమైన కావ్యములవంటి శాసనాలు వేయించి సప్తసంతాలను కలిగి ఉన్నదని చెప్పవచ్చును.

మైలమ (క్రీ.శ. 1202):

కాకతి గణపతిదేవుని ముఖ్యసేనాధిపతి చౌండసేనాని భార్య. విర్యాల అన్నయ, ఐతమల కుమార్తె అయిన మైలమ ధర్మకార్యాలలో అగ్రగణ్యురాలు. కట్టకూరులో రెండు చెఱువులు తవ్వించింది. రెండు అగ్రహారాలను దానంచేసింది. శక సంవత్సరం 1124లో తన పేరు మీద తల్లిదండ్రుల పేరుమీద మల్లికార్జున, అన్నేశ్వర, ఐతేశ్వర దేవరలకు ఆలయాలు కట్టించి త్రికూటాలయాలలోని దేవరకు అంగభోగార్థం ఇరవై నివర్తనల భూమిని, పుష్పవాటికలను అర్పించింది. విప్రులకు గోదానాలను చేసింది. గోవులను, భూములను, బంగారు, అన్నవస్త్రాలను ఇచ్చి పండితులను గౌరవించేది. శివాలయాలను ఎన్నిటినో కట్టించింది. గో బ్రాహ్మణ పూజాతత్పరురాలు. గోవులను నువ్వులు బెల్లము, లవణము, పాలు, నేయి, పెరుగు, తేనె మున్నగువానితో అర్చించింది. విప్రులకు వృత్తులనేకం దానం చేసింది. దేవ, భూసురులకు వివాహలు చేసింది. అగ్రహారాలను, ఆలయాలను నిర్మించి పూలవనాలను, అర్పించి, చెఱువులను తవ్వించి, కాటకూరు శాసనం ద్వారా పుట్టింటికీ, మెట్టినింటికీ కీర్తి గడించి కులభూషణమనే కీర్తి సంపాదించిన మైలమ ఆ కాలపు స్త్రీలకు ప్రతినిధిగా భావించవచ్చును.

ఎఱకసానమ్మ 1 (క్రీ.శ. 1208):

రేచర్ల పిల్లలమర్రి బేతిరెడ్డి భార్య ఎఱకసానమ్మ మహాదానపరురాలు. ఈమె ఎన్నో ప్రజోపయోగకార్యాలు చేసింది.

క్రీ.శ. 1208 (శ. 1130) లో పిల్లలమర్రిలో తన పేరుమీద ఎఱకేశ్వర దేవరను ప్రతిష్ఠ చేసి, గుడి, గోపురం కట్టించి, శిఖరం పెట్టించింది. బావి, మఠము కట్టించింది. వీటికి అంగరంగ భోగాలకు, సమస్త పూజలకు తన పేరుతో ఉన్న ఎరకపురమనే ఊరిలో దేవబ్రాహ్మణ వృత్తులు తమ తోటలు తప్ప తక్కిన మాగాణి, మెట్ట భూములు (నీరునేల, వెలివొలము), ఉప్పరిపాడులో ఎర్రమరాజు కుంటలో, క్రోప్రోలిపొలంలోనూ, తాను కట్టించిన లక్ష్మీసముద్రంలోనూ భూములను ధారాపూర్వకంగా ఆచంద్రార్కంగా ఇచ్చింది. త్రిపురదేవిని, తండ్రిపేర కొమరేశ్వర దేవరను, తల్లి పేర ఎఱకేశ్వరిని ప్రతిష్ఠించి, గుడులు కట్టించి, ఎరక సముద్రం, పిల్లలమర్రి లక్ష్మీసముద్రం, బొమ్మకంటికాలువ మొదలైన ప్రదేశంలోని భూములను దానమిచ్చింది. మ్రోతుకూరులో తన సోదరుడు నూంకనాయకుడు కట్టించిన ఆలయానికి భూములనిచ్చింది. క్రీ.శ. 1215లో సూర్యగ్రహణ నిమిత్తం ఎఱకేశ్వర దేవరకు సమస్త పూజార్థం ఎరకపురంలో బ్రాహ్మణవృత్తులు తప్ప తమ తోటలు, పొలములు చతుస్సీమంగా ఆచంద్రార్కంగా అర్పించింది. ఎఱకసముద్రం కింద పొలాలలో బేతేశ్వర ఎఱకేశ్వర దేవరలకు ఇచ్చి, 15 మంది భోజనం చేయగలిగిన సత్రానికి, వండేవారికి, విద్యార్ధులకు ఆహార వస్త్రాలకు, చలిపందిరి, నీళ్ళు మోసేవారికి భూములనిచ్చింది. ఆలయాలు కట్టించి, చెఱువులు తవ్వించి, దేవబ్రాహ్మణ వృత్తులు ఏర్పరచడమే కాక విద్యార్థులకు మఠాన్ని, సత్రాన్ని బాటసారులకు చలివేంద్రాన్ని పెట్టించి తన భూములనూ, తోటలను దానంచేసి సంఘశ్రేయస్సు తన ధ్యేయంగా పెట్టుకొన్న ఎఱకసానమ్మ తన వంశంవారికీ భర్తవంశంవారికీ కూడా కీర్తి సంపాదించి పెట్టిన దానపరురాలు అని చెప్పవచ్చు. ఆకాలంలోని స్త్రీలలో అగ్రగణ్యురాలు అని చెప్పవచ్చును.

విర్యాల నాగసానమ్మ 1 (క్రీ.శ. 1234):

మహాసామంత విర్యాల నాగసానమ్మ దేవ బ్రాహ్మణ భక్తితత్పరురాలే కాక ప్రజల క్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ధర్మకార్యాలు చేసేదని శక సం. 1156 నాటి పమ్మి శాసనాన్ని బట్టి తెలుస్తుంది. దేవన ప్రగడ అనే వ్యక్తి పమ్మిలో ప్రసన్న వల్లభుని ప్రతిష్ఠ చేయించగా మహాసామంత నాగసానమ్మ మల్రాజు, ముమ్మడిరాజు అన్నవారితో వచ్చి దేవరను దర్శించుకొని దేవుని అంగరంగభోగాలకు, మండపం వేసినందుకు, చలివేంద్రానికి, చాతుర్మాస్య ఏకాదశులకు శ్రీ జయంతికి, బ్రాహ్మణుల దక్షిణలకు, మాసోత్సవాలు చేయించడానికి కావలసిన సామగ్రికి వీటన్నింటికీ వృత్తులను ఏర్పరచింది.

కోట గణపాంబ ( క్రీ.శ. 1219 – 1250):

గణపాంబ కాకతీయ గణపతిదేవుని పుత్రిక. ఈమె భర్త కోట బేతరాజు కోట రెండవ కేతరాజు మనుమడు, రుద్రరాజు పుత్రుడు. భర్త మరణించినపుడు అతని పుణ్యలోక ప్రాప్తికోసం రుద్రపెద్ది అనే బ్రాహ్మణునికి క్రీ.శ. 1219లో ఉత్తరాయణ సంక్రాంతి నిమిత్తం గయావ్రజన దక్షిణగా మొగలుట్ల గ్రామం దానం చేసింది. క్రీ.శ. 1250 నాటి యనమదల శాసనాన్ని బట్టి ఆమె భర్త మరణానంతరం ధార్మిక చింతనతో ధర్మకార్యాలు చేస్తూ, ధాన్యాంకపురంలో అమరేశ్వరాలయంలోని గోపురాలకు సువర్ణ కలశాలు నిలిపిందని, అక్కడ గణపేశ్వరమనే ఆలయాన్ని యనమదలలో భర్త పేరు మీద బేతేశ్వరాలయాన్ని కట్టించిందని తెలుస్తుంది.

యనమదలలోని మరొక శాసనం (క్రీ.శ. సం. 11-3) లో గణపమదేవి గోపీనాథునికి నిజగరగపాడు గ్రామాన్ని సమర్పించినదనీ, దేవర దీపానికై ఒక గానుగను, ఒక పూదోటను తమకు పుణ్యం కలగడానికి సమర్పించిందని ఉన్నది. గణపమదేవి దేవబ్రాహ్మణులకై గ్రామాలు అర్పించింది. ఆలయాలు కట్టించింది.

రాణీ పండాంబిక (క్రీ.శ. 1266):

మన్మపోతక్షితీశుని భార్య. త్యాగి నృసింహరాజు (శతృక్షత్ర నృపేభకుంభ దళనస్త్యాగీ నృసింహః పితా) కుమార్తె అయిన పండాంబిక భర్త మరణించిన తరువాత అతనికి శివలోక ప్రాప్తికై శివప్రతిష్ఠ చేసింది. ఆమె భర్త కామేశ్వర దేవరను ప్రతిష్ఠించి దేవాలయం, ప్రాకారం, మండపం, గర్భగృహం కట్టించి అగ్రహారాలు, చెఱువులు, సత్రాలు, మఠాలు, నిర్మించి దేవాలయాలకు దానం చేయటం రాజ, సామంతాది కుటుంబాలవారు చేసేవారు. సామాన్య కుటుంబాల స్త్రీలు కూడా యథోచితంగా దానం చెయ్యడం, అఖండ దీపం అర్పించడం చేసేవారు. వారి గురించి కాకతీయుల నాటి స్త్రీలు – ఒక పరిగణన అన్న ప్రకరణలో తెలపడమైంది. పూజార్థం వృత్తులను ఇవ్వగా, రాణి పండాంబిక తాను ప్రతిష్ఠించిన మన్మపోతీశ్వర, పండీశ్వర దేవరలకు వృత్తులుగా భూముల నర్పించి, పూజారులకు కూడా భూములను ఏర్పాటుచేసింది.

కుప్పాంబిక (క్రీ.శ. 1276):

గోన బుద్ధారెడ్డి పుత్రిక, కాకతి గణపతి దేవుని సేనాధిపతి మల్యాలగుండ దండాధీశుని ధర్మపత్ని అయిన కుప్పాంబిక ఎన్నో ధర్మకార్యాలు చేసింది. వ్రతాలు చేసింది. దానధర్మాలు చేసింది. ఆలయాలు కట్టించింది.

కుప్పాంబ చేసిన వ్రతాలలో లక్ష్మీనారాయణ వ్రతం, జలశయన వ్రతం అశూన్యశయ్యావ్రతం, అరుంధతీవ్రతం, ద్వాదశీ వ్రతం. ఇవన్నీ భర్తృక్షేమం, సుమంగళీత్వం కోరి స్త్రీలు చేసే వ్రతాలు.

ఈమె చేసిన దానాలలో భూదానం, గోదానం, భూరిదానం, రధ, తురగ నిత్యాన్నదానాలు, గృహదానం, వివిధములైన శ్రేష్ఠ వస్త్రదానం, రత్నాలతో కూడిన ఛత్రదానం, శయ్యాదానం ముఖ్యమైనవి, కల్పోక్తములైనవి.

ఈమె చేసిన ధర్మకార్యాలలో పశువులకు నీటికై కుంటలు, (కూపాహావాటీ) సరస్సులు వంటి నీటి వనరులు కల్పించింది. బావులు తవ్వించింది. చెరువు, వనము ఉన్న శివాలయం కట్టించి అర్పించింది. ముకుందుని ప్రతిష్ఠ చేసింది.

కుప్పాంబిక భర్త గుండదండాధీశుడు పరలోక గతుడైనపుడు ఆమె గుండయ పేర శివలింగ ప్రతిష్ఠ చేసింది.

అగ్రహారాలు, చెఱువులు, సత్రాలు, మఠాలు నిర్మించి దేవాలయాలకు దానంచేయటం రాజ, సామంతాది కుటుంబాలవారు చేసేవారు. సామాన్య కుటుంబాల స్త్రీలుకూడా యథోచితంగా దానం చెయ్యడం అఖండదీపం అర్పించడం చేసేవారు. వారి గురించి కాకతీయుల నాటి స్త్రీలు – ఒక పరిగణన అన్న ప్రకరణలో తెలపడమైంది.

నోములు–వ్రతాలు

ఆంధ్రదేశంలో జైన, బౌద్ధ, శైవ వైష్ణవాది మతాల ప్రోత్సాహం వల్ల అధిక సంఖ్యలో ప్రజలు ఆయా మతాలకు చెందిన సంప్రదాయులను పాటిస్తూ, ధర్మకార్యాలు ఆచరిస్తూ, దానాలు చేస్తూ ఉండేవారు. ఆయా మతాలకు సంబంధించిన ఉత్సవాలు, యాత్రలలో పాల్గొంటూ ఆ సందర్భాలలో జరికే వేడుకలు వినోదాలతో కాలక్షేపం చేసేవారు. అయితే ఈ మతాలేవీ ఆంధ్రదేశంలో వ్యాపించక ముందు నుంచీ జానపదులు వారివారి తెగలకు సంబంధించిన ప్రాంతీయ గ్రామదేవతలను, ప్రకృతిశక్తులను పూజించుకొనేవారు. వేదవేదాంగాలు, వైదిక సంస్కృతి, సంస్కృతభాష వారికందుబాటులో ఉండేవి కావు. అప్పటికి అగ్రవర్ణాల స్త్రీలు వేదవిద్యకు అనర్హలై శూద్రుల కోవలోనికి చేరారు. యజ్ఞయాగాల పేరుతో జీవహింస, వర్ణాల పేరుతో సంఘంలో ఎక్కువ తక్కువలు, తేడాలు ఎక్కువైనాయి. అధిక సంఖ్యాకులైన స్త్రీలు శూద్రులు హీనంగా చూడబడిన పరిస్థితుల్లో బౌద్ధమతం ఆవిర్భవించింది. గౌతమబుద్ధుడు యజ్ఞయాగాలను నిరసించి అహింసాతత్త్వాన్ని బోధించాడు. బౌద్ధమతం సామాన్య ప్రజల భాషలో వారికర్థమయే రీతిలో సత్యం, ధర్మం, అహింసల గురించి బోధించి వారి అభిమానాన్ని సంపాదించింది. ప్రజల అభిమానాన్ని చూరగొనడానికి రాజులు ఆ మతాన్ని ఆదరించారు. అశోక చక్రవర్తి కాలంలో ఆంధ్రదేశంలో జానపదుల గ్రామదేవతారాధననీ, పూజాపద్ధతినీ, స్త్రీలు ఆచరించే పూజలూ, నోములు వంటివాటినీ బౌద్ధమతం నిరసించేదని అతని ఎర్రగుడిపాడు శాసనాన్ని బట్టి తెలుస్తుంది. అశోకుడు తన తొమ్మిదవ శిలానుశాసనంలో ఈ విధంగా చెప్పాడు.

  1. దేవానాంప్రియుడు ఈ విధముగ దెల్పెను,
  2. జనులు అనారోగ్యముగ నున్నపుడు గృహమందు వివాహాది శుభకార్యములు జరుగునపుడు మంగళ ప్రధానమయిన క్రతువులు చేయుచుందురు.
  3. ఆయా సందర్భాలలో శుభాకాంక్షులై పుణ్యకార్యములు చేయుట కూడా కలదు.
  4. అందు ముఖ్యముగా స్త్రీలు నిరుపయోగమైనట్టి, అర్థ రహితములైనట్టి పనులెన్నో చేయుట కలదు.
  5. శుభప్రదమయిన కార్యములను తప్పక చేయవలసిందే.
  6. కానీ సాధారణముగ మనము చేయు కార్యములు తగినంత ప్రయోజనకరములు కావు.

ఈ విధంగా స్త్రీలు జానపదుల నోములు, పూజలు, జాతరల వంటివాటిని నిరసించిన బౌద్ధం చివరకు స్త్రీలను, సామాన్య ప్రజానీకాన్ని ఆకర్షించడానికి వాటిని అంగీకరించక తప్పలేదు. ప్రకృతి వైపరీత్యాలకు, అంతు తెలియని జబ్బులకు కారణం గ్రామదేవతల ఆగ్రహమే కారణమనుకొని ఆ తల్లులు పూజలు చేస్తే వారిని తమ మతంవైపు తిప్పుకోవడానికి స్త్రీ దేవతలను జైన బౌద్ధాలు స్వీకరించక తప్పలేదు.

శాసనాలలో ప్రసక్తమైన అష్టాదశ వర్ణాలవారిలో ఎక్కువ మంది రకరకాల వృత్తులు నిర్వహించేవారే. ఈ సంఘాల వారందరికీ ప్రత్యేక కులాచారాలు, కులదేవతలు వారి కథలు వినిపించే కులగురువులు ఏర్పడ్డారు. ఆ సమయ నియమాలను ఎవరు తప్పినా వారిని ఆయా సంఘాలు వెలివేసేవి. ఇటువంటి సంఘ బహిష్కరణకు భయపడి సంఘంలో వారందరూ ఒకవిధమైన కట్టుబాటుకు, క్రమశిక్షణ కూడిన జీవనానికి అలవాటుపడ్డారు. ఇలా ఏర్పడిన కులవృత్తి సంఘాలవారిని తెలుగుదేశంలోని తాంత్రిక బౌద్ధులు, జైనులే కాక శైవ వైష్ణవ మతాలవారు తమ మహిమలతో, వైద్య ప్రక్రియలతో ప్రజలకు రోగనివృత్తి కలిగిస్తూ, ధనసంతానాది ప్రాప్తిని కలిగించే ప్రక్రియలను వ్రతాలు, నోముల ద్వారా ప్రచారం చేసి తమ అధీనంలో ఉంచుకొనేవారు. ఆ విధంగా సంఘంలో అధిక సంఖ్యాకులైన శ్రీ శూద్రాదులు తరతరాలుగా తాము ఆచరించే నోములు, జాతరల వంటివి మానక ఈనాటికీ కొనసాగిస్తూనే ఉన్నారు. మతాలెన్ని మారినా, ఎన్ని శతాబ్దాలు గడచినా ఏది రాజమతం అయినా స్త్రీలు తమ గృహాలలో తమ యిష్టానుసారం నోములు, వ్రతాలు చేసుకోవడం మానలేదు. అనారోగ్యం వస్తే మొక్కుకోవడం, ఆ మొక్కులు చెల్లించుకోవడం రెండు వేల సంవత్సరాల క్రిందటి నుంచి ఈనాటి వరకు అనూచానంగా వస్తున్నది.

కాకతీయుల కాలంలో ముందు చెప్పబడిన మత పరిస్థితుల నేపథ్యంలో స్త్రీలు నోచిన నోములు వాటి వివరణ ముందు వివరించబడతాయి.

స్త్రీల నోచే నోములు:

వ్రతాలు నోములు జాతి యొక్క సంస్కృతిని, నాగరికతను, ఆచార వ్యవహారాలను తెలియజేస్తాయి. వీటిని స్త్రీలకు ఏర్పరచడంలో గల ప్రధాన ప్రయోజనం వారిలో దానధర్మ బుద్ధిని కలగచేయడమని, చిన్నతనం నుండి సౌశీల్యం, మితభాషిత్వం, భక్తి, ఉపవాసం, నీతి అలవడటం అని మన పూర్వుల విశ్వాసం. వ్రతం మంత్రపూర్వకం. నోముదేశీయమైనది. వ్రతాలు స్త్రీలు, పురుషులు కూడా ఆచరిస్తారు. నోములు కేవలం స్త్రీలే మంత్రాలస్థానంలో పాటల రూపంలో షోడశోపచారాలతో చేసేవి. నోములలో వాయనానికి ప్రాముఖ్యం ఎక్కువ. వాయనంతోనే నోము పరిపూర్తి అవుతుంది.

నోములలో గౌరీవ్రతాలే ఎక్కువ. దీనికి వీరశైవ మత ప్రాబల్యం ముఖ్యకారణం. గౌరీదేవి సౌభాగ్య ప్రదాయిని అవటంవల్ల స్త్రీలు సౌభాగ్యంకోరి నోములు వ్రతాలు ఎక్కువగా ఆచరించడం వల్లకూడా గౌరీవ్రతాలు ఎక్కువ ప్రాముఖ్యం పొందినాయి. స్త్రీలు నోచే నోముల గురించి క్రింద వివరించబడుతుంది.

స్త్రీలు సంతానం కోసం నోచే నోములు:

భారతదేశంలో అనాది నుండీ సంతానం పొందడమే గృహస్థుని అతి ముఖ్యమైన ధర్మంగా భావించబడేది. ముఖ్యంగా కొడుకులు పుట్టాలని, పితృదేవతలను, తమను పున్నామ నరకం నుండి తప్పించాలనీ, పుత్రుని పొందడం ద్వారా పితృరుణం తీర్చుకోవాలని ప్రాచీనులు ఆశించేవారు. కనుక కొడుకు పుట్టాలని పూజలు చేసేవారు, యాగాలు, క్రతువులు తలపెట్టేవారు. మొదట పురుషులే యాగాలు తలపెట్టి, తపస్సు చేసి పుత్రులను పొందవలసిన బాధ్యత స్వీకరించారు. తమ ద్వారా పుత్రులు కలగకపోతే నియోగ పద్ధతి ద్వారా క్షేత్రజుడనే పుత్రునైనా పొందేవారు. కానీ కాలక్రమాన కొడుకులను పొందవలసిన బాధ్యత స్త్రీలపై పడింది. పాతివ్రత్యాన్ని పాటిస్తూ పరపురుషుని కలనైనా తలవక, భర్త ద్వారా కొడుకులను పొందవలసిన స్త్రీకి యజ్ఞయాగాది క్రతువులు చేసే అధికారం లేకపోవడం వల్ల నోములను, అవైదిక కర్మకాండలను ఆచరించవలసి వచ్చింది. కొడుకులను కనని స్త్రీ తనను వదలి భర్త మరొక స్త్రీని వివాహం చేసుకోవడం, సపత్నులను భరించడం దుస్సహమై సంఘాన్ని, కులాన్ని, కుటుంబాన్ని ఎదిరించి నిలవలేని స్త్రీకి నోములే శరణైనాయి.

కాకతీయుల కాలంలోని సాహిత్యాన్ని బట్టి ఆ కాలంలో అన్ని వర్గాల స్త్రీలు – వేశ్యలు, భోగస్త్రీలు అందరూ – నోములు నోచేవారు. పుత్రసంతానం కోసం, భర్త క్షేమం కోసం, వైధవ్యం ప్రాప్తించకుండా ఉండేటందుకు, వివాహితులైన కులస్త్రీలు నోములు నోచేవారు. కన్యలు మంచి భర్త లభించాలని నోచేవారు. భోగస్త్రీలు, వేశ్యలు సౌభాగ్యం కోసం నోములు నోచేవారు. నాటి సాహిత్యాన్ని పరిశీలిస్తే ఎక్కువగా స్త్రీలు పుత్రసంతానానికై నోములు నోచేవారని, రకరకాల పూజలు చేసేవారనీ తెలుస్తుంది.

వాల్మీకి రామాయణంలో దశరథుడు పుత్రులకోసం పుత్రకామేష్టి యజ్ఞం చేశాడన్నది తెలిసిన విషయమే. కానీ రంగనాధ రామాయణంలో కౌసల్య తాను కొడుకును కనేటందుకు ఎన్నో నోములు నోచి పడరాని పాట్లు పడ్డానని పలికింది.

పెద్దకాలము నాకు బిడ్డలు లేక, పెద్దయు శోకించి పెక్కులు నోచి

కడపటనొక్కనిగని యేనుగొంత, యుడుకారియున్నచో నుండనీవైతి

పట్టి నీకొఱకునై పాలించినట్టి

వివిధ వ్రతంబులు వివిధ దానములు

చవుట విత్తనములు చల్లినట్లయ్యె (రంగనాధ రామాయణం – అయోధ్యాకాండ)

భాస్కర రామాయణంలోనూ కౌసల్య “ఇంకందొల్లిటి నోములిట్లగుటకేనేమందు?” అని తన నోములు విఫలమైనాయని శ్రీరాముడు వనవాసానికి బయలుదేరినపుడు పలికింది. దీన్నిబట్టి కొడుకుల కోసం స్త్రీలే నోములు నోచేవారని అర్థమౌతుంది. పురుషుడు ఒక భార్యకు పుత్రుడు కలగకపోతే ఇంకొకరిని వివాహమాడేవాడు. కనుక కొడుకును కనవలసిన బాధ్యత, తద్వారా సంక్రమించవలసిన గౌరవం స్త్రీకి చెందేవి.

పుత్రుల కోసం స్త్రీలు నోచే నోములు (శైవ మతానికి సంబంధించిన నోములు):

నందికేశుని నోము:

పాల్కురికి సోమనాధుని బసవపురాణంలో బసవని తల్లి మండెగ మాదిరాజు భార్య మాదాంబ పిల్లలు కలగలేదని ఎన్నో నోములు నోచి చివరకు నందికేశ్వరుని నోము నోచుకుంటే కోరికలు తీరుతాయని విని ఆ నోము నోచుకున్నది.

మాదాంబ నోచుకున్న విధము (బసవ పురాణంలోని నందికేశులని నోము విధము): గుడికి వెళ్ళి నందికి సాష్టాంగ దండ ప్రణామం చేసి, నందిని స్తుతిచేసి, వ్రతచర్యలు చేసి, సోమవారం మొదలు తొమ్మిది దినాలు ఈ విధంగా చేసింది, మర్నాడు నందికి అభిషేకం చేసి చందన కుంకుమలతో అర్చించి మెత్తని వస్త్రాలు నందిపై కప్పింది. ఉత్తమమైన ఆభరణాలు, గజ్జెలు, అందెలు, గంటలు కూర్చి, పసిడికొమ్ములు, గొరిజియలు పెట్టి నుదుటిపై (మోరపైన) పట్టం కట్టింది. ఈ విధంగా అలంకారం చేసిన తరువాత అక్షత ధూపదీపాదులతో అర్చించి పంచభక్ష్యాలు నివేదించి, పులగం నెయ్యి, పులకండం కలిపి పోగుగా పోసి, నందికి అర్పించింది. తరువాత ఆ పులగాన్ని భక్తులకు ప్రసాదంగా పంచిపెట్టింది. ఆద్యులు పుస్తకాలన్నీ వెదకి వెదకి ఈ నోము గురించి చెప్పారనడం వల్ల ఈ నందికేశుని నోము ప్రాచీనకాలంలో ఉన్నదాన్ని బసవన్న, సోమనాధుల కాలంలోనే తిరిగి ప్రవేశపెట్టారనుకోవచ్చును.

ఈ నందికేశుని నోమును బాలచంద్రుని తల్లి ఐతాంబ కూడా నోచింది. అయితే ఆమెకు ఈ నోము నోచడం వల్ల కూడా పుత్రులు కలగలేదు. (ఆమెకు గజనిమ్మ నోము నోచడం వల్ల బాలచంద్రుడు కలిగినట్లు పల్నాటి వీరచరిత్ర కావ్యంలో ఉన్నది) దీని గురించి ముందు వివరించబడింది. కాకతి రుద్రమ్మ తన కుమార్తె ముమ్మడమ్మ చేత ఎడ్లనోము నోమించింది. అయితే ఇది నందికేశుని నోముకంటే భిన్నంగా ఉన్నది.

ఎడ్లనోము చేసే పద్ధతి:

ఎడ్లకు కట్టే పలుపు, పగ్గం, మునికోల బంగారంతో చేసినవై ఉండాలి. ఒక్కొక్క ఎద్దును వేయిమాడల దక్షిణతో బ్రాహ్మణునికి దానమివ్వాలి.

ఈనాటివారు చేసే నందికేశుని నోము పై రెండు నోముల కంటే కొంత భిన్నమైనది. ఈ నోము ప్రకారం అయిదు శేర్ల పెసరపప్పును వండి ఆ గుండిగకు అయిదుమూళ్ళ అంగవస్త్రాన్ని చుట్టి బంగారంతో నంది ప్రతిమను చేయించి ఉపనయన సందర్భంలో నంది హోమం సమయంలో వటువుకు దక్షిణ తాంబూలములతో ఇవ్వాలి. ఈ నోము ఫలితం ఐశ్వర్యం కలగడమని పెద్దలంటారు. కాకతీయుల కాలంలో నందికేశుని నోము పుత్రప్రాప్తికేనని ఆనాటి కావ్యాధారాలని బట్టి చెప్పవచ్చును.

ఒడ్డెపల్లి గణపతిపూజ:

ఒడ్డెపల్లిలోని గణపతి దేవునికి నూఱు బండ్లనిండా బుడ్డనకజ్జాలు, బెల్లంపానకం, పప్పు, నేయితో పక్వమైన మోదకాలు నివేదించాలి.

కాకతిదేవికి, ఏకవీరాదేవికి పూజలు:

రుద్రమాంబ ముమ్మడమ్మకు పుత్రుడు కలగాలని చేసిన పూజలలో కులదేవత కాకతి దేవతకు చేసిన పూజ ఒకటి. బంగారు కుండలను అయిదు లక్షల మాడలతో నింపి, ఆ ధనాన్ని ఖర్చు పెట్టి అక్షయంగా జాతరలు చేయించింది. మొగిలిచెర్లలోని ఏకవీరాదేవిని అర్చించడానికి వచ్చి అయిదు రోజులపాటు ఆ దేవిని అర్చించింది.”

ఐతాంబ కొడుకు కోసం నోచిన నోములు:

(1) కుమ్మరి ఆవములని యథేచ్ఛగా అనుభవించడానికి దానమిచ్చింది (బహుశా కుమ్మరివారికే అయివుంటుంది)

(2) గానుగలను దానంగా ఇచ్చింది. ఈ నూనె గానుగలను దేవాలయాలకి ఇవ్వడం రెండవ ప్రతాపరుద్రుని కాలానికి ఉన్నట్లు శాసనాలను బట్టి తెలుస్తుంది.

(3) తిలపర్వతం నోము: ఐతాంబ తిలపర్వతం దిగి నోము నోచిందని పల్నాటి వీరచరిత్రలో ఉన్నది. నోము వివరాలు లేవు. కానీ ఇది షోడశమహాదానాల్లో ఒకటి అని విక్రమాదిత్యుని దండనాధుడగు అనంతపాలుని శాసనంలో ఉన్నది. ఈ పద్ధతి పూజ కాకతి ప్రోలరాజు తన భార్యతో కలసి తన పుత్రుడు మహాదేవుని శ్వేతరోగం పోవడానికి చేశాడు అని సిద్ధేశ్వర చరిత్రలో ఉన్నది. ఆ పూజ ఈ విధంగా ఉన్నది. తిలపర్వతాన్ని పోలే విధంగా అయిదు పుట్లు నువ్వులు కుప్పగా పోసి దాని మీద బంగారం పెట్టి, అష్టభుజాశక్తి ప్రతిమను కుందనంతోనూ, పన్నెండు మణులతోనూ చేయించి దానిపై నిలిపి, అయిదు లక్షల మాడలను బంగారంతో కూడిన సువర్ణ ప్రతిమను, ఏనాడు దానం పట్టని, అతియోగ్యుడైన బ్రాహ్మణునికి ఇవ్వాలి. రుద్రమదేవి కాకతిదేవికి చేసిన పూజలో కూడా అయిదు లక్షల మాడలను సువర్ణ కుంభాలతో అర్పించిందని ఇంతకుముందు చెప్పడమైంది. కాకతి ప్రోలరాజు చేయించిన అష్టభుజాశక్తి కాకతి దేవి వంటి శక్తి కావచ్చును. ఐతాంబ కూడా ఆవిధంగానే నోచి ఉంటుంది.

గుమ్మడి ఫలాల నోము: ఐతాంబ శ్రీశైలమల్లికారు నునికి భ్రమరాంబకు వెండి బంగారు గుమ్మడి ఫలాలను చేయించి కానుకలిచ్చింది. సిద్ధేశ్వర చరిత్రలో మాధవవర్మ కొడుకు పద్మసేనుడు సంతానం లేదని చింతపడి పండితులు చెప్పగా సిద్ధేశ్వరుని గుమ్మడిపండ్లతో పూజచేసి, పుత్రసంతానం పొందాడని ఉన్నది. గుమ్మడి ఫలాల నోము ఈనాటికీ ప్రాచుర్యంలో ఉన్నదే.

ఏలేశ్వరంలోని గౌరీమహేశ్వర శిఖరాన్ని ఎక్కి నోచే నోము: ఈ నోమును కూడా ఐతాంబ పుత్రార్ధం నోచింది.

విధివెలుగు నోము: ఐతాంబ నోచిన నోముల్లో ఇదొకటి.

ఘనవిష్ణుకాంత నోము: ఇది విష్ణుకాంత నోము అంటే లక్ష్మీదేవిని పూజించేవారేమో.

సంజవత్తి నోము: ఐతాంబ నోచిన నోము ఇది. వివరాలు కావ్యంలో లేవు. బహుశా సంధ్యవేళ దీపాలను పెట్టటమే ఈ నోము విధానం కావచ్చు. మోచేటి పద్మం నోము లేదా మూగనోము అనే నోములోనూ ఆశ్వయుజ బహుళ అమావాస్య మొదలు కార్తీక శుద్ధ పూర్ణిమ వరకు సంధ్యవేళ దీపం వెలిగించి నోచుకుంటారు. ఈ నోము పద్ధతి ఈ విధంగా ఉన్నది. పైన చెప్పిన కాలంలో సాయంత్రం వేళ స్నానం (కంఠస్నానం) చేసి మడుగు వస్త్రాలు ధరించి, తులసిచెట్టు దగ్గర నాలుగు పద్మాలు పెట్టుకొని నాలుగు వత్తుల దీపం వెలిగించి, నలుగురు ముత్తైదువులకు బొట్టుపెట్టి, నాలుగు నక్షత్రాలు లెక్కపెట్టాలి.

రెండవ సంవత్సరం నాలుగు బదులు ఎనిమిది, మూడవ సంవత్సరం పన్నెండు చొప్పున పద్మాలు, దీపాలు, నక్షత్రాలు, ముత్తైదువుల సంఖ్య పెంచుతూ ఉండాలి. నోచుకున్న కన్య ముత్తయిదువులకు మొదటి యేడు నాలుగట్లు, రెండవయేడు ఎనిమిది, మూడవయేడు పన్నెండు చొప్పున వాయనమిచ్చి నల్లపూసలు, లక్కజోళ్ళు, దక్షిణ తాంబూలలా లివ్వాలి. ఈ నోము కన్యలు నోచుకున్నట్లు ఈనాడున్నది. బహుశా దీనికి మూలంవంటి సంజవత్తి నోము కాకతీయుల కాలంలో స్త్రీలు పుత్రులకోసం చేసి ఉంటారు.

చీకటింటి నోము: ఈ నోము ఈనాడు చెప్పే నోముల్లో లేదు. బహుశా ఒకరాత్రి చీకటిలో గడపడమే ఈ నోము నోచే పద్ధతి కావచ్చు. ఐతాంబ ఈ నోము కూడా నోచింది.

ఏకవిల్లు నోము: అయిదుమంది వనితలను చేర్చి ఏకవిల్లు నోము ఐతాంబ నోచుకున్నది.

పచ్చవిల్లు నోము: పదిమంది వనితలను చేర్చి పచ్చవిల్లు నోము నోచింది ఐతాంబ.

కేదారేశుని నోము: ఐతాంబ కేదారేశుని పూజించే నోము నోచింది.

అశ్వత్థ వృక్షాలకు పెళ్ళి: ఐతాంబ కొడుకు పుట్టాలని శ్రీ శైలమార్గంలో అశ్వత్థ వృక్షాలను నాటి, అశ్వత్థ వృక్షాలకు వెండి బంగారు తాళ్ళతో చుట్టూ కట్టించి ఆడమగ వృక్షాలకు పెళ్ళిచేసింది.

ఐతాంబ వంటి స్త్రీలు పుత్రులు కలగడానికి నోములు, పూజలు వ్రతాలూ ధర్మకార్యాల వంటివి ఎన్నో చేశారు. వీటిలో ఎక్కువభాగం శివునికి సంబంధించినవే. శివభక్తులకు, శైవక్షేత్రాలకు దానధర్మాలు చేయడం గమనించదగిన విషయం. పల్నాటి వీరచరిత్రను బట్టి ఐతాంబ జీర్ణాలయాలను బాగుచేయించి పూజాదికాలకు ఏర్పాటుచేసింది. శ్రీగిరికి వెళ్ళే భక్తులకు రాగితో చేసిన కమండలాలను, కప్పెరచయాన్ని దానమిచ్చింది. అన్నసత్రాలను, చలివేంద్రాలను పెట్టించింది.

పుత్రకామ్యాన్ని ఇచ్చే చీరలు అద్దకం అద్దించి కట్టింది. సంతానాన్నిచ్చే చీరలను కూనలమ్మ చీరలు అంటారని సూర్యరాయాంధ్ర నిఘంటువులో వ్రాశారు.

ఇన్ని చేసినా ఆమెకు పుత్రులు కలగలేదు. అప్పుడు విప్రులను అడిగితే గజనిమ్మ ఫలాల నోము గురించి చెప్పారు. ఇది విష్ణువుకు ఇంపైన నోమని వారు చెప్పారు.

గజనిమ్మ నోము: పల్నాటి వీరచరిత్రలో చెప్పిన పద్ధతి: నోము చేసుకొనే స్త్రీ ఉదయం నదిలో స్నానం చేసి చెన్నకేశవుని పూజించి దీపనైవేద్యాలిచ్చి, దేవాలయంలోని గజనిమ్మచెట్టు చుట్టూ శుభ్రం చేయాలి. ఆ ప్రదేశమంతా అలికించి ముగ్గులు పెట్టి, వనదేవతను ఆవాహన చేయించి బావిలో నీరు తెచ్చి పోసి బ్రాహ్మణులకు స్వయంపాకమివ్వాలి. చెట్టుకు ఫలాలు కాయగా సంవత్సరాంతంలో చెట్టు ఫలాలను తెప్పించి బంగారు పళ్ళెంలో పోయించి చెన్నకేశవునికి అర్పించాలి. పైన చెప్పిన విధంగా చేసి ఐతాంబ గీతవాద్యాలతో కానుకలతో జనం వెంటరాగా జమ్మిమానుకి కుడివైపున చెన్నకేశవునికి ఎదురుగా నుంచొని పూజించింది. అప్పుడు ఫలాలలో ఒకటి ఎగిరి ఆమెపై పడింది. దాన్ని ఆరగించగా ఆమెకు బాలచంద్రుడు కలిగాడని ఐతాంబ చెప్పింది. పైన వివరించినట్లు ఐతాంబ అంతకుముందు నోచుకున్న అన్ని నోములు శైవ సంబంధమైనవి. గజనిమ్మ ఫలాల నోము ఒక్కటే వైష్ణవ సంబంధమైనది. ఈ నోమువల్ల ఐతాంబకు పుత్రుడు కలిగాడని పల్నాటి వీరచరిత్ర కవులు చెప్పటంలో బహుశా విష్ణు భక్తి ప్రాశస్త్యాన్ని చాటడమే ఉద్దేశమై ఉంటుంది.

విజ్ఞాన సర్వస్వం మూడవ భాగం ‘సంస్కృతి చరిత్ర’ అనే సంపుటంలో నోములు అన్న శీర్షికతో రాయబడిన వ్యాసంలో చెప్పిన నోములలో నందికేశుని నోము, తప్ప మిగిలినవేమి కాకతీయుల కాలం నాటి సాహిత్యంలో కనిపించలేదు. [నోములు విజ్ఞానసర్వస్వం – తెలుగు సంస్కృతి (111 పేజి. నం. 904-910)]

వైధవ్యం ప్రాప్తించకుండా ఆచరించే నోములు:

ఆనాటి స్త్రీలు వైధవ్యం ప్రాప్తించకుండా నోము నోచేవారు. అన్ని బాధలకంటె దుస్సహమైనది పతివియోగం. అందునా ఆ కాలంలో భర్త చనిపోతే భార్య సహగమనం చేసేది లేదా జీవితాంతం దుర్భరమైన జీవితాన్ని గడిపేది కనుక ఆ బాధ రాకుండా ఉండేటందుకు ఆనాటి స్త్రీలు నోచేవారు. గోనబుద్ధారెడ్డి పుత్రిక, మల్యాల గుండ దండాధీశుని భార్య కుప్పాంబిక చేసిన నోములు వ్రతాలు గూర్చి ఆమె వేయించిన బూదపురశాసనంలో చెప్పబడ్డాయి. కల్పోక్త ప్రకారం ఆమె క్రింద చెప్పబడిన వ్రతాలు చేసిందని శాసనం తెలుపుతున్నది.

కుప్పాంబ చేసిన వ్రతాలు – నోములు:

లక్ష్మీనారాయణ వ్రతం: ఫాల్గుణమాస పూర్ణిమ మొదలుకొని ప్రతిమాస పౌర్ణమినాడు లక్ష్మీనారాయణులను గూర్చి చేసే వ్రతము.

జలశయన వ్రతం: కార్తిక కృష్ణ చతుర్దశినాడు నీటిలో నిమగ్నురాలై ఉండి విష్ణుమూర్తిని గూర్చిచేసే కృచ్ఛవ్రతం. దీనిఫలము విష్ణులోక ప్రాప్తి (హేమాద్రి వ్రతకాండ రెండవభాగం పుట 769).

అశూన్య శయన వ్రతం:  స్త్రీపురుషులకు విరహ వ్యాధి, రోగ, భయ దుఃఖములు కలుగకుండా ఉండే ఉపాయం నారదునికి ఈశ్వరుడు ఈ విధంగా చెప్పాడు.

శ్రావణశుక్ల ద్వితీయనాడు లక్ష్మీసమేతుడైన నారాయణుని కల్పోక్త విధానంతో పూజించి, గోభూ, హిరణ్యదానాలు చేసినవారు డెబ్బయి వేలకల్పాల కాలం సుఖంగా ఉంటారు.

వ్రత విధానం – గోవిందుని పూజించి, పగలు ఉపవాసం చేసి, ఆ రాత్రి నూనె, ఉప్పు, కారం లేని ఆహారం తిని ఆ రాత్రి గడపాలి, తెల్ల వారిన తర్వాత గృహస్థు వేదపండితుడు, శ్రోత్రియుడు, సర్వక్రతుకర్త, ఎక్కడా ఏ లోపం లేనివాడు అయిన విప్రుడికి లక్ష్మీనారాయణ ప్రతిమను, దీపాలను, భోజన పాత్రలు, మంచాలు, పరుపులు, దిళ్ళు, ఆనుకొనే దిళ్ళు, పాదుకలు, చెప్పులు, గొడుగులు, చామరాలు, ఇంకా ఇష్టమైన సామగ్రి తెల్లని గంధపు పూత సామగ్రి, పూలదండలు మొదలైనవాటిని దానం చేయ్యాలి. ఆ బ్రాహ్మణుడిని, అతని భార్యను మంచంపైన కూర్చోబెట్టి శాస్త్రోక్తంగా అలంకరించి, పత్నికి భక్ష్యభోజ్యాలున్న పాత్రని, భర్తకు లక్ష్మీనారాయణుల బంగారు ప్రతిమను చేతికివ్వాలి. విష్ణును తలచుకొని నీకు వలె నాకును కళత్రముతో నిత్యసంబంధ ముండు గాక. నీ శయన మెల్లప్పుడు అశూన్యమై ఉండునట్లే నా శయనము కూడా అశూన్యమై ఉండుగాక అని ప్రార్థించి పూజ చేయాలి. పూజసమయంలో గీత వాద్యాలు వినిపించాలి. ఈ వ్రతం వల్ల భార్యాభర్తలు పరస్పర వియోగం లేక సుఖంగా ఉంటారు అని మత్స్య పురాణంలో చెప్పబడింది. ఈ వ్రతం మల్యాల గుండన భార్య కుప్పాంబ చేసింది కానీ ఆమెకు భర్త వియోగం కలిగిందని ఆమె వేయించిన బూదపూరు శాసనం బట్టి తెలుస్తున్నది.

అనంతవ్రతం: భాద్రపద శుద్ధ చతుర్దశినాడు అనంతుని గురించి చేసే వ్రతం ఇది. వ్రతం చేసేవారు పద్నాలుగు ముళ్ళతో అల్లబడిన తాడు కుడిచేతికి కట్టుకొంటారు. ఈ వ్రతం పద్నాలుగేళ్ళు చేస్తారు.

అరుంధతీ వ్రతం: పుణ్యస్త్రీలు అరుంధతీ దేవిని గూర్చి చేసే వ్రతం ఇది. పుత్ర పౌత్రాభివృద్ధి, సౌభాగ్యాలకై వసంతకాల ప్రారంభంలో తృతీయాతిథిలో ఈ వ్రతాన్ని చేస్తారు. దీన్ని స్త్రీలు వైధవ్యం ప్రాప్తించకుండా ఉండటానికి, పిల్లలు కలుగడానికి చేస్తారు.

అసిత సితద్వాదశీ వ్రతం: శుక్ల బహుళ ద్వాదశి దినాలలో చేసే వ్రతం దీని వివరాలు తెలియవు.

కన్యలు నోచుకునే నోములు, చేసే పూజలు:

అందమైన భర్త లభించేందుకు నోచే నోము: అంధమైన భర్తకోసం స్త్రీలు నోచే వారని సాహిత్యంలో ప్రత్యేకమైన నోము ప్రస్తావనలేక పోయినప్పటికీ పరోక్షంగా ఆధారమున్నది. పలనాటి వీరచరిత్రలో మాంచాలను చూడడానికి బాల చంద్రుడు ఆమెనగరికి వెళ్ళినపుడు అక్కడి స్త్రీలు ఆతని సౌందర్యానికి అబ్బురపడి –

బంగారుకుండల పన్నీరు దెచ్చి

అభిషేక మొనరించె నభవుని తొల్లి

మాంచాల యేరీతి మరువు లేకుండ

కాకున్న యిటువంటి కందర్పసముడు

భర్తగా ఎలా లభించి ఉంటాడు? అని అనుకున్నారు. అంటే శివునికి సువర్ణ కుంభాభిషేకం చేస్తే అందమైన భర్త లభిస్తాడని ఆనాటి స్త్రీల విశ్వాసం అయివుంటుంది.

అట్లతద్ది నోము:

ఆనాటి స్త్రీలు అట్లతదియ నోము నోచినట్లు ఆధారం లభ్యం కాలేదుగానీ ఈ నోము నోచే స్త్రీలు ఆశ్వయుజ బహుళ తదియనాడు రూహిణీ నక్షత్రయుక్తుడైన చంద్రుని పూజిస్తారు. చంద్రుని వంటి ఆహ్లాదకరుడైన భర్త లభించాలని ఈ నోము నోచేవారని చెప్తారు. బాలికలు నోచుకునే అట్లతద్ది నోముకు ఫలితం మంచి భర్త లభించడము, వ్రతభంగంమైతే ముసలి మొగుడు లభించడం అని పెద్దలు చెప్పారు. ఆనాడు బహుశా ముసలి వాడికి బాలికనిచ్చి పెళ్ళి చేయడం ఉండవచ్చు. కేతన విజ్ఞానేశ్వరంలో కన్యను తగిన వరునకిచ్చి వివాహం చేయక పోవడం పాపమని చెప్పాడు. పైగా బాల్య వివాహాలు అంటే వధూవరులు చిన్నపిల్లలుగా ఉన్నపుడే వివాహాలయేవి. రాజకుటుంబాలలో వయసులో పెద్దగా ఉన్న రాజుకు సామంతుల కన్యలను రాజకీయ కారణాల వల్ల బహుశా ఇచ్చేవారేమో (సాహిత్యంలో వాటి ఆధారమేమి లేదు) కానీ ముసలి భర్త రాకుండా ఉండేటందుకు ప్రత్యేకంగా ఏ నోమూ ఉన్నట్లు లేదు.

కందుకోత్సవం:

ఈ ఉత్సవం గురించి కేతన దశకుమార చరిత్రలో ప్రస్తావించబడింది. తుంగధన్వుడనే రాజు సంతానం కోరి సోమా పీడా నామాంకిత అయిన దేవతను కొలవగా ఆమె అతనికి ఒక కొడుకును, ఒక కూతురుని ప్రసాదించి, కూతురి ఏడవ సంవత్సరం మొదలు పాణి గ్రహణ సమయం వరకు, ఆమెచేత కందుకోత్సవం చేయించమని ప్పింది. అప్పటి నుంచి తుంగధన్వుని కూతురు కందుకావతి ప్రతి ఏటా దేవీ గృహానికి వచ్చి కందుకోత్సవం అంటే రకరకాలైన కందుక క్రీడలు ఆడి, దేవిని కొలుస్తుంది. ఇటువంటి నోము సాహిత్యంలో ఇంక ఎక్కడా కనిపించలేదు. దీనికి ఫలితం డా ప్రత్యేకంగా ఏమీ చెప్పలేదు. ఈ కందుక క్రీడ క్రీడాభిరామంలో ప్రసక్తమైంది కానీ నోముగా కాదు. బాలికలు ఆడుకునే ఆటగానే పేర్కొనబడింది. ఇది నిరాహారంగా ఉండి, కష్టపడి నోచే నోము కాదు. ఆటపాటలే ఈ నోములో ప్రత్యేకాంశాలు. తెలుగు బాలికలు నోచే ఉండ్రాళ్ళ తద్దె, అట్లతద్దె నోములు కూడా ఈ విధమైన ఆటపాటలతో కూడిన నోములే.

ఉండ్రాళ్ళ తద్దె నోము చేసుకొనే పద్ధతి:

భాద్రపద బహుళ తదియ నాడు ఆడపిల్లలు ఉదయమే లేచి నేలములగ చెట్టు మొక్కను పసువుగౌరి వద్ద పెట్టి పూజ చేసుకుంటారు. తరువాత కుడుములు ఉండ్రాళ్ళుగానీ, గారెలు బూరెలుగానీ అయిదు పళ్ళాలలో దక్షిణతాంబూలాలతో పాటు వాయన మివ్వాలి. ఈ అట్లతద్ది నాడు గానీ, ఉండ్రాళ్ళతద్ది నాడు అయిదుగురు ముత్తైదువులకు తలంటి పోసి గోరింటాకు పెట్టి, మధ్యాహ్నం గారెలు, బూరెలు కలిపి ముతైదువకు అయిదు భక్ష్యాలు, రవికలగుడ్డ, దక్షిణతాంబూలం వెండిములగ కాయ వాయనమిచ్చి అక్షతలు వేయించుకొని భోజనాలు పెట్టాలి. తెల్లవారు జాముకే లేచి కన్యలు తలంటి పోసుకొని, కొత్త బట్టలు కట్టుకొని, గోరింటాకు పెట్టుకొని, వేడివేడి అన్నం వేపుడు కూరలు, మీగడ పెరుగుతో భోజనాలు చేసి, ఉయ్యాలలూగుతారు. ఉత్తర హిందూస్థానంలో కూడా ఈ భాద్రపదమాసంలో కన్యలు, వివాహితలైన స్త్రీలు తదియనాడు ఈ విధంగానే కలసి భోజనాలు చేసి ఉయ్యాలలూగుతారు. సాధారణంగా కుటుంబ బాధ్యతలు, బాధలు, ఉండే స్త్రీలకు ఇటువంటి నోముల రూపేణా ఆనందం, ఉత్సాహం కలిగించడమే ఈ పండుగలు, ఉత్సవాల ఉద్దేశమై ఉంటుంది. ఎక్కడ స్త్రీలు సుఖసంతోషాలతో ఉంటారో అక్కడ దేవతలు ఆనందిస్తారని, సిరిసంపదలు ఉంటాయని మన భారతీయుల నమ్మకం కనుక ప్రాచీన కాలంనుంచీ ఈ నోములు ఉత్సవాలు ఆడవారికే ప్రత్యేకింపబడి ఉంటాయి.

(సశేషం)

Exit mobile version