Site icon Sanchika

‘కాకతీయ యుగంలో స్త్రీల సామాజిక స్థితిగతులు – ఒక పరిశీలన’ -24

[డా. మంత్రవాది గీతా గాయత్రి గారు 1995లో పిహెచ్‍డి పట్టా కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖకి సమర్పించిన సిద్ధాంత వ్యాసాన్ని సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము.]

ప్రకరణం 8 – స్త్రీలు-వృత్తులు: మొదటి భాగం

[dropcap]కా[/dropcap]కతీయుల కాలంలో అన్ని కులాల వారు వారి కులవృత్తులను నిర్వహించినప్పటకి ఈ కుల వ్యవస్థ అంత ఘనీభవించినది కాదు. ఈ వృత్తిని ఈ కులంవారే నిర్వహించాలన్న నియమాన్ని ఆ కాలంలో వారు అంతగా పాటించినట్లు కనబడదు. యుద్ధం చేసేవారిలో క్షత్రియులే కాదు బ్రాహ్మణులు కూడా వుండేవారు. రేచర్ల రుద్రుని ప్రధాని రాజనాయకుడు బ్రాహ్మణుడు. ఖడ్గ తిక్కన బ్రాహ్మణుడు. అయినా యుద్ధాలలో పాల్గొన్నారు. వర్తకవ్యాపారాలు వైశ్యులేకాక బలిజలు, ఇతర కులాలవారు కూడా నిర్వహించేవారు. త్రిపురాంతకంలోని ఒక శాసనంలో ఒక నగరంలోని వర్తక సభ్యులలో కొందరు బలిజలు, కొందరు కోమట్లు, కొందరు రెడ్లు కూడ ఉన్నారు. పల్నాటి వీర చరిత్రను బట్టి బ్రహ్మనాయని సైన్యంలో అన్ని కులాల వారు ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే క్రీడాభిరామాన్ని బట్టి వేశ్యా వృత్తిని అవలంభించిన వారిలో భిన్న కులాల వారు ప్రాంతాల వారు ఉన్నారని తెలుస్తున్నది.

ఏ కాలంలోనైన సాంఘిక పరిస్థితి ఆర్థిక పరిస్థితి పైన ఆధారపడి ఉంటుంది. ఎవరైన ఆర్థికంగా లాభసాటి అయిన వృత్తిని అనుసరించేందుకు ప్రయత్నిస్తారు. అందుకు సాంప్రదాయం, సంఘంలో కట్టుబాట్లు అడ్డువస్తే కొద్ది మంది వాటిని మార్చటానికి ప్రయత్నిస్తారు. వారు సఫలీకృతులైతే తక్కిన వారు అనుసరిస్తారు. కాకతీయుల కాలంలో ముఖ్యంగా గణపతిదేవుని కాలంలో రాజకీయంగా స్థిరత్వం ఏర్పడి, రాజులు, సామంతులు, ప్రజోపయోగ కార్యాలెన్నో తలపెట్టడంవల్ల దేశం సుభిక్షమైంది. బలమున్న వారు భూస్వాములు ప్రభువులైనారు. వారి నాశ్రయించుకొని వారి భోగలాలసత్వనికి వినోదానికి ఉపయోగించే వృత్తులవారు నటవిట గాయక గణికాద్యనేకులు, దాదులు, దాసీలు తాంబూలకరండ వాహికలు, ప్రసాధికలు, తోలు బొమ్మలు మొదలైన ఆటలు ఆడించేవారు, గడమీద సాము చేసేవారు మొదలయిన వారు ఎక్కువైనారు. గాయకులు, నర్తకులు, వాద్యకారులు, చిత్రకారులు శిల్పులు ధనిక వర్గం ప్రాపు సంపాదించే వృత్తులనే ఆధారం చేసుకొనే మనుగడ సాగించారు. కాలక్రమేణ వృత్తులను వంశపారంపర్యంగా అనుభవించే హక్కు సంపాదించి మాన్యాలని సంపాదించారు.

ఆనాడు యుధ్ధాలు ఎక్కువ గనుక అన్ని కులాలకు సంబంధించిన పురుషులు యుద్ధంలో పాల్గొని జీతం సంపాదించేవారు. ఈ విధంగా రకరకాల కులాలవారు రకరకాల వృత్తులను అనుసరించారు. అదే విధంగా స్త్రీలు కూడా ఏవో వృత్తులననుసరించి ధనం సంపాదించేవారు. దేవాలయాలలో భోగాల వారుగా, దేవదాసీలుగా, ధనికురాండ్రైన స్త్రీలకు దాసీలుగా వారి పిల్లలకు దాదులుగా పని చేసేవారు.

మధ్యయుగ సాంఘిక వ్యవస్థలో దేవాలయాలు ప్రధాన పాత్ర నిర్వహించాయి. మహారాజులు, సామంతులు, సేనానులు, సామాన్య ప్రజలు దేవాలయాలకు విరివిగా దానాలిచ్చేవారు. దేవాలయాలలో అంగరంగభోగాలు నిర్వర్తించేవారు. ఈ కార్యక్రమాలను వ్యక్తులు తమ వంశపారంపర్యంగా నడిపేవారు. అందుకు వారికి మాన్యాలు, జీతాలు ఏర్పాటు అయి ఉండేవి.

ఆ విధంగా రకరకాల సేవలు నిర్వర్తించడానికి కొత్తగా వృత్తులేర్పడినాయి. కాకతీయుల కాలంలో చాలామంది ప్రజలు ముఖ్యంగా స్త్రీలు దేవాలయాలలో రకరకాల వృత్తులు చేపట్టేవారు .

ఆ రోజుల్లో వేశ్యలతో సుఖించటం అన్నది గొప్పగా భావించేవారు. వేశ్యలకై ఎంతో ధనాన్ని ఖర్చు పెట్టేవారు. సంఘంలోని అన్ని కార్యక్రమాలలో వేశ్యలు పాల్గొనడం తప్పనిసరి అయింది. దానితో వారు సాంఘికంగా, ఆర్థికంగా మంచి స్థానాన్ని పొందేరు. వేశ్యావృత్తి అన్ని వృత్తులలోను లాభసాటిగా భావించబడింది. ఏ కొద్దిమందో పూర్వాచార పరాయణులు నైష్ఠికులు వారిని చిన్నచూపు చూసినా అధిక సంఖ్యాకులకు వేశ్యలపైన, వేశ్యా జీవితంపైన ఈనాడున్న నీచాభిప్రాయం లేదు. అందువల్ల డబ్బు సంపాదించలేని రకరకాల కులాల స్త్రీలు కూడా వేశ్యావృత్తిని అవలంబించారని, వారు కాకతీయ రెండవ ప్రతాపరుద్రుని కాలానికి అధిక సంఖ్యలో ఉండేవారని క్రీడాభిరామ, పలనాటి వీర చరిత్ర కావ్యాల వల్ల తెలుస్తున్నది. ఆనాటి స్త్రీలు ఏఏవృత్తులను స్వీకరించే వారో ఈ ప్రకరణంలో వివరించబడుతుంది.

దాసీ వృత్తి:

దేశం సుభిక్షంగా ఉండి వర్తక వ్యాపారాలు వృద్ధిచెంది, రాజులు జైత్రయాత్రలు చేసి శత్రురాజులను గెలిచి కొల్లగొట్టుకు వచ్చిన ధనంతో, పన్నుల ద్వారా రాబట్టే ధనంతో, పైవర్గాలవారు భోగభాగ్యాలతో తులతూగేవారు. కానీ క్రింది వర్గాల ప్రజల పరిస్థితి ఆనాడు ఈనాడు ఒకే విధంగా ఉన్నది. కాకపోతే ఆ రోజుల్లో ఆర్థిక సమానత్వం గురించి వారాలోచించేవారు కాదు. వారు పై వర్గం వారి నాశ్రయించుకొని ఉండేవారు.

సంపదలు, మాన్యాలు, వృత్తులు, అన్నీ వంశపారంపర్యంగా సంక్రమించేవి. కులవృత్తులు కూడా అలాగే సంక్రమించేవి. భాగ్యవంతులు వేల మంది దాసదాసీ జనాన్ని పోషించేవారు.

తిక్కన రచించిన నిర్వచనోత్తర రామాయణంలో సీతకు లెక్కలేనంత మంది చెలికత్తెలున్నారు. మూలమైన వాల్మీకి రామాయణంలో సీతకు చెలికత్తెలున్నట్లు కనిపించదు. ఆనాడు తెలుగు రాణులకు అంతఃపురవాసినులైన పరిచారకా బృందం లెక్కకు మించి ఉండేది. తిక్కన కాలంలోనే కాక విజయనగర సామ్రాజ్యంలో కూడా ఈ విధంగానే ఉన్నట్లు విదేశీయాత్రికుల వ్రాతలవల్ల తెలుస్తున్నదని ఆరుద్రగారు తమ సమగ్రాంధ్ర సాహిత్యం అనే గ్రంథంలో తెలిపారు.

తమ కన్యలకు వివాహం చేసి అత్తవారింటికి పంపే సమయంలో అరణంగా ధన కనక వాహనాలతో పాటు దాస దాసీ జనాన్ని కూడా పంపేవారు. కులవృత్తులు చేయనివారు, స్వతంత్రంగా ఏ వృత్తి చేయని క్రింది వర్గం స్త్రీలు దేవాలయాలలోనో ధనికులు లేదా రాజుల అంతఃపురాలలోనో సేవలు చేసేవారు. దేవాలయాలలో సేవ చేసేవారిని ద్వాదశ సేవా విలాసినులని, దేవదాసీలని, భోగం వారనీ వ్యవహరిస్తే, రాజ సంపన్న గృహాలలో సేవ చేసేవారిని దాసీలని వ్యవహరించేవారు. దేవాలయాలలో సేవచేసే వారికి మాన్యాలుండేవి. కుటుంబంలో వ్యక్తులందరు దేవాలయాలలోని పనులు చేస్తూ మాన్యాలపై జీవించేవారు. సంపన్న గృహాలలో దాసీలు వారి యజమానుల దయాధర్మాలకై ఆధారపడి జీవించేవారు. వీరిలో చాలామంది పుట్టుబానిసలు. అంటే తరతరాలుగా ఆ కుటుంబాలకు దాస్యం చేస్తూ ఉండిపోయినవారు.

దేవాలయాలలోని దాసీ వృత్తి వంశపారంపర్యంగా వచ్చేది. పైగా అన్ని విధాలుగా నేర్పుగల వారికే ప్రవేశం కనుక ప్రజలలో అట్టడుగు వర్గంవారు, పేదవారు జీవికకై ధనిక కుటుంబాలని ఆశ్రయించుకొని ఉండేవారు.

దాసీలను విక్రయించడం, కొనడం కూడా ఆనాడు ఉండేది. హరిశ్చంద్రుడు విశ్వామిత్రునికి ధనమీయ లేక భార్యను అమ్మదలచాడు. అతని భార్యయే తనను దాసిగా అమ్మి ఆ డబ్బును విశ్వామిత్రునికి ఇవ్వమని చెప్పింది. కౌశికుడనే బ్రాహ్మణుడు ఆమెను సుకుమారమైన తన భార్యకు పరిచర్యలు చేయడానికి దాసిగా కొనదలచాడు. పురుషునికి ఖరీదు వేనవేలు మాడలు, స్త్రీకి అందులో సగం వెల ఇవ్వాలని శాస్త్రాలు చెప్పాయని చెప్పి ఆ బ్రాహ్మణుడు ఆమెకు ఆమె కుమారునికి కూడా తానే ధర నిర్ణయించి హరిశ్చంద్రునకా ధనం ఇచ్చాడు. పురుషునికి కట్టే ఖరీదులో స్త్రీ విలువ సగం ఉండేది. దీనికి కారణం స్త్రీ పురుషుల మధ్య అసమానత్వం కారణం కాకపోవచ్చు. పురుషుడు ఎక్కువ శ్రమతో కూడిన పనులు, బరువు పనులు చెయ్యగలడు. కాపలాభటులుగా, రక్షకులుగా, అంతఃపురం కావలి వారుగా ప్రాణాలకు తెగించి కార్యాలను సాధించేవారుగా ఉండేవారు. దాసీలుగా ఉన్న స్త్రీలు సుకుమారలైన సంపన్న కుటుంబాల స్త్రీలకు అలంకరణలోనూ, గృహాలంకరణలోనూ, చిన్న చిన్న పనులలోనూ సహయపడేవారు. కన్యలుగా ఉన్న ధనవంతుల కుమార్తెలకు సఖులుగా, చెలికత్తెలుగా, చతురికలుగా స్నేహపాత్రంగా ఉంటూ తమ ఆట పాటలతో వారిని రంజింపచేసే వారు. కనుక వారు చేసే పనులను బట్టి వారి ధర కూడా తక్కువగా అంచనావేసి ఉంటారు.

దాసీలుగా ఉన్న స్త్రీలు గృహాలలో రకరకాల పనుల చేసేవారు. వారు చేసే పనులను బట్టి వారికాయా పేర్లు ఇవ్వబడేవి. దాసీలలో దాదులు, సైరంధ్రికలు, ప్రసాధికలు, దూతికలు, అడపలు చామర గ్రాహికలు ఉండేవారు. వీరిలో తెలివితేటలు, సమయస్ఫూర్తి మాట చాతుర్యంకలవారు రాజకన్యలకు ఇష్టసఖులుగా ఉండి వారి ఇష్టాయిష్టాలను గమనించి సన్నిహితంగా మెలగుతూ, వారిని రంజింపచేసేవారు. నన్నెచోడుని కుమార సంభవంలో పార్వతి విరహబాధను గ్రహించిన ఆమె చెలికత్తె చతురిక విరహవ్యథను చెప్పుకొని తనపైన వాలిన చెలి పార్వతిని తన చతురోక్తులలో అనునయించింది. ఆమెకు విరహవేదన తగ్గించే శిశిరోపచారాలు చేయడానికి నిపుణికాది సఖీజనాన్ని పిలిపించింది. తపోవనానికి పార్వతితో చతురికాది సఖీ జనం తరలి వెళ్ళారు. ఈ విధంగా సమవయస్కలైన కన్యలు దాసీలుగానేకాక సఖీ జనంగా కూడా ఉండేవారు.

దాదులు:

ఆనాటి కావ్యశాసన వాఙ్మయంలో దాదుల ప్రసక్తి ఎక్కువగా ఉన్నది. దాసి, దాది పర్యాయ పదాలుగా కూడా వాడినట్లు కనిపిస్తుంది. సంపన్నుల గృహాలలో ప్రతి వ్యక్తికి ఒక దాది ప్రత్యేకంగా ఉంటుంది. కేతన దశకుమార చరిత్రలోనూ, పల్నాటి వీర చరిత్రలోనూ ఈ దాదుల ప్రసక్తి ఎక్కువగా వచ్చింది.

కేతన రచించిన దశకుమార చరిత్రలో ప్రహార వర్మ అనే రాజుకు ఉన్న కవలపిల్లలిద్దరికి తల్లీ కూతుళ్ళు దాదులుగా ఉండి వారి సమస్త శరీరరక్షలు నడిపేవారు. కాలగుప్తుడనే వైశ్యుని కూతురు సుపుత్రకు దాదియైన స్త్రీ, నౌకాప్రయాణం చేస్తూ నౌక మునిగిపోగా గర్భభారంతో ఉన్న సుపుత్రను ఎత్తుకొని తీరానికి చేరింది. ఈ విధంగా యజమానురాళ్ళకు అంగరక్షకులుగా ఉండేవారు దాదులు. రాజహంసుడు తన భార్యను అంతఃపురజనాన్నీ ఒక నిగూఢ స్థలానికి పంపిన సందర్భంలో శరీర స్థితి సహాయంగా. ధాత్రీ వర్గాన్ని అంటే దాదులను పంపించాడు. పలనాటి వీర చరిత్రలో ఐతాంబ తన తోడికోడండ్రతో కలిసి మాంచాల గృహానికి వెళ్ళినపుడు దాదులు కూడా వెళ్ళారు (దంటగావెంటను దాదులు చనిరి).

బాలచంద్రుని వేశ్య సబ్బాయికి కూడా దాది ఉన్నది. బాలచంద్రునికి, సబ్బమకు మధ్య మాటలు చేరవేసినది రాయబారం నడిపినది ఆమె దాదియే.

దాదులు – సంఘంలో స్థానం:

దాది దాసీ అనేవి పర్యాయ పదాలుగా వాడినట్లున్నా దాదులనే వారు శిశు సంరక్షణ భారం వహించేవారు. ఈ దాదులు బహుశా మొదట దాసీలుగా ఉండి, పెద్దవయసు వచ్చాక వారికి కూడా పిల్లలు కలిగే వయసు వచ్చాక దాదులుగా నియమింపబడేవారు కావచ్చును. దాదిగా నియుక్తమైన స్త్రీకి సంఘంలో మాన్యత గౌరవం ఉండేవి. ఒకానొక శాసనంలో కోట మన్మ కేతరాజుల దాది కొడుకు “ —-నాయుండు” అనే వ్యక్తి రుద్రదేవరకు అఖండ దీప దానం చేస్తూ తన గురించి దాది కొడుకుగా చెప్పుకున్నాడంటే ఆనాడు దాదులకు సంఘంలో ఉన్న స్థానం ఎంతటిదో తెలుస్తున్నది. దాదులను తల్లి, తండ్రి, తోబుట్టువులు, గురుపత్నివంటి వారితో సమానంగా చూచుకోవాలని ఆనాటి ధర్మశాస్త్రాలు ఆదేశించాయి. సాధారణంగా దాసీలైన స్త్రీలను యజమానులైన పురుషులు తమ కామోపభోగాలకై వాడుకోవడం జరుగుతుండేవి. కానీ దాదియైన స్త్రీని కలవడానికి, బలాత్కారంగా అనుభవించడానికి ప్రయత్నించే మగవాడి కోరును తెంపడమే శిక్షగా కేతన తన విజ్ఞానేశ్వరంలో తెలిపాడు.

తల్లి తోబుట్టువు తండ్రి తోబుట్టువు

తల్లి దండ్రుల సహోదరుల సుతలు

తన తోబుట్టువు తనతోడ బుట్టిన

వారల సుతలా భూవరులు సుతలు

తనయుని కాంతయు దన కన్న కూతును

గోడలు నత్తయు గోత్రజులును

బతి హిత వ్రతయైన బ్రాహ్మణ భార్యయు

చెలికాని సతియును శిష్యుసతియు

గురునిసతి దాదియు ననంగ బరగువారి

గవయు కష్టుండు గురుతల్పగామివాడు

ఉత్తమ బ్రాహ్మణుడు గాక యుండెనేని

చంపకాతని కోరును ద్రంపవలయు

దాదుల బాధ్యత:

దాది యైన స్త్రీ యజమానురాలికి బిడ్డ పుట్టిన నాటినుంచి శిశు సంరక్షణ బాధ్యత వహించేది. పెద్ద కుటుంబాలలో స్త్రీలు తమ పిల్లల బాధ్యత పూర్తిగా దాదులపైన ఉంచేవారు. దాదులు శిశు సంరక్షణ ఏ విధంగా చేసేవారో బసవపురాణంలో బెజ్జ మహదేవి వృత్తాంతంలో ఉన్నది. శరీర మర్దనం, అభ్యంగనం, స్నానం చేయించడం, ఉగ్గుపోయటం, స్తన్య మీయటం వంటి వన్నీ దాదుల పనులు. బసవపురాణంలో ఈ క్రింది విధంగా బెజ్జ మహదేవి శివుని మూర్తిని శిశువుగా భావించి సేవ చేసింది.

ముందు కాళ్ళపై శిశువునుంచి అభ్యంజన కార్యక్రమం మొదలు పెట్టింది. ముక్కు, చెక్కిలి నొక్కి మూడు కన్నులకు నూనె పులిమింది. కడుపు నొక్కింది. వీపు నిమిరింది. చేతులు కాళ్ళు సాగేటట్లు లాగింది, నలుగులు పెట్టి నలిచి, నీళ్ళు పోసేటప్పుడు నోటిలోకి పోకుండా జాగ్రత్తలు తీసుకొని, పసుపు రాసి మజ్జనం చేసి, కళ్ళు, చెవులలో గట్టిగా ఊది అంగిట్లో వేలు పెట్టి శుభ్రంచేసి, నీళ్ళుపోసి, శుభ్రంగా తడితుడిచి, బొట్టుపెట్టి, విభూతి నొసలకు పూసి, కాటుక పూసి, చన్నిచ్చి, నిద్రపుచ్చేది. వెన్న పెట్టేది. ఉగ్గుపోయడానికి చెక్కిలి మీటి ఏడవడానికి నోరు తెరవగానే వేలు లోపల పెట్టి ఉగ్గు పోసేది. నవ్వించి, బుజ్జగించి, ముద్దాడింది. బెజ్జ మహదేవి చేసిన ఈ శిశుపాలన కార్యక్రమం దాదులు శిశువులకి చేసేవారు. శిశువులు బాగా ఎదగాలన్నా శరీరం గట్టిపడి దృఢంగా ఉండాలన్నా ఈ విధమైన లాలన పాలన అవసరం. ఇది ఆరోగ్య శాస్త్ర రీత్యా అందరూ అంగీకరించిన సత్యం. అత్యాధునికులైన ఈనాటి వారు ఇంత సమయం వెచ్చించి తమపిల్లలకు పోషణ చేయలేకపోతున్నారు కానీ పూర్వీకులు శాస్త్రీయ దృక్పథంతోనే శిశు సంరక్షణ చేసేవారు. ఈనాటి వారు చాదస్తంగా భావించే ఈ చర్యలు అత్యంతావశ్యకాలు. భావితరాన్ని శారీరకంగా, మానసికంగా దృఢంగా చేసే ఈ విషయంలో పూర్వకులు మనకి అనుసరణీయులని మనం గ్రహించాలి.

దాది అనగా తల్లి తరువాత తల్లి వంటిది. ఈ దాదులు మధ్యయుగంలో ముఖ్యంగా ప్రస్తుతం చర్చింపబడే కాలంలో చాలా ఎక్కువగా ఉండటానికి కారణం బహుశా రాజకుటుంబాల స్త్రీలు, ధనిక వర్గాల స్త్రీలు భోగ భాగ్యాలకు, సుఖ జీవనానికి అలవాటు పడినవారవటం, తమ శారీరక సౌందర్యానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వడం కావచ్చు. అంతేగాక పైన చెప్పిన స్త్రీలు భర్త చనిపోతే అతనితో సహగమనం చేసేవారు కనుక తమ సంతానం పోషణ బాధ్యతని దాదులకు అప్పగించి, శిశువుల పట్ల మోహం పెంచుకోకుండా ఉండేవారు.

ఈనాటి స్త్రీల లాగా ఆనాటి స్త్రీలు కూడా సంఘంలో బాధ్యతాయుతమైన విధులను నిర్వహించేవారు. మండలేశ్వరులుగా, నాయకురాళ్ళుగా, అంతఃపురాలలో రకరకాల బాధ్యతలను వహిస్తూండేవారు. దేవాలయాలలో అంగ రంగ భోగాల వంటి కార్యక్రమ నిర్వహణలో తమ సంతానం కోసం స్వయంగా శ్రద్ధ తీసుకొనే సమయం ఉండదు. పైగా దాదులు ఉండటం, దాసీలుండటం అన్నది ఆ రోజుల్లో అధికారానికి, అంతస్తుకు వైభవానికి గౌరవానికి చిహ్నాలు. కనుక ధనవంతులైన స్త్రీలందరూ ఈ దాసీలను పోషించేవారు. దాది అవసరం తీరిపోగానే యజమానులు వారికి తగిన మాన్యాలిచ్చి వీడుకొలిపేవారేమో. బహుశా కోట మన్మకేతరాజుల దాదికి కూడా కొంత ధనమో పొలమో ఇచ్చి ఉంటారు. కనుకనే ఆమె కొడుకు తాను కోటమన్మకేత రాజుల దాది కొడుకునని చెప్పుకొని అఖండ దీపానికై దానం చేసి ఉంటాడు.

దాదులు అంతఃపుర చారులుగా కూడా ఉండేవారు. సభలలో జరిగే విషయాలు అంతఃపుర స్త్రీలకు తెలిపేవారు. రంగనాధ రామాయణంలో విశ్వామిత్ర, రామలక్ష్మణులు జనకుని సభకు వచ్చినట్లు, శ్రీరాముడు శివుని చాపం ఎక్కు పెట్టదలచినట్లు దాదులు వచ్చి జనకుని దేవికి, సీతకు, ఊర్మిళకు చెప్పారు.

ప్రసాధికలు:

వీరు అలంకరణలు చేసేవారు. అంతఃపురాలలో రాణి మొదలగు వారికి అలంకారం చేసే స్త్రీ అని సూర్య రాయాంధ్ర నిఘంటువులో అర్థమున్నది. ఈ ప్రసాధికలు వేశ్యలకు కూడా అలంకారాలు చేసేవారని కావ్యాలను బట్టి తెలుస్తుంది. వీరి అలంకరణా నైపుణ్యం ఎంతటిదంటే వారు చేసిన శృంగార భంగులు (అంటే ఈనాటి మేకప్) చేసినట్లే తెలిసేది కాదు. విశేషలావణ్యకళతో, జగన్మోహనంగా కనిపించే విలాసినుల సౌందర్య రహస్యం ప్రసాధికల అలంకరణా చాతుర్యంలో ఉండేదని భాస్కర రామాయణంలోని వర్ణన బట్టి తెలుసుకోవచ్చును. ప్రసాధికలనే సైరంధ్రులని కూడా అనవచ్చు. సూర్య రాయాంధ్ర నిఘంటువులో సైరంధ్రి అన్న పదానికి అంతఃపురపు కావలికత్తె, సంకరజాతి స్త్రీ అని అర్థం ఉన్నది. కానీ తిక్కన రచించిన విరాటపర్వంలో సైరంధ్రి వేషధారణ, ఆమె చేసే పని గురించి తెలిపే సందర్భంలో ఆమె, శిరోజాలను రకరకములుగా ముడిచి పూవులతో అలంకరణలను చేయగలదని ఉన్నది. దీన్ని బట్టి ప్రసాధిక, సైరంధ్రి అన్నవి స్త్రీలకు శృంగారం చేసే దాసీలకు పర్యాయ పదాలని తెలుస్తున్నది. సైరంధ్రీ వేషంలో ఉన్న ద్రౌపది తాను చేయగల పనిని గూర్చి ఈ విధంగా తెలిపింది.

కలపములు గూర్ప బహువిధ

తిలకంబులు వెట్ట వింత తెరువున బలుపు

వ్వులు గట్టికట్టి ముద్దుగ

దల ముడువగ సరులు గ్రువ్వ దద్దయు నేర్తున్

ఇది అమూలకమే.

సైరంధ్రీ జారి స్త్రీ ఎలా ఉంటుందో తిక్కన ఈక్రింది విధంగా వర్ణించాడు.

నిజదేశాచారంగా అల్లి ఉన్న జడను ముడివేసి వలపలి దిక్కుకు కొంచెంరానిచ్చి జుట్టులోనికి తుఱిమింది. కొద్దిగా మాసిన వస్త్రాన్ని కట్టి వక్షంపై వేరొక వస్త్రాన్ని ధరించింది. మేలిముసుగు ధరించింది. (తలసీర యరసి).

వీరు రాజకన్యలను అలంకారం చేయడం చాలా శాస్త్రీయంగా చేసేవారు. అలంకరణ కూడా ప్రత్యేకమైన విద్య. సాంకేతిక విద్యగా భావించవచ్చు. ఈనాటి (బ్యుటీషియన్) సౌందర్య పోషకురాలు చేసే పనులెంత శాస్త్రీయమో ఆనాటి వారు చేసే అలంకరణ కూడా అంత శాస్త్రీయంగా ఉండేది. అంతేకాదు. కృత్రిమ సౌందర్య పోషక సాధనాల కన్న ఆనాటి సహజ సౌందర్య పోషక వస్తుసామగ్రి గొప్పదని ఈనాటి వారు గ్రహించి పాటిస్తున్నారు. ఈ అలంకరణ విద్య వారు పూర్వీకుల వద్ద గ్రహించినది కావచ్చును. వీరు రాజకన్యలనెలా అలంకరించేవారో ఆనాటి కావ్యాల్లో చక్కగా వర్ణించారు. రంగనాధ రామాయణంలో పెళ్ళి కూతుళ్ళైన సీత ఊర్మిళాది కన్యలు నలుగురిని అలంకరించడానికి కన్యకలను మణి పీఠాలపై నుంచి, పేరంటాండ్రు పెళ్ళి పాటలు పాడుతుండగా, కుంకుమ, కస్తూరి, గోరోచనం, సంకుమదము, వాసనగందవడి మొదలైన వాటితో వారికి నలుగులు పెట్టి, కురులకు సంపెంగనూనె రాసి, హరిచందనంతో ఆటకలు (అంటే నలుగు) పెట్టి, ఘనసార సురభి నఖంపచాంబులతో నీరుపోసి, తడి తుడిచి చెంగావివన్నె చలువ పావడాల పైన జాళువాసరిగె కొంగులున్న వస్త్రాలు కట్టి, కొప్పులు పెట్టి, జాజిపూలను అందులో తురిమి, పచ్చకర్పూరం, పన్నీరు, పచ్చి కస్తూరి కలపము కలిపి మైపూతగా అద్ది, బంగారు జరీ పువ్వుల కుట్టుపని చేసిన రవికెలు తొడిగి, పచ్చల బన్న సరాలను, తారహారాలను అమర్చి, కస్తూరి తిలకాలను దిద్ది, చెక్కులపైన మకరికలు చిత్రించి నాసాగ్రాన ముక్కర నలంకరించి, రకరకాలైన వరభూషణాలను అలంకరించి, సానదీఱిన జాతి రత్నాలో, పులుగడిగిన ముత్యాలో, అలరుగంధపు కొమ్మలో, పూర్ణచంద్రుని కళలో అని ఆశ్చర్యపోయే విధంగా అలంకరించారు.

ఇదే విధంగా పలనాటి వీరచరిత్రలో వీరసోముని పుత్రిక సిరాదేవి మలిదేవులి వివాహ సమయంలో సిరాదేవిని అలంకరించే విధం, మాంచాలను చెలికత్తెలు అలంకరించిన విధాలను పరిశీలిస్తే ఈ అలంకరణ ఒక్కరు చేసేది కాదనీ, కొందరు ప్రత్యేకమైన శ్రద్ధతో నైపుణ్యంతో చేసే విద్యగా కనిపిస్తుంది. మాములు ఊడిగం చేసేవారు, పరిచర్యలు చేసే స్త్రీలు కాక ఈ అలంకరణను వృత్తిగా స్వీకరించిన వారు చేసే పనిగా పైన చెప్పిన కావ్యాలను బట్టి మనం గ్రహించగలుగుతాం. దీన్ని బట్టి సైరంధ్రికలనే ప్రత్యేకమైన జాతివారు ఈ కళనభ్యసించి వృత్తిగా స్వీకరించేవారని దాసీలలో వీరు ఉన్నత వర్గానికి చెందిన వారని చెప్పవచ్చును. సూర్య రాయాంధ్ర నిఘంటువులో వీరు నీచ జాతి వారని అన్నప్పటికీ తిక్కన విరచిత విరాటపర్వంలో సైరంధ్రీ జాతి గురించి ద్రౌపది ద్వారా చెప్పించిన దాన్ని బట్టి ఆ స్త్రీలు గౌరవభావం కలిగేటట్లు ప్రవర్తిస్తారని, పాతివ్రత్యంతో చరిస్తారని సౌజన్యం, మితభాషిత్వం వ్రతసంభావన, పాపభయం వారికి ఉచితమైన గుణాలని తెలుస్తున్నది. సైరంధ్రిని గట్టివాలు అని కూడా అంటారు. గట్టివాలు అనగా సైరంధ్రీ జాతి స్త్రీ అని, పరుల యింట నుండి గంధపుష్పాదుల చేత అలంకరించు స్వతంత్ర స్త్రీ అని సూర్య రాయాంధ్ర నిఘంటువులో ఉన్నది. ఈనాడు అటువంటి వారిని బ్యూటీషియనులంటారు.

అంతఃపుర పరిచారికులలో చామర గ్రాహికలు కూడా ఉన్నారు. వీరు ఎల్లప్పుడు అప్రమత్తతలో వింజామర వీస్తూ ఉండాలి. అడప, లేక తాంబూల కరండ వ్రాహికలు తాంబూలం ఉన్న పేటికలను మోస్తూ, పచ్చకర్పూరం, కస్తూరి వంటి సుగంధ పరిమళ ద్రవ్యాలతో ఆకుల మడుపులు చేసి రాజుకు యజమానులకు అతిథులకు అందించేవారు. రాణివాసంలో ఈ పనులను స్త్రీలు చేస్తే రాజాంతఃపురాలలో పురుషులు (అడప) మోసేవారు. ఒకానొక శాసనంలో అడపకేతనబోయ అన్నతని ప్రసక్తి ఉన్నది. పలనాటి వీర చరిత్రలో అడపకేదాసి అన్న వ్యక్తి ప్రస్తావన ఉన్నది.

వీరే కాక కొందరు స్త్రీలు అడుగులను వత్తేవారు. ఒకానొక ద్రాక్షారామ శాసనంలో కులోత్తుంగ చోడ గొంకరాజు అడుగులొత్తెడి నంగాండి కూతురు ఉయ్యమ కూతురు పెరియాండి ప్రస్తావన ఉన్నది. ఈమె కోన రాజేంద్ర చోడయ రాజుల అనుంగు అంటే కులోత్తుంగ చోడ గొంకరాజుకు అడుగులు వత్తే స్త్రీ మనుమరాలు, ఆ యజమాని బంధువుకే భోగస్త్రీగా ఉన్నది అని తెలుస్తుంది.

అంతఃపురంలో రాజుకుటుంబాల స్త్రీలు వారి దాదులు, కాక మిగిలిన పరిచారకా గణం ఎక్కువగా వేశ్యలై ఉండేవారు. అయితే వీరు వేశ్యావృత్తి జీవనంగా పెట్టుకొని, ధనం గడించేవారు కాదు. యజమానుల ఇండ్లలో రకరకాల వృత్తులు నిర్వహిస్తూ ఆ కుటుంబాల మగవారికి భోగినులుగా ఉండేవారు. రాజ ప్రాసాదాలలోని పరిచారికలు వేశ్యలనడానికి ఆనాటి కావ్యాలలో ఆధారాలు లభిస్తాయి. నన్నెచోడుని కుమార సంభవంలో దక్షయజ్ఞ ముఖమండపంలో విమానం దిగిన సతీదేవిని “శివగణికా సహస్రం” పరివేష్టించినట్లు ఉన్నది. శివుడు పంపగా సప్త ఋషులు హిమవన్నగానికి వెళ్ళి పార్వతిని చూడబోగా హిమవంతుడు పిలిపించగా గణికాజనం పార్వతిని మునుల వద్దకు తెచ్చారు.

దశకుమార చరిత్రలో అంగనా పరివృతుడైన అంగాధీశ్వరుడు కొలువుదీల్చిన సమయంలో ఆ స్త్రీలలో ఒకతె తాను కామ మంజరితో పందెం వేశానని చెప్పింది. కామ మంజరి ఒక వేశ్య. ఆమెతో పందెం వేసిన స్త్రీ కూడా వేశ్యయే. దీన్ని బట్టి రాజాంతఃపురాలలో గణికాజనం (వేశ్యలు) ఉండేవారని మనము నిర్ధారించుకోవచ్చు.

దాసీలు- హక్కులు:

శూద్రుల దాసీలకు పుట్టిన కొడుకుకు శూద్రుని కొడుకుతో సమంగా ఆస్తి హక్కు ఉన్నది. కొడుకులు లేకపోతే దాసీపుత్రుడే శూద్రుని ధనానికి వారసుడు అని కేతన విజ్ఞానేశ్వరీయంలో చెప్పడాన్ని బట్టి ఆనాడు దాసీలు గానీ, దాసీ పుత్రులు గానీ సాంఘికంగానూ, ఆర్థికంగానూ మంచి స్థితిననుభవించారని పిస్తుంది.

దాసీల ఎంపిక:

రాజుల అంతఃపురాలలో పనుల నిర్వర్తించే దాసీలుగా నియమింపబడే స్త్రీలను బాగా పరీక్ష చేసి ఎన్నుకునే వారు. “బాగా శిక్షణ పొందిన స్త్రీలను, వారి అంగాంగములు, ఆభరణములు, పరీక్షింపబడిన తరువాతనే రాజునకు నీటి నందించుట, వింజామర వీచుట గంధము నందించుట వంటి పనులకు నియోగించవలెను” అని మనువు శాసించాడు.

రాజును సేవించే వారకాంతలు ఎలా ఉండాలో ఏ విధమైన దుస్తులు, ఆభరణాలు ధరించాలో కామందకం అనే ఆనాటి నీతి శాస్త్ర గ్రంధం ఇలా చెప్పింది.

లలిత మంజుల విమలాంగలతలు వెలుగ

సూక్ష్మ వస్త్రాభరణ మాల్య సుభగమూర్తు

లగుచు వారాంగనలు మన్మథాస్త్ర లీల

బలిసి కొలువంగ వలయు భూపాల మదను

ఈ విధంగా రాజును సేవించే కాంతలు నృత్య సంగీతాది కళలలో నిపుణలై ఉండాలి. శాస్త్ర పరిజ్ఞానం కలిగి ఉండాలి. జాయపసేనాని తన నృత్త రత్నావళిలో తెలిపినట్లు, రాజు నాట్య ప్రదర్శనను తిలకించే వేళ కొందరు స్త్రీలు అతనికి వీస్తూ ఉండాలి. కొందరు స్త్రీలు ఆ ప్రదర్శన లోని నృత్య విశేషాలను రాజుకు వ్యాఖ్యానించి చెప్పాలి.

రాజగృహాలలో, మండలేశ్వరుల గృహాలలో రాజోద్యోగుల భార్యలు పనులను నిర్వహించేవారని కొన్ని శాసనాలను బట్టి తెలుస్తుంది. గొంకరాజు యొక్క అమాత్యుడు ప్రోలన భార్య వంటల కామసాని అన్న స్త్రీ. ఆమె వంటశాలకు అధ్యక్షురాలు. ఎఱ్ఱగరాజు కూతురు సూరమ గొంకరాజు తళియ అని చెప్పడం వల్ల ఆమె రాజు గారి భోజన పాత్రను అందించే స్త్రీ అని చెప్పవచ్చును.

ఈ విధంగా సంపన్న గృహాలలో సేవికలైన స్త్రీలు ఆర్థికంగానూ, సాంఘికంగానూ సముచిత స్థానాన్ని సంపాదించారని, సంఘంలో క్రింది వర్గాల కులస్త్రీలకన్నా ఎక్కువ వైభవంగా ఉన్నారని గ్రహించవచ్చును.

(సశేషం)

Exit mobile version