[డా. మంత్రవాది గీతా గాయత్రి గారు 1995లో పిహెచ్‍డి పట్టా కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖకి సమర్పించిన సిద్ధాంత వ్యాసాన్ని సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము.]
ప్రకరణం 8 – స్త్రీలు-వృత్తులు: రెండవ భాగం
దేవాలయాలలో స్త్రీలు నిర్వహించే వృత్తులు:
[dropcap]కా[/dropcap]కతీయుల కాలంలో దేవాలయం కేవలం ఆధ్యాత్మిక జీవనానికే కాక అన్ని కళలకు కేంద్ర స్థానమైంది. ఎంత మందికో జీవిక కల్పించే సంస్థ వంటిది. దేవాలయాన్నాశ్రయించుకుని ఎంతమందో కళాకారులు, వృత్తులవారు ఉండేవారు. వారిలో స్త్రీలు కూడా ఉండేవారు. దేవాలయంలో దేవునికి రకరకాలైన సేవలు పూజలు జరిగేవి. దేవునికి చేసే సేవలకు అంగభోగమనీ, రంగభోగమనీ, అర్చన భోగమనీ అంటారు. అయాసేవలు చేసేవారిని అంగరంగ భోగాలవారని పేర్కొని వారికి జీతాలు లేదా వృత్తులు ఇచ్చేవారు. దేవునికి జరిగే ఈ అంగరంగ భోగాల గురించి క్రింద వివరించబడుతుంది.
అంగభోగం:
రంగభోగమనే పదంలో జంటగా కన్పించే పదం అంగభోగం. అంగభోగమంటే గర్భగుడిలోని మూలస్ధాన దేవతకు చేసే స్నానవసనాభరణ గంధపుష్ప ధూప దీప నైవేద్యాది వైభవాలు అని కుందూరి ఈశ్వర దత్తుగారు తమ శాసన శబ్దకోశంలో అర్థం చెప్పారు. క్రీ.శ. 1269 నాటి దుర్గి శాసనాన్ని బట్టి దేవతా విగ్రహాలకు చేసే ధూప దీప నైవేద్యాలేకాక తాంబూలం, శ్రీగంధం, చాతుర్మాస్యాది విశేష దినాలలో బ్రాహ్మణులకు పెట్టే భోజనాలు కూడా అంగభోగానికి సంబంధించినవి అని తెస్తున్నది.
“నాగేశ్వర దేవరకు అఖండం నూనెదీపం-1, సంధ్యాకాల మన్నిటికి పరివారదేవతలకూ దీపమైత్తేది శ్రీ గ్రంధ మేండాటికి గ3 గుగ్గిలం గలి విడెంపోకలు అన్ని దేవడ్లకు నిత్య 2 (8) ఆ ఆకులు గ పంచపర్వాలుకి దేవర విభవ వెచ్చం గసేసేది! చాతుర్మాస్య నెలలు 8 న్ను నిత్య యేవురపాస్పతులకు భోజనం లెస్సగాంబెట్టేది! ఇంతవట్టు దేవరకు అంగభోగము!”
అంగభోగమంటే శరీరానికి లేదా విగ్రహానికి చేసే సేవలు అనగా ఛత్రమును పట్టడం, వింజామర వీచడం, కస్తూరి, చందన కుంకుమ గంధము వంటి లేపనాలు పూయటం, అభిషేకం లేదాస్నానం చేయించి వస్త్రాలతో, ఆభరణాలతో దేవుని అలంకరించడం వంటిది. క్రీ.శ. 1112 నాటి దాక్షారామ శాసనంలో పెద మున్నూంటి సాని జయమ చామరి అని చెప్పడం వల్ల ఆమె దేవుని సన్నిధిలో చామరం వీచేదని తెలుస్తున్నది. కొప్పరంలోని కోదండ రామాలయంలోని శాసనంలో చమరిక ప్రసక్తి ఉన్నది. నాదిండ్ల శాసనంలో గొడవుకామె అన్న ఆమెకు వృత్తులిచ్చినట్లు ఉన్నది. ఈమె ఛత్రాన్ని పట్టుకుని నడిచేదని తెలుస్తుంది. స్నాననై వేద్యాదులను పూజారులే నిర్వహించేవారు. అయితే బసవ పురాణంలో దాక్షారామంలో వీర చోడవ అనే వేశ్య, శివ భక్తురాలు శివునికై పులగం వండి దాసి చేత పంపగా శివుడు ప్రేమగా తిన్నాడన్న ఉదంతాన్ని బట్టి నైవేద్యం కోసం శైవాలయాలలో సానులు వండి పంపేవారనుకోవాలి. ఇది బహుశా వీరశైవ సంప్రదాయం ఉన్న దేవాలయాలలో కావచ్చు. కానీ ఇది సర్వసాధారణంగా జరిగేది కాదు. దీన్ని అపవాదుగా గ్రహించాలి. విడెంపోకల ఇచ్చేవారిని అడపలు లేదా తాంబూలకరండవాహికలు అని అంటారు. స్త్రీలు పురుషులు కూడా అడపలుగా ఉన్నట్లు శాసనాలలో ఆధారాలున్నాయి. క్రీ.శ. 1275 నాటి దాక్షారామ శాసనంలో కొండిక మున్నూంటి అడప, అక్కాసాని ప్రసక్తి ఉన్నది.
ఛత్రచామరాలను మోసేవారిలోనూ, అడపము పట్టుకునే వారిలోనూ స్త్రీ పురుషులు సమానంగానే ఉండేవారు. నాదిండ్ల శాసనంలో గొడవు కామె అన్న స్త్రీయే కాక గొడవు భరువన అన్న పురుషుడు కూడా ఉండేవాడు. అడప అన్న పదవి నిర్వహించిన పురుషులు ఉండేవారనటానికి క్రీ.శ. 1240 నాటి వేల్పూరు శాసనంలోని అడపకేతన బోయ తార్కాణం ఇతడు గంగేశ్వర దేవర విత్తి మంతుడు.
రంగభోగము:
రంగభోగము అనే పదానికి దేవుని ఉత్సవ విగ్రహానికి చేసే నృత్య గీత వాయిద్యాది వైభవాలు, కల్యాణ శయన డోలాది ఉత్సవాలు అని అర్థం. శాసన శబ్దకోశంలో ఇవ్వబడింది. దుర్గి, పిల్లల మర్రి శాసనాలలో వివరాలను బట్టి ఏ ఏ సేవలు రంగభోగానికి చెండుతాయో తెలుస్తుంది.
క్రీ.శ. 1269 నాటి దుర్గి శాసనంలో రంగభోగాల వారికిచ్చే వృత్తుల వివరాలున్నాయి. వాటిని బట్టి రంగభోగాలంటే మనోరంజనానికి సంబంధించి నృత్య నాట్య వాయిద్యాది భోగాలని గ్రహించవచ్చును. ఉత్సవ విగ్రహాలకు చేసే ఉత్సవాలు ఊరేగింపులలో గీత నృత్య వాద్యాలకు ప్రాముఖ్యమున్నది. దుర్గి, పిల్లల మర్రి శాసనాలలో రంగభోగాల వారికిచ్చిన వృత్తుల పట్టికను బట్టి రంగభోగాల వివరణ తెలుసుకోవచ్చును. దుర్గి శాసనంలో ఇచ్చిన వివరాలను బట్టి రంగభోగము వారిలో మద్దెలవారు. ఆవజకాడు, వానెకాడు, ఎత్తుకాడు, మోభరత, పాత్రలు, పాడే సీయాణెతలు, వీరణతి వారు, బొమ్మిడి వారు, జేగంటల వారు, ఎక సంకుల వారు, ధవళ సంకులవారు, పెద్ద గవుఱ్ఱవారు, సన్నగాళవాడు, గ్రాడగువాడు, దివ్యకోలవాడు, అంగరేక, సూవాసి, తిరుమజ్జనానికి తీర్ధాలు తెచ్చేకావడి పడుగు సంప్రదాయం వెన్న కూతవాడు, కంభపుముట్టు చెలగే బానిస అనే వారున్నారు.
పిల్లల మర్రి శాసనంలో రంగభోగాల వారికిచ్చిన యిళ్ళ వివరాలలో ఆవజం, మద్దెల వారు, వాసెకాడు, మోకరి, పాడేస్త్రీలు, పాత్రలు అంటే నర్తకులు ఉన్నారు.
వీటిని పరిశీలిస్తే రంగభోగం సేవలు చేసే స్త్రీలు ముఖ్యంగా నిర్వహిచవలసిన విధులు గీత, నృత్యాలు. వీటిని ప్రదర్శించేందుకు ప్రత్యేకంగా రంగమంటపం అన్నది దేవాలయంలో ఉంటుంది.
రంగభోగాల వారందరినీ సంఘాన్నీ మేళం అని కూడా అంటారు. ఈ మేళానికి నాయకుడు మేలునాయకుడు. మేళంలో మేలునాయకుడు కాక నర్తకులు, గాయకులు, గాయనులు, మద్దెల వీణ, కాంస్య, వేణువు కాహళ వీరణతి, ఆవజము ఇత్యాది వాయిద్యాలను పయోగించే వాద్యకారులు ఉంటారు.
క్రీ.శ 1132 నాటి దూబాడు భీమేశ్వరాలయ శాసనంలో మేలునాయక దేవాండి అన్న వ్యక్తి ప్రసక్తి కాన వచ్చింది. క్రీ.శ. 1135 నాటి సాతులూరు రామేశ్వరాలయంలో మేలునాయక మల్లె గురించి ఉన్నది. కొన్ని శాసనాలలో మొదలి అన్న పదం కూడా ప్రసక్తమైంది. మొదలి అంటే శాసన శబ్దకోశంలో ప్రధానుడు అని అర్థం ఇవ్వబడింది కానీ ఈ మొదలి అన్నది మేలునాయకుని బిరుదు కూడా కావచ్చును. దాక్షారామ శాసనంలో కులోత్తుంగ చోడదేవర అనుంగు గుద్దవారి నాంటి పెద్ద డాకిరేమి సమర మొదలి బేతి నాయకు కూతుఱు జయమ అనడం వల్ల జయమ తండ్రి పెద్దడాకి రేమి దేవాలయ సానిమాన్య సంఘం వాడనీ, మొదలి అన్న పదవిని నిర్వహించాడని తెలుస్తున్నది. ఆ సంఘానికి నాయకుని మొదలి అంటారని పై శాసన వాక్యాన్ని బట్టి చెప్పవచ్చు. లేదా దేవాలయంలో మేలునాయకునిగానూ, రాజోద్యోగిగా సమర మొదలి గానూ ఉండేవాడని కూడా అన్వయించుకోవచ్చు. పురుషులే కాక స్త్రీలు కూడా మేళ నాయకురాళ్ళుగా ఉండేవారు. వీరిని నాయకురాలు లేదా మొదలి సాని అని కూడా వ్యవహరించేవారు. నకరపు వాడ విష్ణుదేవర గుడిలోని మొదలి సాని కామకోటి నాయకురాలి చెల్లెలు చిన్నమ నాయకుణాలు మధుకీశ్వర దేవునికి అఖండవర్తి దీపాన్ని సమర్పించింది. సాని మున్నూర్వురు అన్న సంఘం స్త్రీలదే కనుక బహుశా వారి నాయకురాలు మొదలిసాని అని వ్యవహింపబడుతుందని భావించవచ్చు.
మేలునాయకులకు, మేళనాయకురాళ్ళకు గ్రామాలను వృత్తులుగా ఇచ్చేవారు. క్రీ.శ. 1161 నాటి తిమ్మాపురం శాసనంలో పండీశ్వరాలయనర్తకి తండ్రి మేలునాయకుడు అయిన పోతయనాయకుడు ధాన్యవాణీ వరవృత్తిపరుడు. క్రీ.శ.1238 నాటి ఆత్మకూరు శాసనంలో పాతుపోతారం నాయిక చోడి చంద్రమా కూచాంబ ప్రసక్తి ఉన్నది. ఈమె తన కళాపాండిత్యాల వల్ల పాతుపోతారం అనే గ్రామానికి నాయకురాలై ఉంటుంది.
పాత్ర:
పాత్ర అంటే నాట్యం చేసే స్త్రీ అని సూర్యరాయంధ్ర నిఘంటువులోనూ, శాసన శబ్దకోశంలోనూ ఉన్నది. ఆనాటి శాసనాలలో పాత్ర అన్న పదం నాట్యకర్తలు అన్న అర్థంలో ఉపయోగిస్తే నేడు నాటకంలోని వ్యక్తులనే అర్థంలో ఉపయోగిస్తున్నారు.
జాయప తన నృత్త రత్నావళిలో రూపము, యౌవనము లావణ్యము కలిగిన్నత్త విద్యలకు ఆశ్రయ భూతులై ఆ విధంగా వారిచ్చే నేత్రానందుమనే అమృతాన్ని త్రాగడానికి అనువైన పాత్రలు కావటం వల్ల వారికి పాత్రలని పేరు సార్థకమైందని చెప్పాడు.
ఒక దేవాలయంలో పాత్రలు ఒకరికంటే ఎక్కువే ఉంటారు. పిల్లల మర్రి శాసనంలో ఇళ్ళు గ్రహించిన పాత్రలు నలుగురు. పాత్ర సీతమ్మ, అన్నమ, పార్వతి, ముత్తమ అనేవారు. ఇంకొక దేవాలయంలో ఎనిమిది మంది పాత్రలున్నారు. రంగభోగాలవారిలోని స్త్రీలు గాయనులు, నర్తకులే కాక రకరకాల వాద్యాలను వాయించేవారు కూడా ఉండేవారు. వేణువు ఊదేవారు, మద్దెల వాయించేవారు, శంఖం ఊదేవారు కూడా స్త్రీలేనని క్రీ.శ. 1134 నాటి నాదిండ్ల శాసనాన్ని బట్టి తెలుస్తుంది.
నాదిండ్లలోని కర్ణమోటి గుడిలోని శాసనంలో పేర్కొన బడ్డ సానులలో సంకుధార కన్నె, వాసన అయక, మద్దలి యెక్కపకామె అనే స్త్రీలున్నారు. పాలంపేటలోని రామప్ప దేవాలయం కుడ్యాలపైన నర్తకీ సమూహాల శిల్పాలలో వేణువునూదేవారు, మృదంగం వాయించేవారు, ఉన్నట్లు గమనించ వచ్చును. దీన్ని బట్టి దేవాలయాలలో స్త్రీలు గాయనులు నర్తకులుగానే కాక వాద్యకారులుగా కూడా ఉండేవారని తెలుస్తుంది.
బసవపురాణంలో ముగ్ధ సంగయ్యకథలోని వేశ్య యింట్లో ఆమె నాట్యమాడుతుండగా ఆమె చెలులు రకరకాల వాద్యాలు వాయించారని వర్ణించ బడింది.
యక్కమహాదేవి! యల్ల మద్దెలలు – జక్కొల్పి వేగంబ సంధించుకొను డు
స్వరమానమున బసవ ప్రమధవ్వ! కరమర్ధి (బట్టుడు(ము?) కాహళలోలి
సకళవ్వ! నీవును సంగళవ్యయును – నొకరీతి నిలువు డు సుకరంబుగా గ
బాల రుద్రమ యొత్తు పట్టగ వాళ (సె) గ్రోలు వ్రాయింపుము! గుడ్డవ్వ నీవు
సిట్టితాళము వట్టు శివదేవి నీవు – సట్టన నృత్యంబు సరసంబెఱింగి
పై వారే కాక దేవాలయాలలో ఇతర పనులకు కూడా స్త్రీలను నియమించేవారు.
ఆలయ ప్రాంగణం శుభ్రం చేసి అలికేవారు, ముగ్గు పెట్టేవారు ఉండేవారు. ఈ పనులు స్త్రీలే చేసేవారు. దేవాలయం చిన్నదైతే ప్రాంగణం అలకడం, ముగ్గు పెట్టడం ఒకరే చేసేవారు. పెద్ద దేవాలయాలలో ఈ రెండు పనులు చేయడానికి ఇద్దరు నియమింపబడేవారు. అలికే వారిని మ్రేక వారు అనేవారు. ఈ ప్రేక అన్న పదానికి శాసన శబ్ద కోశంలోగానీ, ఇతర నిఘంటువులోనూ అర్థం లేదు గానీ సందర్భాన్ని బట్టి అలకడం అన్న పదానికి మ్రేక అని వాడేవారని అర్థం గ్రహించవచ్చును. క్రీ.శ. 1135 నాటి సాతులూరు రామేశ్వరాలయంలోని నిబంధకారులలో మ్రేక వారికి వెలిపొలం ఇచ్చినట్లున్నది.
క్రీ.శ.1171 నాటి సిరిపురం శాసనంలో సానులకు వృత్తుల వివరాల నిచ్చిన సందర్భంలో విరికమ్రేకకు రెండు ఖండుకలు, ముగ్గుపెట్టే మాసకమ్మకు ఒక ఖండుక భూమి నిచ్చారు. దేవాలయం చిన్నదైనా, ఆదాయం తక్కువ ఉన్నా ఈ రెండు పనులకూ ఒకే స్త్రీని నియమించడం జరిగేది.
అలకడం ముగ్గు పెట్టడం అన్నది ఎప్పుడూ జంటపదాలుగానే ప్రయుక్తమౌతాయి, కనుకనే ముగ్గును, మ్రేకకు అన్నపుడు మ్రేక అంటె అలకడం అన్న అర్థం సరిపోతుంది. నన్నెచోడుడు కుమార సంభవంలో మ్రేక అన్న పదాన్ని అలకడం అన్న అర్థం లోనే వాడాడు.
పరమేశ్వరుడు హిమవంతానికి వచ్చినపుడు పురాలంకరణ చేసిన సందర్భంలో
“కస్తూరి మ్రేకపై గర్పూర మౌక్తిక
రంగవల్లులు నొప్పె నంగణములో”
అన్న వాక్యాన్ని బట్టి కస్తూరి కలయంపి పైన కర్పూర ముక్తాఫలాలలో రంగవల్లులు తీర్చారని, కలయంపికి బదులు మ్రేక అన్న పదం నన్నెచోడుడు వాడాడనీ చెప్పవచ్చు.
క్రీ.శ. 1168 నాటి మండపాడు శాసనంలో మందాపురం దేవాలయంలో శ్రీ మల్లిఖార్జున మహాదేవునికి దీపనివేద్య భోగాలకు వృత్తులనిస్తూ మ్రుగ్గును మ్రేకకు ప్రోలమకు 10 ఖందుకలు భూమి నిచ్చినట్లున్నది. అంటే ప్రోలమ ఆలయ ప్రాంగణం చిమ్మి కలయంపి జల్లడం, అలకడం వంటివి చేసేదని, ఆమెకు పై విధంగా జీతాన్ని ఏర్పాటు చేశారనీ తెలుస్తున్నది. వీణ వాయించే స్త్రీని వాణి అనేవారు. క్రీ.శ. 1130 నాటి నాదిండ్ల శాసనంలో వెండిపాడి వాణి, పాడి వాణి అనే ఇద్దరు సానులకు వృత్తులనిచ్చినట్లు తెలుస్తున్నది. దాన్ని బట్టి ఇద్దరు స్త్రీలు రెండురకాల వీణలను వాయించడంలో నిపుణులని ఉహించవచ్చును. వీణ వాయించే పురుషుని వాణిక అని శాసనాలలో అనేవారు. ఇది వైణిక అన్న సంస్కృతశబ్దానికి తత్సమ రూపం కావచ్చు. కొప్పరంలోని సంస్కృత శాసన భాగంలో వాణిక శంకరస ఖ 5 అని ఉన్నది. బహుశా శాసనాలు వ్రాసేవారు వైణిక శబ్దానికి బదులు వాణిక అని వాడి ఉంటారు.
దేవాలయ పరిచారిక వృత్తులు చేసేవారిలో ఎంగిళ్ళు ఎత్తేవారు, వడ్లు దంచేవారు, నీళ్ళు తెచ్చేవారు కూడా స్త్రీలే. కులోత్తుంగ చోడదేవుని కాలం నాటి దాక్షారామ శాసనంలో శివ యోగులు పదిమందికి భోజనానికై వడ్లు దంచేందుకు ఒక స్త్రీని, ఐట్టముద అనే నైవేద్య పదార్థం కొరకు వడ్లు దంచే స్త్రీలనిద్దరినీ విడివడిగా నియమించినట్లు తెలుస్తున్నది.
ఈ వృత్తులు చేసేవారిలో బ్రాహ్మణస్త్రీలు కూడా ఉండేవారు. దేవాలయంలో వంట చేసే వారిలో బ్రాహ్మణ స్త్రీలున్నారని తెలుస్తున్నది. కోల వెన్ను శాసనంలో నాగనకూచి (బ్రాహ్మణుడు) కూతురు మారామ బ్రేక ప్రసక్తమైంది. ఆమె పేరు బ్రేక బహుశా విరికమ్రేక అన్న స్త్రీ పేరులో లాగా మ్రేక కు బదులు వ్రాయబడి ఉంటుంది. బ్రాహ్మణ స్త్రీ గనుక బహుశా గర్భగుడిలో చిమ్మటం, అలకడం వంటిమి మారామ అన్న ఆ స్త్రీ చేసి ఉంటుంది.
దేవాలయాలలో స్త్రీలకు పురుషులతో సమానంగానే జీతభత్యాలు ఉండేవి. పిల్లల మర్రి శాసనంలో పాత్రలు సీతమ, పార్వతి మొదలైన వారికి ఇళ్ళు ఇచ్చినట్లుగానే వాసెకార పోతనకు, మోకరి దామకు పాదే త్రిపురమకు కూడా ఇళ్ళు ఇచ్చారు. నాదిండ్ల లోని శాసనాన్ని బట్టి గొడుగు (ఛత్రం) మోసే గొడవు కామెకు 2 ఖండుకలు, గొడవు భడివనకి రెండు ఖండుకలు ఇచ్చారని తెలుస్తున్నది. పురుషుడికి ఎక్కువ స్త్రీకి తక్కువ అని కాకుండా వారి అర్హతలను బట్టి జీతాలు ఇచ్చేవారని పిస్తుంది. కొప్పరం శాసనంలో గాయకి గౌరి అన్న స్త్రీకి 6 ఖండుకులు వ్రీహిఖ 4 గాయకుడు ఆదిత్యునికి ఖ 5 వ్రీహి ఖలి అనటం వల్ల గాయకికి ఎక్కువ భూమినినిచ్చారని తెలుస్తున్నది. పైన చెప్పిన పనుల వారే కాక రామయణ భారతాది పురాణకథలు చెప్పే స్త్రీలు కూడా దేవాలయాల నాశ్రయించుకుని ఉండేవారు. వీరు సత్యభలలోనూ, రాజసభలలోనూ పాల్గొనే వారని ప్రతాపరుద్ర చరిత్రలోని భరత కథల అంబాదేవి అన్న స్త్రీని పేర్కొనడం వల్ల తెలుస్తున్నది.
ఇటువంటి పనులే కాక దేవాలయానికి సంబంధించిన పొలం చూసుకునే సానికాంపులు, దానమిచ్చిన గోవులను కాచి దేవుని దీపారాధనకు నెయి పోసేవారిలోనూ స్త్రీలుండే వారని చెప్పవచ్చును.
క్రీ. శ. 1254 నాటి త్రిపురాంతకం శాసనంలో అఖండదీపానికి నామదేవుడు ఇచ్చిన 50 గోవులను తీసుకొని బాలసెట్టి బాలమ నిత్యమానెడు నేయి పోయాలని ఉన్నది. సాధారణంగా ఈ గోవులను కాపాడి, పెంచి నేయి సమర్పించే వారు బోయలనేవారు. కానీ ఈ శాసనాన్ని బట్టి స్త్రీలు కూడా ఇటువంటి విధులు నిర్వర్తించే వారని తెలుస్తుంది.
సానుల వృత్తులకు సంబంధించినవి, దానమీయబడ్డ క్షేత్రాలు సామాన్య నిబంధం వారి ఆధీనంలో ఉంచితే ఆ పొలాలను సాగుచేసి ఆ పంట దేవుని భోగానికి అందేలా చేయడం సానుల పనే. వీరినే సాని కాంపులంటారు. క్రీ.శ. 1102 నాటి బొబ్బిలి తాలూకాలోని నారాయణపురం శాసనంలో భూతన నాగవ అనే సానికాంపు స్త్రీ తన కొడుకు కొమ్మన పేరు మీద నీలీశ్వర దేవరకు అఖండవర్తి దీప మర్పించింది. సానులు గోవులను చూసుకొంటే వారిని సానికాంపులంటారు. క్రీ.శ. 1155 నాటి కాజశాసనంలో కాంజ నరీంద్రీశ్వర దేవరకు కులోత్తుంగ చోడగొంకరాజులు ముదిసెడ్లు దారప నాయకుడు జామెన పెగ్గడ అనే వారు కులోత్తుంగ చోడ గొంకరాజు ధర్మార్థం అఖండదీపానికై ఇచ్చిన ఐదు కులోత్తుంగ గద్యలు ఆ ఆలయంలోని పన్నెండుమంది సానికాంపులు తీసుకొని నిత్యం మానెడు నెయ్యి పోయాలి అని నిర్దేశించారు.
ఇతర వృత్తులు
దేవాలయాల నాశ్రయించుకొన్నవారు, మహరాజులు, మండలాధీశులు, రాజోద్యోగులు మొదలైన ధనిక వర్గం వారినాశ్రయించు కొన్నవారు, వేశ్యావృత్తిని స్వీకరించేవారు కాక తక్కిన స్త్రీలు తమతమ కులవృత్తులు చేసుకొనేవారు. ఇందులో బ్రాహ్మణ కులానికి చెందిన స్త్రీలు సంఘంలోని అన్ని దైవ ధర్మ కార్యాలలో ముందుండే వారు. శుభకార్యాలలో పాటలు పాడటం, సేసలు చల్లటం, నోములు వ్రతాలలో వాయినాలు స్వీకరించడం వంటివి చేసేవారు. ఇంటి గృహస్థు చేసే దైవ పితృకార్యాలలో సహకారాన్నందించేవారు. వీరికి ప్రత్యేకంగా రాబడి అని ఉండేది కాదు కానీ, వాయనాల రూపంలో కొద్దిగా కానుకలు అందుతుండేవి. వైశ్యస్త్రీలకు కూడా వేరే వృత్తి ఉండదు. కాంచన గుప్తుడనే వైశ్యుడు నూనెకు సరిపడే తైలమిచ్చిన వైశ్యబాలిక బుద్ధి విశేషాన్ని మెచ్చుకొని ఆమెను తన కోడలిగా చేసుకొన్నాడన్న మంచనకేయూర బహూ చరిత్రలోని ఉదంటాన్ని బట్టి 7°వైశ్య స్త్రీలు తమ బుద్ధి, చాతుర్యాలనుపయోగించి భర్తల వ్యాపారానికి తోడ్పడేవారని గ్రహించవచ్చు.
క్షత్రియ స్త్రీలు, రాజకుటుంబాల స్త్రీలు రాజనీతి, రాజ్యతంత్రము తెలిసిన వారై భర్తలకు, పుత్రులకు వెనుక నుండి అండదండల నందించేవారు. సలహాలిచ్చేవారు. మంత్రులుగా, సలహదారులుగా వ్యవహరించేవారు. శాసనాలలో మహ మండలేశ్వర వంటి బిరుదులున్న స్త్రీలు, నాయకురాలు, దండ నాయకురాలు వంటి పదవులున్న స్త్రీలు ప్రసక్తమైనారు.
పై మూడు వర్గాలు కాక తక్కిన కులాల స్త్రీలలో పుష్పలావికలు, సుగంధ తైలాలనమ్మె స్త్రీలు, స్త్రీలు ఉపయోగించే సౌందర్య సాధనాల సామగ్రి నమ్మే స్త్రీలు, సాముగరిడీ లేదా గడ మీద సాములు చేసే స్త్రీలు, తోలు బొమ్మల నాడించే స్త్రీలు, రామాయణ భారతాది కధలను చెప్పే స్త్రీలు ఉండేవారని ఆనాటి సాహిత్యం వల్ల తెలుస్తుంది.
వినుకొండ వల్లభరాయని క్రీడాభిరామంలో సంపెంగతైలాన్నమ్మే స్త్రీ గురించి ప్రస్తావన ఉన్నది. ఓరుగంటిలోని నాగరిక స్త్రీలకై ఆ వీధులలో దంతపు పెట్టెలో సుగరభేత్తు వంటి లేపనాలు అమ్మేవారని ఆకావ్యాన్ని బట్టి తెలుస్తుంది. పల్నాటి వీర చరిత్రలో గడమీద ఎక్కి ఆడే స్త్రీల గురించి తెలుస్తుంది. యుద్ధానికి బయల్దేరిన బాల చంద్రునితో తల్లి ఐతాంబ తాడెక్కు పురుషుడి తల్లికి, గడమీడ ఆడే కాంత తల్లికి, శూరుని తల్లికి సుఖం లేదు అన్నది. దాన్ని బట్టి ఆ స్త్రీలు సాహసంతో, ప్రాణాలకు తెగించి ధైర్యంగా ఆడేవారని తెలుస్తుంది.
మేదర స్త్రీలు:
వీళ్ళు వెదురు చీల్చి ఈనెలుతీసి బాగా నునుపు చేసి బుట్టలు, చేటలు, గంపలు, చాపలు వంటి గృహోపకరణాలు చేసి అమ్మి జీవనం సాగించేవారు. క్రీడాభిరామంలో మేదర వాడ అని ప్రత్యేకంగా మేదర వాళ్ళు నివసించే ప్రదేశం గురించి ప్రస్తావన ఉన్నది. అక్కడ మేదరకరణ వేశ్య గురించి ఉన్నది. బహుశా వేశ్యావృత్తి లాభసాటిగా ఉండటం వల్ల తన కులవృత్తులతో పాటు వేశ్యావృత్తి కూడా చేపట్టి వుంటుంది.
పుష్పలావికలు:
స్త్రీలు సహజంగా సుకుమారమైన పనులు, నైపుణ్యంతో చేస్తారు. పూలతో చిత్రవిచిత్రమైన దండలు అల్లి అమ్మటం వీరి ప్రత్యేకత. వీరి ప్రస్తావన క్రీడాభిరామంలోనూ, కుమార సంభవం లోనూ వస్తుంది.
వీరు దండలల్లడమే కాక ఆయా ఋతువులకు సంబంధించిన సుగంధ భరితమైన పువ్వులను ఇంటికీ వెళ్లి అందజేసేవారు. వీరిని గట్టివాలు అని కూడా వ్యవహరిస్తారు. సాహిత్యంలో వీరి వర్ణన చాలా కావ్యాలలో ఉంటుంది. దేవాలయాలలో కూడా మాలకరులుగా వీరు మాలలల్లేవారు. అందుకు మాన్యాలు ఇవ్వబడినట్లు శాసనమున్నది.
తెలిక జాతి స్త్రీలు:
ఈ కులానికి సంబంధించిన స్త్రీలు గానుగ నుండి నూనె తీసేవారు. గ్రానుగెద్దును నడపుతూ, గానుగ పట్టిపై తామూ తిరుగుతారు. అంతే కాక పరిమళభరితమైన పుష్పాలతో చందనం వంటి సుగంధ ద్రవ్యాలతో కూడిన తైలాలను తయారుచేసి అమ్మేవారు. క్రీడాభిరామంలో ఒక కాంత కనుమయవ్వలి, దేశంబు కరణకాంత సంపెంగ నూనె నమ్మినట్లు ఉన్నది. ఆనాటి స్త్రీ సౌందర్యపోషణలోనూ, చర్మ సౌందర్యపోషణలోనూ సంపంగి, చందన తైలాల వాడకం ఎక్కువగా ఉండేది కనుక వీరి ఆదాయం కూడా బాగా ఉండేదని చెప్పవచ్చును. కనుమ అవతల నున్న ప్రదేశం నుంచి వచ్చి ఓరుగల్లులో సంపెంగ నూనె అమ్మడానికి వచ్చినదనటం వల్ల ఆ కాలంలో కూడా స్త్రీలు స్వేచ్ఛగా తమ వ్యాపారం కోసం దూరప్రాంతాలకు వెళ్ళేవారని తెలుస్తుంది.
పూట కూళ్ళ వృత్తి:
ఈ వృత్తి చేసుకొనే స్త్రీలు ఉండే ప్రదేశాన్ని అక్కల వాడ బాడబుల వాడ అని అంటారని క్రీడాభిరామాన్ని బట్టి తెలుస్తుంది. ఓరుగల్లు నగరానికి వచ్చే పరప్రాంతం వాళ్ళకి ఈ రోజుల్లో లాగా హోటల్ సౌకర్యాలుండేవి కావు. డబ్బు తీసుకొని భోజనం వండి వడ్డించే వారిని అక్కలు అనేవారు. క్రీడాభిరామాన్ని బట్టి ఒక రూపాయికి కప్పుర భోగి బియ్యంతో వండిన అన్నం, గోధుమ పిండి వంట, గుప్పెడు పంచదార, కొత్తగాకాచిన ఆవునెయ్యి, పెసరపప్పు, అరటిపండ్లు, నాలుగు అయిదు కూరలుపచ్చళ్ళు వంటి నంజుళ్ళు, లప్పలు, కొత్త పెరుగు లభించేవి.
ఈ వంటలన్ని బ్రాహ్మణస్త్రీలే చేసేవారు. శైవ మతానికి సంబంధించిన దేవాలయాలలో సత్రాలలో బ్రాహ్మణస్త్రీలే వంట చేసేవారు. భక్తులు తీర్ధయాత్రాస్థలాలలో దేవాలయాలకు సంబంధించిన సత్రాలలోనే భోజనం చేసేవారు. కాని ఓరుగల్లు వంటి నగరానికి వచ్చేవారు బహుశా భోజన వసతికి పూటకూళ్ళ పైన ఆధారపడేవారేమో? సహగమనం బ్రాహ్మణ విధవలకు విజానేశ్వరుడు నిషేధించడం వల్లను, ఎక్కువ మందికి వేరే జీవనాధారం లేక పోవడం వల్లను వారు పూటకూళ్ళు నడిపేవారు.
రాజాస్థానాలలో స్త్రీలు:
చామర గ్రాహిణులు:
వాలు కన్నుల వనితల క్రీగంటి చూపులు ప్రభువును తాకకుండా మధ్యలో ఎడతెగక చామరాలాడించి వారించేవారిలాగా, కంకణాల నిస్వనంతో, చెరగని చిరునవ్వుతో చామర గ్రాహిణులు రాజుకు వెనుక ఇరువైపులా ఉండాలి.
విలాసినులు:
నమ్మిక మాటలాడే నేర్పరులు, మేలపు మాటలు మాట్లాడడం తెలిసినవారు (చతురికలు) రాజుకు ప్రీతిపాత్రమైనవారు, అలంకారాలకే అలంకారమైన అవయవాలు కలిగినవారు, కామింపతగినవారు, కామకళలో జాణలు, యౌవనంతో ఉన్నవారు, నృత్తగీత వాద్యాలు తెలిసినవారు, చక్కని వేషంగలవారు, శుభలక్షణ వతులు అయిన విలాసినులు సభాపతికి ఎడమపక్క వెనుక ఉండాలని జాయప తన గ్రంధమైన నృత్తరత్నావళిలో తెలిపాడు.
అడప:
తాంబూల సామగ్రి ఉన్న పెట్టెను పట్టుకొనే స్త్రీని అడప అంటారు. ఆమెకి ఎటువంటి లక్షణాలు ఉండాలో జాయప నృత్తరత్నావళిలో తెలిపాడు.
శుచి క్షేత్రా(చ) విశ్వాస భాజనం రూపశాలినీ
సువేష మధురాలాపా కలావిత్ ప్రౌఢయౌవనా
సావధానేంగితాభిజ్ఞా నృపవంశక్రమాగతా
మంజూషాం దధతీ హైమీం నానారత్న విభూషితామ్
భూపాలోచిత తాంబూల సామగ్రీ పరిపూరితామ్
ఆసీత దక్షిణే పార్శ్వే రాజ్ఞస్తాంబూలదాయినీ
పరిశుద్ధ జన్మంగల, విశ్వాసపాత్రమైన రూపవతి, చక్కని వేషంగలది, తియ్యగా మాట్లాడేది, కళలెరిగినది, నిండు జవ్వని, రాజవంశ క్రమంగా వచ్చినది, ప్రభువు ఇంగిత మెరిగినది, సావధానత కలది అయిన స్త్రీ రాజులకు తగిన తాంబూల సామగ్రి ఉన్న రత్నాలతో చెక్కబడిన బంగారు అడపాన్ని పట్టుకొని రాజుకు కుడిపక్క కూర్చోవాలి. క్రీ.శ. 1252 నాటి దాక్షారామ శాసనంలో మత్స్యకుల తిలకుడైన ఒడ్డాదిరాజు అర్జునదేవుని దేవి కొండికమున్నూటి అడప అక్కాసాని ప్రస్తావన ఉన్నది. ఆమె ప్రేకేటి వీరపనాయకుని కుమార్తె అని చెప్పబడింది. బహుశా ఆమె పైన చెప్పిన లక్షణాలున్న అడప అయివుండి మొదటి దేవాలయంలోను, తరువాత అర్జునదేవుని కొలువులో ఉండి అతనికి సన్నిహితురాలై ఉండి ఉంటుందని భావించవచ్చును.
ఆటపాటల వృత్తులు:
కొంతమంది తక్కువ కులంవారు మాల, మాదిగ, దొమ్మర, గొరగ జాతివారు, గొండ్లి (గోండులు), పిచ్చుకుంట్లు మొదలైనవారు ఆటపాటల మీద ఆధారపడి పర్వాలలో, ఉత్సవాలలో, తీర్థయాత్రలలో తమ ఆటపాటలను ప్రదర్శించి ప్రజలను మెప్పించి తమ జీవికను గడుపుకొనేవారు. వీరి ఆటపాటలే దేశి నృత్తరీతులుగా రూపొంది కాకతీయుల కాలంలో రాజుల నుండి సామాన్యుల వరకు అందరి ఆదరణను పొంది జాయపసేనాని, శ్రీనాధుడు వంటి కవుల కావ్యాలలో స్థానం సంపాదించాయి.
పైవారు చేసే ఆటపాటలు జాయప సేనాని తన నృత్తరత్నావళిలో ఈ క్రింది పేర్లతో దేశి నృత్త రీతులుగా పేర్కొన్నారు.
ఘటిసణి నృత్తం:
మాలజాతి నర్తకి మూపుమీద చెలికత్తెలాగా హుడుక్కా వాద్యాన్ని పెట్టుకొని వాయిస్తూ, పాటపాడే స్త్రీ పురుషులతో కలిసి చర్యాప్రబంధం మొదలైన గీతాలకు నర్తించేది.
అంత్య ప్రాసలుండి అధ్యాత్మ విషయం కలిగి, యోగులు పాడే రచన చర్యా ప్రబంధం. అంటే పైన చెప్పిన నర్తకులు ఘటిసణి అధ్యాత్మ విద్యలో కూడా ప్రవేశం ఉన్నవారేనని, తరువాతి కాలాలలో వలె నీచంగా చూడబడక సంఘంలో ఉచితస్థానం పొందినవారని చెప్పవచ్చును.
కొల్లాట నృత్యం:
దొమ్మరి (కొల్లాటవారు) వారు అంచితం మొదలైన కరణాలతో వింతవింతగా తోలు పగ్గాలపైన నడుస్తూ పొడవైన వెదురుగడ పైన చాలా దుష్కరమైన భ్రమరులు చేస్తూ అతి బరువైన వస్తువులను మృదువైన అంగముల మీద పెట్టుకొని ఎత్తుగా ఎగురుతూ కత్తులు మొదలైనవి తిప్పుతూ తప్పించుకొంటూ నర్తించేవారికి దీని కొల్లాటమని నర్తించేవారి జాతిపేరే ఈ నృత్తానికి కలిగింది. వీరు చేసే ఆటపాటలను దొమ్మరాట అని కూడ అంటారు. ఇది సాహసం, నేర్పుతో కూడిన ఆట. దొమ్మర స్త్రీలు గడనెక్కి రకరకాలుగా తమ విద్యలను ప్రదర్శించి ప్రజల మెప్పుపొందేవారు. దొమ్మరి స్త్రీలు చేసే ప్రదర్శనలలో ప్రమాదాలు లేకపోలేదు.
దొమ్మర స్త్రీలు:
గడమీద నాడెడు కాంత తల్లికిని
శూరుని తల్లికి సుఖమేమిలేదు.
గడమీద రకరకాలుగా సాహసంగా ప్రదర్శనలు చేసే స్త్రీ తల్లికి, శూరుని తల్లికి మనశ్శాంతి కరువని బాలచంద్రుని తల్లి ఐతాంబ మాటల వల్ల వ్యక్తమౌతుంది.
దొమ్మర వారికి డోంబలనే పేరు కూడా ఉన్నది. ప్రాచీన కాలం నుంచి వీరికి నాట్య నృత్యగానాలు వృత్తిగా ఉండేవి. కన్నడంలో వీరికి కొల్లటిగ అనే మారు పేరున్నదని జాయప నృత్తరత్నావళిని అనువదించిన శ్రీ రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మగారు తెలిపారు.
సానుల మాన్యాలు:
వారసత్వం దేవాలయాలలో రకరకాల వృత్తులు చేసే సానుల కుటుంబాలకు మాన్యాలు వంశపారంపర్యంగా ఇవ్వబడతాయి. అయితే మాన్యాలు పొందిన వ్యక్తులు తమ తల్లిదండ్రులకు సంబంధించిన ఆలయాలలోనే సేవ చెయ్యవలసి ఉంటుంది. వృత్తులు లేదా పదవులు ఎవరినుండి సంక్రమించాయో వారి పేరు ముందు చెప్పి తమ పేరు చెప్పుకొనే వారు. ఉదాహరణకు తాత నుండి వృత్తి వారసత్వంగా పొందితే తాత పేరు చెప్పి తమ పేరు చెప్పుకొనేవారు. తండ్రి నుండి సంక్రమిస్తే తండ్రి పేరు, తల్లి నుండి సంక్రమిస్తే తల్లి పేరు చెప్పుకొనేవారు. ఆనాడు కేవలం జన్మకారణంగా తండ్రి పేరు వంశం పేరు వ్యక్తి నామధేయానికి ముందు ఉండేది కాదు. మనుగడను బట్టి గుర్తింపు కోసం నిజనామధేయానికి ముందు తల్లిదండ్రుల పేర్లు లేక గ్రామాల పేర్లు వచ్చేవి. అదే విధంగా సానులు కూడా తమ వృత్తులు ఎవరినుండి సంక్రమిస్తే వారిపేరే ముందు చెప్పుకొనే వారు. వారీకులం వారని, వారికి ఈ యింటిపేరే ఉండాలని గానీ ఆచారంగా ఉండేది కాదు.
ఉదాహరణకు క్రీ.శ. 1135 నాటి సాతులోరు రామేశ్వరాలయంలోని శాసనంలో పేర్కొనబడిన స్థానపతుల మల్లిక, మసనాసాని విఱియక, బ్రహ్మసాని సూరక, బొల్లసాని కొమ్మ, ఎఱియసాని కొమ్మ అనే వారిలో స్థానపతి కూతురు మల్లిక అనీ, మిగిలినవారు మసనాసాని, బ్రహ్మసాని, బొల్లసాని, ఎఱియసాని అనేవారి సంతానంగా మనం గ్రహించవచ్చును.
క్రీ.శ. 1139 నాదిండ్లలోని వేములమ్మ గుడిముందరి శాసనంలో బసవిసెట్టి బోచక, వైద నూంకె మారక, బోయు బుద్ధన సూరక, మాదిరాజు మారక, గోకన దారక అనే సానుల పేర్లను బట్టి వారి వృత్తులు తండ్రుల నుండి సంక్రమించాయని చెప్పవచ్చును. ఆ సానుల తండ్రులు ఆ ఆలయంలో ముందు రంగభోగాల వారిలో ఉండి వృత్తులు గ్రహించి ఉంటారు. వైదనూంకె అన్నవాడు వైద్యం చేసే వృత్తివాడై ఉంటాడు. తల్లిదండ్రుల వృత్తులను సక్రమంగా నిర్వహించినవారికే ఆ వృత్తులు మాన్యాలు సంక్రమించేవి. ఎవరివల్ల వారికా మాన్యాలు వచ్చాయో వారి నామధేయానికి ముందు చెప్పుకొన్న పేరును బట్టి గ్రహించవచ్చును. వీరిలో కొందరు తాతలు సమర్పించగా సానులైన వారున్నారు. దేవాలయ వృత్తులు నిర్వహించేవారి పుత్రులు సైన్యాధికారులుగానో, ఉద్యోగులు గానో అయి వెళ్ళిపోతే తమ మాన్యాలను పోగొట్టుకోవడం ఇష్టంలేని వారు తమ మనమరాళ్ళను దేవాలయ సేవకు అర్పించి సానులుగా చేసి మాన్యాలు వారికి చెందేటట్లుగా ఏర్పాటు చేసి ఉంటారు. కనుకనే కొందరు సానులకు వారి తాతల పేర్లు వారి అసలు నామధేయాలకు ముందుండేవి. ఉదాహరణకు పైనచెప్పిన నాదిండ్ల శాసనం లోనే దాడపోజు మన్మరాలు ముప్పై, కొట్యము నాయకు మన్మఱాలు నాగ, పెద్దన బోయని మన్మఱాలు అయితక, మేలు నాయక మన్మఱాలు చెన్నక అనే సానులున్నారు. వీరు బహుశా తాతల వృత్తులు గ్రహించి ఉంటారు. అప్పుడప్పుడు తాత లేదా అవ్వ పేరు, తరువాత తండ్రి పేరు ఆ తరువాత వ్యక్తినామం ఉండటం కనిపిస్తుంది క్రీ.శ. 1161 నాటి చిఱుమామిళ్ళ శాసనంలోని సానుల లోని ఒక స్త్రీ పేరు అన్నమెయెఱియన చిమ్మక. అన్న లేదా అన్నమ కొడుకు యెఱియన, అతని కూతురు చిమ్మక అని పేరును బట్టి తెలుస్తున్నది. క్రీ.శ. 1074 నాటి ఒక శాసనంలో చోడనారాయణ దేవరసాని నూంకమతో పాటు దనదవ్రోలి పడ్యబోయిని వెనమ కొడ్కు గోకరాజు అన్న వ్యక్తి కూడా అఖండ దీపానికై బిరుదు గద్యలను సమర్పించాడు. ఈతని పేరులో పడ్య బోయడన్న తాత పేరు, అతని కూతురు గోకరాజు తల్లి అయిన వైనమ పేరు ముందు చెప్పిన తరువాతనే గోకరాజు పేరు చెప్పబడింది. అలాగే మల్లీశ్వర దేవాలయశాసనంలో కామసాని మారెబోని కొడ్కు వీరమర అని ఉన్నది. ఇందులో అవ్వ కామసాని తండ్రి మారెబోయని తరువాత వీరమర అన్నతని పేరున్నది.
ఈ పేర్లను బట్టి మూడు తరాలుగా ఆ వ్యక్తులు దేవాలయాన్ని సేవిస్తున్నారనీ, వంశపారంపర్యంగా అంటే కొడుకు తర్వాత కొడుకు కాక కూతురుకు కూడా దేవాలయ వృత్తులు సంక్రమించేవి అనీ, అయితే దేవాలయ సేవచేసే వారికి మాత్రమే ఈ మాన్యాలు చెంది ఉంటాయనీ భావించవచ్చును.
ఈ వృత్తులు స్వీకరించి వంశపారంపర్యంగా మాన్యాలు పొంది వారి వంశం నిలబెట్టిన స్త్రీలను శాసనాలలో సుపుత్రి, కులదీపకురాలు అని సంబోధించడం శాసనాలలో చూడవచ్చును.
దన్నవాడ అమరీశ్వర స్థానము వ్రిత్తిమంతుడైన కడియమనాహినికి దాయమసానికి సుపుత్రుడు ఎఱ్ఱమనాహిని వేల్పూరి వ్రిత్తిమంతులైన కూచెమ నాహినికి బసెట్టికి సుపుత్రి అమరసాని, ఎఱ్ఱమ నాహినికి అమరసానికి సుపుత్రి కులదీపకురాలు లోకసాని అని క్రీ.శ. 1248 నాటి వేల్పూరి శాసనంలో చెప్పబడింది. ఈ శాసనం వేయించినవాడు లోకసానికి, మహాదేవనికి సుపుత్రుడైన సూరపనాహిని అన్నవాడు తన తల్లి లోకసానికి కులదీపకురాలు అన్న విశేషణం వాడాడు. పైవారి వృత్తులను వంశపారంపర్యంగా తల్లి లోకసాని ద్వారా తనకు చెందటంవల్ల పై విధంగా మన్నించి ఉంటాడు. తన తండ్రి పేరుకు ముందు సుపుత్రుడు అన్న విశేషణం వాడలేదు. దీన్ని బట్టి కేవలం విత్తిమంతులైన వారికే ఈ మన్నన దక్కిందని గ్రహించవచ్చును.
తరువాత కాలంలో కొన్ని కుటుంబాలలో సానుల కొడుకులు మాన్యాలు సంపాదించాక తమ కొడుకులకు, మనుమలకే మాన్యాలు వచ్చేటట్లు చూసి ఉంటారు. ఇక వారి ఇంటి ఆడపిల్ల దేవాలయమాన్యాలు పొందక ఏ ధనవంతునకో భోగస్త్రీ అయి ఉంటుంది. క్రీ.శ. 1222 నాటి విజయవాడ మల్లీశ్వర దేవర శాసనంలో మాన్యాలు ఎవరి తరువాత ఎవరికి సంక్రమించాయో తెలిపే విధంగా ఉన్నది. పల్లప కొమ్మన బోని కొడ్కు పారె బోయుండు పారెబోని కొడ్కు నూకి బోయుండు తమ తల్లిదండ్రులకు ధర్మార్థంగా అరదీపమునకు బెట్టిన మోదాలు 13 సూరె బోయుండును తన పుత్రాను పౌత్రికము ఆ చంద్రార్కము నిత్యతరెండు సెయి పోయంగలవాడు. ఈ శాసనంలో చెప్పబడిన పల్లప కొమ్మన బోయండనే పేరులో పల్లపు స్త్రీ పేరు. ఆమె నుండి వృత్తి సంక్రమించింది కనుక కొమ్మనబోయుడు పల్లపకొమ్మన బోయుడని వ్యవహరింపబడినాడు. అతని కొడుకు పారెబోయుండు పారె బోనికొడుకు నూకి బోయుడు అని కొడుకు నుండి మనుమనికి, మనుమడినుండి మునిమనుమడికి వారసత్వపు హక్కు వచ్చిందే కానీ మళ్ళీ స్త్రీ పేరులేదు. శాసనకాలానికి మూడు తరాలనుండే కొడుకులకు సంక్రమించడం ప్రారంభమైందని అనుకోవచ్చు. సాని వృత్తులు కూడా తరువాత కొడుకులకే వచ్చాయని క్రీ.శ. 1317 నాటి పెద్ద కొండూరు శాసనం వల్ల తెలుస్తున్నది. “యి విత్తి సానికొడుకులు అనుభవించ్చువారు”. స్త్రీలకు ప్రాముఖ్యమిచ్చి, వారు రాజకీయంగా, మత పరంగా ఉన్నతంగా ఉన్నపుడు కులస్త్రీలకు దేవాలయ సానులకు, భోగస్త్రీలకు, వేశ్యలకు సమానంగానే సంఘంలో గౌరవం ఇచ్చారు. క్రమంగా మతము, రాజకీయాలు స్త్రీని చిన్నచూపు చూడటం వల్ల, ఆస్తి హక్కు పోగొట్టుకొని, విద్యార్హత పోగొట్టుకొని, పరాధీనగా పరతంత్రగా ధర్మశాస్త్రాల చేత నిర్దేశింపబడడంతో అన్ని వర్గాల స్త్రీలు సంఘంలో దిగజారి పోయారు. పందొమ్మిదవ శతాబ్దం నాటికి బాల్యవివాహాలు, కన్యాశుల్కాలు, సతీసహగమనాలు ఎక్కువైనాయి. కొందరు స్త్రీలు బాల్యంలోనే వితంతువులై కుటుంబంలోని వారందరికీ జీతం బత్తెంలేని దాసీలుగా ఉంటే మరి కొందరు జోగినులై ఊరివారందరి కామానికి బలి అవుతూ కొందరు బలవంతంగా వేశ్యా గృహాలకు అమ్మబడి వేశ్యలుగా మారి రకరకాల బలహీనతలకు, జబ్బులకు లోనైనారు. కొందరు కులస్త్రీలు భార్యలుగా, కోడళ్ళుగా భర్తల, అత్తమామల ఆరళ్ళకు గురియై జీవచ్ఛవాలుగా మారితే కన్యలు వరకట్నాల బాధతో అవివాహితలుగా ఉండి నిరంతరం ఆత్మరక్షణ కోసం తపిస్తూ ఉన్నారు. ఈ విధంగా సంఘంలో అన్ని వర్గాల స్త్రీలు వయసు తేడా లేకుండా బాధలననుభవిస్తూ ఇరవైయవ శతాబ్దం నాటికి ఆడదై పుట్టేకంటే అడవిలో మానై పుట్టడం మేలు అనే దశకు దిగజారింది.
(సశేషం)