‘కాకతీయ యుగంలో స్త్రీల సామాజిక స్థితిగతులు – ఒక పరిశీలన’ -26

0
2

[డా. మంత్రవాది గీతా గాయత్రి గారు 1995లో పిహెచ్‍డి పట్టా కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖకి సమర్పించిన సిద్ధాంత వ్యాసాన్ని సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము.]

ప్రకరణం 9. స్త్రీలు – వేషభూషాదులు – మొదటి భాగం

స్త్రీల ఆభరణాలు

[dropcap]కా[/dropcap]కతీయుల కాలంలో స్త్రీలు ఆపాదమస్తకం నగలు ధరించేవారు. వారు తమ ఆర్థిక స్తోమతను బట్టి, కులాచారాన్ని బట్టి, అంతస్తును బట్టి రకరకాలైన లోహాలతో, రత్నాలు, గాజుపూసలు, గవ్వలతో, పటిక పూసలతో చేసిన నగలను ధరించేవారు. సాధారణంగా పైవర్గపు, నాగరికులైన స్త్రీలందరూ బంగారుతో, రత్నాలు, ముత్యాలతో చేసిన నగలను ధరించేవారు. ఆటవిక స్త్రీలు, యోగినులు, ఎఱుక, చెంచు స్త్రీలు ఇత్తడి, ఇనుము మొదలైన లోహాలతో, సంకుపూసలు, స్ఫటికాలతో, రుద్రాక్ష పూసలతో చేసిన ఆభరణాలను ధరించేవారు. ఉపయోగించే లోహమేదైనా శిరసు మొదలు పాదాల వరకు అన్నిరకాల నగలు ధరించటం ఆనాడు ఎక్కువగా ఉండేది. రాజకీయంగా సుస్థిరంగా ఉండటం, ఇతర రాజ్యాలపై దండెత్తి తెచ్చుకొన్న ధనం ఉండటం, దేశం పాడిపంటలతో సుభిక్షంగా ఉండటం, ప్రజలు భోగలాలసులు కావడం ఆ కాలం వారి అలంకార ప్రియత్వానికి కారణాలు కావచ్చును. ఆనాటి సాహిత్యంలో ఆ కాలంలోని స్త్రీలు ధరించే నగల ప్రస్తావన ఉన్నది. కేతన రచించిన దశకుమార చరిత్రలో సాధారణంగా ఆనాటి స్త్రీలు ఆపాదమస్తకం ధరించే నగల జాబితా ఒకటి ఉన్నది.

సీ.

మట్టియలుజ్జ్వల మణినూపురంబులు మొలనూలు వస్త్రముల్ ముత్తియములు

కట్టువడంబులు గట్టినూళ్ళును సుద్దసరితీగె మినుకులు సందిదండ

లంగుళీయకములు హారికంకణములు, చేకట్టు పావెలు చెన్నుమెఱుగు

టాకులు సరిపెణలాలక్తకము పూత కాటుక తిలకంబు కమ్మపువ్వు

తే.గీ.

లాదిగాగల మేలిద్రవ్యములనొప్ప, బసదనము జేసియుచిత రూపంబు దాల్చి

బాలచంద్రిక బోటినై పజ్జనరిగి, దారువర్మునిలో గిలి దఱియ జొచ్చి’

రంగనాథ రామాయణంలో సీతారాముల కళ్యాణ సందర్భంగా పెళ్ళికూతుళ్ళను అలంకరించిన ఘట్టంలో వారికి తొడిగిన నగల గూర్చి వివరంగా ఉన్నది.

పల్నాటి వీరచరిత్రలో సిరాదేవి, మాంచాలలకు వివాహాది శుభసందర్భాలలో అలంకరించిన నగల వర్ణన ఉన్నది. పండితారాధ్య చరిత్రలో జోగినులు, పుణ్యాంగనలు, ఆటవిక స్త్రీలు ధరించే నగల గూర్చి చెప్పబడింది. కుమారసంభవంలో పార్వతీ వివాహ సందర్భంలో ఆమెకు అలంకరించిన నగలు, చెంచు, శబర వనితలు ధరించే నగల వర్ణన ఉన్నది. ఈ విధంగా మనకు ఆనాటి సాహిత్యాన్ని బట్టి ఆనాటి స్త్రీలు ధరించే రకరకాలైన నగల గూర్చి తెలుసుకొనే అవకాశమున్నది.

ఆపాదమస్తకం ధరించే ఆభరణాలు:

కాళ్ళకు ధరించే ఆభరణాలు:

మట్టెలు:

కాకతీయుల కాలంలో మట్టెలు కాలివేళ్ళకు అలంకారంగా ఎక్కువగా వాడేవారు. ఈ రోజుల్లో వివాహితలైన స్త్రీలు మట్టెలు ధరిస్తున్నారు. కానీ కాకతీయుల కాలంలో ప్రజలు ఎక్కువగా అభిమానించినవి మట్టెలేనని చెప్పాలి. ఈ మట్టెలను వివాహిత స్త్రీలే ధరిస్తారని అందరూ ఆభిప్రాయపడతారు. కానీ కాకతీయుల కాలంలో కన్యలు ముఖ్యంగా వివాహానికి ముందు చేసుకొనే అలంకరణలో ఒక భాగంగా భావించేవారు. పల్నాటి వీరచరిత్రలో పెదమలిదేవుని వివాహమపుడు పెళ్ళికూతురు సిరాదేవికి అలంకరణ చేసినపుడు ఆమెకు గిల్కుసరి మట్టెలు తొడిగారు. ఈ మట్టెలు బొటనవేలి ప్రక్కవేలుకు పెట్టుకొనేవారు. పాదం అయిదు వేళ్ళకూ మట్టెలవంటివి ఉండేవి. వాటికి వేరువేరు పేర్లుండేవి. వీరముద్దియలు (సంస్కృతంలో వీరముద్రికా అని) మట్టెలు, బిచ్చిలికాయలు, పిల్లాండ్లు, చిటిబొద్దులు అనేవి. ఇవి రకరకాల లోహాలతో తయారుచేసేవారు. క్షత్రియ స్త్రీలు బంగారంతో చేసినవి ధరించేవారు. ఈ ఆచారం ఇప్పుడు కూడా రాజుల్లో ఉన్నది. తక్కిన స్త్రీలు, నాగరిక స్త్రీలు వెండివి, ఆటవిక స్త్రీలు తగరం వంటి లోహాలతో చేసిన మట్టెలు ధరించేవారు. మట్టెలు స్త్రీలే కాక పురుషులు కూడా ధరించేవారు. విరాటపర్వంలో కీచకుడు మెల్లగా మట్టియల చప్పుడు కాకుండా నడిచాడని ఉన్నది.

“మట్టియలొండొంటి బిట్టు దాకగ నేలనందంద మునిగాళ్ళ నప్పశించు”

దాన్నిబట్టి పురుషులు కూడా మట్టెలు ధరించేవారన్నది స్పష్టం.

వీరముద్దియలు లేక వీరమద్దియలు మొదటి అంటే బొటనవ్రేలుకు ధరించే అభరణాలు, మట్టెలు, రెండవ వేలుకు బిబ్బిలికాయలు మూడవ వేలుకు, పిల్లాండ్లు నాల్గవ వేలుకు, చిటిబొద్దులు అయిదవవేలుకు ధరించవలసిన ఆభరణాలు. అయితే ఈ మట్టెలు బొటన వ్రేలి ప్రక్కవేలుకు కాక నడిమి వేలికి వేసుకొనే ఆచారం తెలంగాణాలో ఉన్నది. రెండవవేలికి తొడిగే వాటిని ఉంగరాలు అంటారు. ఇవి ఆకారంలో పెద్దవి. మట్టెలు ఆకారంలో చిన్నవి. ఉంగరాలకే మట్టెలనే వ్యవహారం కూడా ఉన్నది. మట్టెలను వివాహకాలంలో మంగళసూత్రంతో పాటుగా ధరింపచేస్తారు. ఉంగరాలు తరువాత చేయిస్తారు. ఇది తెలంగాణాలో ఈనాడు వున్న ఆచారం. మాంచాల, సిరాదేవి అలంకరణలోనూ కేతన దశకుమార చరిత్రలోని (బాలచంద్రిక వేషంలో ఉన్న వ్యక్తి) స్త్రీ అలంకరణలోనూ మట్టియలు ధరించడం మనకి కనిపిస్తుంది. దాన్ని బట్టి వివాహితులే కాక కన్యలు కూడా మట్టెలు పాదాభరణాలుగా ధరించేవారు అని తెలుస్తుంది. విలాసినులు కూడా మట్టెలు ధరించేవారని విరాటపర్వంలోని ‘లలితంబులగు మట్టియల చప్పుడింపార’ అన్న పద్యాన్ని బట్టి తెలుస్తుంది.

కాలి ఆభరణ విశేషాలు:

పాదాలకు అందెలు గొలుసులు, గజ్జెలు ధరించేవారు. (మాంచాల ధరించినవి) గోమేధికాలు పొదిగిన అందియలు కూడా ఉండేవని రంగనాథ రామాయణంలో సీత నగల వర్ణనని బట్టి తెలుస్తున్నది. ‘మణినూపురంబులు’, అంటే మణులతో చెక్కిన నూపురాలు ధరించేవారని కేతన దశకుమార చరిత్రను బట్టి చెప్పవచ్చును.

నడుముకు పెట్టుకొనే ఆభరణాలు:

నడుముకు ఈనాటివారు పెట్టుకొనే ఒడ్డాణం ఆనాడు కూడా ధరించేవారు. ఈ ఒడ్డాణమునకు మేఖల అని మరో పేరు. దీన్ని రత్నాలతో పొదిగి కూడా చేసేవారు. పార్వతికి చెలికత్తెలు వివాహ సమయంలో రత్నమేఖలను ధరింపజేశారు. “గటినూత్న రత్న మేఖల యొనర్చి”.

మొలనూలు:

కటి ప్రదేశంలో ధరించే మరొక ఆభరణం మొలనూలు. ఇది బహుశా పురుషులు ధరించే మొలత్రాడు వంటిది. అయితే ఇది ఒడ్డాణం వలె నడుముకు అంటిపెట్టుకొని ఉండదు. బహుశా చీరకుచ్చెళ్ళను అదిమి ఉంచడానికి మొలనూలును వాడేవారు. ముత్యాలు, రత్నాలు వంటివాటితో కూర్చి మొలనూలు తయారుచేసేవారు. వేయిస్తంభాల గుడి, రామప్ప ఆలయ శిల్పాలలో స్త్రీలు రకరకాల మొలనూళ్ళను ధరించడం చూడవచ్చును. రంగనాథ రామాయణంలో సీత “పద్మరాగాలు కూర్చిన మొలనూలు” ధరించింది. చిరుగంటలు కూర్చిన మొలనూళ్ళు కూడా ఆనాటి స్త్రీలు ధరించేవారు. పలనాటి వీరచరిత్రలో అటువంటి గంటల మొలనూలు పెళ్ళికూతురుగా అలంకరించే సమయంలో సిరాదేవికి చెలికత్తెలు ధరింపజేశారు.

గంటల మొలనూలు గజ్జెలందియలు

జంటమ్రోగెడు గిల్కు సరి మట్టియలును

“శృంగారమొనరించి శ్రీసిరాదేవి

దోడితెచ్చిరి చెలుల్ తో రంపు బ్రీతి”

మాంచాలకు

“కటియందు సంధించి గంటలు మ్రోయు

తపనీయ కాంచియు దట్టించి ముడిచి”

ఈ గంటలు కూర్చిన మొలనూలు పురుషులు కూడా ధరించేవారు. రంగనాథ రామాయణంలో జనకుని సభలో ప్రవేశించి శివధనుర్భంగం చేసి సమయంలో శ్రీరాముడు ధరించిన ఆభరణాలలో మొలనూలి గంటలు అంటే గంటలు కూర్చిన మొలనూలు ఒకటి.

“అసమ సాహసుడు,

మొలనూలి గంటలు మురవుమించగను,

మలగ్రుచు నవరత్నమాలికల్పోరల

బాహుపుర్ణుంగ రాల్పటు కంకణములు”

రొమ్ముపై ధరించే ఆభరణాలు:

కాకతీయుల కాలంలో స్త్రీలు రొమ్ముపై ధరించే ఆభరణాలలో ముఖ్యమైనవి హారాలు, ముత్యాలు, రత్నాలు, పగడాలు, కెంపులు మొదలైన వాటిని గుచ్చి హారాలుగా ధరించేవారు.

ఈ హారాలు మూడు పేటలవి ఉండేవి. బన్నసరాలు అనేవి అయిదు వరసలవి అనుకోవచ్చు. ఇవి ఎక్కువగా ధనవతులైన స్త్రీలు ధరించేవారు. ఈ బన్నసరాలు ముత్యాలు, రత్నాలు, గోమేధికాలు, మాణిక్యాలు, పచ్చలు, పగడాలు మొదలైనవానితో హారాలుగా గుచ్చి వేసుకునేవారు. రంగనాథ రామాయణంలో సీతకు పచ్చలతో గుచ్చిన బన్నసరములు అలంకరించారు. పలనాటి చరిత్రలో మాంచాలను పగడాల బన్నసరాలతో అలంకరించారు.

ఈ బన్నసరమనే పదం పఞ్చసరమ్ అనే సంస్కృత పదానికి వికృతి అని సూర్యరాయాంధ్ర నిఘంటువు సూచించింది. అయితే నిఘంటువులో పలువిధములైన మణులు గ్రుచ్చిన హారము అనే అర్థం ఇవ్వబడింది. ఈ అయిదువరసలు, మూడు వరుసలలో ముత్యాలు హారాలుగా గుచ్చి ధరించడం ఈనాడు కూడా ఉన్నది. కానీ మణులను గ్రుచ్చి చేసిన అయిదు వరుసల హారాలు మాత్రం ఈనాడు అరుదు.

బవిరె గొలుసు:

బవిర అంటే వర్తులాకారం గల నగ అని శబ్దరత్నాకరం చెబుతోంది. ఆనాటి స్త్రీలు పొగడలు అంటే పగడాలు, కెంపులు కూర్చిన బవిరె గొలుసులు ధరించేవారు. రంగనాథ రామాయణంలో పెళ్ళికుమార్తెలైన సీత ఊర్మిళ మొదలైన వారికి పై ఆభరణాలు ధరింపజేసినట్లు ఉన్నది.

పట్టెడ:

కంఠానికి పట్టి ఉండే హారాన్ని పట్టెడ అంటారు. ముత్యాలతో కూర్చిన పట్టెడను ఆనాటి స్త్రీలు ధరించేవారు. పలనాటి వీరచరిత్రలో మాంచాల ముత్యాల పట్టెడను ధరించింది. బహుశా దీనినే కుత్తికంటు అని కూడా అనేవారు. పలనాటి వీరచరిత్రలో సిరాదేవి అలంకరణలో ఈ కుత్తికంటు ఉన్నది. కుత్తికకు అంటిపెట్టుకున్నట్లు ఉంటుంది కనుక బహుశా పట్టెడను కుత్తికంటు అనేవారేమో! కుతిక + అంటు అని వరుడు నాగవల్లి నాడు వధువుకు కట్టే ఆభరణ విశేషమని సూర్యరాయాంధ్ర నిఘంటువులో ఉన్నది. కానీ సిరాదేవి పెండ్లికి ముందు ధరించింది.

త్రిసరములు:

మూడుపేటలుగా ఉండే హారాలను త్రిసరములంటారు. క్రీడాభిరామంలో కర్ణాటాంగన “క్రొవ్వారు పాలిండ్లపై త్రిసరంబుల్ పాలుపార” వచ్చింది. ఈనాటివారు పలకసరులు, చంద్రహారాలు, సైకిలుచైను వంటి గొలుసులను మూడు పేటలుగా చేయించి ధరిస్తారు. ముత్యాలతో కూడా మూడు వరుసల గొలుసులు ఆనాటి నుంచి ఈనాటివరకు స్త్రీలు ధరిస్తూనే ఉన్నారు.

వక్షస్థలం పై ధరించే ఇంకొక ఆభరణం గుండ్ల పేరు. అంటే గుండ్రనైన బంగారుపూసలు గుచ్చి హారంగా చేసేవారు. దీన్నే గుండ్ల పేరు అనేవారు. ఈ ఆభరణం ఈనాటికీ స్త్రీలు (ముఖ్యంగా పల్లెటూళ్ళలో) ధరిస్తారు. పలనాటి వీరచరిత్రలో సిరాదేవి వివాహసందర్భంగా అలంకరించుకున్న ఆభరణాలలో గుండ్లపేరులున్నాయి.

కేతన దశకుమార చరిత్రలో ఆనాటి స్త్రీలు ధరించే కంఠాభరణాలలో కట్టు వడములు, గట్టినూళ్ళు, సుద్దసరి, తీగె, మినుకులు అనేవి ఉన్నాయి. దండి రచించిన దశకుమార చరిత్రలో మణి నూపుర మేఖలా కంకణ కటక తాటంకహార మనే ఆభరణాలు పేర్కొనగా కేతన మట్టియలు, కట్టు వడములు, గట్టినూళ్ళు, సుద్దసరి, తీగె, మినుకులు, సంది దండలు, అంగు ళీయకములు, హరికంకణములు, చేకట్టు పావెలు, చెన్నుమెఱుగుటాకులు, సరిపెణలు అనే నగలను పేర్కొనడం వల్ల ఈ నగలు కేతన నాడు ఆంధ్రస్త్రీలు ధరించేవారని తెలుస్తున్నది. కట్టువడములు అన్న పదానికి అర్థం నిఘంటువులలో లేదు. గట్టినూళ్ళు అనే ఆభరణ విశేషానికి కూడా అర్థం తెలియదు. బహుశా తీగెలు వంటివి పేనినట్లుండే గొలుసు అయివుంటుంది. ఈనాడు నానుతాడు అనే గొలుసునే నాడు గట్టినూళ్ళు అనేవారేమో! మినుకు అంటే తాళిబొట్టు (మంగళసూత్రం) అనే అర్థంలోనే, వాడబడింది.

గురుజను లెఱు గక యుండగ

వెరవిడియై మినుకు గట్టి వెళ్ళి చనువునన్

వరియింప దగిన పురుషుడు, పరియణమగునేని నదియపైశాచమగున్

సుద్దసరి, తీగె, మినుకులు:

ఇవి అంగుళములో నాలుగవ వంతు వెడల్పుగల బంగారురేకుతో చేయబడి, రెండు చివరలలో కొక్కెముల వంటివి అమర్చబడి ఉంటాయి. కొక్కాలకు పైన, రేకుల పైన అక్కడక్కడ ముత్యాలు, రత్నాలు పొదగబడి ఉంటాయి. నానుపట్టెడ, దండసరిగెలు, అనే కంఠాభరణాలు కూడా ఉండేవని పల్నాటివీరచరిత్రలోని సిరాదేవి నగల వర్ణనని బట్టి తెలుస్తుంది.

సరిపెణలు:

గొలుసులను సరిపెణలంటారు. ఈ సరిపెణలు ముత్యాలతో చేసినవి ఉండవచ్చు. నాగరికులైన ధనవతులు బంగారుతో చేయబడిన సరిపెణలు ధరిస్తే, ఆటవిక స్త్రీలు ఇనుప సరిపెణలు ధరించేవారు. పండితారాధ్య చరిత్రలో జోగినులు ఇనుప సేవళములు ధరించారని వర్ణింపబడింది. సేవళములంటే లలంతికలని నిఘంటువులో అర్ధమున్నది. సరిపెణకు కూడా లలంతిక అని అర్థం ఇవ్వడం వల్ల సరిపెణ సేవళములన్నవి సమానార్ధక పదాలని చెప్పవచ్చు.

బంగారు వంటి లోహాలతో చేసిన ఆభరణాలే కాక సంకుపూసలు, పలు పూసలపేరుల బన్నసరాలు, వెండ్రుకల దండలు కూడా ఆనాటి స్త్రీలు ధరించేవారని పండితారాధ్య చరిత్రలోని జోగినుల వర్ణనను బట్టి తెలుస్తున్నది. వివాహిత, స్త్రీలు, మంగళసూత్రాలను తప్పక ధరించేవారు. పతకాలు కూడా ధరించేవారు. హారాలే కాక వక్షస్థలం పైన పత్రవల్లికలు కూడా ధరించడం ఆనాటి స్త్రీలు చేసేవారు. కుమారసంభవంలో బ్రాహ్మణ తాపస స్త్రీల వర్ణనలో వారు సాధారణంగా సుందరులైన స్త్రీలు ధరించే ఆభరణాలేవీ ధరించలేదని చెప్పే సందర్భంలో వారు రొమ్ముపై వరహారాలు, పత్రవల్లికలు ధరించలేదని చెప్పారు. అంటే ఇతరులు నాగరికలైన స్త్రీలు పత్రవల్లికలు ధరించేవారని తెలుస్తుంది. క్రీడాభిరామంలో కాపుజిల్లాలు ‘పసరు బారెడు నింబపల్లవముల దండ గుచ్చి చన్నుల మీద కుదురు కొల్పినది’ క్రీడాభిరామం – సాంఘిక సాంస్కృతిక విశేషాలు అన్న ఎం.ఫిల్ పట్టా పొందిన గ్రంధంలో దీన్ని బంగారుతో చేసిన వేపచిగురుటాకుల దండ – అంటే ఈనాడు మామిడిపిందెల హారం వంటిదిగా చెప్పారు. కానీ పసరుబారెడు నింబపల్లవములు అనడం వల్ల లేత వేపచిగురాకులతో తయారుచేసిన దండ వంటిదని ఊహించవచ్చును. నాటివారు పుష్పహారాలను ధరించేవారు. ఆ విధంగా పత్రవల్లికలను కూడా ధరించేవారని, పైన చెప్పిన నింబపల్లవముల దండ కూడా అటువంటిదేనని చెప్పవచ్చును. పువ్వులతో రకరకములైన ఆభరణాలను కూడా కొందరు స్త్రీలు ధరించేవారు. కుమార సంభవంలో మన్మథుడు నవకుసుమంబుల నానావిధంబుల తొడవులు రచియించి రతీదేవిని అలంకరించినట్లు ఉన్నది. దీన్నిబట్టి పుష్పాలతో చేసిన ఆభరణాలు కూడా ధరించేవారని తెలుస్తున్నది.

ఎఱుకు స్త్రీలు వెదుళ్ళలోని ముత్యాలు ధరించేవారు.

వేణుజ మౌక్తికముల్ దొడి, వీనులకింపెసగ నెఱుకు వెలదులు ప్రీతిన్.

ఆనాటి స్త్రీలు తమ ఆర్థికస్థితిని బట్టి, హోదాను బట్టి రకరకములైన రత్నాలతో, గాజు, సంకుపూసలతో, పూలతో తయారుచేసిన కంఠాభరణాలను, ధరించేవారని చెప్పవచ్చును. వింతవింత పతకాలు, తాయెత్తులు కూడా ధరించేవారు. పత్రవల్లికలు ధరించేవారు అని కూడా తెలుస్తున్నది.

హస్తాభరణాలు:

ధనవతులైన స్త్రీలు రకరకాలైన హస్తాభరణాలను ధరించేవారు. చేతివేళ్ళకు రత్నాంగుళీయకాలు, చేకట్టు పావెలు, హరికంకణాలు ధరించేవారనికేతన దశకుమార చరిత్రలోని ఆభరణాల పట్టికను బట్టి తెలుస్తున్నది! చేకట్టు పావెలు అంటే చేతివేళ్ళన్నిటికి ఉన్న అంగుళీయకముల నుంచి గొలుసులు అమర్చబడి కంకణాలకు జతచేర్చబడి ఉండేవి కావచ్చును. ఆనాటివారు సంది దండలు కూడా ధరించేవారు. వాటినే బాహుపుర్లు అని కూడా అనేవారు. వీటిని స్త్రీలేకాక పురుషులు కూడా ధరించేవారు. రంగనాథ రామాయణంలో శివధనుర్భంగానికై ఆయత్తపడిన శ్రీరాముడు ధరించిన ఆభరణాలలో ఈ బాహుపుర్లు కూడా ఉన్నవి. సంది దండలు అన్నవి మోచేతికి భుజానికి మధ్యభాగంలో ధరించే నగలు. పలనాటి వీరచరిత్రలో మాంచాల పెట్టుకున్న హస్తాభరణాలు నవరత్నాలతో చేసిన కేయూరాలు, రత్నాలు చెక్కిన రమ్యాంగదాలు, జంట కడియాలు, జంట తాయెత్తులు, నీలాల గాజులు, పచ్చల కంకణాలు, చామలా కడియాలు అన్నవి. కడియాలనే కంకణాలు అని కూడా అంటారు. పామరస్త్రీలు, క్రింది వర్గాల స్త్రీలు బంగారుతో కాక వెండితో చేసిన కడియాలు ధరించేవారు. క్రీడాభిరామంలో ఒక కరణకాంత కరమూలమున వెండి మొరవంక కడియములు ధరించినట్లు చెప్పబడింది. మొర అంటే పశ్వాదుల ముట్టె లేక దీర్ఘముఖము అని అర్థం నిఘంటువులో చెప్పబడింది. మొరవంక కడియాల కొనలు రెండింటికి జంతువుల ముఖం రూపంలో చెక్కబడి ఉంటుంది. ఇవి ఈనాటికీ గ్రామీణ స్త్రీలు ధరించడం కద్దు.

గాజులు:

సంపన్నకుటుంబాలకు చెందని క్రిందివర్గం స్త్రీలు వెండి, పూసలు, ముత్యాలే కాక గాజుతో చేసిన హస్తాభరణాలు ధరించేవారు. క్రీడాభిరామంలో ఈ గాజుల ప్రస్తావన ఉన్నది. గానులకరణకాంత ‘కరవల్లికాచ భూషాకల మధుర, ఘణత్కారముల్ దోరముగా పసుపు నూరింది’. కాచ భూషలంటే గాజుతో చేసిన భూషణాలని అర్థం. ఆమె సంపన్న కుటుంబానికి చెందినది కాదని తెలుస్తున్నది. ఆనాటి సంపన్న స్త్రీలు మంజుల ధ్వనులు చేసే చిరుగజ్జెలున్న కంకణాలు ధరించేవారు. కానీ గాజుతో తయారుచేసినవి ధరించినట్లు కనపడదు. కనుకనే రంగనాథ రామాయణం, పలనాటి వీరచరిత్ర, భాస్కర రామాయణం వంటి కావ్యాలలో రాజకుమార్తెల అభరణాలలో ఈ కాచభూషలు రాలేదు. కాని మోటుపల్లి రేవు శాసనాన్ని బట్టి గాజు కూడా దిగుమతి వస్తువులలో ఒకటి అని తెలుస్తున్నది.

కర్ణభూషణాలు:

తాటంకాలు:

ఆనాడు బంగారుతో చేసిన తాటంకాలు, తెల్లతాటి ఆకుతో చేసిన తాటంకాలు స్త్రీలు తమ ఆర్థిక స్థాయిని బట్టి ధరించేవారు. మాంచాల బంగారు తాటంకాలు ధరించగా, క్రీడాభిరామం కావ్యంలో ఒక మేదదదరకరణవేశ్య ‘ధవల తాళ పలాశ తాటంకాల’ ను ధరించింది.

ప్రాచీనకాలంలో తెల్లని తాటిఆకుతో కర్ణాభరణం చేసి ధరించేవారు. దాన్ని తాటంకమనేవారు. తరువాతి కాలంలో బంగారుతో చేసిన కర్ణాభరణాలను కూడా తాటంకమని అనేవారు. కాకతీయుల కాలంలో బంగారు, వెండి, నవరత్నాలతో చేసిన కర్ణాభరణాలే కాక తాటిఆకుతో చేసిన చెవికమ్మలు కూడా ధరించేవారని క్రీడాభిరామాన్ని బట్టి చెప్పవచ్చు. క్రీడాభిరామంలో కరణకాంత “పలితంపు విచ్చుటాకుల దుద్దు గమ్మ”లు చెవులకు ధరించింది.

తాటంకాలకే మరొక పేరు కమ్మలు. పలనాటి వీరచరిత్రలో సిరాదేవి చెవులకు ధరించిన ఆభరణాలు బంగారు కమ్మలు, బావిలీలు, కుంటెంట్లు. బావిలీలు అన్నవి గొలుసుల వంటివి. చెవికమ్మలకు గొలుసుల వంటివి తగిలించబడి వెనుకనున్న కబరికి గుచ్చబడి ఉంటాయి. కుంటెంట్లు అన్నవాటికి నిఘంటువులో అర్ధం చెప్పలేదు. కానీ చెవికి కమ్మలు బావిలీలతో పాటు అమర్చగలిగిన ఆభరణాలు కుంటెంట్లు అయి ఉంటాయి. కనుకనే ఈ మూడింటినీ ఒకే సమయంలో ధరించినట్లుగా సిరాదేవి నలంకరించిన ఘట్టంలో చెప్పబడింది.

క్రీడాభిరామంలో హాలికవాడ కర్ణాటాంగన ముత్యాల కమ్మలు ధరించినట్లు చెప్పబడింది. చెలికత్తెలు మాంచాల చెవులకు ‘నవరత్న మౌక్తిక నవహేమయుక్త తాటంక భూణషద్వయం’ ధరింపజేసి, ‘ముత్యాల కుచ్చుల బవిరలు కుంటేండ్లు’ అమర్చారు. అంటే బవిరలు, కుంటేండ్లు అన్నవి ముత్యాల కుచ్చులు కలిగి ఉంటాయని తెలుస్తున్నది. బవిరెలు అంటే చెవికి పెట్టుకొనే గుండ్రని నగ, వర్తులాకారపు కర్ణాభరణ విశేషము అని సూర్యరాయాంధ్ర నిఘంటువులో ఉన్నది.

రంగనాథ రామాయణంలో సీత నగల వర్ణనలో మగరాల తళుకు కమ్మలు, కట్టాణి అనే కర్ణభూషల ప్రసక్తి ఉన్నది!

కట్టాణి అన్న పదానికి నిఘంటువులో (కడు+ ఆణి) మిక్కిలి గుండ్రని ప్రశస్తమైన మౌక్తికమని అర్థం ఉన్నది. ఆ ముందు చెప్పినట్లు మేలిమి ముత్యాలు, మగరాల తళుకు కమ్మలతో పాటు ధరింపబడినాయి. ఇవేకాక పొగడలు కెంపులు కూర్చిన బవిరెలు కూడా చెవులకు అమర్చబడినాయి. అంటే ఆనాటి స్త్రీలు చెవులకు ఒక కమ్మలే కాక వ్రేలాడే ఆభరణాలు, చెవుల నుండి శిరోజాలకు సాగేవిధంగా ఉండే ముత్యాల కుచ్చులు గొలుసులు ధరించేవారని తెలుస్తున్నది. ఈనాడు కేవలం కమ్మలు లేదా వ్రేలాడే జుంకీలవంటివి గానీ లేదా గుండ్రని పోగులు (రింగులు) వంటివి గానీ ధరిస్తున్నారు. చెవికమ్మల నుండి వెనుకవైపుక బరికి చేర్చే చేర్లు, చెవి క్రింది నుండి మీది చెవులకుంచే చేర్లు ఈనాడు కూడా కొన్ని కుటుంబాల్లో వున్నవి. బావిలీలు, కమ్మచేర్లు.

చెవులకే కాక చెవులకు పైన ఉన్న ముంగురులకు కూడా కుప్పెల ముత్యాల కుచ్చులు అమర్చేవారు. మాంచాల కుంతలాలకు రెండు కుప్పెల ముత్యాల కుచ్చులు అమర్చారు. కాశ్మీర స్త్రీలు ధరించే మంగళసూత్రాలు కుచ్చులతో ఉండి జుట్టుకి వ్రేలాడతాయి.

కుండలాలు:

గుండ్రని కర్ణాభరణాలను కుండలాలని అంటారు. హాలిక వాటిలో కాపుటిల్లాలు “కుండలములు కురుల్ కదల గోమయ పిండములింటిముందు” రచియించింది. 51

నాసికాభరణాలు:

ఆనాటి స్త్రీలు ముక్కున ముత్యపు ముంగర ధరించేవారు. ముంగరనే ముక్కెర అని కూడా అంటారు. ముక్కెరతో పాటు నత్తు అన్న ఆభరణం కూడా ధరిస్తారు. ముంగర అన్నది ముక్కు కింది భాగంలో మధ్యగా అమర్చబడి పెదవి పైభాగంలో వ్రేలాడే ఆభరణం. దీన్ని ఋలాకీ అంటారు. ఇది కాశ్మీరీ పదం. నత్తు అన్నది ముక్కుకు ఒకవైపు అమర్చబడే ఆభరణం. జోగినులు పటిక (స్పటికం) తో చేసిన బరువైన ముక్కెరలు ధరించేవారు.

“పటికంబు ముక్కఱల్ భారమై తనర”

ఆనాటివారు చౌకట్టులు అంటే నాలుగు వైపుల ముత్యాల వరుసల నుంచి చతుర్భుజాకారంగా ఉండే కర్ణాభరణం రంగనాథ రామాయణంలో శ్రీరాముడు వివాహ సమయంలో ధరించాడు.

శిరోభూషణాలు:

శిరసు నలంకరించే ఆభరణాలు, కేశాలను ముడిచివేసి కబరిని అలంకరించే ఆభరణాలు ఎన్నో ఆనాటి స్త్రీలు ధరించేవారు.

పాపటబొట్టు:

పాపటలో ధరించే ఆభరణం పాపటిబొట్టు లేదా చేర్చుక్క అని అనేవారు. “మణి హేమ మౌక్తిక మండితమైన చేర్చుక్కను” మాంచాలకు పాపట్లో అమర్చారు.

పసిడిపోక:

పాపటబొట్టుతో పాటు పసిడిపోకను ధరించేవారు. ఇది రాజస్ధానంలోని సుమంగలి స్త్రీలు ధరించే నగ.

సూసకం:

ఇది కూడా పాపటలో అలంకరించుకొనే ఆభరణం. ఈ మూడూ ఒకేసారి ధరించవారని పలనాటి వీరచరిత్రలో సిరాదేవి అలంకరణ ఘట్టాన్ని బట్టి చెప్పవచ్చు.

పాపట కిరువైపుల సూర్యచంద్రులను ధరించేవారు. చంద్రవంక కెంపుల కూర్చి చేసేవారు. సూర్యచంద్రులనే ఆభరణాలనే శశి రవిభూషలనేవారు. తలవెనుక రాగిడి, తిరుగుడు పువ్వు, అమర్చేవారు. పల్లెరు పువ్వు, తమ్మిరేకు, రావిరేకు అన్నవి కూడా శిరోజాలకు అమర్చేవారు.

కబరి:

శిరోజాలను దువ్వి ముడివేయడం ఆనాటి నాగరిక స్త్రీల శిరోజాలంకరణ పద్ధతి. ఈ ముడికి బంగారు పూచేర్లు చుట్టేవారు. హంసతిలకాన్ని అమర్చేవారు. కుమార సంభవంలో గౌరీకల్యాణ సందర్భంలో “శృంగార రాజ్యలక్ష్మికి ముడి గలపిన గతి హంసతిలకంబు గబరి బూన్చి” పార్వతికి వివాహానికి ముందు ఆమె చెలులు చేసిన అలంకరణలో ఈ హంస తిలకాన్ని కబరికి అలంకరించారు. చెన్ను మెఱుగుటాకులు అన్న ఆభరణం కేతన దశకుమార చరిత్రలో ప్రస్తావించబడింది. ఈ బహుశా పల్లెరుపువ్వు, తమ్మిరేకు, రావిరేకు అన్న ఆభరణాలనే చెన్నుమెఱుగుటాకులు అని ఉండవచ్చు. ఇవేకాక మాణిక్యాలతో కూర్చిన చిన్న అద్దం వంటిది కూడా కబరికి అమర్చేవారేమో. పల్నాటి వీరచరిత్రలో మాంచాల ధరించిన ఆభరణాలలో ఈ మాణిక్య హాటకమయ బింబం ఒకటి. మాణిక్యాలతో కూర్చిన బంగారు బింబాన్ని ఆనాటి స్త్రీలు ధరించేవారు. బింబం అంటే సూర్యరాయాంధ్ర నిఘంటువులో (చంద్రసూర్య) మండలము, ప్రతిబింబము, కమండలువు, అద్దము, ఉపమేయము, ముఖము, చిహ్నము, ఉపదానము, ఊసరవెల్లి, దొండపండు, ప్రతిమ అన్న అర్థాలున్నాయి. ఈ వీటన్నింటిలో అద్దం అన్న అర్థమే పై సందర్భంగా సరిగా సరిపోతున్నది. మాణిక్యాలు పొదిగిన బంగారుతో చేసిన అద్దాన్ని తలవెనుక భాగంలో అమర్చితే రవి శశి భూషలకాంతులు దానిపై బడి మిరుమిట్లు గొలిపే కాంతులతో శిరసు వెలిగిపోతుంది. కనుకనే పెళ్లి వంటి ప్రత్యేక సమయాల్లో ఈ అలంకరణ చేసేవారు.

సవరాలు:

సవరాలు ఆనాడు పట్టుదారాలతో, చమరీమృగవాలాలతో చేసేవారు. వీటిని ఆనాటి స్త్రీలు ధరించేవారని నాటి సాహిత్యాన్ని బట్టి తెలుస్తుంది. గణపతి దేవుని కాలంనాటి వరంగల్లు శాసనంలో కూడా ఈ సవరాల ప్రసక్తి ఉన్నది. ఉభయనానాదేశి వర్తక సంఘంవారు స్వయంభూదేవునికి అర్పించిన సుంకాలలో సవరాలపై విధించిన సుంకం గురించి ఉన్నది కనుక సవరాలు ఎక్కువగా వాడేవారని తెలుస్తుంది. శిరోజాల చివర సవరాలు ముత్యాల కుచ్చులతో ఉన్నవి ధరించేవారు. పలనాటి వీరచరిత్రలో బాలచంద్రుని వేశ్య సబ్బాయి ‘సవరని ముత్యాల జల్లులు తూలుచుండగా’ బాలచంద్రుని వద్దకు వచ్చింది. యెఱుకు స్త్రీలు చమరీ మృగం వెంట్రుకలతో చేసిన సవరాలను ధరించేవారు అని నన్నెచోడుని కుమార సంభవాన్ని బట్టి తెలుస్తుంది. మొదట ఆటవికులు చమరీమృగం తోకలతో చేసిన చమరాలు ధరించగా, క్రమక్రమంగా నాగరికులు కూడా సవరాలు ధరించడం ప్రారంభించారని ఊహించవచ్చును. క్రీడాభిరామంలో కర్ణాటాంగన మంచన శర్మ పరాచికాలకు సమాధానంగా ‘పన్నిదము, వీని మెడనున్న జన్నిదములు సవరగా గ్రుత్తు పుంజాల దండ’ అన్నది.

చెప్పులు:

ఆనాటి స్త్రీలు ప్రయాణ సమయాల్లో చెప్పులు ధరించేవారని పండితారాధ్య చరిత్రలో పర్వత ప్రకరణంలోని పుణ్యాంగనల వర్ణననుబట్టి తెలుస్తుంది.

“చెలువగు పైనంబు చెప్పులు మెట్టి”

రామప్ప దేవాలయంలోని శిల్పాలలో ఒక స్త్రీ ఎత్తుమడమల జోళ్ళు ధరించి ఉండటం చూడవచ్చును.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here