[డా. మంత్రవాది గీతా గాయత్రి గారు 1995లో పిహెచ్‍డి పట్టా కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖకి సమర్పించిన సిద్ధాంత వ్యాసాన్ని సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము.]
ప్రకరణం 9. స్త్రీలు – వేషభూషాదులు – రెండవ భాగం
స్త్రీలు – వస్త్రధారణ
పట్టువస్త్రాలు:
[dropcap]కా[/dropcap]కతీయుల కాలంలో స్త్రీలు పురుషులు పట్టువస్త్రాలను ఎక్కువ అభిమానించేవారు. గణపతి దేవుని కాలంలోని మోటుపల్లి రేవు శాసనాన్ని బట్టి పట్టు దిగుమతి చేసుకొనేవారని తెలుస్తుంది. మన దేశంలోనూ పట్టువస్త్రాలను నేసేవారు. సంపన్న కుటుంబీకులు అన్ని శుభకార్యాలకు ఉత్సవాలకూ పట్టువస్త్రాలు ధరించేవారు. ఆనాటివారు ఎన్ని రకాల పట్టువస్త్రాలు ధరించేవారో బసవ పురాణంలోని తృతీయాశ్వాసంలో బసవన్న తన భార్య చీర విప్పించి జంగమునకిచ్చిన కథను బట్టి తెలుస్తుంది. ఒక వేశ్యతో ఆమె దాసి తాము ఎన్నోరకాల పట్టువస్త్రాలను చూచామని, బసవని భార్య గంగాంబ కట్టిన పటవలి పుట్టము వంటిది ఎక్కడా చూడలేదని చెప్పిన సందర్భంలో పట్టువస్త్రాల పేర్లు చెప్పింది. అవి యాభై మూడు రకాల పట్టువస్త్రాలు. అందులో రంగులను బట్టి కొన్ని రకములు, అంచులను బట్టి కొన్ని, ఆ వస్త్రాలు తయారయే ప్రదేశాలను బట్టి కొన్ని పేర్లు వచ్చి ఉంటాయి. పాల్కురికి సోమనాధుడు పేర్కొన్న పట్టురకాలు ఈ క్రింద ఉదహరింప బడినాయి.
- వెంజావళి
- జయరంజి
- మంచుపుంజము: ఇది మంచువలె అతి తెల్లనిదై ఉంటుంది.
- మణి పట్టు: బహుశా ఇది మణివంటి కాంతిగలదై ఉంటుంది.
- భూతిలకము: ఇది నేలరంగు కలిగినదై ఉంటుంది.
- శ్రీవన్నియ:
- మహాచీనిచీని : చైనాదేశం నుండి దిగుమతి చేసుకున్న పట్టు అయి ఉంటుంది.
- భావజ తిలకము
- పచ్చని పట్టు: పచ్చని పసుపు ఛాయగల పట్టువస్త్రము.
- రాయశేఖరము: మహారాజులు ధరించతగ్గ ప్రశస్తమైన పట్టువస్త్రము అయి ఉంటుంది.
- రాజవల్లభం: ఇది కూడా అతివిలువైన పట్టురకం అయివుంటుంది. మృదుత్వం, కాంతిని బట్టి నాణ్యత ఎంచబడుతుంది. రాచకుటుంబాలలలో వారు సుకుమారులు కనుక అతి మృదువుగా కాంతివంతంగా తేలికగా ఉండటమే నాణ్యమైనదిగా ఎంచుతారు. కనుక పై రెండు రకాల పట్టువస్త్రాలు అతి సున్నితమై కాంతివంతమైనవై ఉంటాయని భావించవచ్చును.
- వాయుమేఘము: ఈ పట్టు తెల్లగా, తెలిమబ్బు వలె ఉండి, తేలికగా ఉండి ఉంటుంది.
- గజవాళము
- గండవడము
- కావులు: బహుశా కావిరంగు పట్టు అయి ఉంటుంది. నీర్కావి, చంద్రకావి వలువలన్నవి ఇందులోని బేధాలు కావచ్చు.
- సరిపట్టు
- హంసపడి: హంసరెక్కల వలె తెల్లని, మెత్తని పట్టు కావచ్చు. లేదా హంసలబారు అంచు ఉన్న పట్టు వస్త్రం కావచ్చు.
- వీణావళి: అంచు వీణల బారుతో ఉండి ఉంటుంది.
- గజావళి: అంచులో ఏనుగుల బారు నేసి ఉంటారు.
- హయావళి: కింద అంచులో గుర్రాల బొమ్మలు బారు ఉండి ఉంటుంది.
- పల్లడదట్టి: దట్టి అనగా కాసె, కాసెకోక అని నిఘంటువు. పల్లడ దట్టి అనగా బహుశా నాట్యకత్తెలకై ప్రత్యేకంగా నేసిన కాసె అయి ఉంటుంది.
- వారణాసి: ఈ పట్టు వారణాసిలో తయారైనది. ఈనాడు దాన్ని బెనారసు పట్టు అంటారు.
- చీకువాయు కెందొగరు: చక్కటి కెంపురంగు పట్టు అయి ఉంటుంది. మామిడి చిగురు రంగులో ఉండి ఉంటుంది.
- గౌరిగనయము: గౌరవర్ణంలో ఉండి ఉంటుంది.
- క్షీరోదకము పట్టు: పాలునీరులాగా తెలుపు, నలుపుల కలనేత చేసిన పట్టు వస్త్రం అయి ఉంటుంది.
- రత్నంబు పట్టు: రత్నంలాగా మెరిసిపోయే పట్టు కావచ్చు.
- సంకుపట్టు
- మరకతపట్టు: మరకతం రంగులో ఉన్న పట్టువస్త్రం
- పొంబట్టు: దీన్నే పొన్నుపట్టు లేక పొన్పట్టు అని కూడా అంటారు. క్రీడాభిరామంలో ఒక వేశ్య క్రొత్తమడుగుంబొన్పట్టు నీరంగి ధరించింది. అంటే బంగారు పోతగల పట్టువస్త్రమని చెప్పవచ్చును.
- నెఱపట్టు
- వెలిపట్టు: తెల్లని పట్టువస్త్రం. క్రీడాభిరామంలో అక్కల ఆరాధన సందర్భంలో ఒక అలరు బోడి ‘నిద్దంపు వెలిపట్టు’ చీర ధరించింది. పూజాసమయాల్లో బహుశా అలాంటివారు తెల్లని పట్టువస్త్రం ధరించేవారేమో!
- నేత్రంబు పట్టు
- తవరాజంపు పట్టు
- మాందోళి రవి: సూర్యుని కాంతివంతమైన పట్టువస్త్రం కావచ్చు.
- చంద్రాతపము: ఇది కూడా తెల్లనిదై ఉంటుంది.
- సాంధ్యరాగము: సంధ్య వలె ఎర్రని రంగుగల వస్త్రం అయి ఉంటుంది.
- ఇంద్రనీలము: ఇది ఇంద్రనీలం వలె నీలిరంగు గల వస్త్రం అని చెప్పవచ్చు.
- శరధి: సముద్రపు నీలిరంగు గల వస్త్రం
- మేఘవన్నె: మేఘం వంటి నీలిరంగు గల వస్త్రం
- రుద్రాక్ష వన్నె: రుద్రాక్షల వన్నెలో ఉన్న పట్టువస్త్రం
- కాంభోజిపట్టు: కాంభోజి దేశం నుండి దిగుమతి అయిన పట్టు
- మహేంద్ర భూషణం: మహేంద్రుని వజ్రం వలె కాంతివంతమైన పట్టువస్త్రమై ఉంటుంది.
- సన్ననడంచు
- సరిగమ్మి తెలుపు దివ్యాంబరం: ఇవి రెండు అంచులను బట్టి వచ్చిన పేర్లు అయి వుంటాయి.
- మలయజసిరి: బహుశా ఇది గంధపువన్నె కలిగి ఉంటుంది.
- కొలని మేఘము: నీలిమేఘం రంగులో ఉన్న పట్టు.
- వలిపం: అతి పలుచని వస్త్రము. పయ్యెదగా వాడేవారు. ‘వలిపవు సన్న పయ్యెదను వాసిన’ — మొల్ల రామాయణం
- పులిగోరు పట్టు: పులిగోరు వన్నెగల పట్టువస్త్రం
- భూపతి రుద్ర తిలకము
- ఉదయరాగం: సూర్యోదయ కాలంలోని అరుణవర్ణంలో ఉండి ఉంటుంది.
- సరిపట్టు
- దేవాంబరం పట్టు
- గుజరాష్ట్రంబు పట్టు: గుజరాష్ట్రం నుండి దిగుమతి అయిన పట్టువస్త్రం.
ఇన్ని రకాల పట్టువస్త్రాలు ఆ రోజుల్లో ఉండేవి అంటే ఆనాటి వారి వైభవం, భోగరాసిక్యం అర్థమౌతాయి.
అన్ని శుభకార్యాలలోను స్త్రీలు, పురుషులు పట్టువస్త్రాలను ధరించేవారు. క్రీడాభిరామంలో అక్కల ఆరాధన ఉత్సవంలో ఒక స్త్రీ ‘నిద్దంపు వెలిపట్టు పుట్టంబు’ అంటే మెరిసే తెల్లని పట్టుచీరె కట్టింది. సంప్రదాయానుసారిణులైన స్త్రీలు ఆనాడు శుభకార్యాలకూ, పూజలకు తెల్ల పట్టుచీరెలు కట్టేవారు.
వేశ్యలు కూడా పట్టువస్త్రాలే ధరించేవారు. క్రీడాభిరామంలో ఒక వేశ్య ‘ క్రొత్తమడుగుం బొన్పట్టు నీరంగి’ అంటే కొత్త నీరుకావి పట్టుచీర ధరించింది.
బాలచంద్రుని వేశ్య సబ్బాయి తల్లి వేశ్యమాత తనకు పట్టు పచ్చడం ఇవ్వమని కోరింది.
చీరలలో రకాలు:
స్త్రీలు ధరించే నూలు, పట్టు వస్త్రాలకు చిత్ర విచిత్రములైన అంచులుండేవి. ‘గడివోని చిఱుత చౌకంబుల’ కరకంచులు, బొమ్మంచులు, ముయ్యంచులు (మాంచాల ముయ్యంచు చేలం కట్టింది), చిలుకచాళ్ళు, ఉడుత చారలు, పుప్పొడి వన్నెలు, రుద్రాక్ష వన్నెలు, హంసావళులు, గజావళులు మొదలైనవి. బసవపురాణంలో బసవని భార్య గంగాంబ చీరను జంగముని వేశ్యకిప్పించిన ఘట్టంలో రకరకాల పట్టువస్త్రాల గురించి ప్రస్తావించబడింది. సామాన్య కుటుంబాలకు చెందిన స్త్రీలు నూలువస్త్రాలను ధరించేవారు. ధనవంతులు, రాజకుటుంబాల స్త్రీలు, వేశ్యలు పట్టువస్త్రాలు ధరించేవారు. ప్రత్యేక సమయాలలో ఆ పట్టు వస్త్రాలలో మేలిమి వస్త్రాలను ధరించేవారు.
పట్టువస్త్రాలల కొంగులకు చివర ముత్యాలు కుట్టేవారు. చీరలపై ప్రతిమలను చిత్రించేవారు. పలనాటి వీరచరిత్రలో బాలచంద్రునితో చిత్తరువు మేడకు చేరిన మాంచాల ముత్యాలు కూర్చిన కొంగు కలిగి, ప్రతిమలు రాసిన పట్టువస్త్రాన్ని ధరించిందని ఉన్నది. దీన్నిబట్టి పట్టువస్త్రాలను ప్రత్యేక సమయాలలో వాడడమేకాక సందర్భాన్ని బట్టి, వారి హోదాను బట్టి చీరల పైన చిత్రాలు అద్దించడం, ముత్యాలు కుట్టడం వంటివి స్త్రీలు ఆనాడు చేసేవారని గ్రహించవచ్చును.
పట్టుచీరలకు సరిగ లేక జరీ ఉండడం అన్నది ఆనాటివారికి ఇష్టంగా ఉండేది. ఈనాటికీ స్త్రీలు వారి అంతస్తు, హోదా తెలిపే విధంగా జరీ పనిచేసిన చీరలు ధరిస్తూ ఉంటారు.
ఆనాడు అద్దకం చేసిన చీరలు ధరించేవారు. మాంచాల ప్రతిమలు రాసిన చీర అంటే ప్రతిమలు అద్దించిన చీర కట్టింది. ఐతాంబ పుత్రుల కోసం అద్దకం చేసిన చీరలు కట్టింది. బహుశా కూనలమ్మ చీరలు అంటే సంతానాన్నిచ్చే కూనలమ్మ పేరుమీద నేసిన చీర అయి ఉంటుంది. అద్దకం చీరల్లో కాట్రేని చీరలు ఋతు ప్రసర దోషంపోవడానికి ధరిస్తారనీ, గోవుల బొమ్మల అద్దకం వేసిన చీరలు వితంతువులు పుణ్యం కోరి ధరిస్తారని పింగళి లక్ష్మీకాంతంగారు పల్నాటి వీరచరిత్ర అనుబంధంలో చెప్పారు. కాని ఋతు చక్రం ఆగిపోయిన వారు ఆవుల బొమ్మల చీరలు ధరించడం ఆచారమని ఆచార్య అమరేశం రాజేశ్వర శర్మగారు తెలిపారు. క్రీడాభిరామంలో ‘కర్ణాటాంగన కుసుమంబెట్టిన చీర కొంగు వొలయం’ వచ్చింది. ( క్రీడాభిరామం – పద్యం 86)
రవికలు, పైటలు ధరించడం:
రంగనాథ రామాయణంలో సీతకు శివధనుర్భంగవేళ చంద్రకావి వలువలను ధరింపజేశారు. వివాహవేళ “బంగారు సరిగె కన్పట్టు కుట్టుపనుల కంగుల అయికలు కనుపట్ల దొడిగి” బంగారు జరీతో కుట్టుపని చేసిన రవికలు ఆ రోజుల్లో ప్రత్యేక సమయాల్లో ధరించేవారని తెలుస్తుంది. చలువ పావడాలు కట్టి జాళువా సరిగె కొంగులు అంటే అందమైన జరీపని చేసిన కొంగులున్న దుకూలాన్ని కట్టారు. కుమార సంభవంలో పిశాచ నర్తకీమణులు ‘కంచెలలు’ అంటె రవికలు తొడిగారు.
పల్నాటి వీరచరిత్రలో మాంచాల వివాహ సమయంలో ఆమెకు కూడా బంగారు పువ్వుల పట్టు కంచుకం తొడిగి ముందుభాగంలో చివర ముడివేశారు. రవికలను తొడిగాక చివరలు ముడివేసేవారు. బంగారు జరీతో ఉన్న ముయ్యంచు చేలాన్ని ఆమె నడుముకు కట్టి పైట సవరించారు. బాలచంద్రుని వేశ్య సబ్బాయి వెండిపువ్వుల రవికె తొడిగి బంగారు జాళువా వస్త్రాన్ని ధరించింది. ‘బంగారు జాళువా పటంబు ధరించి, రాజత కుసుమంపు రవిక’ తొడిగింది.
కన్యలు పైటలేక వల్లెను ధరించేవారు. క్రీడాభిరామంలో ‘హాలికవాటిలో నొక్కచక్కని జవరాలు కట్టెఱ్ఱ తొగఱుంగఱ్ఱల యెఱ్ఱయొల్లియ ని తంబభారమున’ అమర్చింది. ఒల్లియ, పైట, వల్లెవాటు, పయ్యెద, కొంగు ఈనాటి వోణీ. ఇవన్నీ రొమ్ముపై ధరించే వస్త్రానికి ఉన్న పేర్లు. నడుము భాగంలో పావడాలు కట్టి, పైన ఒల్లియ లేదా పైట వేసేవారు. లేదా చీరకొంగును పయ్యెదగా వేసి మిగిలిన వస్త్రాన్ని నడుముకు కట్టేవారు. నడుముకు చీరను అందంగా అమర్చి పైన ఒడ్డాణం, మొలనూలు, తపనీయకాంచి వంటి కటి ఆభరణాలతో బిగించి కట్టేవారు.
చీరకట్టే పద్ధతి:
చీరలు అందరూ ఒకే విధంగా కట్టేవారు కాదు. కొంతమంది ఒంటిపొర చీరకట్టేవారు. కొందరు కాసెపోసి కట్టేవారు. కొందరు పావడాలు కట్టి వాటిపై పట్టువస్త్రాలు ధరించేవారు.
కానె అంటె గోచీ, వెనకకు చెక్కు – అని నిఘంటువులో అర్ధమున్నది. ‘కాసెపోసి లేదా కచ్చపోసి’ చీరకట్టడం అంటే చీరలో కొంతభాగం వస్త్రాన్ని కుచ్చెళ్ళుగా అమర్చి ముందునుంచి వెనుకకు గోచీవలె తీసి నడుము వెనుకభాగంలో చెక్కి కట్టడం. ఈనాటికీ ఆంధ్రదేశంలో పల్లెటూళ్ళలో మగవారు ప్రత్యేక సమయాలలో ఈ విధంగా కాసెపోసి పంచ కడతారు. ఆడవారు పూజలు, వ్రతాల సందర్భాలలో ఈ విధంగా గోచీపోసి కట్టడం ఈనాటికీ సంప్రదాయంగా ఉన్నది. ఈ విధంగా కాసెపోసి కట్టడం వల్ల పనిచేసే సమయాలలో చీర కాళ్ళకడ్డు పడకుండా ఉంటుంది. క్రీడాభిరామంలో కాపుపడతి జరిపోని గడితంపు చిఱుత చౌకంబుల తొగఱు పుట్టము కచ్చదొడివి కట్టింది. పామరస్త్రీలు ముఖ్యంగా పల్లెటూళ్లలో స్త్రీలు ఈనాటికీ కాసెపోసి చీరకట్టడం ఉన్నది.
కాసెపోసి చీరకట్టడం కేవలం పనిపాటలు చేసుకొనేవారే కాదు, నాట్యంచేసేవారు కూడా చేసేవారు. మగవారు కాసెపోసి కట్టేదానికి, స్త్రీలు కాసెపోసి కట్టే పద్ధతికి తేడా వుండి ఉండవచ్చును. కనుకనే మగకాసె అన్నపదం ఆనాడు వాడుకలో ఉండేది. పలనాటి వీరచరిత్రలో నలగామరాజు రాయబారానికి వచ్చిన భట్టుతో
మగతనంబున బుట్టి మగకాసె గట్టి
మగటిమి విడనాటి మానంబుదూలి
అన్నాడు. మగవారు కాసెపోసి కట్టే పద్ధతి ఆడవారి కాసె కంటె భిన్నమైనదని దీన్నిబట్టి చెప్పవచ్చు.
నాట్యం చేసే స్త్రీలు కాసె కట్టేవారని పలనాటి వీరచరిత్రను బట్టి తెలుస్తుంది. నలగాముని కొలువులో కంజలోచన అనే నర్తకి నాట్యం చేయడానికి వచ్చినపుడు ఆమె పంచవన్నియల కాసె గట్టిగా కట్టింది. భరతనాట్యం చేసే నర్తకీమణులు ఈనాటికీ కాసె కట్టిన పద్ధతిలోనే పట్టువస్త్రాన్ని ధరిస్తారు. పంచవన్నియలంటే పంచరంగులు కలిగిన వస్త్రం. కాసె అన్నది పనిపాటలకే కాక నాట్యానికి కూడా అనువైనది కనుకనే నాట్యం చేసేవారు చీరను కాసే పద్ధతిలోనే ధరిస్తారు.
చల్లడము లేక చల్లాడము:
నాట్యకత్తెలు కాసె కట్టకుండా చల్లడం ధరించి సన్నని నాజూకైన వస్త్రాన్ని భుజాలమీద ధరించడం కూడా ఆనాడు ఉండేది. చల్లడం అంటే సగము తొడవఱకు తొడిగికొను లాగు అని సూర్యరాయాంధ్ర నిఘంటువులో అర్థం ఇవ్వబడింది. అంటే నాట్యంచేసేవారు మోకాలి పైవరకు వచ్చే చల్లడాన్ని ధరించేవారు. రామప్ప దేవాలయంలోని నర్తకీమణులు చల్లడాలను ధరించడం మనం గమనించవచ్చును. నన్నెచోడుని కుమార సంభవంలో మహాకాళి సభలో పిశాచ నర్తకీమణులు చల్లడాలను గట్టి నాట్యం చేసినట్లు వర్ణించబడింది.
సరసాజినంబులు సల్లడంబులు గట్టి
నెనకుల కంచెల లొనర బెట్టి
హాస్య భీభత్స భయానక రసములా
యత్తంబుగా నోలి నభినయించి
~
ఆ.
సంగరాంగణంబు రంగంబుగా భూత
గమము విచ్చలింప గా బిశాచ
నర్తకీ చయంబు నర్తించె గంకాలి
చిత్తమలరి యంగ చిత్ర మెస గో
ఒంటిపొర చీర:
పనిపాటలు చేసుకొనే పామరస్త్రీలు చీరను ఒంటిపొరగా ధరించేవారు. నిలువుగా పింజ సవరించి కట్టడం వల్ల పనిపాటలకు చీరకుచ్చెళ్ళు అడ్డురాకుండా ఈ కట్టు ఉపయోగపడుతుంది. వరంగల్లు సమీపంలోని గ్రామాలలో ఈనాటికీ ఈ పద్ధతిలోనే చీరకడతారు. క్రీడాభిరామంలో ‘కనుమయవ్వలి’ దేశానికి చెందిన కరణకాంత “జంగాళముగ బింజె సవరించి కట్టిన మడు గొంటి పొరను లో దొడలు మెఱయ”గా ఓరుగంటి పురంలో సంపెంగనూనె నమ్మింది.
రెండు పొరల లేదా రెండు వరసల చీరలు ధరించడం:
పామర స్త్రీలు ఒంటిపొర చీరలు ధరిస్తే కులస్త్రీలు, ధనిక వర్గపు స్త్రీలు రెండు మూడు పొరలుగా చీరలను కట్టేవారు. రాజకన్యలు పావడాలు కట్టి పైన పైటలు, వల్లెవాటు ధరించేవారని ఇంతకుముందు చెప్పడమైనది. కులస్త్రీలు (వివాహితలు) పండ్రెండు మూరల చీరలు ధరించేవారు. పండ్రెండు మూరల పసిడి పుట్టాన్ని ఒక సాలెవాడు నేసి తేడర దాసయ్యకిస్తే దాన్ని అతడు ఒక తపసికిచ్చాడని బసవ పురాణాన్ని బట్టి తెలుస్తున్నది. ఈ చీరలు అతి సున్నితంగా, నాజూకుగా సన్నగా ఉండడం వల్ల వీనిని ధరించిన పిదప రెండు ముతక వస్త్రాలను జోడించి ఆ సన్నని చీరపై చుట్టేవారు. పండితారాధ్య చరిత్రలో శ్రీశైల యాత్రకు వెళ్ళే పుణ్యాంగనలు
గుఱువేరి కట్నముల్ గొంగుల క్రింద
జెఱు గులు నొడి చుట్లు సిక్క నిండించి
పలుచని తొల్లుకుప్పసములు పూని
పద పడి యల తి దుప్పట్లు గొంగెడలు
వదలకుండ గ మీద వల్లరుల్ చుట్టేవారు
అని ఉన్నది.
పలుచని తోలు కుప్పసాలు ధరించి, దుప్పట్లు వంటివాటిని పలుచని వస్త్రాలు కదలకుండ చుట్టూ చుట్టేవారు.
తోలు కుప్పసాలు ధరించడం:
పలుచని తోలు కుప్పసాలు అంటే కంచుకాలు ధరించేవారని పై సందర్భాన్ని బట్టి తెలుస్తుంది. ఈ తోలు కుప్పసాలు అన్ని వర్గాల స్త్రీలు ధరించేవారు. అయితే వీటి ప్రసక్తి పండితారాధ్య చరిత్రలో శ్రీశైలయాత్ర చేసే స్త్రీల దుస్తుల సందర్భంలో చెప్పడం వల్ల, పర్వతప్రాంతంలో శివరాత్రి నాటికి చలి ఎక్కువగా ఉంటుంది కనుక తోలు కుప్పసాలు లేదా అంగీలు ధరించడం దుప్పట్లు ధరించడం వంటివి చేసేవారని ఊహించవచ్చును. ఇంక ఏ సందర్భంలోనూ స్త్రీలు ఈ తోలు కుప్పసాలు ధరించినట్లు ఇతర కావ్యాలలో లేదు. కుప్పసం కూర్పాసమన్న పదానికి వికృతి. (సూర్యరాయాంధ్ర నిఘంటువు).
ముసుగు:
ఆనాటి స్త్రీలలో చాలామంది ముసుగు ధరించేవారు. ఇది ఉత్తర హిందూస్తానీయులలో లాగా ముఖాన్ని పూర్తిగా చాటు చేసేది కాదు. మహారాష్ట్ర వనితలలాగా వెనుకనుంచి తలపై కొంగు ముసుగుగా వేసుకుంటారు. క్రీడాభిరామంలో ఒక కర్ణాటాంగన హాలికవాడకు వచ్చినపుడు ముసుగు ధరించి వచ్చింది. “ముసుగు వెట్టిననేమి ముత్యాల కమ్మల క్రొమ్మించు లీలలు గులుకరించి” – అన్న వాక్యాన్ని బట్టి ముసుగు ముఖాన్ని దాచేవిధంగా కాక, తలమీద ధరించేదని తెలుస్తున్నది.
బసవ పురాణంలో కళ్యాణకటకంలో బసవనను చూడడానికి వచ్చిన పుణ్యపణ్యాంగనలలో ఒకరు మరొక స్త్రీతో ముసు గిడి వేగరామురియక అన్నది. అంటే బయటికి వచ్చి జనసందోహంలో ఉన్నపుడు స్త్రీలు ముసుగు ధరించేవారని అర్థమౌతుంది.
తిక్కన రచించిన విరాటపర్వంలో సైరంధ్రీ వేషంలో ఉన్న ద్రౌపది రాణి సుధేష్ణ తనకై కబురు పంపినపుడు – తన తలసీర యరసి యవ్వనితా రత్నంబు వినయవైభవము శ్రీరూపం దాల్చినదా యన్నట్లు సుధేష్ణ వద్దకు వచ్చింది. అంటే సైరంధ్రి జాతిస్త్రీలు కూడా తలపై ముసుగు ధరించేవారని తెలుస్తున్నది. అయితే వీరెవ్వరూ ముస్లిం వనితలలాగా ముఖాన్ని కప్పే పరదా వంటిది ధరించలేదు. కనుకనే సైరంధ్రి రూపాన్ని సుధేష్ణ దూరం నుండి చూచి ఆమె రూపసౌందర్యానికి ముగ్ధురాలై పిలిపించింది.
కర్ణాంటాంగన, సైరంధ్రి, కళ్యాణ కటకంలోని స్త్రీలు వీరెవ్వరూ అచ్చమైన ఆంధ్రవనితలు కారు. బహుశా ఈ జాతులవారు తలపై కొంగు ముసుగుగా ధరించేవారు కావచ్చు. కాకతీయుల నాడు ఆంధ్రదేశంలో రకరకాల ప్రదేశాల నుండి జనం వచ్చి తెలుగుదేశంలో స్థిరపడ్డారు. వారి ఆచారాలను వారి వస్త్రధారణ ఇక్కడి ప్రజలకంటే మొదట భిన్నంగా ఉండి క్రమక్రమంగా ప్రాంతీయ జనుల ఆచార వ్యవహారాలతో వస్త్రధారణ మొదలైనవానితో కలిసిపోయి రెండు జాతుల మధ్య సాధారణంగా జరిగే ఆదాన ప్రదానాల వల్ల ఈ ముసుగు, పరదా పద్ధతి వంటివి ఆంధ్రదేశంలోని స్త్రీలలో కూడా ప్రాచుర్యం పొంది ఉంటాయి. ఆధునిక కాలంలో ఉత్తర హిందూస్థానీయులు ధరించే షేర్వాణీ, కుర్తా, పైజామా వంటివి దక్షిణ దేశీయులు, కేరళ స్త్రీలు ధరించే లుంగీ వంటివి ఉత్తరదేశ స్త్రీలు ధరించడం ఇప్పుడు ఉన్నట్లే ఆ కాలంలోనూ వివిధ ప్రాంతాల ప్రజలు ఒకచోట నివసించడం జరిగినపుడు ఒక ప్రాంతము వారి వస్త్రధారణ మరొక ప్రాంతమువారు సౌకర్యము కోసం ధరించడం జరిగింది. ఈ విధంగా కాకతీయులనాటి స్త్రీల వేషభూషాదులలో ఆనాటివారి భిన్న సంస్కృతుల మేళగింపు ప్రతిబింబించినదని చెప్పాలి.
(సశేషం)