Site icon Sanchika

‘కాకతీయ యుగంలో స్త్రీల సామాజిక స్థితిగతులు – ఒక పరిశీలన’ -28

[డా. మంత్రవాది గీతా గాయత్రి గారు 1995లో పిహెచ్‍డి పట్టా కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖకి సమర్పించిన సిద్ధాంత వ్యాసాన్ని సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము.]

ఉపసంహారం

[dropcap]కా[/dropcap]కతి అనే స్త్రీ దేవత కులదైవంగా ఆరాధించిన కాకతీయవంశం అంతరించి పోయే దశలో విరియాల కామసాని ప్రయత్నంతో పునఃస్థాపించబడింది. కాకతి రెండవ ప్రోల, రుద్రదేవ, గణపతి దేవుల వంటి రాజుల రాజనీతితో ప్రఖ్యాత సామంత వంశాలతో వైవాహిక సంబంధాల ద్వారా సామ్రాజ్యాన్ని విస్తరింపజేసుకొని సుస్థిరమైన ప్రభుత్వాన్ని నెలకొల్పటం, కొడుకులు లేనందువల్ల కూతురే వారసురాలై విశాల సామ్రాజ్యాన్ని ఏలేందుకు అనుకూల పరిస్థితులు నెలకొల్పడం అనే కారణాల వల్ల ఆ కాలంలో స్త్రీలకు రాజకీయంగా ప్రాముఖ్యం లభించింది. కోటగణపాంబ, చాగి ముప్పలదేవి, బయ్యలదేవి, రాణి పండాంబిక వంటి స్త్రీలు మహామండలేశ్వరులుగాను, విర్యాల నాగసానమ్మ, మహాదేవి వంటి స్త్రీలు మహాసామంత, దండనాయకురాలు వంటి పదవులు నిర్వహించారు. శూరత్వంలో పురుషులకి తీసిపోనివిధంగా యుద్ధం చేసిన వీరనారులు రాణి రుద్రమ, నాయకురాలు నాగమ, నాట్యకళలో ప్రవీణలై జగద్విఖ్యాతిగాంచిన జయదేవకవికి ప్రేరణ నిచ్చిన పద్మావతి వంటి నర్తకీమణులు ఆ కాలానికి చెందినవారే.

ఆ కాలంలో అధిక సంఖ్యలో స్త్రీలు దానాలు చేసి శాసనాలు వేయించారు. రాజ, సామంత వంశాల స్త్రీలు, సామాన్య స్త్రీలు, సానులు, భోగస్త్రీలు, అందరూ తమ ధనం నుంచి దేవాలయాలు, సత్రాలు, మఠాలు నిర్మించడం, తటాకాలు, కుంటలు తవ్వించడం, చలివేంద్రాలు పెట్టించడం వంటివి చేసి రాజ్యాన్ని సుభిక్షంగా సస్యశ్యామలంగా చేయడంలో తోడ్పడ్డారు. కాకతీయుల కాలంలో, ముఖ్యంగా గణపతిదేవుని కాలంలో స్త్రీలు అధిక సంఖ్యలో దానాలు చేశారు. తమ పుట్టినింటికి, మెట్టినింటికి కీర్తి గడించి పెట్టారు. స్త్రీలకు పురుషులతో సమాన ప్రతిపత్తి నిచ్చిన వీరశైవం మరణించిన భర్త పేరుమీద శివలింగ ప్రతిష్ఠ చేయడం ద్వారా సహగమనం చేసే దురవస్థ తప్పించడం, స్త్రీధనం ఉండడం, వృత్తుల ద్వారా జీతాలు, మాన్యాలు లభించడం వల్ల ఆర్థిక స్వాతంత్య్రం కలిగిఉండడం, దానికి కారణాలు అని చెప్పవచ్చు. ఈ దానాల ద్వారా వారి పేర్లు, వారి వంశాల పేర్లు చిరస్థాయిగా నిలిచిపోతాయని భావించడం కూడా ఒక కారణమేనని చెప్పాలి.

కాకతీయుల నాటి సమాజంలో కులస్త్రీలు, వేశ్యలు, సానులు, భోగస్త్రీలనే నాలుగు వర్గాలవారి జీవన విధానం భిన్నంగా ఉండేది. భోగస్త్రీలు కులస్త్రీలకంటే భిన్నంగా, వివాహం కాని భార్యలుగాను, వేశ్యల కంటే భిన్నంగా ఉండేవారు. వారు దేవాలయాన్ని ఆశ్రయించుకొని దైవసేవకు, దేవాలయానికి సంబంధించిన అంగరంగ భోగాది పూజాసేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ భక్తులిచ్చే దానాలను పరిరక్షిస్తూ స్థానపతి, శ్రీకరణం వంటి దేవాలయాధికారులతో సమాన ప్రతిపత్తిని కలిగి ఉండేవారు. వేశ్యలలాగా కళలను నేర్చినా పూర్తిగా దేవునికే అంకితమై, మాన్యాలను పొంది, వంశపారంపర్యంగా వృత్తులను కొనసాగించే హక్కును పొంది ఉండేవారు. వివాహితలైన ఆ స్త్రీలను వారి కుటుంబాలలో పురుషులు గౌరవంగా సుపుత్రి, కులదీపకురాలు అని మన్నించేవారు. భోగస్త్రీలు తాము నమ్ముకున్న పురుషునే భర్తగా ఎంచేవారు. అతడు మరణించినపుడు వైధవ్యం పాటించేవారు. అతని ధర్మార్థం దానాలు చేసేవారు. వీరికి కులసతికిచ్చిన గౌరవం ఇచ్చి దేవి, ద్వితీయ లక్ష్మీసమానురాలు అని ఆనాటి వారు గౌరవించేవారు. వేశ్యలు కూడా సర్వకళా పాండిత్యం సంపాదించి, సంఘంలో ఏ శుభకార్యమైనా వారు పాల్గొనేవారు. అన్ని వర్గాల స్త్రీలు సమాజంలో సమానస్థాయి ననుభవించారని నాటి సాహిత్యాన్ని బట్టి చెప్పవచ్చును. కులస్త్రీలను పుణ్యాంగనలనీ, వేశ్యలను పణ్యాంగనలనీ, వీరందరినీ జంటగా పుణ్యపణ్యాంగనలనీ సాహిత్యంలో పేర్కొనేవారు. పట్టాభిషేకం, వివాహమహోత్సవాల నుంచి సహగమన కార్యక్రమం వరకు అన్ని శుభకార్యాలలోనూ పుణ్యస్త్రీలతో పాటూ వేశ్యలూ పాల్గొనేవారు. కులస్త్రీలు, భోగస్త్రీలు, పుణ్యస్త్రీలు, పణ్యస్త్రీలు ఒకనాణానికి బొమ్మా, బొరుసూ వంటివారని చెప్పవచ్చును. వేశ్యలు ఈనాటి వారివలె నీచంగా చూడబడడంగానీ, దయనీయమైన స్థితిలో ఉండడంగానీ లేదు. వైభవోపేతమైన జీవితం గడుపుతూ సాంఘిక, సాంస్కృతిక కార్యకలాపాలలో ప్రధానపాత్ర వహించేవారు.

ఆనాటి న్యాయసభలలో కులస్త్రీలకు ప్రవేశం ఉన్నప్పటికీ భర్త వల్ల గానీ ఇతర పురుషుల వల్ల గానీ అన్యాయం జరిగితే వారికి న్యాయసభలలో చెప్పుకొనే అవకాశం ఉన్నా సంఘం హర్షించేది కాదు. ఆమెకు దేనికైనా భర్త అనుమతి కావాలి. ఈ విషయంలో వేశ్యలే మెరుగ్గా ఉండేవారు. వారికి ప్రత్యేకంగా జారధర్మాసనాలుండేవి. అన్యాయం జరిగినప్పుడు వారు రాజసభలోనూ చెప్పుకోవచ్చు. వేశ్యలను మోసగించినవారూ, బలాత్కారం చేసిన వారూ కూడా ఆనాడు నష్టపరిహారం చెల్లించవలసి వచ్చేది.

పరస్త్రీని చెడుదృష్టితో చూసినా, చెడు తలపుతో సమీపించి అసభ్యంగా ప్రవర్తించినా ఆ పురుషుడికి శిక్ష ఉండేది. కానీ స్త్రీని నిందించేవారు కాదు. పరనారీ సహోదర, పరస్త్రీ వర్ణిత పరాంగనాపుత్ర, పరాంగనా పరాంగ్ముఖ అనే బిరుదులు రాజులు, మండలేశ్వరులు తమ ప్రశస్తిలో గర్వంగా చెప్పుకొనేవారు. బలాత్కారం చేసిన పురుషులకు అతితీవ్రమైన శిక్షలుండేవి. తప్పుచేసిన స్త్రీలకూ, పురుషులకూ కూడా దండన ఉండేది. స్త్రీలను అవమానించే విధంగా ఉండే బూతు మాటలాడే వారికి కూడా దండన, (జరిమానా) శుల్కం ఉండేవి.

కులస్త్రీలకు పాతివ్రత్యం పరమధర్మమని ఒకవైపు పురాణాలు బోధించినా స్త్రీపురుష సమానత్వాన్ని ప్రతిపాదించిన వీరశైవం స్త్రీలకు భావస్వాతంత్ర్యాన్ని, వాక్స్వాతంత్ర్యాన్నీ దానధర్మాల విషయంలో స్వాతంత్ర్యాన్ని ప్రోత్సహించింది. భర్తకు ఎదురు సమాధానం చెప్పరాదనే పురాణాలకంటే అన్యాయం జరుగుతూంటే భర్తను ధిక్కరించే స్వాతంత్ర్యాన్నిచ్చిన వీరశైవం స్త్రీలను ఎక్కువగా ఆకర్షించిందని చెప్పవచ్చు.

కుటుంబంలో స్త్రీ తల్లిగా అతి ప్రధానమైన పాత్ర వహించేది. ఆనాడు తల్లిని ఎంతగా గౌరవించేవారంటే కొడుకులు తమ పేర్లకు ముందు తమ తల్లి పేరు చెప్పుకునేవారు. కొన్ని వంశాలు ప్రసిద్ధి చెందిన స్త్రీల పేర్ల మీదే చలామణీ అయినాయి. తల్లి పేరే కాక పెంచిన తల్లి పేరు కూడా తమ పేర్లకు ముందు చెప్పుకొన్న కొడుకులు ఆనాడు ఉన్నారంటే వారు తల్లులకు ఎంత గౌరవమిచ్చేవారో గ్రహించవచ్చును. ఆనాటి కుటుంబాలో స్త్రీలు పురుషులతో సమానమైన ప్రాముఖ్యాన్ని అధికారాన్ని పొందడం వల్ల అందరూ పరస్పరం అభిమానంతో మెలిగేవారు. ఈనాడున్న అత్తాకోడళ్ళపోరు ఆనాడు ఉండేది కాదు. భార్యగా భర్తకు సలహా చెప్పడం, ప్రోత్సహించడం, తప్పుచేసినపుడు విమర్శించడం ఆనాటి స్త్రీలు నిస్సంకోచంగా చేసేవారు. బహుశా బాల్యవివాహాలు దీనికి కారణం అయివుండవచ్చు. అతి చిన్నవయసులోనే అత్తవారింట అడుగుపెట్టిన స్త్రీ మెట్టినింట్లో సులువుగా కలిసిపోయేది. అత్తాకోడళ్ళు తల్లీకూతుళ్ళలాగా ఆప్యాయంగా ఉండేవారు.

కూతురికి కూడా కుటుంబంలో ఉచితస్థానముండేది. ఈనాటివారిలాగా ఆడపిల్ల పుట్టడాన్ని ఆనాడు గర్హించలేదు. సుపుత్రి, కులదీపకురాలు, ‘కులభూషణమ’ని స్త్రీని మన్నించి ప్రశంసించినవారు ఉన్నారు. సహగమనం రాజకుటుంబాలలోనూ, క్షాత్రధర్మాన్ని స్వీకరించిన ఇతర కులాల్లోనూ ఉన్నా తక్కువగానే ఉండేది. సహగమనమైనా, వైధవ్య జీవనం గడపాలన్నా నిర్ణయించుకొనే హక్కు స్త్రీలకే ఉండేది. తరువాతి కాలాలలో లాగా సహగమనం బలవంతంగా జరిగేదికాదు. భర్త మరణిస్తే స్త్రీలు పునర్వివాహం చేసుకోవచ్చు అని ఆనాటి ధర్మశాస్త్రాలు అనుమతించినా అగ్రవర్ణాలవారు పునర్వివాహం చేసుకునేవారు కాదు.

ఆ కాలంలో స్త్రీలకు బాల్యంలోనే వివాహాలు చేసేవారు. ఎక్కువగా పెద్దలు ముఖ్యంగా తండ్రి నిర్ణయించిన వరుడితోనే స్త్రీకి వివాహం జరిగేది. మేనరికాలు ఉండేవి. స్వయంవరం ధర్మశాస్త్రరీత్యా అంగీకరింపబడినా కాకతి గణపతి సోదరిమేలమాంబ లాగా స్వయంవరం చేసుకున్నవారు అరుదు. రాజకుటుంబాలలో రాజకీయ సంబంధాలు బలపరచుకోవడానికి వివాహాలు జరిగేవి. రాజకీయంగా అనుకూలంగా ఉంటే తప్ప సాధారణంగా తమ కులం వారినే వివాహాలు చేసుకునేవారు. బహు భార్యత్వం రాజకుటుంబాల్లో ఉన్నా తక్కువే అని చెప్పాలి. కులపత్ని ఒకరు ఉండగా భోగస్త్రీలు ఇతర పత్నుల స్థానాన్ని పొందేవారు. వివాహసమయంలో అల్లుడికి మామ అరణం ఇచ్చేవాడు. అల్లుడు మామకు ఉంకువ ఇచ్చేవాడు. పెళ్ళికూతురికి తండ్రి స్త్రీధనంగా (హరిద్రార్థం) తన శక్త్యానుసారం కానుకలిచ్చేవాడు. స్త్రీకి తన స్త్రీధనాన్ని ఖర్చు పెట్టుకునే హక్కు, దానంచేసే హక్కు ఉండేవి. వరకట్నం అన్నది ఆ కాలంలో ఉండేది కాదు. అల్లునికిచ్చే అరణమైనా పెళ్లికూతురి తండ్రి తన ఇష్టానుసారం ఇచ్చేవాడుకానీ ఈనాటి వారిలాగా వరుని అర్హతలను బట్టి అంచనా వేయడం, బేరం చేయడం ఉన్నట్లు ఆధారాలు లేవు.

ఆ కాలంలో రాజసామంత కుటుంబాలలో స్త్రీలు రాజనీతి, యుద్ధవిద్య, అశ్వారోహణం, గజసాధన వంటి విద్యలను నేర్చేవారు. సంస్కృతం వంటి సాంప్రదాయక విద్యనేర్చిన రాజవంశాల స్త్రీలు ఉండేవారు. అభినవ సరస్వతి అన్న బిరుదు సంపాదించిన స్త్రీలుండేవారు. వేశ్యలు, ఇతర వర్గాల స్త్రీలు సంగీతం, నాట్యం వంటివి నేర్చేవారు. అన్ని రకాల వాద్యాలు నేర్చేవారు. నృత్య సంగీతాలలో మార్గదేశీ భేదాలు నేర్చిన కళాకోవిదలు రాజాస్థానాలలో దేవాలయాలలో ఉన్నతశ్రేణి కళాకారులుగా సన్మానాలు, మన్ననలు, బహుమతులు పొందేవారు. పురవీధుల అలంకరణ, శరీరాలంకరణ, సౌందర్యపోషణ ప్రత్యేక కళలుగా నేర్చి వృత్తులుగా చేపట్టి ధనం సంపాదించేవారు. ఎవరు ఏ వృత్తుల నభ్యసించినా, విద్యనేర్చినా ఎనిమిదవ ఏట నుంచే ప్రారంభం చేసేవారు. దేవాలయాలే సంగీత నృత్త వాద్యాది కళలు నేర్పే విద్యాలయాలుగా ఉండేవి. దేశి సంగీత నృత్యాలకు మాన్యత లభించింది. ఎఱుక స్త్రీలు ఇతర ఆటవిక స్త్రీలు ఇతర నిమ్న కులాలవారు పాడే గీతాలకు నృత్యాలకు కావ్యగౌరవం నన్నెచోడ, పాల్కురికి సోమనాధ, జాయపసేనాని, శ్రీనాధుని వంటి కవులు కల్పించి వారి కళలను చరిత్రలో చిరస్థాయిగా నిలిపారు. ఆనాటి స్త్రీల కళలన్నీ ఈనాడు మనం గర్వంగా చెప్పుకొనే ఆంధ్ర సంస్కృతిని సుసంపన్నం చేశాయని చెప్పాలి.

ఈనాటి రాజకీయ రంగంలాగే మధ్యయుగంలో మతం అతి కీలకమైన స్థానాన్ని ఆక్రమించింది. కాకతీయుల కాలంలో ప్రాచీన కాలంనుంచి ఉన్నవైదిక, జైన, బౌద్ధమతాలకు ప్రాచుర్యం తగ్గింది. సంఘంలో అధిక సంఖ్యాకులైన స్త్రీలను, శూద్రులను ఆకర్షించేందుకు మతాలు వారికి అనుకూలంగా తయారయినాయి. అందులో శైవమతం శాఖలైన కాలాముఖం, పాశుపతం, వీరశైవం, స్త్రీలకు, శూద్రులకు ప్రాధాన్యాన్నిచ్చాయి. కాకతీయ చక్రవర్తులు శైవాన్ని అభిమానించారు. దానివల్ల స్త్రీల పరిస్థితి కూడా మెరుగుపడింది. ఆ కాలంలో దేవాలయాలు సంఘజీవనంలో అతి ముఖ్యమైన పాత్ర వహించాయి. ఆధ్యాత్మిక చింతనకే కాక, ఎన్నో కళలకు, విద్యలకు, వృత్తులకు ఆధారభూతమైనాయి. ఆనాటి దేవాలయాలు ఈనాటి చలనచిత్ర పరిశ్రమలాగా ఎంతో మంది కళాకారులను, వృత్తిపనివారినీ పోషించేవి. ఈనాడు ప్రేక్షకుల వల్ల చలన చిత్ర పరిశ్రమకు ధనం లభించినట్లు ఆనాడు భక్తుల దానాలవల్ల దేవాలయాలు అగ్రహారాలను, క్షేత్రాలను, మఠాలు, సత్రాలు ఆరోగ్యశాలలున్న గ్రామాలతో వైభవంగా ఉండేవి. స్త్రీలకు దేవాలయాలలో రకరకాల సేవలు, వృత్తులు చేసే అవకాశం లభించింది. జీతాలు మాన్యాల విషయంలో స్త్రీలు పురుషులతో సమానంగా ఉండేవారు. సహగమనాల సంఖ్య తగ్గించడంలో శైవమతం ఎక్కువ దోహదం చేసింది. స్త్రీలకు వ్యక్తిత్వ వికాసానికీ, ఆర్థిక స్వాతంత్ర్యానికి శైవమతం తోడ్పడింది. సంతానం కోసం పురుషులు యజ్ఞయాగాదులు చేసే పరిస్థితి నుంచి స్త్రీలే నోములు నోచే ప్రయత్నాలు చేయడంలో సంతానోత్పత్తి విషయంలో స్త్రీకి ప్రాముఖ్యం లభించింది. ఈ విషయంలో శైవవైష్ణవ మతాలు స్త్రీలు తరతరాలుగా చేస్తున్న ఎన్నో నోములు, పూజలకు ప్రోత్సాహం ఇచ్చి రకరకాల వ్రతాల ద్వారా స్త్రీలనూ, శూద్రులనూ ఆకర్షించాయి. అధిక సంఖ్యలో శైవ దేవాలయాలకు దానాలివ్వడం, అగ్రహారాలు, మఠాలు, సత్రాలు, చెరువులు నిర్మించడం వంటి ప్రజోపయోగ కార్యక్రమాలు ప్రోత్సహించడం వల్ల పురుషుల ప్రమేయం లేకుండా స్త్రీలే స్వయంగా సప్తసంతానాలు పొందే ప్రయత్నాలు చేసేవారు. కులస్త్రీలే కాక వేశ్యలు కూడా సౌభాగ్యం కోసం నోములు నోచేవారు. అన్ని వర్గాల స్త్రీలు సమూహాలుగా, తీర్థయాత్రలు చేసేవారు. మతసభల్లో, భక్త కూటువలలో పాల్గొనేవారు. ఈ విధంగా పురుషులతో సమానస్థాయిని స్త్రీలకిచ్చిన శైవమతం కాకతీయ రాజుల ప్రాపకాన్ని సంపాదించి అత్యున్నత స్థితిని అనుభవించింది.

స్త్రీలు రకరకాల వృత్తులు చేసి ఆర్థిక స్వాతంత్ర్యాన్ని కలిగి ఉండేవారు. దేవాలయాలలో వారికి అనేక రకాల సేవల ద్వారా జీతాలు, మాన్యాలు లభించేవి. సంగీత నృత్యాది కళలే కాక, ఛత్ర చామర, తాంబూల కరండవాహికలు గాను, దేవాలయాలు అలికి ముగ్గులు పెట్టే వృత్తులు స్వీకరించి కూడా మాన్యాలు సంపాదించేవారు. కలయంపి లేదా కళ్ళాపు జల్లడం అన్న పనికి మ్రేక అనే పేరుండేది. (శాసనాలలో కనిపించే ఈ మ్రేక అనే శబ్దానికి నిఘంటువులలో అర్థాన్నివ్వలేదు. కానీ నన్నెచోడుడు చేసిన ప్రయోగం శాసనాలలో ప్రయోగించిన సందర్భాలను బట్టి మ్రేక అంటే కలయంపి లేదా కళ్ళాపు అని అర్థనిర్ణయం చేయవలసి వచ్చింది) ముగ్గులు పెట్టడం కళే కాదు ఒక వృత్తిగా కూడా ఉండేది. దేవాలయాలలో, రాజాస్థానాలలో రామాయణ భారతాది కథలు చెప్పే స్త్రీలుండేవారు. తెలిక స్త్రీలు స్వయంగా గానుగను తిప్పి నూనెను తీసేవారు. సంపెంగనూనె, సుసరభేత్తు వంటి స్త్రీలు ఉపయోగించే సౌందర్య పోషక వస్తుసామగ్రిని స్త్రీలే అమ్మేవారు. దొమ్మరి, గొరగ, మాల జాతిస్త్రీలు తమ ఆటపాటల ద్వారా నేర్పుచూపి ధనాన్ని గడించేవారు. కొద్దిమంది అగ్రకులాల స్త్రీలు తప్ప అందరూ ఏదో ఒక వృత్తినీ, కళనూ చేపట్టేవారు. భూస్వామ్యం రాజరిక వ్యవస్థ మూలంగా భోగలాలసత్వం, సుఖజీవనం అలవాటైన ధనిక కుటుంబాల వారి గృహాలలో దాదులుగా దాసీలుగా ప్రసాధికలుగా, చెలికత్తెలుగా రకరకాల పనులు చేసేవారు. దానికి వారికి జీతభృత్యాలుండేవి. దాసీవృత్తి చేసేవారు దయనీయమైన స్థితిలో ఉండేవారుకాదు. వారు చేసే పనిని బట్టి యజమానుల అంతస్తు అనుగ్రహాన్ని బట్టి వారికి జీవనభృతి గడిచేది. దాదులుగా ఉన్నవారికి మాన్యత ఉండేది. దాసీలలో ప్రసాధికలు, చెలికత్తెలు వంటివారు ఎన్నో కళలు నేర్చి తమ కళల ద్వారా యజమానుల అనుగ్రహానికి పాత్రులయేవారు.

దేవాలయ వృత్తులు మాన్యాలు, ఆ సేవలు కుటుంబంలో ఎవరు కొనసాగిస్తే వారికే లభించేవి. ఎవరి ద్వారా వృత్తులు సంక్రమిస్తాయో, వారి పేర్లు వారి వారసుల పేర్లకు ముందు చెప్పుకునేవారు. స్త్రీలకు స్త్రీధనమనేది ప్రత్యేకంగా ఉండేది. ఇది తల్లి నుంచి కూతురికి, కూతురి కూతురికి సంక్రమించేది. ఋణం విషయంలో కూడా భార్యాభర్తలు ఒకరికొకరు బాధ్యులు కారు. భర్త చేసిన అప్పు భార్య, భార్య చేసిన అప్పు భర్త తీర్చవలసిన అవసరం లేదు. ఆస్తిలో భాగం ఉన్నప్పుడే అప్పు తీర్చడంలో కూడా భార్యకు బాధ్యత ఉంటుంది. వ్యసనాల వల్ల స్త్రీలోలత్వం వల్ల చేసిన అప్పులు తీర్చవలసిన బాధ్యత భార్యకు లేదు. స్త్రీలు చేసే ఏ వృత్తిమీద పన్ను విధించినట్లు ఆధారాలు లేవు. దేవాలయ వృత్తులవారికి దేవాలయాల నుండి సర్వమాన్యంగా, సర్వకర పరిహారంగా అంటే ఏ పన్నులు విధించకుండా లభించిన భూముల నుండే జీతభత్యాలు మాన్యాలు లభించేవి కనుక బహుశా వారెవరూ పన్ను చెల్లించవలసిన అవసరంలేదు. కానీ పొరుగు రాజ్యమైన కర్ణాటక దేశంలో దేవాలయ సేవలవారు పన్నులు చెల్లించేవారని తెలియడం వల్ల ఇక్కడి స్త్రీలకు పన్ను కట్టవలసిన బాధ్యత లేదని, ఆ కారణంగానే పొరుగు ప్రాంతాల నుంచి క్రీడాభిరామం కావ్యంలో చెప్పబడిన కర్ణాట వేశ్య వంటి వారు ఓరుగల్లు చేరి ఉంటారని ఊహించడమైంది. ఏమైనా ఆర్థికంగా ఈనాటివారికన్నా ఆనాటి స్త్రీలు మేలుగా ఉన్నారని చెప్పాలి.

ఆనాటి స్త్రీలు అలంకార ప్రియలని, రకరకాల ఆభరణాలను ధరించేవారని తెలుస్తుంది. సంపన్నుల నుంచి సామాన్యుల వరకు నాగరికుల నుంచి ఆటవికుల వరకు అందరు స్త్రీలు భూషణాలు ధరించేవారు. ధనవతులైన స్త్రీలు విలువైన మణులు, రత్నాలు పొదిగిన బంగారు ఆభరణాలు ధరిస్తే లేనివారు రకరకాల గాజు పూసలు, సంకుపూసలతో చేసిన ఇత్తడి, కంచు, రాగి వంటి లోహాలతో చేసిన ఆభరణాలు ధరించేవారు. మట్టెలు వివాహిత స్త్రీలే కాక అవివాహితలు, విలాసినులు మగవారు కూడా ధరించేవారని తెలుస్తున్నది. ఆనాటి స్త్రీలు రకరకాల పట్టువస్త్రాలని విశేషంగా అభిమానించేవారు. స్త్రీలు ఉపయోగించే అనేక సౌందర్య పోషక సామగ్రి, సుగంధ ద్రవ్యాలు, సవరాలు, పట్టు, గాజు వంటివి దిగుమతి చేసుకొనేవారు. నర్తకీమణులు చల్లడాలను కట్టేవారు. ఆభరణాలు వస్త్రధారణ రకరకాల ప్రాంతాలవారి ఆదాన ప్రదానాలవల్ల వైవిధ్యం కలిగి ఉండేది. ముస్లిం వనితల పరదా పద్ధతిలా కాక మేలిముసుగు ఆనాటి స్త్రీలలో కొందరు ధరించేవారు. పణ్యాంగనలు కూడా మేలిముసుగు ధరించేవారు.

పై విషయాలన్నీ పరిశీలిస్తే కాకతీయుల కాలంలో అందునా గణపతిదేవుని కాలంలో శైవమతం ఉచ్చదశలో ఉన్నప్పుడు స్త్రీలు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా మంచి స్థితి ననుభవించారని, తరువాతి కాలాలలో క్రమంగా వారు అన్ని విధాలా హీనస్థితికి దిగజారి పందొమ్మిది, ఇరవై శతాబ్దాల నాటికి ఆడదై పుట్టేకంటే అడవిలో మానై పుట్టడం మేలని భావించే పరిస్థితికి వచ్చారని గ్రహించవచ్చును. ప్రభుత్వం, సంఘం స్త్రీలకు సమానమైన అవకాశమిచ్చి ప్రోత్సహిస్తే వారు ఏ రంగంలోనైనా రాణిస్తారని ఈనాడు స్త్రీలు మళ్ళీ రుజువు చేస్తున్నారు. వారిని మళ్ళీ మతం, సంప్రదాయం, పేరుతో అణగదొక్కకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వానికీ, సంఘానికీ ఉన్నది.

(సమాప్తం)

Exit mobile version