Site icon Sanchika

‘కాకతీయ యుగంలో స్త్రీల సామాజిక స్థితిగతులు – ఒక పరిశీలన’-3

[డా. మంత్రవాది గీతా గాయత్రి గారు 1995లో పిహెచ్‍డి పట్టా కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖకి సమర్పించిన సిద్ధాంత వ్యాసాన్ని సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము.]

ప్రకరణం 1 కాకతీయులు – మూడవ భాగం:

రుద్రమదేవి:

కాకతీయ గణపతిదేవుని తర్వాత అతని కుమార్తె రుద్రమదేవి రుద్ర దేవ మహారాజు అనే పేరుతో సింహాసన మధిష్ఠించింది. కాసె సర్వప్ప రచించిన సిద్ధేశ్వర చరిత్రలోనూ, ఏకామ్రనాధుని ప్రతాపరుద్ర చరిత్రలోనూ, రుద్రమదేవి గణపతిదేవుని భార్యగా పేర్కొనబడింది. వెనీసు దేశయాత్రికుడైన మార్కొపోలో మోటుపల్లిని దర్శించి గణపతిదేవుని శ్లాఘించి ఆ కాలములో ఆతని భార్య రాజ్యమేలుతున్నదని వ్రాశాడు.  ప్రతాపరుద్ర యశోభూషణానికి వ్యాఖ్య వ్రాసిన కుమారస్వామి గణపతిదేవుని మరణానంతరం ఆతని పట్టమహిషి రుద్రమ దేవి రాజ్ఞి అయినదని పేర్కొన్నాడు. విదేశీయుడైన మార్కోపోలో, ప్రజా సామాన్యంలోని గాథల నాధారం చేసుకొని ఉండవచ్చు. కుమారస్వామి వ్యాఖ్యానం మూలానికి విరుద్ధం కనుక అప్రామాణ్యమని చరిత్రకారులు నిర్ణయించారు. రుద్రమదేవి గణపతిదేవుని కూతురు అని శాసన ప్రమాణాలున్నాయి. మల్కాపుర శాసనంలో స్పష్టంగా రత్నాకరునికి లక్ష్మీవలె గణపతిదేవునికి రుద్రదేవి జన్మించినదని ఉన్నది. కోటగిరి తామ్ర శాసనంలోనూ, కొలనుపాక శాసనం లోనూ కూడా రుద్రమ గణపతిదేవుని పుత్రిక అని ఉన్నదని క్రింది శ్లోకాల వల్ల తెలుసుకోవచ్చు.

“స్వస్తి శ్రీకాకతీశో గణపతినృపతిస్తస్యశా(సా) రుద్రమాంబాపుత్రీలోకైక లీలా జని” – కోటగిరి తామ్ర శాసనం

“తత్పుత్రో గణపతి నామధేయో సంజజ్ఞే జాతా జాతాతస్య పయోనిధరివరమా శ్రీ రుద్రదేవీ సుతా” కొలనుపాక శాసనం

జుత్తిగ శాసనం లోనూ రుద్రమదేవి గణపతిదేవుని కూతురు అని స్పష్టంగా ఉన్నది.

“శ్రీమ(త్కా)కతి వల్ల భాద్గణపతి క్షీణీశ చూడామణే ర్జాతాజ్య రమేవ రుద్రమహాదేవీ (సు) రూపాన్వితా”- జుత్తిగ శాసనం.

ఆంధ్రులు అందునా స్త్రీలందరూ గర్వంతో చెప్పుకోదగిన తెలుగు ఆడపడుచు రాణీ రుద్రమదేవి. స్త్రీలు రాజ్యాధికారాన్ని పొందే అర్హత లేని ఆ రోజుల్లో గణపతిదేవుని పుత్రిక రుద్రమ కాకతీయ సామ్రాజ్యానికి అధిపతి కావడమేకాక తనను ఎదిరించి తిరుగుబాటు చేసిన సామంతులను, స్త్రీ అబల అనీ, ఆమెను ఓడించి రాజ్యాధికారం దక్కించుకోవాలని తనపైకి దండెత్తి వచ్చిన పొరుగు దేశపు శత్రువులను చీల్చి చెండాడి తన పేరును సార్థకం చేసుకొన్నది. ప్రజల క్షేమం కోరి సంక్షేమ కార్యాలను ఎన్నింటినో తలపెట్టి ప్రజలను కన్నబిడ్డలుగా పరిపాలించింది. అప్పటివరకు రాజ్యాధికారం కూతురికి వారసత్వంగా లభించడం మనదేశ చరిత్రలో లేదు. భర్త గతించిన తర్వాత రాజ్యం అల్లకల్లోలం కాకుండా, వారసులు చిన్నవారైనపుడు వారి తరపున రాజమాతలుగా రాజ్యం చేయడం శాతవాహనులు, ఇక్ష్వాకుల కాలం నుంచీ ఉన్నది. కనుకనే రుద్రమదేవిని సమకాలీనులైన మార్కోపోలో వంటి యాత్రికులు, సిద్ధేశ్వర చరిత్ర, ప్రతాప చరిత్ర వంటి అర్వాచీన గ్రంథకర్తలు గణపతిదేవుని భార్యగా భ్రమ పడ్డారు. కూతురికి వారసత్వంగా రాజ్యం సంక్రమించడం ఆనాటి ధర్మశాస్త్రాలకు విరుద్ధమైన విషయం అన్నది సత్యం. అయితే కాకతీయ సామ్రాజ్యానికి సమకాలికమైన ఢిల్లీ సామ్రాజ్యంలో ఇల్తుత్‌మిష్ అనే బానిస చక్రవర్తి కూతురు రజియా సుల్తానా తండ్రి తరువాత గద్దెనెక్కింది. రజియా సుల్తానాకు సోదరులున్నారు కానీ వారు అప్రయోజకులు, రాజ్యాన్ని పాలించే తెలివి తేటలు లేని వారని గ్రహించిన ఆమె తండ్రి ఇల్తుత్‌మిష్ అన్ని విధాలా యోగ్యురాలైన తన కుమార్తెనే సుల్తాన్ చేశాడు. ఆమె కూడా పురుషుల దుస్తులు ధరించి పురుషులకు ఏవిధంగాను తీసిపోని శూరత్వంతో రాజనీతి చతురతతో పరిపాలించింది. కాని ఆమె అంటే గిట్టని సామంతులు రజియా సుల్తానా తన బానిసను ప్రేమించినదన్న నెపంతో తిరుగుబాటు చేసి ఆమెని హతమార్చారు.

గణపతిదేవుడు తనకు సమకాలికమైన ఇల్తుత్‌మిష్ చక్రవర్తి వలె తన కుమార్తె రుద్రమదేవిని తనకు వారసురాలిగా ఎంచుకొని ఉంటాడు. మంచి రాజనీతిజ్ఞుడు కనుక ఢిల్లీ రాజకీయాలను గమనించి, సామంతులు అంగీకరించే విధంగా వారికి అనుకూలమైన పద్ధతిలోనే రుద్రమను ఏలికగా చేశాడు. రుద్రమదేవికి రాజోచితమైన రాజ్యయుద్ధ తంత్రాలను నేర్పించి, తను పరిపాలించే కాలంలోనే రాజ్యకార్య కలాపాలు రుద్రమ నిర్వర్తించేలా చేశాడు. ఆమెను యువరాజుగా నియుక్తి చేసాడు. సామంతులకు నచ్చకపోతే వారు తిరుగుబాటు చేసి ఉండేవారు. సామంతులలో తమ వంశంకంటే చారిత్రాత్మకంగా గొప్పదైన చాళుక్యుల వంశంలోని ఇందుశేఖరుని కొడుకు వీరభద్రునితో వివాహం జరిపించాడు. కానీ గణపతిదేవుడు ఎక్కువగా సామదానోపాయాలతోనే సామంతులకు నచ్చిన చక్రవర్తి అయినాడు. కనుకనే గణపతి దేవుని నిర్ణయాన్ని అధిక సంఖ్యాకులైన వారు అంగీకరించారు.

రుద్రమదేవిని సామంతులంగీకరించటానికి మరొక కారణం ఆమెకు సాక్షాత్తు పరమశివుని అవతారంగా భావించబడ్డది. విశ్వేశ్వర శివాచార్యుల అంగీకారముండటమే ఈ విషయం మనకు మల్కాపురం శాసనము (క్రీ.శ.1261) ను బట్టి తెలుస్తున్నది. రుద్రమదేవి గణపతిదేవుని ద్వారా విశ్వేశ్వర శివాచార్యునకు వాగ్దత్తమైన మందర గ్రామంతో పాటు, తండ్రి అనుజ్ఞతో వెలగపూండి అను మరియొక గ్రామాన్ని అష్టస్వామ్యములతో, పంటలతో చేర్చి దానం చేసినదని పై శాసనం వెల్లడి చేస్తున్నది. సిద్ధేశ్వర ప్రతాప చరిత్రలలో చెప్పబడిన మంత్రి శివదేవయ్యయే పై విశ్వేశ్వర శివాచార్యుడు కానీ, అతని కుమారుడు కానీ కావచ్చునని డా. చిలుకూరి వీరభద్రరావుగారు తలచినారు. నాటికి రుద్రమదేవి మనుమడు దౌహిత్రుడు ప్రతాపరుద్రుడు జన్మించాడు.

కాకతీయ వంశానికి మౌక్తికము వంటివాడని వర్ణించబడ్డ ప్రతాపరుద్రుడు రుద్రమదేవి పుత్రిక ముమ్మడమ్మకు కాకతి మహదేవునికి జన్మించినవాడు. క్రీ.శ.1261 నాటికి రుద్రమ నలభై సంవత్సరముల పైబడిన వయసు ఉండి ఉంటుంది కనుక ఆమె క్రీ.శ. 1217-27 మధ్య జన్మించి ఉండవచ్చునని ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనంగారి అభిప్రాయం.

వీరభద్రుడు నిడుదవోలు చాళుక్యుల వంశానికి చెందినవాడు. కొలనుపాక శాసనలో కాకతీయ వంశం రుద్రమదేవి వరకు, చాళుక్య వంశం వీరభద్రుని వరకు వర్ణింపబడింది. పోతినాయకుని కొలనుపాక శాసనాన్ని బట్టి చాళుక్య వీరభద్రుని తండ్రి ఇందుశేఖరుడు కొలనుపాకను పాలిస్తున్నట్లు తెలుస్తున్నది. ఇందుశేఖరుడు సేవకుడు పోతినాయకుడు దానమిచ్చినట్లు ఉన్న ఈ శాసనంలో వీరభద్రుడు కాకతి గణపతి కూతురు రుద్రమకు భర్త అయినాడని ఉన్నది. కాని ఈ శాసన కాలానికి ఆతడు జీవించి ఉన్నట్లు స్పష్టంగా లేదు. చాళుక్య ఇందుశేఖరుడు దానమిచ్చినాడనడం వల్ల బహుశా ఆనాటికి వీరభద్రుడు మరణించి ఉంటాడని చరిత్రకారులు భావించారు. వీరభద్రుని తల్లి ఉదయ మహాదేవి క్రీ.శ.1266లో పాలకొల్లులోని క్షీరారామేశ్వరునికి తన కుమారుడు వీరభద్రుని పుణ్యంకోసం అఖండదీపం కొరకు దానమిచ్చిందని పాలకొల్లు శాసనం వల్ల తెలుస్తున్నది. దీనిపై చర్చించి డా. చిలుకూరి వీరభద్రరావుగారు ఈ శాసనకాలం నాటికే వీరభద్రుడు మరణించి ఉంటాడని అభిప్రాయపడినారు. దాదాపు ఈ ప్రాంతాలలోనే గణపతిదేవుడు కూడా మరణించి ఉంటాడని ఆయన అభిప్రాయం (రెండు విషాదకరమైన సంఘటనల వల్ల శోకతప్త అయిన) రుద్రమదేవి తన భర్తతో సహగమనం చేయబోయి మంత్రి శివదేవయ్య వారించడం వల్ల రాజ్యపాలనకు అంగీకరించిందని సిద్ధేశ్వర చరిత్ర వలన తెలుస్తున్నది. అయితే సిద్ధేశ్వర చరిత్రకారుడు రుద్రమదేవి గణపతిదేవుని భార్య అని పొరపాటు పడ్డాడు. భర్త మరణం, తండ్రి మరణం దాదాపు ఒకే సమయంలో జరగడం, వైధవ్యం ప్రాప్తించిన తరువాత రాజ్యానికి అధికారి కావడం వల్ల ఈ విధంగా అర్వాచీన చరిత్రకారుడు పొరపడి ఉంటాడు. గణపతిదేవుడు కుమార్తెలిద్దరికీ రాజ్య తంత్రంలోనూ యుద్ధ కళలోనూ శిక్షణ ఇప్పించి ఉంటాడు. పుత్రులు లేకపోవడం వల్ల రుద్రమను ముందు పట్టోధర్తి (పట్టోధర్త్రి కావచ్చును) అంటే యువరాజుగా నియమించి ఉంటాడు. సామంతులకు రుద్రమ గణపతిదేవుని రాజ్యకాలంలో రాజ్యకార్యకలాపాలు నిర్వర్తించడంలో అభ్యంతరం లేకపోయింది. ఆనాడు శాస్త్రాలు దౌహితృని ఔరస పుత్రునిగా అంగీకరించినాయి. కనుక మనుమడు ప్రతాపరుద్రుడు పెద్దవాడయే వరకు రుద్రమ రాజ్యం పాలించడాన్ని కొందరు సామంతులు అభ్యంతర పెట్టలేదు. రుద్రమను రాణిగా స్వీకరించడానికి అంగీకరించని సామంతులు కొందరు స్వతంత్రత ప్రకటించుకొన్నారు. రాజ్యంలో సుస్థిరత్వం ఉండదని ఊహించిన గణపతిదేవుడు దౌహిత్రుని పుత్రునిగా దత్తత స్వీకారం చేసుకొనటానికి ఆమెను ప్రోత్సహించాడు. గణపతిదేవుడు తన సామర్ధ్యంతో విశాల సామ్రాజ్యాన్ని ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలాడు కనుక ఆ ధైర్యంతోనూ, తన సామ్రాజ్యం తన సంతానానికే చెందాలనే దృష్టితోనూ కూతురు రుద్రమను సామ్రాజ్యానికి ఏలికను చేశాడు. ఆమెను యువరాజుగా నియుక్తి చేసినపుడు సామంతులు నచ్చకపోతే తిరుగుబాటు చేసేవారు కానీ గణపతి దేవుని పై భక్తి, అతని నిర్ణయం పట్ల విశ్వాసం ఉన్న సామంతులు రుద్రమను ఏలికగా స్వీకరించారు.

రుద్రమ పరిపాలించే నాటికి పరిస్థితులు మారినాయి. సామంతులను చాలావరకు అదుపులో పెట్టినప్పటికీ తన తర్వాత తన కుమార్తెలు అంత సమర్థులు కారని ఆమె తలచి ఉంటుంది. పైగా తన రాజ్యానికి కాబోయే రాజు కాకతీయ వంశానికి చెందిన పురుషుడైతే (తాను ఎదుర్కొన్న పరిస్థితులు కాకుండా) సామంతులు, ప్రజలు అంగీకరించడం వల్ల కాకతీయ సామ్రాజ్యం సుస్థిరంగా ఉంటుందన్న ఊహ రుద్రమకు ఉండి ఉంటుంది. అందుచేతనే తన తండ్రి వలె తాను తన కుమార్తెలలో ఒకరిని తనకు వారసురాలిగా ఎన్నుకొనే సాహసం ఆమె చూపించలేకపోయింది.

రుద్రమ రాజకీయ నిపుణత, యుద్ధకౌశలం గురించి మనకు శాసనాల ద్వారా తెలుస్తుంది. ఒక రాణిగా, వ్యక్తిగా రాజమాతగా కాసె సర్వప్ప వ్రాసిన సిద్ధేశ్వర చరిత్ర, ఏకామ్రనాధుని ప్రతాప చరిత్ర, శివయోగ సారము, సోమదేవ రాజీయము మెదలైన కాకతీయ రాజుల చరిత్ర గ్రంథాల వలన తెలుస్తున్నది. ఆనాడు ఆంధ్రదేశాన్ని సందర్శించిన విదేశీ యాత్రికులు మార్కోపోలో, బర్నీ వంటి వారి వ్రాతల వల్ల రుద్రమ పరిపాలన గురించి తెలుస్తుంది. గణపతిదేవుని వార్ధక్యదశలో రుద్రమదేవి రాజ్యాధికారాన్ని చేపట్టింది. తండ్రి అండలోనే కొంతకాలం రాజ కార్యాలు నిర్వహించడం వలన మాండలికులు, సేనాపతులు విధేయులుగా ఉండేవారు. రుద్రమ సింహాసనం అధిష్ఠించగానే గణపతిదేవునికి ఇతర భార్యల వలన జన్మించిన పుత్రులు హరిహరుడు, మురారి దేవుడనే వారు తిరుగుబాటు చేసి రాజధానిని స్వాధీనం చేసుకొన్నట్లు ప్రతాప చరిత్రలో ఉన్నది. దీని గురించి శాసనబద్ధమైన, చారిత్రకాధారాలు లేకపోయినప్పటికీ స్త్రీ ఏలికగా నియుక్తురాలవటం హిందూ ధర్మశాస్త్ర విరుద్ధం కనుక రాజకుటుంబంలోని కొందరు తిరుగుబాటు చేసి ఉంటారు. ఆనాటికి నెల్లూరులో కాకతి సైన్యం పేరు ప్రతిష్ఠలు సన్నగిలినాయి. పడమటి నుండి దేవగిరి యాదవరాజు మహాదేవుడు ఓరుగల్లు పైన పెద్దయెత్తున దాడి చేసాడు. కానీ కోట స్వాధీనం కాలేదు. మొదట కోటలోనికి ప్రవేశించిన యాదవ సైనికులను రెండువైపులనుండి చుట్టుముట్టడంతో కొత్త సైన్యం అందుబాటులో లేకపోవడం వల్ల మహదేవుడు ముట్టడిని వదలి పారిపోవలసి వచ్చింది. రుద్రమదేవి స్వయంగా అశ్వంపై శత్రువును వెంబడించి పారద్రోలింది. అతడు దేవగిరి చేరేలోపున యాదవుల బెడదకోట (బీదరుకోట) ను రుద్రమదేవి స్వాధీనం చేసుకొన్నది.  మహదేవుడు తన రాజ్యం చేరుకొన్నప్పటికీ ఓరుగల్లు కోటలో చిక్కుకొనిపోయిన యాదవ సైన్యాన్ని విడిపించలేదు. యుద్ధ నష్టపరిహారంగా అసంఖ్యాకంగా బంగారు నాణాలను యాదవరాజు రుద్రమదేవికి అర్పించుకోగా ఆమె తన సైనికులకు ఆ ధనాన్ని పంచిపెట్టినట్లు ప్రతాప చరిత్రలో ఉన్నది. యాభై సంవత్సరాల క్రింద కృష్ణా మండలంలోని కైకలూరు తాలూకాలోని రాచపట్నంలో కొన్ని యాదవ రాజచిహ్నాలున్న బంగారు నాణాలు దొరకడం వలన ప్రతాపచరిత్రలో చెప్పిన వృత్తాంతం నమ్మదగినదనుకోవచ్చును. కానీ కొందరు చరిత్రకారులు కాకతీయులు యాదవులకు సామంతులుగా చాలాకాలం ఏలారు కనుక యాదవుల నాణాలు అంధ్రదేశంలో చెల్లుబడిలో ఉండి ఉండవచ్చునని అభిప్రాయ పడ్డారు. ఇదేకాక బీదరుకోటలో రుద్రమదేవి సామంతుడు సింద వంశానికి చెందిన భైరవుడనే వాడు వేయించిన శాసనంలో కాకతీయ వంశ వర్ణన రుద్రమదేవి వరకు విపులంగా వర్ణించడం వలన రుద్రమదేవి బీదరుకోటను స్వాధీనం చేసుకొని తన సామంతుని ఆ కోటకు అధిపతిగా నియమించి ఉంటుంది అని నిర్ణయించవచ్చును. ఈ ఘన విజయాన్ని పురస్కరించుకొని రుద్రమదేవి తన తండ్రి బిరుదైన ‘రాయగజకేసరి’ని స్వీకరించింది. ఈ బిరుదున్న బంగారు నాణాలు దొరకడం ఈ అభిప్రాయాన్ని బలపరిచింది. కోస్తా ప్రాంతంలో రుద్రమదేవి అధికారం తగ్గిపోయింది. క్రీ.శ.1274 లో వేంగి మీద దురాక్రమణ జరిపిన గజపతి రాజు మొదటి భానుదేవుడిని, వడ్డాది మత్స్యరాజైన అర్జునదేవుడిని ఎదుర్కొనటానికి రుద్రమదేవి పోతినాయకుడు ప్రోలినాయకుడు అనే సోదరుల నాయకత్వంలో తన సైన్యాన్ని పంపి వాళ్ళను నిర్జించింది.

రుద్రమదేవి రాజ్యం చేపట్టేనాటికే కాకతీయ సామ్రాజ్యంలో దక్షిణభాగం అంటే కంచి నెల్లూరు కడప మండలాలు చేజారిపోయినట్లయినాయి. కానీ రుద్రమ కొద్దికాలంలోనే ఈ ప్రాంతంలో మళ్ళీ తన సామంతులను నిలుపసాగింది. కడపలో ఉన్న కాయస్థ సామంతుడు జన్నిగదేవుని తర్వాత అతని తమ్ముడు త్రిపురారి నాలుగేళ్ళు సామంతరాజ్యానికి అధిపతి అయినాడు. కానీ ఆ తరువాత వచ్చిన అంబదేవుడు (క్రీ.శ.1272) మహా పరాక్రమశాలి. రాజ్యానికి వచ్చినది మొదలు కాకతీయ సామ్రాజ్ఞి అయిన రుద్రమ పైన కుతంత్రాలు పన్నడం సాగించాడు. నెల్లూరుపై దండెత్తి ఇమ్మడి తిరుకాళత్తి దేవుని ఓడించి అతని స్థానంలో మనుమగండ గోపాలుడనే చోడరాజును నిలబెట్టాడు. దీనితో నెల్లూరులో కూడా కాకతీయుల పలుకుబడి పూర్తిగా నశించింది. అంటే క్రీ.శ.1282 నాటికి కడప నెల్లూరు మండలాన్ని అంబదేవుడు స్వాధీనం చేసుకున్నాడని తెలుస్తున్నది. ఈ ఒడిదుడుకులెలా ఉన్నప్పటికీ రుద్రమదేవి విశ్వాసపాత్రులైన సేనానుల, మంత్రుల సహాయంతో చాలా సమర్ధతతో రాజ్యపాలన సాగించినదనటం సత్యం.

ఒక స్త్రీ రాజ్యాధినేత అయినచో ఇరుగుపొరుగు దేశాలవారికి చులకనగా ఉండేది. హేమాద్రి తన వ్రతఖండంలో “అయం శిశుస్త్రీశరణాగతానాం హంతా మహదేవనృపోనజాతు/ఇత్థం వినిశ్చిత్యతతోధి భీతైరంధ్రైః పురంధ్రీ నిహితా నృపత్వా” (రాజప్రశస్తి 14 శ్లో) అని వ్రాశాడు. అదే గ్రంథం అవతారికలో “యస్తస్యైవరణే జహారకరిణ స్తత్పంచ శబ్దాదికాన్/యస్తత్యాజ వధూవధాదుపరత స్తద్భూభుజాం రుద్రమాం” అని ఉన్నది. పై రెండింటినీ సమన్వయించి భండార్కరు పండితుడు ఆంధ్రులు మహదేవరాజునకు భయపడి స్త్రీని తమకు ఏలికగా చేసుకున్నారని, అంతట ఆ మహాదేవుడు పంచరత్నములను, ఏనుగులను, పంచశబ్దసాధనాలను హరించి స్త్రీ అవటం ఆమెను ప్రాణములచే విడిచి పుచ్చెనని వ్రాశారు. పైన వ్రాసిన దాని బట్టి స్త్రీలు పాలకులైనట్లయితే ఆ రాజ్యానికి, ప్రజలకు గౌరవహాని అని ఆనాటి వారి అభిప్రాయమని అనిపించక మానదు. రుద్రమ స్త్రీ కనుక ఆమెను మహదేవరాజు ఓడించినప్పటికీ చంపక ప్రాణాలతో విడిచిపెట్టినట్లు వ్రాసిన దాన్ని బట్టి ప్రాచీన యుద్ధ సాంప్రదాయాన్ని బట్టి స్త్రీని వధించలేదు అనుకునేందుకు వీల్లేదు. వాస్తవానికి ఆ విధంగా స్త్రీని సులువుగా జయించవచ్చనే చులకన భావంతో కాకతి రుద్రమ మీదికి దండెత్తిన మహదేవరాజును ఆమె ఓడించి తరిమికొట్టి ఆ యాదవరాజు చేత యుద్ధ నష్ట పరిహారంగా బంగారు నాణాలు గ్రహించింది. ఆ కాలంలో ఒక స్త్రీ చేతిలో ఓడిపోయినట్లు చెప్పుకొంటే అవమానం కనుక వాస్తవాన్ని కప్పిపుచ్చి ఆమె స్త్రీయని ప్రాణాలతో వదిలినట్లు చరిత్రను మార్చి కల్పించడమైనది. పై విషయాన్ని నిశితంగా పరిశీలిస్తే స్త్రీలను వధించరాదు, గౌరవించాలి అన్న ప్రాచీన సంప్రదాయపు ముసుగులో స్త్రీలు శక్తిహీనులు, వారిని ఓడించడం సులువు అన్న చులకన భావం వ్యక్తమౌతున్నది. ఎందుకంటే స్త్రీని ఓడించి వధించకుండా వదిలి పెట్టిన సంఘటన ఆనాడు గానీ, ఆ తర్వాత గానీ జరగలేదు. రజియా సుల్తానాను ఆమె సామంతులు వధించారు. రుద్రమదేవి యుద్ధంలో నిహతురాలైనట్లు శాసనాధారమున్నది. చందుపట్ల శాసనంలో కాకతి రుద్రమదేవి, సేనాపతి మల్లికార్జున నాయకులు శివలోకమునకేగిన సందర్భంలో వారి పుణ్యం కొఱకు వారి బంటు పువ్వుల ముమ్మడింగారు సోమనాధదేవరకు కొంత భూమిని దానం చేసినట్లు ఉన్నది.

చందుపట్ల శాసనం

  1. స్వస్తి (11) శ్రీజయా
  2. భ్యుదయ శక వర్ష
  3. వర్షంబులు 1211 విరో
  4. ధి సంవత్సర మార్గశిర
  5. శు. 12 శు (1) స్వస్తి (11) శ్రీమ
  6. న్మహా మండలేశ్వర కా
  7. కతియ్య రుద్రమ
  8. మహాదేవి శివలోకా
  9. నకు విచ్చే (స్తేని) శివలోక
  10. ప్రాప్తిగాను మల్లికార్జు
  11. నాయునింగారికి శి
  12. వలోక ప్రాప్తిగాను వారి
  13. భృ (బి) త్యులు పువుల ము
  14. ముంవుడింగారు చంద్రు ప(ట్ల)
  15. సోమనాధ దేవరకు గొస
  16. గి ఓగిరానకు

ఈ శాసనము క్రీ.శ.1289 నవంబరు నాటిది. క్రీ.శ. 1290లో పానుగల్లులో మల్లికార్జున నాయకుని కొడుకు ఇమ్మడి మల్లికార్జుననాయకుడు కుమార రుద్రదేవునికి అంటే రెండవ ప్రతాపరుద్రునికి పుణ్యము కొరకు వేయించిన శాసనమును బట్టి రుద్రమదేవి, సేనాధిపతి మల్లికార్జున నాయకుడు అని తెలుస్తుంది. రుద్రమదేవి అప్పటికి వృద్ధురాలు కనుక ఆమె యుద్ధరంగంలో యుద్ధం చేస్తున్నప్పుడు కాక సేనలకు ఉత్తేజపరచడానికి వారికి నాయకత్వం వహించి, యుద్ధ శిబిరంలో సేనాధిపతితో పాటు విడిసినప్పుడు చంపబడి ఉంటుందని డా.పి.వి. పరబ్రహ్మశాస్త్రిగారు భావించారు.

కానీ కాకతీయుల సామంతుడు కాయస్ధసేనాని అంబదేవుడు ఆ కాలంలో స్వతంత్రత ప్రకటించుకొని ఉండటం వల్ల బహుశా రుద్రమదేవి నాయకత్వం తానే వహించి సేనలను అంబదేవునిపై నడిపి ఉంటుంది. అంబదేవుడు త్రిపురాంతకంలో వేయించిన శాసనమే ఇందుకు ఆధారమని, అందులో అంబదేవుడు “సర్వాన్ ఆంధ్ర మహీపతీన్ రణముఖే జేత యశోలబ్ధవాన్” చెప్పుకోవడం వల్ల ఆ విషయం స్పష్టమౌతున్నదని, యుద్ధంలో మల్లికార్జున పతి సప్తాంగాలను హరించాడనడం వల్ల స్వామి, అమాత్య, సుహృత్, కోశ రాష్ట్ర, దుర్గ, బలములనే సప్తాంగాలలో స్వామిని అయిన రుద్రమను సంహరించినట్లు పరోక్షంగా, చెప్పుకున్నాడని శ్రీ పరబ్రహ్మశాస్త్రిగారు అన్వయించారు. దీన్నిబట్టి వృద్ధురాలైన స్త్రీని వధించడానికి జంకనివాడు ఆ విషయాన్ని చెప్పుకోవడానికి సంకోచించినట్లు దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చును.

రుద్రమదేవి యుద్ధం చేస్తూ మరణించినదా లేక పరబ్రహ్మశాస్త్రిగారు అభిప్రాయ పడినట్లు శిబిరంలో ఉన్నప్పుడు వధించిబడినదా అన్నది నిర్ణయించగల ఆధారం ఇంతవరకు దొరకలేదు. ప్రతాపచరిత్రలో రుద్రమదేవి ప్రతాపరుద్రునికి పట్టాభిషేకం కావించి శివదేవయ్యకు అప్పగించి ముప్పది ఎనిమిదేండ్లు రాజ్యం పాలించి శివలోకమునకు వెళ్ళెనని ఉన్నది కానీ, యుద్ధరంగంలో మరణించినట్లు లేదు.

రుద్రమదేవి సేనానులు, మంత్రులు రాజనీతిజ్ఞులు, శౌర్య దురంధరులు, విశ్వాసపాత్రులు కనుక ఆమె రాజ్యపాలన సుస్థిరంగా ఉండేది. ఓరుగల్లు కోటను బాగుచేసి శత్రు దుర్భేద్యంగా చేసింది. తటాకాలను నిర్మించి కాలువలు త్రవ్వించి వ్యవసాయాభివృద్ధికి తోడ్పడింది. దేవాలయ నిర్మాణం, నూతన గ్రామ నిర్మాణం చేపట్టి అభివృద్ధి కార్యక్రమాలనెన్నిటినో చేపట్టి ప్రజల చేత అంబగా కీర్తించబడింది. అంబాల పల్లి అన్న పేరుతో గ్రామాలను నిర్మించి యేలేశ్వర దేవరకు అర్పించింది. ఆమెననుసరించి ప్రజలు కూడా అంబాల అనే గ్రామాలను రుద్రమాంబ పేరు మీద నిర్మించి ఆమె పై తమకుగల భక్తిని చాటుకున్నారు. ప్రజాక్షేమం శ్రీ సంక్షేమం కొరకు రుద్రమ అనుసరించిన విధానాలు (మల్కాపుర శాసనాన్ని బట్టి) ఈ నాటికీ మనకు శిరోధార్యాలు, ఆదర్శప్రాయాలు. ఆ శాసనాన్ని బట్టి గోళకీ మఠం ఆధ్వర్యంలో ప్రసూతి ఆరోగ్య వైద్య శాలలుండేవి. పుత్రులు లేని స్త్రీలు తమ భూములకు సంబంధించిన పనులను ఇతరుల చేత చేయించి భూములను, తోటలను అనుభవించడానికి వీలుండేది. ప్రతి ఒక్కరు తమ తమ విధులను సక్రమంగా నిర్వర్తించి నంత వరకు వృత్తులుండేవి. అంటే విధులను సరిగా నిర్వహించని వారి వృత్తులను రాజు వెనుకకు తీసుకొనే వాడు. శ్రీనాధుని కాశీ ఖండంలోని గుణనిధి కధలో ఈ విషయమే ప్రసక్తమైంది. అంటే ఆ రోజుల్లో ప్రతివారు తమ తమ విధులను నిర్వహించడంలో అప్రమత్తతతో ఉండేవారు అని తెలుస్తున్నది.

రుద్రమదేవి చేపట్టిన ఇంకొక సంస్కరణము నాయంకర విధానము. సామంతులందరూ చక్రవర్తి కొరకు ప్రత్యేకమైన సైన్యాన్ని నిర్వహించే బాధ్యత స్వీకరించాలి. ఈ సైన్యం చక్రవర్తికి యుద్ధ సమయంలో ఉపయోగిస్తుంది. ఈ సైన్య పోషణకి చక్రవర్తి ప్రత్యేకంగా కొన్ని ఊళ్ళను ఆయా నాయకులకు ఇచ్చేవాడు. సైన్య పోషణేగాక క్రమానుసారం నాయకులు కప్పం కూడా కట్టాలి. ఈ విధానాన్నే నాయంకర విధానమనే వారు. దీనివల్ల చక్రవర్తికి యుద్ధ సమయంలో తనకు ఎంత సేన సిద్ధంగా ఉన్నదో తెలిసే వీలున్నది. రుద్రమ ప్రవేశ పెట్టిన ఈ విధానం ప్రతాపరుద్రుని కాలంలో కూడా అమలు జరుపబడింది. ఈ విధానాన్ని అనుసరించడానికి ముందు చక్రవర్తులు తమ సామంతుల అండదండలపైన వారికి తమ పట్లగల భక్తి విశ్వాసాల పైన ఆధారపడేవారు. ఏ యుద్ధంలో ఏ సామంతుడు ఎంత సైన్యాన్ని పంపగలడో ముందు అంచనా వేయగలిగేవారు కారు. గణపతిదేవ చక్రవర్తి సామదానోపాయాల తోనూ, ప్రజలను సామంతులను తనకు అభిమానులుగా చేసుకొన్నవాడు. రుద్రమ స్త్రీ కావడంతో అదను చూసుకొని తిరుగుబాటు చేసే సామంతులు ఉండేవారు. రుద్రమ కేవలం తన భుజశక్తి తోనే సామంతులను తనకు వశవర్తులుగా చేసుకొన్నది. సామంతులతో వివాహ బాంధవ్యాలను పెంచుకోలేదు. కనుక రుద్రమ విజయాలకు ఈ నాయంకర విధానం, దుర్భేద్యమైన కోట, సుశిక్షితమైన సైన్యం, విశ్వాసపాత్రులైన మంత్రులు, సేనానులు, అన్నిటిని మించి ఆమె రణ కౌశలం కారణాలు అని చెప్పవలసి ఉన్నది.

క్రీ.శ.1246 లోనే రుద్రమాంబ రుద్రదేవమహారాజనే పేరుతో వ్యవహరింపబడినదని ఆమె యేలేశ్వర శాసనం వల్ల తెలుస్తున్నది. యేలేశ్వరంలోని ఈ కాలపు శాసనాలని బట్టి క్రొత్తలూరు, గుమ్మలూరు ఈపూరు, అంబాలపల్లి, కాలువలు, ఒక చెరువు యేలేశ్వర పండితునికి దానం చేసినట్లు తెలుస్తున్నది. ఈ యేలేశ్వర పండితుడు వివిధ ప్రాంతాలమధ్య అనగా వేగినాడు, వెలనాడు, మలికినాడు వంటి ప్రాంతాల బ్రాహ్మణుల మధ్య వివాహ సంబంధాలను నిషేధించినవాడు.

రుద్రమ తాను మాత్రం వివాహాది విషయాల్లో కులానికి ప్రాముఖ్యత ఇచ్చినట్లు కనబడదు. ఆమె పెద్ద కుమార్తె ముమ్మడమ్మ కాకతి మహదేవుని వివాహమాడింది. రెండవ కుమార్తె రుద్రమ యాదవ వంశానికి చెందిన జైతుగి భిల్లమ వంశానికి చెందిన ఎల్లణదేవుడనే రాజకుమారుని వివాహమాడింది. ఈ ఎల్లణ దేవుడు రుద్రమ దేవి అనుగ్రహం వల్లనే రాజ్యం సంపాదించానని, ఆమె రెండవ కుమార్తె రుద్రమను వివాహమాడానని ఆలపాడు తామ్ర శాసనంలో చెప్పుకొన్నాడు.

“..అస్యారుద్రమదేవ్యాః కృపయా దే
శం సమాసాధ్య! నిజభార్యాయాః కాకతి రుద్రమ (దేవిద్వితీ)
య తనయాయాః పుణ్యార్ధమయుగ్మాంతర పంచాశత్భాగ కల్పన
యా సహితం సర్వైర్భోగైర్విప్రేభ్యః!”

మూడవ కుమార్తె రుయ్యమ బ్రాహ్మణ మంత్రి అయిన ఇందులూరి అన్నయామాత్యుని వివాహమాడింది.

ప్రతాపరుద్రుడు (1289-1323):

రుద్రమదేవి తన అనంతరం కాకతీయ సామ్రాజ్యాన్ని ఏలగల వారసునిగా దౌహిత్రుని స్వీకరించింది. గణపతిదేవుడు తన పూర్వీకులు, తాను ఎంతో వృద్ధిపొందించిన సువిశాల కాకతీయ సామ్రాజ్యానికి తన వంశం వారే పాలకులు కావాలని నిర్ణయించుకొని ఉంటారు. పుత్రుని దత్తత తీసుకోకుండా తన కుమార్తెను తన అనంతరం సామ్రాజ్ఞిని చేశాడు.

స్త్రీకి వారసత్వపు హక్కు లేనందువల్ల తన నిర్ణయాన్ని సామంతులు ప్రజలు అంగీకరించరని ఊహించి రుద్రమకు దౌహిత్రుడు పుట్టిన తరువాతనే పట్టోధర్తిగా ప్రకటించాడు. ఆమె దౌహిత్రుని రుద్రమ అనంతరం వారసునిగా నిర్ణయించాడు కాకతీయ వంశానికి చెందిన మహాదేవునికి, రుద్రమ పెద్దకూతురు ముమ్మడమ్మకు జన్మించిన ప్రతాపరుద్రుని రుద్రమ తన పుత్రునిగా స్వీకరించింది. ప్రతాపరుద్రుని శాసనాలలో చాలాకాలం వరకు కుమార రుద్రుడని సంబోదించేవారు. రుద్రమదేవి కాలంలో యువరాజుగా ఉన్న కుమారరుద్రుడు ఆమెకు అన్ని విధాలా రాచకార్యాలలో తోడ్పడ్డాడు. క్రీ.శ. 1296లో రుద్రమ మరణానంతరం కాకతీయ సామ్రాజ్యానికి సామ్రాట్టు అయాడు.

రాజ్యాధికారానికి వచ్చిన వెంటనే కాకతీయ రాజ్య గౌరవానికి మచ్చ కలిగించిన కాయస్థ సామంతుడు అంబదేవుని తిరుగుబాటు నణచి, అతడు ఆక్రమించిన ప్రదేశాలన్నీ తిరిగి కాకతీయుల అధీనంలోనికి తెచ్చుకోవడమే ప్రతాపరుద్రుని ప్రథమ కర్తవ్యమైనది. అందుకు కాకతీయ సైన్యాన్ని తిరిగి వ్యవస్థీకరించవలసి వచ్చింది. రుద్రమదేవి ప్రవేశ పెట్టిన నాయంకర విధానంలో రాజుకు ఉన్న సేనతో పాటు నాయంకులకున్న సేనలు కూడా యుద్ధాలలో తోడ్పడతాయి. అందుకే నాయకులకు సైనిక నిర్వహణ కోసం కొన్ని రాజ్యభాగాలను కేటాయించేవారు. ఇటువంటి విధానం వలన అవసరమైనపుడు చక్రవర్తికి అపారమైన సేన సిద్ధంగా ఉండేది. ఇది రుద్రమదేవి నీతిని, పరిపాలనాదక్షతని తెలియ జేస్తుంది.

ప్రతాపరుద్రుడు తన నాయకుల సైన్యాన్నంతటిని తీర్చిదిద్ది మంచి శిక్షణ ఇప్పించి యుద్ధానికి సిద్ధపరచాడు. తన దాడిని కూడా మూడు భాగాలుగా చేసి ఒకటి అంబదేవుని పైకి, రెండవది నెల్లూరిమీదకు, మూడవ దానిని సేవుణ రాజ్యం మీదకు నడిపించాడు. దీనివల్ల శత్రువులు ఒకరికొకరు సహాయం చేసుకోలేకపోయారు. ఆశించినట్లు పాండ్యుల, సేవుణుల నుండి తనకు సైన్యం సహాయం అందకపోవడంతో అంబదేవుడు త్రిపురాంతకాన్ని వదలి కడప మండలానికి పారిపోయాడు. ఈ విధంగా అంబదేవుని తిరుగుబాటును కుమారరుద్రుడు తాను రాజ్యానికి వచ్చిన కొద్దికాలంలోనే అణచి కాకతీయుల అధికారాన్ని యథాపూర్వకంగా నిలిపాడు.

సామంతుల తిరుగుబాటు నణచగలిగిన ప్రతాపరుద్రునికి బయటినుంచి వచ్చేదాడిని ఎదుర్కోవడం ముఖ్య సమస్య అయింది. ముస్లిం దాడులు దక్షిణం వైపు ఎక్కువైనాయి. మాలిక్ కాఫర్ ఢిల్లీ సుల్తాన్ సేనాధిపతిగా గొప్ప సైన్యంతో వచ్చి హనుమకొండను స్వాధీనం చేసుకొని ఓరుగల్లు కోటను ముట్టడించాడు. నెలరోజులపాటు శత్రువులను కోటలోనికి ప్రవేశించకుండ నిగ్రహించినప్పటికీ మాలిక్ కాఫర్ ఓరుగంటి పరిసరాలను భస్మీపటలం చేయడంతో కోటలో ప్రజలకి, సైన్యానికి ఆహార పదార్థాల కొరత ఏర్పడింది. తప్పని పరిస్థితిలో ప్రతాపరుద్రుడు ఢిల్లీ సుల్తానుతో సంధి చేసుకొని ప్రతిఏటా అంతులేని ధనాన్ని, ఏనుగులను కప్పంగా పంపడానికి అంగీకరించాడు. తరువాత ఢిల్లీ సుల్తాన్ మరణించడం వల్ల కప్పం కట్టడం మాని స్వతంత్రంగా ఉండసాగాడు.

ఢిల్లీ సుల్తాన్ కొడుకు కుతుబుద్దీన్ ముబారక్ దక్షిణంలోని వ్యవహారాలు చక్క బెట్టడానికి వస్తున్న సంగతి గ్రహించి సుల్తాన్ పంపించిన ఖుస్రూఖాన్‌కి బకాయి పడ్డ కప్పాన్ని చెల్లించి సంధి చేసుకొన్నాడు. క్రీ.శ.1320లో ఢిల్లీ రాజకీయాల్లో మళ్ళీ మార్పు వచ్చి తుగ్లక్ వంశం అధికారం లోకి వచ్చింది ఈ అవ్యవస్థని కనిపెట్టి ప్రతాపరుద్రుడు కప్పం కట్టడం మానేశాడు.

క్రీ. శ. 1323లో ఢిల్లీ సుల్తాన్ ఘియాజుద్దీన్ కొడుకు ఉలుగ్‌ఖాన్‌ను వరంగల్లు పైకి దండయాత్రకు పంపించాడు. కోట అంత సులభంగా వారి వశం కాలేదు. ఉలుగ్‌ఖాన్ పెద్ద సైన్యంతో మళ్ళీ నెలరోజుల్లోనే మళ్ళీ దండెత్తాడు. ఇంత త్వరగా శత్రువు ముట్టడి చేస్తాడని ఊహించక పోవడం వల్ల కాకతీయుల కోట శత్రువుల స్వాధీనమయింది. ప్రతాపరుద్రుని బందీగా ఢిల్లీకి తీసుకొని పోతూ ఉండగా మార్గమధ్యంలో నర్మదా నదీ తీరంలో స్వయంగా దేహం చాలించాడని క్రీ.శ.1330 నాటి ప్రోలయ నాయకుడి తామ్రశాసనం, అని తల్లి కలువచేరు శాసనాల వల్ల తెలుస్తున్నది. ప్రతాపరుద్రుని మరణంతో కాకతీయ సామ్రాజ్యం అంతరించింది.

ప్రతాపరుద్రుని భార్య విశాలాక్షి అని ప్రతాప చరిత్రలో ఉన్నది. రెండు చోట్ల ఆమె ప్రసక్తి వచ్చింది. శాసనాలలో ప్రతాపరుద్రుని దేవి లక్మాదేవులుగారు అని ప్రసక్తమైంది. క్రీ.శ.1301 నాటి ఈ శాసనంలో ప్రతాపరుద్ర దేవ మహారాజుల దేవులు లక్మా దేవమ్మగారు తమ తండ్రి పాల్దేవ నాయనింగారికి పుణ్యంగా శ్రీరామనాధ దేవరకు (విత్తిగా) పన్ను, కానిక, కట్నం మొదలైనవి సమర్పించినదని ఉన్నది. దీనిని బట్టి ప్రతాపరుద్రుడికి ఇద్దరు భార్యలని తెలుస్తున్నది. ప్రతాప చరిత్రలోనే రుద్రమదేవి ప్రతాపరుద్రుని పదహారవ ఏట విశాలాక్షి మొదలైన రాజ కన్యలను పదహారుమందిని ఇచ్చి పెళ్ళి చేసినట్లు ఉన్నది. ఆనాటి రాజులలో బహుభార్యత్వం ఉన్నట్లు తెలుస్తున్నది. అంతకు ముందు కాకతీయ రాజులు యుద్ధాలలో గెలిచి సామంత రాజులతో ఒప్పందంగా వారి కుమార్తెలను వివాహమాడేవారు. బలవంతులైన సామంతులతో వియ్యమంది తమ సామ్రాజ్యాన్ని పటిష్టం చేసుకున్నట్లు ఇంతకు ముందు చెప్పుకొన్నాం. ప్రతాపరుద్రుని నాటికి బహుశా చాలామంది కన్యలను పెళ్ళాడటం అన్నది సాంప్రదాయంగా మారి ఉంటుంది. ఏకామ్రనాధుని ప్రతాపరుద్ర రచనాకాలం నాటికి ఆ సంఖ్య బాగా పెరిగి ఉంటుంది. కాని శాసనాలలో ఈ భార్య లెవరి ప్రసక్తిలేదు. పైగా వీరికి సంతానమున్నట్లు గానీ, వీరి పుత్రుల ద్వారా వేయించిన శాసనాలు గానీ లేవు. ప్రతాపరుద్రుని పుత్రులు జుట్టయలెంక గొంకారెడ్డి, కృష్ణనాయకుడు అనే వాళ్ళున్నట్లు శాసనాలలోనూ, ముస్లిం చరిత్రకారుల గ్రంథాలలోనూ ఉన్నది కానీ వీళ్ళు అతనికి అతి సన్నిహితులైన వారు, నమ్మకమైన సేవకులు, పుత్ర సమానులు కనుక పుత్రులనే చెప్పుకొని ఉండవచ్చు గానీ పుత్రులు కారు. ప్రతాపరుద్ర చరిత్రలో ప్రతాపరుద్రుని మరణానంతరం అతని తమ్ముడు అన్నమదేవుడు ప్రతాపరుద్రుని కొడుకైన వీరభద్రుని పట్టాభిషిక్తుణ్ణి కావించినట్లు ఉన్నది. కాని ఎక్కడా శాసన ప్రమాణాలు లేకపోవడం వలన అది నిరాధారమని ఊహిస్తున్నారు. ప్రతాపరుద్రునికి మాచల్దేవి అనే ఉంపుడుగత్తె కూడా ఉన్నట్లు క్రీడాభిరామంలో ఉన్నది.

కాకతీయుల రాజనీతిజ్ఞత

గణపతిదేవుడు – రాజనీతిజ్ఞత

గణపతిదేవ చక్రవర్తి సామదాన దండోపాయాలు అతి నిపుణతో ఆచరించగల రాజనీతిజ్ఞుడు. సరిహద్దుల్లో ఏ కొద్ది భాగమో తప్ప మిగిలిన తెలుగు దేశాన్నంతా ఒకే ఏలుబడి క్రిందికి తెచ్చిన మొదటి రాజు గణపతిదేవుడు. వైవాహిక సంబంధాల ద్వారా రాజకీయ సుస్థిరతని సాధించే ప్రయత్నం చేసి సాధించాడు గణపతిదేవ చక్రవర్తి. సిద్ధేశ్వర చరిత్రలో చెప్పినట్లు యాదవరాజకుమారి రుద్రమను పెండ్లాడడం వల్ల యాదవులతో మైత్రిని సాధించాడు. పినచోడి నాయకుని ఓడించి అతని కుమార్తెలు నారమాంబ పేరమాంబలను వివాహమాడి, వారి సోదరుని తన గజసేనకు నాయకుని చేశాడు. ధరణికోట సామంతులను తనకు అనుకూలంగా చేసుకొనేందుకు తన కూతురు గణపాంబను కోటబేతరాజు కిచ్చి వివాహం చేశాడు. గొప్పరాజ వంశానికి చెందిన చాళుక్య ఇందుశేఖరుడి పుత్రుడైన వీరభద్రునికి తన కుమార్తె రుద్రమనిచ్చి వివాహం చేశాడు. యుద్ధంలో సహాయం చేసి నెల్లూరు చోడరాజులని తనకనుకూలంగా చేసుకున్నాడు. (రుద్రమ పుత్రికల వివాహంలోనూ గణపతిదేవ చక్రవర్తి ప్రమేయం ఉండి ఉండవచ్చును. రుద్రమ మొదటి కూతురు ముమ్మడమ్మను కాకతీయ మహదేవునికిచ్చి వివాహం చేసి, వారి కుమారుడు కాకతీయ వంశ దీపకుడు అయిన ప్రతాపరుద్రుని రుద్రమచే దత్తత స్వీకారం చేయించి కాకతీయ సామ్రాజ్యానికి ఏలికని కావించాడు కానీ అతని ఇతర భార్యల వల్ల కలిగిన సంతానానికి గానీ రుద్రమ పుత్రికలు రుద్రమ, రుయ్యమల సంతానానికి గానీ రాజ్యాధికారాన్ని కలిగించలేదు.) కాకతీయ వంశానికి చెందిన వారే (కాకతీయ సామ్రాజ్యానికి) తాను విస్తరింపజేసిన సామ్రాజ్యానికి ఏలికలు కావాలని నిర్ణయించుకొని ఉండవచ్చును. కాకతీయ రాజులు అందునా గణపతిదేవ చక్రవర్తి ఇతర కులాలకి, సామంతరాజ వంశాలకి చెందిన వారితో వైవాహిక సంబంధాలు పెట్టుకున్నప్పటికీ రాజ్యాధికారం మాత్రం కేవలం కాకతీయులకే కలిగే విధంగా మలచుకున్నారు. వారు ఎంతమంది స్త్రీలను వివాహమాడినా, వారి కులానికి చెందిన వారి సంతానానికే రాజ్యాధికారం కలిగే విధంగా ఉండేదని వారి వివాహ సంబంధాలను పరిశీలిస్తే అర్ధమౌతుంది.

కాకతి ప్రోలుడు తమ కులానికి చెందిన నతవాడి ఆడపడుచు ముప్పమాంబని వివాహ మాడాడు. ఆమె సంతానమైన రుద్రదేవ మహదేవులు రాజ్యమేలారు. రుద్రదేవుని తరువాత మహదేవుడు రాజయ్యాడు. తరువాత అతని సంతానంలో గణపతిదేవుడే రాజ్యానికి వారసుడయాడు. గణపతిదేవునికి సోమలదేవియే కాక నారమాంబ, పేరమాంబ అనే తెలుగుచోడ వంశానికి చెందిన కన్యలు భార్యలయారు. కాని వారి సంతానమైన గణపాంబకు గానీ, సిద్ధేశ్వర, ప్రతాపచరిత్రలలో చెప్పబడిన యాదవ రాజకుమారి రుద్రమ సంతానానికి గానీ రాజ్యాధికారం రాలేదు. రుద్రమదేవియే కాక గణపతిదేవునికి ఇతర భార్యల వల్ల పుత్ర సంతానం కూడా ఉన్నదని ప్రతాపరుద్ర చరిత్ర వలన తెలుస్తున్నది.

అయితే అందులో గణపతిదేవుని కూతురు ముమ్మక్కగా పొరపాటు పడినారు. ఆ కాలంలో పుత్ర సంతానానికే గానీ పుత్రికలకి వారసత్వపు హక్కు లేకపోయినా తన కుమార్తెకు రాజ్యాధికారం అప్పగించాడే కానీ చాళుక్య వీరభద్రుని ఇతర భార్యల సంతానానికి గానీ, తన ఇతర సంతానానికి గానీ సింహాసనాధికారం ఇవ్వలేదు. అయితే రుద్రమదేవి పురుషులకి ఏ విధంగానూ తీసిపోని అసమాన పరాక్రమవంతురాలు, పరిపాలనా దక్షత కలిగినది. బాల్య నుండి యుద్ధ కళలోనూ, రాజ్య తంత్రంలోనూ శిక్షణ పొందినది. ఇక రుద్రమదేవి కుమార్తెలు ముగ్గురిలో ముమ్మడమ్మకు కాకతి మహదేవునికి సంతానమైన ప్రతాపరుద్రుడే సింహాసనాధికారి అని నిర్ణయించినవాడు గణపతిదేవ చక్రవర్తి. తాము పెంపొందించిన విశాల సామ్రాజ్యం కేవలం కాకతీయ వంశానికీ, కులానికి చెందిన వారే పాలించే విధంగా మలచుకున్న గణపతిదేవ చక్రవర్తి రాజనీతిజ్ఞత అపూర్వం అని చెప్పవచ్చును.

గణపతిదేవుడు ప్రజలను కన్నబిడ్డలుగా చూచిన మంచి పాలకుడు. ప్రజల యోగక్షేమాలను కాంక్షించి వారికోసం ఎన్నో సౌకర్యాలు చేశాడు. తాను శైవ దీక్ష నవలంబించినప్పటికీ మతసహనాన్ని చూపాడు. తాను చక్రవర్తి అయినప్పటికీ తన క్రిందనున్న సామంతులను చిన్న చూపు చూడక వారికి పాలనలో స్వతంత్ర ప్రతిపత్తినిచ్చాడు. తన తోటి సామంతులతోనూ, బలవంతులైన సామంతులతోనూ వివాహ బాంధవ్యాలు ఏర్పరచుకొని తన సామ్రాజ్నాన్ని సుస్థిరం చేసుకొన్నాడు. ప్రజాహిత కార్యాలు చేస్తూ, సక్రమంగా పరిపాలించి, చక్రవర్తి పట్ల విధేయత చూపే మండలాధికారులకు పరిపాలనలో స్వేచ్ఛ నిచ్చేవాడు. తిరుగుబాటు చేసి యుద్ధాలకు కాలు దువ్వి రాజకీయంగా సంక్షోభం కలిగించే మండలాధీశులను యుద్ధం చేసి అణచి వారిని తిరిగి విధేయులుగా చేసుకొనే వాడు. బ్రాహ్మణాధిక్యత గల వైదికమతాన్ని కాక అధిక సంఖ్యాకులైన క్రింది వర్గపు ప్రజలు అభిమానించిన శైవమతాన్ని అభిమానించి వారికి నచ్చేవిధంగా మతాభివృద్ధికి తోడ్పడ్డాడు. విద్యాదానం చేసి బీదసాదలకు ఆశ్రయం కల్పించి, స్త్రీలకు ప్రసూతి వైద్యశాలలు నిర్మించి ప్రజోపయోగ కార్యాలెన్నో చేసే, విశ్వేశ్వర శైవాచార్యుల వంటి వారి శైవమతాలకు విరివిగా దాన మిచ్చేవాడని గోళకీ మతం గురించి తెలిపిన మల్కాపుర శాసనం వల్ల తెలుస్తున్నది.

గణపతిదేవ చక్రవర్తి కాలంలోనే కాకతీయ సామ్రాజ్యం సువిశాలంగా, సుస్థిరంగా, సుభిక్షంగా ఉన్నది. ఆలయ నిర్మాణం, తటాక నిర్మాణం, సంగీత సాహిత్య, నాట్య, శిల్ప, చిత్ర కళాది లలిత కళలకు ప్రోత్సాహం కాకతీయ చక్రవర్తులు మొదలుకొని సామంతరాజులు చిన్న చిన్న ఉద్యోగులు, సామాన్య ప్రజలు వరకు అందరు ముమ్మరంగా ప్రోత్సహించినారు. ముఖ్యంగా గణపతిదేవుని కాలంలో స్త్రీలు తమ స్త్రీధనంతో ప్రజోపయోగ కార్యాలెన్నో చేపట్టి తమ పుట్టినింటికీ, మెట్టినింటికీ కీర్తి గడించి పెట్టిన వారెందరో ఉన్నారు. ఈ కాలంలో వెలువడిన శాసనాలలో ఎంతోమంది స్త్రీలు దానాలు చేసినట్లు ఉన్నది. అంటే ఆనాటి స్త్రీలు దైవ ధర్మకార్య నిరతి గలవారని, తమకున్న ఆర్థిక స్వాతంత్ర్యం వల్ల దానాలు చేసి శాసనాలు వేయించేవారని అనుకోవచ్చును. గణపతిదేవుడు స్త్రీలను నిరసనతో కాక గౌరవభావంతో చూశాడనడానికి అతడు తన కూతురైన రుద్రమను పుత్రిక లాగాకాక పుత్రుడివలె పెంచి రుద్రదేవ మహారాజు అన్న పేరుతో తన రాజ్యానికి పట్టాభిషిక్తురాలిని చేయడమే నిదర్శనం.

రుద్రమదేవియే కాక ఆమె సోదరి గణపాంబ కూడా రాజ్యమేలినట్లు శానాధారాలున్నాయి. గణపాంబ భర్త కోట బేతరాజు మరణానంతరం కోట గణపాంబ రాజ్యాధికారం చేపట్టి, దానం చేసి వేయించిన మొగలుట్ల తామ్రశాసనం వల్ల తెలుస్తున్నది.

కాకతిబేతరాజు వరకు కాకతీయ రాజులందరూ జైన మతావలంబులుగా ఉన్నారు. ఆనాడు తెలంగాణంలో జైన మతం విస్తృతంగా వుండేది. పద్మాక్షి గుట్టపైనీ కాకతి బేతరాజు మంత్రి వైజ దండాధినాధుని కొడుకు బేతన బార్య మైలమ కడలాలయబసదిని నిర్మించగా అతడు కొన్ని భూములను ఆ దేవాలయ పూజ సామాగ్రి కొరకు, పూజారి ఆహార వస్త్రాల కొరకు దానం చేసినాడు. దీనిని బట్టి ఆనాడు జైన మతానికి ఆదరం ఉన్నదని తెలుస్తున్నది. అయితే తన పూర్వీకులు జైనులైనప్పటికీ, ఈ బేతరాజు కామేశ్వర దీక్షితుడనే మహాశైవాచార్యుని గురువుగా శైవ దీక్ష పొందాడు. అప్పటినుండి కాకతీయులు శైవ మతావలంబికులయ్యారు. అయినప్పటికీ కాకతీయులు జైన మతాన్ని నిరసించలేదు. కాకతీయులలోని విశేషం వారి మత సహనం. వారు జైన మతమును అనుసరించినపుడు శైవ మతమును, శైవ దీక్ష పుచ్చుకున్న తరువాత జైన మతమును నిరసించుటగానీ నిరాదరించుటగానీ చేయలేదు. రాజకీయ చతురత గలవారు కనుక ప్రజలకు జైన బౌద్ధ మతముల పట్ల ఆసక్తి తగ్గి శైవ మతమును ఆరాధించినపుడు శైవ మతావలంబకులై శివాలయములు కట్టించి దానాలు చేసి తద్వారా శైవ మతవ్యాప్తి చేసి ప్రజలభిమానమును సంపాదించారు. శైవ మతం క్షీణించి వైష్ణవ మతం ప్రజలలో వ్యాపించినపుడు వైష్ణవ మతమును అభిమానించి విష్ణువుకు ఆలయాలు కట్టించి దానాలు చేసి ఆ మత వ్యాప్తికి తోడ్పడి ప్రజలు అభిమానించే చక్రవర్తులయ్యారు. ప్రజలకు నచ్చే విధంగా, ప్రజలు మేచ్చే విధంగా తమ పాలనను సాగించి అత్యంత సమర్థ రాజవంశంగా కీర్తిపొందారు. సంఘంలో ఏ విధమైన మార్పు గోచరించినప్పటికీ అది మంచిదైతే వెంటనే దాన్ని స్వీకరించి ప్రచారమయ్యే విధంగా చేశారు.

(సశేషం)

Exit mobile version