Site icon Sanchika

‘కాకతీయ యుగంలో స్త్రీల సామాజిక స్థితిగతులు – ఒక పరిశీలన’-5

[డా. మంత్రవాది గీతా గాయత్రి గారు 1995లో పిహెచ్‍డి పట్టా కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖకి సమర్పించిన సిద్ధాంత వ్యాసాన్ని సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము.]

ప్రకరణం 2 కాకతీయుల కాలంనాటి స్త్రీలు – ఒక పరిగణన – రెండవ భాగం:

మాంచాల:

[dropcap]ప[/dropcap]లనాటి వీర చరిత్ర కావ్యంలో బ్రహ్మనాయుడు, నాయకురాలు నాగమ్మ, బాలచంద్రుని తర్వాత ముఖ్యమైన వ్యక్తి మాంచాల. ఏడు కోట్ల సంఖ్య నెసగిన ధనము కలిగిన గండు కన్నమ నేనికి, రేకమ్మకు పుత్రిక. బాలచంద్రుని తల్లి ఐతాంబకు మేనకోడలు. పలనాటి వీరులలో కీర్తిగాంచిన బాలచంద్రుని భార్య. ఈమె అతి సౌందర్యవతి అని కావ్యంలో పలుచోట్ల ప్రశంసించబడింది.

శంబరాసుర వైరి సతిచేతియందు
చెలువొంద నిలిచిన చిలుకకు సమము
మాంచాల సౌందర్య వహిమ కల్గొన్న
చాలించు పోకడ సఖియ నీ సుతుడు

అని శీలమ మాంచాలను పొగడడమే కాక బాలచంద్రుని యుద్ధ ప్రయత్నాన్ని మానిపించగల శక్తి ఆమె సౌందర్యాని కున్నదన్న సత్యాన్ని చెప్పింది. ఇతరులకే కాక మాంచాలకు కూడా తన సౌందర్యం పైనా, తన ప్రేమ శక్తిపైనా నమ్మకం ఎక్కువ.

పంపుమీ కాముని పగ దీర్చుటకును
పోయెద ననియెడు బుద్ధి మాన్పింతు
ఏడేండ్ల నుంచి తానే మరనట్టి
వేశ్య పై మోహంబు విడువంగ జేతు

అన్న మాటలలో ఆమె ఆత్మవిశ్వాసం ప్రకటిత మౌతున్నది.

బాల్యంలోనే వివాహమైనా తన భర్త ఎలా ఉంటాడో కూడా తెలియని ఇల్లాలు. కానీ ఆమె పాతివ్రత్యం జగద్విదితం. ఐతాంబ తన కుమారుడు బాలచంద్రుని యుద్ధరంగానికి వెళ్ళకుండా ఆపమని మాంచాలను అడగడానికి వచ్చింది.

బ్రహ్మగూర్చెను మమ్ముబాలుర మపుడు
సమరంబులో నతడు సమసిన వెనుక
వెంటనే గెద గాని, వినుము నామాట
పంపుము పుత్రుని బవరంబునకును

అని పలికిన మాంచాల మాటలు నిజమౌతాయని, ఆమె పాతివ్రత్యాని కాశక్తి ఉన్నదని గ్రహించి భయపడింది ఐతాంబ. అందుకే ఆమె

పరమ పతివ్రత పావన మూర్తి
పతిభక్తి గలిగిన పద్మాయతాక్షి
నేనరుదెంచుట నీమది దెలిసె
వలవదీలాగున వచియించుటకును
సాధ్వి ప్రేమయె పతికి సకలసాధకము
కావున మనసున కరుణయునుంచి
నేరంబులతనిపై నిలుపకు మిపుడు

అని కోడలిని అర్థించింది.

మాంచాల సమయస్పూర్తి, తెలివితేటలు గలది. పెళ్ళి అయి పదేళ్ళయినా భర్త ఎలా ఉంటాడో మాంచాలకు తెలియదు. తమ్ములందరితో కలిసి తమ యింటికి వచ్చిన బాలచంద్రుని గుర్తుపట్టడం కష్టం. తల్లి నడిగితే ఆమె నీవు వారి ముందరికెళ్ళినపుడు మీ మరదులు భక్తితో లేచి నిలబడతారు. భర్త లేవడు. దాన్ని బట్టి అతడు నీ భర్త అని గుర్తించమని చెప్పింది. కానీ ఆమె వచ్చినపుడు తక్కిన వారందరూ లేచి నిలబడినప్పటికీ, బ్రాహ్మణుడైన అనపోతు తాను లేస్తే ఆమెకు పాపం కలుగుతుందేమోనని లేచి నిలబడలేదు. కూర్చున్న వారిద్దరిలో భర్త ఎవరో మాంచాల తెలుసుకోలేక బంగారు ఛాయ కలిగిన అనపోతు తన భర్త అనుకుని పాదాలు పట్టుకొని పన్నీట కడగబోయింది.

ఇద్దరిలో పతినేర్పరచలేక
కాంచన సమవర్ణకాయుడైనట్టి
పారుడే పతి యని పాదంబు పట్టి
పన్నీట గడుగంగ భావన చేయ

భయంలో అనపోతు వెంటనే లేచి నేను మీ మరిదిని తల్లీ అని పలికాడు. అందుకామె సమయస్పూర్తితో ఇదివరకు ముహూర్తం సరిగా చూడకుండా చెనటి విప్రుడొకడు మా పెళ్ళి చేశాడు. అందుకే నేను భర్తకు దూరమైనాను, అయినప్పటికీ నేను పూర్వం చేసిన వ్రతాలు సిద్ధించడం వల్ల నాభర్త నన్ను చూడవచ్చాడు. ఇకముందు నన్ను నా భర్త విడువకుండా ఉంటే నా భాగ్యానికి సాటిలేదు అనుకుని బ్రాహ్మణుడివి, వేదాది విద్యల నెఱిగిన విజ్ఞానివని నీ కాళ్ళు పట్టుకున్నాను అంతేగానీ, నాకింకో అభిప్రాయం లేదు అని తెలివిగా సమాధానం చెప్పింది.

వేశ్య మోహంలో పడి తనను చూడటానికైనా ఎన్నడూ రాని భర్తను ఆమె నిలదీసి నిందించలేదు. అందుకు సమయం కాదని ఆమెకు తెలుసు కనుక తన మేడకు అతడిని తీసుకువెళ్ళి తనకు పొద్దు పోవడానికి ఏం చేసేదో అన్నీ చూపించి అతడిని తన స్నేహ భావంతో, ప్రేమపాశంతో బంధించింది.

తరువాత మాంచాల తన మగడైన

బాలచంద్రుని తోడ బహు మోదమునను
మేడ మీదికి బోయి మేలైనయట్టి
చిత్తర్వు జూపుచు చిలకల చదువు
వినిపించి శృంగార విపినంబు జూపి
పెద్దలు తనమీద ప్రియము కొలంది
ప్రొద్దు పోవుటకునై పొందించినట్టి
భర్మాపాంచాలిక ప్రతతిని జూపి
అందులోనొక బొమ్మ నాడంగ జేసే

ఈ విధంగా స్నేహంతో ప్రేమతో అతడిని తన వైపు ఆకర్షింపజేసుకున్నది. తరువాత అతడి మనసులో తన పట్ల ఉన్న మోహం, ప్రేమ నర్థం చేసుకొని అందంగా అలంకరించికొని వచ్చి భర్తను అలరింప చేసింది. ఆమె లోని గొప్పతనాన్ని గుర్తించిన బాలచంద్రుడు తన ప్రవర్తనకు తానే సిగ్గుపడ్డాడు.

నరలోక సురలోక నాగలోకముల
సరిలేరు నెలతకు సౌందర్యమునను
ఇటువంటి కాంతపై నిచ్చయు విడిచి
పశుబుద్ధి వాడనై భావంబు మరచి
ఉంటినేనిన్నాళ్ళు ఉన్మత్త దశను
పరలోక సౌఖ్యంబు పారదోలితిని

మాంచాల వీరపత్నులకే ఆదర్శప్రాయమని చెప్పాలి. తాను తలచుకుంటే బాలచంద్రుని చేత యుద్ధప్రయత్నం మానిపించగలదు. కానీ ఆమె వీరపత్ని. భర్తకు పిరికివాడనే పేరు రాకూడదనీ నిష్కలంకమైన కీర్తిని అతడు సంపాదించాలని తాత్కాలికమైన మోహానికంటే శాశ్వతమైన కీర్తి గొప్పదని గుర్తించింది. భర్త యుద్ధరంగంలో చనిపోతే తనకూ చావు తప్పదని ఆమెకు తెలుసు.

విడియంబు చేయుట వెలయాలి యింట
సానికూతురు తోడ సకల భోగములు
నానోము ఫలమేమో నలినజు డతని
ననుబాపి వేశ్యయౌ నాతికొప్పించె
మేలను భవించెడి మెలతలువారు
చావనోచిన యట్టిసకియను నేను

అన్న విషయాన్ని మాంచాలే కాదు, ఆనాటి వీరుల పత్నులందరూ గుర్తించిన వారే. కానీ తన వద్దకు వచ్చి తనపై మోహంతో ఉన్న భర్తకు యుద్ధరంగానికి పంపటానికి వెనుకాడక వీరతిలకం దిద్ది, హరతి యిచ్చి, ఆశీర్వదించి పంపిన మాంచాల వీర పత్నులకే శిరోమణి వంటిది. అందుకే మాంచాల పేరు చరిత్ర పుటలలో శాశ్వతమైన స్థానాన్ని పొందింది.

ప్రోలాంబిక:

చోడ తిక్కరాజు మంత్రి అయిన సిద్ధి సేనాపతి భార్య ప్రోలాంబికను కామిత వసు విశ్రాణన భూమి జనిత కల్పవల్లి అని కేతన తన దశకుమార చరిత్రలో పొగిడాడు. ఈమె వీరుడైన ఖడ్గతిక్కనకు వీరత్వాన్ని నూరిపోసిన వీరమాత. కాటమరాజుతో జరిగిన యుద్ధంలో శత్రువులను గెలవలేక ప్రాణాలతో తిరిగి వచ్చిన ఖడ్గతిక్కనను తన మాటలతో ఉత్తేజితం చేసి యుద్ధోన్ముఖుని చేసిన వీరవనిత. ఆ కాలంలో పుత్రుల కొరకు ఎన్నో నోములు నోచేవారు. యుద్ధానికి వెళ్ళే పుత్రుని లేకలేక కలిగిన పుత్రుడనీ, ఎన్నో నోములు నోచి కన్నాననీ, యుద్ధానికి వెళ్ళవద్దనీ వెనుకకు లాగే ఐతాంబ వంటి తల్లులున్న ఆ కాలంలో, క్షాత్ర ధర్మానికి చెందని బ్రాహ్మణ వంశంలోని స్త్రీయైన ప్రోలమ తన పుత్రుని యుద్ధానికి దీవించి పంపడమే కాక, భీరువులాగా వెనుతిరిగి వచ్చినవాడిని యుద్ధోన్ముఖుని చేసింది. శత్రువుకు వెన్నుచూపించిన తిక్క రాజు స్నానానికి అతని భార్య మరుగున పసుపుముద్ద ఉంచి స్నానానికి ఏర్పాటు చేస్తే తల్లి ప్రోలాంబ అన్నంలో విరిగిన పాలు పోసి అదేమని అడిగిన పుత్రునితో

అసదృశముగ నరి వీరుల
మసి పుచ్చక విఱిగి వచ్చు మగపందక్రియన్
కసవున్ మేయగ బోయిన
పసులున్ విఱిగినవి తిక్క! పాలున్ విఱిగెన్

అని వ్యంగ్యంగా మాట్లాడి కుమారునికి పౌరుషం తెప్పించి యుద్ధానికి పంపింది. తాడిచెట్టెక్కే పురుషుని తల్లికి గడమీద ఆడే స్త్రీకి తల్లియైనదానికి, శూరుని తల్లికి సుఖమేమీ లేదు అని ఐతాంబ చెప్పినట్లు శూరుడైన రణతిక్కనకు తల్లియైన ప్రోలమ తనకు కలుగబోయే కడుపుకోతను లెక్కజేయక కొడుకును యుద్ధానికి పంపి వీరమాతగా చరిత్ర ప్రసిద్ధిగాంచింది.

జానమాంబ:

జానమాంబ ఖడ్గతిక్కనకు భార్య, వీరమాత ప్రోలమాంబకు కోడలు. కాటమరాజు పై యుద్ధానికి వెళ్ళిన ఖడ్గతిక్కన శత్రువులను సంహరించక వెనుదిరిగి వచ్చాడని, ఇల్లు చేరిన భర్తకు స్త్రీలకు స్నానానికి ఏర్పాటు చేసినట్లు మరుగున స్నానానికి నీళ్ళుతోడి పసుపుముద్ద ఉంచింది. అదేమని అడిగిన భర్తకు

పగఱకు వెన్నిచ్చినచో
నగరే నిను మగతనంపు నాయకులెందున్
ముగురాడు వారమైతిమి
వగపేటికి జలకమాడ వచ్చినచోటన్

అని ఎకసెక్కమాడింది.

జానమను పతిహితారుంధతి, అనింద్య చరిత, సకల గుణగణాలంకృత అని కేతన తన దశకుమార చరిత్రలో వర్ణించాడు. భర్తను తన మాటలతో నొప్పించి, యుద్ధానికి పంపి, మృత్యుముఖానికి పంపిన స్త్రీ అనింద్య చరిత, పతిహితారుంధతి ఎలా అవగలదని ఈనాటి వారు అబ్బురపడవచ్చును.

కానీ ఆనాటి పరిస్థితులు వేరు. ఆ కాలంలో వారు రాజకీయ కారణాలకు, వీరావేశాలకు, కీర్తిపౌరుషాలకు, మాట పట్టింపుకు ఇచ్చినంత విలువ ప్రాణాలకు ఇవ్వలేదు. రాజు కోసం సైనికులు, సేవకులు ప్రాణాలర్పించేవారు. రాణులు చనిపోతే అంతఃపుర స్త్రీలు దాసీలు అగ్నిలో దూకి ప్రాణాలర్పించేవారు. భర్తను దీవించి, హారతి ఇచ్చి పంపే భార్యకు భర్త మరణిస్తే తానూ సహగమనం చేస్తుందని తెలిసీ అందుకు సిద్ధపడి ఉండేది. అయితే ఈ స్త్రీలు ఎక్కువగా రాజకుటుంబాలకి చెందినవారు. కానీ జానమ బ్రాహ్మణ స్త్రీ. క్షాత్ర ధర్మాన్ని స్వీకరించిన సిద్ధి సేనాపతి కుటుంబంలోని స్త్రీల కుండే తెగువ, ధైర్యం, సాహసం ఉన్నాయి. కనుకనే ఆమె సకల గుణగణాలంకృత అయింది.

ఖడ్గతిక్కన యుద్ధంలో చనిపోగా యుద్ధభూమిని వెదకి అతని శిరసును గుర్తించి తెచ్చి, ఆ శిరసుతో ఆమె అనుగమనం చేసింది. ఆ కాలంలో సహగమనం చేసిన స్త్రీలను అరుంధతితో పోల్చేవారు. కనుక జానమ ‘పతిహితారుంధతి’,  ‘అనింద్యచరిత’గా సంభావింపబడింది. ఈమెకు పుత్రులు సిద్ధన, కొమ్మన, ఇమ్మడి, ముమ్మడి అనేవారు. పెద్దకొడుకు సిద్ధనను ‘జానమ సిద్ధశౌరి’ అని కేతన సంబోధించాడు.

జానమ వంటి స్త్రీ తనకు తల్లి అయినందున ఆ కొడుకు గర్వపడి ఉంటాడు. కనుకనే ఆతడు ‘జానమ సిద్ధశౌరి’గా వ్యవహరింపబడినాడు.

జానమ తన భర్తతో సహగమనం చేసే నిమిత్తం సచేల స్నానం చేసి, అనేక దానాలను బ్రాహ్మల కిచ్చి రణభూమికి ప్రదక్షిణ నమస్కారాలను చేసి ప్రార్థించి, పతి శిరసును గుర్తుపట్టి తెచ్చి దానితో అనుగమనం చేసింది.

ధైర్యసాహసాలు, స్వార్థరహిత దేశభక్తి కలిగి ఉండడంలో పురుషులకు స్త్రీలు తీసిపోరని నిరూపించిన జానమ కాకతీయుల కాలంనాటి స్త్రీలలో ఎన్నదగినదని చెప్పవచ్చును.

కాకతీయుల కాలంలో ప్రసిద్ధురాండైన స్త్రీలు

కోట గణపాంబ (క్రీ.శ. 1219):

గణపాంబ కాకతీయ గణపతిదేవ చక్రవర్తికి జన్మించిన కుమార్తె. గజసాధనిక జాయప సేనాని మేనకోడలు. ఈమె కోట రెండవ కేతరాజు మనుమడు, కోటరుద్రుని పుత్రుడు అయిన బేతరాజును వివాహమాడింది. శకసంవత్సరం 1141, ఉత్తరాయణ సంక్రాంతి కాలంలో మహామండలేశ్వర గణపమదేవి మొగలుట్ల గ్రామాన్ని రుద్ర పెద్దింగారికి గయా వ్రజన దక్షిణగా తన భర్త బేతరాజు పుణ్యలోకప్రాప్తి కొరకు దానం చేసింది. ఈ దానం కాకతి గణపతి దేవ మహారాజు సమక్షంలో జరిగింది. ఈ దాన సందర్భంలో వేయించిన తామ్రశాసనంలో కోటరాజుల వంశవర్ణన ఉన్నది. కోటభీముని కొడుకు మొదటి కేత. అతని కొడుకు రెండవ కోటభీముడు. అతడు వెలనాటి రాజకుమార్తె సబ్బాంబికను వివాహమాడాడు. అతని పుత్రుడు రెండవ కేత. అతని కుమారుడు రుద్రుడు. అతడు పండాంబికను వివాహమాడాడు. వారి పుత్రుడు బేతరాజు. అతడే కాకతీయ గణపతిదేవుని పుత్రిక గణపాంబికకు భర్త. భర్త మరణానంతరం ఆమె రాజ్యమేలిందని కోట మన్మకేతరాజు, కోట గణపాంబ ఒకేకాలంలో కోట దేశంలోని రెండు భాగాలను ఏలినట్లు గణపాంబ వేయించిన యనమదల శాసనం, మన్మకేతరాజు ఎడవల్లి తామ్రశాసనాన్ని బట్టి గ్రహించవచ్చును.

మొగలుట్ల శాసనంలో కోట గణపాంబకు కోటమండలేశ్వరునికున్న బిరుదులన్నీ ఉన్నట్లుగా ఉన్నది. ‘శ్రీమత్త్రిణయన పల్లవ ప్రసాదాసాదిత కృష్ణవేణ్యా నదీ దక్షిణ షట్సహస్రావనీ వల్లభ, భయలోభ దుర్లభ, చోడచాళుక్య సామంత మదానేక పమృగేంద్ర విభవామరేంద్ర శ్రీ మదమరేశ్వర దేవదివ్య శ్రీపాద పద్మారాధక పరబలసాధక శ్రీధాన్యకటక పురవరాధీశ్వర, ప్రతాపలంకేశ్వర కలిగల మోడకే బేడువరగీవకై గండరగండ గండభేరుండ జగమెచ్చుగండ నందిమార్తాండ నామాది సమస్త ప్రశస్తి సహిత శ్రీ మన్మహా మండలేశ్వర కోట గణపమదేవి అమ్మగారు’ అని శాసనంలో చెప్పడం వల్ల భర్త బేతరాజు మరణానంతరం కోటగణపాంబ మండలేశ్వర పదవిని రాజ్యపాలనను నిర్వహించినందున ఆ పదవికి సంబంధించిన బిరుదులను గ్రహించినట్లు గ్రహించవచ్చును. శాసనంలో మహారాజ సన్నిధిని, గణపదేవరున్ను తమ అంశము ధారపోసి అన్న వాక్యాల వల్ల కోట బేతరాజు మరణానంతరం అతని రాజ్యం కాకతీయ చక్రవర్తి అధీనమైనదని, గణపతిదేవుడు ఆ రాజ్యాన్ని తన పేరుమీద తన కుమార్తె గణపాంబను ఏలనిచ్చాడని అనుకోవచ్చునని ఈ శాసనాన్ని పరిష్కరించి ప్రకటించిన పరిశోధకుడు ఎన్. రమేశన్ గారు అభిప్రాయపడ్డారు. గణపాంబ యనమదలను రాజధానిగా చేసుకొని తన భర్తకు చెందిన కోట రాజ్యభాగాన్ని పాలించింది.

కోట గణపాంబకు ఇరవై ఏళ్ళ వయసు నిండకముందే వైధవ్యం ప్రాప్తించింది. ఆమెకు సంతానం కూడా లేదు. ఆనాటి నుండి భర్త రాజ్యానికి వారసురాలై, ధార్మికమైన కార్యాలు చేస్తూ, కాలం గడిపింది. ఆమె దాదాపు ముప్ఫైఏళ్ల పాటు అంటే మొగలుట్ల శాసనకాలం క్రీ.శ. 1219 నుండి యనమదల శాసనకాలం క్రీ.శ. 1250 వరకు రాజ్యాన్ని అతి సమర్థతతో పాలించింది. గణపాంబకు ఈ సామర్థ్యం తండ్రి గణపతిదేవుని శిక్షణ వల్ల లభించి ఉంటుంది. ఈమెకు మేనమామ గజసాధనిక, కాకతీయ సేనాధిపతి జాయపసేనాని. బహుశా ఇతడు గణపాంబకు గజసాధన, గజారోహణ వంటివి నేర్పి ఉండవచ్చును. ఇందుకు శాసనాలలో ప్రత్యక్షాధారం ఇప్పటికి లభించలేదు కానీ రామప్ప దేవాలయం గోడలపైన ఉన్న శిల్పాలలో ఏనుగులతో పోరాడే స్త్రీమూర్తి బొమ్మలున్నాయి. ఆ మూర్తులను బట్టి ఆ స్త్రీ గజసాధన చేస్తూ ఉండినట్లున్నది. ఒకవైపు ఏనుగులు కొన్ని ఆ స్త్రీపై తలపడినట్లు, అందులో ఒక ఏనుగు ఆ స్త్రీని తన తొండంతో చుట్టి పైకెత్తినట్లు, తరువాతి శిల్పాలలో ఆ స్త్రీ ఆ ఏనుగులను నిగ్రహించినట్లు, చివరకు ఒకచేతిలో కత్తి మరొక చేతిలో డాలుతో రెండువైపులనున్న ఏనుగులను ఆపినట్లు ఉన్నది. ఈ శిల్పాలలో ఉన్న స్త్రీ గజసాధన చేస్తున్నట్లు తోస్తున్నది.

దాన్నిబట్టి గణపాంబ గజసాధన నేర్చి ఉంటుందన్న ఊహకు తావునిచ్చింది. పై అభిప్రాయం మాట ఎలా ఉన్నా గణపాంబ ఏలికగా సమర్థురాలని ఆమె సుదీర్ఘమైన రాజ్యపాలనా కాలాన్ని బట్టి, శ్రీమత్త్రిణయన పల్లవ ప్రసాదాసాదిత కృష్ణవేణ్యానదీ దక్షిణ షట్సహస్రావనీ వల్లభ అని వంశపారంపర్యంగా ఆమెకు లభించిన బిరుదును బట్టి చెప్పవచ్చును.

తుఱుకమాంబ:

కాకతి రుద్రదేవుని మంత్రి వెల్లకి గంగాధరుని తల్లి తుఱకమాంబ. ఆమె భర్త గోవిందుడు. ఆత్రేయ గోత్రుడైన నారాయణునికి పుత్రుడు.

కాకతి రుద్రుని మంత్రి గంగాధరుడు నగునూరు, అనుమకొండ, మొదలైన ప్రదేశాలలో ఆలయాలు, పుష్పవాటికలు నిర్మించాడు. ఆ సందర్భంలో వేయించిన శాసనాలలో తన తల్లి తుఱుకమాంబను గురించి గుణవిభాసి, భాగ్యవతి, మహసతి, అని కీర్తించాడు. హనుమకొండలోని శాసనంలో ‘సాధ్వీ తుఱుకమాభిఖ్యా గృహిణీతస్య సాభవత్’ అని ఉన్నది.

ఆ కాలంలో స్త్రీలకు సాధారణంగా గుండమ, కుందమ, మైలమ, ముప్పమ ఇత్యాది పేర్లు ఎక్కువగా ఉండేవి. గానీ తుఱుకమాంబ అన్న పేరు విలక్షణంగా ఉండి కుతూహలాన్ని రేకెత్తిస్తుంది. చరిత్ర పరిశోధకులు కొందరి దృష్టిలో అప్పటికి దక్షిణ హిందూ దేశంలో ఇస్లామ్ మతప్రభావం గానీ, ముస్లిం దాడులు గానీ తెలుగు, భాషపై ప్రభావం చూపించలేదు. అందునా తుఱుకమాంబ శ్రోత్రియ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన స్త్రీ, మరి ఆమెకు ఈ పేరు ఎలా ఉన్నదని మనకు సందేహం కలుగుతుంది. ఈ సందర్భంలో డా. ఎన్.ఎల్. ఎన్. ఆచార్య తమ కాకతీయ శాసనాలు భాషా పరిశీలన అన్న తమ సిద్ధాంత గ్రంథంలో అన్య భాషాపదాలు అన్న అంశం గురించి ప్రస్తావిస్తూ ఈ తురక శబ్దం గురించి చర్చించి క్రీ. శ. 1279 గుంటూరు జిల్లాలోని మందడ శాసనంలోని తుఱుకేశ్వర మహదేవ దివ్యశ్రీ పాదపద్మారాధకుడైన అమర సెట్టి అన్న వాక్యాన్ని ఉదహరించారు. ఈ పదాలను బట్టి కాకతీయుల నాటికే తెలుగుదేశంలో మహమ్మదీయ సంస్కృతి భారతీయ సంస్కృతిలో కలిసిపోయినట్లు కన్పిస్తుందని కానీ అది విశ్వసనీయంగా తోచదన్నారు.

కానీ ఆ అభిప్రాయం సరికాదు. మహమ్మద్ గోరీ, ఘజనీ వంటి మహమ్మదీయ ఆక్రమణదారుల దాడులకు పూర్వం ఇండియా, అరబ్బుదేశాల మధ్య సంబంధాలు, రాకపోకలుండేవి. రెండు దేశాల మధ్య రాయబారులుండేవారు. ఈ విషయాన్ని గురించి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ తమ డిస్కవరీ ఆఫ్ ఇండియాలో విపులంగా వివరించారు. మన గ్రంథాలు ముఖ్యంగా గణిత శాస్త్రం, భౌగోళశాస్త్రం బాగ్దాదుకి కొనిపోబడి అరబ్బీ భాషలోకి అనువదింపబడినాయనీ, ఇక్కడి వైద్యులు బాగ్దాదుకి వెళ్లారనీ సంస్కృతి – వాణిజ్య సంబంధాలు ఉత్తర హిందూస్ధానానికే పరిమితం కావనీ, దక్షిణ భారత రాజ్యాలు, ముఖ్యంగా రాష్ట్రకూటులు వాణిజ్యపరంగా అరబ్బులతో సంబంధాలు పెట్టుకొన్నారనీ వారు రాసిన దాన్ని బట్టి తెలుస్తున్నది. ఆ విధంగా భారతీయులు ఇస్లాము గురించి తెలుసుకోవడం ప్రారంభించారని మిషనరీలు తమ కొత్త మతాన్ని ప్రచారం చేయటానికి రాగా వారికి స్వాగతం లభించిందనీ, మసీదులు కట్టడానికి ప్రజలు, ప్రభుత్వం అభ్యంతరం పెట్టలేదని నెహ్రూగారు వ్రాశారు. నిజానికి భారతదేశం మొదటినుండి మత సహనానికి పేరు గాంచిన దేశం. అన్ని మతాలనూ, నమ్మకాలనూ సమభావంతో చూచి, అన్ని దేశాలవారినీ సహనంతో ఉండనిచ్చారు మన భారతీయులు. ఆనాటి కావ్యాలలోను, తురుష్కుల ప్రసక్తి ఉన్నది. రంగనాథ రామాయణంలో సీతాస్వయంవర సందర్భంలో మిధిలకు విచ్చేసిన రాజులలో తురుష్క రాజులున్నారు. ‘కాళింగ నేపాళ కర్ణాటలాట మాళవ సౌవీర మగధ పాంచాల కురుపాండ్య బర్బరకుంత లావంతి, మరు తురుష్కాభీర మనుజ వల్లభుల’ కనుక ఒకవేళ ఇది ఇస్లామును సూచించే తుఱుక అన్న పదమే అయితే మనవారికి తురుక శబ్దం కొత్తదేమీ కాదు. కాకతీయులనాటి (ప్రేమాభిరామానికి తెలుగు రూపమైన) క్రీడాభిరామంలో మంచెన శర్మ, టిట్టిభులు ఓరుగల్లులో పాండవుల గుడిని, ముసానమ్మ గుడినీ, ఏకవీరాలయాన్నే కాక తురకల మసీదును కూడా చూసారు. ఢిల్లీ సుల్తాన్ దండయాత్రల తరువాత కట్టినదే అయితే ఆ తురకల మసీదు పాండవుల ఆలయం, ఏకవీరాదేవి ఆలయాలతో పాటు ఉండేది కాదు. అది ఆనాటి వారి పరమత సహనానికి, ఇతర మతాల అదరణకూ తార్కాణం కనుక తుఱుక అన్న పదం తెలుగుపదాల్లో ప్రవేశించి ఉండవచ్చును.

ఇక తుఱుకమాంబ పేరు గురించి చర్చించాలి. పూర్వకాలంలో పిల్లలు కలగడానికి రకరకాల దేవుళ్ళకి మొక్కుకొనేవారు. ఆ దేవుళ్ళు ఏ మతానికి చెందినవారైనా జనం మొక్కుకొని మొక్కు ఫలించి సంతానం కలిగితే ఆ దేవుని పేరు పెట్టుకొనేవారు. ఆ విధంగా కూడా తుఱుకమాంబకు ఆ పేరు వచ్చి ఉండవచ్చు. ఈ సందర్భంలో డా. ఎన్.ఎల్.ఎన్ ఆచార్యగారు తురక పదం దుర్గాశబ్దభవమని పి.వి. పరబ్రహ్మ శాస్త్రిగారు సూచించినట్లు ఉటంకించారు. దుర్గ, దురగ, తురుకగా మారి ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు. సాధారణంగా పరుషాలు సరళాలు అవడం కద్దు. కానీ సరళాలు పరుషాలు అవడం భాషా శాస్త్ర విరుద్ధం. పైగా దుర్గా శబ్దభవంగా దుగ్గ అన్న నామం ఆ రోజుల్లో వ్యవహారంలో ఉండేది. రేపొల్ల దుగ్గ రాజు కాజీపేట దర్గా శాసనంలో ప్రస్తావించబడినాడు. ఈ చర్చను బట్టి తుఱుక అన్న శబ్దం దుర్గా శబ్ద భవం కాదని నిశ్చయించవచ్చు. పైగా ఆ రోజుల్లో చాలమంది స్త్రీలు ఒకే పేరును కలిగి ఉండడం శాసనాలలో గమనిస్తాము. మైలమ, ముప్పమ, మేడమ, గుండమ, కుందమ, బెజ్జమ, మాచమ ఇత్యాది. కానీ ఎక్కడా ఈ తుఱుకమాంబ అన్న పేరు ఇంకెవరికీ లేదు. కాబట్టి ఇది ఒక ప్రత్యేకతను సూచిస్తుంది. అంటే పిల్లలు పుట్టి మరణిస్తూంటే లేక చావుబ్రతుకుల్లో ఉన్నపుడు విలక్షణమైన పేరునో లేక ఏ సాధువు (సూఫీ సెయింట్) పేరునో పెట్టుకోవడం వల్ల కేవలం ఆ బిడ్డకు మాత్రమే ఆ పేరు పరిమితమౌతుంది. ఈ నాటికీ కొంతమంది హిందువులకు మస్తాన్ రావు, భానుమస్తాను, మస్తానురెడ్డి వంటి పేర్లు ఉండటం కద్దు. అదే విధంగా గంగాధరుని తల్లికి కూడా ఆ పేరు పెట్టి ఉండవచ్చు. అయితే ఈ తుఱక శబ్దం ఈనాటి ముస్లిం అన్న అర్థంలో టర్కశబ్ద భవంగా ప్రయుక్తం అవకపోవచ్చు. పూర్వం టర్క్ లనబడే వారు రకరకాల జాతులలో ఉండేవారనీ, మధ్య ఆసియా, చైనీస్ టర్కిస్ధాన్ ప్రాంతాల ప్రజలు కూడా టర్క్‌లు లేదా తుర్కలన బడేవారని పండిత్ జవహర్లాల్ నెహ్రూగారు తమ డిస్కవరీ ఆఫ్ ఇండియాలో వ్రాశారు. ఈ విషయాన్ని చర్చిస్తూ ఈ క్రింది విధంగా వ్రాశారు. ఆసియాలో మహమ్మదీయ మతానికి ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు అరబ్బులు కాదు. పైన చెప్పబడిన టర్కులు (తురుకలు) మంగోలులు. (వీళ్ళే తర్వాత ఇండియాలో మొఘలులుగా పిలవబడ్డారు.) ఈ మంగోలులు పశ్చిమాసియాలో ముస్లిములుగానూ, తూర్పు, మధ్య ఆసియాలలో బౌద్ధులుగానూ మారారు. చివర చెప్పబడిన వారిలోని బౌద్ధులే దక్షిణ హిందుదేశంలో ముఖ్యంగా ఆంధ్రదేశంలో బౌద్ధమతం వర్ధిల్లిన రోజులలో ప్రచారం కోసం చేరి ఉంటారు. అటువంటి వారిలో ఒకరైన తుఱుకదేవుడనే బౌద్ధుని అశీర్వాదం వల్ల పుట్టిన బిడ్డ అవడం వల్ల గంగాధరుని తల్లికి తుఱుకమాంబ అని పేరు వచ్చి ఉండటానికి ఆస్కారమున్నది. దీనికి పూర్వమున్న శాసనాలలో తురగనాచార్య అనే పేరు కన్పించింది.

బౌద్ధముని ఆశీర్వాదం వల్ల జనించిన తుఱుకమాంబకు బుద్దునిపై విశేషమైన భక్తి ఉండి ఉంటుంది. పూర్వకాలంలో భర్తలు హిందూ ధర్మపరాయణులై యజ్ఞాలు యాగాలు చేస్తే, భార్యలు బౌద్ధమతాన్ని అభిమానించి దానాలు చేయడం చరిత్రలో కొత్త విషయం కాదు. ఆ విధంగానే తుఱుకమాంబ కూడా భర్త గోవిందుడు హైందవ ధర్మపరాయణుడైనా బుద్ధుని కొలిచి వుంటుంది. తన తల్లి కారణంగానే గంగాధరమంత్రి కూడా బుద్ధునిపై భక్తి కలిగుండి బుద్ధ ప్రతిష్ఠ చేసి ఉంటాడు. తల్లి పై భక్తి గల గంగాధరుడు తుఱుకమాంబను పతివ్రతా గుణవిభాసి, భాగ్యవతి, మహాసతి అని శాసనంలో కీర్తించాడు. తన తల్లిదండ్రులు తనను ప్రేమతో పెంచి చదివించి విద్యావంతుని చేసి, పెండ్లి చేసి పోషించారని శాసనాలలో గంగాధరుడు చెప్పుకొనడం వల్ల అతని తల్లిదండ్రులకు ముఖ్యంగా తల్లికి గంగాధరమంత్రి పట్ల గల ప్రత్యేక శ్రద్ధ తెలుస్తున్నది. బుద్ధుని హరిస్వరూపంగా తలచి బుద్ధ ప్రతిష్ఠచేసి, త్రిమూర్తులకు ఆలయాలు నిర్మించి, సప్త సంతానాలైన ఆలయ, ఉద్యాన వన వాపీతటకా కాదు నిర్మలను నిర్మించిన గంగాధరునికి సర్వమత సమానత్వభావన కలిగించినది అతని తల్లి తుఱుకమాంబ కావచ్చును.

పద్మావతి:

ఈమె కొప్పరం లోని కోదండ రామస్వామి ఆలయంలో నర్తకి. ఈమెను నర్తకీ తిలకము అని ప్రస్తుతించారు. పైగా తక్కిన కళాకారులందరి కంటే ఈమెకు భూమి ఎక్కువ ఇవ్వడమైంది. కనుక ఈమె ఆ నాటి సుప్రసిద్ధ నర్తకి అయివుంటుందని భావించవచ్చు.

ఆరుద్రగారు రచించిన ప్రజాకళలు, ప్రగతి వాదులు అన్న పుస్తకంలో గీతగోవిందానికీ, తెలంగాణాకూ ఏమిటి సంబంధం? అన్న వ్యాసంలో జయదేవుని కాలం గురించి, నర్తకి పద్మావతిని గురించి చర్చించి, అతడు క్రీ.శ 1179 నుంచి 1205 దాకా పాలించిన లక్ష్మణసేనాని ఆస్థానకవిగా ఉండేవాడనీ, జయదేవునికి గీతగోవిందరచనకు పూర్వమే పద్మావతితో పరిచయం ఏర్పడి అతడు చేస్తే ఆమె నాట్యం చేసి ఉండవచ్చునని చెప్పారు.

పూరీజగన్నాధంలో జయదేవుని గీతగోవిందం నిత్యం గానం చేసే ఆచారమున్నది. అక్కడ క్రీ. శ. 1499 నాటి ఒక శాసనంలో పెద్ద దేవరివారి నట్టున మేళము వారున్నూ, కపిలేశ్వర దేవరి వారి ఆటగత్తెలున్నూ, తెలంగాణమునకు చెందినటు వంటి ప్రాచీన నాట్య బృందం వారున్నూ పెద్దదేవరి వారి అనుగ్రహాన, గీతగోవిందం వినాతదితర కీర్తనలు నేర్వరాదు. వారు తదితర కీర్తనలు పాడరాదు అని ఉన్నది. ఇది ఆరుద్ర గారు ఒరియా శాసనానికి ఉన్న ఆంగ్లానువాదానికి తెనిగించిన శాసనం లోని కొంతభాగము. ఒరియా శాసనం క్రింద ఇవ్వబడింది.

పూరీ జగన్నాధాలయంలోని ఒరియా శాసనం

  1. వీర శ్రీ గజపతి గౌడేశ్వర నవకోటి కర్నాట కలవర యెసర వీరవర శ్రీ ప్రతాపరుద్ర దేవ
  2. మహా రాజాంక సమస్త అంక శ్రాహి కకడ సు 10 బుధ వేరే అవధారీత్ ఆర్యంగా ప్రమాణే వడ
  3. ఠాకురంక గీత గోవింద ఠాకుర భోగవేవే ఎనాట హొఈవ! సంఝాధుప సరిలాఠారు
  4. వడ సింగార పరియనై ఎనాట హొవ! వడఠాకురంక సంపరదా కపిలేశ్వర ఠాకురంక వన్ధా
  5. నా చణీమాన పురుణా సంపరదా తెలంగీ సంపరదా ఎమానే సవిహేం వడ ఠాకురంక గీతగో
  6. వింద హబ్ ఆనగీత నసిఖీవె! ఆనగీత న గా ఈవే! ఆన నాచ హో పరమేశ్వరంక ఛామురేన
  7. హవ ఎ నాట వితరకె వైష్ణామ్ గాణా చారీ జన అభన్తి ఎమానె గీతగోవింద గీతహి సేగావె
  8. ఎహాంక ఠారు అశిక్షిత మానె ఎకస్వర రెశ్రుణి గీతగోవిన్ద గీత హింసె సిఖివె ఆన గీత న శిఖీవె ఎహా
  9. జే పరీక్షా ఆనగీత నాట కరా ఇలే జానీ సే జగన్నాథంక ద్రోహకరఇ

దీన్ని బట్టి పూరీలోని జగన్నాథ స్వామి ఆలయంలో (తెలంగీ) తెలంగాణాకు చెందిన (ఉత్తర హిందూస్థానం వారు దక్షిణదేశం వారిని మద్రాసీలు అన్నట్లు బహుశా కాకతీయుల కాలంలో తెలుగుదేశం నుంచి వచ్చిన వారిని తెలంగాణాకు చెందిన వారిని భావించేవారేమో) ప్రాచీన నాట్య బృందం ఒకటి ఉందని తెలుస్తున్నది. వారు గీతగోవిందం తప్ప వేరే కీర్తనలు నేర్వరాదు, తదితర నాట్యములు ఆభినయించి ఆడరాదు అని నిబంధన ఒకటి ఉండటం వల్ల ఈ తెలంగాణాకు చెందిన ప్రాచీన నాట్య బృందానికి జయదేవునికి గీతగోవిందానికి ఏదో బలమైన కారణం ఉండి ఉంటుందని వారు భావించారు. జన్మతః జయదేవునికి ఏ సంబంధంలేని తెలంగాణాను శాసనంలో ఎందుకు పేర్నొవలసి వచ్చిందని ఆరుద్ర గారు ప్రశ్నించి బహుశా జయదేవుని కాలంలో ప్రాచీన నాట్య బృందం వారు పూరికి వచ్చి స్థిరపడి ఉంటారని అభిప్రాయపడ్డారు.

జయదేవుడు గీతగోవిందం అవతారికలో పద్మావతి చరణ చారణ చక్రవర్తి నని చెప్పుకొన్నాడు. ‘విహిత పద్మావతి సుఖసమాజే భణతి జయదేవ కవిరాజ రాజే’ అని 21వ అష్టపదిలో చెప్పాడు. అయితే పద్మావతి జయదేవుని భార్య, కులాంగన అని కొందరు భావిస్తే శృంగారగీతాలకు అభినయం చేసే ఆమె కులాంగన కావడానికి వీల్లేదని ఇతరులు విశ్వసిస్తారు. ఆనాటి సాంఘిక పరిస్థితులను బట్టి ఆమె కులాంగన కాక నర్తకి అయి వుంటుందని అనుకోవడమే సబబు, పైగా శృంగార రసావేశంలో ‘పద్మావతి చరణ చారణ చక్రవర్తి’నని ఒక నర్తకితో తన సంబంధాన్ని గురించి కవి చెప్పుకోవచ్చునేమో గానీ ఆనాటి కులాంగనలకు ఆ అదృష్టం మాత్రం లేదు. మాంచాల ‘మేలనుభవించెడి మెలతలువారు, చావనోచినయట్టి సకియను నేను’ అని బాలచంద్రుని వేశ్యల గురించి చెప్పిన సందర్భంలో పలికిన పలుకులలో ప్రస్ఫుట మౌతున్నది. కనుక పద్మావతి కులాంగన కాక నర్తకి అనడానికి ఎక్కువ ఆస్కారముంది.

కాటమ రాజు కధ వల్ల కాకతీయ యుగంలో కటకంలో జగన్నాథునికి మొక్కులు మొక్కుకునే వారు గనుక జయదేవుని కాలంలో జగన్నాథుని ఆలయంలో తెలుగువాళ్ళు కొందరు తమ బిడ్డలను దేవదాసీలుగా అర్పించడం ఉండేదేమో నని ఆరుద్రగారు అభిప్రాయపడ్డారు. పద్మావతి పేరు ఆమె తెలంగాణాకు సంబంధించినదనడానికి సాక్ష్యమని చర్చించి తేల్చారు. కనుక పూరీ ఆలయంలో శాసనంలో ప్రసక్తమైన తెలంగాణాకు చెందిన ప్రాచీన నాట్య బృందంలో పద్మావతి వచ్చి ఉండాలి అనీ, ఆమె జయదేవుని ప్రియురాలు కావడంవల్ల ఆమెతో వచ్చిన ఇతర దేవదాసీలకు గీతగోవిందం పై ఒక రకమైన ఆడపడుచు హక్కు ఏర్పడి ఉండవచ్చునని ఊహించారు. దాదాపు మూడు వందల ఏళ్ళుగా ఈ కుటుంబాల వారంతా జగన్నాథుని సన్నిధిలో ఈ ప్రబంధాన్ని అభినయిస్తూండడం ప్రతాపరుద్ర గజపతి గమనించి ఆ సంప్రదాయం శాశ్వతంగా కొనసాగేటందుకు ఈ శాసనాన్ని వేయించి ఉండవచ్చునని వారు అభిప్రాయపడ్డారు.

ఆ కాలంలో పద్మావతి ప్రసక్తి వచ్చిన శాసనం ఏదైనా తెలుగుదేశంలో ఉన్నదా అని పరిశీలిస్తే క్రీ.శ. 1115 నాటికి చెందిన కొప్పరం కోదండరామస్వామి ఆలయంలోని ముందు చెప్పబడిన శాసనంలో పద్మావతి అనే ఒక నర్తకి ప్రసక్తి కానవచ్చింది. కన్నారదేవుడనే మండలేశ్వరుడు తన మంత్రి మార కట్టించిన సోమేశ్వరాలయంలోని సోమేశ్వరునికి కొప్పరం గ్రామాన్ని దానమిచ్చాడు. ఇచ్చిన భూములు వివరాలు ఇచ్చిన సందర్భంలో నర్తకీ తిలకం పద్మావతికి ఖ 12 (ఖండ్రుకలు) వ్రీహి 6 ఖండుకలు అని ఉన్నది. స్థానపతికి క్షేత్రం 20 ఖండుకలు వ్రీహి 15 ఖండుకలు ఇవ్వగా పూజారి పవిత్రరాశికి 5 ఖండుకలు, వ్రీహి 2 ఖండుకలు ఇచ్చారు. గాయకి, నాద దాయకునికి ఇతరులకు తక్కువ భూమిని ఇచ్చారు. పద్మావతికి నర్తకీ తిలకమనే మన్ననతో పాటు ఎక్కువ భూమిని ఇవ్వడాన్ని బట్టి చూస్తే ఆమె స్థానపతి తరువాత స్థానాన్ని పొంది ఉంటుందనీ, దేవదాసి వలె సాధారణ స్త్రీ కాక తన నాట్యకౌశలం గుణోన్నతిని బట్టి గౌరవాన్ని హోదాని కలిగి ఉంటుందని ఊహించ వచ్చును. అంటే ఆ నాటికి ఆమె ప్రసిద్ధ నర్తకి అయివుంటుందని తీర్మానించ వచ్చును. అయితే ఈ సోమేశ్వరాలయంలోని నర్తకి పద్మావతి పూరీ జగన్నాథాలయానికి ఏ విధంగా చేరి ఉంటుందన్నది చర్చింపదగ్గ విషయం. నర్తకి పద్మావతి ఉన్న సోమేశ్వరాలయానికి దానమిచ్చిన సామంతుడు, మండలేశ్వర కన్నారదేవుడు ఉత్కలపతిని ఓడించిన మొదటి సోమేశ్వరుని కొడుకు, నాగవంశజుడు. ఇతడు క్రీ.శ. 1111లో ఆధికారానికి వచ్చాడు. ఆ సందర్భంలోనే సోమేశ్వరాలయానికి కొప్పరం గ్రామాన్ని దానంగా ఇచ్చి ఉంటాడు. కళింగాధిపతి అనంత వర్మ చోడ గంగరాజు వేంగీపతిని ఓడించి తిరిగీ సింహాసనస్థుడిని చేసి నపుడు కన్నారదేవరాజు కప్పంలో భాగంగా నర్తకి పద్మావతిని అనంతవర్మకు సమర్పించి ఉండవచ్చు. ఆ విధంగా పద్మావతి అనంతవర్మచోడ గంగరాజు కట్టించిన పురుషోత్తమాలయానికి (పూరీ క్షేత్రాంలోని జగన్నాథాలయం) చేరి ఉంటుంది.

ప్రచారంలో ఉన్న మరొక కథ ప్రకారం ఆంధ్రదేశానికి సంబంధించిన దేవలశర్మ అనే బ్రాహ్మణుడు పద్మావతిని పూరీ లోని జగన్నాధునికి అర్పించడానికి వచ్చి, తన కలలో కనిపించి జగన్నాథదేవుడు చెప్పిన విధంగా అక్కడ ఉన్న కవి జయదేవునికి అప్పగించమని అక్కడి అర్చకులకు చెప్పి తన దేశానికి తిరిగి వెళ్ళిపోయాడు. జయదేవుడు మొదట వివాహం చేసుకోవటానికి నిరాకరించినా తరువాత అర్చకులకు కలలో దేవుడు కనిపించి చెప్పిన తరువాత పద్మావతిని చేపట్టాడు. పేరేదైనా ఆంధ్రదేశానికి సంబంధించిన బ్రాహ్మణుడు ఆ కాలంలో ఉన్నట్లు పూరీలోని శాసనాలలో ఏదైనా ఆధారం ఉన్నదా అని చూడాలి. డా. రాజగురు గారిచ్చిన అముద్రిత శాసనానికి నకలు ఇది:

  1. శ్రీ శాకాబే (అ)వనివేద ఖేన్దు
  2. గణితే కన్యాగతే భాస్కరే (1) దీ
  3. పంశ్రీ పురుషోత్తమే (మా) య
  4. విశదా వ్య(ద్ధ) (క) త్తోరఖణ్డంసదా (1)
  5. గంగ (క్షేత్రో) ప ధీ(ద) సం (శం) ప్ర దత్త(?)
  6. శ్రీ సుధీ గోవిన్ద నామ్నా- – – – –
  7. ——–
  8. బ్రా(హ్మ) ణేనాలంకారే వరేషువి
  9. స్వ(శ్వ) విది తః (1) కార్షా పణేనాం
  10. కృతః ——
  11. ——

పై శాసనాన్ని బట్టి తెలుగు బ్రాహ్మణుడైన గోవిందుడనే పండితుడు పురుషోత్తమాలయంలో క్రీ.శ. 1129 లో అఖండ వర్తి దీపం దానం చేశాడని తెలుస్తున్నది. ఇక్కడ లభ్యమైన వాటిలో ఇంకా తెలుగు శాసనాలు ఉన్నాయి. వాటిని బట్టి తెలుగు దేశం నుంచి భక్తులు వచ్చి జగన్నాథుని దర్శనం చేసుకొనేవారని తెలుస్తున్నది. బహుశ ఆ తెలుగు పండితుడు అనంతవర్మ చోడగంగు వేంగిని జయించి తిరిగి వెళ్ళేటపుడు వెంట తీసుకు వెళ్ళిన పండితులలో ఒకరై ఉండవచ్చు. ప్రచారంలో ఉన్న కథ ప్రకారం పద్మావతిని పూరికి తీసుకువెళ్ళిన బ్రాహ్మణుడు ఇతడు కావచ్చునని భావించవచ్చును.

అయితే కవి జయదేవుడు సోమేశ్వరాలయంలోని నర్తకి పద్మావతికి సమకాలికుడు అయితేనే ఈమె జయదేవుని ప్రేయసి పద్మావతి అని నిర్ధారణ అవుతుంది. కవి జయదేవుని కాలం, ఎక్కడి వాడూ అన్న అంశాలపై చాలా పరిశోధనలు జరిగినాయి. చివరకు ఆయన పూరీ సమీపంలో ఉన్న కిందు బిల్వం (ఇప్పటి కెందులి) నివాసి అని పరిశోధకులు తేల్చారు. సుప్రసిద్ధ చారిత్రక పరిశోధకులు, ఒరిస్సా శాసనాల పరిష్కర్త డా. రాజగురు గారు కవి జయదేవుడు 12వ శతాబ్ది ఉత్తర భాగం వాడని ఆధారాలతో నిరూపించారు. ఆయన జయదేవుని గురించి మరి కొన్ని ఆసక్తిదాయకమైన అంశాలను వెల్లడించారు.

ఆనాడు శ్రీకూర్మం దేవాలయం ప్రసిద్ధమైన వైష్ణవక్షేత్రముగా, శ్రీ రామానుజ, మధ్వాచార్యులను అనుసరించిన వైష్ణవ పండితులు అనేకులకు విద్యాకేంద్రంగా కూడలిగా ఉండేది. కవి జయదేవుడు కూడా వైష్ణవ సాధువుగా అక్కడ నివసిస్తూ భక్తి మార్గాన్నను సరించిన కవుల లాగే రాధాకృష్ణుల ప్రేమను జీవాత్మ పరిమాత్మల కలయికగా భావించి కవిత్వాన్ని అల్లినవాడు. ఆయన కవిత్వంలోని భాష, భావం అక్కడి వారినెంతో ముగ్ధుల్ని చేసేది. ఆ ఆలయంలో నృత్యాన్ని నేర్చుకొనే నర్తకులు నృత్యాంగనలు ఎందరో జయదేవుని వద్ద దీక్ష పొందీ ఆయన వద్ద శిష్యరికం చేసి ఆయన కీర్తనలను నేర్చి అభినయించేవారు. ఆటువంటివారిలో మేడమ దేవి ఒకతె. ఆమె వేయించిన శాసనమిది: (నం-1)

  1. స్వస్తి శ్రీ రాఘవ దేవస్య ప్రవర్ధమాన (విజయ)
  2. సుది 20 వారే బుద్ధ (ధే) శ్రీకి (కీ)ర్తి వాసేశ్వరస్స ప్రీ,) తయే మేడమ దే (వ్యా?)
  3. యదాద్యావ (ద) ఖణ్డ (ణ్డా) క్షవత్తె (త్తి) స్యా మాతాపితరౌ త కొమినాయకన్ క (కీ)
  4. ర్తివాసే స్వ(శ్వ) (ర) స్సప్రీతయే దీపం దద్యాతా!! కుర్మపాటక ప్రతి
  5. ర సాధు ప్రధాన జయదేవ సమవాయ (?) దేవధరగ్రామ దాస పుర స్రేఠి
  6. హస్తాత్ క్రీతా వాహేడాఖణ్డ క్రే (క్ష) త్ర స్య కీర్తి వాసే స్వ(శ్వ) రాయ ధీ(లా)

శ్రీ రాఘవ దేవుని 10వ విజయ రాజ్య సంవత్సర కార్తి పూర్మిమ దశమి బుధవారం మేడమదేవి ఆమె తల్లి, తండ్రి కీర్తి వాసేశ్వర దేవుని ప్రీత్యర్ధం అఖండ దీప దానం చేశారు. ఈ దానాలకై శ్రీ కూర్మపాటక, సాధు ప్రధానుడు జయదేవుని సమక్షంలో దేవధర గ్రామాన్ని వాహేడాఖండ క్షేత్ర మనే పేరు దాసపురానికి చెందిన శ్రేష్ఠి వద్ద కొన్నారు. (ఇది డా. రాజగురు గారి ఇంగ్లీషులోని శాసన సారాంశానికి తెలుగు అనువాదం). కానీ శాసనాన్ని చదివితే ఇది మేడమ దేవి తన తల్లిదండ్రుల కొరకు కీర్తివాసేశ్వరునికి (లింగరాజాలయంలోని దేవుడు) అఖండ దీపం దానం చేసి, అందుకై దేవ ధరగ్రామంలోని దాసపుర శ్రేష్ఠి వద్ద సాధు ప్రధాన జయదేవుని సమక్షంలో వాహేడాఖండ క్షేత్రాన్ని కొని అర్పించి ఉంటుంది అని అన్వయించ వచ్చును. ఈ శాసనం క్రీ.శ. 1163 నాటిది. ఈ శాసనంలోని మేడమ, ఆమె తండ్రి కొమ్మినాయకుడు వేయించిన శాసనాలు ముఖలింగం లోని మధు కీశ్వరాలయంలో ఉన్నాయి. క్రీ.శ. 1173 నాటి మధుకీశ్వరాలయ శాసనంలో కొమ్మినాయుడు మధు కీశ్వరునికి అఖండ దీప దానం చేశాడు. ఈ ఆలయంలోని క్రీ.శ. 1128 నాటిదే అయిన మరొక శాసనంలో మేడమ, ఆమె తండ్రి కొమ్మినాయకుడు అఖండ దీపదానం చేశారు. ఈమె తల్లి నంగమ. ఈ నంగమ మధుకీశ్వరాలయంలోని గుడిసాని యెఱకమకు పుత్రిక.

డా. రాజగురు గారు పై శాసనాలను పరిష్కరించి చెప్పిన అంశాలను, ఇంతకుముందు చర్చించిన విషయాలను బట్టి ఈ విధంగా సమన్వయించ వచ్చును.

శ్రీ కూర్మం దేవాలయం ఆ కాలంలో ప్రసిద్ధి చెందింది. దేశంలో నలమూలల నుంచి పండితులు విద్యార్థులు అక్కడకు వచ్చి రకరకాల శాస్త్రాలను అధ్యయనం చేసేవారు. కవి జయదేవుడు కూడా అక్కడ ఉండేవాడు. ఆ దేవాలయం కళాక్షేత్రంగా కూడా ప్రసిద్ధమైనది. నృత్యాంగనలెందరో నాట్యాన్ని అభ్యసించేవారు. వారు కవి జయదేవుని వద్ద దీక్ష స్వీకరించి అయన కీర్తనలను వారు నేర్చి అభినయించేవారు. ఆ విధంగా నర్తకులు అయనను సాధు ప్రధానగా మన్నించేవారు. శ్రీకూర్మం నుంచి వచ్చిన జయదేవుని పైన చెప్పిన శాసనంలో శ్రీకూర్మపాటక, సాధు ప్రధాన జయదేవుడని సంబోదించారు. ఆ శాసనాలను బట్టి జయదేవుడు క్రీ.శ. 1113 నాటికి శ్రీకూర్మంలో ఉండి క్రీ.శ. 1128 నాటికి మేడమ వంటి నర్తకులకు ఆచార్యుడై ఉంటాడు. అనంతవర్మ చోడగంగు క్రీ.శ. 1127లో ఆరవ విక్రమాదిత్యుడు మరణించగానే వేంగిపై దండైత్తి గోదావరీ మండలాన్ని ఆక్రమించాడు. ఆరవ విక్రమాదిత్యుడికి, వేంగీమండల చక్రవర్తులకి వెలనాడు అధీనంలో ఉండేది. అనంతవర్మచోడ గంగరాజు ఆ సందర్భంలో సామంతులనుంచి గ్రహించిన కప్పంతో పాటు, తాను కట్టబోయే పూరిలోని పురుషోత్తమ దేవాలయం కొరకు దేవదాసీ జనాన్ని దేవాలయ కళాకారులలో ప్రముఖులను, పండితులను తనతో తీసుకువెళ్లి ఉండవచ్చు. ఆ విధంగా నర్తకీ తిలకమైన పద్మావతి పూరీ జగన్నాథ క్షేత్రాన్ని చేరి ఉండవచ్చు. క్రీ.శ. 1163 నాటి శాసనాన్ని బట్టి రాఘవ దేవుని కాలం నాటికి సాధు ప్రధానుడిగా మన్నన పొందే వయసు కలిగి ఉంటాడు. నర్తకి పద్మావతి నృత్యకౌశలానికి ప్రేరితుడై తన అష్టపదులను ఆమె ఆభినయిస్తూండగా జయదేవుడు గీతగోవింద కావ్యాన్ని అంత గొప్పగా రూపొందించి ఉంటాడు. కవికి నర్తకి, నర్తకికి కవి పరస్పర ప్రేరకాలవడమన్నది లోకంలో కొత్తకాదు. జయదేవుని గీతగోవింద రచనకు ప్రేరకమైన పద్మావతి నాట్యం ఆనాటి ఆంధ్ర సంప్రదాయ నాట్యమన్నది గమనించ దగ్గ విషయం. అందుకనే ఆ సంద్రాయాన్ని పద్మావతి వంశంలోని తరువాత తరాల నర్తకీమణులు, నాటి తెలంగాణా (తెలుగు) ప్రాంతాలనుంచి వచ్చిన నాట్యకత్తెలు తమ నాట్యంతో కాపాడి వుంటారు. కనకనే దాదాపు మూడు వందల ఏండ్ల తరువాత 15 శతాబ్దిలో ప్రతాపరుద్ర గజపతి పై నర్తకులందరికీ గీతగోవిందం ఆభినయించడం ఒక హక్కుగా ఇచ్చి శాసనం వేయించాలని నిర్ధారించి ఉండవచ్చును. ఆ విధంగా గీతగోవింద కావ్యం రచించిన కవి జయదేవునికి ప్రేయసియై, ప్రేరకమై ‘పద్మావతీ చరణ చారణ చక్రవర్తి’ననీ, ‘విహిత, పద్మావతీ సుఖసమాంజే భణతి జయదేవ కవి రాజరాజే’ అని ఆ మహాకవి గర్వంగా చెప్పుకునే విధంగా నాట్యం చేసిన నర్తకీ తిలకం పద్మావతి తెలుగింటి ఆడపడుచు అవడం గర్వించదగ్గ విషయం.

(సశేషం)

Exit mobile version