[డా. మంత్రవాది గీతా గాయత్రి గారు 1995లో పిహెచ్‍డి పట్టా కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖకి సమర్పించిన సిద్ధాంత వ్యాసాన్ని సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము.]
ప్రకరణం 2 కాకతీయుల కాలంనాటి స్త్రీలు – ఒక పరిగణన – ఐదవ భాగం:
శాసనాలలో ప్రసక్తమైన స్త్రీలు
భర్తలు, కొడుకులు వేయించిన శాసనాలలో ప్రసక్తమైన స్త్రీలు:
1. జన్నమ (క్రీ.శ. 1120):
వెలనాటి రాజేంద్రచోడుని ముదిసెలి (రాజేంద్ర) చోడ క్షితిప భుజసహాయో (మంత్రి నారాయణ) నారాయణ ప్రగ్గడ తల్లి. ఈమె ధర్మార్థం ఉత్తరాయణ సంక్రాంతినాడు అఖండదీపం భీమేశ్వరునికి దానమివ్వడమైనది.
2. పిట్టమ (క్రీ.శ. 1122):
మడపలి నూకాండి అయిన మగధరాయనికి తల్లి శక సం. 1044 న చేబ్రోలులో తమ రట్టడికంలోనూ, కవడ్డ రట్టడికంలోనూ కొంత భూమిని భీమేశ్వరునికి దానమిచ్చాడు.
3. బాదాంబిక (క్రీ.శ. 1129):
కాడ్వెట్టి కులంలో పుట్టిన మందడలిక బొద్దినాయకునికి, భీమనాయకునికి తల్లి. ఈమె కొడుకు భీమినాయకుడు శక సం. 1051 ఉత్తరాయన సంక్రాంతి నాడు భీమేశ్వరునికి నాలుగు అఖండ దీపాలకై ఇనపఎడ్లను దానమిచ్చాడు.
4. సబ్బాంబిక (క్రీ.శ. 1132):
వెలనాటి రెండవ గొంక భూపతి ధర్మపత్ని అయిన ఈమె రమణీయమైన రూపం కలదనీ, ముల్లోకాలలో గుణాలు కలదనీ, సౌందర్యవతి, సహనంలో భూదేవి వంటిదనీ అంతులేని సుగుణాలు కలదని వెలనాటి పృథ్వీశ్వరుని శాసనంలో ప్రశంసించబడింది. ఈమె పుత్రుడు రాజేంద్రచోడుడు తనను సబ్బాంబికా పుత్రుడని క్రీ.శ. 1173 నాటి త్రిపురాంతక శాసనంలో చెప్పుకొన్నాడు.
5. కొసనాసాని:
వెలనాటి కులోత్తుంగ చోడగొంకరాజులు పాదపద్మోపజీవి అయిన యమడాల దూబాడశాసనుడు కసవియ వెదురయ అనునతని తల్లి ఈ కొసనాసాని. ఈమె భర్త యెఱియమ నాయకుడు. కసవియ వెదురయ తన తల్లిదండ్రులకు ధర్మార్థంగా రామేశ్వరదేవునికి అఖండదీపం అర్పించాడు.
6. మాకమవ్వ/మాకాంబ (క్రీ.శ. 1133):
ఇట్టగెయాగ్రహారంలో బాగిమాది మయ్యనాయకుల కోడలు గోవిందరాజుల భార్య. ఈమె పుత్రుడు లక్షణ దండనాయకుల మహాప్రధాని సిద్ధమయ్య నాయకుడు.
7. తొండిదేవి (క్రీ.శ. 1135):
కోన రాజపనేని భార్య, కులపత్ని (ఆసీన్నామ్నాదయితాకులజా శ్రీ తొండిదేవీతి) ఈమె కుమారులలో ఒకరు రాజేంద్రచోడరాజు. అతని తమ్ముడు సత్తిరాజు. ఈతడు తన తల్లి తొండిదేవికి ధర్మార్థం భీమేశ్వరునికి శక సం. 1057, ఉత్తరాయన సంక్రాంతి నాడు అఖండవర్తి దీపానికి కొంత భూమిని దానం చేశాడు.
8. వెన్నిదేవి (క్రీ. శ. 1135):
రాయపరాజు కొడుకు పెర్మడిరాజుకు తల్లి వెన్నిదేవి. శక సం. 1057, ఉత్తరాయన సంక్రాంతినాడు పెర్మడిరాజు తన తల్లి ధర్మార్థం భీమేశ్వరునికి అఖండదీపాన్ని అర్పించాడు.
9. సూరాంబిక ( క్రీ.శ. 1138):
వెలనాటి గొంక రాజేంద్రచోడుని మంత్రి శ్రీధరుని భార్య (శ్రీధర నాయకస్య వనితా సూరాంబికా సువ్రతా) ఈ సూరాంబిక. వీరి కుమారుడు కంటియ ప్రెగ్గడ. శ్రీధరుని తాత కమ్మనాటి బ్రాహ్మణుడు పోతన సోమయాజి తండ్రి దొడ్డపనాయకుడు కొడుకు కంటియ ప్రెగ్గడ.
10. మల్లాసాని (క్రీ.శ. 1139):
మహామండలేశ్వర కులోత్తుంగ చోడగొంకరాజుల మామ దండనాయక పెఱ్ఱయ. అతని తల్లి మల్లాసాని. తండ్రి మారినాయకుడు. అతడు తల్లిదండ్రులకు, కొడుకు మారినాయకుడికి ధర్మార్థం మూడు అఖండదీపాలు అర్పించాడు.
11. బాదమదేవి (కాలం తెలియదు):
కొండపడమటి రాజవంశంలోని బుద్ధనృపుని భార్య. మహామండలేశ్వర చోడెరాజులకు తల్లి. చోడెరాజు తన తల్లి ధర్మార్ధం మూలస్థాన మహాదేవునికి అఖండదీపం సమర్పించాడు.
12. చెల్వాంబ (క్రీ.శ. 1141):
కులోత్తుంగ చోడ గొంకరాజులు ఇష్టభృత్యుడు, జననాధ నందనుడైన కూతాండి భార్య చెల్వాంబ. ఈమె కుమారుడు నూకాండి.
13. దామమాంబిక ( క్రీ.శ. 1142):
దామమాంబిక ఎఱియబోయుడనే వానికి తల్లి. తండ్రి గుండ్యబోయన. శక సం. 1064 మకర సంక్రాంతినాడు వలివేరి భడారికి దామవ పుత్రుడు దీపాన్ని సమర్పించినాడు. శాసనంలో ఒకచోట (పంక్తులు 5-6) ఆ గుప్తజుండు అని ఎఱియబోయుని గురించి పేర్కొన్నారు. (గూఢజుడు గుప్తజుడు ఒకడే కావచ్చు.)
14. బమ్మమ (క్రీ.శ. 1144):
పెనుగొండ శాసనుడు వెంగిన వైశ్యుడు నాబెలగోత్రుడు అయిన కోట కొమ్మిసెట్టి తల్లి బమ్మమ. ఈమె భర్త వియమసెట్టి. కోటకొమ్మిసెట్టి తన తల్లిదండ్రులకు ధర్మార్థంగా శక సం. 1066లో జలధీశ్వర దేవరకు అఖండ దీపాలు రెండింటిని సమర్పించాడు.
15. వింజమాంబ (క్రీ.శ. 1145):
పెనుగొండ సూక్కల మాదిసెట్టి భార్య వింజాంబ. ఈమె కొడుకు ప్రోలిసెట్టి శక సంవత్సరం 1067లో పట్టిన వీరభద్రేశ్వర దేవునికి అఖండదీపాన్ని సమర్పించాడు.
16. బూరమ (క్రీ.శ. 1145):
విల్లమభీముని మనుమడు పండడి భార్య బూరమ (భూరమ కావచ్చును). ఈమె కొడుకు భీమయ. ఈమెకు శీతకరాస్య అన్న విశేషణం వాడారు.
17. ఎఱియాంబ (క్రీ.శ. 1145):
ఈమె పైనచెప్పిన భూరమకు కోడలు. భీమయ భార్య. ఈమెకు జనించినవాడే భారతీనిలయుడని పేరుపడిన పండధరణీపతి.
18. జిల్లాంబిక (క్రీ.శ. 1146):
పెన్మద గ్రామాధినాథుడు నరసింహభట్టు భార్య ఈ జిల్లాంబిక. ఈమె పుత్రుడు మంత్రి విష్ణు.
19. కామసాని (క్రీ.శ. 1147):
కామసాని భర్త కాపిరెడ్డి. కొడుకులు కట్టారి దాసిరెడ్డి, కొమ్మరడ్డి విషువు సంక్రాంతినాడు బెజవాడ మల్లీశ్వరదేవునికి తల్లిదండ్రుల ధర్మార్థం అఖండవర్తి దీపం సమర్పించారు.
20. ఎఱియాంబ ( క్రీ.శ. 1149):
చతుర్థవంశజుడు దండనాయక శిఖామణి కామకు తల్లి. తల్లి ధర్మార్థం విషు సంక్రాంతినాడు కామన భీమేశ్వరదేవరకు అఖండదీపం సమర్పించాడు.
21. దెన్నవమహాదేవి ( క్రీ.శ. 1149):
గంగాన్వయుడైన శ్రీ మదనస్తవర్మ దేవర ద్వితీయలక్ష్మి అయిన దెన్నవ మహాదేవికి కొడుకు అట్టహాస దేవుడు. ఇతడు శక సం. 1071, కన్యా సంక్రాంతినాడు భీమేశ్వరుని అఖండవర్తి లోహదండు దివ్వెకై 50 ఇనప ఎడ్లను సమర్పించాడు.
22. కుప్పాంబిక (క్రీ.శ. 1149):
కమ్మనాంటి త్రిభువన మల్లదేవరాజు పెగ్గడ (అంటే మంత్రి కావచ్చు) అరియ పెగ్గడకు తల్లి. భర్తపేరు శాసనంలో శిధిలమైనది. ఈమెకు కులభామినీ, గుణవతి అనే విశేషణాలు వాడారు. ఈమె పుత్రుడు రాజచిహ్నము, ఛత్రము, మహాప్రధాన పదవి లభించిన సందర్భంలో కావచ్చును, ఉత్తరాయన సంక్రాంతినాడు దాక్షారామ భీమేశ్వరునికి అఖండదీపం సమర్పించాడు.
23. పేకాసాని (క్రీ.శ. 1149):
పెనుగొండ వాస్తవ్యుడు పెండిసెట్టి భార్య పేకసాని. వీరి కొడుకు కాపీసెట్టి. తండ్రి పెండిసెట్టికి తల్లి పేకసానికి ధర్మార్థం ఉత్తరాయణ సంక్రాంతి సందర్భంగా అఖండవర్తి దీపం సమర్పించాడు.
24. కుందాంబిక (క్రీ.శ. 1150):
కొండపడుమటి మండరాజు మనమడు గండనికి కొడుకు అయిన మండనికి భార్య కుందాంబిక. కొండ పడుమ డైబ్భైమూడు గ్రామాలకు అధిపతి అయిన మల్లనికి తల్లి. ఈమెకు మరొక పుత్రుడు కొండ పడుమటి బుద్ధరాజు.
25. వెన్నాంబిక (క్రీ.శ. 1151):
ముద్గల గోత్రుడైన పామలూరి ప్రభువు మండనామాత్యుని పుత్రుడు పడ్ల నామధేయుని భార్య వెన్నాంబిక. ఈమెను పతివ్రతాచార విచారవీధిలో అరుంధతి వంటిదని ప్రశంసించారు. శిష్టేష్ట విద్వజ్జన కామధేనురెవన్నాభికా అనడం వల్ల ఈమె కూడా శిష్టులను, ఇష్టులను, విద్వజ్జనులను ఆదరించేదని తెలుస్తున్నది. ఈమె పుత్రుడు పామలూరి కొమ్మనామాత్యుడు ఉత్తరాయణ సంక్రాంతినాడు తల్లిదండ్రులకు ధర్మార్థం నాదిండ్ల మూలస్థానదేవునికి అఖండవర్తి దీపాన్ని సమర్పించాడు.
26. ఎఱియాంబిక ( క్రీ.శ. 1153):
పెరువణిలు దారపరాజు భార్య. శాణ్డిల్యగోత్రుడు నామన పెగ్గడ తల్లి. నామన పెగ్గడ తల్లిదండ్రుల ధర్మార్థం ఉత్తరాయణ సంక్రాంతినాడు భీమేశ్వరునికి అఖండవర్తి లోహదండు దివ్వె కోసం ఇనపయెడ్లను దానంచేశాడు.
27. రొంబ్బూసాని ( క్రీ.శ. 1153):
చునుమూరు రెడ్డి ముప్పనాగనాయకుని తల్లి. ఈమె భర్త ముప్పమ్రాన నాయకుడు. ముప్పనాగనాయకుడు తన తల్లిదండ్రుల ధర్మార్థం, శక 1075 ఉత్తరాయణ సంక్రాంతి కాలంలో జునుమూరి రామేశ్వరదేవరకు నవులూరిపొలం, ఐదుగురు సానులకు, మానికి చునుమూరులో ఇద్దరు సానులకు అఖండదీపానికి సత్రంలో పదిమంది బ్రాహ్మణులకు కొంతభూమిని దానం చేశాడు.
28. మేచమవ్వ/మేచాంబిక (క్రీ.శ. 1153):
ఱాపర్తి నాయకుని భార్య, కొసనయకు తల్లి. ఈమె కొడుకు కొసనయ భీమేశ్వరునికి మీనమాస శుద్ధ ఏకాదశి గురువారంనాడు అఖండదీపాన్ని సమర్పించాడు.
29. కామాంబిక ( క్రీ.శ.1155):
కంటపుగ్రామ ముఖ్యుడైన మంతనామాత్యుని భార్య. గౌతమగోత్రుడు, వెలనాటి గొంకనృపతికి పుత్రుడు రాజేంద్రచోడుని మంత్రి శిఖామణి అయిన సూరనకు తల్లి. ఇతడు “కామాంబికా ప్రియసుతుడ” అని శాసనంలో సంబోధించబడినాడు.
30. జన్నాంబిక ( క్రీ.శ. 1155):
వశిష్ఠగోత్రుడు క్రొవ్విలి పురనివాసుడు అయిన నన్నపార్యుని భార్య జన్నాంబిక. అతని పుత్రుడు అప్పన.
31. దెన్నమాంబిక ( క్రీ.శ. 1155):
జన్నాంబిక పుత్రుడు అప్పనార్యుని భార్య. పతిహితాచరణలో అరుంధతి వంటిదని శాసనంలో ప్రస్తుతించారు. ఈమె కొడుకు కండ్డనార్యుడు పహిండిపాటి చెన్నకేశవ దేవరను ప్రతిష్ఠ చేసి త్రికాలం పూజించే విపులకు వృత్తులను, మూడు అఖండ దీపాలకు, నైవేద్యాలకు పరికరాలకు, ఉత్సవాలకు పొలములతో ధాన్యాలను సమర్పించాడు.
32. సూరమాంబ ( క్రీ.శ. 1156):
భారద్వాజ గోత్రుడు, మూలఘటికాన్వయ కులతిలకుడు అయిన వెలంటూరి దండనాయకుడు అయిన వేమనాయకుని భార్య. ఈమెకు “వాణీనిభ” అనే విశేషణం వాడారు. ఈమె కొడుకు నారాయణుడు శక సంవత్సరం 1078లో నాదిండ్ల మూలస్తాన మహాదేవునికి అఖండదీపం సమర్పించాడు.
33. మల్లాంబిక ( క్రీ.శ. 1156):
ఈమెను లీలావతి, ధైర్యగుణవతి అని శాసనంలో ప్రశంసించారు. ఈమెకు నిడుమ్రాని కొమ్మయకు జన్మించిన పుత్రికమ.
34. కొమ్మమ:
నిడుమ్రాని కొమ్మయకు లీలావతి ధైర్యగుణవతి అని ప్రశంసింపబడే మల్లాంబికకు పుత్రిక అయిన కొమ్మమను కూడా ధైర్యగుణములు కలిగినది అని ప్రశంసించారు. పండిత మిత్ర పరివారాలకు హృదయానందకారి అయిన ఈమె గొంకవిభుని మామ, రిపుసంహారుడు ధీరుడు దండేశుడు అయిన మారయపండడికి ప్రియాంగన. ఈమె పెరువలి మాధవదేవరకు గుడి కట్టించగా, ఈమె కుమారుడు చోడదండేశుడు ఆ దేవర నైవేద్యానికి శక సం. 1078లో కొంత భూమిని దానమిచ్చాడు.
మల్లాంబిక, కొమ్మమ వీరిద్దరినీ ధైర్యవతులని పొగడడం వల్ల వీరు బహుశా అంతఃపుర రక్షణ బాధ్యత వహించేవారని ఊహించవచ్చును.
35. డెంద్దేటి కుప్పిదేవి పోతమ (క్రీ.శ. 1157):
డెంద్దేటి గ్రామవాస్తవ్యుడు, సూరమకు తనూభవుడు అయిన గుడ్డనాయకునికి తల్లి ఈ పోతమ. ఈమె బహుశా గుడ్డనాయకుని పెంచిన తల్లి అయి ఉంటుంది. కనుకనే శాసనంలో డెంద్దేటి కుప్పిదేవి పోతమ కొడుకునని చెప్పుకున్నాడు. ఇతడు సూరమకు జన్మించిన వాడని శాసనంలోని (తస్య గుణాంకా సూరమాప్రియ తనూభవచ్చ డెంద్దేటి గ్రామ వాస్తవ్య అన్న) వాక్యాన్ని బట్టి తెలుస్తున్నది.
36. సూరమ:
డెంద్దేటి కుప్పిదేవి పోతమ కొడుకు గుడ్డనాయకుని తల్లి. బహుశా ఈమె బిడ్డను కని చనిపోవడం వల్ల కుప్పిదేవి పోతమ గుడ్డనాయకుని పెంచి ఉంటుంది. ఈమె ధర్మార్థం ఈమె కొడుకు భీమేశ్వరునికి అఖండ దీపాన్ని సమర్పించాడు.
37. పద్మ (క్రీ.శ. 1160):
శ్రీవత్సగోత్రుడు ఆదిత్యదేవుని ధర్మపత్ని, సుగుణవతి, పుణ్యాంగనలలో ఎన్నదగినది, అందమైన కేశభారం కలది (కచభారభూషా). సర్వకళా ప్రవీణుడు పండితులకు పారిజాతం వంటివాడు, శివారాధన తత్పరుడు అయిన పోతశారికి తల్లి. పోతశౌరి జుత్తిగలోని సోమేశ్వరునికి శక సంవత్సరం 1082లో అఖండదీపం అర్పించాడు.
38. కొమ్మమాంబ ( క్రీ.శ. 1160):
పెరువంగూరు పురాధీశుడు, కౌశిక గోత్ర బ్రాహ్మణుడు అయిన కొమ్మశౌరికి భార్య. వెలనాటి కులోత్తుంగ చోడ గొంకరాజు వద్ద సంధి విగ్రహి అయిన గోవింద ప్రెగ్గడకు తల్లి.
39. కేతమ/ కేతసాని:
కులోత్తుంగ చోడగొంకరాజు వద్ద సంధివిగ్రహి అయిన గోవిందప్రెగ్గడకు భార్య. సంధి విగ్రహి కొమ్మన ప్రెగ్గడకు తల్లి. ఈమె కుమారుడు కొమ్మన ప్రెగ్గడ శక సంవత్సరం 1082, ఉత్తరాయణ సంక్రాంతి నాడు తన తల్లిదండ్రుల ధర్మార్థం కమ్మనాంటిలోని భావనారాయణ దేవరకు అఖండదీపం సమర్పించాడు.
40. ఎఱియాంబిక ( క్రీ.శ. 1163):
కులోత్తుంగ చోడ రాజేంద్ర చోడయరాజుల జోస్యు (జ్యోతిష్కుడు) నల్లయభట్టు తల్లి ఎఱియాంబిక. తల్లి ధర్మార్థం ఇతడు భీమేశ్వరునికి అఖండదీప దానం చేశాడు.
41. కొమ్మాంబ ( క్రీ.శ. 1165):
కులోత్తుంగ రాజేంద్రచోడుని ఇష్టభృత్యుడు కోశాధికారి (కొట్టరి) ఎఱియమ నాయకుని తల్లి. వెలనాటిలోని నిడుంబ్రోలి సబ్బినాయకుని భార్య. ఎఱియమ నాయకుడు ద్రాక్షారామ భీమేశ్వరుని హవిర్బల్యర్చనలకు అనంతారామం తూర్పున పోకతోట కొని సమర్పించాడు. శాసనంలో తన తల్లి కొమ్మాంబికను “ఖ్యాతా పతివ్రతా గుణయుతా” అని ప్రశంసించాడు.
42. ప్రోలాసాని (క్రీ.శ. 1166):
ఈమె కులోత్తుంగ రాజేంద్ర చోడయరాజులకు సంబంధించిన స్త్రీ. శాసనంలో బంధుత్వం స్పష్టంగా లేదు. ఈమె కొడుకు భీమేశ్వరునికి సంక్రాంతినాడు అఖండదీపం సమర్పించాడు.
43. దేవాంబ (క్రీ.శ. 1167):
పెనుగొండపుర వరులలో శ్రేష్ఠుడు నారాయణుని భార్య. ఈమె కొడుకు గండేశ్వర దేవరకు అఖండ దీపాన్ని సమర్పించాడు. దేవాంబ రూపగుణశీలయుక్త, పతికి ప్రియమైనది అని శాసనంలో ప్రశంసించబడింది.
44. కట్టాంబ ( క్రీ.శ. 1170):
వెలనాటి గొంకనృపతికి సేవకుడైన పడాలు చోడుని భార్య. ఈమె పండితులను పోషించేది (బుధ జన పోషణరతా) సౌభాగ్యవతి. ఈమె పుత్రుడు పడవాలు గొంక. ఇతడు తన తల్లి కట్టసానికి, తండ్రి చోడపనాయకునికి ధర్మంగా మ్రోంపర్తిలో చోడేశ్వర దేవుని గుడి కట్టించి రెండు అఖండ దీపాలను సమర్పించాడు.
45. ప్రోలాంబిక ( క్రీ.శ. 1172):
కౌశిక గోత్రుడు చెఱుసేండ్రు గ్రామ వాస్తవ్యుడు రేమన అనే బ్రాహ్మణుని భార్య. ఈమె పుత్రుడు కాటనార్యుడు.
46. అన్నాంబ:
రేమన, ప్రోలాంబికలపుత్రుడు కాటనార్యుని భార్య. పాతివ్రత్య గుణాన్విత, సౌందర్యంలోనూ, ధైర్యగుణంలోనూ జనుల పొగడ్తనందుకున్నది. ఈమె పుత్రులు సూరప, నారాయణుడు, నాగదేవడు అనేవారు. వీరు ముగ్గురు శక సంవత్సరం 1094, దక్షిణాయన సంక్రాంతి నిమిత్తం సిరిపురంలోని మూలస్థానం రామేశ్వర మహాదేవునికి తమ తండ్రి కాట్యపెగ్గడకు, తల్లి అన్యసానికి ధర్మంగా అఖండదీపాన్ని సమర్పించారు.
47. నాయమసాని (క్రీ.శ. 1174):
ఈమె దివాకరరాజు భార్య. వీరపెర్మడిరాజనే గ్రామణికి మంత్రి (కరణం కావచ్చును) అయిన దివాకర సోమునికి తల్లి.
48. వెన్నమ:
దివాకరసోమునికి భార్య, దివాకర రాజునకు తల్లి. ఈమెను శాసనంలో కులపాలికా శిరోవిచికిల పుష్పదామమని పొగిడారు.
49. ప్రోలమ:
దివాకరరాజునకు భార్య, దేవన మాధవుని తల్లి. పతివ్రతాంభోరుహ వాసనాంబర అని ఈమెను ప్రశంసించారు.
50. సబ్బాంబిక ( క్రీ.శ. 1182):
ఈమె కోట రెండవకేతరాజునకు తల్లి. వెలనాటి చోడరాజు పుత్రి, వెలనాటి గొంక రాజేంద్రచోడుని సోదరి. కోట రెండవభీముని భార్య. ఈమెకు ధర్మార్థంగా కోట రెండవ కేతరాజు శక సంవత్సరం 1104 నాడు కొండ నాతవాడిలోని ఊరు కోకల్లును సబ్బాంబికా పురమనే పేరు పెట్టి యమనియమాది సమస్త గుణసంపన్నులైన బ్రాహ్మణోత్తములకు ఇచ్చాడు.
51. వడ్లమాంబ ( క్రీ.శ. 1199):
మన్నకులంలోని వడ్లిరాతికి భార్య. ఈమె పుత్రుడు వివిధోపాయుడు చవినర్మాయ లలాముడు (?) అయిన గొల్లన.
52. దత్తమాంబ:
పైన చెప్పబడిన గొల్లన భార్య. ఈమెకు గొల్లనకు పుత్రుడు మన్నకుల చంద్రుడు మల్లన. ఇతడినే గొల్లపరడి కొడుకు మల్లిరడి అని శాసనంలో సంబోధించారు. ఇతడు శక సంవత్సరం 1121లో తన తల్లిదండ్రుల ధర్మార్థం వేల్పూరి మహాదేవునికి అఖండదీపాన్ని సమర్పించాడు.
53. రాజాంబిక ( క్రీ.శ. 1199):
దుర్జయ వంశంలోని ముప్పరాజు వంశంలోని త్యాగి దోర ధరాధిపతి కొడుకు త్యాగి పోతరాజు భార్య. ఈమె కొడుకు త్యాగి దోర ధరాధీశుడు.
54. నూంకసాని (క్రీ.శ. 1210):
ఈమె దాడి నారపరెడ్డి భార్య, దాడి కొమ్మిరెడ్డికి తల్లి. కొమ్మిరెడ్డిని నారపరడి కొమ్మిరడి అన్నారు. తన తండ్రి నారపరెడ్డికి, తల్లి నూకసానికి ధర్మంగా కొమ్మిరెడ్డి శక 1132, విష్ణుసంక్రాంతినాడు అఖండదీపాలు దానమిచ్చాడు.
55. కామాంబిక (క్రీ.శ. 1212):
రేచర్ల రుద్రిరెడ్డికి అమాత్యుడైన రాజనాయకుని తల్లి కామాంబిక. శక సంవత్సరం 1134 వైశాఖ శుక్ల ఏకాదశి నాడు రాజనాయకుడు తన తల్లిదండ్రుల ధర్మార్ధం భీమేశ్వరునికి అఖండదీప దానం చేశాడు.
56. బొల్లాసాని (క్రీ.శ. 1213):
నెగడాల ఎఱ్ఱమసెట్టి భార్య, అన్నిసెట్టికి తల్లి. అన్నిసెట్టి శక సంవత్సరం 1135, మేష సంక్రాంతి నిమిత్తం తల్లి బొల్లాసానికి, తండ్రి ఎఱ్ఱమసెట్టికి ధర్మార్ధం మల్లీశ్వర మహాదేవునికి అఖండదీప దానం చేశాడు.
57. అన్నసాని (క్రీ.శ. 1213):
పెదవెంగేశ్వర దేవ దివ్యపాదపద్మారాధకుడైన వాసుదేవప్పనంగారి భార్య. ఈమె కొడుకు తల్లిదండ్రులకు తనకు ధర్మార్థం విజయవాడ మల్లీశ్వరదేవునికి అఖండదీపం సమర్పించాడు.
58. అన్నమాంబ (క్రీ.శ. 1213):
కాకతీయ చక్రవర్తి శ్రీవాకిలి అంగరక్ష అయిన పెదనీలినాయుని చిన్నకోడలు, వల్లినాయకునికి భార్య. పోచయ నాయకుని తల్లి. ఈమెను శివపాద షట్చరణ పతివ్రతా గుణవిశాల యశోనిధి అని శాసనంలో ప్రశంసించారు. ఈమె పుత్రుడు పోచయ తన తల్లిదండ్రుల ధర్మార్థం రాజ్యాభివృద్ధి కలగడానికి శక సంవత్సరం 1135 గణపేశ్వరంలోని గణపతీశ్వర దేవునికి అఖండదీపానికై నూరు పెయ్యలను ఇచ్చి పుల్లరిని వదిలేశాడు. కామరాజు గడ్డలో సుక్షేత్రాన్ని దేవునికి అర్పించాడు.
59. బొల్లమాంబ (క్రీ.శ. 1216):
వేంగి గ్రామవాస్తవ్యుడు ఆపస్తంబ సూత్రుడు అయిన సోమమంత్రికి ధర్మపత్ని, మహామండలిక గొంటూరి ఒదయరాజుల సమస్త సేనాధిపతి అయిన రాయన పెగ్గడకు తల్లి. ఈ రాయన పెగ్గడ శక సం. 1138 ఉత్తరాయణ సంక్రాంతి నిమిత్తం మల్లేశ్వర మహాదేవరకు అఖండదీపాన్ని సమర్పించాడు.
60. సోమాంబ (క్రీ.శ. 1218):
కొలని మండలికి కేశవదేవరాజు పత్ని ఈ సోమాంబ. వీరి పుత్రులు కొమ్మయ సోమయ అనేవారు.
61. అన్యమదేవి (క్రీ.శ. 1218):
కొలని మండలిక కేశవదేవరాజు, సోమాంబల రెండవ కొడుకు కమలాకర పురాధీశుడు అయిన సోమయ భార్య ఈ అన్యమదేవి. ఈమె స్వర్గస్థురాలు కాగా ఆమె ధర్మార్ధంగా శక సంవత్సరం 1140, శ్రేష్ఠమాసంలో పూర్ణిమనాడు సోమయ డుత్తిక రామేశ్వర దేవరకు గుడి కట్టించి సున్నం వేయించాడు. భూములను దానం చేశాడు.
61. సబ్బమదేవి (క్రీ.శ. 1222):
మహామండలేశ్వర పరిచ్ఛేద కుస్మరాజుల కులపత్ని ఈ సబ్బమదేవి. శక సం. 1144 లో చైత్ర శుద్ధ దశమి సోమవారం నాడు తన పత్ని సబ్బమదేవి ధర్మార్థం గండీశ్వర మహాదేవరను ప్రతిష్ఠ చేసి దేవరకు భూములను సమర్పించాడు.
62. గంగాంబ (క్రీ.శ. 1225):
విష్ణువర్ధన మహారాజులైన గొనగ చక్రవర్తి భార్య. ఈమె పుత్రుడు ఉదయచంద్రదేవ చక్రవర్తి.
63. కొమ్మాసాని (క్రీ.శ. 1229):
లామన మారెబోయిని భార్య కొమ్మాసాని. ఈమె కొడుకు బయ్యని బొయ్యన బోయుండు. ఇతడు శక సంవత్సరం 1155 ఉత్తరాయన సంక్రాంతి నిమిత్తం తన తల్లిదండ్రుల ధర్మార్ధంగా అఖండ దీపాన్ని సమర్పించాడు.
64. అమరాసాని (క్రీ.శ. 1233):
ఈమె భర్త కాట్యబోయుడు. వీరి కొడుకులు ఎఱ్ఱబోయుడు, మారె బోయుడు పాలుపఱితి ఎఱ్ఱబోయుడు అనేవారు కాట్యబోయునికి, తల్లి అమరసానికి ధర్మంగా ఉత్తరాయణ సంక్రాంతి నాడు మల్లీశ్వరదేవునికి అఖండదీపం అర్పించారు.
65. మాళసాని (క్రీ.శ. 1235):
మసంగెరవుతు తల్లి. శక సంవత్సరం 1159, కార్తీక పర్వ నిమిత్తం తల్లి మాళసానికి ధర్మంగా 13 గోవులను త్రిపురాంతక దేవునికి మసంగెరవుతు అర్పించాడు. మసంతుగెరవుతు శక సం. 1157 నాటి మరొక త్రిపురాంతకం శాసనంలో పేర్కొనబడిన విషవెలి మసకసాహిణి కావచ్చును. ఇతడు బిరుదు అనుంగుదేవ మహారాజు వద్ద అశ్వసైన్యాధికారి (పాదపద్మోపజీవి, రాయసాహిణి) చింతలపూడి కయ్యంలో పుణ్యమూర్తి అనే అశ్వానెక్కి యుద్ధం చేసి గెలిచాడు. ఇతని తండ్రి దెవైసాహిణి. మాళసాని దేవైసాహిణి భార్య కావచ్చును.
66. సూరల మహాదేవి (క్రీ.శ. 1235):
మండలేశ్వరుడు పరిచ్ఛేద కొమ్మరాజు పత్ని, కొమ్మరాజు పుత్రుడు భీమరాజు తండ్రి కొమ్మరాజుకు సూరలదేవికి ధర్మార్థంగా శక సంవత్సరం 1157న శ్రీ గోపాలదేవునికి వెలిచేను సమర్పించాడు. ఇతడు సూరలదేవిని తన తల్లిగా చెప్పలేదు. కానీ పొత్తూరులోని క్రీ.శ. 1246 నాటి శాసనంలో ఆమెకు భీమరాజులు, తమ్ముభీమరాజులు, దేవరాజులు, గణపదేవరాజులు అనేవారు నలుగురు కొడుకులున్నట్లు చెప్పబడింది.
67. బెజ్జమాంబ (క్రీ.శ. 1236):
కాకతి గణపతిదేవుని ప్రధాని రేచెర్ల రుద్రుని తల్లి. కాటయసేనాని భార్య. రేచెర్ల రుద్రుని బెజ్జమకు ప్రియనందనుడు, బెజ్జమ తనయుడు అని ఉప్పరపల్లి శాసనంలో పేర్కొన్నారు. కానీ రేచెర్ల రుద్రుని క్రీ.శ. 1213 నాటి పాలంపేట శాసనం లోని దాంట్లో అతడు తనను కామాంబికానందనుడని చెప్పుకున్నాడు. అతడు నాతుకూరుపురంలో స్థాపించబడిన రుద్రేశ్వర, కాథేశ్వర, కామేశ్వర దేవరాలయాలకై నడకుడి గ్రామాన్ని ధారాదత్తం చేసినట్లు ఆ శాసనంలో ఉన్నది. దాన్నిబట్టి రేచర్ల రుద్రునికి ఇద్దరు తల్లులని, జన్మనిచ్చిన తల్లి కామాంబిక. తండ్రి మరణించిన తర్వాత కామేశ్వర దేవరను కాటేశ్వర దేవరను అతడు ప్రతిష్ఠించి ఉంటాడని తెలుసుకోవచ్చును. బెజ్జమాంబ కాటమసేనాని రెండవభార్య, రేచెర్ల రుద్రుని పెంచిన తల్లి అయి వుంటుందని పై రెండు శాసనాలను బట్టి ఊహించవచ్చును. ఈ బెజ్జమాంబ సౌభాగ్య, సౌందర్య, చాతుర్యములు కలిగినది, పరమ పతివ్రత అని శాసనంలో ప్రశంసించబడింది. ఈమె రేచర్ల రుద్రుని పెంచిన విధానం బహుశా ప్రశంసనీయంగా ఉండి తరువాతి తరంవాడైన పాల్కురికి సోమనాధుని కృతి బసవ పురాణంలో ఈశ్వరునికి తల్లి అయిన బెజ్జమాంబ వృత్తాంతానికి ప్రేరకమై ఉంటుంది.
68. గుండసాని (క్రీ.శ. 1238):
కోటగణపతిదేవ మహారాజు మహాప్రధాని పొడ్వుపురాధీశుడు అయిన ఉద్దండ నాయక ప్రోలెనాయకుడు. గుండసాని చిన్నకొడుకు. ఈమె భర్త ఉద్దండ నాయకుడు. పెద్దకొడుకు దండనాయక కేతినాయకుడు. ఉద్దండ నాయక ప్రోలెనాయకుడు తన తల్లి తండ్రి అన్నల ధర్మార్ధం పులిపాటి రామేశ్వర దేవరను ప్రతిష్ఠ చేసి, గుడి కట్టించి, గణేశుని ప్రతిష్ఠ చేసి గణేశునికి, కుమారస్వామికి, బ్రోసినమ్మకు గుడులు కట్టించాడు. నాలుగు చెఱువులు కట్టించాడు.
68. చాగి ముప్పలదేవి (క్రీ. శ. 1246):
మహామండలేశ్వర చాగి ముప్పలదేవి శక సంవత్సరం 1168, పరాభవ సంవత్సర చైత్రశుద్ధ షష్ఠి ఆదివారం విషువు సంక్రాంతినాడు త్రిపురాంతక దేవరకు అఖండదీపానికై 25 గోవులను సమర్పించింది. ఈమెను సమస్త గుణగణాలంకృత శ్రీయోగానంద నరసింహదేవ దివ్య శ్రీపాద పద్మారాధక చతుర్వర్గ పురుషార్ధ సాధక దుష్ట జనమర్దన శ్రీనరసింహవర్ధననామ అని బిరుదులున్నట్లు శాసనంలో ఉన్నది. అక్కడే ఉన్న మరొక శాసనంలో పై బిరుదులు, ప్రశస్తితో చౌగిగణపయ రాజలు ఇదే రోజున త్రిపురాంతక దేవునికి 25 గోవులనిచ్చినట్లు ఉన్నది. దీన్ని బట్టి వీరు భార్యాభర్తలై ఉంటారని, భర్తకున్న బిరుదులు భార్యకున్నట్లు గ్రహించవచ్చును.
చాగి ముప్పలదేవి పైన చెప్పిన బిరుదులేవీ లేకుండా క్రీ.శ. 1242 నాటి త్రిపురాంతక శాసనంలో సూర్యగ్రహణ నిమిత్తం అఖండదీపానికై 25 గోవులనిచ్చింది. ఈ శాసనంలో నాతవాటి రుద్రుడు కాకతియ్య మైలమహాదేవి కూడా ప్రసక్తమైనారు. బహుశా ఈమె వారి కుమార్తె అయి ఉంటుంది. లేక నతవాడి రుద్రుని సోదరి కూడా కావచ్చును.
69. వింజమదేవి (క్రీ.శ. 1246):
ఈమె కోట చోడ్రాజునకు భార్య మహామండలేశ్వర, ధాన్యకటక పురావరాధీశ్వర ఇత్యాది ప్రశస్తి కలిగిన కోట ముమ్మడిరాజు తల్లి. కోటముమ్మడి రాజు తన తల్లిదండ్రులకు ధర్మార్ధం త్రిపురాంతక దేవరకు శక సంవత్సరం 1168 విష్ణువు సంక్రాంతినాడు అఖండవర్తి దీపానికై గోవులను, భూమిని కూడా దానమిచ్చాడు.
70. కోట వెన్నమదేవి:
ధాన్యకటక పురవరాధీశ్వర, అమరేశ్వర దేవదివ్య పాదపద్మారాధకురాలు కోట వెన్నమదేవి. ఈమె మనుమలు ప్రోరాజు, బయరాజు మూలస్థానేశ్వరునికి దానం చేశారు (శాసనం ఎక్కువగా శిధిలమవడం వల్ల వివరాలు స్పష్టంగా లేవు). ఈమె బిరుదులను బట్టి మనుమలకు రాజ్యార్హత వచ్చేవరకు ఆమె ఆ రాజ్యానికి పాలకురాలిగా ఉండి ఉంటుందని భావించవచ్చును.
71. కామాంబ (క్రీ.శ. 1249):
కశ్యపగోత్రుడైన రాయనామాత్యుడనే బ్రాహ్మణునిపుత్రుడు కామనామాత్యుని భార్య ఈ కామాంబ. కామనామాత్యుడు గురుకావ్య ధనాధ్యక్షానుయోహనివస్సర్వదా అనగా కవి కావచ్చును. ఈ కామాంబను స్వస్తిమతి గుణాతిసతి అనీ, కశ్యపునికి అదితి వంటి భార్య అని ప్రశంసించారు. ఈమె పుత్రుడు రాయనామాత్యుడు.
72. విద్ధసాని (క్రీ.శ. 1252):
జాకరాజు కొడుకు మల్లికార్జున దేవరు పాదపద్మారాధకుడు అయిన పెదలూరి సోమరాజు భార్య విద్ధసాని. సోమరాజు తన భార్య విద్ధసాని ధర్మార్ధం త్రిపురాంతక దేవరకు అఖండదీపం సమర్పించాడు.
73. లక్కాంబ:
నిడుదవోలు చాళుక్యుల వంశంలోని మహాదేవరాజు భార్య లక్కాంబ. ఈమె కొడుకు ఇందుశేఖరుడు. ఇందుశేఖరుని కొడుకు కాకతి రుద్రమదేవి భర్త చాళుక్య వీరభద్రుడు.
74. కోట బయ్యలదేవి (క్రీ.శ. 1254):
ఈమె కాకతి మైలమ నతవాడి రుద్రుల కుమార్తె. మహామండలేశ్వర కోటమన్మకేతరాజును వివాహమాడింది. ఈమెకు పుత్రుడు మహామండలేశ్వర జగమెచ్చుగండ గణపతి దేవరాజు. ఇతడు కోటబయ్యలదేవి గణపతి దేవరాజులు అని ఒక శాసనంలో ప్రసక్తమైనాడు.
శక సంవత్సరం 1176లో కోటబయ్యలదేవి గణపతిదేవరాజు వేల్పూరి రామేశ్వరదేవునికి భండారము అక్కమ అనే స్త్రీని సానిగా ఇచ్చి వృత్తులనేర్పరిచారు. ఒక నాదిండ్ల శాసనంలో కోట గణపతిదేవరాజును కోటబయ్యలదేవి సుపుత్రుడని సంబోధించారు.
74. ముప్పాంబ (క్రీ. శ. 1260):
చాగి వంశానికి చెందిన దోరక్షితిపతి వంశంవాడు. జయచంద్రుడనే రాజు భార్య ముప్పాంబ ఈమె కుమారుడు చాగిమన్మ గణపతి.
75. వెన్నాంబిక (అదే కాలం):
చాగి మన్మగణపతికి భార్య అయివుంటుంది. మనుమ చాగి గణపతి రితి జగతిఖ్యాయ మాన నామానం భువన హితాయ కుమారం తస్మాద్వెన్నాంబికా లభతుం ప్రౌడిం.
76. కౌతాంబిక (క్రీ.శ. 1261):
వేంగిరాజు వద్దనున్న సైన్యాధిపతులలో ఉన్న పోతినాయకుడనే చతుర్థకుల శూరవంశానికి చెందిన కమ్మన అనే అతనికి భార్య. ఈమెకు జనించినవాడు పెనుంబత్తి నాధుడైన వీరపనాయకుడు. ఇదే శాసనంలో వీరప నాయకునికి సంబంధించిన స్త్రీని (బహుశా భార్య కావచ్చు. శాసనంలో స్పష్టంగా లేదు) గురించి కులపాలికా, గుణవతీ, వాణీ, సత్పుత్రవతీ, పతివ్రతా అని ప్రశంసించారు.
77. గుడ్డాంబిక (క్రీ.శ. 1264):
వెలనాటి గొంకభూపతి కొడుకు చోడక్షితీశుని భార్య పూర్ణచంద్రుని వంటి ముఖం కలిగిన గుడ్డాంబిక లక్ష్మీతో సమానమైన గుణాలు కలిగినది. పతివ్రతలలో ఎన్నదగినది. ఈమె పుత్రుడు రెండవ గొంకభూపతి.
78. అక్కాబిక:
ఈమె మహామండలేశ్వర వెలనాటి వీరరాజేంద్రచోడుని భార్య. సబ్బాంబిక కోడలు. ఈమెను భూమిపై నడయాడే విద్యుల్లత వంటిదని, శశికళ వలె ఆహ్లాదపరచేదని, స్త్రీలలో రత్నం వంటిదనీ శాసనంలో కీర్తించారు. ఈమెకు వీరరాజేంద్రునికి జన్మించినవాడు మూడవ గొంకభూపతి.
79. సోమాంబ (క్రీ.శ. 1265):
కోటభీముని భార్య. (కోట భీమనరేంద్రేణ సోమాంబా వల్లభేన)
80. కామలదేవి (క్రీ.శ. 1266):
ఒఱయూరి పురవరాధీశ్వర, సూర్యవంశోద్భవ, కాశ్యపగోత్ర, తేంకణాదిత్య, శివపాద శేఖర పరాంగనా పుత్ర ఇత్యాది బిరుదులు కలిగిన పొత్తెపిగామ చోడ మహారాజు తల్లి. ఈమె భర్త ఆదిత్య దేవచోడ మహారాజులు. ఈమెకు ఇంకొక పుత్రుడు చోడబల్లి. పొత్తపి (కామ) చోడ మహారాజు తమ తల్లితండ్రుల ధర్మార్థం తమ్ముని పేరుమీద చోడ బల్లీశ్వరాలయం కట్టించాడు.
81. పోతాంబ (క్రీ.శ. 1266):
బయ్యరాజు, వెన్నమాంబల పుత్రుడు పోతరాజు భార్య. శ్వశుర గృహజనైరీడ్యమానా అంటే అత్తవారింటి ఆదరణ, మన్నన పొందినది అని, అతి ముగ్ధ, సాధుశీల, పతిహిత చరిత, వీరసూస్సూంశంస్యా అని శాసనంలో ప్రశంసించబడింది.
82. గంగాంబ:
పోతాంబ కుమారుడు కామభూపతి భార్య. సకల జననుతా, పార్వతి వంటిది అని శాసనంలో కీర్తించారు. ఈమె కొడుకు మన్మపోతరాజు.
83. రాణి పండాంబిక (క్రీ.శ. 1266):
మన్మపోతక్షితీశుని భార్య. మన్మపోతరాజుని ఏకపత్నీవ్రతుడని శాసనంలో ప్రశంసించారు. (స్వయువతి నియమే రామభద్రోతి భద్రః) ఈమె లక్ష్మీ వలె సంపద కలిగినదని (తస్య ప్రియా శ్రీ రివ సంపదూరి తా శివేవ సర్వార్థవతీ ప్రియంవదా వాణీవ వీణామధురోక్తవేశలా అని శాసన వాక్యాలు) సర్వార్థాలు కలిగినదని, ప్రియభాషిణి అని ఈమెను ప్రశంసించారు. సేయం సతీ భర్తరి సాంపరేతే రాజీం సమాగమ్య నిజాధిపత్యం లబ్వాస్వ భక్తుశ్శివలోక సాధనం శివ ప్రతిష్ఠా మకరోత్పత్తివ్రతా అనడాన్నిబట్టి పండాంబికకు భర్త మరణించిన తరువాత రాజ్యధికారం వచ్చి ఉంటుందని, భర్తకు శివలోక ప్రాప్తి కలిగించడానికి శివలింగ ప్రతిష్ఠ చేసిందనీ తెలుస్తున్నది.
84. పారసాని (క్రీ.శ. 1267):
ఈమె రేచర్ల కాట్రెడ్డి భార్య. ఈమెకు పుత్రులు కామయ, నామయ, మల్లయలు. తమ తల్లిదండ్రులకు తమకు పుణ్యం కలగడానికి నామేశ్వర, అయేశ్వర, కామేశ్వర దేవరలకు నాగులపాడు తూర్పు నామ సముద్రాన పొలాలు వృత్తులుగా అంగరంగ భోగాలకై ఇచ్చారు.
85. దామలదేవి ( క్రీ.శ. 1267):
ఒఱయూరి పురవరాధీశ్వర, సాహసోత్తుంగ, వేంకణాదిత్య, అయ్యన సింగ నామాది ప్రశస్తి కలిగిన మహామండలేశ్వర సిద్ధయదేవ చోడమహారాజు తల్లి ఈ దామలదేవి. తల్లిదండ్రుల ధర్మార్ధం ఈమె పుత్రుడు అఖండదీపం సమర్పించాడు.
86. రుద్రసాని (క్రీ.శ. 1271):
కాకతీయ ప్రతాపరుద్రుని సామంతుడు చెఱకుమన్న బొల్లయరెడ్డి వియ్యమా మహాసామంత వావిలాల రుద్రయరెడ్డికి అక్క రుద్రసాని. మహాసామంత రుద్రయరెడ్డి తమ అప్ప రుద్రసాని జ్ఞాపకార్థం ఇరువెంటి ఇంద్రేశ్వరుని పాత్రభోగానికై కరావలమ్మ కాల్వ, తాడ్ల కాల్వలలో కొంతభూమిని కార్తీక వైశాఖాలు ఇచ్చినట్లున్నది. రుద్రసాని బహుశా చెఱకుమన్న బొల్లయరెడ్డి భార్య కావచ్చు.
87. రవ్వమాంబ ( క్రీ.శ. 1273):
రేచర్ల రుద్రుని ప్రధాని రాజనాయకుని ధర్మపత్ని. సుచారిత్ర అయిన రవ్వమాంబకు కొడుకు కాటయసేనాని.
88. వెంకాంబ (క్రీ.శ. 1273):
విర్యాలవంశంలో జన్మించిన రుద్రరాజు కుమారుడు గణపతిరాజు భార్య వెంకాంబ. ఆమె 1 గణపతిరాజుకు ప్రాణాధిక ప్రేయసి అని (తతస్య మహిషీ ప్రాణాధిక ప్రేయసీ వెంకాంబేతి సతీ) శాసనంలో చెప్పబడింది. ఆమె కుమారుడు సామంతశూరుడు. ఇతడు శకసంవత్సరం 1195, శ్రీముఖ సంవత్సరం ఇరవై మంది బ్రాహ్మణులకు తన శ్రేయస్సు కొరకై వైనాయకపురి, వేన్కలపురి (తల్లి పేరుమీద వేంకలపురి అని ఉండవచ్చును) ధారాపూర్వకంగా ఇచ్చాడు.
89. కామలదేవి (క్రీ.శ. 1283):
పరిచ్ఛేద అల్లాడ నాధ దేవరాజుల తల్లి. పరిచ్ఛేద గొంకరాజునకు భార్య. అల్లాడనాధ దేవరాజు తన తల్లిదండ్రుల ధర్మార్థం శ్రీ కాకొలని శ్రీవల్లభునికి అఖండదీపానికై 25 గోవులనిచ్చాడు.
(సశేషం)