[box type=’note’ fontsize=’16’] , జీవిక కోసం నిరంతం పనిలో పడి తీరికని పోగొట్టుకుంటున్నామంటున్నారు శ్రీధర్ చౌడారపు “కాకెత్తుకెళ్ళిన ఖాళీ సమయం” అనే కవితలో. [/box]
[dropcap]ఎం[/dropcap]తిదిగా
కులాసాగా కాలం గడిపేవాణ్ణి
నిదురలో కలలను కంటూనో
మెలకువ సమయంలో లలితకళలను
కనులారా కంటూనో
వీనుల విందుగా వింటూనో
అనుభూతుల లోకంలో ఆడుకుంటూనో
పదాలు పద్యాలు రాసుకుంటూనో
చిత్రాలు గీసుకుంటూనో
చలనచిత్రాలను చూసుకుంటూనో
ఎంత దిలాసాగా కాలం గడిపేవాడిని
కడుపునిండిన కమ్మని కథలను
ఎండిన, కడుపుమండిన
కన్నీటి గాథలను చదువుకుంటూనో
భావజగత్తు దృశ్యాలను
రాగతాళాల మేళవింపులో
రసరమ్యంగా పాడుకుంటూనో
ఎంత హాయిగా కాలాన్ని
జమా లెక్కల బెదురు లేకుండా
జాంఝామ్మని ఖర్చు చేసేవాడిని
నాకున్న తీరిక సమయాన్ని
తీరైన రీతిగా తీర్చి దిద్దుకునేవాడిని
ఏ పాపిష్టి కళ్ళ దిష్టి తగిలిందో
నా ఖాళీ సమయాన్ని కాకెత్తుకెళ్ళింది
తీరిక సమయాన్ని తటాలున తీసుకెళ్ళిపోయింది
మాగన్నుగా ఉన్న అదను చూసి
మళయాళ మంత్రగత్తెలా మాయం చేసేసింది
ఖాళీ సమయం ఖాళీ అయిపోయిన
ఆ ఖాళీ కంతలన్నింటి నిండా
అలా ఖాళీగా ఉండటం బాగోదేమోననుకుని
ఎక్కడినుండి రాలిపడిందో ఏమో
దట్టంగా దిట్టంగా “పని” నిండి పోయింది
ఇంటిపని బయటి పని
వంటపని వంటింటి అంట్ల పని
సొంతపని, అరువు పని
బరువు పని, బతుకుతెరువు పని
ఆ పనీ, ఈ పనీ, అదేదో పనీ… అంతటా పనీపనీ
ఇపుడు పనితో ఊపిరి సలపటం లేదు
ఊపిరి పీల్చేసినా, “ఉఫ్” అని విడిచేసినా
పని వాసనే, పని వేడిమే తగులుతోంది
పని, సమయంతో బంధాన్ని
ఎంత పదునుగా పెనవేసుకుందో ఏమో
ఇపుడెక్కడా
ఖాళీ సమయం కనిపించటంలేదు
తీరిక దృష్టి పథంలో అగుపించటంలేదు
అంతే…
నా నిన్నటి ఆనందాల అలవాట్లకు
తీరిక ఏమాత్రం చిక్కటం లేదు
నా మొన్నటి ఆటవిడుపు ఆటపాటలకు
అవకాశం అణుమాత్రం దక్కటం లేదు
ఏమండీ…
కాస్త మీ చుట్టుపక్కల వెతుకుతారా
నా ఖాళీ సమయాన్నెత్తుకెళ్ళిన కాకి
తీరిక సమయాన్ని తీసుకెళ్ళిన కాకి
అక్కడెక్కడైనా పారేసిందేమో కాస్త తెచ్చిస్తారా