కల కాదు సుమా!

5
2

[dropcap]సె[/dropcap]ల్ ఫోన్ రింగవడం విని సెల్ చేతిలోకి తీసుకుని చూశాడు రాజారావు. అమెరికాలో ఉన్న కొడుకు సిద్దార్థ్ నుంచి వస్తున్న కాల్ అది. కాల్ రిసీవ్ చేసుకుని “చెప్పరా సిద్దూ. ఎలా ఉన్నావు?” అని అడిగాడు.

“నేను బాగున్నాను నాన్నా! మీతో మాట్లాడాలి. ఫ్రీగా ఉన్నారా?” అని అడిగాడు సిద్దూ.

“నేను ఎప్పుడూ ఫ్రీనే. చెప్పు” నవ్వుతూ అన్నాడు రాజారావు.

“ఆ అమ్మాయి క్రొత్త క్రొత్త కండిషన్లు పెడుతూంది నాన్నా!”

“ఏ అమ్మాయి?”

“అక్షర.”

“ఏమంటూంది?”

“తనకు ఎం.ఎస్. చదవడానికి అమెరికాలోని ఓ యూనివర్సిటీలో సీటు వచ్చిందట. అందుకయ్యే పాతిక లక్షల ఖర్చు నేను భరించాలట. తర్వాత తను ఇక్కడే ఉద్యోగం చేస్తుందట. మేమిద్దరం ఇక్కడే సెటిల్ కావాలట.”

“నువ్వేమన్నావు?”

“చదువు వరకూ ఓకే అన్నాను. మిగతావాటికి నేను ఒప్పుకోలేదు. తన చదువు కాగానే ఇద్దరం ఇండియాకు వెళ్ళిపోవాలని చెప్పాను. తను నా మాట వినడం లేదు.”

“మీ అమ్మ పెళ్ళికి పట్టుచీరలు కొనడానికి హైదరాబాదు వెళ్ళింది. ఈపాటికి కొనడం కూడా అయిపోయి ఉంటుంది. రాత్రి మీ అత్తయ్య ఇంట్లో ఉండి రేపు ఉదయం బయలుదేరుతుంది. తను రాగానే మాట్లాడి నీకు ఫోన్ చేస్తాను.”

“అలాగే. నాకు ఆఫీసు కాల్ వస్తూంది. ఉంటాను”

“అలాగే” అంటూ కాల్ కట్ చేశాడు రాజారావు.

***

రాజారావు చెప్పిన విషయం విని డీలా పడిపోయింది సరిత.

“అదేమిటండీ! శుభలేఖలు పంచేశాము. బట్టలు, నగలు కొనడం అయింది. ఇంకో ఇరవై రోజుల్లో పెళ్ళి అనగా ఆ అమ్మాయి ఇప్పుడు ఇలాంటి కండిషన్లు పెడితే ఎలాగండీ?” అంది బాధగా.

“ఆశయాలుండటం తప్పు కాదు. కాని పెళ్ళిచూపులప్పుడే తన ఆశలు, ఆశయాల గురించి మనకు చెప్పి ఉంటే ఇది మనకు సరిపోయే సంబంధమా కాదా అని ఆలోచించి నిర్ణయం తీసుకునేవాళ్ళం” అన్నాడు రాజారావు.

“పెళ్ళిచూపులప్పుడే చెబితే మనం ఒప్పుకోమని అనుకుందేమో. ఇప్పుడు చెబితే మనం తప్పనిసరిగా ఒప్పుకుంటామని ఆ అమ్మాయి అనుకుని ఉంటుంది.”

“కండిషన్లతో బంధాలు నిలువవు కదా!”

“మన సిద్దూకి అక్షర బాగా నచ్చిందండీ! ప్రతిరోజూ ఫోనులో మాట్లాడుతూ ఆమెపై అభిమానం పెంచుకున్నాడు” అంది సరిత.

“అవును. ఓ సారి వాడితో మాట్లాడి నిర్ణయం తీసుకుందాం.”

“ఇప్పుడు వాడు మేలుకునే ఉంటాడు. వీడియో కాల్ చేయండి. మాట్లాడుదాం!”

“అలాగే” అంటూ సిద్దూకి వీడియో కాల్ చేశాడు రాజారావు.

కుశల ప్రశ్నలయ్యాక “సిద్దూ. నాన్న అంతా చెప్పారు. నువ్వు ఏం నిర్ణయించుకున్నావు?” అని అడిగింది సరిత .

“మీ ఇద్దరి నిర్ణయమే నా నిర్ణయం అమ్మా!” అన్నాడు సిద్దూ.

“ఆ అమ్మాయంటే నీకు ఇష్టం కదరా!” బాధగా అంది సరిత.

“మీరంటే నాకు ఇంకా ఎక్కువ ఇష్టం అమ్మా. ఇంకో రెండేళ్ళు ఇక్కడే ఉండి, కాస్త సంపాదించుకుని, తర్వాత ఇండియా వచ్చెయ్యాలని, మీకు దగ్గర్లో ఉండాలని, మీకు ఏ అవసరమొచ్చినా నేను అందుబాటులో ఉండాలని నా ఆలోచన. మీరు కర్నూలు వదలి నేనెక్కడ ఉంటే అక్కడికి వచ్చి ఉంటే నాకు మరింత సంతోషం.”

కొడుకు అభిమానానికి ఎంతో ముచ్చటేసింది రాజారావుకి.

“సిద్దూ. ఆ అమ్మాయి ఇలా చేస్తుందని అస్సలు ఊహించలేదురా!” అంది సరిత.

“ఏం కాలేదమ్మా! ఒకవేళ పెళ్ళయ్యాక ఆమె ఈ కండిషన్లు పెట్టి ఉంటే మన పరిస్థితి ఎలా ఉండేదో ఆలోచించు. ఇదో ఏక్సిడెంట్.. అంతే. మనం ఇందులోంచి త్వరగానే కోలుకుంటాము. మీరు ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకండి.” అన్నాడు సిద్దూ.

“అక్షరతో నేనోసారి మాట్లాడి చూడనా?” అని అడిగింది సరిత.

“వద్దమ్మా. తల్లితండ్రుల మాటే వినడంలేదు తను. ఆమెకు అమెరికాలో స్థిరపడాలన్న కోరిక గాఢంగా ఉంది.”

భారంగా నిట్టూర్చింది సరిత.

“నేను అక్షర నాన్నగారితో మాట్లాడుతాను. ఆమె తన నిర్ణయం మార్చుకోకపోతే ఈ సంబంధం క్యాన్సిల్ చేసుకుంటామని చెబుతాను” అన్నాడు రాజారావు.

“అలాగే నాన్నా. నేను ఉంటాను”

“అలాగే రా సిద్దూ.. నువ్వు జాగ్రత్త” అంది సరిత.

అలా అంటున్నప్పుడు ఆమె కళ్ళల్లో అప్రయత్నంగా నీరు తిరిగింది.

***

“నాకు సిద్దూ గురించే భయంగా ఉందండి. వాడు చాలా సెన్సిటివ్. పైకి నిబ్బరంగా కనిపిస్తున్నాడు కాని వాడి మనసులోని మథన నాకు తెలుస్తూనే ఉంది” అంది సరిత భర్తతో.

“నీవు అంతగా భయపడవలసిన అవసరం లేదు. మనం వాడికి ఫెయిల్యూర్స్ కూడా అలవాటు చేశాం. వాడు త్వరలోనే కోలుకుంటాడు. బాధ ఉంటుంది.. మనం వాడిని మనిషిగా కూడా తీర్చిదిద్దాం కదా!” అన్నాడు రాజారావు.

ఆ మాట నిజమేననిపించింది సరితకు. సిద్దూకి డిసప్పాయింట్మెంట్స్ కూడా అలవాటైతే భవిష్యత్తులో పరీక్షలోగానీ, ప్రేమలో గానీ ఫెయిలయితే తట్టుకోగలడని భావించాడు రాజారావు. అందుకే సిద్దూ అడిగినవన్నీ కొనిచ్చేవాడు కాదు. కావాలనే కొన్నిటిని కొనివ్వడానికి నిరాకరించేవాడు. కొడుకును పద్దతిగా పెంచడానికి అతను అనుసరించిన విధానాలు, బోధించిన పాఠాలు తనను ఆశ్చర్యపరిచేవి. అతని సహనానికి, ఆలోచనలకి మనసులోనే జోహారులర్పించేది.

రాజారావు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్‌లో పనిచేసి సూపరింటెండెంట్‌గా రిటైరయ్యాడు. నిజాయితీ, చిత్తశుద్ది, క్రమశిక్షణ కలిగిన ఉద్యోగిగా మంచిపేరు తెచ్చుకున్నాడు.

కొడుకుకు చదువు విలువ గురించి చెప్పడమే కాక సంస్కారం కూడా నేర్పాడు. ఇంటర్మీడియట్ అయ్యాక సిద్దూకి ఐ.ఐ.టి.లో సీటు మొదటి ప్రయత్నంలో రాలేదు. అతను ఏమాత్రం నిరుత్సాహం చెందకుండా తల్లితండ్రుల ప్రోత్సాహంతో లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుని చెన్నై ఐ.ఐ.టి.లో సీటు సాధించాడు.

ఓసారి రాజారావు, సరిత చెన్నై వెళ్ళినప్పుడు సిద్దూ స్నేహితులు చాలామంది పరిచయమయ్యారు. వారిలో అమ్మాయిలే ఎక్కువ. కొందరు తెలుగువారు కూడా ఉన్నారు. వాళ్ళందరూ సిద్దూ తెలివితేటల గురించి, మంచితనం గురించి తమతో చెబుతూంటే విని ఆనందంతో పొంగిపోయారు.

ఓసారి సెలవులప్పుడు సిద్దూతో పాటు అతని స్నేహితురాలు శ్రీనిజ కర్నూలు వచ్చింది.

“మీ ఇద్దరి గురించి సిద్దూ గొప్పగా చెబుతుంటాడు. ఈ సెలవుల్లో ఓ నాలుగు రోజులు మీతో గడపాలని ఉందని సిద్దూతో చెప్పాను. అడగడమే ఆలస్యం పిలుచుకొచ్చేశాడు” అంది శ్రీనిజ సరితతో.

శ్రీనిజ ఉన్న నాలుగురోజులూ సరదాగా గడచిపోయింది వారికి. ఓ రోజు శ్రీనిజ సరితతో “కొంతమంది అబ్బాయిలు మాతో పద్దతిగానే మాట్లాడుతుంటారు గాని వారి చూపులు ఒక్కోసారి మమ్మల్నిఇబ్బంది పెడుతుంటాయి. కాని సిద్దూ చూపులు ఎంత స్వచ్చంగా ఉంటాయంటే అతనితో మాట్లాడుతూంటే మా మనసులు ఎంతో ఆహ్లాదంగా ఉంటాయి. అంతే కాదు.. మాలో ఎవరికి ఏ అవసరం వచ్చినా, ఏ బాధ కలిగినా ‘వారికి నేను ఏ విధంగా సహాయపడగలడు?’ అని ఆలోచిస్తాడు సిద్దూ. పిల్లలు చెడిపోయిన అన్ని కేసుల్లో తల్లితండ్రుల పాత్ర ఉండకపోవచ్చు. కాని పిల్లలు ఉత్తములుగా తయారైన చాలా కేసుల్లో తల్లితండ్రుల పాత్ర ఉంటుంది. ఆ విషయంలో మీరు,అంకుల్ అభినందనీయులు” అంది.

ఆ మాటలు సరితకు ఎంతో ఆనందాన్నిచ్చింది.

తర్వాత శ్రీనిజ హైదరాబాదులో ఉంటున్న తన తల్లితండ్రుల దగ్గరకు వెళ్ళింది.

సిద్దూ బి.టెక్. తర్వాత అమెరికాలో ఎం.ఎస్. చేశాడు. తర్వాత అక్కడే ఎం.బి.ఎ. చేశాడు. అతని చదువు కోసం రాజారావు బ్యాంకులో తన ఇంటిపై మార్టగేజ్ లోను తీసుకున్నాడు. సిద్దూ చదువు పూర్తయ్యాక అమెరికాలోని ఓ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కంపెనీలో ఉద్యోగం తెచ్చుకున్నాడు.

సిద్దూ ఉద్యోగంలో చేరిన కొద్దినెలలకే తండ్రి అప్పులన్నీ తీర్చేశాడు. బంధుమిత్రుల్లో ఎవరికైనా పెళ్ళిళ్ళకు, చదువులకు, వైద్యానికి డబ్బులు అవసరమైతే తండ్రి ద్వారా తెలుసుకుని వారికి ఆర్థిక సహాయం చేసేవాడు. అందువల్ల రాజారావుకు సమాజంలో గౌరవం మరింత పెరిగింది. “పిల్లల వల్ల తల్లితండ్రులకు గౌరవం లభిస్తే ఆ తల్లితండ్రులకు అంతకంటే ఆనందం ఏం ఉంటుంది?” అని భార్యతో చెప్పి మురిసిపోయేవాడు రాజారావు.

సిద్దూకు పెళ్ళి సంబంధాలు చూడటం మొదలుపెట్టే ముందు సిద్దూ అభిప్రాయం అడిగారు సరిత, రాజారావు.

“అమ్మాయి చక్కగా ఉండి, చదువుకున్నదైతే చాలు. కుటుంబం గురించి మీరు విచారించండి. మంచి కుటుంబంలో పెరిగిన అమ్మాయి మంచి సంస్కారం కలిగి ఉంటుందని నా నమ్మకం. మననుంచి ఎటువంటి డిమాండ్లూ పెట్టకండి. మనకు భగవంతుడు ఇచ్చింది చాలు. పెళ్ళి వాళ్ళకు ఎంతలో అయితే అంతలోనే చెయ్యమనండి. అఫ్ కోర్స్ నేను మీకు చెప్పనక్కరలేదు. ఇవన్నీ నేను నేర్చుకుంది మీ నుంచే కదా!” అన్నాడు సిద్దూ.

కొడుకు మాటలకు ఎంతో సంతోషించారు సరిత,రాజారావు.

అక్షర ఫోటో వాట్సాప్‌లో పంపితే చూసి ఇష్టపడ్డాడు సిద్దూ. ఆ అమ్మాయి తల్లితండ్రుల అనుమతితో అక్షరకు వీడియో కాల్ చేసి మాట్లాడాడు. తర్వాత తల్లితండ్రులతో తన అంగీకారం తెలిపాడు. చూసిన మొదటి సంబంధమే కుదిరినందుకు సరిత ఎంతో సంబరపడింది. ‘అయితే అక్షర అంత పెద్ద షాక్ ఇస్తుందని తాము ఊహించలేదు. సిద్దూ ఎంతో నమ్మకంతో తమపై పెళ్ళి బాధ్యత ఉంచాడు. తాము అతనికి న్యాయం చెయ్యలేకపోయాము’ అనుకుని సరిత బాధపడసాగింది.

***

అక్షర నిర్ణయం ఆమె తల్లితండ్రులైన రుక్మిణి, భాస్కర్ లకు కూడా నచ్చలేదు.

తమ కూతురి వైవాహిక జీవితం ఆనందంగా గడవాలని ఎన్ని సంబంధాలు వచ్చినా ఆచీతూచి అడుగులు వేశారు. ప్రతి సంబంధాన్నీ స్క్రూటినీ చేశారు. పిల్లవాడి గురించీ, అతని కుటుంబం గురించీ పలుచోట్ల విచారించారు. కొన్ని సంబంధాలు మొహమాటం లేకుండా వద్దని చెప్పేశారు. తాము చూసిన ఆరవ సంబంధం సిద్దూది. సిద్దూ అందం, చదువు, ఉద్యోగం.. అన్నీ తమకు నచ్చాయి. కుటుంబం గురించి విచారిస్తే అందరూ మంచి మార్కులే ఇచ్చారు. వాళ్ళు కట్నకానుకలు వద్దనడం, పెళ్ళి తమకు ఎంతలో వీలైతే అంతలోనే జరిపించమనడం వారి ఉన్నత సంస్కారాన్ని తెలియజేశాయి. సిద్దూ అక్షరతో మాట్లాడుతూ అభిమానం పెంచుకున్నాడు.

ఇప్పుడు ఆలోచిస్తే తామే వారికి తగినట్లు లేము. తమ కూతుర్ని తాము సరిగ్గా పెంచలేదు. ఒక్కతే కూతురు కావడంతో గారాభం ఎక్కువైంది. తను అడిగినదల్లా కొనివ్వడం, తన ప్రతి చర్యనూ చూసి ఆనందించడం, తను బాధపడితే తాము చూడలేకపోవడం.. ఇవన్నీ అక్షరను ఓ అహంకారిగా తయారుచేసింది. క్రమంగా తను ఏది చెబితే అది కరెక్ట్ అనే స్థాయికి తమను తెచ్చేసింది. ఆడపిల్లకు చదువు, ఉద్యోగం తప్పనిసరని భావించి, ఆ విధంగా తీర్చిదిద్దే క్రమంలో విలువల గురించి చెప్పలేకపోయాము. నలుగురిలో మంచిగా మెసలే విధానం నేర్పలేకపోయాము. వచ్చే అల్లుడి వల్ల తమ బిడ్డ సుఖంగా ఉండాలని తాపత్రయపడ్డామే గాని తమ బిడ్డ వల్ల అల్లుడు సుఖంగా ఉండాలనే ఆలోచన తమకు రాలేదు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న విధంగా తయారైంది తమ పరిస్థితి.

అక్షర తీసుకున్న ఈ నిర్ణయం వల్ల పాపం వాళ్ళెంత ఇబ్బంది పడతారో? ఇంతదూరం వచ్చి పెళ్ళి ఆగిపోతే ఎంత అవమానకరంగా ఉంటుందో, ఇరువైపులా ఆర్థికంగా ఎంత నష్టం కలుగుతుందో ఈ పిల్ల ఆలోచించదే! తనకు ఏది చెప్పబోయినా ‘మీకేం తెలీదు. మీరు ఊరుకోండి’ అంటూ తమ నోరు మూయించేస్తుంది. అమెరికాలో తన చదువు పూర్తయి ఉద్యోగంలో చేరిన సంవత్సరంలోనే తమకు ఆర్థికంగా కలిగిన నష్టాన్ని తీర్చేస్తానంటుంది. ఇప్పుడు సిద్దూ తల్లితండ్రులు ఫోన్ చేస్తే ఏం చెప్పాలి? ఇంటికి వచ్చి నిలదీస్తే ముఖం ఎక్కడ పెట్టుకోవాలి?’ అనుకుని బాధపడసాగింది రుక్మిణి.

***

అక్షర పెళ్ళికి అప్పులు చేయడం, పెళ్ళి క్యాన్సిల్ అవడంతో చాలా డబ్బులు నష్టపోవడం వంటి కారణాలతో అక్షర చదువుకు తీసుకున్న లోన్ ఇన్స్టాల్మెంట్స్ కట్టలేకపోయాడు భాస్కర్. అందువల్ల అతనికి బ్యాంకులు ఇచ్చే సిబిల్ రేటింగ్ తగ్గింది. ఫలితంగా అక్షర ఎం.ఎస్. చేయడానికి బ్యాంకులు లోన్ ఇవ్వలేదు. దాంతో అక్షర చాలా నిరుత్సాహానికి గురైంది. విధి లేక ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగంలో చేరింది.

ఆరోజు ఉదయం ఆఫీసుకు బయలుదేరుతూంటే తండ్రి గదిలోంచి తల్లి అరుపులు వినిపించాయి. లోపలికి పరుగెత్తిన అక్షరకు భాస్కర్ గుండెపై చేయి ఉంచుకుని బాధతో విలవిలలాడటం కనిపించింది. తండ్రికి గుండెపోటు వచ్చిందేమోనని అనుమానమొచ్చింది ఆమెకి. తన కొలీగ్ లత తల్లికి గుండెపోటు వస్తే శ్రీకృష్ణ హాస్పిటల్‌లో చేర్పించడం, ఆవిడ కోలుకోవడం గుర్తొచ్చింది. వెంటనే క్యాబ్ బుక్ చేసింది. తర్వాత తల్లి సహాయంతో తండ్రిని హాస్పిటల్‌లో చేర్చింది. భాస్కర్‌ని అడ్మిట్ చేసుకుని యాభైవేలు కౌంటర్లో కట్టమని అక్షరతో చెప్పారు హాస్పిటల్ వాళ్ళు.

అప్పుడు గుర్తొచ్చింది అక్షరకు -తను తండ్రిని తీసుకొచ్చింది సిటీలోకెల్ల అతిపెద్ద హాస్పిటల్ కని, తన దగ్గర రెండువేలు మాత్రమే ఉందని. ‘తను ఉద్యోగంలో చేరి నెలరోజులే అయింది కాబట్టి తన దగ్గర సేవింగ్స్ లేవు. తండ్రి దగ్గర ఉందో లేదో తెలియదు. అడిగినా జవాబు చెప్పే స్థితిలో ఆయన లేరు. అంత డబ్బు అప్పుగా ఇచ్చే సన్నిహితులేవరూ లేరు’ అనుకుంటూ ఆందోళనతో నిలబడిఉంటే ఎదురుగా సిద్దూ కనిపించాడు. ఆమె ఆశ్చర్యపోయింది.

సిద్దూ కూడా ఆమెని చూసి ఆశ్చర్యంతో “అరే.. మీరేమిటి ఇక్కడ” అని, ఆమె ముఖంలో ఆందోళన గమనించి “ఎనీ ప్రాబ్లెం?” అని అడిగాడు.

“నాన్నకు..” దుఖంతో ఆమెకు మాటలు రాలేదు.

“ఓకె.. ఓకె.. రిలాక్స్.. ఆయన ఎక్కడున్నారు?”

అతన్ని తండ్రి ఉన్న చోటికి తీసుకెళ్ళింది. రుక్మిణిని చూడగానే నమస్కారం చేసి, తర్వాత భాస్కర్‌ని చూసి కళ్ళతోనే ధైర్యం చెప్పి, దూరంగా వెళ్ళి ఫోన్‌లో మాట్లాడసాగాడు. అయిదు నిమిషాల్లో మరో ఇద్దరు డాక్టర్లు వచ్చి భాస్కర్ ని ఐ.సి.యు.లోకి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ మొదలుపెట్టారు.

జరుగుతున్నదంతా ప్రేక్షకుల్లా చూస్తూండిపోయారు రుక్మిణి, అక్షరలు.

సిద్దూ వారి దగ్గరికి వచ్చి “మీ నాన్న గురించి ఆందోళన చెందకండి. సిటీలో మంచిపేరున్న కార్డియాలజిస్టుల పర్యవేక్షణలో ఆయన ఉన్నారు. మీరు ఇక్కడే కూర్చోండి. వాళ్ళు అనుమతి ఇచ్చినప్పుడు లోపలికి వెళ్ళి చూద్దురు గాని” అంటూ నాలుగడుగులు వేసి, మళ్ళీ వెనక్కి వచ్చి “హాస్పిటల్ వాళ్ళు డబ్బులు కట్టమని మిమ్మల్ని అడగరు. ఎవరైనా అడిగితే నాకు కాల్ చేయండి. నేను ఇంకో నాలుగు రోజులు ఇక్కడే ఉంటాను” అని చెప్పి వెళ్ళిపోయాడు.

అక్షర కళ్ళకి దేవుడిలా కనిపించాడు సిద్దూ. అయితే అతను హాస్పిటల్‌లో ఎందుకున్నాడో తాను అడగలేదని తర్వాత గుర్తుకొచ్చింది ఆమెకి.

***

వారం రోజుల తర్వాత హాస్పిటల్ ఎం.డి.తనను పిలుస్తున్నారని చెబితే వెళ్ళింది అక్షర. ఆవిడకు దాదాపు యాభైఏళ్ళుండవచ్చు. చీర కట్టుకుని హుందాగా ఉన్నారావిడ. క్యాబిన్ బయట బోర్డ్ చూసి ఆవిడ పేరు భరణి అని తెలుసుకుంది అక్షర.

అక్షరను చూసి ఏం కావాలన్నట్టు చూసింది భరణి.

“నా పేరు అక్షర. భాస్కర్ మా నాన్నగారు. మీరు పిలిచారని నర్సు చెప్పింది”

“ఓహ్. నువ్వు సిద్దూ మామయ్య కూతురు కదూ!”

అక్షరకు ఏం చెప్పాలో తోచలేదు. అయోమయంగా అవునన్నట్లు తల ఊపింది.

“కూర్చో. మీ నాన్నగారిని సాయంత్రం డిశ్చార్జ్ చేస్తున్నాము. మీ బిల్లులో డిస్కౌంట్ ఇవ్వమని సిద్దూ అడిగాడు. ఇంతకాలం నేను సిద్దూను ఆబ్లిగేషన్స్ అడుగుతున్నాను కానీ అతను నన్ను అడగడం ఇదే మొదటిసారి. అందుకే మీ నాన్నగారికి వాడిన మందులకు తప్ప ఇంక దేనికీ చార్జ్ చెయ్యలేదు మేము. సాయంత్రం బిల్లు పే చేసి ఆయన్ను ఇంటికి తీసుకుపోవచ్చు”

“థాంక్యూ మేడం.. సిద్దూ ఇక్కడ పనిచేస్తున్నాడా?”

“సిద్దూ నీకు చెప్పలేదా? సిద్దూ పనిచేస్తున్న కంపెనీకి మేము క్లయింట్స్‌మి. వాళ్ళు మాకు చేసిచ్చిన ప్రోగ్రాములు వాడటంలో ఏవైనా ఇబ్బందులు వచ్చినా, మాకు అనుమానాలున్నా నేను సిద్దూను పంపమని అడుగుతాను. ఎందుకంటే సిద్దూ చిత్తశుద్దిమీద, తెలివితేటల మీద నాకంత నమ్మకం. పైగా సిద్దూ మంచి వ్యక్తి. నాకు కూతురు ఉండి ఉంటే సిద్దూని అల్లుడుగా చేసుకునేదాన్ని. అన్నట్టు సిద్దూ మొన్న రాత్రి అమెరికా వెళ్ళిపోయాడు. నీకు చెప్పాడా?”

“అమ్మకు చెప్పాడు. వస్తానండీ” అంటూ లేచి చేతులు జోడించింది అక్షర.

“అలాగే. నాన్నగారికి మందులు క్రమం తప్పకుండా ఇవ్వండి. అవసరముంటే నాకు కాల్ చేయి” అంటూ విజిటింగ్ కార్డ్ ఇచ్చింది భరణి.

“అలాగేనండీ” అంటూ బయటకు నడిచింది అక్షర.

***

భాస్కర్ ను హాస్పిటల్ నుంచి డిస్చార్జ్ చేసుకుని ఇంటికి పిలుచుకుని వచ్చారు అక్షర, రుక్మిణి. హాస్పిటల్ బిల్లు చాలా తక్కువ రావడం వారికి రిలీఫ్ నిచ్చింది.

“సిద్దూను చూస్తూంటే ‘అపకారికి ఉపకారం’ పద్యం గుర్తొస్తూంది. అటువంటి మనుషులు ఇంకా ఈ ప్రపంచంలో ఉన్నారా అనిపిస్తుంది.. ముఖ్యంగా.. మీ తరంలో” అంది రుక్మిణి అక్షరతో.

“రాజారావుగారు ఈ సంబంధం క్యాన్సిల్ చేసుకుంటామని చెప్పినప్పుడు ఆయన మాటల్లో నిష్ఠూరం గాని, కోపం గానీ కనిపించలేదు. మన పరిస్థితిని బాగా అర్థం చేసుకున్నట్లు కనిపించింది. అటువంటి తండ్రికి పుట్టిన సిద్దూ అలా కాక మరెలా ఉంటాడు?” అన్నాడు భాస్కర్.

ఇంతలో అక్షర సెల్ మ్రోగితే తీసి మాట్లాడింది. తర్వాత “ఫోన్ బ్యాంకు నుంచి. ఎం.ఎస్.చదవడానికి లోన్ ఇవ్వమన్నారుగా. వాళ్ళకు టార్గెట్స్ పెంచారు కాబట్టి ఇప్పుడు ఇస్తారట. నాన్నకు ఇలా ఉంటే నేను ఎలా వెళ్ళగలను? అందుకే వద్దని చెప్పాను” అంది తల్లితండ్రులతో.

“నువ్వు ఎం.ఎస్. చదవకపోవడానికి నేను కారణం కావడం నాకిష్టం లేదు. భవిష్యత్తులో ఆ నింద నేను భరించలేను” అన్నాడు భాస్కర్.

“నాన్నను నేను చూసుకుంటాను. ఇక్కడి డాక్టర్లు బాగా పరిచయమయ్యారుగా. నువ్వు హాయిగా వెళ్ళి చదువుకో” అంది రుక్మిణి.

అక్షర అయిష్టంగానే తలూపింది.

***

“మా నాన్న నాకో సంబంధం చూశాడు. అబ్బాయి చాలా బాగున్నాడు. అయితే అతనికి ఇండియాలో ఉండే అమ్మాయి కావాలిట. మా నాన్న నా చదువు పూర్తవగానే ఇండియాకు వచ్చి పెళ్ళి చేసుకుని అక్కడే సెటిల్ అవమంటున్నారు. నాకు ఇక్కడే సెటిల్ కావాలని లేదు గానీ ఓ రెండేళ్ళయినా ఇక్కడ ఉండాలని ఉంది” అంది ఉష అక్షరతో.

వాళ్ళిద్దరూ నార్త్ కరోలినాలోని ఓ యూనివర్సిటీలో సహాధ్యాయులే కాకుండా రూమ్మేట్స్ కూడా.

అక్షరకు సిద్దూ గుర్తొచ్చాడు.

“ఆ అబ్బాయి ఫోటో ఉందా నీ దగ్గర?” అని అడిగింది అక్షర.

“అతని ఫేస్ బుక్ పేజీ నుంచి డౌన్లోడ్ చేసుకున్న ఫోటో ఉంది” అంటూ తన మొబైల్ లోని ఫోటోని అక్షరకి చూపింది ఉష.

ఫోటో చూసి ఆశ్చర్యపోయింది అక్షర.

అది సిద్దూ ఫోటో!

“బాగున్నాడు. గో అహెడ్” అంది ఫోటో తిరిగి ఉషకిస్తూ.

“ఓకే చెప్పెయ్యమంటావా?” నవ్వుతూ అడిగింది ఉష.

“నీకు ఇండియాకు వెళ్ళిపోయే ఉద్దేశం ఉంటే ఓకే చెప్పెయ్.”

“అయితే ఈరోజే నాన్నతో మాట్లాడతాను” అంది ఉష ఆ ఫోటో వైపే చూస్తూ.

“ఆల్ ది బెస్ట్” అంది అక్షర కూడా నవ్వుతూ.

ఉషతో నవ్వుతూ చెప్పిందే కానీ అక్షర మనసు మనసులో లేదు.

‘ఇక్కడికి వచ్చినప్పట్నుంచీ ప్రతిరోజూ సిద్దూ గుర్తుకొస్తున్నాడు. తనవల్ల అతనికి అంత ఇబ్బంది కలిగినా అతను హాస్పిటల్‌లో సహాయం చెయ్యడం తన మనసును కదిలించింది. అతను మళ్ళీ కనపడితే బాగుణ్ణు అని తను అనుకుంది. కానీ అతను తను ఉన్న నాలుగు రోజులూ లంచ్ టైంలో వచ్చి తన తండ్రిని చూసి వెళ్ళాడు. ఆ సమయంలో తను ఆఫీసులో ఉంది.

అతను ఇంకా అమెరికాలోనే ఉన్నాడు. ఓ సారి కాల్ చేసి మాట్లాడాలని చాలాసార్లు అనుకుంది. ఎందుకో ‘మొహం చెల్లలేదు’ అనుకుంది.

“ఒకవేళ ఈ సంబంధం నీకు వచ్చివుంటే నువ్వు అమెరికా వదలి ఇండియా వెళ్ళేదానివా?” అని అడిగింది ఉష.

“ఒకప్పుడు ఒప్పుకునేదాన్నికానేమో. మనుషుల విలువ ఈమధ్యే తెలిసింది నాకు. మంచి మనుషుల మధ్య ఉంటే అది అడవైనా, అమెరికా అయినా ఒక్కటే అని తెలుసుకున్నాను.”

“చాలా మంచి మాట చెప్పావు” అంది ఉష.

***

“ఏమన్నాడు నీ రాజకుమారుడు?”

మరుసటిరోజు ఉదయం ఉషను అడిగింది అక్షర.

“అతనికి ఇప్పట్లో పెళ్ళి చేసుకునే ఉద్దేశం లేదట!” అంది ఉష దిగులుగా ముఖం పెట్టి.

“అదేంటి…”

“అతనికి ఇదివరకే పెళ్ళి నిశ్చయమైందట. ఆ అమ్మాయి ఆఖరి నిమిషంలో అమెరికాలో సెటిల్ అవాలని మొండిపట్టు పట్టిందట. ఆ అబ్బాయి అందుకు ఒప్పుకోలేదు. ఫలితంగా పెళ్ళి క్యాన్సిల్ అయ్యింది. కానీ ఆ అబ్బాయి ఆ అమ్మాయిని మరవలేకపోతున్నాడట. అందువల్ల మరికొంత కాలం పెళ్ళిగురించి ఆలోచించడట.”

ఆశ్చర్యంగా చూసింది అక్షర.

‘అబ్బాయిల్లో కూడా సున్నిత హృదయులు ఉంటారని విన్నది కాని ఓ అమ్మాయిని ఇంతలా ప్రేమించి, ఆమె కాదన్నా మనసులోనే నింపుకుని, పెళ్ళిని ఇన్నేళ్ళు వాయిదా వేసే అబ్బాయిని చూడటం ఇదే మొదటిసారి’ అనుకుంది. అతని ప్రేమలోని నిజాయితీ ఆమెని కట్టిపడేసింది.

“ఈ విషయం నీకెలా తెలిసింది. ఆ అబ్బాయి చెప్పాడా?”

“అతని ప్రాణ మిత్రుడు డాడీ స్నేహితుడి కొడుకట. డాడీ అతనితో మాట్లాడితే చెప్పాడు. ఆ అబ్బాయి చాలా మంచివాడట. ఆ ఆమ్మాయికి అమెరికాలో స్థిరపడాలని ఉంటే పెళ్ళిచూపులప్పుడే ఆ మాట అతనితో చెప్పి ఉండవచ్చుగా? అతని మనసుతో ఆడుకోవడం ఎందుకు?”

“బహుశ ఆ అమ్మాయి తనకు ఎం.ఎస్.లో సీటు వస్తుందని ఊహించి ఉండదు. అందుకే పెళ్ళికి ఒప్పుకుని ఉంటుంది. సీటు వచ్చిందని తెలిశాక ఆమె ఊహలకు రెక్కలు వచ్చి ఉంటుంది. అంత మంచివాడు, తనను అంతగా ఇష్టపడుతున్నవాడు తన మాట కాదనడని అనుకుని ఉంటుంది. అయితే అతను తన సిద్దాంతాలతో రాజీపడడని తర్వాత తెలిసి ఉంటుంది. ఇంట్లో తన పంతం నెగ్గించుకునే అలవాటున్న ఆమె ఇక్కడా వెనుకడుగు వెయ్యకుండా ముందుకెళ్ళి ఉంటుంది.”

“ఆ అమ్మాయెవరో నీకు తెలిసినట్లే మాట్లాడుతున్నావు. కొంపదీసి ఆ అమ్మాయి నువ్వే కాదు కదా?” నవ్వుతూ అడిగింది ఉష.

“అవును. నేనే ఆ అమ్మాయిని’ బాధగా అంది అక్షర.

నమ్మలేనట్టు చూసింది ఉష.

“అయితే ఇప్పుడు చాలా బాధపడుతున్నాను. మా నాన్నకు ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్‌లో చేర్పిస్తే అతను కనిపించి మాకు సహాయం చేశాడు. మళ్ళీ కనిపిస్తే క్షమాపణ అడుగుదామని అనుకున్నాను. అయితే అతను నేను లేనప్పుడు వచ్చి నాన్నను చూసి వెళ్ళేవాడు. నా తొందరపాటు నిర్ణయం వల్ల ఓ మంచి వ్యక్తిని కోల్పోయానన్న బాధ నాకుంది. సిద్దూ మనసులో ఇంకా నేనున్నానన్న విషయం తెలిసుంటే నేను ఇక్కడికి వచ్చేదాన్నే కాను. ఈపాటికి అతనికి ఇల్లాలై పోయేదాన్ని.”

“అయితే అతని స్నేహితుడితో మాట్లాడి పెళ్ళి సెటిల్ చెయ్యమని డాడీకి చెప్పనా?”

“వద్దు. నేనే మాట్లాడుతాను” స్థిరంగా చూస్తూ అంది అక్షర.

***

 ఓరోజు సిద్దూకు ఫోన్ చేసి చాలాసేపు మాట్లాడింది అక్షర.

“నేను చాలా మూర్ఖంగా ప్రవర్తించాను. మీరు చదివిస్తానని అన్నా అక్కడే స్థిరపడాలని మొండిపట్టు పట్టాను. ఇండియాలో ఉంటే మన ఇద్దరి తల్లితండ్రుల్నీ చూసుకోవచ్చని మీరు చెప్పినా అర్థం చేసుకోలేదు. నన్ను క్షమించండి” అంది బాధగా.

“మన మధ్య క్షమాపణలు, కృతజ్ఞతలు ఉండకూడదు. కేవలం ప్రేమ, అనుబంధం మాత్రమే ఉండాలి. మన పెళ్ళి తప్పకుండా జరుగుతుందని నమ్మకం నాకు ఉండేది. మీరూ మంచివారే. మీ ఆశయాల కోసం ఆ నిర్ణయం తీసుకున్నారు. మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కూడా మీ ఉద్దేశ్యం కాదు. మన పెళ్ళికి మీకు ఓకే అయితే అమ్మానాన్నలతో మాట్లాడుతాను “

“నాకు ఓకే. అసలు ఇది కలా నిజమా అని నాకు ఆశ్చర్యంగా ఉంది. పోగొట్టుకున్నదేదో మళ్ళీ దొరికినట్లుంది” అంది అక్షర.

“మీరు పోగొట్టుకోలేదు… భవిష్యత్తు కోసం దాచుకున్నారు … అంతే!” అన్నాడు సిద్దూ నవ్వుతూ.

***

రెండేళ్ళ తర్వాత.. ఓరోజు

తనకు కంపెనీ వాళ్ళిచ్చిన చెక్‌ను డిపాజిట్ చేయడానికి బ్యాంకుకు వెళ్ళింది అక్షర. బ్రాంచి మేనేజర్ని కలసి ఆ మొత్తాన్ని ఎం.ఎస్. చదవడానికి తను తీసుకున్న లోన్‌కు జమచేసుకోమని చెప్పింది.

తర్వాత “నేను లోన్ తీసుకున్నప్పుడు ఇంకో సార్ మేనేజరుగా ఉన్నారు. నా దగ్గర సంతకాలు మాత్రం తీసుకుని అన్నీ తనే చూసుకున్నారు” అంది.

“అవునా. నేను ఇక్కడికి వచ్చి నెలరోజులే అయింది” అన్నాడు మేనేజరు.

తన లోన్‌కు అయిన వడ్డీ వివరాలు అడిగి తెలుసుకుని ఆశ్చర్యపోయింది అక్షర.

“ఎడ్యుకేషన్ లోన్‌కు కూడా అంత వడ్డీ వేస్తారా?” అని అడిగింది.

మేనేజరు సిస్టంలో వివరాలు చూసి “ఇది ఎడ్యుకేషన్ లోన్ కాదు మేడం. ఫిక్సడ్ డిపాజిట్ ప్లెడ్జ్ చేసి తీసుకున్న లోన్. అంటే ఒకవేళ మీరు ఈ అప్పు తీర్చకపోతే ఆ డిపాజిట్ క్యాన్సిల్ చేసి ఆ లోన్‌కు జమ చేస్తామన్నమాట.”

“అంత పెద్ద మొత్తంలో మాకే డిపాజిట్టూ లేదే?” ఆశ్చర్యపోతూ అంది అక్షర.

అతను మళ్ళీ సిస్టంలో చూసి “ఆ డిపాజిట్ సిద్దార్థ్ అన్న పేరు మీద ఉంది!” అన్నాడు.

షాక్ తిన్నట్టు చూస్తూండిపోయింది అక్షర.

ఆమె తనపై సిద్దార్థ్ కున్న అభిమానానికి, నమ్మకానికి కదలిపోయింది. ఆమె కళ్ళలో నీరు తిరిగింది.

ఆమెను అలా చూసి “అదేమిటి అలా అయిపోయారు? ఆ సిద్దార్థ్ ఎవరో మీకు తెలియదా?” అని అడిగాడు మేనేజరు.

“ఎందుకు తెలియదు. ఆయన మావారే” అంటూ తల ప్రక్కకు త్రిప్పుకుంది

తన కళ్ళలో తిరిగిన నీరు అతను చూడకుండా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here