[dropcap]ప్రొ[/dropcap]ద్దునే లేచి తలంటు పోసుకుని కొత్తబట్టలు వేసుకున్నాడు రామ్మోహన్. ఇంటిల్లిపాది కొత్తబట్టలు ధరించారు. మామిడి తోరణాలు కట్టిన గుమ్మాలతో ఇల్లు కళకళలాడుతోంది. ఇంటిముంగిట రంగురంగుల రంగవల్లికలు తీర్చిదిద్దారు. ఇంట్లో అమ్మ చేసిన ఉగాది పచ్చడి ప్రసాదం నోటికి ఆరురుచులను అందించింది. కమ్మని పాయసం కూడా తాగి “నాన్నా! వెళ్ళొస్తా” అని ఇంటినుండి బయలుదేరాడు రాము.
వీధులన్ని కళకళలాడుతున్నాయి. ప్రతి ఇంటి ముందు రంగులతో ముగ్గులు వేసి ‘నూతన సంవత్సర శుభాకాంక్షలు’ అంటూ అందంగా రాశారు. అలా అన్నీ చూసుకుంటూ నడుస్తున్నాడు. తెలిసిన స్నేహితులు కలిశారు. అందరూ చక్కగా పట్టుపంచలు, లాల్చీలు, పై కండువాలు ధరించి తెలుగుతనం ఉట్టిపడుతూ కనిపిస్తున్నారు.
”రామూ! నూతన సంవత్సర శుభాకాంక్షలు రా, ఎటుకేసి బయల్దేరావు” అన్నాడు చంద్రం.
“ఎక్కడకని అనుకోలేదురా! ఈ రోజు బడికి శలవుకదా! చాలారోజులనుండి గోదారమ్మను, ప్రక్కనే ఉన్న గుడిని చూడాలని అనుకుంటున్నాను. ఈరోజు నుండి కొత్తసంవత్సరం కదా! గుడికి వెళ్తే మంచిదని బయల్దేరాను” అన్నాడు.
“అయితే పద అందరం వెళ్దాం” అంటూ నడక సాగించారు. వెళ్ళేదారిలో గోదావరి సాంస్కృతిక, సాహిత్యవేదిక దగ్గర ఆగారు.
పాటలు, కవితలు, నృత్యాలు ప్రదర్శింపబడును అని బయట ఉన్న సమాచారాన్ని చదివి లోపలికి వెళ్ళారు.
పెద్ద పెద్ద తాటాకు పందిళ్ళు వేశారు. పందిళ్ళుచుట్టూ మామిడి ఆకుల తోరణాలు కట్టారు. అరటిస్తంభాలతో వేదికను అలంకరించారు.
స్నేహితులందరు చుట్టూ కలయచూస్తూ లోపలికి వెళ్ళి కూర్చున్నారు.
జనం బాగానే వచ్చారు. మగవాళ్ళందరూ పంచెలు, కండువాలు ధరించి హుందాగా తిరుగుతున్నారు. ఆడవాళ్ళంతా అందమైన చీరలతో యుక్తవయసులోని అమ్మాయిలంతా పట్టుపరికిణీ, ఓణీలతో అతిలోక సుందరిలలా వెలిగిపోతున్నారు. పిలల్లంతా బుట్టబొమ్మల్లా తయారయి హడావిడి చేస్తున్నారు. వెళ్ళిన వాళ్ళందరికి పులిదోర, పాయసం ఉగాది ప్రసాదం పెడుతున్నారు. రామ్మోహన్ అతని స్నేహితులు ఆ అల్పాహారం తీసుకుని చేతులు కడుక్కుని వచ్చి కుర్చీలలో కూర్చున్నారు.
సభ మొదలయింది. మొదటగా మంగళప్రదంగా నాదస్వరం వినిపించారు. ఆ తర్వాత పంచాంగ శ్రవణం చేశారు ప్రముఖ పండితులు నరసింహశాస్త్రులుగారు. ఆ తర్వాత శ్రీ శార్వరి నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ కవిసమ్మేళనం కొనసాగింది. ఉగాది పండుగపైన కవులందరూ కమ్మని కవితలు చదివి అందరినీ అలరించారు. పాల్గొన్న వాళ్ళందరికీ దుశ్శాలువ కప్పి, పూలమాల వేసి సత్కరించారు.
ఆ తర్వాత పాటలు మొదలయ్యాయి. చక్కని తెలుగు భాషలో వీనులవిందుగా, మధురంగా పాటలు పాడారు గాయనీ గాయకులు. మాతృభాష గొప్పదనాన్ని తెలియజేసే పాటలు ఎక్కువగా పాడారు. మధ్యమధ్యన తెలుగువారి నృత్యాలైన కూచిపూడి జానపదం, తప్పెటగుళ్ళు, చెక్కభజన వంటి సాంస్కృతిక కార్యక్రమాలు కనువిందుచేశాయి. తెలుగుతల్లి రూపకం అందరిని కట్టిపడేసింది. చివరిగా తెలుగు పరీక్షల్లో ఎక్కువ మార్కులు తెచ్చుకున్న పాఠశాల విధ్యార్థులకు, కళాశాలలు జరిపిన వక్తృత్వపోటీలో గెలుపొందిన విజేతలకు నగదు బహుమతి, ప్రశంసా పత్రాలు అందచేశారు. బహుమతులు తీసుకున్న వారంతా ’ధన్యవాదాలండీ’ అని మర్యాదగా చెప్పి వేదిక దిగి వస్తున్నారు.
‘నేను కూడా నా తరగతి పిల్లలను ఇలా తయారుచేయాలి’ అనుకున్నాడు రామ్మోహన్.
వక్తల ఉపన్యాసాలు మొదలయినాయి. ప్రధానవక్త విశ్వవిధ్యాలయం ఆచార్య మురళీకృష్ణ మాట్లాడుతూ “మన మాతృభాష తెలుగును బాగా నేర్చుకుంటున్నారు విద్యార్థులు. అలాగే ఇళ్ళలో తల్లిదండ్రులు కూడా తెలుగుభాషను చక్కగా నేర్పుతున్నారు. పిల్లలందరినీ అడిగాను. ఒక్కొక్కళ్ళకి దగ్గరదగ్గర యాభై శతక పద్యాలు వచ్చునని తెలిసింది. ఇందాక జరిగిన సాంస్కృతిక సభలో పిల్లలు చక్కగా అలవోకగా పద్యాలను రాగయుక్తంగా చెప్పడం జరిగింది. మన భాష తేనెకన్నా, చక్కెరకన్నా, పనసతొనలకన్నా మధురమైనది కదా. తెలుగుభాషలో చదువుకున్న మన విద్యార్థులు ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా మంచి పదవుల్లో ఉన్నారు. మాతృభాష పై పట్టు ఉన్నవాళ్ళే ఇతర ఏ భాషలైనా నేర్చుకోగలరని నిరూపిస్తున్నారు. కట్టు, బొట్టు, జుట్టు అన్నీకూడా తెలుగుతనం ఉట్టిపడేలా ధరించి ఈరోజు సభను విజయవంతం చేసిన అందరికీ నా వందనాలు. నూతన సంవత్సర శుభాకాంక్షలు” అంటూ ఉపన్యాసం ముగించారు.
ఆ తర్వాత ప్రముఖకవులు విశ్వనాథ వారికి, శ్రీశ్రీగారికి, నండూరి జాషువా గారలకు ఘన సన్మానం చేశారు.
రామ్మోహన్‍కి ఆ వాతావరణం చాలా నచ్చింది. పచ్చని కొబ్బరాకులతో కట్టిన స్తంభాలు, మామిడాకు తోరణాలు, అరటిగెలల స్వాగత ద్వారాలు, తాటాకు పందిళ్ళు చల్లగా, కళ్ళకు హాయిగా అనిపించాయి.
“పదరా గుడికి పోదాం అన్నావు, చూస్తూండగానే రెండు గంటలు గడిచిపోయాయి” అంటూ రామ్మోహన్‍తో అనగానే “సరే! పదండి” అన్నాడు. అందరూ గోదారమ్మ నదికేసి కదిలారు.
“ఒరే! ఆ మురళీకృష్ణ గారు ఎంత బాగ తెలుగు భాష గొప్పదనాన్ని చెప్పారు. ఆయన విశ్వవిద్యాలయంలో పనిచేసే సమయంలో ఆంగ్లభాషనే మాట్లాడుతారు. అదీ అనర్గళంగా. పైగా తనకు తన, మాతృభాషలో బాగా అవగాహన ఉన్నందునే ఇతర భాషలెన్నో తేలిగ్గా నేర్చుకోగలిగారు” అని చెప్తుంటారు అంటూ వాళ్ళు విన్న ఉపన్యాసం గురించి మాట్లాడుకుంటూ గోదారి ఒడ్డు చేరారు. గుడి ఒడ్డునే కట్టిన ప్రాచీన రామాలయం వెళ్ళి సీతారాముల దర్శనం చేసుకుని, ఆంజనేయస్వామి ఆశీస్సులు పుచ్చుకుని ఏటిగట్టుకు చేరారు.
అందరూ అక్కడ కూర్చుని ఆ నది అందాలను, చల్లని పిల్లగాలులను ఆస్వాదిస్తుంటే ‘వేదంలా ఘోషించే గోదావరి అమరధామంలా విలసిల్లే రాజమహేంద్రి’ అంటూ కందుకూరి వీరు పాడుకుంటూ నీళ్ళవైపే వస్తున్నారు. వీళ్ళకు కొంతదూరంలోనే కందుకూరి, గిడుగు, రాయప్రోలు మరికొందరు యువకవులు కూర్చుని కమ్మని కవితలను, మాటలమువ్వలను పంచుకుంటున్నారు. “అమ్మా! తెలుగుతల్లీ! ఏమిచ్చి నీ ఋణం తీర్చుకోగలం! ఎందరు మేధావులకు భాషాసంస్కృతులకు ప్రాణం పోస్తున్న రచయితలను ఈ తెలుగు తోటలో చేర్చుకుంటున్నావు” అంటూ పెద్దగా చేతులు పైకెత్తి నినాదాలు చేశారు.
***
“ఒరే! ఏంటా పిచ్చి కలవరింతలు! బారెడు పొద్దెక్కినా లేవకుండా పగటికలలు కనడం అలవాటయింది. ఈరోజు కూడా పండగ కూడా! లే! లే!” అంటూ అమ్మ అరచిన అరుపులతో ఉలిక్కిపడుతూ తటలున లేచాడు రామ్మోహన్.
“ఏంటి! ఇదంతా కలా! నిజంకాదా! ఎంత చక్కని కల కన్నాను” అనుకుంటూ లేచి ముఖం కడుక్కుని వచ్చాడు.
కొత్తగా తెచ్చుకున్న బడిపంతులు ఉద్యోగం ఇలా టీచర్ ట్రైనింగ్ పూర్తిచేశాడో లేదో అలా డి.యస్.సిలో కూడా అర్హుడైనాడు. ఆ తర్వాత ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మాతృభాషోపాధ్యాయుడుగా ఉద్యోగం సంపాదించాడు రామ్మోహన్. తెలుగును సుమధురంగా, విద్యార్థులు ఇష్టంగా నేర్చుకునేందుకు ఆకర్షణీయంగా బోధించే ఉపాధ్యాయుడని పేరు తెచ్చుకున్నాడు.
అమ్మ ఇచ్చిన వేడి కాఫీ తాగి బయటపడ్డాడు రామ్మోహన్. ఆరోజు ఉగాది పండుగ కాబట్టి పాఠశాలకు శలవు ఇచ్చారు. వీధుల్లో ఎక్కడా పండగ వాతావరణం కనిపించలేదు. తెలిసిన స్నేహితులు కనిపిస్తే “నూతన సంవత్సర శుభాకాంక్షలురా!” అని చెప్తే “విష్ యు ద సేమ్” అని చెప్పి హడావిడిగా వెళ్ళిపోయారు. ఏ ఇంటిముందూ ఉగాది శుభాకంక్షలతో ముగ్గులు కనిపించలేదు. అదే న్యూఇయర్‍కి హ్యాపీ న్యూయర్ అంటూ రంగురంగుల ముగ్గులు వేసే సంస్కృతికి చేరిపోయారు మన తెలుగువాళ్ళు అనుకున్నాడు.
అట్లా నాలుగు వీథులు తిరిగి ఇంటికి వచ్చి టి.వి పెట్టాడు. తెలుగు భాష వచ్చీరానీ యాంకర్ “విష్‍యూ హాపీ టెల్గూ న్యూఇయర్” అని చెప్తున్నది. ఏ చానల్ తిప్పినా తొంభైశాతం ఆంగ్లపదాలు నిండిన పాటలు, మాటలు ఒక్క లోకల్ చానల్‍లో మటుకు ఆపాత మధురంగా వినిపిస్తున్నాయి. “మల్లియలారా! మాలికలారా” అంటూ ఘంటశాల గారి గొంతు అమృతం ఒలికిస్తున్నది.
ఇంతలో రామ్మోహన్ నాన్నగారు వచ్చారు. “ఇదిగో కమలా! ఉగాదిపచ్చడికి వేపపువ్వు. ఇక్కడెక్కడా దొరకలేదు. చివరికి మార్కెట్‍కి వెళ్ళి యాభై రూపాయలు పెట్టి రెండు రెబ్బలు కొనుక్కొని వచ్చాను” అంటూ ఆమెను కేకేసి ఆమె చేతిలో ఒక మామిడికాయ రెండురెబ్బలు వేపపువ్వు పెట్టారు.
“ఒరే రామా! బయట మామిడి మండలు అమ్ముతున్నారు. చూడు. ఓ నాలుగుమండలు కొనుక్కురా” అంటూ కమలమ్మ లోపల్నించి అరచింది.
“సరే అమ్మా!” అంటూ రామ్మోహన్ బయటికి వెళ్ళాడు. పక్కింటి పిల్లలు కూడా మామిడి అకుల కోసం వచ్చారు. “హపీ టెల్గు న్యూఇయర్ అంకుల్” అని చెప్తుంటే తెలుగు భాషకు, తెలుగు సంస్కృతికీ పట్టిన తెగులుకు బాధ కలిగింది.
“ఏవి తల్లీ! నిరుడు కురిసిన హిమ సమూహములు” అనుకుంటూ నిట్టూర్చాడు. ‘నా కల నిజమౌతే… ఎంత బాగుంటుంది’ అని కూడా అనుకున్నాడు రామ్మోహన్.