[box type=’note’ fontsize=’16’] శ్రీ సన్నిహిత్ వ్రాసిన ‘కలగంటినే చెలీ’ అనే నవలని ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]
[dropcap]త[/dropcap]ర్వాతి రోజు శ్రీహరికోట రాకెట్ సెంటర్ (షార్) కి చేరుకున్నారు. సూర్య క్లాస్మేట్ హర్ష అని.. అతని డాడ్, షార్ సెంటర్‌లో సీనియర్ సైంటిస్ట్. ఆయన రికమెండేషన్‌తో వీళ్ళంతా అక్కడికి ప్రవేశం పొందగలిగారు. జూనియర్ సైంటిస్ట్‌లకు ఇచ్చే హాస్టల్‌లో వీళ్ళందరికీ ఎకామిడేషన్ ఇవ్వబడింది. సూర్య అయితే ఆ వాతావరణం చూసి ఇంప్రెస్ అయిపోయాడు.
అందరూ ఫ్రెష్ అయ్యాక లోపలికి వెళ్ళారు. ముందుగా రాకెట్ ఇంటెగ్రేషన్ సెంటర్ చూసారు. పొడుగ్గా ఉండే రాకెట్‌లో డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. ఒక్కో స్టేజ్‌ని ఆ బిల్డింగ్‌లో ఉన్న ఒక్కో ఫ్లోర్‌లో తయారు చేసి టెస్టింగ్ చేస్తారు. అంటే కింద ఉన్న రాకెట్ సెక్షన్‌ని గ్రౌండ్ ఫ్లోర్‌లో, పై సెక్షన్‌ని ఫస్ట్ ఫ్లోర్‌లో, ఆ తర్వాత పై సెక్షన్‌ని సెకండ్‌ఫ్లోర్‌లో.. అలా…
ఒక్కసారి అన్ని సెక్షన్‌ల టెస్టింగ్ పూర్తవ్వగానే రాకెట్ మొత్తాన్ని ఇంటెగ్రేట్ చేసి, రాకెట్ నోస్ సెక్షన్ అంటే ముక్కు దగ్గర శాటిలైట్‌ని అమర్చుతారు. మొత్తం ఇంటెగ్రేషన్ పూర్తయ్యాక రాకెట్‌ని మూవింగ్ రైల్స్‌మీద నడిపిస్తూ లాంచ్‌పేడ్ దగ్గరికి తీసుకెళ్తారు. ఒక సారి రాకెట్ లాంచింగ్‌కి సిద్ధం కాగానే, దాన్ని అక్కడి దాకా తీసుకెళ్ళిన మూవింగ్ రైల్ వెనక్కు, అంటే తన యథాస్థానానికి వచ్చేస్తుంది. తర్వాత రాకెట్ హెల్త్ చెక్‌చేసి, అంతా ఓకే అనుకున్నాక కౌంట్‌డౌన్ ప్రారంభించి, రాకెట్‌ని లాంచ్ చేస్తారు సైంటిస్ట్‌లు. ఇదీ ప్రొసీజర్. ఇదంతా అక్కడున్న చీఫ్ సైంటిస్ట్ వీళ్ళకి వివరించాడు. సూర్య మనసు ఆనందంతో నిండి పోయింది. మన దేశం గర్వించే పని చేస్తున్న అక్కడి ఉద్యోగులందరినీ ఆరాధనగా చూసాడు.
తర్వాత టూర్ ముగించుకుని వెనక్కు వస్తూ చెన్నై బీచ్, పెద్ద పెద్ద టెంపుల్స్ అవీ చూసుకుని కాలేజీ దారి పట్టారు.
ఆ అనుభూతులన్నింటినీ తన మనసులో భద్రంగా దాచుకున్నాడు సూర్య… అప్పుడప్పుడే ప్రపంచాన్ని చూస్తున్న సూర్య.
***
కాలం సాగిపోతోంది.
సూర్య చదువు బ్రహ్మాండంగా ముందుకెళుతోంది. అప్పుడప్పుడు చుట్టుపక్కల జరిగే పాటల పోటీలకు వెళ్తూ ప్రైజ్‌లు గెలుచుకుంటున్నాడు సూర్య. గాయకుడిగా గుర్తింపు రావడం ప్రారంభించింది. ఎంత గుర్తింపు వస్తున్నా చదువును మాత్రం వదిలిపెట్టేవాడు కాదు. దేని దారి దానిదే… అయితే అతన్ని డిస్టెర్బ్ చేసే పెద్ద రాకెట్ ప్రేమ రూపంలో దూసుకొస్తుందని అతనికి తెలీదు.
“హాయ్…” అంది ఎదురుగా కూర్చున్న అమ్మాయి. చదువుకుంటున్న వాడు తలెత్తి చూసాడు సూర్య. లైబ్రరీలో అందరూ సీరియస్‌గా చదువుకుంటున్నారు.
ఆశ్చర్యపోయి, నెమ్మదిగా “ఎవరండీ..” అన్నాడు.
“మీ జూనియర్‌ని… హాసిని” అంది.
“అలాగా… తర్వాత మాట్లాడుదాం” అన్నాడు.
“సాయంత్రం మా హాస్టల్‌కి రండి.. ప్లీజ్” అంది.
“ష్యూర్…” అని చెప్పి చదువుకోవడంలో మునిగిపోయాడు.
ఆ సాయంత్రం ట్రిమ్ముగా తయారయి గాళ్స్ హాస్టల్‌కి వెళ్ళాడు సూర్య. తనొచ్చినట్టు లోనికి కబురు పంపాడు.
హాసిని వచ్చింది. పొద్దున్న లైబ్రరీలో చూసినప్పటి కంటే చాలా అందంగా ఉంది. సూర్య మనసు అదో రకమైన ఎక్సైట్‌మెంట్‌తో కొట్టుకుంటోంది. అమ్మాయిలతో మాట్లాడటం అతనికి కొంచెం భయం. పైగా అస్సలు పరిచయం లేని వాళ్ళతో…
ఎదురుగా ఉన్న హాసినిని చూస్తూ… ధైర్యం కూడగట్టుకుని “హాస్టల్‌కి ఎందుకు రమ్మన్నారు?” అని అడిగాడు. అందంగా నవ్వింది హాసిని. “మీతో ఏకాంతంగా మాట్లాడుదామని” అంది.
“నాతో ఏకాంతం గానా… అంత సీన్ ఏముంది” అన్నాడు.
“మీ పాట అంటే నాకు ఎంతో ఇష్టం.. ఎన్నో సార్లు మీకు ఆ విషయం చెబుదామని ట్రై చేసాను..కానీ కుదరలేదు”
“ఓహ్.. అదా.. ఏదో అలా పాడుతానండీ… చిన్నప్పటి నుండీ అలవాటు” అన్నాడు.
“ఏమో నాకైతే మీ స్వరం చాలా ఇష్టం.. స్టేజీ మీద మీరు పాడుతుంటే అలా మైమరచిపోతాను” అంది.
లోలోపల చాలా ఖుషీగా ఫీల్ అయ్యాడు సూర్య. అది పైకి ఏ మాత్రం కనిపించకుండ నార్మల్‌గా ఉండటానికి ప్రయత్నిస్తున్నాడు. పది మంది గుర్తించడం వేరు.. ఒక అందమైన అమ్మాయి గుర్తించడం వేరు. ఈ గుర్తింపు అతని మనసు పొరల్లో ఎక్కడో తగిలింది.
“అబ్బా.. చాలా థేంక్సండీ… నాక్కూడా అభిమానులున్నారని తెలిసింది” అన్నాడు
కిల కిలా నవ్వింది హాసిని. ఆమె నవ్వుతున్నప్పుడు చిత్రంగా కదిలే ఆమె పెదవులని తంమయంగా చూడసాగాడు సూర్య.
వీళ్ళలాగే హాస్టల్‌బయట చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు మాట్లాడుకుంటూ ఉన్నారు. అది విజిటింగ్ టైము కావడంతో ప్రతీ రోజూ జరిగే వ్యవహారమే అది. కానీ సూర్యకి ఇదంతా కొత్త.
మరికొంత సేపు హాసినితో మాట్లాడి “బాయ్.. అండీ ఇక వెళ్తాను” అని చెప్పాడు.
“అప్పుడప్పుడు వస్తూ ఉండండి..” అంది హాసిని.
“సరే…” అంటూ వెనుతిరిగాడు సూర్య.
అతడు తనకోసం మళ్ళీ మళ్ళీ వస్తాడని… తన ఆకర్షణలో పడతాడని తెలిసిన హాసిని చిన్నగా నవ్వుకుని హాస్టల్‌లోనికి వెళ్ళిపోయింది.
***
సాయంకాలమైంది. చీకట్లు కమ్ముకుంటున్నాయి.
గాళ్స్ హాస్టల్‌కి వెళ్ళి వచ్చినప్పటి నుండీ అదో రకమైన ట్రాన్స్ లోకి వెళ్ళిపోయాడు సూర్య. ఎవరితో మాట్లాడకుండా మౌనంగా ఉండసాగాడు. మనసు నిండా ఏవో మధురమైన ఫీలింగ్స్. తనలో తానే నవ్వుకోసాగాడు. ఇదంతా అతని రూమ్మేట్ ‘గుర్రం’ గమనించసాగాడు. గుర్రం పూర్తిపేరు ‘ గుర్రం శ్రీనివాస్’. అందరూ గుర్రం అని షార్ట్‌గా పిలుస్తారు.
“ఏరా.. సూర్యా.. ఈవెనింగ్ గాళ్స్ హాస్టల్‌కి వెళ్ళావట…” అడిగాడు గుర్రం.
“ఆ..అవును రా… హాసినీ అని మన జూనియర్… మాట్లాడదామని వెళ్ళాను”
“ఓ.. ఆ అమ్మాయా.. నీకెలా తగిలిందిరా….”
“ఏంట్రా ఆ భాష… తగలడమేంటి…” చిరాగా అన్నాడు సూర్య.
“అబ్బ అది కాదురా.. ఆ అమ్మాయి చాలా ఫేమస్‌రా.. ఎప్పుడూ చదువు… పాటలు అంటూ తిరిగే నీకేం తెలుసు…” అన్నాడు గుర్రం
“నిజమా..” అంటూ ఆలోచనలో పడ్డాడు సూర్య.
అలా డిన్నర్ టైము దాకా ఏవో రక రకాల ఆలోచనలు.. తొలిసారి ప్రేమ (?) రుచి చూసిన అతని మనసు ఆ గుడ్‌ఫీలింగ్‌లో నుండి బయటకు రావడానికి ఇష్టపడటం లేదు. డిన్నర్ టైము అయింది. స్టూడెంట్స్ అంతా నెమ్మదిగా మెస్ వైపు కదులుతున్నారు. గుర్రం “రేయ్.. రారా.. మెస్‌కి వెళ్దాం” అని పిలిచాడు.
సూర్య లేచి నెమ్మదిగా అతన్ని ఫాలో అయ్యాడు. మెస్‌కి వెళ్ళాక, లైన్‌లో ఉండి ప్లేట్స్ తీసుకున్నారు. అన్నం, కూర, పప్పు వేసుకుని, పెరుగు ఒక కప్పులో పెట్టుకున్నారు.
డైనింగ్ టేబుల్ మీద కూర్చుని తినడం ప్రారంభించారు. సర్వర్స్ మధ్య మధ్యలో వారికి కావాల్సిన అన్నం, సాంబారు వడ్డిస్తున్నారు. ఏదో ఆలోచిస్తూ తినడం ముగించాడు సూర్య.
మెస్ బయటకు వచ్చి వాకింగ్ మొదలెట్టారు. అప్పటికే చాలా మంది స్టూడెంట్స్ బయట అక్కడక్కడ చెదురు మదురుగా ఉన్నారు.
“ఏరా సూర్యా.. హాసినితో మాట్లాడుతున్నావట…” అడిగాడు రూపేంద్ర. అతడు మెకానికల్ బ్రాంచ్ స్టూడెంట్. పెద్దగా పరిచయం లేదు సూర్యానికి.
“కొంచెం మర్యాదగా మాట్లాడు గురూ..” కోపంగా అన్నాడు సూర్య.
“ఏంటి మర్యాద… హాసినీ నా గాళ్ ఫ్రెండ్… నీకు తెలీదా”
“నిజంగా నాకు తెలీదు… అయినా ఒక్కసారి మాట్లాడితే కొంపలేం మునిగిపోవు కదా..”
“అవన్నీ నాకు అనవసరం.. నువ్వు ఆ అమ్మాయితో మాట్లాడ్డానికి వీల్లేదు.. ఇంకోసారి ఆ లేడీస్ హాస్టల్ ఛాయల్లో కనపడకూడదు.. తెలిసిందా..” వార్నింగ్ ఇచ్చాడు.
“సరే గురూ… నాకెందుకు ఇవన్నీ… ఆ అమ్మాయి రమ్మంటే వెళ్ళి మాట్లాడాను.. నీకు అంత ప్రోబ్లెం అయితే వెళ్ళను” అని నెమ్మదిగా చెప్పాడు సూర్య.
ఒక విషపు నవ్వు నవ్వి సిగరెట్ త్రాగుతూ వెళ్ళిపోయాడు రూపేంద్ర.
అప్పటి దాకా ఈ సంభాషణ అంతా విన్న గుర్రం “చెప్పాను కదరా.. ఆ అమ్మాయితో నీకెందుకు… పద రూముకి” అన్నాడు. ఇద్దరూ రూముకి వచ్చేసారు.
చదువుదామని సర్క్యూట్స్ బుక్ ఓపెన్ చేసాడు సూర్య. కొంచెం కూడా కాన్సన్‌ట్రేట్ చెయ్యలేకపోయాడు.
ఒక గంట సేపు ఏదో చదివినట్టు పుస్తకం ముందు కూర్చుని, తర్వాత బుక్ మూసేసి బెడ్‌మీద వాలిపోయాడు.
అతనికి తన ఊరు.. సాధారణమైన కుటుంబం గుర్తొచ్చింది.. తన లాంటి చిన్న స్థాయి వాళ్ళకి ప్రేమ అన్న పదం చాలా దూరం అని అర్థమైంది… అలాగే కళ్ళు మూసుకున్నాడు. నెమ్మదిగా అతని కళ్ళనుండి జారుతున్న కన్నీరు తలగడ లోకి ఇంకిపోతోంది.
***
మ్యూజిక్ రూములో కూర్చుని పాట ప్రాక్టీసు చేస్తున్నడు సూర్య. అతని సీనియర్ శ్రీకాంత్‌కీ బోర్డ్‌మీద దానికి మ్యూజిక్ వాయిస్తూ –
“సూర్యా… నువ్వు కూడా కీబోర్డ్ నేర్చుకోవచ్చు కదా.. అప్పుడు నువ్వే కీబోర్డ్ ప్లే చేస్తూ పాడవచ్చు… నాకు కూడా ఈ శ్రమ తప్పుతుంది..” అని నవ్వుతూ అన్నాడు.
నిజమే అనిపించింది సూర్యకు. తర్వాత రోజే వెదుక్కుంటూ ‘సర్వేశ్వర్రావ్’ గారి ఇంటికి వెళ్ళాడు. గేటు తీసి లోనికి వెళ్ళేసరికి ఆయన చిన్న పిల్లలకి కీబోర్డ్ నేర్పిస్తున్నారు.
సూర్యను చూసి “ఎవరు బాబూ నువ్వు… ఎందుకొచ్చావు” అని అడిగారు.
“నమస్కారం సార్… నేను ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థిని.. కీ బోర్డ్ నేర్చుకుందామని వచ్చాను” అని చెప్పాడు.
“సరే.. రేపు రా.. వచ్చేటప్పుడు ఒక నోట్‌బుక్ తీసుకుని రా…” అని చెప్పారు.
“అలాగే సార్” అని చెప్పి వచ్చేసాడు.
తర్వాత రోజు చిన్న నోట్‌బుక్ కొనుక్కుని, ఫీజుకి కొంచెం డబ్బులు తీసుకుని వెళ్ళాడు. గురువుగారు ‘సరళీ స్వరాల’తో మొదలుపెట్టారు. శద్ధగా నేర్చుకున్నాడు.
సూర్య. ఒక గంట సేపు క్లాసు అవగానే సిటీ బస్సెక్కి కాలేజీ హాస్టల్‌కి వచ్చేసాడు. ఇలా ప్రతీ రోజూ ఒక నెల పాటు వెళ్ళాడు. ఇంతలో సెమిస్టర్ మిడ్‌ఎగ్జామ్స్ వచ్చాయి. కీబోర్డ్‌కి కామా పెట్టి పుస్తకాలు ముందేసుకున్నాడు. తర్వాత మళ్ళీ వెళ్దామనుకున్నాడు. కానీ ఎందుకో కుదరలేదు. క్రమంగా కీబోర్డ్ లెర్నింగ్‌కి ఫుల్‌స్టాప్ పడిపోయింది. పాటలు పాడటం మాత్రం మానలేదు సూర్య. ఎందుకంటే అది అతని శ్వాస.
(సశేషం)