కలగంటినే చెలీ-12

0
3

[box type=’note’ fontsize=’16’] శ్రీ సన్నిహిత్ వ్రాసిన ‘కలగంటినే చెలీ’ అనే నవలని ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]సూ[/dropcap]ర్య కాలేజీకి చేరుకొనేటప్పటికి కేంపస్‌ అంతా హై టెన్షన్‌లో ఉంది. ఏం జరిగిందో తెలుసుకుందామని రూమ్మేట్‌ గుర్రాన్ని అడిగాడు. గుర్రం అదోలా చూసి “చెబుతాను రా.. ఇంతకీ మీ నాన్న గారి ఆరోగ్యం ఎలా ఉంది?” అని అడిగాడు

“ఇప్పుడు పర్వాలేదు రా… నార్మల్‌ అయ్యారు… నేను లేనప్పుడు కాలేజీలో ఏమయిందో చెప్పు” అన్నాడు సూర్య.

“మన రూపేంద్ర లేడూ.. ముంజేతి నరాలు కోసుకుని సూసైడ్‌ ఎటెంప్ట్‌ చేసాడు. హాస్పిటల్‌లో వెంటనే ఎడ్మిట్‌ చెయ్యబట్టి బ్రతికి బట్ట కట్టాడు. మెడికో లీగల్‌ కేసు అయింది. పోలీసులూ కేంపస్‌కి వచ్చి ఎంక్వైరీ చేసి వెళ్ళారు… “

“మై గాడ్‌.. అంత పని చేసాడా..” ఆశ్చర్యపోయాడు సూర్య. “…అయినా వాడికి అంత కష్టమేమొచ్చిందిరా…”

“దానికి ఇండైరెక్ట్‌గా నువ్వే కారణం..”

“నేనా..!!” అంటూ షాక్ అయ్యాడు సూర్య.

“అవును… నువ్వేరా.. “

“ఏయ్‌.. సరిగ్గా చెప్పు” చిరాగ్గా అన్నాడు సూర్య “హాసిని.. నీతో బాగా క్లోజ్‌ అయ్యాక అతన్ని ఎవాయిడ్‌ చెయ్యడం స్టార్ట్‌ చేసింది. నీ మీద పీకల్దాకా కోపం పెంచుకున్నాడు రూపేంద్ర. కానీ నువ్వు కాలేజీలో లేకపోయేసరికి తన కోపం ఎవరి మీద తీర్చుకోవాలో అర్థం కాక కాలు కాలిన పిల్లిలా తిరగడం మొదలెట్టాడు. కానీ తర్వాత ఏమయిందో… ఇలా సూసైడ్‌ ఎటెంప్ట్‌ చేసాడు”

“అవునా.. అయినా అంతమాత్రం దానికి ఇలా చెయ్యాలా.. నేనేమీ హాసినిని పెళ్ళిచేసుకోలేదుగా…”

“ఏమోరా.. నువ్వు వాడి ఏంగిల్‌లో ఆలోచించు.. అయినా ఇప్పుడు హాసిని కూడా కేంపస్‌లో లేదు.. ఆమె పేరెంట్స్‌ వచ్చి తీసుకుపోయారు.. బహుశా ఇక రాకపోవచ్చు. డిస్‌కంటిన్యు చేసి వెళ్ళిపోయింది…” బాంబు లాంటి మాట చెప్పాడు గుర్రం

అదిరిపడ్డాడు సూర్య. ఉరిము ఉరిమి మంగళం మీద పడ్డం అంటే ఇదే!

సడన్‌గా మౌనంగా అయిపోయాడు సూర్య. గుర్రంకి సూర్య పరిస్థితి అర్థం అయింది. “పోనీ లేరా.. ఇవన్నీ లైఫ్‌లో కామన్‌… మర్చిపో..” అని పెద్ద ఆరిందలా ఓదార్చాడు.

సూర్యకు తన పరిస్థితి చూసి నవ్వొచ్చింది. ఒక వైపు తండ్రి అనారోగ్యం.. ఇంకోవైపు హాసిని దూరమవడం.. అన్నిటికంటే ముఖ్యంగా… తాను ఎంతో ప్రేమించే సింగింగ్‌ ఫీల్డ్‌లో కృషి చేసే అవకాశం లేకపోవడం. మనసు అట్టడుగు పొరల్లో ఆ బాధ గూడుకట్టింది. చాలా రోజులు ఆ బాధ నుండి కోలుకోలేకపోయాడు. కానీ కాలం పెద్ద వైద్యుడు కదా… అతని మనో గాయాన్ని క్రమంగా అదే మాయం అయ్యేలా చేసింది.

***

సూర్య వాళ్ళ బేచ్‌ ఫైనల్‌ ఇయర్‌కి వచ్చేసింది. కేంపస్‌ ఇంటర్వ్యూలు మొదలయ్యాయి.

ఇదేదో సువర్ణావకాశంలా కనిపించింది సూర్యకి. ఎలాగైనా కష్టపడి జాబ్‌ కొట్టాలని స్థిరంగా నిశ్చయించుకున్నాడు. చాలా కంపెనీలు కేంపస్‌కి వచ్చి ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తున్నాయి. ముందుగా రిటెన్ టెస్ట్ పెట్టి అందులో క్వాలిఫై అయినా వాళ్లకి ఇంటర్వ్యూ చేసి, అందులో నుండి కొంత మందిని తీసుకుంటున్నారు. సూర్య మొదటగా వచ్చిన కంపెనీలో రిటెన్ టెస్ట్‌కి సెలెక్ట్ కాలేదు. అయినా నిరాశ పడకుండా బాగా ప్రిపేర్ అవసాగాడు.

రెండో కంపెనీ కేంపస్‌కి వచ్చి రిటెన్ టెస్ట్ పెట్టింది. అందులో సూర్య క్వాలిఫై అయ్యాడు. ఇంటర్వ్యూ తర్వాత రోజు అని చెప్పారు కంపెనీ వాళ్ళు.

ఆ రాత్రి సూర్యకు నిద్ర లేదు. మాటి మాటికీ తండ్రి గుర్తుకు రాసాగాడు. ఆయన చేసిన పిచ్చి చేష్టలు గుర్తుకు రాసాగాయి. మనసంతా ముళ్ళు గుచ్చుకుంటున్నట్టు బాధ. అవన్నీ పక్కనపెట్టి విపరీతమైన పట్టుదలతో ప్రిపేర్ అవసాగాడు. అన్ని సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసేటప్పటికీ తెల్లగా తెల్లవారింది. నిద్ర లేక కళ్ళు మండసాగాయి.

ఫ్రెష్ అయి.. మెస్‌కి వెళ్లి కొంచెం బ్రేక్‌ఫాస్ట్ తిని ఇంటర్వ్యూకి వెళ్ళాడు .

అక్కడ చాలా మంది తన బేచ్‌మేట్స్‌ వచ్చి ఉన్నారు. వాళ్ళని చూసి గుండె జారిపోయింది. వాళ్ళ సంగతేమో కానీ తనకు మాత్రం జాబ్‌ కంపల్సరీ! అదే అతని ధైర్యాన్ని పెంచింది.

తన టర్న్ రాగానే లోనికి వెళ్ళాడు. చిత్రంగా విపరీతమైన కాన్ఫిడెన్స్ అతనిలో ….

పేనల్‌లో ఉన్న మెంబెర్స్ అందరూ ఒక్కో సబ్జెక్ట్ నుండి ఎన్నోప్రశ్నలు అడగసాగారు. ఎలెక్ట్రానిక్ సర్క్యూట్స్, రాడార్లు, మైక్రో ప్రాసెసర్స్, కమ్యూనికేషన్స్, ఒకటేమిటి అన్ని సబ్జెక్ట్స్ స్పృశించారు.

అన్నిటికీ బ్రహ్మాండంగా ఆన్సర్స్‌ చెప్పాడు సూర్య. పేనల్‌ మొత్తం బాగా సంతృప్తి పడినట్టు కనిపించారు. ఇంటర్వ్యూ పూర్తయి వచ్చేస్తుంటే ‘సూర్యా..ఆల్‌ ద బెస్ట్‌ ‘ అని చెప్పాడు బోర్డ్‌ చైర్మన్‌. అదొక పాజిటివ్‌ సైన్‌లా అనిపించింది సూర్యకి. మనసంతా గమ్మత్తైన అనుభూతి.

తర్వాత రోజు సెలెక్టెడ్‌ కేండిడేట్స్‌ లిస్ట్‌ని ఎనౌన్స్ చేసారు కంపెనీ వాళ్ళు. సూర్యతో పాటూ మరో ఇద్దరు సెలెక్ట్‌ అయ్యారు. ఆ వార్త వినగానే గాల్లో తేలిపోయినట్టు ఫీల్‌ అయ్యాడు సూర్య. హైదరాబాద్‌లో ఉన్న ఆ కంపెనీకి సెలెక్ట్‌ అవడం ఒక గొప్ప ఎచీవ్మెంట్‌లా భావించాడు సూర్య. ఈ వార్త తన తల్లిదండ్రులకి చెప్పాలని, వారి కళ్ళాల్లో ఆనందాన్ని చూడాలని అనిపించి వెంటనే ఊరు బయలు దేరాడు.

లాస్ట్ బస్ పట్టుకుని ఊరికి చేరుకున్నాడు సూర్య. రాత్రి పదకొండు అయింది. ఊరు మంచి నిద్రలో ఉంది. కుక్కలు మొరుగుతున్నాయి. ఇంటి తలుపు కొట్టగానే గాఢ నిద్రలో ఉన్న పార్వతమ్మ ‘ఎవరబ్బా …ఈ టైములో ‘ అనుకుంటూ తలుపు తీసింది. సూర్యను చూసి ఆశ్చర్యపోయింది .

“బాగున్నారమ్మా.. ” అంటూ లోపలికొచ్చాడు .

“ఆ బాగున్నాం రా.. ఈ టైములో వచ్చావేంట్రా ..కొంచెం ముందు బయలుదేరలేకపోయావా” అంటూ అతనికి భోజనం ఏర్పాట్లు చెయ్యసాగింది.

“మిమ్మల్ని చూడాలనిపించిందమ్మా … అందుకే వెంటనే బయలు దేరాను” చెప్పాడు.

“సరే… ముందు భోంచెయ్” అని కంచం పెట్టి అన్నం కూర వడ్డించింది.

నెమ్మదిగా భోంచేస్తూ “అమ్మా… మీకో విషయం చెప్పాలి. నాకు ఉద్యోగం వచ్చిందమ్మా” అన్నాడు.

ఆమె సంభ్రమాశ్చారానికి లోనయింది. “ఎంత మంచి వార్త చెప్పావురా.. ” అని కొడుకు తల మీద చెయ్యి వేసి నిమిరింది. “అయినా …నీ చదువు ఇంకా అవలేదు కదరా.. ఉద్యోగం ఎలా వచ్చింది…” అంది.

“ఇప్పుడు అలాగే వస్తున్నాయి అమ్మా …కేంపస్ జాబ్స్ అంటారు..”

“సరే ..ఏదో ఒకటి… మీ నాన్నగారి ఆందోళన తగ్గుతుంది. ఆ భగవంతుడే మన పరిస్థితి చూసి ఇలా సహాయం చేసాడేమో ..” అంది.

తిన్నాక నిద్రపోయాడు సూర్య.

తెల్లారింది. పార్వతమ్మ టీ తెచ్చి సూర్యాన్ని లేపింది. వాకింగ్ నుండి వచ్చిన శంకరం గారు “లేచావా నాన్నా.. కంగాచ్యులేషన్స్” అన్నారు.

“థేంక్యూ నాన్నా” అని టీ సిప్ చెయ్యసాగాడు సూర్య. ఆ ఇంట్లో చాలా కాలం తర్వాత ఆనందం తాండవించింది. పండగ వాతావరణం నెలకొంది. రెండ్రోజుల పాటు ఆ ఆనందాన్ని అనుభవించి తిరుగు ప్రయాణమై కాలేజీకి వచ్చేసాడు సూర్య. జీవితంలో కొన్ని ఊహించని విజయాలు చాలా కిక్‌ ఇస్తాయి అని తెలుసుకున్నాడు .

ఫైనల్‌ ఇయర్‌ ఎగ్జామ్స్‌ ఆడుతూ పాడుతూ వ్రాసేసాడు సూర్య. డిగ్రీ పూర్తయింది. సర్టిఫికెట్‌ తీసుకుని, ఉన్నపాటి లగేజ్‌ సర్దుకుని జాబ్‌లో జాయిన్‌ అవడానికి హైదరాబాద్‌ వెళ్ళే ట్రైన్‌ ఎక్కాడు. అతనితో పాటూ సెండాఫ్‌ ఇవ్వడానికి వచ్చాడు గుర్రం. ట్రైన్‌ కదులుతుండగా బాయ్‌ చెబుతూ “ఒరేయ్‌ …సూర్యా.. నువ్వు చాలా పెద్ద పొజిషన్‌ కి వెళ్ళాలిరా ..ఆల్‌ ద బెస్ట్‌ ” అని చేతిని ఊపుతూ కనుమరుగయ్యాడు గుర్రం. కళ్ళ నిండా నీళ్ళతో ..మసక బారిపోయాడు గుర్రం. ట్రైన్‌ వేగం పుంజుకుంది, సూర్యానికి మరో కొత్త జీవితాన్ని పరిచయం చెయ్యాలన్న కోరికతో !!

ఆ విధంగా ఆ విధంగా విద్యార్థి దశ ముగించుకుని ఉద్యోగం చేయడానికి హైదరాబాద్‌కి వచ్చి పడ్డాడు సూర్య.

***

ఆఫీసులో సిస్టం ముందు కూర్చుని పని చేసుకుంటున్నాడు సూర్య.

అతని మనసు పరి పరి విధాలా ఆలోచించసాగింది.

బయట నుండి చూసేవాళ్ళకి అతని జీవితం అందంగా.. అద్భుతంగా కనపడుతుంది. కానీ లోపల దాగున్న నిస్పృహ అతనికి మాత్రమే తెలుసు. ఇంకా చెప్పాలంటే కడుపులో లావా దాచుకున్న వాల్కెనో లాంటి జీవితం అతనిది . !

పొద్దున్న లేవడం.. ఆఫీసుకి రావడం.. ఏదో మొక్కుబడిగా పనిచెయ్యడం.. సాయంత్రం ఇంటికి వెళ్ళి టీవీకి అతుక్కుపోవడం..!

ఇదేగా జీవితం.. పరమ రొటీన్‌… బోర్‌! ‘ఏదో కావాలి ..తనకు ఏదో కావాలి’ – అతని మనసులో రోజూ సాగే ఆలోచనలు ఇవే!

“కాఫీకి వెళ్దామా!” వచ్చి అడిగింది రోహిణి.

తలెత్తి చూసి ‘అబ్బా’ అనుకున్నాడు సూర్య. పసుపురంగు మేని చాయతో మిస మిస లాడే ఆమెను చూసినప్పుడల్లా అతనికి మనసులో అదో రకం అలజడి. కానీ ఎప్పుడూ బయట పడడు. మహా సంస్కారవంతుడిలా నటిస్తాడు.

‘ఓ …తప్పకుండా’ అని సీట్లోంచి లేచాడు.

ఇద్దరూ కేఫ్‌లో ఎదురెదురుగా కూర్చున్నారు.

ఇంకా ఆలోచనల్లోనే తేలిపోతున్న సూర్యను చూసి “ఏంటి గురూ అంతలా డ్రీమింగు… రాత్రి నిద్రలేదా ఏంటి?” అంది రోహిణి.

చిన్నగా నవ్వాడు సూర్య. రోహిణి అలాంటి ఎ-సర్టిఫికెట్‌ జోకులేసినప్పుడు చాలా డీసెంట్‌గా రియాక్ట్‌ అవుతాడు. మనసులో మాత్రం బాగా ఎంజాయ్‌ చేస్తాడు.

“అబ్బే …అదేం కాదు …” అని మాట మార్చి కాఫీ ఆర్డరిచ్చాడు.

రోహిణి అతన్ని చూస్తూ “ఈ మధ్య బాగా పరధ్యానంగా ఉంటున్నావు… ఏమైంది” అంది.

“ఏం కాలేదు… లైఫ్‌ బోరు కొడుతోంది…”

“అదేంటి? నీకు లైఫ్‌ బోరా? ఎంతో ఏంబిషియస్‌గా ఉండే నీకు బోర్‌ కొట్టడమేంటి!” ఆశ్చర్యపోయింది.

“ఏం చెప్పమంటావు… నాదొక బాధ. అది నీకు అర్థం కాదులే” అని మాట మార్చాడు. కాఫీ తాగడం పూర్తయింది.

“ఇట్స్‌ ఓకే” అంటూ లేచింది రోహిణి. తర్వాత ఇద్దరూ ఆఫీసులోకొచ్చి పనిలో మునిగిపోయారు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here