కలగంటినే చెలీ-17

0
3

[box type=’note’ fontsize=’16’] శ్రీ సన్నిహిత్ వ్రాసిన ‘కలగంటినే చెలీ’ అనే నవలని ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]సీ[/dropcap]తకు ఏమీ అర్థం కాలేదు. పార్వతమ్మ ఇంత వయొలెంట్‌గా రియాక్ట్‌ అవుతుందని ఊహించలేదు. ‘తాను తొందరపడ్డానా’ అని ఒక క్షణం బాధపడింది. సూర్య కోసం వెదికింది. అప్పుడే ఇంట్లోకొచ్చి సోఫాలో కూర్చుని కళ్ళు మూసుకుని ఉన్నాడు.

అనసూయమ్మ సూర్య దగ్గరకు వచ్చి “ఊరుకో బాబూ.. ఇలాంటివన్నీ మామూలే… అన్నీ సర్దుకుంటాయి” అని ప్రేమగా మాట్లాడింది. ఇదీ అని చెప్పలేని మానసిక స్థితిలోకి వెళ్ళిపోయాడు సూర్య.

చుట్టాలంతా డిస్పెర్స్‌ అయ్యారు. మామగారు ఇదేమీ పట్టనట్టు టీవీలో ‘పెళ్ళాం చాటు మొగుడు’ సీరియల్‌ చూసుకుంటున్నారు. అనసూయమ్మ, సీత ఆ సీరియల్లోని పాత్రల దౌర్జన్యం గురించి మాట్లాడుకుంటున్నారు. పగిలిన గుండెతో సూర్య అలా బెడ్‌మీద వాలిపోయాడు.

ఈ సంఘటన జరిగిన తర్వాత సూర్య ఒక నిర్ణయానికి వచ్చాడు. దూరంగా ఉన్న తల్లిదండ్రులని గురించి కాకుండా, ముందు తన కళ్ళెదురుగా ఉన్న సమస్యలను సరిద్దిద్దుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఔనన్నా కాదన్నా ఇప్పుడు తనకు అత్తగారి అవసరం చాలా ఉంది కాబట్టి, ఊరికే పంతానికి పోకుండా సీత తోనూ, అత్తా మామలతోనూ నార్మల్‌గా ఉండసాగాడు.

కాలం అన్నిటినీ తనలో కలిపేసుకుంటూ సాగిపోతూ ఉంది.

ఒక రోజు టీవీలో వస్తున్న ప్రకటన చూసి ఆలోచనలో పడ్డాడు సూర్య. “వర్ధమాన గాయకులకు ఆహ్వానం… మేం త్వరలో నిర్మించబోయే సీరియల్‌లో పాడటానికి ఆసక్తి ఉన్న గాయకులు సారథి స్టుడియోలో జరిగే ఆడిషన్స్‌కి రండి” అని వస్తోంది. మనసులో ఆశ రెపరెపలాడింది సూర్యానికి. కాలేజీ చదువు అయిపోయాక రోజువారీ పనిలో పడి సింగింగ్‌ని పక్కన పెట్టాడు. ఇప్పుడు ఈ అడిషన్స్‌కి వెళితే పాడే అవకాశం దొరుకుతుందేమో! అనుకున్నాడు.

“సీతా… నేను ఆ సింగింగ్‌ ఆడిషన్స్‌కి వెళతాను” అన్నాడు.

“అబ్బో, ఇప్పుడు తమరు పాడకపోతే దేశానికి ఏమైనా నష్టమా..” వ్యంగ్యంగా అంది సీత.

“ప్లీజ్‌ సీతా.. నాకు ఇంట్రెస్ట్‌ ఉంది… ఒక్కసారి వెళ్ళనీ” అని బ్రతిమాలుకున్నాడు

“సరే లెండి… ఆదివారమే కదా.. నేను మా అమ్మా వాళ్ల దగ్గర ఉంటాను… మీరు వెళ్ళి త్వరగా వచ్చెయ్యండి” అని పర్మిషన్‌ ఇచ్చింది.

అదే మహాభాగ్యం అనుకుని.. బైక్‌మీద సారథి స్టుడియోకి వెళ్ళాడు. అక్కడ ఇసక వేస్తే రాలనంత మంది ఔత్సాహికులు! నీరసం వచ్చింది సూర్యకు. అయినా ఓపిగ్గా వాళ్ళందరినీ దాటుకుంటూ వెళ్ళి అక్కడ తన పేరు నమోదు చేసుకున్నాడు. ఒక్కొక్కరినీ లోనికి పిలుస్తున్నారు. వెళ్ళి లోపల ఏదో ఒక పాట పాడి, తమ స్వరాన్ని వినిపించి వస్తున్నారు గాయకులు.

“సూర్యా..” అని పిలిచాడు అక్కడి ఆర్గనైజెర్‌. సూర్య లోనికి వెళ్ళాడు.

లోపల, ఒక సీనియర్‌ నటుడు, ఒక పాత తరం నటి న్యాయనిర్ణేతలుగా ఉన్నారు. “పాడు బాబూ…” అన్నారు.

సూర్య గొంతు సవరించుకుని బాలూ గారు పాడిన ” అదే నీవు.. అదే నేను.. అదే గీతం పాడనా..” అనే ప్రేమ పాటను రాగయుక్తంగా ఆలపించాడు. వాళ్ళు ఇంప్రెస్‌ అయినట్టు కనిపించారు.

“సరే బాబూ.. మళ్ళీ పిలుస్తాము” అని చెప్పి పంపించారు. సంతృప్తిగా బయటకు వచ్చేసాడు సూర్య. చాలాకాలం తర్వాత రిలీఫ్‌గా ఫీల్‌అయ్యాడు.

సూర్య స్టుడియో నుండి తిరిగి ఇంటికి వచ్చేటప్పటికి సీత ఇంకా అత్తగారి ఇంటి నుండి రాలేదు. ‘చాలా సేపయింది కదా’ అనుకుంటూ అక్కడికి వెళ్ళాడు.

“రా బాబూ.. సీత ఇప్పుడే పడుకుంది” అని అత్త అనసూయమ్మ చెప్పంది

“పడుకుందా.. ఏమైందండీ..” అని కంగారుపడ్డాడు

“ఏమవుతుంది… ఒకటే కడుపు నొప్పి.. నువ్వేమో ఎక్కడో బయట తిరుగుతున్నావు.. ఇక దాన్ని పట్టించుకునేదెవరు” గుచ్చినట్టు అంది. ఒళ్ళు మండిపోయింది సూర్యకు. కంట్రోల్ చేసుకున్నాదు. సీత దగ్గరకు వెళ్ళి ఒంటి మీద చెయ్యి వేసాడు. విసిరి కొట్టింది. సీన్‌ అర్థమైంది సూర్యకు. “సరే.. వచ్చానుగా.. మన ఇంటికి పద..” అని బయటకు వచ్చాడు. ముక్కుతూ మూల్గుతూ వచ్చింది సీత. “అమ్మాయి జాగ్రత్త బాబూ” అంటోంది అనసూయమ్మ.

బైక్‌పై ఇద్దరూ తమ ఇంటికి వచ్చేసారు. సీత కోపంగా “పొద్దున్ననగా వెళ్ళావు.. ఇప్పుడా వచ్చేది” అంది.

“వెళ్ళిన పని అవ్వాలి కదా.. ఎలా వచ్చేస్తాను” నెమ్మదిగా అన్నాడు

“అది అంత ముఖ్యమా? ఎగేసుకుంటూ వెళ్ళావు..”

“ఏదో ఒక ఇంట్రెస్ట్‌.. అవకాశం వస్తే మంచిదే కదా.. గుర్తింపు వస్తుంది”

“ఎవడిక్కావాలి గుర్తింపు.. ఇప్పుడు మీరు గుర్తింపు తెచ్చుకుని ఎవడ్ని ఉద్ధరించాలి?” అని రఫ్‌గా అంది సీత.

ముళ్ళు గుచ్చుకున్నట్టుగా ఫీల్‌ అయ్యాడు సూర్య. టీవీలో పాటల ప్రోగ్రాములని ఎంతో ఇష్టంగా చూసే సీత, తనను మాత్రం ఎందుకు డిస్కరేజ్‌ చేస్తోందో అర్థం కాక తల పట్టుకున్నాడు. ఇంకెప్పుడూ ఇలాంటి ఆడిషన్స్‌కి వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాడు. తన లోని గాయకుడ్ని పక్కకు తోసేసాడు. తన వ్యక్తిగత అభిరుచుల్ని, ఇష్టాల్ని పూర్తిగా వదిలేసి తన జాబ్‌కి, కుటుంబానికి పూర్తిగా అంకితం అయిపోయాడు సూర్య…

సీతకు సుఖ ప్రసవం జరిగి పండంటి మగ బిడ్డకి జన్మని ఇవ్వడంతో బాధలన్నీ మరచిపోయాడు. వాడ్ని పెంచడంలో నిమగ్నమయ్యాడు. చూస్తుండగానే చింటూ స్కూలింగ్‌‌కి వచ్చేసాడు….

“డాడీ..” అని నిద్రలో ఉన్న చింటూ కేక పెట్టడంతో… గతంలో నుండి బయటపడి బెడ్రూం వైపు వెళ్ళాడు. బెడ్‌మీద వాలి… ఎప్పుడో తెల్లవారు జామున నిద్రలోకి జారుకున్నాడు.

***

పొద్దున్న లేచి ఆఫీసుకి రడీ అయ్యాడు. సీత మామూలుగానే చింటూని స్కూల్‌కి రడీ చేసింది. వాడికి బాక్స్‌ కట్టింది కానీ, సూర్యకు లంచ్‌ పెట్టలేదు. బహుశా అలిగింది అనుకుని సరిపెట్టుకున్నాడు. చింటూని తీసుకుని స్కూల్‌లో దింపి ఆఫీసుకి వచ్చేసాడు.

మనసంతా అదోలా ఉంది సూర్యకి. తమకు ఏం తక్కువయిందని సీత మాటిమాటికీ గొడవ పడుతుందో అర్థం కాదు. హాయిగా గడపాల్సిన యవ్వనాన్ని ఎందుకు వ్యర్థం చేసుకుంటుందో తెలీదు. ఎప్పుడూ అదోలా అసంతృప్తితో ఉంటుంది. సూటిపోటి మాటలతో హృదయాన్ని ఛిద్రం చేసేస్తూ ఉంటుంది. తనకంటే చాలా తక్కువ వాళ్ళని ఎప్పుడూ పొగుడుతూ ఉంటుంది. అందరూ బాగా సంపాదిస్తున్నారని, తాను మాత్రం సంపాదించడం లేదని వాపోతూ ఉంటుంది. ఎందుకీ వ్యర్థ ప్రయాస అని చెప్పినా వినదు… కొంతమంది అంతే.. ఉన్నదానితో సంతృప్తి పడరు.. ఎదుటివారిని సుఖంగా ఉండనివ్వరు అనుకుని, పని మీద దృష్టి సారించాడు.

కొలీగ్‌ రవి వచ్చాడు. “సూర్యా.. నేను చెప్పింది ఏం ఆలోచించావు?” అంటూ కొన్ని పేపర్లు బయటకు తీసాడు. ‘వీడొకడు నన్ను తగులుకున్నాడు’ అనుకుని “..లంచ్‌ తర్వాత చూద్దాం లే” అని చెప్పాడు సూర్య.

“ప్లీజ్‌ సూర్యా.. ప్లీజ్‌” అని బ్రతిమాలి వెళ్ళిపోయాడు రవి. తల పట్టుకున్నాడు సూర్య.

కాసేపటి తర్వాత బాస్‌ రాజీవ్‌ దగ్గరకు వెళ్ళి వర్క్‌ అప్డేట్‌ చేసాడు. రాజీవ్‌ చాలా కూల్‌గా మాట్లాడాడు. వచ్చేస్తుంటే “సూర్యా.. మన రవికి ఏదో హెల్ప్‌ కావాలంట… చెయ్యకూడదూ” అని చెప్పాడు. అందులో రిక్వెస్ట్‌ కంటే ఆర్డరే కనబడింది.

“సరే బాస్‌..” అని చెప్పి వచ్చేసాడు. ‘ ఏంటో తన బతుకు… ప్రతీవాడికి లోకువే’ అనుకుని నిట్టూర్చాడు.

రవిని పిలిచి, అతని చిట్టీ పేపర్ల మీద గ్యారంటీ సంతకం పెట్టాడు.. బాస్ రాజీవ్ చెప్పాడు కదా అని పెట్టాడు కానీ అదే అతని మెడకు చుట్టుకుంటుంది అని ఊహించలేకపోయాడు.

***

రోహిణీ వచ్చి “కాఫీకి వెళ్దాం పద..” అంది. ఇద్దరూ కదిలారు. కూర్చున్నాక

“ఏంటి ఆ రవి గాడు ఎందుకొస్తున్నాడు నీ దగ్గరకు..” అంది రోహిణి.

“ఏదో చిట్టీ పాడుతున్నాడట… గ్యారంటీ సంతకానికి వచ్చాడు…”

“పెట్టావా..”

“తప్పదు కదా.. రాజీవ్ రికమండేషన్ కూడా..”

“నిజమా… జాగ్రత్త.. వాళ్లిద్దరూ తోడు దొంగలు..” హెచ్చరించింది రోహిణి. “.. ఏంటి ఈ మధ్య అదోలా ఉంటున్నావు..” అంది.

“ఏముంది.. నోన్‌ ప్రోబ్లెం…ఇంటి పోరు..” బాధగా అన్నాడు.

“నువ్వే అలా అంటే ఎలా… సర్దుకుపో సూర్యా..” ఓదార్చింది.

“నీకేం… ఎన్నైనా చెబుతావ్‌.. ఒంటరి దానివి..” నవ్వేసాడు రవి.

“మా బాధలు మాకుంటాయి బాబూ..” అంటూ లేచి “..పద..” అంది. సీట్‌కి వచ్చేసారు.

“లంచ్‌కి నేను కూడా వస్తా.. బాక్స్‌ తేలేదు” అన్నాడు సూర్య.

“ఓహ్‌.. వెల్కం గురూ..” అని వెళ్ళిపోయింది రోహిణి.

రోహిణితో కూర్చుని లంచ్‌ చేస్తున్నాడు సూర్య. సెల్‌ రింగ్‌ అయింది. కాల్‌ లిఫ్ట్‌ చేసాడు.

“ఎక్కడున్నారు..?” అడిగింది సీత.

“లంచ్‌ చేస్తున్నాను..” చెప్పాడు సూర్య

“నేను బాక్స్‌ పెట్టలేదుగా…”

“కేంటీన్‌లో తింటున్నాను..”

“ఎవరితో…”

“ఏం ప్రశ్న అది… ఎవరితో తింటాను… నా కొలీగ్స్‌తో తింటాను..” కోపంగా అన్నాడు

“కొలీగ్సా… గాళ్‌ఫ్రెండా?”

“ఏం మాట్లాడుతున్నావు నువ్వు..”

“ఉన్నదే మాట్లాడుతున్నాను… ఏం తప్పా.. ఇప్పుడు నీ పక్కనే ఉందిగా”

మనసంతా చేదుగా అయిపోయింది సూర్యకు. ఇక అన్నం తినాలనిపించలేదు. లేచి వచ్చేసాడు. ” ఏయ్‌.. సూర్యా..” అని వెనక నుండి పిలుస్తోంది రోహిణి.

సీట్‌కొచ్చి చాలా సేపు తల వాల్చుకుని కళ్ళు మూసుకున్నాడు. ఉవ్వెత్తున లేచిన అల లాంటి బాధ ఎగిసెగసి పడుతోంది అతని గుండెల్లో!!!

***

శేఖర్‌.. సూర్య కొలీగ్‌…పైకి కనిపించేంత అమాయకుడు కాదు.

ఆఫీసుకొచ్చి పని చేసి రూముకెళ్ళాక… ఇంటెర్నెట్‌లో పోర్నోగ్రఫీ చూస్తూ టైం పాస్‌ చేస్తాడు. అప్పుడప్పుడు మందు పార్టీలు, అమ్మాయిలని రూముకి తెచ్చుకుని ఎంజాయ్‌ చెయ్యడాలు అన్నీ ఉన్నాయి. కానీ అతనికి అది రొటీన్‌ అయిపోయింది. వెరైటీ కావాలి. డబ్బు పెట్టి తెచ్చుకునే అమ్మాయిలందరూ వేశ్యలు. ఎంతో మందితో నిత్యం సెక్సువల్‌ ఏక్టివిటీలో ఇన్వావ్వ్‌ అవుతారు. వాళ్ళతో ఎంత సమయం గడిపినా అది ప్రొఫెషనల్‌గానే ఉంటుంది. అందులో మనసు ఉండదు. మొదట్లో అతనికి ఈ విధంగా గడపడం వల్ల బాగా థ్రిల్‌ వచ్చేది. రాను రాను అది కామన్‌ అయిపోయి బోర్‌ కొడుతోంది. ఫ్రెష్‌గా ఒక అమ్మాయిని ప్రేమించి, నెమ్మదిగా ఆమెను ముగ్గు లోకి దింపాలని అతని ఆలోచన. కానీ ఒక పక్క ఆఫీసుకు వెళుతూ ఇంకోపక్క ఇలాంటి కల్చరల్‌ ఏక్టివిటీస్‌కి కుదరడం లేదు. అందుకే ఆఫీసులోనే ఎవరో ఒకరిని బుట్టలో వెయ్యాలని అనుకున్నాడు. ఆలోచిస్తే అతని కళ్ళముందు ఒక అమ్మాయి కదిలింది. ఆమె ‘రోహిణి’. టెంప్ట్‌ చేసే ఆమె ఫిగర్‌. అతన్ని బాగా నిద్రకు దూరం చేసింది.

శతవిధాల ప్రయత్నించి రోహిణితో స్నేహం చేసుకున్నాడు. ఏ విషయంలో కలిసిందో కానీ ఇద్దరి మధ్య గాఢమైన ఫ్రెండ్షిప్‌ కుదిరింది. శేఖర్‌ ప్లాన్‌ చేసినట్టుగా ఆమె అతని దార్లోకి వచ్చింది. ఇక ఆమెను నెమ్మదిగా బెడ్‌ ఎక్కించడమే మిగిలింది.

సెల్‌ రింగ్‌ అయితే లిఫ్ట్‌ చేసాడు శేఖర్‌.

“హాయ్‌.. బేబీ ఎలా ఉన్నావు” అంటూ ప్రేమగా విష్ చేసాడు.

“వెరీ ఫైన్‌.. వాట్సప్‌..” అంది రోహిణి అటు నుండి.

“థింకింగ్‌ ఎబౌట్‌ యు… వాట్‌ ఎల్స్‌..” అంటూ మురిపించాడు.

“అవునా.. అన్నీ కోతలు.. “

“బీ సీరియస్‌… నీ బర్త్‌డేకి ఒక సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నాను… “

“ఓహ్‌.. రియల్లీ… సో ఎక్సైటింగ్‌” అంది రోహిణి

” బట్‌ యు హేవ్‌ టు ప్రామిస్‌ మీ ఒన్‌థింగ్‌…”

“ఏంటి..?”

“ఆ బర్త్ డే సెలెబ్రేషన్‌ నా రూములో…”

“నో..నాటెటాల్‌..” అంది రోహిణి.

“ప్లీజ్‌… ప్లీజ్‌ రోహిణీ..” అంటూ రిక్వెస్ట్‌ చేసాడు శేఖర్‌.

“చూద్దాం…” అని ఫోన్‌ కట్‌ చేసేసింది రోహిణి.

చిన్నగా నవ్వుకున్నాడు శేఖర్‌…. రోహిణి అంత అమాయకురాలు కాదని… ఆమె అతని రూముకి రావడం ఒక ప్రమాదానికి దారి తీయబోతోందని తెలీని పిచ్చి శేఖర్‌!!

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here