Site icon Sanchika

కలగంటినే చెలీ-19

[box type=’note’ fontsize=’16’] శ్రీ సన్నిహిత్ వ్రాసిన ‘కలగంటినే చెలీ’ అనే నవలని ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]ఇం[/dropcap]టికొచ్చిన సూర్య… సీత, చింటూ లేకపోవడంతో కంగారు పడ్డాడు. వెంటనే ఆమె సెల్‌కి కాల్‌ చేసాడు.

సీత లిఫ్ట్‌ చేసి “..చెప్పండి” అంది.

“సీతా.. ఎక్కడున్నారు” అడిగాడు

“మా అమ్మా వాళ్ళ ఇంట్లో ఉన్నాము.. కొన్ని రోజులు ఇక్కడే ఉంటాము.. మీరు రావద్దు” అని చెప్పి పెట్టేసింది. అనసూయమ్మ గారే ఈ సలహా ఇచ్చి ఉంటారని ఊహించాడు. ‘అయినా సీత ఏమీ చిన్న పిల్ల కాదు కదా..ఎవరేం చెప్పినా వినడానికి? అయినా ఎవరో చెప్పడం వల్ల కాదు… తన మీద ఇష్టం లేకనే వెళ్ళిపోయుంటుంది’ అనుకుని ఈగో ఫీల్‌ అయ్యాడు. ‘అయినా ఆడది, ఆమెకే అంత అహంకారం ఉంటే తనకెంత ఉండాలి.. కొన్ని రోజులు పోతే తనె వస్తుందిలే’ అనుకుని లైట్‌ తీసుకున్నాడు.

ఆ రాత్రికి ఉన్నదేదో తిని పడుకున్నాడు. పొద్దున్నే లేచి రడీ అయి ఆఫీసుకు వెళ్ళిపోయాడు. రవి ఆ రోజు కూడా ఆఫీసుకి రాలేదు. నిస్పృహగా అనిపించింది సూర్యానికి. సీటు ముందు కూర్చుని వర్క్‌ చేసుకుంటుండగా సెల్‌ రింగ్‌ అయింది. సీత ఏమో అనుకున్నాడు.

కానీ ఫోన్‌ చేసింది తల్లి పార్వతమ్మ. “అబ్బా..” అనుకుంటూ లిఫ్ట్‌చేసాడు.

“బాబూ బాగున్నావమ్మా…” అంది పార్వతమ్మ అటునుండి.

“ఆ.. బాగున్నానమ్మా..” అన్నాడు

“మరేం లేదు… పెద్ద చెల్లికి మంచి సంబంధం వచ్చింది.. మన పక్క ఊరి అబ్బాయే… గవర్నమెంట్‌జాబ్‌.. మా అందరికీ నచ్చింది.”

“ఓ.. కంగ్రాచ్యులేషన్స్ అమ్మా…”

“ఆ..ఆ.. అయితే కట్నం కొంచెం ఎక్కువ అడుగుతున్నారు. మీ నాన్నగారి రిటైర్‌మెంట్‌ డబ్బులు కొన్ని ఉన్నాయి… అయితే అవి సరిపోవు..” నసుగుతూ అంది.

“ఎందుకమ్మా సరిపోవు..”

“అబ్బాయికి బైక్‌ కావాలంట బాబూ..” అంది. “అంతే కాకుండా ఇంకా పెట్టుపోతలు ఉంటాయి కదా.. అందుకే ఓ రెండు లక్షలైనా నువ్వు సర్దుతావని..”

“అమ్మో రెండు లక్షలా… నా దగ్గర ఎక్కడివమ్మా..” నిస్సహాయంగా అన్నాడు. అప్పటి దాకా నెమ్మదిగా మాట్లాడిన పార్వతమ్మ తన ఒరిజినల్‌ టోన్‌లోకి మారిపోయింది.

“ఏంట్రా నువ్వు మాట్లాడేది.. అంత పెద్ద జాబ్‌ చేస్తున్నావు.. ఆ మాత్రం సర్దలేవా… మా రక్తం ధారపోసి నిన్ను పెంచాం.. చదివించాం.. ఇప్పుడు మా అవసరం తీరిపోయిందని వదిలేస్తావా.. నీకు నీ అత్త మామలేనా ముఖ్యం? మేము కాదా..” అరుస్తోంది

“ప్లీజ్‌ అమ్మా.. ప్లీజ్‌..”

“అవన్నీ మాకు తెలీదు.. నువ్వు రెండు లక్షలు పంపించు… అంతే..” అని ఫోన్‌ పెట్టేసింది పార్వతమ్మ. దెబ్బ తిన్న పక్షిలా విల విల్లాడిపోయాడు.

పరిస్థితులు మనుషుల్ని ఎలా మార్చేస్తాయో అనడానికి ఉదాహరణ ఇంతకన్నా ఇంకేం కావాలి. ముఖ్యంగా డబ్బు.. మనుషుల్ని బాగానే ఆడిస్తుంది.

హెడేక్‌లా అనిపించి కాఫీ తాగుదామని లేచాడు. అతన్ని చూసి రోహిణి కూడా వచ్చింది. ఇద్దరూ కేంటీన్‌ వైపు కదిలారు.

కాఫీ తెచ్చుకున్నాక “ఏమైంది అదోలా ఉన్నావు..” అంది రోహిణి.

చిన్నగా నిట్టూర్చాడు సూర్య. “ఎప్పుడూ ఉండేదే… సీత గొడవపడి పుట్టింటికి వెళ్ళిపోయింది..”

“నిజమా.. మరి నువ్వు వెళ్ళి బ్రతిమాల లేకపోయావా..”

“వెళ్తాను… నాకు మాత్రం ఆత్మాభిమానం లేదా…”

“ఊరికే ఇగోకి పోకు… ఎంతైనా నీ వైఫ్‌ కదా.. పైగా చింటూ కూడా ఉన్నాడు” అంది.

“అబ్బ.. క్లాసు పీకకు… వెళ్తాలే…” అని విసుక్కున్నాడు. “… ఇందాక అమ్మా వాళ్ళు ఫోన్‌చేసారు.. చెల్లికి మేరేజ్‌ సెటిల్‌ అయిందట… కొంచెం మనీ కావాలంటున్నారు..”

“ఓహ్‌.. అదా సంగతి.. అందుకేనా విసుగు…” చిన్నగా నవ్వింది.

“నీకు అసలు విషయం చెప్పలేదు… సీత ఎందుకు గొడవ పడిందో తెలుసా..”

“తెలీదు… చెప్పు”

“మన రవి చిట్టీ పాడి డబ్బులు ఎగ్గొట్టాడు… నేను కూడా గ్యారంటీ ఇచ్చాను కదా… ఇప్పుడు నాకు సేలరీ కటింగ్‌ వచ్చింది.” బాధగా అన్నాడు.

“అవును.. ఇందాకే ఎవరో చెప్పారు.. నేనే అడుగుదామనుకున్నాను… కానీ నువ్వు వేరే ప్రోబ్లమ్స్‌ చెప్పేటప్పటికి ఆగిపోయాను” అంది. “… అయినా వాడిని నమ్మడం చాలా పొరపాటు.. మన రాజీవ్‌ వీడు తోడుదొంగలు..” అంది. నిశ్శబ్దంగా ఉండిపోయాడు సూర్య. పరిస్థితి బాగా లేనప్పుడు తాడే పామై కరుస్తుందంటే ఇదే అనుకున్నాడు.

సూర్య “రోహిణీ… నాకు హెల్ప్‌ చేస్తావా.. కొంచెం మనీ ఎడ్జస్ట్‌ చెయ్యగలవా…” అడిగాడు.

“సేవింగ్స్‌ అయితే ఉన్నాయి…. మీ చెళ్ళి మేరేజ్‌కే కదా…ఇస్తాలే” అంది. రిలీఫ్‌గా ఫీల్‌ అయ్యాడు సూర్య.

తర్వాత.. రోహిణి ఆ డబ్బులు ఇచ్చాక తల్లిదండ్రులకి పంపించేసాడు. ఏదో కింద మీద పడి ఒక తలనొప్పి తగ్గించుకున్నాడు. కానీ ఈ సేలరీ కటింగ్‌ తలనొప్పి ఎలా తీర్చుకోవాలో అర్థం కాక తల పట్టుకున్నాడు.

***

సీత చింటూని స్కూల్‌లో దింపి వచ్చింది. తల్లికి ఇంటి పని, వంట పనిలో సాయం చెయ్యసాగింది. అనసూయమ్మకు కూడా కొంచెం సుఖంగా ఉంది. సీత వచ్చాక ఆ మాట ఈ మాట చెప్పుకుంటూ పనులన్నీ చేసుకుంటున్నారు.

వాట్సప్‌లో ఏదో వీడియో మెసేజ్‌ వస్తే ఓపెన్‌ చేసింది సీత. అది చూసి తల తిరిగినంత పని అయింది ఆమెకు. ఆ వీడియోలో సూర్య, రోహిణి చాలా చనువుగా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు కాఫీ తాగుతున్నప్పుడు దొంగ చాటుగా తీసిన వీడియో అది. అందులో పెద్ద విషయమేమీ లేదు కానీ అప్పటికే గాయపడి ఉన్న సీత మనసు మీద కారం జల్లినట్టు అయింది. భగ్గున మండిపోయింది. తల్లికి చూపించింది.

“అమ్మో.. అమ్మో.. ఎంత పని చేసాడమ్మా.. పైకి అమాయకుడిలా కనిపిస్తాడు కానీ పెద్ద దొంగ మీ ఆయన..” అంటూ ఆడిపోసుకోసాగింది. సీత కూడా ఆ మాటలకు తలూపుతూ “అవును నిజమేనమ్మా..” అంటూ వంత పాడింది. ఈ ఫేక్‌ వీడియో వల్ల సీత సూర్య మధ్య దూరం మరింత పెరిగింది.

అనసూయమ్మ ఆలోచనలో పడింది. పెళ్ళి కాకముందు సీత సంపాదనకు అలవాటుపడిన వాళ్ళు కదా.. ఇప్పుడు కూడా అదే ఏంగిల్‌లో బుర్రకు పదును పెట్టింది. కొడుకు సుశీల్‌ ఇంకా సెటిల్‌ కాలేదు. అవుతాడన్న నమ్మకం కూడా లేదు. అతనికో బంగారు భవిష్యత్తు ఇవ్వాలంటే సీతను ఉపయోగించుకోవాలి అనుకుంది.

“సీతా..” అని పిలిచింది.

“ఏంటమ్మా..” అంటూ వచ్చింది సీత.

“నీకో మాట చెబుతాను… తప్పుగా అనుకోవద్దు”

“చెప్పమ్మా”

“పెళ్ళి చేసి నిన్ను పంపించాం… కానీ నీ బ్రతుకు ఇలా అవుతుందని అనుకోలేదమ్మా..” అని కన్నీళ్ళు పెట్టుకుంది

“ఊరుకోమ్మా.. ఎందుకంత భారీ డైలాగులు.. ఇప్పుడేమైందని”

“ఇంకా ఏం కావాలమ్మా.. మొగుడికి దూరమై నువ్వు ఇలా ఉంటే మాకు గుండె తరుక్కుపోతుందమ్మా….”

చిరాగ్గా అనిపించిది సీతకు. తనకు లేని ఫీలింగ్స్‌అన్నీ కలిగిస్తోంది అనుకుంది. “అయితే ఏం అంటావమ్మా..” అంది.

“ఇలా ఇంట్లో కూర్చుని ఉంటే ఇంకా ఆ బాధ ఎక్కువవుతుందమ్మా.. మళ్ళీ జాబ్‌కి ట్రై చెయ్‌..పనిలో పడితే అన్నీ మర్చిపోవచ్చు”

“ఇప్పుడు నాకు జాబ్‌ ఎవరిస్తారమ్మా..”

“ఎందుకివ్వరు.. నువ్వు క్వాలిఫైడ్‌, ఎక్స్‌పీరియన్స్ కూడా ఉంది. అయినా నువ్వు జాబ్‌ మానేసిన కంపెనీలోనే మళ్ళీ ట్రై చెయ్..” అంది

సీత “నాక్కొంచెం టైమివ్వమ్మా… ఆలోచించుకోవాలి” అంది.

అనసూయమ్మ చిన్నగా నవ్వుకుంది. తను వేసిన డోస్‌ పనిచేస్తుందని ఆమెకు తెలుసు.

***

ఫ్రెండ్‌ రాజుకి ఫోన్‌ చేసాడు సూర్య. అతను లిఫ్ట్‌ చేసాక “మావా ఒక సారి రారా…నీతో మాట్లాడాలి” అన్నాడు.

“ఏమైందిరా.. సడన్‌గా నేను గుర్తొచ్చాను” అన్నాడు రాజు

“కొంచెం ప్రోబ్లెం అయింది రా.. కాస్త డీటెయిల్డ్‌గా మాట్లాడాలి”

“ఆహా.. సీత ఎలా వుంది… చింటూ ఎలా ఉన్నాడు”

“……..”

“సరే.. అర్థమైందిలే… మన అడ్డాకి వచ్చెయ్‌… మాట్లాడుదాం” అని పెట్టేసాడు రాజు.

***

బార్‌లో కూర్చున్నారు ఇద్దరూ. పరుచుకున్న డిం లైట్‌ సూర్య మనసులో గూడుకట్టుకున్న బాధలా ఉంది. పక్క టేబుల్స్‌లో అప్పటికే బాగా తాగి మత్తెక్కిన కస్టమర్లు పెద్ద వేదాంతుల్లా మాట్లాడుతున్నారు.

రెండు బీర్లు.. విస్కీ ఆర్డరిచ్చాక అడిగాడు రాజు “ఏంట్రా ప్రోబ్లెం..” అని

సూర్య నెమ్మదిగా జరిగినదంతా చెప్పాడు. కొలీగ్‌ రవి మోసం, సీత పుట్టింటికి వెళ్ళిపోవడం…తల్లిదండ్రులు డబ్బుల కోసం వత్తిడి చెయ్యడం…రోహిణి హెల్ప్‌ చెయ్యడం అన్నీ వివరంగా చెప్పాడు. ఇంతలో డ్రింక్స్‌ వచ్చాయి. గ్లాసుల్లో పోసుకుని త్రాగడం మొదలు పెట్టారు.

రాజు అన్నాడు ”…ఇంత జరుగుతున్నా నాకు చెప్పలేదేమిట్రా.. పెళ్ళి అయ్యాక చాలా మారిపోయావు రా.. పైగా ఆ రోహిణితో ఫ్రెండ్షిప్‌ ఒకటి..”

“సరే ఇప్పుడు ఆమె సంగతి ఎందుకు.. ఏం చెయ్యాలో చెప్పు” అన్నాడు సూర్య.

రాజు కాసేపు ఆలోచించాడు. “ఏం చేస్తాం.. ప్రస్తుత పరిస్థితుల్లో.. ముందు సీతను బ్రతిమాలి ఇంటికి తెచ్చుకో… తర్వాత తనని కూడా జాబ్‌కి ట్రై చెయ్యమని చెప్పు.. అప్పుడు నిదానంగా అన్నీ సర్దుకుంటాయి” అన్నాడు సాలోచనగా.

ఈ అయిడియా బాగానే ఉందనిపించింది. కొంచెం కిక్‌ ఎక్కి ఉండటంతో సీతతో మాట్లాడాలనిపించింది. జేబులో నుండి సెల్‌ బయటకు తీసాడు.

“ఇప్పుడొద్దులేరా..” అన్నాడు రాజు వారిస్తూ.

“లేదురా.. ఇప్పుడే మాట్లాడతాను.. మధ్యాహ్నం చేస్తే కట్‌ చేసింది” అంటూ డయల్‌ చేసాడు సూర్య. లక్కీగా సీత ఫోన్‌ లిఫ్ట్ చేసింది.

సూర్య “షీతా.. షీతా.. నేను… నేను.. చింటూ” అంటూ ముద్ద ముద్దగా అన్నాడు.

“ఎక్కడున్నారు మీరు…” గట్టిగా అంది సీత అటు నుండి.

“నేను… నేను… బయట ఉన్నాను..” అన్నాడు అతి కష్టం మీద..

సీతకు, అతను బార్‌లో మందు కొడుతున్నాడని అర్థమైంది. ఒళ్ళు మండిపోయింది ఆమెకు. భార్యా, పిల్లాడు తన దగ్గర లేరు అన్న బాధ ఎంత మాత్రమూ లేకుండా ఇలా బార్ల వెంబడి తిరుగుతున్నాడన్నమాట. కోపంగా ఫోన్‌ కట్‌ చేసేసింది. అనవసరంగా ఫోన్‌ చేసానని కన్నీళ్ళు పెట్టుకున్నాడు సూర్య.

“ఊరుకోరా.. ఏమీ కాదు..రేపు మళ్ళీ ట్రై చెయ్‌” అని ఓదార్చాడు రాజు.

కట్‌ చేస్తే.. ”ఎవరమ్మా.. ఇంత రాత్రి పూట ఫోన్‌..” అంటూ సీత దగ్గరకు వచ్చింది అనసూయమ్మ.

“ఇంకెవరమ్మా… నీ గారాల అల్లుడు” అంది.

“ఆయనా.. ఏంటట…”

“బార్‌కెళ్ళి పీకల్దాకా మందు కొడుతున్నాడు.. ప్రేమ పొంగుకొచ్చి ఫోన్‌ కొట్టాడు..”

“నిజమా.. అయినా అదేం బుద్ధమ్మా.. భార్య వెళ్ళిపోయిందన్న బాధ లేకుండా ఈ తిరుగుళ్ళేంటి” అగ్నికి ఆజ్యం పోసింది.

“ఛీ..ఛీ.. నాదే బుద్ధి తక్కువ… మారుతాడని అనుకున్నాను.. పగలు ఆఫీసులో ఆ రోహిణితో సరసాలు… రాత్రి బార్లలో మందుకొట్టడాలు…” విసుక్కుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది. వెనగ్గా వచ్చిన తల్లితో “అమ్మా.. రేపు నేను నా పాత కంపెనీకి వెళ్తున్నాను… జాబ్‌ కోసం ట్రై చేస్తాను..” అని చెప్పి తలుపు దఢాలున మూసేసింది. కాగల కార్యం గంధర్వులే చేసారు అనుకుని నవ్వుకుంది అనసూయమ్మ. ఆ రాత్రి…. చాలా సేపు సీత ఏడుస్తూనే ఉంది.

***

పాత కంపెనీలో… బాస్‌ వెంకట్‌ ముందు కూర్చుంది సీత. ఆమెను చూస్తూ

“హాయ్‌ సీతా.. హౌ ఆర్యూ..” అన్నాడు వెంకట్‌

“ఫైన్‌సార్‌.. మీరెలా ఉన్నారు…”

“బాగున్నాను… చెప్పు ఏంటి ఇలా వచ్చావు…” అన్నాడు

“సార్‌… మన కంపెనీలో మళ్ళీ ఓపెనింగ్స్‌ ఏమైనా ఉన్నాయా..” నెమ్మదిగా అడిగింది.

ఆలోచించాడు వెంకట్‌. సీత చాలా సిన్సియర్ వర్కర్‌.. పని ఇస్తే కంప్లీట్‌ చెయ్యకుండా వదలదు. అందుకే మళ్ళీ అవకాశం ఇస్తే బెటర్‌ అని అనుకున్నాడు.

“చూస్తాను… మన హెచ్‌.ఆర్‌. మేనేజర్‌తో మాట్లాడి చెబుతాను… ఇంకేంటి మీ హస్బెండ్‌ ఎలా ఉన్నారు” అన్నాడు.

“హి ఈజ్‌ ఫైన్‌ సార్‌…” అని “…మళ్ళీ ఎప్పుడు రమ్మంటారు..” అని టాపిక్‌ మార్చింది.

“ఐ విల్‌ ఇన్‌ఫార్మ్ యు.. డోంట్‌వర్రీ… సీ యు సూన్‌..” అని సంభాషణ ముగించాడు.

“ఓకే  సార్‌.. బై సార్‌…” అని చెప్పి వచ్చేసింది.

ఇంటికొచ్చాక అనసూయమ్మ “ఏమైందమ్మా…ఏమన్నారు..” ఆత్రుతగా అడిగింది.

“చూసి చెబుతామన్నారమ్మా…” అని తన గది లోకి వెళ్ళిపోయింది.

“పోనీలే అన్నం తిందువు గాని రా..” అని వంటగదిలోకి వెళ్ళింది అనసూయమ్మ.

ఫ్రెష్ అయి వచ్చి కూర్చుంది సీత. తల్లి వడ్డించాక నెమ్మదిగా తినసాగింది. “అసలు నేనెందుకు జాబ్‌ చెయ్యాలమ్మా… నన్ను చూసుకోవడానికి మీరు లేరా..” అనడిగింది

అనసూయమ్మ ఖంగు తింది.. అయినా తేరుకుని “అదేంటమ్మా అలా అంటావు… ఆడదానికి ఆర్థిక స్వాతంత్ర్యం ఉంటే మంచిదే కదమ్మా.. ఎవరి మీదా ఆధారపడక్కర్లేదు” అంది.

“మరి నువ్వెందుకు జాబ్‌ చెయ్యలేదమ్మా…”

“మా రోజులు వేరమ్మా.. ఏదో భర్త చాటున బ్రతికేసాం…ఇప్పుడలా కాదుగా.. అయినా నీలా నేను చదువుకోలేదు కదమ్మా…” అంది.

“సరేలే.. వాళ్ళు రమ్మంటే వెళ్ళి జాయిన్‌ అవుతాను” అంది సీత. తినడం పూర్తి చేసి చేతులు కడుక్కుని లేచింది.

రెండ్రోజుల తర్వాత సీతకు కాల్‌ వచ్చింది, జాబ్‌లో జాయిన్‌ అవమని. సంతోషంగా వెళ్ళి జాయిన్‌ అయింది సీత.

అనసూయమ్మ మనసు ఆనందంలో తేలియాడింది.

(సశేషం)

Exit mobile version