Site icon Sanchika

కలగంటినే చెలీ-23

[box type=’note’ fontsize=’16’] శ్రీ సన్నిహిత్ వ్రాసిన ‘కలగంటినే చెలీ’ అనే నవలని ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]వా[/dropcap]తావరణం ప్రశాంతంగా ఉంది.. రాత్రి పది దాటింది. డిన్నర్‌ చేసి ఇంటి డాబా పైన కూర్చున్నారు సూర్య, సీత, రోహిణీ, రాజు. నలుగురి మనసులు ఉద్విగ్నంగా ఉన్నాయి. ఏదో రహస్యాన్ని తెలుసుకోవాలని ఆత్రపడుతున్నాయి.

సూర్య జరిగినదంతా రోహిణికి బ్రీఫ్‌ చేసాడు. శేఖర్‌ తనని బర్త్‌డే పార్టీకి రమ్మన్నాడని… తీరా వెళ్ళేటప్పటికి బాస్‌ రాజీవ్‌ శవం దర్శనం ఇచ్చిందని, తర్వాత శేఖర్‌ పోలీసులతో వచ్చి తనని అరెస్ట్‌ చెయ్యించాడని చెప్పాడు. గాఢంగా నిశ్వసించింది రోహిణీ.

“అయితే మీకు నేను జరిగింది చెప్పాలి” అని ఆగింది రోహిణి.

“వాట్‌… చెప్పు” అంటూ ఉత్సుకతతో ముందుకు వంగారు ముగ్గురూ.

రోహిణీ చెప్పసాగింది. “శేఖర్‌ నన్ను కూడా బర్త్‌డే పార్టీకి ఆహ్వానించాడు. అతడు నా బాయ్‌ఫ్రెండ్‌ కాబట్టి కాదనలేక ఆ రోజు రాత్రి పది గంటలకు అతని ఇంటికి వెళ్ళాను. కానీ తీరా రూముకి వెళ్ళాక ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే అక్కడ మా బాస్‌ ‘రాజీవ్‌’ ఉండటం. శేఖర్‌కి, రాజీవ్‌కి అంత సాన్నిహిత్యం ఉందని నాకు తెలీదు.. ఎప్పుడూ శేఖర్‌ కూడా చెప్పలేదు. అయినా ఆ విషయాన్ని తేలిగ్గా తీసుకుని వాళ్ళతో మామూలుగానే ప్రవర్తించసాగాను. కాసేపటి తర్వాత ‘నేను వెళ్ళి ఐటమ్స్ తీసుకొస్తాను’ అని శేఖర్‌ బయటకు వెళ్ళాడు. నాకు ఎందుకో ఇబ్బంది మొదలైంది. అసహనంగా కూర్చున్నాను. చాలా సేపయింది. శేఖర్‌ ఇంకా రాలేదు. అతని సెల్‌కి కాల్‌ చేసాను. నో రిప్లై. నా ముక్కుపుటాలకు ఆల్కహాల్‌ వాసన తగిలింది. తలెత్తి చూస్తే దగ్గరగా రాజీవ్‌. నా మొహానికి దగ్గరగా వచ్చి ‘బేబీ… చాలా సెక్సీగా ఉన్నావు’ అంటూ ఒంటి మీద చెయ్యి వేసాడు. షాక్‌ కొట్టినట్టు అయింది నాకు.

పులి బోనులో చిక్కుకున్న జింక పిల్లలా ఉంది నా పరిస్థితి. సమయానికి శేఖర్‌ కూడా పక్కన లేడు.

“ప్లీజ్‌ బీ ఇన్‌ యువర్‌ లిమిట్స్‌” అని గర్జించాను. కొంచెం వెనక్కి తగ్గాడు రాజీవ్‌. ఇంతలో మెయిన్‌ డోర్‌ చప్పుడయింది. శేఖర్‌ వచ్చాడు.

ఒళ్ళు మండిపోయింది నాకు. “ఏంటి శేఖర్‌.. నన్ను ఇలా వదిలి ఎక్కడకు వెళ్ళావు” అని అరిచాను.

నాకు సమాధానం ఇవ్వకుండా రాజీవ్‌ వైపు చూసి “పని అవలేదా..” అన్నాడు శేఖర్‌.

“ఉహూ.. అవలేదు. దానికి నువ్వు చెప్పలేదా.. కోఆపరేట్‌ చెయ్యకుండా తిరగబడుతోంది” అన్నాడు.

నాకు కళ్ళు బైర్లు కమ్మాయి. అంటే..శేఖర్‌ నన్ను రాజీవ్‌కి బలి ఇవ్వడానికి ప్లాన్‌ చేసాడన్నమాట. ఛీట్‌! ప్రేమ నటించి నన్ను ఇక్కడిదాకా తీసుకొచ్చింది అందుకేనన్న మాట. నా మనసు ముక్కలైంది. పశ్చాత్తాపం కలిగింది.

రాజీవ్‌, శేఖర్‌ కాలర్‌ పట్టుకుని “దీన్ని నా పక్కన పడుకోబెడతానని పది లక్షలు తీసుకున్నావు.. ఇదేనా నువ్వు చేసిన పని” అని నిలదీస్తున్నాడు.

నేను నెమ్మదిగా అక్కడి నుండి జారుకుని, రోడ్డు మీద కొచ్చి దొరికిన ఆటో ఎక్కి పారిపోయాను. అదీ జరిగింది. ఆ తర్వాత రాజీవ్‌ ఎలా చనిపోయాడు, అసలు ఏం జరిగింది అన్నది నాకు తెలీదు” అని ముగించింది.

అందరూ ఒక్కసారిగా ఊపిరి వదలడంతో ‘ఉఫ్‌…’మన్న సౌండ్‌ వచ్చింది.

సీత అంది “సూర్యా మీరు వెళ్ళేటప్పటికి.. శేఖర్‌ ఇంట్లో లేడు కదా” అని.

“అవును..” అన్నాడు సూర్య.

“అంటే… రోహిణి తప్పించుకుని వెళ్ళిపోయాక, మీరు శేఖర్‌ ఇంటికి వెళ్ళక ముందు, మధ్యలోనే రాజీవ్‌ హత్య జరిగింది. అయితే హంతకుడు ఎవరు అన్నది తెలుసుకోవాలంటే ఈ కోణంలోనే మనం ఆలోచించాలి” అంది సీత.

బాగా పొద్దు పోవడంతో “సరే ఈ రోజుకి నిద్రపోదాం.. చెయ్యాల్సిన పనులు రేపు చూద్దాం” అనుకుని అందరూ కిందకు దిగి వచ్చేసారు.

(ముగింపు వచ్చే వారం)

Exit mobile version