కలగంటినే చెలీ-3

0
2

[box type=’note’ fontsize=’16’] శ్రీ సన్నిహిత్ వ్రాసిన ‘కలగంటినే చెలీ’ అనే నవలని ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]”ఏం[/dropcap]ట్రా.. నాకే ఎదురు చెబుతున్నావు. నువ్వు చదువులో పూర్‌ కాకపోవచ్చు.. కానీ నేను జీవితంలో పూర్‌. నా సత్తా ఇంతే.. గుర్తుంచుకో”

సూర్యం తల్లి పార్వతమ్మ మధ్యలోకి వచ్చి “ఏంట్రా.. నాన్నగారికే ఎదురు చెబుతున్నావు” అని కోప్పడింది. తల్లి వైపు దెబ్బతిన్నట్టు చూసాడు. “నాకు ఇంజనీరింగ్‌ చదవాలని ఉందమ్మా.. నా ఫ్రెండ్స్‌ అందరూ వైజాగ్‌ వెళ్ళి కోచింగ్‌‌లో జాయిన్‌ అవుతున్నారు. వాళ్ళందరూ నాకంటే చదువులో.. తెలివితేటల్లో తక్కువ స్థాయి వాళ్ళు. వాళ్ళే ప్రయత్నించగా లేనిది నేనెందుకు మానెయ్యాలి” బాధగా అన్నాడు. అభావంగా చూసింది పార్వతమ్మ.

శంకరం “వాళ్ళందరూ చదువులో నీ కంటే తక్కువ స్థాయి వాళ్ళు కావచ్చు. కానీ ఆర్థికంగా నీ కంటే పైమెట్టులో ఉన్న వాళ్ళు. వాళ్ళు ఏమైనా చెయ్యగలరు. ఒక వేళ ఇంజనీరింగ్‌లో సీటు రాకపోతే ఇంకోలా గొప్పగా బ్రతకగలరు. కానీ మనలాంటి వాళ్ళకి ఆ చదువులు అందని ద్రాక్ష. మనకి తగ్గ చదువు చదివి ఏదో ఒక జాబ్‌ చూసుకుని జీవితాన్ని లాగించెయ్యడం ముఖ్యం.” గొప్ప వేదాంతిలా చెప్పాడు.

“ఏమో నాన్నా.. నాకు అవన్నీ తెలియవు. ఇంజనీరింగ్‌ చదవమని నా మనసు బలంగా చెబుతోంది. అంతే.. నీకు వీలైతే సాయం చెయ్యి లేకపోతే లేదు.. నేను వైజాగ్‌ వెళ్ళడం మాత్రం తథ్యం” అని చెప్పి అక్కడి నుండి విసురుగా వెళ్ళిపోయాడు సూర్యం. తాగుతున్న టీ గ్లాసుని బలంగా నేలకేసి కొట్టాడు శంకరం. అది భళ్ళున బ్రద్దలైంది… సూర్యం మనసు లాగ.

ఏం చెయ్యాలో తెలియక తల పట్టుకుంది పార్వతమ్మ.

***

నేల విడిచి సాము చెయ్యాలి.. అందరిచేత గొప్పవాడు అని భజన చెయ్యించుకోవాలి అన్నది కాదు సూర్యం ఆలోచన. ‘తాను చదవగలడు. ఆ సామర్థ్యం తనకుంది. అలాంటప్పుడు ప్రయత్నిస్తే తప్పేమిటి’ అన్న పట్టుదల అతనిది. ఇంత చిన్న విషయం తండ్రి శంకరానికి అర్థం కాకపోవడం అతని దురదృష్టం.

ఫ్రెండ్స్‌ అందరితోనూ తన సమస్యను చెప్పాడు. వాళ్ళంతా ఒకటే చెప్పారు – వైజాగ్‌లో కోచింగ్‌ జాయిన్‌ కావడానికి ఆర్థిక సహాయం చేస్తాము. మిగతా విషయాలన్నీ నువ్వే చూసుకో – అని. ఆ మాత్రం భరోసా దొరకడంతో కొంచెం బలం వచ్చింది సూర్యానికి. ఎంత కాదనుకున్నా వైజాగ్‌లో మూడు నెలలు ఉండాలి. మరి మూడు నెలల పాటూ ఫుడ్డూ.. బెడ్డూ ఎలా? మనసులో దేవుడిని తలుచుకున్నాడు. ఏదో ఒక మార్గం కనపడకపోదా అని ఆలోచించసాగాడు.

ఫ్రెండ్స్‌ మళ్ళీ అన్నారు. “ఒరేయ్‌.. మన మేథ్స్‌ లెక్చరర్‌ సొంత ఇల్లు వైజాగ్‌ లోనే. ఆయన ఫేమిలీ అక్కడే ఉంటుంది. వీకెండ్స్‌లో ఆయన అక్కడికి వెళ్ళి వస్తూ ఉంటారు. నువ్వు ఆయనని కలుసుకో.. నీ షెల్టర్‌ విషయంలో ఏదైనా మార్గం చూపిస్తారు” మంచి ఆలోచన అనిపించింది సూర్యానికి. వెంటనే స్టాఫ్‌ రూముకి వెళ్ళి ఆయన్ని కలిసాడు.

“ఏంటి సూర్యం… చెప్పు?” అన్నారు

సూర్యం తన సమస్యని పూర్తిగా వివరించాడు… తన తండ్రి విముఖతతో సహా!

“ఆహా.. అలాగా.. అయితే ఒక పని చెయ్‌. మా ఇంటి మేడ మీద ఒక చిన్న క్లాసు రూములాంటింది ఉంది. అందులో నేను వీకెండ్‌ ట్యూషన్స్‌ చెబుతూ ఉంటాను. మిగతా రోజుల్లో ఆ రూము ఖాళీ. కొన్ని రోజులు ఆ రూములో ఉండు. తర్వాత వేరే ఎక్కడైనా చూద్దాం” అన్నారు. మనసు ఆనందంతో గంతేసింది సూర్యానికి. దేవుడికి థాంక్స్‌ చెప్పుకున్నాడు.

ఆయనతో “అలాగే సార్‌.. థాంక్యూ వెరీ మచ్‌ సార్‌” అని చెప్పాడు.

“ఇట్స్‌ ఓకే.. ఆల్‌ ద బెస్ట్‌” అని ఆయన క్లాసు చెప్పడానికి వెళ్ళిపోయారు.

రిలీఫ్‌గా ఫీల్‌ అయి.. మంచి సలహా ఇచ్చిన ఫ్రెండ్స్‌కి థాంక్స్‌ చెప్పాడు. తర్వాత ఇంటికి వచ్చేసాడు.

శంకరం కొడుకు సూర్యంతో సరిగ్గా మాట్లాడటం లేదు. కొడుకు ఎదురు సమాధానం చెప్పడంతో ఈగో హర్ట్‌ అయి కోపంగా ఉన్నాడు. తల్లి పార్వతమ్మ మాత్రం సూర్యానికి కొంచెం సపోర్ట్‌. గుడ్డిలో మెల్ల అంటే ఇదే! రాత్రి బాగా పొద్దుపోయాక –

సూర్యం నెమ్మదిగా తల్లి దగ్గర చేరాడు. “అమ్మా.. నేను రేపు వైజాగ్‌ వెళతాను. కోచింగ్‌లో జాయిన్‌ కావాలి” అని చెప్పాడు.

“అమ్మో.. ఒక్కడివీ అక్కడ ఎలా ఉంటావురా.. అయినా డబ్బులు ఎక్కడివి?” ఆశ్చర్యపోయింది

“అవన్నీ నా ఫ్రెండ్స్‌ చూసుకున్నారమ్మా.. మా లెక్చరర్‌ ఒకరు తన ఇంట్లో ఉండటానికి రూము ఇస్తామన్నారు… నువ్వేమీ కంగారు పడకు. నన్ను ఆశీర్వదించు చాలు” అన్నాడు

“సరేరా.. అన్నీ మంచిగా జరగాలి. జాగ్రత్త” అని చెప్పి తను ఇంతకాలం భర్తకు తెలియకుండా దాచుకున్న కొంత డబ్బు కొడుకు చేతిలో పెట్టింది.

బట్టలు.. పుస్తకాలు సర్దుకున్నాడు సూర్యం. గీత దాటే ముందు సీతాదేవి మానసిక స్థితిలా ఉంది అతని పరిస్థితి! తనకు తాను ధైర్యం చెప్పుకున్నాడు.

తెల్లారాక ఫ్రెష్ అయి నిద్రపోతున్న తల్లిదండ్రుల కాళ్ళకి దండం పెట్టాడు. ఇంట్లో నుండి బయటపడి ఫస్ట్‌ బస్‌ ఎక్కాడు. ఇక అతడు తన గమ్యాన్ని చేరగలడో లేదో అన్నది ఆ భగవంతుడే నిర్ణయించాలి.

***

వైజాగ్‌లో అడుగు పెట్టగానే సూర్యానికి కలిగిన మొట్ట మొదటి ఫీలింగ్‌ – ‘అమ్మో ఇంత పెద్ద నగరమా!’ అని.

తన ఊరు ఈ వైజాగ్‌లా మారాలంటే కొన్ని దశాబ్దాలు పడుతుంది అనుకున్నాడు. మేథ్స్‌ సార్‌ ఇంటి ఎడ్రస్ వాళ్ళనీ వీళ్ళనీ అడిగి కనుక్కున్నాడు. వెళ్ళేటప్పటికి ఆయన ఇంట్లోనే ఉన్నారు.

“రా సూర్యం” అని ప్రేమగా ఆహ్వానించారు.

“నమస్కారం సార్‌” అన్నాడు సూర్యం

ఆయన సూర్యాన్ని తీసుకెళ్ళి మేడ మీద రూము చూపించారు. చాలా చిన్న రూము అది. అందులో గోడకి బ్లాక్‌ బోర్డ్‌ ఉంది. విద్యార్థులు కూర్చోవడానికి వేసిన బెంచీలు వరసగా ఉన్నాయి.

“ఈ రూములో కొన్ని రోజులు ఉండు. తక్కువలో ఎక్కడైనా రూము దొరికితే అప్పుడు మారుదువుగాని. కింద కామన్‌ బాత్రూం ఉంది. అది వాడుకో” అని చెప్పారాయన.

ఆయన కాళ్ళకి దండం పెట్టి “అలాగే సార్‌! కొన్ని రోజుల్లో వేరే రూము చూసుకుంటాను” అని చెప్పాడు సూర్యం. “సరే.. బాగా చదువుకో” అని చెప్పి ఆయన కిందికి వెళ్ళిపోయారు.

‘ఉండటానికి నీడ దొరికింది.. ఇక తిండి సంగతి చూసుకోవాలి’ అనుకున్నాడు సూర్యం. లగేజ్‌ ఒక పక్కగా పెట్టి రూము బయటకు వచ్చాడు. రోడ్డు మీద నడుస్తూ ఏదైనా హోటల్‌ కనిపిస్తిందేమో అని చూడసాగాడు. లక్కీగా ఒక మెస్‌ కనపడింది. ‘అమ్మ మెస్‌’ అన్న బోర్డ్‌ చూసి లోనికి వెళ్ళాడు.

కౌంటర్‌లో ఉన్న వ్యక్తి దగ్గరకు వెళ్ళి “సార్‌.. నెల రోజులకి సరిపడా మీల్స్‌ టికెట్‌ ఎంతవుతుంది?” అని అడిగాడు. అతను చెప్పిన రేటు విని దిగాలు పడిపోయాడు సూర్యం. ఇంటి దగ్గరనుండి వస్తున్నప్పుడు తల్లి ఇచ్చిన డబ్బులు ఈ నెల రోజుల భోజనానికే సరిపోయేలా ఉన్నాయి. ఇలా అయితే కష్టం అనుకుని బయటకు వచ్చేసాడు. పక్కనే ఉన్న టిఫిన్‌ సెంటర్‌లో కాస్త తిని రూముకి వచ్చి పుస్తకాలన్నీ ఒక షెల్ఫ్‌లో సర్దుకుని అందులో నుండి ఫిజిక్స్‌ బుక్‌ తీసి చదువుకోవడం మొదలెట్టాడు.

సూర్యంలో ఉన్న మంచి గుణం ఏమిటంటే ఒక్కసారి చదువులో పడితే అన్నీ మరిచిపోతాడు. ఆకలి అనేది మనిషికి బేసిక్‌ సమస్య. అందులో సందేహం లేదు.. కానీ ఒక లక్ష్యం మీద దృష్టి ఉన్నప్పుడు అది అంత బాధ అనిపించదు. సూర్యం కూడా ప్రస్తుతం తన లక్ష్యం ఏ విధంగా సాధించాలి అన్న దృష్టి మీద ఉన్నాడు కాబట్టి మిగతా చిన్న చిన్న ప్రాపంచిక సమస్యలని మర్చిపోగలుగుతున్నాడు. సమస్య ఎప్పుడూ రెలెటివ్‌ కదా! ఆ రోజు రాత్రి కూడా చాలాసేపు నిద్ర పట్టలేదు సూర్యానికి. తను చేయాల్సిన పనుల గురించి ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు.

మరుసటి రోజు తొందరగా లేచి రడీ అయ్యాడు. పెట్టెలో నుండి దేవుడి పటం తీసి దండం పెట్టుకున్నాడు. తర్వాత బయటపడి రోడ్డు మీదికొచ్చాడు.

అతడు కనుక్కున్న దాన్ని బట్టి ‘ఎంసెట్‌ కోచింగ్‌ సెంటర్‌’ అక్కడి నుండి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆటో ఎక్కితే డబ్బులు దండగ అని నడవడం ప్రారంభించాడు. రోడ్డు పొడుగునా షాపులు.. కమర్షియల్‌ కాంప్లెక్సులు. ఇంకా జనసంచారం మొదలు కాలేదు. ఆ షాపులను.. బిల్డింగులను అన్నీ చూసుకుంటూ ఆర్టీసీ కాంప్లెక్సు కూడా దాటి నడిచి నడిచి కోచింగ్‌ సెంటర్‌ చేరుకున్నాడు. అప్పటికే అతని ఫ్రెండ్స్‌ అక్కడకు చేరుకుని ఉన్నారు.

“రేయ్‌.. సూర్యం.. వచ్చేసావా” అంటూ చుట్టుముట్టేసారు. వాళ్ళని చూడగానే ఆనందంతో కన్నీళ్ళు తిరిగాయి సూర్యానికి.

“వచ్చాను రా.. మేథ్స్‌ సార్‌ ఇంటిలో ఉంటున్నాను.”

“హమ్మయ్య.. సరే నీక్కూడా ఫీజ్‌ కట్టాం.. ఇదిగో రిసీట్‌…” అని ఆ కాగితాన్ని చేతిలో పెట్టారు. దాన్ని భద్రంగా జేబులో పెట్టుకుని

“సరే.. మీరు హాస్టల్‌లో జాయిన్‌ అయ్యారా” అని అడిగాడు సూర్యం.

“అందరం.. హస్టల్‌లో జాయిన్‌ అయ్యామురా. నీకు మాత్రం మేము హాస్టల్‌ తీసుకోలేకపోయాము.” అంటూ బాధపడ్డారు ఫ్రెండ్స్‌.

కృతజ్ఞతగా వాళ్ళని చూసి “ఇప్పుడు మీరు చేసినదే ఎక్కువరా.. చాలు..” అని చేతులు పట్టుకున్నాడు.

“సరే పద.. క్లాసుకి వెళదాం” అందరూ క్లాసు వైపు దారి తీసారు.

క్లాసు రూము చాలా రిచ్‌గా ఉంది. రకరకాల ఊళ్ళ నుండి వచ్చిన విద్యార్థులు. అందరూ ధనవంతుల పిల్లలే!

మేథ్స్‌ లెక్చెరర్‌ బోర్డ్‌ ముందు నిలబడి ఒక్కొక్క ప్రోబ్లెం సింపుల్‌గా ఎలా సాల్వ్‌ చెయ్యాలో ట్రిక్స్‌ అన్నీ చెబుతున్నాడు. సూర్యం ఆశ్చర్యపోయాడు. ఇచ్చిన ప్రోబ్లెంని తక్కువ సమయంలో సాల్వ్‌ చెయ్యాలంటే ఈ టెక్నిక్స్‌ చాలా ముఖ్యం. కాంపిటీటివ్‌ ఎగ్జామ్స్‌లో కావాల్సింది టైం మేనేజ్మెంట్‌ కదా.

మేథ్స్‌ సార్‌ అందరినీ చూస్తూ “డియర్‌ స్టూడెంట్స్‌.. మీరందరూ కాలేజీలో చదివేటప్పుడు ఈ సిలబస్‌ అంతా చదివే ఉంటారు. అయితే ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది ఏమిటంటే తక్కువ సమయంలో ప్రోబ్లెమ్స్‌ని కరెక్ట్‌గా ఎలా సాల్వ్‌ చెయ్యాలి అన్నది. ఎంత తక్కువ సమయంలో చేస్తే అంత మంచిది. ఎంసెట్‌లో మీ రేంక్‌ని డిసైడ్‌ చేసేది ఈ నైపుణ్యమే! కాబట్టి నేను చెప్పేది జాగ్రత్తగా విని రూముకి వెళ్ళాక బాగా ప్రాక్టీసు చెయ్యాలి” అని చెప్పారు. సూర్యం మనసులో ఈ మాటలు బాగా రిజిస్టర్‌ అయ్యాయి.

తర్వాత ఫిజిక్స్‌, కెమిస్ట్రీ క్లాసులు కూడా అయ్యాయి. ఇంచుమించు అందరు సార్లు చెప్పే టెక్నిక్స్‌ అవే – తక్కువ సమయంలో కరెక్ట్‌గా వ్రాయడం.

క్లాసులన్నీ అయ్యాక మెటీరియల్‌ ఇచ్చారు కోచింగ్‌ సెంటర్‌ వాళ్ళు. ఆ పుస్తకాలని చేతులతో ప్రేమగా తడిమాడు సూర్యం. లంచ్‌ టైము అయింది. పిల్లలంతా అదే బిల్డింగ్‌లో ఉన్న హాస్టల్‌కి వెళ్ళసాగారు. సూర్యం ఫ్రెండ్స్‌ కూడా “సరేరా.. మేము లంచ్‌కి వెళతాము” అన్నారు. లంచ్‌ తర్వాత క్లాసులు ఉండవు. కేవలం స్టడీ అవర్స్‌ ఉంటాయి. హాస్టల్‌లో ఉండే విద్యార్థులు అక్కడే ఉండి చదువుకోవాలి. సూర్యంలా బయట రూముల నుండి వచ్చి అటెండ్‌ అయ్యేవాళ్ళు మాత్రం వెళ్ళిపోవచ్చు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here