Site icon Sanchika

కలక నీరు

[శ్రీ చేకూరి రామలింగరాజు రచించిన ‘కలక నీరు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

 

[dropcap]‘యూ[/dropcap] ఆర్ అపాయింటెడ్ యాజ్ అసిస్టెంట్ ఇంజనీర్ ఇన్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ అండ్ పోస్టెడ్ ఇన్ కుమారపురం డివిజన్ ఇన్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్’ ఉత్తర్వులు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారికి అందించి ఎదురుగా నిలుచున్నాడు విశ్వం. దానిని చదివి, చేయి ముందుకు చాపి కరచాలనం చేస్తూ “కంగ్రాట్యులేషన్స్!” అని చెప్పి “కూర్చో విశ్వనాధ్!” అన్నాడాయన ఎదురుగా ఉన్న కుర్చీని చూపిస్తూ. అందులో కూర్చుని క్లుప్తంగా తన పరిచయం చేసుకున్నాడు విశ్వం.

“ఇక్కడ మన పరిధిలో ‘కుమారపురం – అప్పనలంక’ బ్రిడ్జి పని జరుగుతోంది. దాని నిర్మాణ భాద్యత నీకు అప్పగిస్తున్నాను. కష్టపడి పని చేసి, మంచిపేరు తెచ్చుకోవాలి” చెప్పాడు ఇ.ఇ గారు. బెల్ కొట్టి ఒక అటెండర్‌ను పిలిచి “ఈ సారు కొత్తగా వచ్చిన ఏ.ఇ గారు, ఆయనకు సీటు చూపించు” అని చెప్పాడు. ఆయనకు నమస్తే చెప్పి అటెండరు వెంట నడిచాడు విశ్వం. ఆఫీస్ సిబ్బందికి తన పరిచయం చేసుకుంటూ వెళ్లి అటెండరు చూపించిన తన సీటులో కూర్చున్నాడు.

తనకు బాధ్యత అప్పగించిన కుమారపురం – అప్పనలంక వంతెన తాలూకు దస్త్రాలను అడిగి తెప్పించుకుని, వాటిని అధ్యయనం చేయసాగాడు విశ్వం. పన్నెండు స్తంభాలు, రెండు వరసల రహదారికి సరిపడు వెడల్పూ, కిలోమీటరు పొడవున నిర్మించ తలపెట్టిన వంతెన అది. ప్రధాన భూభాగంలోని కుమారపురం గ్రామం వద్ద, నాలుగు గ్రామాలున్న అప్పనలంకను కలపడానికి ఉద్దేశింపబడింది. డ్రాయింగ్స్ లోని అన్నీ ముఖ్యమైన వివరాలను నోట్ చేసుకున్నాడు. పరిశీలన అంతా పూర్తయ్యాకా నదిలో స్తంభాలకు పునాదికి సంబంధించి డ్రాయింగ్స్ లేకపోవటం గమనించి వాటి గురించి అడగాలి అనుకున్నాడు.

***

మరునాడు ఇ.ఇ. గారిని కలిసి “ఒకసారి వంతెన పని వద్దకు వెళ్లి చూసి వస్తాను సర్!” అని చెప్పాడు విశ్వం.

“అలాగే వెళ్ళు, కొంతకాలం నుంచీ నిధుల కొరత వల్ల పని నిలిచిపోయింది. ప్రస్తుతం అక్కడ మనుషులు ఎవ్వరూ లేరు. ఒక పని చెయ్యి, బెన్నీసు అని ఒక జట్టు మేస్త్రి ఉన్నాడు. ఆ ఊరి వాడే!, అతని సెల్ ఫోన్ నెంబర్ ఇస్తాను. ఫోన్ చేస్తే, అతను వచ్చి అంతా చూపిస్తాడు. నేను కూడా ఫోన్ చేస్తాను” అంటూ ఫోన్ ఒక నెంబర్ ఇచ్చాడాయన.

“అలాగే సార్!” అని బయటకు వచ్చి ఆ నెంబరుకు ఫోన్ చేసాడు. అవతల ఎత్తగానే “బెన్నిసేనా! మాట్లాడేది. నేను విశ్వనాధ్ ఏ.ఇ.ని మాట్లాడుతున్నాను” అన్నాడు.

“నమస్తే సారు! ఇప్పుడే ఇ.ఇ. సారు ఫోన్ చేసారు మీరు వస్తున్నారని, నేను కాలవగట్టున కాటన్ దొర బొమ్మ దగ్గర చూత్తా ఉంటాను. మీరు గట్టెంబడి వచ్చెయ్యండి” అన్నాడు బెన్నీసు.

స్కూటరు తీసుకుని బయలుదేరాడు విశ్వం. బెన్నీసు చెప్పినట్టు కాలువ వెంబడి ఉన్నరోడ్ మీద ప్రయాణించి కాటన్ దొర బొమ్మ దగ్గరకు చేరుకున్నాడు. సూటూ బూటూ వేసుకుని గుర్రం మీద కూర్చున్న దొర విగ్రహం ఠీవిగా ఉంది. దాని నీడలో కొంతమంది కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. తనవైపే చూస్తున్న ఒకతనిని దగ్గరకు వెళ్లి “బెన్నీసేనా!” అడిగాడు రూఢి చేసుకోవడానికి “అవును సారు, నమస్తే!” అన్నాడు బెన్నీసు ఒంటి చేతి నమస్కారం చేస్తూ.

“నేను, ఏ.ఇ. విశ్వనాధ్ నయ్యా!” నవ్వుతూ చెప్పి “వంతెన పని ఇక్కడినుంచి ఎంత దూరం బెన్నిసూ!” అడిగాడు విశ్వం.

“ఆ కరకట్ట ఎక్కి కొంచెం దూరం వెళ్ళాలి సారు!” చెప్పాడు.

“సరే! వెనుక ఎక్కు వెళదాం” అన్నాడు విశ్వం.

అతడు ఎక్కాక కరకట్ట మీదకు పోనిచ్చి దానిపై ముందుకు వెళుతున్నారు. దిగువన వున్న కరకట్ట వెంబడి ఉన్న కాలువపై చెక్కిన రాళ్లతో, చక్కటి నిర్మాణ కౌశలంతో కట్టిన లాకులను నిర్మాణాన్ని చూస్తూ, ఎంత అందంగా కట్టారో!, అనుకున్నాడు విశ్వం మెచ్చుకోలుగా.

“ఈ లాకులు బ్రిటిషోళ్ళ టైములో కట్టేరంట సారు! ఈ పనులన్నీ కాటన్ దొర అజమాయిషీ జరిగేయంట. ఆ దొర గుర్రంమీదొచ్చి గానుగాడుతున్న సున్నం మీద కొరడా ఏసి పైకి లేపితే దానితో పాటు సున్నం గుర్రమంత ఎత్తు సాగితే అప్పుడు దానిని కట్టుబడిలోకి ఒప్పుకునేవోడంట. లేకపోతే గానుగ ఇంకా తిప్పనేవోడంట. అందుకే ఈ కట్టుబళ్లు ఇంకా సెక్కు సెదరలేదు. ఇయ్యాల మనోళ్లు కట్టిన బ్రిడ్జీలు ఏడాది తిరగకుండా బీటలు తీసేత్తన్నాయి” అన్నాడు బెన్నీసు.

అవునన్నట్లుగా తలఊపాడు విశ్వం.

కొంతదూరం వెళ్లేసరికి కరకట్టకు కాంక్రీటుతో కట్టిన ఒడ్డుకట్ట కనిపించింది. “ఇదే సార్! వంతెన మొదలు” చెప్పాడు బెన్నీసు. వంతెన చేరుకోవడానికి ఎత్తుగా పోసిన మట్టికట్ట ఉంది. కాస్త దూరంలో నదీపాయ కనబడుతోంది.అక్కడవరకూ బాట ఉండి ఇరువైపులా కొబ్బరితోటలున్నాయి. “అటు పోనివ్వండి” అని బెన్నీసు చెప్పడంతో కరకట్ట దిగి నది వైపు పోనిచ్చాడు ఒడ్డున రెండు, మూడు స్తంభాలకు పునాదులు పూర్తయ్యి పైకి వచ్చాయి. నదీపాయ దగ్గరకు చేరుకున్నారు. వంతెన కట్టే ప్రదేశానికి కాస్త ఎగువున ఒక పడవల రేవు ఉంది. అప్పుడే వచ్చిన పడవ నుండి జనం దిగి నడిచి వెళ్తున్నారు.

“అవతలివైపుకు వెళ్లి అక్కడకూడా జరిగిన పని చూద్దాం బెన్నిసూ!” విశ్వనాధ్ అనడంతో ఇద్దరూ కలిసి రేవు దగ్గరకు వెళ్లారు. స్కూటరు ఒడ్డున పెట్టి నడిచి వెళ్లి పడవ ఎక్కారు. జనం నిండడంతో పడవ నడిపే గోబేరు, ఒడ్డుకు కట్టిన తాడు విప్పి పడవను నదిలోకి తోస్తుండగా “ఆపండాపండి మేవొవత్తనాం” అంటూ వినపడింది. ఒకామె మూడేళ్ళ పిల్లాణ్ణి ఎత్తుకుని పరుగుపరుగున రేవులోకి వస్తోంది..

“బెన్నీసూ! మీ ఫ్యామిలీ వొత్తన్నార్రా!” అన్నాడు గోబేరు. బెన్నీసు గబుక్కున ముందుకు వెళ్లి ఆమె చేతుల్లోంచి పిల్లవాణ్ణీ, చేతి సంచినీ అందుకుని పడవలో దింపి తర్వాత ఆమె కూడా చెయ్యి అందించి “జాగ్రత్త!” అంటూ పడవ ఎక్కించాడు. “సంత కెళ్ళానయ్యా! సరుకులు తెచ్చుకోవడానికి” చెప్పిందామె పడవలో కింద జాగ్రత్తగా కూర్చుంటూ. పిల్లవాడు పడవ అంచున కూర్చున్న బెన్నీసు వొళ్ళో కూర్చున్నాడు. “మా ఆవిడ వీరవేణి సార్! బుడ్డోడు మహేశు” వాళ్ళను చూపిస్తూ చెప్పాడు బెన్నీసు విశ్వంతో.

“కానీ నీ పేరేమిటి, బెన్నీసు చిత్రంగా వుంది!” అడిగాడు విశ్వం.

“అదా! పుట్టిన పిల్లలు సచ్చిపోతన్నారని మా ఊరి సర్చిలో మొక్కుకుందంట మా అమ్మ. ఆ సర్చి పాదర్ పెట్టాడంట సార్ నా పేరు బెన్నీసని” చెప్పాడు. పడవ బయలుదేరింది. చల్లని గాలి వేస్తుండంతో అందరికీ హాయిని కలిగిస్తూ సాగింది ప్రయాణం. తీరం చేరాక వాలుగా వేసిన చెక్కపై ఒక్కరొక్కరుగా దిగాక భార్యాపిల్లలతో మాట్లాడి ఊర్లోకి పంపించి “పదండి సారు” అంటూ వంతెన పనివైపు దారితీసాడు బెన్నీసు. అప్పనలంక వైపు కరకట్ట లేదు. “వరద వస్తే ఎలా? అడిగాడు విశ్వం. “లంకలో ఊళ్లలోకి నీరు వచ్చేస్తుంది సారు!” చెప్పాడు బెన్నీసు. ఇవతలి వైపు కూడా కాంక్రీటు అడ్డుకట్ట ఉంది, మట్టికట్టలు పోసివున్నాయి. చివరివరకూ వెళ్లి పూర్తిగా చూసి రేవు దగ్గరకు వచ్చాకా “మీది ఈ ఊరేగా! ఇక నువ్వు ఉండు, నేను వెళతాను” అని చెప్పి పడవ ఎక్కి రేవు ఇవతలికి వచ్చి తన బసకు చేరుకున్నాడు.

***

మరునాడు ఆఫీసులో దస్త్రాలు చూసుకుంటున్న విశ్వాన్ని “మిమ్మల్ని ఇ.ఇ. గారు రమ్మంటున్నారు సర్!” అంటూ అటెండరు చెప్పడంతో అయన గదికి వెళ్ళాడు. వెళ్లేసరికి అక్కడ కూర్చున్న ఒకాయనను పరిచయంచేస్తూ “ఈయన మన వంతెన పని గుత్తేదారు సుబ్బరాజుగారు” అన్నాడు ఇ.ఇ. గారు.

“నమస్తే సార్!” చెప్పాడు సుబ్బరాజు.

“నమస్తే!” అని బదులు చెప్పి కుర్చీలో కూర్చుంటూ అడిగాడు విశ్వం

“పని నిలిపివేసినట్టున్నారు, తిరిగి ఎప్పుడు మొదలు పెడదామనుకుంటున్నారు సుబ్బరాజుగారూ!, పనికి మీకు ఇచ్చిన పద్దెనిమిది నెలల గడువు కూడా దాటిపోయింది.”

“మీకు తెలియనిది ఏముంది సార్! గత సంవత్సరం నుండీ నిధుల కొరత వల్ల బిల్లులు చెల్లింపులేదు. మొన్ననే ఫైనాన్సు వాళ్లకు డబ్బు ఇచ్చి వచ్చాను. నిధులు విడుదల చేస్తామన్నారు. పేమెంటు రాగానే మొదలుపెడతాను” చెప్పాడు.

“అన్నట్టూ నదిలో స్తంభాలకు పునాది డ్రాయింగ్స్సు లేవు సార్!” ఇ.ఇ. గారితో చెప్పాడు విశ్వం.

“అవి ప్రగతి కన్సల్టెంట్స్ అనీ, హైదరాబాద్ వాళ్ళకి డిజైను కాంట్రాక్టు ఇచ్చాము. వాళ్ళను అడిగి తెప్పించుకో విశ్వనాధ్” చెప్పాడు ఇ.ఇ. గారు.

“సరే సార్! నేను వాళ్ళతో మాట్లాడి ఆ డ్రాయింగ్స్ తెప్పిస్తాను. ఈ లోపు పని మొదలు పెట్టడానికి ఏర్పాట్లు చెయ్యండి సుబ్బరాజు గారూ!” అన్నాడు విశ్వం.

తన సీటుకు వచ్చి ప్రగతి కన్సల్టెంట్స్ వాళ్ళ ఫోన్ నంబరుకు ఫోన్ చేసాడు. ఎవరో వాళ్ళ మేనేజర్ ఎత్తాడు. విశ్వం డిజైన్ల విషయం అడుగుతూ “ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. పునాది డ్రాయింగులు లేకుండా పని ఎలా నడుస్తుంది చెప్పండి. మీకు మొత్తం బిల్లు చెల్లింపు కూడా జరిగింది” అన్నాడు గట్టిగా

“చూడండి ఏ.ఇ. గారూ! మీ వాళ్ళు ఏవో పాత డ్రాయింగులతో పని చేసుకుంటాము, మీ పేరు మాత్రం వాడుకుంటామంటే, మాకు అనుభవ పత్రం అయినా వస్తుందని ఈ పనికి ఒప్పుకున్నాము. మాకు చెల్లించినదాంట్లో చాలా మీ వాళ్లే తీసేసుకున్నారు” చెప్పాడతను.

నివ్వెరపోయాడు విశ్వం. వ్యవస్థలో అవినీతి ఎంతగా వేళ్లూనుకుందో అర్థమయ్యింది.

జరిగినది ఇ.ఇ.కి చెబితే అయన నవ్వి “నేను మాట్లాడుతాను” అంటూ వాళ్లకు ఫోన్ చేసి మాట్లాడాడు. ఫోన్ పెట్టేసి చెప్పాడు, “వాళ్ళ డిజైనరు అమెరికా వెళ్ళాడట. అతను రాగానే చేసి ఇస్తామంటున్నారు. ఈ లోగా ఉన్న డ్రాయింగులతో పనిచేయించండి.”

“అలాగే సార్!” అన్నాడు విశ్వం, పునాది డ్రాయింగ్స్ లేకుండా ఏం పని చేయాలబ్బా! అనుకుంటూ.

గుత్తేదారు సుబ్బరాజుకు కొంత బిల్లు చెల్లింపు కావడంతో నదిలోకి దారులు వేసుకునే పని చేయసాగాడు. మరో రెండు నెలలకి డ్రాయింగ్స్ కూడా వచ్చాయి. అప్పుడు మొదలయ్యింది వర్షాకాలం. నదిలో నీటి మట్టం పెరడం వలన దారులు కొట్టుకుపోయి మరో నాలుగు నెలలపాటు ఏ పనీ జరగలేదు.

వర్షాలు తగ్గక మళ్ళీ నదిలోకి దారులు వేసుకుని స్తంభాలొచ్చేచోట చిన్న ద్వీపాలు ఏర్పాటు చేసుకుని పని మొదలుపెట్టాడు గుత్తేదారు.

ఓ రోజు పని పర్యవేక్షణకు వచ్చిన ఇ.ఇ. గారు విశ్వం, సుబ్బరాజులతో అన్నాడు “మాజీ ఎమ్మెల్యే ఫోన్ చేసాడయ్యా! మేం అధికారంలో ఉండగా నేను మంజూరు, చేయించిన వంతెన అది. మాకు కనీసం ఏమి తెలియచెప్పకుండా పనులు చేసుకుంటున్నారు. అవునులెండి అధికారంలో లేనోళ్లంటే లోకువే మరి. అంటూ నిష్ఠూరంగా మాట్లాడుతున్నాడు.”

“దానికి మనమేం చెయ్యాలి సార్!” అడిగాడు విశ్వం సందేహంగా.

“ఒకసారి నువ్వూ, సుబ్బరాజు గారూ, వెళ్లి ఆయనను కలిసి రండి. ఏమంటాడో చూద్దాం” చెప్పాడాయన సుబ్బరాజు తెప్పించిన కొబ్బరిబొండం తాగుతూ.

“ఏముంది సార్! ఆయన ఎంతో కొంత డబ్బు అడుగుతాడు. ఇప్పటికే ప్రాజెక్టు శంఖుస్థాపన ఖర్చులనీ, మంత్రి పర్యటనలనీ ప్రస్తుత ఎమ్మెల్యే చాల ఖర్చు పెట్టించాడు. ఈ అదనపు ఖర్చులన్నీ ఎక్కడ నుంచి వస్తాయి నాకు” అన్నాడు సుబ్బరాజు.

“మనం వెళ్లి కలవకపోతే భూసేకరణలో అక్రమమాలు జరిగాయని తమ వాళ్ళతో పిటిషన్ పెట్టించి పని ఆపు చేయించేస్తానంటున్నాడట” చెప్పాడు ఇ.ఇ. గారు తాగిన కొబ్బరిబొండం పక్కన పెడుతూ.

“అదే జరిగితే నేను నా యంత్రాలూ, మనుషులూ ఖాళీగా ఉండవలసి వస్తుంది. చాలా ఇబ్బందే” అన్నాడు సుబ్బరాజు ఒకింత ఆందోళనగా.

“సరే సార్! వెళ్లాయనను కలిసి వస్తాం” అంటూ చెప్పాడు సుబ్బరాజు “రేపు ఉదయం వెళదాం ఏఇ గారూ!”

మరునాడు ఉదయం ఆ మాజీ ఇంటికి వెళ్లారు విశ్వం, సుబ్బరాజులు. ఇంట్లోంచి తెప్పించి ఇచ్చిన టీ తాగుతుండగా చెప్పాడాయన “మా ప్రాంతంలో బ్రిడ్జి కట్టడం మాకూ సంతోషమే. మంజూరు చేయించడానికి మాకు బాగానే ఖర్చయ్యింది. అవన్నీ మీరు ఇవ్వాలని కాదు. అధికారంలో ఉన్నోళ్లు గొప్పలు చెప్పుకుంటూ, సంబరాలు చేసుకుంటున్నారు” అని అనుచరుల వైపు చూపిస్తూ “మా వాళ్ళను అస్సలు పట్టించుకోవడం లేదు” అన్నాడు.

ఎంత ఘరానా యాచన అనుకున్నాడు విశ్వం. సుబ్బరాజు ఓ అనుచరుణ్ణి పక్కకు తీసుకునివెళ్లి మాట్లాడి వచ్చాడు. ఆ మాజీ దగ్గర సెలవు తీసుకొని బయలుదేరారు.

***

వంతెన పని సజావుగా సాగుతోంది. బెన్నీసు అతడి మనుషులు రాత్రింబవళ్లు కష్టపడి పనిచేస్తున్నారు. వంతెన పూర్తయితే తమ గ్రామాల కష్టాలు తీరతాయని ఆశతో శ్రమకోరుస్తున్నారు. స్తంభాలు నీటిపైకి వచ్చి కనబడుతుంటే లంక ప్రజలు సంతోషపడుతున్నారు. అప్పుడు వచ్చాయి ఎన్నికలు.

ఎన్నికలలో కొత్త అభ్యర్థి ఎమ్మెల్యే ఎన్నికయ్యాడు. రాగానే కొత్త ప్రభుత్వం పాత ప్రభుత్వంలో ఏవో అక్రమాలు జరిగాయని ప్రతీ పనికీ రీటెండరింగ్ అని చెప్పడంతో పని మళ్ళీ ఆగిపోయింది. సుబ్బరాజు వెళ్లి పెద్ద పెద్ద ప్రజాప్రతినిధుల దగ్గరకు వెళ్లి మొత్తాలు సమర్పించి వచ్చాక మళ్ళీ మొదలయియింది. నాలుగు నెలల కాలం వృథా అయ్యింది.

అవినీతి, లంచాల భారానికి వంతెన కుచించుకుపోయింది. గుత్తేదారు ధరలు పెరిగాయన్న నెపంతో తక్కువ పనికే ఎక్కువ డబ్బు వచ్చేలా ఒప్పందాలు మార్పించుకున్నాడు.

ఓరోజు అవతల ఒడ్డున పని ఉండడంతో, విశ్వం బెన్నీసుకు ఫోన్ చేసి వేచి ఉండమని చెప్పి పడవలో బయలుదేరాడు. వర్షాకాలం కావడంతో నదిలో కలకనీరు వస్తోంది. అవతల ఒడ్డున బెన్నీసును తోడు తీసుకుని పనివాళ్లకు కొలతలు చెబుతూ సాయంత్రం వరకూ ఉండిపోయాడు. ఇంతలో చీకటి పడింది. వర్షం కూడా మొదలైంది. బయలుదేరి రేవు దగ్గరకు వచ్చేసరికి గోదావరి వరద తగిలివుండడంతో రాత్రివేళ పడవలు నిలిపివేశామని చెప్పాడు గోబేరు. “సార్! ఈ రోజుకు మీరు ఇక్కడ ఉండిపోవడం మంచిది” చెప్పాడు బెన్నీసు. విశ్వం ఎలాగా అని ఆలోచిస్తుండగా “మా ఇంటికి రండి సారు. పొద్దున్నమటేల వెళ్లి పోవచ్చు” అన్నాడు బెన్నీసు. గోబేరు కూడా “మా ఇల్లూ అక్కడే, రండి సారు తెల్లారగానే దాటించేస్తాను” అనడంతో సరేనంటూ వాళ్ళతో బయలుదేరాడు విశ్వం.

వర్షం వల్ల కరెంటు తీసేయడంతో ఊరంతా చీకటిగా ఉంది. కిరోసిన్ దీపాలు పెట్టుకున్నారందరూ. కొబ్బరితోటల మధ్య పోసిన సన్నటి సిమెంట్ రోడ్‌కి అటూ ఇటూ వున్నాయి ఇళ్లు.

గోబేరు తన ఇంటివద్ద ఆగిపోయాడు. బెన్నీసు ఇంటికి చేరగానే వీధి అరుగుమీద మంచం వాల్చి లోపలి వెళ్లి దుప్పటి, తువ్వాలూ తెచ్చి తువ్వాలు చేతికిచ్చి “తడిసిపోయారు, తుడుసుకోండి సారు!” అన్నాడు. మంచం మీద దుప్పటి పరిచి లోపలి వెళ్ళాడు. విశ్వం తల, ఒళ్ళు శుభ్రంగా తుడుచుకున్నాడు. మంచంమీద కూర్చుని దీపం వెలుతురులో కురుస్తున్న వర్షాన్ని చూస్తున్నాడు. కాసేపటికి ఓ కంచంలో అన్నం పెట్టుకొచ్చి “తినండి సారు” చేతికి ఇచ్చాడు. వీరవేణి కూడా వెనుకనే వచ్చి నిలుచుంది. “ఏవనుకోకండి సారు పచ్చడి మెతుకులు పెడతన్నామని” అంది నొచ్చుకుంటూ. వేడి వేడి అన్నం ఎదో ఊరగాయ ఉన్నాయందులో. “అయ్యో అన్నం పెడుతున్నారు అదే సంతోషవమ్మా” అని ఆకలి బాగా వేస్తుండడంతో తినడానికి ఉపక్రమించాడు. శుభ్రంగా తిన్నాక చెయ్యి కడుక్కుని మంచం మీద నడుం వాల్చి ఫోన్‌లో న్యూస్ చూడసాగాడు. “భద్రాచలం వద్ద పెరిగిన వరద ఉదృతి” అని వార్తలు వస్తున్నాయి. అలసిపోయి ఉండటంవల్ల వెంటనే నిద్రపట్టేసింది విశ్వానికి.

ఏదో కలకలం వినిపించేసరికి ఒక్కసారిగా మెలుకువ వచ్చింది. పూర్తిగా తెల్లవారలేదు. ఎటుచూసినా నీరు. వరద నీళ్లు. ఇళ్ల మెట్లవరకూ వచ్చేసాయి. రోడ్లమీద మోకాలి లోతు నీళ్లలో హడావిడిగా అటూ ఇటూ తిరుగుతున్నారు జనం. ఇంతలో బయటనుంచి నీళ్ళలో నడుచుకుంటూ వచ్చాడు బెన్నీసు. “వరద ఇంకా పెరిగిపోతుందంట సారు. లంకలో ఊళ్లన్నీ కాళీ చేసి అవతలొడ్డుకి వచ్చేయమన్నారంట గవర్నమెంటోళ్లు” చెప్పాడు. విశ్వం లేచి “సరే బయలుదేరుదాం పదండి” అన్నాడు ప్యాంటు మోకాళ్ళ పైకి మడత పెట్టుకుంటూ. బెన్నీసు పిల్లవాణ్ణి ఎత్తుకుని వీరవేణి చేయిపట్టుకుని నీళ్లలో ముందు నడుస్తుండగా వెనుకనే నడవసాగాడు. కొంతమంది పశువుల్ని ఎత్తైన ప్రదేశాలు చూసి వదులుతున్నారు. కొందరు కొబ్బరికాయల్ని మేడలమీదికి చేరుస్తున్నారు. కాస్త దూరం వెళ్ళాక ఒక చోట పడవల్లోకి జనాన్ని ఎక్కిస్తూ ఉన్నారు. “సార్! ఇటు రండి” పిలుపు విని చూస్తే గోబేరు తన పడవలోకి జనాన్ని ఎక్కించుకుంటూ కనబడ్డాడు. అటువైపు దారితీసాడు బెన్నీసు. ముసలివాళ్లూ, పిల్లలతో నిండిపోయివుంది పడవ. కొంచెం జాగా చూసుకుని తాము కూడా ఎక్కేసారు బెన్నిసూ, భార్యా, పిల్లవాడూ, విశ్వం.

పడవ ఇంజను స్టార్ట్ చేసి నదికి బాగా ఎగువకు పోనిచ్చి, నదివైపుకు మళ్ళించాడు గోబేరు. నది మధ్యకు చేరుకునేసరికి వడికి వేగంగా దిగువకు వెళ్ళసాగింది పడవ. వంతెన కోసం వేసిన స్తంభాలు దగ్గరకు వచ్చేసరికి హఠాత్తుగా ఒక స్తంభానికి ఢీకొట్టింది పడవ. దాంతో ఒక్కసారిగా ఒరిగిపోయింది పడవ. దాంతో కొంతమంది నీళ్లలో పడ్డారు. హాహాకారాలు మొదలయ్యాయి. ప్రమాదం గ్రహించిన బెన్నీసు “గోబేరూ! తాడు ఇసురు” అని కేక పెడుతూ నీళ్లలో దూకేసాడు. గోబేరు గబుక్కున పడవలోని తాడు తీసుకుని విసిరాడు. దాన్ని అందిపుచ్చుకుని ఏటికి ఎదురీదుతూ స్తంభంపైకి చేరుకొని దానికి కట్టేసాడు. పడవ నిలబడింది. నీటిలో పడవ అంచును పట్టుకుని వేలాడుతున్న కొంతమంది పిల్లలు కేకలు వేస్తున్నారు. అదిచూసి బెన్నీసు మళ్ళీ నీళ్ళలోకి దూకాడు. వాళ్ళను పట్టుకుని ఈదుతూ స్తంభం పైకి చేర్చాడు. పడవ క్రింద ఇంకా ఎవరైనా ఉన్నారేమో చూద్దామని మళ్ళీ నీళ్ళలోకి వెళ్ళాడు. హఠాత్తుగా ఒక పెద్ద సుడిగుండం వచ్చి దానిలో చిక్కుకుని నీటిలో మునిగాడు. ఎంతకూ పైకి రాకపోవడంతో “బెన్నిసూ!.. బెన్నిసూ…!” అంటూ రోదనలు మొదలయ్యాయి. వీరవేణీ ఒక్కపెట్టున రోదిస్తోంది. “నాన్నా! నాన్నా!” ఏడుస్తున్నాడు పిల్లవాడు. ప్రయాణికులతో కూడా తమ తోటివాళ్లు కొంతమంది కనబడకపోయేసరికి అంతా రోదనలు మిన్నంటాయి. ఇంతలో మరో ఒడ్డునుంచి పడవ వచ్చిమిగిలిన వాళ్లందరినీ ఒడ్డుకు చేర్చింది.

అప్పటికే ఈ వార్త తెలిసి ఒడ్డున చాలామంది జనం చేరారు. కాసేపటికి ప్రభుత్వాధికారులూ, ప్రజాప్రతినిధులూ చేరుకున్నారక్కడికి. గాలింపు చర్యలు మొదలుపెట్టారు. సాయంకాలానికి దిగువున విగతజీవులై దొరికారు పదకొండు మంది. వారిలో బెన్నీసు కూడా ఉండడం కలచివేసింది విశ్వాన్ని.

వంతెన అనుకున్నట్లుగా పూర్తయితే ఇన్ని ప్రాణాలు నిలిచిఉండేవి. వ్యవస్థలోని ఈ అవినీతి, అలసత్వం ఇంకా ఎన్ని ప్రాణాలను బలిగొంటుందో అనుకున్నాడు ఆవేదనగా. బిన్నీసు మృతదేహంపై పడి ఏడుస్తున్న దృశ్యాన్ని అంత్యంత నాణ్యతతో కూడిన ప్రసారం అందరికంటే ముందుగా అందించడానికి పోటీ పడుతున్నాయి మాధ్యమాలు. తనలో చేరిన కాలుష్య కాసారాన్ని ప్రక్షాళన చేయడానికి ఉగ్రరూపమెత్తి సుడులు తిరుగుతూ, నురగలు కక్కుతూ కలకనీటి గోదావరి.

Exit mobile version