కాలక్షేపం

0
2

[dropcap]మ[/dropcap]నుషుల్ని కదిపితే మాటలు పుడతాయి. మానవత్వం మేలుకుంటుంది. ప్రక్కనున్న వారిని పట్టించుకోకపోతే ప్రపంచమే లేదు. మాటలు కలిస్తే మనసు హాయిగా ఉంటుంది.

నేను ఒక రైల్వే స్టేషన్‌లో బుకింగ్ కౌంటర్ కాకుండా ప్రక్కనే ఉన్న ఒక కంప్యూటర్ యూనిట్‌తో టికెట్లు ఇచ్చేవాని వద్దకు వెళ్ళి నేను వెళ్ళవలసిన ఊరు పేరు చెప్పి ఒక టిక్కెట్టు తీసుకున్నాను.

నేను ఎక్కవలసిన ట్రైన్ రావడానికి ఇంకో పావుగంట సమయం ఉందని ఫేను గాలిలో కొంత సేపు ఉండాలని చెమట ఆరుతుందని నిల్చున్నాను.

టిక్కెట్లు ఇచ్చే ఆయన నిలుచునే ఉన్నాడు.

ఆయనతో మాట కలపాలని, “ఎంత సేపూ అలా నిల్చునే ఉంటారా? కాళ్ళు నొప్పులు పుట్టవా, కూర్చోరా?” అని అడిగాను.

అతను “కూర్చుంటే నాకు నిద్ర పట్టేస్తుందండీ, డిమ్ అయిపోతాను. ఇదిగోండి కుర్చీ ఉంది” అని ఆ మిషన్ మీదనే బోర్చించి ఉంచిన ప్లాస్టిక్ కుర్చీ చూపించి, ఇంకా ఇలా చెప్పాడు – “నేను ఎక్కువగా నిల్చునే ఉంటాను. ఇంట్లోనైనా కూర్చోవడం తక్కువ. అసలు సినిమాలకు వెళ్ళను. ఎందుకంతే అక్కడ కూర్చుంటే నిద్ర వచ్చేస్తుందని. ట్రైన్‌లో వెళ్ళినా, సీట్ ఖాళీగా ఉన్నా కూర్చోను. ఒకసారి ఇలాగే విజయనగరంలో దిగవలసినవాడిని విశాఖపట్నంలో దిగాను, నిద్దర పట్టేయడం వలన” అని చెప్పాడు.

నాకు నవ్వు ఆగలేదు. “భలే మంచివారే మీరు” అన్నాను.

ఈలోగా నేను ఎక్కవలసిన ట్రైను స్టేషన్‌లోకి వచ్చేసింది. నేను గాబరాగా బేగు తీసుకుని పరుగు లంఘించాను. ఆ స్టేషన్‌లో బండి ఎక్కువ సేపు ఆగదు. ఓవర్ బ్రిడ్జి పైకి వెళ్ళాలంటే సమయం చాలదు. అదృష్టం బాగుండి రెండు ప్లాట్‌ఫారాల మధ్య పట్టాలు ఖాళీగా ఉండడం వలన వాటి మీద నుంచి వెళ్ళి కష్టంతో ప్లాట్‌ఫారం పైకి వెళ్ళి ట్రైన్ అందుకోగలిగాను.

నా గాబరా చూసి అతను నవ్వుకుని ఉంటాడు. ఎందుకీ అధిక ప్రసంగం అనుకున్నాడో ఏమో.

ఏమైతేనేం, నాకు ట్రైనులో సీట్ దొరికింది. కూర్చుని ‘హమ్మయ్య’ (అమ్మా, అయ్య) అని ఇద్దరిని తలచుకున్నాను. కళ్ళు మూసుకున్నాను.

మా ఊరు చేరటానికి ఇంకో గంట పడుతుంది. నాకు నిద్దర పట్టేయదు కదా ఆ మిత్రుడిలా….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here