కలల వ్యాకరణం తెలిసిన కవి

1
2

(శ్రీ ముకుంద రామారావు జనవరి 7న అజోవిభో కందాళం వారి ప్రతిభామూర్తి జీవితకాల సాధన పురస్కారం అందుకుంటున్న సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు డా. సుంకర గోపాల్.)

మీరెందుకు కవిత్వం రాస్తున్నారని నాలుగు వాక్యాలు రాసిన ఏ కవిని అడిగినా ఆ కవి చెప్పినట్టు మరో కవి జవాబు ఇవ్వలేడు. ఎవరి ఆలోచన వారిదే. కొందరు కవిత్వం మనిషిని మెత్తగా చేస్తుందంటారు. మరికొందరు మనిషిని సౌందర్యీకరిస్తుంది అంటారు. కవిత్వం దిక్కారస్వరం అంటారు కొందరు. కవిత్వం ఆయుధం అంటారు. కవిత్వం ఆసరా అంటారు, భరోసాగా నిలుస్తుందంటారు. కవికి సిలబస్ ఉండదు. కానీ పంజరంలో ఉంచలేరు. అతను పంజరంలో ఉన్నా, భావాలు స్వేచ్ఛగా విహరిస్తాయి.

ఏ కవికైనా ఒక నేపథ్యం ఉంటుంది. పునాది ఉంటుంది. పుట్టుక ఉంటుంది. అక్కడనుంచి కవి మాట్లాడతాడు. వాక్యానికి చిరునామా ఇస్తాడు. అయితే వీటన్నిటినీ కవి, తన కవిత ద్వారా మనలోకి పంపగలగాలి. తన వాక్యం ద్వారా తన నేపథ్యాన్ని మనకు ఇవ్వగలగాలి. అప్పుడే కవిత రూపంలో సార్వజనీనత పొందగలదు.

ముకుంద రామారావు తెలుగు కవిత్వంలో చాలా ఏళ్లుగా కనిపిస్తున్న, వినిపిస్తున్న పేరు. జీవితమంతా విస్తారమైన కవిత్వం రాసిన కవి. ముకుంద రామారావు గారి కవిత యాత్ర దీర్ఘకాలికమైంది. తన లోపలి దీపాన్ని ఆరిపోనివ్వని కవి. లోపలి వెలుగును బయటకు పంపి వెలుగును పంచుతున్న కవి.

కవితకి భాష, భావం, నిజం, నిజాయితీ, అందం, ఆనందం ఉండాలన్నది ఆయన మార్గం. కవిత్వం వెలుగులాగా వెన్నెలలాగా చీకటిలాగా, అప్రయత్నంగా ఏమీ తెలియని అగమ్యంగా ఉండాలంటారు. భాషకి, భావానికి మధ్య ఆలోచనకి, అనుభూతికి మధ్య తర్కానికి, మీమాంసకు మధ్య వేలాడేది కవిత్వం అని నమ్ముతున్నారు. చెప్పలేనిది, చెప్పగలిగి హృదయానికి చేరుకోవడం కవిత్వం అని నిర్ధారిస్తారు.

“నా కవితల్లో
ఏది మంచిదని మిత్రులు అడుగుతారు
ఏదని చెప్పను
ఏది చెప్పినా తతిమావి కావా అని
నాకు నేను గానే సందేహిస్తాను
బహుశా రాబోయేదే మంచి కవిత అని
నాకు నేనుగానే సర్ది చెప్పుకుంటాను” (కవిత 2014, పుట-76)

ఇంత స్పష్టంగా కవి సాధారణీకరిస్తున్నాడు. ఇలాంటి కవికి స్పష్టత ఉంది, కనుకనే ఆయన కవిత్వం పరిశుభ్రంగా ఉంటుంది. మనల్ని తేటపరుస్తుంది. ఏ కవితా సంపూర్ణమైంది కాదు. ప్రతి కవితకు దానిదైన శక్తి ఉంటుంది. ఆ సందర్భాన్ని బట్టో, ప్రాసంగీకతను బట్టో ప్రాధాన్యత ఉంటుంది.

తాత్వికత కలిగిన కవిత మాత్రం ఏ కాలంలోనైనా మనగలుగుతుంది. ఈ కవిత్వం ప్రకృతి, తాత్వికత సమ్మేళనంగా సాగినట్లు చాలా రుజువులు ఉన్నాయి. ఆకాశం, మేఘాలు, సముద్రం, నది, వెలుగు, చీకటి, నీడ, చెట్టు, వర్షం, కాలం ఇవి అందరికీ సులభంగా అనుభవంలోకి వస్తాయి. రామాయణం నుండి రామారావు వరకు వీటిని కవులు చూసిన తీరు, చూపిన తీరు మనం గమనించవచ్చు. ఈ కవి సముద్రాన్ని ఒక చోట ఇలా నిర్వచించాడు.

నదుల్ని తాగుతూ
ఆకాశం గోడల్ని తాగుతూ
జనన మరణాల ఆలోచనల్లేని
లోతూ ఆధారం ఏమీ తెలియని
దళసరి నీటి అద్దం సముద్రం (కవిత 2016, పుట-1267)

సముద్రాన్ని కోశాగారమంటాడు. సముద్రం అలల దీర్ఘ శ్వాససతో తెలియని భాషలో సంగీతమై ఉరకలు వేస్తూ నృత్యం చేస్తుందంటాడు. అలలకు అనుచరులు ఉన్నారంటారు. సముద్రం చుట్టూ, లోపల, బయట కవి చేస్తున్న ఊహలు మన లోపలికి వెళ్తాయి. భలే ఉన్నాయి అనిపిస్తాయి. కవిత చదువుతున్నంతసేపు సముద్రం మన చుట్టూ తిరుగుతున్నట్టే ఉంటుంది. సముద్రం మధ్యలో కల్లోలాలను కలగంటూ, ఊగుతూ, తూలుతూ తాగుబోతుల్లా ఓడలు ఊగుతున్నాయి అనడం మామూలు వాక్యం కాదు.

“నీటిని చేప అర్థం చేసుకున్నట్లు
రుచి చూస్తేనే ఉప్పు తెలిసినట్లు
సవాలుగా సముద్రాలు
సముద్రాంతర నిశ్శబ్దాలు
సకల జీవ ప్రపంచాలు” (సముద్రాకర్షణ, కవిత 2016)

రామారావు కవిత్వంలో అసహజ వాక్యాలు కనిపించవు. నినాదాలు వినిపించవు. భావుకత పుష్కలంగా దొరుకుతుంది. తేలికగా ఉంటూనే గాఢత కలిగి ఉంటుంది. ఆర్ద్రత నిండి ఉంటుంది. జీవితాన్ని, ప్రకృతిని తానెలా చూస్తున్నాడో అలానే పఠితకి కూడా పరిచయం చేయగలిగిన శక్తి ఉంది. ఆయన కవితల్లో మేఘాల ప్రస్తావన కనిపిస్తూ ఉంటుంది. కానీ ఒకచోట చెప్పినట్టు మరోచోట చెప్పరు. సూర్యుడికి అడ్డుగా నిలవగలిగిన అహంకారం మేఘాలకు ఉందేమో అని సందేహిస్తారు. మేఘాల ప్రయాణం సమావేశానికి చేరుతున్న లేదా చేరుస్తున్న జనంలా ఉంది అని అంటారు. ఏదో కారణాలతో సమావేశం రద్దయినట్టు చెల్లాచెదురుగా మేఘాలు, ఉన్నట్టుండి బోరున ఏడుస్తూ కన్నీళ్లు వరదలై పారే మేఘాలు, రొమ్ము విరుచుకుపోయే మేఘాలు, విశ్రాంతి కరువైన నిరాశ్రయ మేఘాలు ఎక్కడో, ఎప్పుడో అలసిపోయి కన్నీళ్లు కార్చే మేఘాలు ఇలా మేఘాల్ని అనేకచోట్ల కవిత్వీకరిస్తారు. వర్షాభినయం అనే కవితలో

తమను తామే కోల్పోయేలాగా
అన్నింటినీ తాకాలని హత్తుకోవాలని
ఎందులో ఏముందో తెలుసుకోవాలని
దాచుకోలేని స్వాగతం
అణచుకోలేని ఆరాటం
ఎడతెగని ఏకాంత మూకాభినయం
ఎవరు అభినయించగలరు ఈ వర్షాన్ని (కవిత-2022, పుట-21)

అట్లా ఆయన అన్ని కవితల్ని పరిశీలించుకుంటూ వెళుతున్నప్పుడు, తెలిసి కవిత్వచింతన చేస్తున్న కవిగా ముకుంద రామారావు గారు కనిపిస్తారు. జీవన తాత్విక సారాంశాన్ని చాలా సులభంగా పాఠకుల్లోకి ప్రవేశపెట్టగలరు. ప్రకృతి మనకు అనేక రూపాల ద్వారా ప్రత్యక్ష ప్రసారం అవుతూ ఉంటుంది. ఇది నిరంతర ప్రక్రియ.

కవి బాగా పరిశీలిస్తే అక్కడినుండే తన కవితల్లోకి పదాలు తెచ్చుకోవచ్చు. ఊహల్ని లాక్కు రావచ్చు. దృశ్యాల్ని పట్టుకోవచ్చు. ప్రతీకలు, సంకేతాలు పొందవచ్చు. ఈ కవి ఇలాంటి పనిని చాలా శక్తివంతంగా చేశారు. ప్రకృతిని ఎప్పటికప్పుడు కొత్తగా చూస్తే తప్ప, కొత్త ఊహలు రావు. ఊహలు బాగున్నప్పుడు వ్యక్తికరణ కూడా బాగుంటుంది. అభివ్యక్తి అప్రయత్నంగా వస్తుంది. సాధారణ వ్యక్తీకరణను దాటి, మన అనుభవాలను కళాత్మకంగా వ్యక్తీకరించినప్పుడు కవిత్వం సాంద్రంగా ఉంటుంది. ఆ ఆవిష్కరణ పాఠకుడ్ని ఆకట్టుకుంటుంది. ప్రత్యేకమైన ఆలోచన ద్వారా మిగిలిన కవులు కంటే మనల్ని విభిన్నమైన కవిగా నిలబెడుతుంది.

ముకుంద రామారావు గారు ప్రకృతిని ఆసరాగా చేసుకుని నేనుకి ఒక సరికొత్త నిర్వచనాన్ని ఇచ్చారు. ఈ నిర్వచనానికి ఆకరాలుగా ప్రకృతిని చేసుకున్న విధానం చూడండి.

“తీరాలు సముద్రాలు దాటొచ్చిన రక్తాన్ని
ప్రాంతాలు నదులు దాటిన శరీరాన్ని
రంగు మార్చని పువ్వుని
భాషరాని పాటని
పక్షుల ఆకాశ భాషని
నవ్వుతూ ఏడుస్తూ సాగిపోతున్న మేఘాన్ని
చేతులు చాచి ఆహ్వానిస్తున్న ఆకాశాన్ని
నచ్చిన సుగంధాన్ని పంచుతున్న గాలిని
కాంతిలో కళ్ళు నింపుకుంటున్న దీపాన్ని
మార్గదర్శకుల నీడని
ఆకుల కన్నీరు కారుస్తున్న చెట్టుని
రాస్తూ చెరిపేస్తున్న వర్షాన్ని
సముద్రం తల్లీ తండ్రికి చేరువవుతున్న నదిని”

బలవంతమైన కవిత తనకు తానే వ్యాఖ్యానం చేసుకుంటుంది. ఈ కవితకు వ్యాఖ్యానాన్ని ఎలా కావాలంటే అలా పాఠకులు చేసుకోవచ్చు.

ఒక దృశ్యాన్నో, ఊహానో కవిత్వం చేయగలిగిన సృజనశీలికి, ఇంద్రధనస్సు ఆకాశం మెడలో వేసిన కండువా అవుతుంది. పచ్చదనం కోల్పోయి రాలుతున్న ఆకులు, వాడిన పూలు పదవి విరమణ చేసినట్లు అనిపిస్తుంది. వెళ్లిన వారంతా సముద్రంతో ఏమి మొరపెట్టుకుంటున్నారో ఒళ్లంతా ఊపుకుంటూ నీటి పదాలతో సముద్రం మాట్లాడడం వినిపిస్తుంది. ఎప్పటికప్పుడు కాళ్ళను కెలుకుతూ తనలోకి రమ్మని పిలిచే భూమి, విన్నవారితో ఏమేమి మాట్లాడుతుందో అక్షరీకరించగలుగుతుంది. దేన్నో అందుకోవాలని అనాదిగా అలా వంగిపోయిన ఆకాశాన్ని, చూడ్డానికి పుస్తకాన్ని దగ్గరకు లాక్కున్నట్టు లాక్కోవాలని అనిపించేలా రాయిస్తుంది. ఇట్లాంటి సృజన ఈ కవిత్వంలో మనల్ని కదిలిస్తుంది.

పాఠకున్ని దగ్గర చేసుకునే తనం ఈ కవిత్వానికి ఉంది. కవిలో వైవిధ్యం ఉన్నప్పుడు మాత్రమే పాఠకుడు కవి వెంట నడుస్తాడు. కవికి కలిగిన దర్శనం పాఠకుడికి కలగాలి. కవి వస్తువుకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తే సరిపోదు. కవిత్వంతోపాటు భాష, నిర్మాణం కూడా ఒళ్ళు కాదు, హృదయం దగ్గర పెట్టుకుని చేయాలి. మూస ధోరణి బద్దలు చేయాలి. మనలోని అంతరాంతర అనుభూతుల వ్యక్తీకరణకి కవిత్వాన్ని వాహకంగా చేసుకోవాలి. అభిప్రాయ ప్రకటన ఎప్పుడూ కవిత్వం కాదు. ప్రపంచ సాహిత్యాన్ని విరివిగా చదువుకున్న రామారావు గారికి ఇవన్నీ తెలుసు. చాలా సామాన్య వాక్యాలని, ఆయన కవిత్వం చేయగలిగారు. సముద్రంలో జాలర్ల వేట నేపథ్యంలో ఆయన రాసిన వేట అనే కవితని నడిపిన తీరు, ముగింపు వాక్యం మనల్ని వెంటాడుతుంది.

“ఏ చేపలు ఏ వలలో
పడుతున్నాయో
ఎంత తెలివి మీరుతున్నాయో
తీరం చేరేవరకు తెలీదు
ఒడ్డుకు చేరి చేరడంతోనే
చేపల అంకెల జూదం
ఎవరికి ఎలా తెల్లారినా
గిలగలా కొట్టుకుంటున్న చేపలు” (కవిత 2004, పుట-85)

ఈ విధంగా అనేక కవితల్లో ఆయన దర్శించిన తీరు భిన్నంగా ఉండటాన్ని గమనించవచ్చు. ఈ కవి అనువాద రహస్యం తెలిసినవాడు. కలల వ్యాకరణాన్ని రచిస్తున్నవాడు. ధైనందిన జీవితానుభవాల్ని తాత్వికతను అనుభూతుల్ని అనేక కవితల్లో ఆయన ఆవిష్కరించారు. ఆటలో అనే కవితలలో ఆయన పిల్లల్ని నేను ఆడిస్తున్నానా, నాకు నేను గానే ఆడుతున్నానా, ఆడబడుతున్నానా అంటూ అమాయకంగా అడిగిన ప్రశ్న చాలా లోతుగా ఆలోచింపజేస్తుంది. పిల్లలు ఆయన్ను వాళ్ళ ప్రపంచంలోకెలా తీసుకెళ్ళారో, వాళ్లు, బొమ్మలు, కవి అంత ఒక్కటే ఎలా అయిపోయారో సాదా సీదా వాక్యాలు లాగా అనిపించినా మనల్ని వెంటాడుతుంది. ‘తాతయ్య కళ్లద్దాలు’ కూడా అలాంటి కవితే. మానవ విలువల్ని అనుభూతుల్ని కాపాడుకోవాలనే తపన ఆయన కవిత్వంలో కనిపిస్తుంది. వైయుక్తి అంశాన్ని, సార్వజనీనం చేయడం కూడా ఆయన కవిత్వంలో ఒక భాగం. వెలుగొచ్చేలోగా విశ్రాంతీ, చీకటే అంటారు, ఓ చోట. 12 లైన్లలో రాసిన ‘పీడకల’ కవిత తాత్వికతకు పరాకాష్ట. చివరిగా ఆయనలోని భావుకతకి ఒక ఉదాహరణ. ‘మననం’ అనే కవితలో

“రాత్రి నది చీకటి అవుతుంది
అలలు బహుశా నిద్రపోతాయి
అలవాటుగా నేను ఒక్కొక్క వాక్యాన్ని నీటిలోకి విసురుతాను
నిద్రలోని చేప పిల్లలు ఉలిక్కి పడతాయి
వెలుగొచ్చాక
విసిరేసిన వాక్యాల్నే వెతుక్కుంటూ
నేను
అలలు” (కవిత -2005, పుట-55)

ముకుంద రామారావు గారు తనదైన మార్గాన్ని ఎంచుకున్న కవి. వస్తువును స్వీకరించడంలోనూ దాన్ని కవిత్వం చేయడంలోను స్పష్టంగా ఉన్నారు. స్వతంత్రంగా ఉన్నారు. దురదృష్టవశాత్తు ఆయన్ని మనం అనువాదానికి మాత్రమే పరిమితం చేశాము. ఈ కవి సంఘటనాత్మక కవి కాదు. జీవితాన్ని సాక్షత్కారం చేసుకున్న కవి. ఈ పురస్కార వేళ ఆయనకు శుభాకాంక్షలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here