Site icon Sanchika

కలలో అశరీర ఆమె

[dropcap]గ[/dropcap]మనం మొదలయ్యిందెక్కడో
గుర్తుకు రావటం లేదు

నడక ఏ గమ్యానికో
పాలుపోవటం లేదు

మజిలీ ఒక్కటే
జ్ఞాపకమున్నట్లనిపిస్తున్నది

పొద్దు గుంకడానికి
కావలసినన్ని ఘడియల
సమయమున్నట్లున్నది

విరామమెరుగని పరుగు
కూసింత సేద తీరాలనుకున్నదేమో
సూరీడు
మబ్బుల ముసుగేసుకున్నడు

పరుగు విశ్రమించలేదు కాబోలు
పురివిప్పిన రంగుల్లో తానమాడి
ఆకాశానికి ఎదురెక్కుతున్న మబ్బులు
వినీల రంగస్థలం మీద
ఆదీ అంతమూ లేని
శూన్యం ఒడిలో
ఒదిగిపోవడానికి ముందో

కాలం కౌగిలిలో
అంతర్ధానమైపోవడానికి ముందో
నాట్యమాడుతున్నట్లున్నవి

ఆపక్క చెట్లకొమ్మలనుంచి
ఈపక్క గుబురు పొదలనుంచి
సప్తస్వరాల వీచికలు

మరోవంక పిచ్చుకల కిచకిచలు
రాచిలుకల గుసగుసలు

భుజం తడిమిన ఎవరో
వెనుకనుంచి
పలకరించిన అలికిడి

ఆమెను పోల్చుకున్నాను
నన్నూ ఆమె పోల్చుకున్నట్టు

ఎడబాటైన బంధం
అక్కున చేరుతున్నదని
ఆత్రంగా చేయి చాచిన ఆశ
ఆశ నైరాశ్యమైన అవాక్కు

ఆపైన ఉలిక్కిపడ్డ విస్మయం!
ఆమె అశరీర!

భుజానికి వేలాడుతున్న
సగం అల్లిన
ఈతబరిగెల బుట్ట భారానికి
వొంగిన ఆమె నడుము చంద్రవంక

అల్లిక కాని బరిగెలు
మొనదేలిన అమ్ములవలె
కొత్త లోతుల్ని శోధించనున్నట్టు
ఓరగా ఆకాశం వేపు

తమ పుట్టుకల జాడల్ని
దేవులాడుకుంటున్నట్టు
ఆమె కుడిచేతి మరిన్ని బరిగెలు
భూతలంవేపు ఓరగానే

నా ఆత్మకు ప్రతిబింబమైన
ఆ ఘడియ మొదలుకొని ఆమె తన
హృదయాంతర పొరలపొరల నడుమ
పదిలంగా దాచుకుంటున్న
నా సృజన నిక్షేపాల
శిల్పాకృతుల ప్రతీకలే
ఆ భుజం మోస్తున్న అల్లికలనీ
ఆ అల్లికలు కానున్న బరిగెలనీ
మెలమెల్లగా పోల్చుకున్నాను

పచ్చిక పరకల మెత్తదనం మీద
ఒకరి పక్కన ఒకరం ఇప్పుడు
ఒదిగి కూర్చున్న మేము

కన్నులు ఒలికిన చెమ్మల సడిలో
పెదాలు తొణికిన మూగ గోసలో
చేజార్చుకున్న గతాల గురుతులు
చేజారిన అనుభూతుల నీడలు

అశరీర ఆమె నా చేయిని
అప్రమేయంగా తన చేతిలోనికి

రెప్పపాటులో
పుటలుపుటలుగా
తెరలుతెరలుగా
నా కవితావనిలో
విరబూసిన పరిమళాలై
రూపు మార్చుకున్న
కుడిచేతి బరిగెలు
అల్లిక కాని బరిగెలు

ఆమె నోట మౌనం వీడిన
తలపోతల నిట్టూర్పు ఊసులు

అవునూ! ఈ కవితలు గుర్తున్నాయా
నువ్వు రాసిన నావే
ఇదిగో ఇటు చూడు ఇవి
ఇంకా నువ్వు రాస్తున్న నావే

అవునూ! ఆమె నివాసమింకా
నా గమనం మొదలైన చోటనే కదా!
మరి ఇప్పుడిక్కడేమిటి!
ఈ మజిలీలో నా చెంతన!

ఓహో! అందుకేనేమో అదిగో
అశరీర ఆమె
నడిచి వొచ్చిన తన దారివెంట
కనుమరుగౌతున్నది

అశరీరాకృతిని వొదిలి
తన శరీరాకృతి వేపు
వెనుదిరుగుతున్నది

ఇప్పుడు ఈ మజిలీ ఎక్కడిదో
గుర్తుకు రావడం లేదు

గమనం మొదలయ్యిందెక్కడో
ఇప్పటికీ గుర్తుకు రావడం లేదు

గమ్యమొక్కటే
గుర్తుకు వొస్తున్నట్లున్నదిప్పుడు

ఆ రంగురంగుల మబ్బులవేపు
అనిపిస్తున్నది
ఆ ఆకాశ రంగస్థలంవేపు
అనిపిస్తున్నది
ఆ కుంగుతున్న పొద్దువేపు
అనిపిస్తున్నది

Exit mobile version