Site icon Sanchika

కాలం తెచ్చిన మార్పు

[box type=’note’ fontsize=’16’] గతాన్ని గుర్తుచేసుకుంటూ కాలానుగుణంగా సంక్రాంతి పండుగను జరుపుకునే తీరులో వచ్చిన మార్పులను ప్రస్తావిస్తున్నారు గూడూరు గోపాలకృష్ణమూర్తి ఈ రచనలో. 2020 సంక్రాంతి పండుగ ప్రత్యేకంగా పాఠకులకి అందిస్తున్నాం. [/box]

[dropcap]కా[/dropcap]లచక్రం గిర్రున తిరుగుతోంది. ఆ కాలచక్రాన్ని ఆపగలిగే శక్తి ఎవ్వరికీ లేదు. ఆ కాలం అలా దూసుకుపోతుంటే ప్రపంచీకరణ నేపథ్యంలో ఎన్ని మార్పులు? ఎన్ని చోద్యాలు? ఎన్ని వింతలు?

అసలే ఇది ఆధునిక యాంత్రిక యుగం. అంతేనా, కంప్యూటర్ యుగం కూడా. మనిషి అంతరిక్షంలోని రహస్యాన్ని తెలుసుకోవాలని తహతహలాడుతూ కృత్రిమ ఉపగ్రహాల ద్వారా ఇతర గ్రహాలపై అడుగులు వేయడానికి, అక్కడ వాతావరణం మనిషి నివాసానికి అనుకూలంగా ఉంటే అక్కడ నివాసం ఏర్పరుచుకోవడానికి ఉవ్విళ్ళూలూరుతున్న కాలం ఇది.

అందరూ కాలమహిమ, కాలం మారుతోంది అని అంటారు. కాలం మారడం అటుంచితే మానవుల మనస్తత్వంలో చాలా మార్పులు వస్తున్నాయి. అభిరుచులు మారుతున్నాయి. అలవాట్లు మారుతున్నాయి. విలువలకి ప్రాధాన్యత ఇచ్చే స్థితిలో లేడు మనిషి. అందుకే ఎన్నో అరాచకాలు, అత్యాచారాలు, దోపిడీలు, హత్యలు అని అనుకుంటాను నేను. ఓ నాటి సమాజాన్ని నేటి సమాజంతో బేరీజు వేసుకుంటున్న నేను.

నేడు సమాజంలో తెలుగు భాష అస్తిత్వం లాగే మనిషి మనస్తత్వం లాగే పండగలు పబ్బాల స్వరూపమే మారిపోతోంది. భాష విషయం తీసుకుంటే ఇప్పుడు మన మాతృభాష దుస్థితి చూస్తుంటే హృదయం బాధగా మూల్గుతుంది.

మా చిన్నప్పుడు ఎన్ని శతకాలు చదివించేవారు. సుమతి శతకం, వేమన శతకం, భాస్కర శతకం, కృష్ణ శతకం. ఇలా ఎన్నో శతకాలు బట్టీ పెట్టించేవారూ. తెలుగు సంవత్సరాల పేర్లు, తెలుగు నెలల పేర్లు, వారాల పేర్లు, నక్షత్రాల పేర్లు, రాశుల పేర్లు, అంతేకాదు, ఆంగ్ల నెలల పేర్లు అన్నీ చదివించేవారు. అంకెలు, ఎక్కాలు బట్టి పెట్టించేవారు. ప్చ్…! ఇప్పుడు మరి? ఈ కార్పొరేట్ స్కూల్లో ప్రాబల్యం పెరిగిన తరువాత పిల్లల విద్యా విధానమే మారిపోయింది.

చిన్నప్పుడు మేము వ్రాయడానికి ఉపయోగించే పలకా బలపం అంటే ఏంటో తెలియదు. తెలుగు సంవత్సరాల పేర్లు తెలియవు. నక్షత్రాల పేర్లు తెలియవు. వారాల పేర్లు, తెలుగు నెలల పేర్లు తెలియవు. ఇంగ్లీష్ నెలలు పేర్లు – జనవరి, ఫిబ్రవరి అంటూ తెలుసు. వారాల పేర్లు తెలుగులో చదవడం రాదు, ఇంగ్లీషులో మాత్రం సండే, మండే అంటూ చిలుక పలుకుల వల్లే వేస్తారు నేటి మన భావి పౌరులు. అంకెల్ని, ఎక్కాలని కూడా ఆంగ్లంలోనే వల్లె వేస్తారు.

ఇది వాళ్ళ తప్పు కాదు. పాశ్చాత్య నాగరికతని అనుకరించాలని తహతహలాడుతూ తల తాకట్టు పెట్టయినా ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో తమ పిల్లల్ని చదివిస్తున్న తల్లిదండ్రులది తప్పు. కార్పొరేట్ స్కూల్లో చదువుతున్న తమ పిల్లలు చిలుక పలుకుల రైమ్స్ వల్లె వేస్తుంటే మురిసిపోతున్నారు వారు. మమ్మీ డాడీ అని తమ పిల్లలు పిలుస్తూ ఉంటే పొంగిపోతున్నారు. అందుకే మన మాతృభాష తెలుగు కొన్నాళ్ళకు మృతభాషగా మారి పోతుందేమో అన్న భయం నాలో.

మాతృభాష పరిస్థితి అలా ఉంటే, మరి పండగలో? వాటి స్వరూపం కూడా పూర్తిగా మారిపోయింది. దసరా పండుగ సమయంలో పిల్లలందరూ దసరా పద్యాలు పాడుతూ బాణాలు పట్టుకుని పప్పు బెల్లాలు కోసం ఇంటింటికీ బారులు తీరి వెళ్తూ ఉంటే ఎంత ఆనందంగా, సంతోషంగా ఉండేది? ప్చ్…! ఇప్పుడు ఆ దసరా పద్యాలు లేవు. బాణాలు ఎలా ఉంటాయో తెలియని పరిస్థితి నేటి భావి పౌరులది. అంతేకాదు దసరా సమయంలో బొమ్మలు కొలువులు కనువిందు చేసేవి.

అన్ని పండుగలు వచ్చినట్టే సంక్రాంతి పండుగ వచ్చేది. ఒకానొక సమయంలో అంటే మా బాల్యంలో సంక్రాంతి పరుగును, నేడు సంక్రాంతి పండుగ జరుపుకునే విధానం, ఆ పండుగ తీరుతెన్నులు బేరీజు వేసుకుంటే నా గుండెల్లో సన్నని బాధ. సమాజం ఎంతగా మారిపోయింది అనుకుంటూ గాఢంగా నిట్టూర్పు విడిచాను.

ఒక్కసారి నా బాల్యం కళ్లెదుట నిలబడినది. జీవితంలో మరిచిపోదామనుకున్నా మరిచిపోలేం, అటువంటిది మధురమైన బాల్యం. ఆ రోజుల్లో రూపాయికి 16 అణాలు. అణాలు తెల్లటి ఉండేవి, పచ్చటివీ ఉండేవి. గుండ్రంగా కాకుండా కోణాలతో ఉండేవి. రూపాయికి పావలాలు నాలుగు. అర్ధ రూపాయలు రెండు. రెండు అణాలు బేడ. బేడ చతురస్ర ఆకారంలో ఉండేది. బేడలు కూడా తెల్లనివి, పచ్చవి ఉండేవి. ఆ తరువాత అర్ధణా. ఈ అర్ధణాలు కూడా చతురస్రాకారంలో ఉండేవి. అవి కూడా తెలుపు రంగులో ఉండేవి. ఆ తరువాత కాణులు. రూపాయికి 64 కాణులు. ఆ కాణులు కూడా చిన్నవి, పెద్దవి, మధ్యలో కన్నం ఉన్నవి ఉండేవి.

నాన్నగారు మా పిల్లలకి ఒక్కొక్కళ్ళకి వారానికి ఒక పర్యాయం కాణీ ఇచ్చేవారు. కాణీకి ఒక జొన్న కంకి వచ్చేది. జొన్న కంకి కొని నిప్పులో కాల్చి నెయ్యి ఉప్పు రాసుకొని మా పిల్లలు ఆనందంతో తినేవాళ్లం. అదే మాకు తృప్తినిచ్చేది. ఆధునిక కాలంలో తండ్రులు తమ పిల్లలకి వందలకు వందలు పాకెట్ మనీ ఇస్తుంటే పిల్లలకి ఇంకా సంతోషం లేదు. ఆనాడు మేము దానితోనే తృప్తి పడిపోయేవాళ్ళం. ఈనాటి తరం వాళ్ళకి అప్పటి నాణేలు తెలియనే తెలియదు.

అదంతా ఎందుకు, మా నాన్నగారి కాలంలో దమ్మిడీలుండేవట. అవి మాకు తెలియదు. మా కాలంలో నాణాలు మా పిల్లలకి తెలియదు. పాత నాణాల స్థానంలో కొత్త నాణాలు చలామణి అయ్యాయి. నయా పైసలు అని పేరు పెట్టారు. ఒక పైసా, రెండు పైసలు, పది పైసలు, ఇరవై పైసలు నాణాలు ఉండేవి. అవి కూడా వివిధ ఆకారాల్లో ఉండేవి. అయితే వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. ఆ ధరల ప్రకారం ఈ పైసలకి కూడా విలువ లేకుండా పోయింది. అందుకే పైసలు కనుమరుగయ్యాయి. ఒకానొక సమయంలో పైసలు ఇస్తే యాచకుడు సంతృప్తి చెందేవాడు. కాలం తెచ్చిన మార్పుల వల్ల పైసలకి కిట్టుబాటు అవడం లేదు. అందుకే పాత నాణాల లాగే కొత్తగా వచ్చిన నాణాలు కనుమరుగయ్యాయి.

ఇప్పుడు పైసా స్థానంలో రూపాయి వచ్చి చేరింది. చివరకు రూపాయి ఇస్తేనే యాచకుడు సంతృప్తిపడే పరిస్థితి వచ్చింది. ఇది అతని తప్పు కాదు. కాలంతో పాటు వస్తువుల ధరలు పెరిగిపోవడమే దీనికి కారణం. ఇప్పుడు రూపాయి బిళ్ళే అతి చిన్న నాణెం. రూపాయి, రెండు రూపాయలు, ఐదు రూపాయలు, పది రూపాయలు… ఇవీ ఇప్పటి నాణాలు. పండుగ తీరుతెన్నుల గూర్చి ఆలోచిస్తున్న నా అంతరంగం అప్పటి నాణాల గురించి కూడా ఆలోచిస్తున్నది.

ఇక నెలగంట పెట్టి ధనుర్మాసం ఆరంభమయినప్పటి నుండి మా పిల్లలకి ఎంతో ఆనందంగా ఉండేది. అప్పటి రోజులు, ఆ వాతావరణమే వేరు. మా ఇంటి వెనకాల కోవెల ఉండేది. ధనుర్మాస సమయంలో ఉదయం, సాయంత్రం బాజా భజంత్రీలు మ్రోగేవి. ఉదయం మా వీధిలో ఉన్న వాళ్ళు రోజుకి ఒకరు, ఇద్దరు దేవుడికి ప్రసాదాలు తయారు చేసి తెచ్చేవారు. ఎవ్వరు భోగం చేయించని రోజున కోవెల్లోనే ప్రసాదాలు తయారు చేయించేవారు.

ఆ నెల రోజులూ మా పిల్లలందరం చలిని కూడా లక్ష్యపెట్టకుండా ప్రసాదాల కోసం పరుగులు తీసేవాళ్ళమి. ఆ రోజుల్లో భక్తి కంటే మా పిల్లలకి ప్రసాదాల మీదే దృష్టి అంతా. కోవెల్లో ఉన్న బాదం చెట్టు ఆకులు కోసి ఆ ఆకుల్లో పులిహోరా, దద్ధోజనం, చక్కెరపొంగలి మొదలైన ప్రసాదాలు పెట్టించుకుని ఇంటికి వచ్చి తినేవాళ్ళమి. ఆ ధనుర్మాసం నెలరోజులూ ఉదయం మా పిల్లల దినచర్య ఇది.

అంతేనా? ఆ నెల రోజులూ తెల్లవారు జామున శకునపక్షిగాడు… అదే బుడబుక్కలవాడు “అమ్మ పలుకు జగదాంబ పలుకు… కంచి కామాక్షి పలుకు…” అంటూ గట్టిగా పలుకుతూ ఢమరూ మోగిస్తూ ఇంటింటికీ వచ్చేవాడు. పడుకున్న వాళ్ళని నిద్రలేపి డబ్బులు, బట్టలు దండుకునేవాడు. వాడికి ఏదో ఒకటి ఈయడం శుభంగా భావించేవారు అందరూ.

మరో ప్రక్క తెల్లవారు జామునే మేలుకొలుపుల వాళ్ళు మేలుకొలుపులు పాడుతూ వీధుల్లో తిరిగేవారు. ‘గుమ్మడేడే గాపితల్లి, గుమ్మడేడే కన్న తల్లి, అమ్మ గోపమ్మా’ అంటూ వాళ్ళు పాడేవారు. మరి పిల్లలదే సందడి. సంక్రాంతి పండుగకి ముందు భోగిమంటకి కర్రలు దండేవారు ఇంటింటికి వెళ్ళి.

“భోగీమంట పొయ్యిలో కర్ర, మీ పిల్లలు లేరా, మా భోగి మంటకి రారా! ఇచ్చినమ్మ పుణ్యం, ఇయ్యనమ్మ పాపం!” అంటూ ఇంటింటికి వెళ్ళి కర్రలు దండుకునేవారు. ఇంటిలో ముసలమ్మలో? వాళ్ళకీ పనే ఆ సమయంలో. ఆవుపేడ, గేదె పేడ తెచ్చి, పిల్లలు భోగి మంటల్లో వేయడానికి భోగి పిడకలు చిన్నచిన్నవి పెరటి గోడకి వేసి తయారు చేసేవారు. అవి ఎండిన వాడిని దండలుగా గుచ్చేవారు.

మరి పగటిపూటో? హరిదాదు “హరిల రంగ హరి” అంటూ తంబూరా మ్రోగిస్తూ, చిడతలు వాయిస్తూ గడపగడపకి వస్తే అతని పాదాలకి నమస్కరించి అతడ్ని భగవత్ స్వరూపుడుగా భావించి అందరూ భిక్షం వేసేవారు అతని భిక్షాపాత్రలో.

మరి గంగిరెద్దుల వాళ్ళూ ఇంటింటికి గంగిరెద్దుల్ని తీసుకువచ్చి బాకా ఊదుతూ సన్నాయి శబ్దాల మధ్య గంగిరెద్దుల చేత రకరకలా విన్యాసాలు చేయిస్తూ డబ్బులు, బట్టలు దండుకునేవారు. ఈ గంగిరెద్దుల విన్యాసం పిల్లలందరికీ గొప్ప వినోదంగా ఉండేది.

తెల్లవారు జామునే అమ్మ వాకిట్లో కళ్ళాపి జల్లి వివిధ రకాల ముగ్గులు వేసి గొబ్బెమల్ని ఆవుపేడతో తయారు చేసి పూలతో అలంకరించి ముగ్గు మధ్యలో ఉంచేది. వివిధ రకాల ముత్యాల్లాంటి ముగ్గులు మా వాకిట్లోనే కాకుండా ప్రతీవాళ్ళ ముంగిళ్ళలో కనువిందు చేసేవి. గొబ్బెమ్మల ముందు కన్నెపిల్లలు పాటలు పాడుతూ తిరిగేవారు.

మరి భోగి రోజునో? తెల్లవారు జామునే మంచును కూడా లెక్క చేయకుండా పిల్లలందరం భోగి మంటల దగ్గర కూర్చుని వెచ్చదనాన్ని అనుభవిస్తూ కేరింతలతో మా ఆనందాన్ని వ్యక్తం చేసేవాళ్ళమి.

ఈ సంక్రాంతి పండగకి పురాణంతో, ఆధ్యాత్మికతతో కూడా సంబంధం ఉంది. విష్ణుచిత్తుని కూతురు గోదాదేవి భగవంతుడైన రంగనాథస్వామిని పెండ్లాడగోరి నెలరోజులు కఠోర దీక్షతో భగవంతుని పూజించి అతడ్ని మెప్పించి అతడ్ని పెండ్లాడిందని. అందుకే సంక్రాంతి సమయంలో విష్ణుమూర్తి, గోదాదేవి కళ్యాణం కూడా జరిపిస్తారు.

సంక్రాంతి వచ్చిందంటే సందడే సందడి. ప్రతీవాళ్ళ గృహాలకి వెల్ల వేయించి గుమ్మాలకి, తలుపులకి రంగులు వేసి ఇంటి అలంకరణ చేసేవారు. ఇలా సంక్రాంతి లక్ష్మిని ఆహ్వానించేవారు. పల్లెటూళ్ళలో అయితే ఈ పండగ మరీ ఎక్కువ సందడిగా ఉండేది. కొత్తగా పెళ్ళయిన అల్లుళ్ళనే కాకుండా, అల్లుళ్ళని, కూతుళ్ళని పండుగ సమయంలో ఇంటి యజమాని ఆహ్వానించి మనుమలు, మనుమరాళ్ళు, కొడుకులు, కోడళ్ళు, అల్లుళ్ళు, కూతుళ్ళతో ప్రతీ ఇల్లూ కళకళలాడేది.

మరి రైతులో? తమ గ్రామాల్లో పండిన వివిధ రకాల పంటలను ఇంటికి తెచ్చుకుని బంధుమిత్రులతో వివిధ రకాల పిండి వంటలు చేసుకుని భుజించి ఆనందపడేవారు. ఇదీ ఒకనాటి సంక్రాంతి పండగ తీరు.

ప్చ్…! మరి ఇప్పుడో? ఆ పండుగ తీరుతెన్నులే మారిపోయాయి. నేటి యాంత్రిక యుగంలో ప్రాణంలేని యంత్రంలా ప్రాణమున్న మనిషి కాలానుగుణంగా మారిపోయాడు. ఇప్పుడు ఆ పండుగ వచ్చిందంటే ఆ సందడ్లే లేవు. సినిమాలకి వెళ్ళడం, పేకాటలో కూర్చోవడం లేకపోతే మద్యం దుకాణాల దగ్గర క్యూ కట్టడం! ఇదే నేటి యువత, పెద్దలు చేస్తున్న పని.

తిరిగి నా మనస్సు ఈ పండుగ మా బాల్యంలో ఎలాగ జరిగేదో బాల్యస్మృతులు గింగిర్లాడుతున్నాయి నా కళ్ళెదుట. సంక్రాంతి రోజున అమ్మ వండిన వంట, తయారు చేసిన బొబ్బట్లు, పులిహోర, బూరెలు, గారెలతో తృప్తిగా మా భోజనం ఉండేది.

భోగి సాయంత్రం చిన్న పిల్లలకి చీడ పోవాలని భోగిపళ్ళు… అదే రేగి పళ్ళు, చెరుకుముక్కలు, సెనగలు, చిల్లర డబ్బులు అన్నీ కలగలిపి దిష్టి తీసి, వాళ్ళ నెత్తి మీంచి క్రిందకి పడేటట్లు జారవిడిచేవారు. ఆ చిల్లర డబ్బులు ఏరుకోవడానికి మా పిల్లలందరం ఎగబడేవాళ్ళమి. ఎవరికి ఎక్కువ డబ్బులు వస్తాయో వాళ్ళు – ‘నాకు ఇన్ని ఎక్కువ డబ్బులు వచ్చాయి’ అని గర్వంగా చెప్పుకునేవాళ్ళమి.

మా చిన్ననాటి ఈ ముచ్చట ఇప్పుడు మా పిల్లలకి చెప్తే “ఛీ… ఛీ…! అలా దిష్టి తీసిన ఆ డబ్బులు ఏరుకుంటారా? మీకు సిగ్గు అనిపించలేదా?” అని వాళ్ళు అడుగుతుంటే… నిజమే ఆ దిష్టి తీసిన డబ్బులు ఏరుకోవడమేంటి? ఆ ఆలోచన మాకు రాలేదు. ఈ ఆధునిక యుగంలో హేతువాద దృష్టితో ఆలోచిస్తున్న మన పిల్లలు మనకన్నా తెలివైన వాళ్ళు. ఆ వయస్సులో మనకి తెలియని ఎన్నో విషయాలు నేటి పిల్లలకి తెలుసు అని అనుకున్నాను.

ఆ పండుగ నాలుగు రోజులు గాలిపడగల పోటీలు గ్రామాల్లోనే కాకుండా పట్టణంలోని మైదాన ప్రాంతంలో జరిగేవి. ఆకాశంలో వివిధ రకాల గాలిపడగలు విన్యాసాలు చేస్తూ అటూ ఇటూ పల్టీలు కొడ్తూ ఉంటే అది చూడ్డానికి మా మా పిల్లలందరికీ అదో అనుభూతి. దారం తెగకుండా మాంజా తయారు చేసేవారు. అది తయారు చేయడానికి గాజు ముక్కలు చితక్కొట్టి మైదా పిండితో తయారు చేసిన పేస్ట్‌లో ఈ గాజు ముక్కల గుండతో కలిపి దారానికి పూసేవారు. అలా చేస్తే దారం తెగదుట.

సంక్రాంతి రోజున సూర్యుడు మకరరాశిలో ప్రవేశిస్తాడు. ప్రతీ ఒక్కరూ పితృదేవతలకి తర్పణాలు వదిలిపెడతారు. అదే పెద్దల్ని కొలుస్తారు. బ్రాహ్మణులకి దానాలు ఇస్తారు. అయితే ఈ ఆధునిక యుగంలో ఈ తంతు మాత్రం జరుగుతున్నా మిగతా సంక్రాంతి వేడుకలు ఎండమావే.

ప్చ్…! ఇప్పుడు ఆ వేడుకలు ఉన్నాయా? లేవే. ఏవి ఉన్నా లేకపోయినా కోడిపందాలు, పొట్టేళ్ళ పందాలు, మద్యం సేవించడాలు, తాగి తందనాలాడ్డం, సినిమాలకి వెళ్ళడం మాత్రం ఉంది.

మరి కనుమ రోజున అమ్మ మమ్మల్ని లేపి, “ఈ రోజు స్నానం చేస్తూ… ‘కాకీ… కాకీ… నా రంగు నాకిచ్చేసి నీ నలుపు రంగు నువ్వు తీసుకో’ అని అనాలి” అని మా పిల్లల చేత తల స్నానం చేయించేది. ఆ సంఘటన ఇప్పుడు మా పిల్లలకి చెప్తే పగలబడి నవ్వుతూ, “ఎంత చాదస్తం మీ కాలంలో! తెల్లగా ఉన్నవాళ్ళు కాకిలా నల్లగా మారిపోరు. నల్లగా ఉన్నవారు తెల్లబడరు” అని హేళన చేస్తారు.

వాళ్ళు అన్నదీ నిజమే. ఈ ఆధునిక యుగంలో పిల్లలు హేతువాద దృష్టితో ప్రతి విషయాన్ని నిశితంగా పరిశీలిస్తారు అని అనుకుంటాను నేను.

కాలచక్రం త్వరితగతిన పరుగులు తీస్తోంది. ఆ కాలచక్ర ప్రభావం మానవ మనుగడ మీద కూడా పడుతోంది. మానవుని మనస్తత్వంలో మార్పు తెచ్చింది. పాత భావాలకి తిలోదకాలు ఇస్తూ కొత్త భావాలకి స్వాగతం పలుకుతున్నారు. అందుకే పండుగల స్వరూపాలే మారిపోతున్నాయి. గంగిరెద్దువాళ్ళ సందడులు నామమాత్రమే ఇప్పుడు. అలాగే హరిదాసుల సందడి నామమాత్రంగా ఉంది. మేలుకొలుపుల వాళ్ళ పాటలు లేవు, శకునిపక్షివాడి సందడి లేదు. గాలిపటాల సందడ్లూ నామమాత్రమే.

ప్రకృతి మారలేదు. మంచు కురిసే రాత్రుళ్ళు అలాగే ఉన్నాయి. చలిగాలులు, ఆ పుష్యమాసం వాతావరణం అలాగే ఉంది. అయితే మనిషి మనస్తత్వంలో మాత్రం మార్పు కొట్టొచ్చేటట్టు అగుపడుతోంది.

ఇక సంక్రాంతి రోజున పెద్దల పేరున పొత్తర్లు ఇయ్యడం, దానాలు చేయడం వీటినన్నింటినీ హేతువాదులు, యాంత్రిక యుగంలో మంచితనం మానవత్వం మరిచిన ఆధునిక మనుషులు ఏఁ ఆలోచిస్తారంటే – ఎన్నో అరాచకాలు చేస్తారు, పాపాలు చేస్తారు. తల్లిదండ్రుల్ని వీధిపాలు చేస్తారు. లేకపోతే వృద్ధాశ్రమాల్లో చేర్పిస్తారు బ్రతికి ఉన్నప్పుడు. అందరూ అలా చేయకపోయినా కొంతమందైనా అలా ప్రవర్తిస్తారు.

అలాంటి ఈ వారసులు ‘సంక్రాంతి రోజున పితృదేవతలకి ఇలా పొత్తర్లు ఈయడమేఁటి’ అని వాదిస్తారు.

నేను నాస్తికుడిని కాకపోయినా నేటి సమాజంలో వృద్ధులైన వారి పట్ల పిల్లల యడల కొంతమంది ప్రవర్తన చూస్తుంటే ఇలా అంటున్న హేతువాదుల ఆలోచన్లు, మాటలూ నిజమే అనిపిస్తుంది.

ఏఁ ఏదయితేనేఁ నేటి ఈ ఆధునిక ప్రపంచంలో పండుగల స్వరూపాలే మారిపోతున్నాయి అనుకుంటూ గాఢంగా నిట్టూర్చాను.

Exit mobile version