భారతీయ శాస్త్రాల్లో కాలమాన విజ్ఞానం

    0
    3

    [box type=’note’ fontsize=’16’] “ప్రాచీన కాలమాన విజ్ఞానం గురించి “భారతీయ శాస్త్రాల్లో కాలమాన విజ్ఞానం”  వ్యాసరూపంలో వివరిస్తున్నారు డా. ఎం.ప్రభావతీదేవి. [/box]

    [dropcap]భా[/dropcap]రతదేశంలో సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నవారు, గౌరవిస్తున్నవారు ఏ కొద్దిమందో మిగిలారు. వారివల్లనే మనకు మన ప్రాచీన ఋషులు అందించిన శాస్త్రాల్లోని విజ్ఞాన రహస్యాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆధునిక కాలంలో విదేశీభావజాలం  మాయలో కొట్టుకుపోతున్నవారెందరో ఉన్నారు. వారికి మన శాస్త్రాల్లోని జ్ఞానం అవసరం లేదు. దాని ఔన్నత్యం ఏమిటో తెలుసుకోకుండా దాని గురించి ఎగతాళిగా మాట్లాడతారు. ఎందుకంటే పాశ్చాత్యులు మన దేశానికి వర్తకం నిమిత్తం వచ్చి మన మీద దాడులు చేసి, మన దేశ సంపదను దోచుకొని, మనలను బానిసలుగా చేసి, మనలను పాలించి, వారి వేషభాషలను మనకు అలవాటు చేసి, మన సంస్కృతిని మనం మరచిపోయేట్టు చేసారు. మిడిమిడి జ్ఞానం గలవారు మన సంస్కృత భాష నేర్చుకొని మన శాస్త్రాలను చదివి, సరిగ్గా అర్థం చేసుకోకుండా, వక్రభాష్యాలు చేసి తమదైన తప్పుడు అభిప్రాయాలను ప్రచారం చేసి మన మనసులను, బుద్దులను కలుషితం చేసారు. మనం కూడా వారి అభిప్రాయాలే సరైనవని నమ్మి భ్రష్టు పట్టిపోయాం. మన శాస్త్రాల్లో విజ్ఞానం ఏదీ లేదని నమ్ముతున్నాం.

    కాలానికి కొలమానాలు

    ప్రాచీన భారతంలో వైదిక ఋషులే శాస్త్రజ్ఞులు. వారందంచిన విజ్ఞాన విషయాలెన్నో ఉన్నాయి. అవన్నీ మనకు అర్థం కాకుండా పోయాయి. ఇప్పుడిప్పుడే కొద్దికొద్దిగా ఆ విజ్ఞాన విషయాలను తెలుసుకోవడానికి కొందరు ఆసక్తి చూపుతున్నారు. కొందరు పండితులు వాటిని వెలుగులోకి తీసుకొస్తున్నారు. ప్రాచీన ఋషులు మనకందించిన ముఖ్యమైన విజ్ఞానం కాలమాన విజ్ఞానం. కాలం యొక్క గణన ఏవిధంగా గ్రహించారన్నది మన ఋషులకు తప్ప ఇంకే ఇతర దేశాల్లో వారికి తెలియదు.

    అనంతమైన బ్రహ్మంలా కాలం కూడా అనంతమే. అయితే ప్రపంచ సృష్టి విషయంలో కాలానికి కూడా ఆది, మధ్య, అంతం ఉంటాయని శాస్త్రాలు చెపుతున్నాయి. ఈ కాలం ఎప్పుడూ ఒకలాగ ఉండదు. మార్పులు చేర్పులతో చక్రంలాగా పరిభ్రమిస్తూ ఉంటుంది. అదే తిరిగే కాలచక్రం. ఈ కాలాన్ని కొలవడానికి మన భారతీయ శాస్త్రాల్లో ఎన్నో కొలమానాలు (కొలతలు) ఉన్నాయి. వాటన్నిటికీ పేర్లు ఉన్నాయి. కాలగణనలో అతిపెద్దది, అతిచిన్నది కూడా ఉన్నాయి. ఇక్కడ మనం చర్చించుకోవలసినది అతిపెద్దదైన ‘కల్పం’, అతిచిన్నదైన ‘లవ’ మన్న కాలాలను గురించి మాత్రమే. కాలంలో కల్పాన్ని అతిపెద్దదిగా తీసుకోవచ్చు. ఎందుకంటే బ్రహ్మ  సృష్టి మొదలై అంతమయ్యేవరకు పట్టే కాలాన్ని ‘కల్పం’ అంటారు. ఇది ఒక ఆవృతమన్నమాట. అంటే సృష్టి, స్థితి, లయలన్న కార్యాలన్నీ ఇందులోకే వస్తాయి. కల్పమన్న ఇంత పెద్ద కాలం ఉన్నప్పుడు అతిచిన్న కాలం కూడా ఉండాలి మరి. అందుకే ‘లవ’మన్న దాన్ని అత్యంత సూక్ష్మమైన కాలంగా చెప్తారు. దీన్నే ‘కాల పరమాణువు’ అని కూడా అంటారు. ఈ రెండింటి గురించి తెలుసుకుందాం.

    పురాణాల్లో ప్రపంచ సృష్టికర్త బ్రహ్మ

    పురాణాల ప్రకారం త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల్లో బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి నాభి నుండి పుట్టి ప్రపంచ సృష్టికర్తగా పేరుగాంచాడు. ఈయన స్వర్గాదిలోకాల్లో ఉన్న దేవతలందరి కంటే పెద్దవాడు. ఈ బ్రహ్మకు ఆయుర్దాయం ఉంది 100 సం||లని. అది ఆయనకు పూర్ణాయుర్దాయం. మానవ కాలమానానికి బ్రహ్మ కాలమానానికి చాలా తేడా ఉంది.

    మానవ కాలమానం

    మానవులకు పూర్ణాయుర్దాయం అంటే సుమారు 100 సం||లంటారు. మానవ లోకంలో ఒకరోజంటే 24 గం||ల కాలం. దాన్ని ఒక పగలు (ఉదయం 6 గం||ల నుండి సాయంత్రం 6 గం||ల వరకు), ఒక రాత్రి (సాయంత్రం 6 గం||ల నుండి మరునాటి ఉదయం 6 గం||ల వరకు) గా విభజించారు. మనకు రోజుకు 8 ఝాములు. ప్రతి 3 గం||లకు ఒక ఝాము చొప్పున లెక్కించారు. మనకు సంధ్యలు కూడా ఉన్నాయి. సాధారణంగా రోజుకు 3 సంధ్యలంటారు. కానీ అర్ధరాత్రిని కూడా కొందరు సంధ్యగా లెక్కిస్తారు. కనుక 4 సంధ్యలున్నాయి. కాలాన్ని భూత, వర్తమాన, భవిష్యత్తులుగా కూడా విభజించారు మనవారు.

    బ్రహ్మ కాలమానం

    బ్రహ్మకు కూడా ఒకరోజంటే ఒక పగలు, ఒక రాత్రి. పగటిపూట ఆయన సృష్టి చేస్తాడు. ఈ పగటిపూటనే ఆయన సృష్టంతా సాగుతుంది. దాన్ని సృష్టి కల్పం అంటారు. ఇందులోనే మన్వంతరాలు, యుగాలు అన్నీ వస్తాయి. బ్రహ్మగారికి ఒక పగలంటే మానవ కాలమానం ప్రకారం కోటానుకోట్ల సంవత్సరాలన్నమాట. రాత్రిపూట బ్రహ్మ చేసిన సృష్టంతా లయించి పోతుంది. దాన్ని క్షయ కల్పం అంటారు. బ్రహ్మ  పగటిపూట కల్పంలో 14 మంది మనువులు సృజింపబడి ఆయనకు జీవకోటి సృష్టికి సాయపడతారు. బ్రహ్మ యొక్క పూర్ణాయుర్దాయం ‘100’ సం||రాల్ని ‘పర’ అంటారు. దానిలో సగాన్ని ‘పరార్ధం’ అంటారు. దీన్నే పండితులు రోజూ పూజ చేసుకునేటప్పుడు సంకల్పంలో చెప్పుకుంటారు: ‘ఆద్య బ్రహ్మ ద్వితీయ పరార్దే.. కలియుగే, ప్రధమ పాదే..’ అని. దీని ప్రకారం ప్రస్తుతం ఉన్న బ్రహ్మకు 50 ఏళ్లు గడిచి 51వ సం||లో అడుగు పెట్టాడు.

    శ్రీ మహాభాగవతంలో ఇలా ఉంది. బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి నాభికమలం (పద్మం) లోంచి పుట్టినప్పటి కాలాన్ని పద్మకల్పం అన్నారు. మొదటి పదార్థాన్ని బ్రహ్మకల్పం అన్నారు. ఇప్పుడు శ్వేత వరాహకల్పం అంటున్నారు. ఇలా ఎన్ని కల్పాలున్నాయో! దీన్నిబట్టి బ్రహ్మగారికి ఎన్ని పగళ్ళ కల్పాలు గడిచాయో, ఎందరు మానవులు గతించారో అని కూడా మనవద్ద లెక్కలున్నాయి. ఇలా ఎందరో బ్రహ్మలు సృష్టికర్తలుగా పని చేసారని మన శాస్త్రాల్లో ఉన్నాయి. అయితే వాళ్ళందరి గురించిన లెక్కలు మనకు తెలీదుగాని ప్రస్తుతం ఉన్న బ్రహ్మ ఎప్పుడు పుట్టింది, ఎప్పుడు తపస్సుకు ఉపక్రమించింది, ఎప్పుడు సృష్టి ప్రారంభించి అన్న విషయాలకు లెక్కలున్నాయి. ఈ సందర్భంలో కల్పాన్ని ఒక పెద్ద కాలంగా తీసికోవచ్చు మనం.

    పెద్దదుంటే చిన్నది కూడా ఉండాలి మరి. అందుకని అతిచిన్న కాలమానం గురించిన లెక్క కూడా మనవద్ద ఉంది. దాన్ని ‘లవ’ మంటారు. దీన్నే ‘కాల పరమాణువు’ అని కూడా అంటారు. ఇప్పుడు మనకు కావాల్సింది ఈ ‘లవ’ మన్న కాల పరమాణువే.

    కొలమానాలు

    మనకి ఎన్నోరకాల కొలమానాలున్నాయి. ఉదా|| భూమిని కొలవాలంటే అంగుళం, జాన, బెత్తె, అడుగు, గజం నుంచి యోజనం వరకు ఉన్నాయి. బరువును కొలవాలంటే వీసం నుండి వీసె, బారువు, మణుగు మొదలైనవి ఉన్నాయి. ద్రవపదార్ధాలను కొలవాలంటే ఉద్దరిణె నుండి గిద్దె, శేరు, మానిక, కుంచం మొదలైనవి ఎన్నో ఉన్నాయి. కాలాన్ని కొలవడానికి తృటి, క్షణం, ఘడియ, విఘడియ అని వాడుతుంటాం. ఇలాంటివన్నీ ఉన్నాయని చాలామందికి తెలుసుకానీ మాట్లాడే భాషలోని పదాల్లో ఒక్కో శబ్దాన్ని కొలవడానికి కూడా మన శాస్త్రాల్లో లెక్కలున్నాయని ఎంతమందికి తెలుసు? అది తెలుసుకుందాం. ఈ సందర్భంలో, ఈ కాలంలో జరుగుతున్న యాంత్రికాభివృద్ధి గురించి కూడా కొంచెం తెలుసుకోవాలి మరి.

    శబ్దాన్ని కొలిచే యంత్రాలు

    ఆధునిక కాలంలో శాస్త్రసాంకేతికరంగాల్లో అభివృద్ధి జరిగి యాంత్రికపరమైన ఆవిష్కరణలు చాలా జరుగుతున్నాయి. ఎన్నో రకాల యంత్రాలు, అన్ని రంగాల్లోనూ వాడుకలోకి వచ్చేసాయి. ముఖ్యంగా తెలుసుకోవాల్సిందేటంటే మనం మాట్లాడే భాషను విశ్లేషించడానికి కూడా అనువైన యంత్రాలు ఎన్నో రకాలు వచ్చాయి. మనం మాట్లాడేటప్పుడు ఎన్నో శబ్దాలను వాడతాం. ఆ శబ్దాలే వర్ణాలుగా, పదాలుగా, వాక్యాలుగా వ్యక్తమౌతాయి. మన సంభాషణల్లో, మనం పలికే శబ్దాల యొక్క ఉచ్చారణ కాల నిడివిని తెలియజేసే యంత్రాలున్నాయి ఇప్పుడు. ఈ శబ్దాలను పలకడానికి కొంత సమయం పడుతుంది. వాటిని కొలవగలమా అని ప్రశ్నించుకుంటే కొలవగలమని ఆధునిక యంత్రాలు రుజువు చేస్తున్నాయి. కంప్యూటర్ రాకముందు మన నోటిద్వారా పలికే శబ్దాలు, పదాలు మొదలైనవి కొలవడానికి కొన్ని యంత్రాలనీ వాడేవారు. ఉదా: స్పెక్టోగ్రాఫ్, మింగోగ్రాఫ్.

    హైదరాబాద్లో గల సిఐఇఎఫ్ఎల్ ని ప్రస్తుతం ఇఎఫ్ఎల్ యు అంటున్నారు. ఇందులో 1990లో ఫోనేటిక్స్ అండ్ స్పోకన్ ఇంగ్లీష్లో ఎం.లిట్. చదువుతున్నప్పుడు తెలుగు, ఆంగ్లభాషలకు సంబంధించిన కొన్ని విషయాలను తులనాత్మకంగా పరిశోధించడం జరిగింది. ఆ పరిశోధనాంశం పేరు Vowel Length in English and Telugu – ఆంగ్లం-తెలుగులో అచ్చుల నిడివి (ఉచ్చారణ కాలం). ఈ పరిశోధన మింగోగ్రాఫ్ అన్న యంత్ర సాయంతో చేయడం జరుగుతుంది. ఈ పరిశోధన కోసం కొన్ని తెలుగు పదాలు, ఒక వాక్యం కొందరు తెలుగువాళ్ళతో పలికించి వాటి చిత్రపటాలను ఈ యంత్రసాయం ద్వారా సేకరించి పరిశోధించడం జరిగింది. మింగోగ్రాఫ్ ద్వారా తీసిన చిత్రాలను మింగోగ్రామ్స్ అంటారు. ఇందులో 6 లేక 8 చేనల్డ్స్ ఉంటాయి. మనకు కావలసిన వాటినే లెక్కలోకి తీసికుంటాం. ఇక్కడ ఓరల్ ట్రాక్ కి సంబంధించిన సమాచారాన్ని మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇచ్చిన కాలమానాన్ని మిలిమీటర్స్(mm)లో కొలిచి మిలిసెకండ్స్ (ms)లోకి మార్చుకోవడంవల్ల ఒక శబ్దాన్ని పలకడానికి పట్టే సమయం తెలుస్తుంది.

    శబ్దం యొక్క నిడివి

    తెలుగులో 56 అక్షరాలున్నాయి. వీటిని పలికేటప్పుడు వర్ణాలు/శబ్దాలు అంటాం. ఈ వర్ణాల కూర్పులే పదాలుగా, వాక్యాలుగా మారతాయి. మన సంభాషణల్లో అనేక వాక్యాలు దొర్లుతుంటాయి. ఒక్కో వాక్యం పలకడానికి ఎంతో కొంత సమయం పడుతుంది. ఆ వాక్యాన్ని విడగొడితే పదాలుగాను, వాటిని విభజిస్తే వర్ణాలుగాను విడిపోతాయి. ఒక వాక్యం పలకడానికి పట్టే సమయాన్ని కూడా విభజిస్తే పదాలకు పట్టే కాలం, వర్ణాలకు పట్టే కాలం కూడా తెలుస్తుంది. ఒక శబ్దం పలకడానికి పట్టే సమయమే దాని నిడివి. ఒక శబ్దాన్ని పలికేటప్పుడు దాన్ని ఎంతసేపు నిలిపి ఉంచగలమో అన్నదే వాటి నిడివి. అదే దానికి పట్టే సమయం. దాన్ని యంత్రాల సాయంతో తెలుసుకోవచ్చు.

    తెలుగు వర్ణాల కాలగణనంలోని తేడాలు

    తెలుగు వర్ణాల్లో అచ్చులు

    అ ఆ ఇ ఈ ఉ ఊ (ఋ ఋ మొ||) ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అః హ్రస్వాలు (పొట్టి అచ్చులు) : అ ఇ ఉ ఎ ఒ దీరాలు (పొడుగు అచ్చులు ) : ఆ ఈ ఊ ఏ ఓ

    ఐ ఔ లను దీర్గాలుగా తీసుకోవచ్చు.

    అచ్చుల కింద మనకు ‘ఋ ఋ ఉన్నాయి. కాని వాటిని మనమిప్పుడు వాడటం లేదు. ‘అం, అః” లో అ+మ్, అ+హ ఉన్నాయి. అంటే అచ్చులు+హల్లులు కలిసి ఉన్నాయి. హల్లులు: క ఖ గ ఘ జ; చ ఛ జ ఝ ఇ; ట ఠ డ ఢ ణ; త థ ద ధ న; ప ఫ బ భ మ; య ర ల ళ వ శ ష స హ మనకున్న ఈ వర్ణాలను లేక శబ్దాలను పలుకుతున్నప్పుడు అన్నిటికి ఒకేరకమైన కాల గణనం ఉండదు. ఎన్నో కారణాల మూలాన కాలగణనంలో తేడాలుంటాయి. ఉదా: వర్ణాల లక్షణాలని బట్టి, మనం మాట్లాడే విధానాన్ని బట్టి, ఒక శబ్దానికి ముందు వెనుకల గల ఇతర శబ్దాల ప్రభావాన్ని బట్టి కూడా తేడాలొస్తాయి. వాటిని గురించి తెలుసుకుందాం.

    అచ్చుల లక్షణాలు

     అచ్చుల్లో రకరకాల లక్షణాలు కలవి ఉన్నాయి. అన్ని అచ్చులను ఒకేలాగ పలకడం కుదరదు. (పలికి చూడండి అర్థమవుతుంది) ‘అ’ పలకాలంటే నోరంతా బాగా తెరచి పలకాలి. ‘ఇ పలికేటప్పుడు రెండు పెదవులూ వెడల్పుగా ఉండి దగ్గరగా వస్తాయి. ‘ఉ’ పలికితే నోరు మూసుకున్నట్టుంటుంది. ‘ఒ’ పలికితే నోరు గుండ్రంగా మారుతుంది. అచ్చుల్లో పొట్టి అచ్చుల, పొడవాటి అచ్చుల నిడివుల్లో తేడాలుంటాయి.

    హల్లుల లక్షణాలు

    హల్లులను పలికేటప్పుడు కూడా అన్నిటిని ఒకేలాగ పలకం. ఉదా: ‘కచటతప’ అన్న హల్లులు పలికి చూస్తే అర్థమవుతుంది. ఈ హల్లుల్లో పరుషాలైన ‘కచటతపలకు, సరళాలైన ‘గజడదబ’లకు, ఊషాలైన శషసహ లకు, అంతస్థాలైన ‘యరలవ’ లకి తేడాలుంటాయి కాలగణనంలో. మాట్లాడే విధానాన్ని బట్టి కాలమానాల్లో తేడాలు

    మనం మాట్లాడే విధానాన్ని బట్టి కూడా శబ్దాల ఉచ్చారణ కాల నిడివుల్లో మార్పులు వస్తాయి. ఒక్కొక్కప్పుడు మనం తొందరగా మాట్లాడతాం. ఇంకోప్పుడు నెమ్మదిగా మాట్లాడతాం. అలాంటప్పుడు శబ్దాల ఉచ్చారణ కాలాల్లో తేడాలుంటాయి.

    ఇతర శబ్దాల ప్రభావం

    సంభాషణల్లో ఒక శబ్దం యొక్క ప్రభావం ఇంకో శబ్దం మీద ఉంటుంది. ఒక శబ్దం పలుకుతుంటే దానికి ముందు, వెనుక గల శబ్దాల యొక్క ఒత్తిడి వల్ల దాని ఉచ్చారణ కాలనిడివిలో తేడా వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, ఒక పదాన్ని ముగ్గురు లేక నలుగురు పలికితే వాటి సమయాల్లో కూడా తేడాలుంటాయి. నలుగురూ ఒకేలాగ ఒకే సమయంలో పలకలేరన్నది రుజువైంది.

    పరిశోధనకు సంబంధించిన పదాలు

    మన పలుకుల కాల నిడువులను గురించి చర్చించాలంటే చాలా ఉంది. కానీ ఇక్కడ అంత అవసరం లేదు. అందువల్ల పరిశోధనకు సంబంధించిన కొన్ని పదాల్లోని అచ్చుల యొక్క ఉచ్చారణ కాల నిడివులనే పరిగణనలోకి తీసికొనడం జరిగింది. ఇక్కడ మచ్చుకు కొన్ని పదాలు, వాటిలోని అచ్చుల కాలనిడివులు ఇవ్వడం జరిగింది. కొన్ని పదాలకు వాటి నిడివులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ పరిశోధనకు ఉపకరించిన కొన్ని పదాలు, పద జంటల రూపంలో ఉన్నాయి.

    (1) అట-ఆట, ఇక-ఈక, ఉసి-ఊసు, ఎట-ఏట, ఒడి-ఓడి (2) పడు-పాడు, విడు-వీడు, కుడి -కూడి, నెల-నేల, కొన-కోన

    ఈ పదాల చిత్రపటాలను మింగోగ్రాఫ్ యంత్రం ద్వారా గ్రాఫ్ పేపర్ మీద తీయడం జరిగింది. ఇక్కడ మచ్చుకు ఒక పద జంట ‘విడు-వీడు’ యొక్క చిత్రపటాలను మటుకు ఇవ్వడం జరిగింది. ఈ పదాలను ముగ్గురు పలికారు. వాటి చిత్రీకరణలో ఓరల్ ట్రాక్ కు సంబంధించిన విలువలనే ఇక్కడ ఇస్తున్నాం. ఆ చిత్రపటాలలో పౌనఃపున్యం (frequency) రూపంలో ఈ విలువలు కనపడతాయి. వాటిని మిలిమీటర్జ్ నుండి మిలి సెకండ్స్ లోకి మార్చడమైంది. వాటి ‘పొడవు’ కొలిచి ‘సమయం’లోకి మార్చడం జరిగింది. వాటి వివరాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ తెలుగు వర్గాలు, వాటిని పోలిన ఆంగ్ల అక్షరాలు ఇవ్వడం జరిగింది. ఈ పరిశోధన కోసం వాడిన పదాల్లో కొన్నింటికి సంబంధించిన వివరాలు రెండు రకాలుగా ఇవ్వడం జరిగింది:

    భారతీయ శాస్త్రాల్లో గల వర్ణోచ్చారణ కాల నిర్ణయ విశేషాలు

    ఇంతవరకూ ఆధునిక యంత్రాల ద్వారా సాధ్యమయ్యే తెలుగు వర్గాల్లోని అచ్చుల ఉచ్చారణ కాలగణనం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు యంత్రాల సాయం లేకుండా శబ్దాల ఉచ్చారణ కాల నిడివుల గురించి తెలుసుకునే పద్ధతి భారతీయ ప్రాచీన శాస్త్రాల్లో ఎలా ఉందో తెలుసుకుందాం.

    ప్రాచీన భారతీయ ఋషులు మనకందించిన విజ్ఞాన శాస్త్రాల్లో కూడా మనం పలికే సంస్కృత శబ్దాలకు సంబంధించిన కాల నిర్ణయం గురించిన విశేషాలు ఉన్నాయి. ఇప్పటికీ గురుపరంపరలో ఒకరి నుండి ఇంకొకరికి ఈ విజ్ఞానం అందుతోంది. ఇలాంటి విషయాలు కొన్ని మంత్ర శాస్త్ర గ్రంథాల్లో ఉన్నాయి. మంత్ర శాస్త్రంలో పేరు ప్రఖ్యాతులు గడించి “భాసురానంద’ దీక్షా నామం కలిగిన “భాస్కరరాయమఖి’ (భాస్కర రాయలు వారు 1700-1768 సిఇ) అనేక గ్రంథాలు రాసారు. వాటిలో ఒకటి వరివస్యా రహస్యము’. ఈ గ్రంథం శ్రీవిద్యకు సంబంధించిన మంత్ర శాస్త్రం. అందులో కొన్ని శ్లోకాల్లో ఈ విషయాలున్నాయి.

    అన్ని భారతీయ భాషలకు మూలమైన గీర్వాణ (సంస్కృతి) భాషకు సంబంధించిన అక్షరాలు పలకడానికి ఒక పద్ధతి ఉంది. వర్ణాలను గాని, శబ్దాలనుగాని పలకాలంటే ఒక కాల పరిమితి ఉంది. అంటే వేదమంత్రాలను వాచక జపం చేయాలంటే ఈ కాలపరిమితికి లోబడి చేయాలి. ఈ సందర్భంలో సంస్కృత భాషకు గల వర్ణాల ఉచ్చారణ కాలాల్ని గ్రహించడం ఎలా జరుగుతుందన్నదాన్ని చక్కగా వివరించారు. దానిలో వర్లోచ్చార కాలానికి ఒక పేరు పెట్టారు “మాత్ర అని. పొట్టి అచ్చులకు, పొడవాటి అచ్చులకు, హల్లులకు ఉచ్చారణ కాలాన్ని నిర్ణయించారు. దాని ప్రకారం

    పొట్టి అచ్చులైన అ ఇ ఉ ఎ ఒ లకు 1 మాత్ర పొడవాటి అచ్చులైన ఆ ఈ ఊ ఏ ఓ లకు 2 మాత్రలు హల్లులకు

    అర్థమాత్రం 1/2 మాత్ర ఈవిధంగా ఉచ్చారణ కాలాన్ని నిర్ధారించారు. ఐతే ఈ కాల నిడివిని భౌతికంగా ఎలా తెలుసుకోగలమో, ఎలా కొలవగలమన్నది అద్భుతంగా వివరించారు ఈ కింది శ్లోకంలో

    నళినీ పత్ర సంహత్యాః సూక్ష్మ సూచ్యభివేధనే | దళే దళే తుయః కాలః సకాలో లవసంజితః | అతిసూక్ష్మతమః కాలోనోపలభ్యో భృగూద్వహ ||

    తామర పూలరేకులను ఒక కట్టగా చేసి సూదితో గుచ్చితే ఒక్క రేకు/దళం గుచ్చడానికి ఎంతకాలం పడుతుందో దాన్ని ‘లవ’ మంటారు. ఇదే సూక్ష్మతమ కాలం (కాల పరమాణువు). దీని ప్రకారం

    1 మాత్ర కు 256 లవములు ‘2’ మాత్రలకు 512 లవములు

    1/2′ మాత్రకు 126 లవములు. ఈ లెక్క ప్రకారం వాచక జపం చేయాలి. మానసిక జపానికి ఈ నియమం లేదు. ఇంత సూక్ష్మ కాలాన్ని కూడా మన ప్రాచీన ఋషులు యంత్రాలు మొదలైనవి లేని వేదకాలంలో పరిగణనలోకి తీసుకున్నారంటే వారికున్న సూక్ష్మగ్రాహ్య శక్తి ఎంత అద్భుతమైనదో తెలుస్తోంది!

    ఈ లెక్కలను బట్టి యంత్రసాయంతో చేసిన పదాలలోని అచ్చుల కొలతలను పోల్చి చూసుకోవచ్చు. తేడాలున్నాగానీ మన ఋషుల శాస్త్ర విజ్ఞానం ఆశ్చర్యకరం. వారు మనకు అతిపెద్ద కాలమైన ‘కల్పం కల్పాలు గురించి, అతిచిన్న కాలమైన ‘లవము’ గురించి తెలియచేసారు. పరిశోధనకు సంబంధించిన పదచిత్రాలు ఉన్నాయి.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here