Site icon Sanchika

కలనైనా…

[dropcap]నా[/dropcap]కు పదహారు సంవత్సరాలు వచ్చాయి. పదో తరగతిలోకి వచ్చాను. ఆ రోజు సత్యవతి స్కూల్‌కి ఎగనామం పెట్టిందేమో అనుకుంటుంటే మా పద్మ చెప్పింది సత్య పెద్దదయిందని. ఎందుకో నాకు ఎలాంటి భావన రాలేదా మాట చెప్పినప్పుడు. మాట్లాడక నడిచా. పదిహేను రోజుల తరువాతనుకుంటా స్కూల్‌లో దర్శనమిచ్చింది. కొత్తదానిలా అనిపించింది చూస్తుంటే. ఒళ్లు ఇంకా పచ్చగా మెరిసిపోతోంది. కళ్ళు మాత్రం నన్ను చూడగానే ఉత్సాహంగా మిలమిలలాడాయి. బుంగమూతి పెట్టింది. నేను నాలుక బయటపెట్టి వెక్కిరించా. ప్రార్థనకు స్కూల్ గ్రౌండ్‌లోకి వెళ్లాం. అక్కడి నుంచి దొడ్డి నుంచి విడివడిన పశువులలా బయటపడ్డాం. వస్తుంటే పద్మ, సత్య మాట్లాడుకోవటం కనిపించింది. సత్య ఎందుకో నాతో మాట్లాడటం మానేసింది. నేను చొరవగా ముందుకెళితే, సిగ్గు పడేది. చిన్నప్పట్టి రోజులే బాగనిపించేవి. అదీ కాక సత్య గౌనులో ఉన్నప్పుడు అందంగానూ; ఈ లంగా ఓణీల్లోనేమో బాగనిపించేది కాదు. ఆ వేళే మొదటసారిగా సత్యకు ఉత్తరం రాయాలనిపించింది.

మా సత్యం మాస్టార్‌కు ఆయన భార్య దగ్గర నుండి ఆ రోజు ఉత్తరం వచ్చింది. మా ఆవిడ దగ్గర నుంచోయ్ అని ఉత్సాహంగా నడిచాడు. ఉత్తరాల ప్రహసనం లేకపోతే ఆయనకు పెళ్లే అయ్యేది కాదట. ఆ మాట అడగకున్నా చమత్కారంగా చెప్పారు. ఆ సాయంత్రం ఇంటికి వెళ్ళి గదిలో కూర్చొని తలుపు గడియ వేసుకొని, ఉత్తరం రాద్దమని కూర్చున్నా. ఏం రాయాలో తోచలేదు. మొదట నా మీద నాకు విపరీతమైన కోపం వచ్చింది. కాసేపు ఆలోచించి తిరిగి మొదలు పెట్టా. మొదట ఏమని సంబోధించాలి అని అనుమానం వచ్చంది. ప్రియా అని రాయాలనిపించింది. ఏమైనా అనుకుంటే? వాళ్ల నాన్నతో చెప్తే? హెడ్ మాస్టర్‌గారికి ఫిర్యాదు చేస్తే? మొదట ఈపుసాపయిద్ది. గీకిన వరకు కాగితాన్ని పరపర చింపేయబుద్ధయింది. ఇన్ని ప్రశ్నలెందుకు వస్తున్నాయో అర్థం కాలేదు.

చివరకు మొండిగా రాసేద్దామనిపించి ప్రారంభించా… ప్రియమైన సత్యవతికి అని రాశా. బాగనిపించలేదు. శ్రీమతి అని రాస్తే? అలా రాయకూడదేమో. అసలీ పేచీ అంతా ఎందుకు? సత్యకు అని ప్రారంభించా, ఇక కాగితాలు చాలా వరకు పాడయిపోయినయ్. అయినా పట్టువదలక మొదలపెట్టా, చాలా రోజులుగా నీతో మాట్లాడాలనుకుంటున్నా, పలకరించినా పలికే పరిస్థితుల్లో నువ్వు లేవు.  అసలు ఎందుకు పెద్దదానివయ్యావు?  నాకంటే ఇంకా పొడుగవుతావా? భయంగా  ఉంది. ఒక వేళ అయినా నీకే నష్టం. నిన్ను చూస్తున్న స్నేహితులంతా పొట్టి మొగుడు సత్యవతి అంటారు. అప్పుడు నువ్వు బాధ పడతావు. అందుకే దేవుడికి చెప్పుకున్నా సత్యవతిలో ఇక మార్పులు చెయ్యకు అని. నా మొర ఆలకిస్తాడో లేదో? ఎప్పుడు వసపిట్టలా వాగుతూ నన్ను వాగించేదానివి, ఇప్పుడు నీ మాటే బంగారం అయిపోయింది. అందుకే నాకీ పెద్దరికపు వేషాలు. ఊహ తెలిసనప్పటి నుండి బాగుంటం లేదు. చిన్నప్పుడు చూడు ఎంచక్కా చెట్టాపట్టాలేసుకొని కాలువగట్లు, చలకలు, పంటపొలాలు, ఎంత హాయిగా తిరిగాం. ఇద్దరం ఒకటిగా మెలిగాం. అలాంటిది మొన్న కరణంగారి సందులో పలకరిస్తే సిగ్గు నభినయించి వెళ్ళావు. మాట్లాడాలనిపించ లేదా! ఎవరైనా చూసి ఆక్షేపిస్తారని భయమా? చిన్నపటి నుంచి దగ్గరగా పెరిగిన మనని అలా ఎవరనుకుంటారు?  నీకో సంగతి గుర్తు చేస్తా. ఒకనాడు మా నాన్న కొట్టాడు. నేను అన్నం తినడానికి ఇంటికి వెళ్ళలేదు సాయంత్రం దాకా. అప్పుడు కలిశావ్. దగ్గరకొచ్చి ఊర్కే రమ్మంటే రావని మీ అమ్మ పిలిచిందని చెప్పి తీసుకెళ్ళావ్. దగ్గర కూర్చొని అన్నం పెట్టావ్. నా ఎదురుగా కూర్చుంటే తినేప్పుడు నీకు ఓ ముద్ద పెట్టాలనిపించింది. నాకు బాగా తెలుసు. తెలియని అవ్యక్తమైన అనురాగ బంధం మనది. అది మొదటి నుంచీ బంధిస్తుంది. కాదంటావా? నువ్వు బదులు చెప్పల్సిన పని లేదు. నేను మనస్ఫూర్తిగా గిలికిన పలుకులివి. ఇంకేం రాసేది. అసలయినా పిలిచినా పలకని పిల్లకి ఎందుకు రాయాలి? అనే ప్రశ్న ఉదయించింది. ఎవరో కాదు కదా, మా సత్యకు అని క్షమించే ఈ పని చేస్తున్నా. నీ నాజూకయిన వేళ్ళ నుంచి వెలువడిన మాటలు కావాలి నాకు, పదిలంగా నా మనసున నిలిచేందుకు.

నిన్ను ఒకసారి తుమ్మొదలు కుట్టాయి. గుర్తుందా! అప్పుడు నువ్వు ఏమన్నావో తెలుసా? ‘పువ్వుల్నే కాక మననీ హింసించటం వీటి నైజం’ అని; ‘వీటితోనే పోలుస్తారుగా మొగవారిని’ అన్నావు. కాదని రుజువేది? మరి నువ్వు? అని అడిగావు సూటిగా చూస్తూ. ఎందుకో మాటలు దొర్లలేదు. నవ్వి ఊరుకున్నా. అక్కడి నుంచి మాట్లాడక నన్నే చూస్తూ పరిగెత్తావు. వయసుకు మించిన తెలివనిపించింది. తెల్లవారి స్కూల్‌లో కలిసినప్పుడు చెప్పా. మనుషులంతా ఒకే జాతి. అందు రెండు తెగలు. చెడ్డవాళ్లు, మంచి వాళ్ళు. ఆడ మగలలో మంచి వారూ చెడ్డవారూ ఉంటారు. కోపాన్ని పొగొట్టుకొని అందంగా నవ్వావు. అలా అర్థం చేసుకొని నవ్వకపోతే ఇలా వ్రాసుకునే అవసరం వచ్చేది కాదు. ఆ నవ్వున వెన్నెల వేడి కరిగినట్టనిపించ లేదు. నీ చక్కని పండ్ల పరుస, సొట్ట బుగ్గలు, చురుక్కా చూసే కళ్ళు. చెప్పటమెందుకు కాని, అర్థం అయితే చాలు. నా వ్రాతలో ఏమైనా తప్పులు దొరికితే వదిలేయి. ఇప్పటికే చాలా పొడుగయింది కదూ ఉత్తరం? ఏదైనా నోట్సు కాదు కదా! తప్పులంటే కోప్పడడానికి ఉంటాను. నీ ఎదురుగా ఉండటమే నా ఇష్టం. ఆ సమయం వస్తుందో లేదో?  ఎదురు చూడటంలో కూడా ఆనందం ఉందని ఇప్పుడు ఇప్పుడే తెలుస్తుంది. నీకు తెలిసినది ఏవైనా చెప్తే వినాలని ఉంది. మనిషికి కొత్త మీద తీరని మోజు. పాతపైన యావగింపు. దాన్ని సహజం అంటారు గాని, నాకు అలా అనిపించదు. ఎందుకో తెలుసా?  చిన్నతనాన్నే ఆనందంగా గడిచింది. అదీ ఇప్పుటికంటే నీల మేఘాల అందాల్లో చేరి సోలిపోవాలని ఉంది. ఉంటాను. చిరాకు పడకు, నువ్వు నా మనసున నిలిచినప్పుడు కలిగే ఉద్వేగం ఇది. అందుకే హద్దులు చెదురుతయ్. నీ కాగితాన్ని పొత్తంగా మార్చి, కవరుగా చేసి దాంట్లో పెట్టి జేబున భద్రంగా ఉంచి, తలుపు తీసి, మా పద్మ దగ్గిరకి వెళ్ళా. అది పడుకునే ప్రయత్నాన ఉంది. బయటకు పిలిచా. అన్నయ్య వచ్చాడంటూ పరిగెత్తుకు వచ్చింది. సత్యకు ఇవ్వమని కవరిచ్చి జాగ్రత్తలు చెప్పా.

ఇంటికొచ్చా. ఇల్లు ప్రశాంతంగానే ఉంది. అమ్మా, నాన్నా నిద్రపోతూ కనిపించారు. మెల్లగా వెళ్ళి పడుకున్నాను. తెల్లవారి నా లేఖ సత్యకు చేరింది. అది తెలిసాక దిగులు. పెద్దవాళ్ళతో చెప్పి చివాట్లేయించి, అవమానిస్తే? సత్య  పిలిచి ‘ఏమిటి ఈ వెధవ వేషాలంటే’? హాయిగా మానేస్తానని చెంపలేసుకోవచ్చు. గుంజిళ్ళు తీయొచ్చు. చాలా చిరాకుగా అనిపించింది ఆ రోజల్లా. సాయింత్రం ఇంటికి వస్తుంటే సత్య వాళ్ళ తాతగారు “ఒరేయ్ ఇటురా” అని పిలిచారు. గుండె జల్లుమంది. దొరక్కుండా పారిపోవాలనిపించింది. కానీ అక్కడే నిలబడ్డా “పిలుస్తుంటే అట్లా నిలబడతావే” అన్నారు. “ఏం లేదు తాతయ్యా” అన్నాను. “నేనేమి అడగందే ఏమీ లేదని నీకు ఎట్లా తెలుసురా!” అని నవ్వి “మీ నాన్న ఉన్నాడేమో చూసి రా” అన్నాడు. నాన్నగారిని పిలిచాను. కాని భయం – దడ. వారి సంభాషణలో నేను రాసిన ఉత్తరం ప్రసక్తి రాలేదు. బ్రతికిపోయా భగవంతుడా అనుకుని సంబంరపడ్డాను. ఆ తర్వాత రెండు రోజులకి పద్మ ఓ కవరు నాకు తెచ్చి ఇచ్చింది. ఆతృతగా ఇంట్లోకి వెళ్ళి కవరు తీశా. సెంటు వాసన గుప్పుమంది. మడత విప్పా. అక్షరాలు చాలా కుదురుగా ఉన్నాయి. నా రాత గుర్తుకొచ్చి నాకే సిగ్గేసింది.

ప్రియమైన – ఆ మాట చూడగనే సంతోషంతో మనసు చిందులు వేసింది. మధురంగా దరహాసం చేస్తున్న సత్య ఉత్తరాన కనిపించింది. పద్మ ఇచ్చిన కాగితంలో కనపడిన నాలుగు వాక్యాలు ఆనందంగా చదివాను. చివరగా ఇంకెప్పుడూ ఉత్తరాలు రాయకు అని ఉన్నా.

మనుసు ఆనందంతో గంతులు వేసింది. ఆ పూట భోంచేయబుద్ది కాలేదు. పిచ్చి పిచ్చిగా బజార్లన్నీ తిరిగా. కాళ్ళు తీపులనిపించినయి, కాని సత్య కనిపించలేదు. కనిపిస్తుందనే ఆశతో ఇంటికి వచ్చి పడుకున్నాను. కలలో నైనా కనిపిస్తుందన్న నమ్మకంతో. కల.

Exit mobile version