Site icon Sanchika

కలపాల్సి ఉంది..

[మాయా ఏంజిలో రచించిన ‘Here’s to Adhering’ అనే కవితని అనువదించి సంచిక పాఠకులకు అందిస్తున్నారు కవయిత్రి హిమజ గారు.]

(మంచి చెడు అంతటా ఉన్నాయని, చెల్లాచెదురుగా ఉన్న మానవతను ఒకచోట కూర్చి చూడాలనుకోవాలన్న తపన ఈ కవితలో కనిపిస్తుంది.)

~

[dropcap]హా[/dropcap]లీవుడ్‌లో
నేనొక విందుకు వెళ్ళాను
అక్కడి వాతావరణం నాసిరకంగా ఉన్నా
అక్కడి పానీయాలు మాత్రం బాగున్నాయి
ఇంకా. నేనక్కడ నీ నవ్వుని విన్నాను

తరవాత నేనొక పాత గ్రీకు ఓడలో
సముద్ర విహారానికి వెళ్ళాను
నౌకా సిబ్బంది ఎంతో వినోదభరితంగా ఉన్నారు
అక్కడున్న అతిథులు మాత్రం
అంత ఆధునికంగా లేరు
అక్కడ నేను నీ చేతులను కనుగొన్నాను

సహారా అడవుల్లో
కారవాన్ వాహనంలో తిరుగుతున్నప్పుడు
సూర్యుడు వాడి బాణాలతో కొట్టాడు గానీ
అక్కడి రాత్రుళ్ళు మాత్రం
చాలా గొప్పగా ఉన్నాయి
ఆ విధంగా నేను నీ ఛాతీని కనుగొన్నాను

సాయంత్రం వేళ కాంగో నదీ తీరంలో
నదీ ప్రవాహం అంతమయ్యే చోట
నన్ను నేను ఒంటరిగా కనుగొన్నాను
నేను కొంతమందిని స్నేహితులుగా చేసుకున్నాను
అక్కడే నీ మొహాన్ని చూసాను నేను

నా సమయమంతా తేలుతున్న నీ
శరీర భాగాలు అతికించడానికి వెచ్చించినా
అవి కలిసి అతుక్కోనే లేదు

నీ అంతట నీవుగా
కలిసి పైకి రాకూడదూ..

ఒక్కసారి..
నాకోసం..!!

‘సంబురు’ అరణ్యాల ఎత్తుల పైకి
సందర్శించడానికి అలా వెళ్ళాను
అక్కడి నేల రాతిలాగా కఠినంగా ఉన్నా
మనుషులైతే సత్యమైన వాళ్ళు
అదిగో
అక్కడే నీ నవ్వుని విన్నాను నేను

తరువాత
Bridger Range పర్వత శ్రేణుల పైకి
సుధీర్ఘ నడక కై బయల్దేరాను
అక్కడి దృశ్యం కళ్ళని కట్టిపడేసేలా ఉంది
గాలి మాత్రం వింత గొల్పేలా విసుర్తోంది
అక్కడ
నీ చేతులని కనుగొన్నాన్నేను

సాగర విహార నౌకలో
మెడిటెరేనియన్ సముద్రం మీదకి వెళ్ళినపుడు
అలలు సింహాల్లా గర్జించాయి
సూర్యుడి కిరణాల వేడి మాత్రం
వాడిగా తగిలింది
నీ కళ్ళని కనుగొన్నాన్నేనక్కడ

నీ కోసం..
ప్రపంచమంతటా వెతుకుతునే ఉన్నాను..
తెగిన నీ శకలాలన్నింటినీ
కలిపి కూర్చాల్సి ఉంది

ఒక్కసారి నాకోసం
నీ అంతట నువ్వే
కలిసి పైకి రాగూడదూ..

ఒక్కసారి
నాకోసం..!!

~

మూలం: మాయా ఏంజిలో

అనువాదం: హిమజ


మాయా పలుకులు:

  1. స్వభావసిద్ధంగా మీరెలా ఉన్నారో అలాగే కొనసాగాలని నేనంటాను. మీ దయాపూరిత చర్యలు చూసి ఈ తుచ్ఛ ప్రపంచం నివ్వెరపోవాలి.
  2. ప్రతి ఒక్కరూ జన్మతః ఏదో ఒక నైపుణ్యంతోనే పుట్టి ఉంటారని నేను నమ్ముతాను.
  3. నీ చుట్టూ జరిగే ఎన్నో విషయాలను నువు నియంత్రించలేకపోవచ్చు. వాటివల్ల నీ విలువ తగ్గించుకోవడం, పెంచుకోవడం అన్నది మాత్రం నువు నిర్ణయించుకోవచ్చు.
  4. యవ్వనం, అందం, తెలివితేటలు, హాస్య చతురత, దయ, కరుణ ఈ లక్షణాలన్నింటిలోను ధైర్యం, ధీరోదాత్తత కలిగి ఉండటమే నేటి అవసరం అని అంటాను.
  5. చెడును పారద్రోలి మంచిని ఆహ్వానించేందుకు విశ్వాసం అనేది ఒక వారధిగా పని చెయ్యాలి.
  6. ఉన్నతంగా జీవించాలనుకుంటే ఒక వారసత్వాన్ని తయారు చెయ్, ఈ ప్రపంచంపై ఎవరూ చెరిపి వెయ్యలేని నీదైన ఒక ముద్ర వెయ్యి.

Exit mobile version