Site icon Sanchika

కాలవ కింద

[dropcap]కా[/dropcap]లవకింద ఎకరం ఉంటే చాలదూ
అన్నరోజుల్నించీ
ఇస్తే పదెకరాలైనా కౌలుకి చేద్దాం
అని పత్తిపూలదండల్ని
పరువు మీద కప్పుకుంటున్నాం

రాయిమీద రాయి పేర్చి
నీళ్ళు ఆనుకోటానికి పెద్దకట్టకట్టేశాం కానీ
ఆనుకున్న నీళ్ళు ఆనుకున్నట్టే
ఆవిరైపోయేంత ఎండెందుకు కాస్తా ఉందో అర్థం చేసుకోలేకపోతున్నాం‌..

పత్తో మిరపో పంటేసి
చలివిరిగోదాం కాడ
కాపలా పొడుకుంటాం గానీ
నిఖార్సుగా పిలగాడు బడికెళ్ళేది పట్టించుకోలేకపోతున్నాం

పంచాయితీ కాణ్ణించి
పంతాలకు తలకాయలరువిచ్చాం కానీ
పాతికేళ్ళైనా పల్నాడెందుకు
ముందుకుబోదురా అని
అడిగేనోరే లేకుండా
పురుగుమందు బోస్తున్నాం..

మన రెక్కలెప్పుడూ
కష్టానికి మొలిచినవే
మన లెక్కలెప్పుడూ
నష్టానికి అతికినవే

గడ్డిమందు చల్లినట్టు
కొత్త ఆలోచనలు చల్లాలీ నేలమీద
రెక్కలార్చి ఎగిరినట్టు
కొత్తపులుగులు ఎగరాలీ ఆకాశం మీద..

Exit mobile version