[ప్రసిద్ధ రచయిత్రి కలవల గిరిజారాణి గారు అందిస్తున్న ఫీచర్ ‘కలవల కబుర్లు’.]
ఫొటోల ముచ్చట్లు
[dropcap]ఇ[/dropcap]దివరకటి కాలంలో మన బామ్మ తాతల ఫోటోలు.. తాతగారు పంచె కట్టి, పైన కోటు, భుజాన జరీ కండువా, ఆ పైన తలపాగా, కొద్దిగా కోర మీసం, గంభీరమైన ముఖం.. చేతిలో పొన్ను కర్ర, సింహాసనం లాంటి కుర్చీలో కూర్చుని ఉంటే పక్కన నాయనమ్మ, వినమ్రంగా నిలబడి, జరీ అంచు పట్టుచీర కొంగు కప్పుకుని, మెడలో ఓ కంటె, చంద్రహారం, పలకసర్లూ, నడుముకి వడ్డాణం, సిగనిండా పూవులూ, ముక్కుకు బేసరీ.. ఈ ఫోజు తోనే అందరిళ్ళలోనూ ఈ ఫోటో గోడకి వేలాడుతూ కనపడేది. ఆ తర్వాత పిల్లలు వచ్చాక చంకలో ఒకరూ, ఒడిలో ఒకరూ, కిందన కూర్చుని మరో ముగ్గురూ.. ఉన్న ఫోటో ఉంటుంది.
మరో పక్కన పెళ్లిలో గ్రూపు ఫోటో.. వరసగా కుర్చీలలో కూర్చున్న మగవారు.. వాళ్ళ వెనకాల అదే వరుసలో నిలబడిన వారి ధర్మపత్నులూ, కిందన జంపకాణా మీద ఎవరి కాళ్ల దగ్గర వాళ్ళ వాళ్ళ పిల్లలు, లేదా ఆ చివరా ఈ చివరా పెద్ద పిల్లలు మడత కాళ్ళేసుకుని కూర్చుంటే. మధ్యలో బాసింపట్టులు వేసుకుని చేతులు కట్టుకుని కూర్చుని నడింపిల్లలూ. వాళ్ళ మధ్యలో నోట్లో వేలేసుకుని ఉంగారాల జుట్టు కళ్ళలో పడుతూ బుజ్జి తండ్రులూ.. ఇలాంటి ఫోటో కూడా ఒకటి ఆ గోడ మీద తప్పనిసరిగా ఉండేది. మధ్యలో ఆ ఇంటి పెద్ద.. వారి తర్వాత ఆ నూతన వధూవరులు మధుపర్కాలు, మెడలో కర్పూరం దండలతో.. వారి పెళ్లికి గుర్తుగా ఆ ఫోటో ఉండేది. ఇలా ముఖ్యమైన ఫోటోలే చాలా మితంగా ఆయా సందర్భాల్లో తీయించుకునేవారు.
పిల్లలు బోర్లా పడిన సమయంలో ఒకటీ, ఆ తర్వాత కూర్చోవడం వచ్చాక, స్టూడియోలో గుండ్రటి వైరు కుర్చీలో కూర్చోపెట్టి మరోటీ, పుట్టినరోజు నాడు ఒకటీ ఇలా అరుదుగా తీయించేవారు. మల్లెపూల కాలంలో ఆడపిల్లలకి పూలజడ వేసి పట్టు పరికిణితో నాన్న సైకిల్ మీద స్టూడియోకి తీసుకువెళ్ళి, అద్దంలో జడ కనపడేలా ఒకటి, జడ ముందుకు వేసుకుని మరొకటి ఫోటో అప్పుడు ప్రతీ ఆడపిల్లకీ ఖచ్చితంగా ఉండేది.
హైస్కూల్ చదువయాక, మళ్లీ ఎప్పుడు కలుసుకుంటామో అనుకుంటూ గుర్తుగా అప్పుడు తీయించుకున్న ఫోటోలు అబ్బాయిలకీ, అమ్మాయిలకీ ఇప్పుడు అవి ఒక తీపి గుర్తులుగా ఉండే ఉంటాయి. అమ్మాయిలు లంగా ఓణీతో రెండు జడలు ఒకటి ముందుకు ఒకటి వెనక్కి, కోల బొట్టు, నుదుట మీద పడే ఉంగారల జుట్టు, సోగ కాటుక కళ్ల, ఒక చేయి ఎక్కడికి పారిపోతుందో అని రెండో చేత్తో గట్టిగా పట్టుకుని, వరసగా నిలబడో లేదా ఫోల్డింగ్ ఇనప కుర్చీలలో కూర్చుని.. సేమ్ ఇంచుమించు అందరికీ ఒకటే ఫోజు.. అబ్బాయిలైతే రోడ్డు ఊడ్చేలా ఉండే బెల్ బాటమ్ ఫేంటూ, ఇంతింత చెవుల్లా ఉండే కాలరున్న చొక్కాలూ, ఔనౌను ఇలాగే ఉండేవి ఆ ఫోటోలు. కావాలంటే మీ ఆల్బమ్‌లో ఓ సారి వెనక్కి వెళ్లి చూడండి. ఔను కదూ! మీ ఆల్బమ్‌లో అచ్చు ఇలాంటి ఫొటోలు వున్నాయి కదూ!
ఆ తర్వాత రోజుల్లో అంటే నాకు తెలిసి 80ల ప్రాంతాల్లో పెళ్లికి ఫోటోగ్రాఫర్‌ని పెట్టి ముఖ్యమైన సన్నివేశాలను మాత్రమే అంటే గౌరీ పూజకి ఒకటీ, స్నాతకానికి ఓ రెండూ, జీలకర్ర బెల్లం సమయాన ఒకటీ, సూత్రధారణ అప్పుడు ఒకటీ, తలబ్రాలుకి ఓ రెండూ.. ఇలా లెక్కగా తీసి ఓ ఇరవై ఫోటోలు అయేలా ఆల్బం చేసి ఇచ్చేవాడు ఫోటోగ్రాఫర్. అవి కూడా బ్లాక్ అండ్ వైట్ ఫోటోలే. చూసుకుని చూసుకుని మురిసిపోయేలాంటి కళాఖండాలు అవి.
ఆ తర్వాత కలర్ ఫోటో రోజులు వచ్చాయి.. వీటి సంఖ్య పెరిగింది. వీటి మోజూ పెరిగింది.
అప్పటి రోజుల్లో కెమెరాలకి రీళ్ళు కొనుక్కుని, జాగ్రత్తగా చూసుకుని చూసుకుని ఫోటోలు తీసుకునే కాలం అది. ఆ రీలుని జాగ్రత్తగా తీసి.. స్టూడియోలో ఇస్తే.. డార్క్ రూమ్‌లో కడిగి దండాలమీద ఆరబెట్టి నెగిటివ్‌లు ఇవ్వడం, వాటిని కొంచెం దూరంలో పెట్టి చూసుకుని ఆ ఫోజులని బట్టి ఏ ఫొటో ఏదో గుర్తు పెట్టుకుని బావున్నవి, అవసరమయినవి ప్రింట్ తీయించుకునేవాళ్ళం. వాటిని ఆల్బమ్‌లో పెట్టడం అదో ప్రహసనం. నల్లని మందమైన షీట్లుండే ఆల్బమ్ వాటి ముందు ప్రతిపేజీకి ఉల్లిపొర కాయితం ఉండేది. ఆ నల్లని షీటుకి ఫోటో మూలలకి అంటించడానికి త్రికోణం లాగా స్టిక్కర్లు ఉండేవి. ఆ ఫోటో సైజుకి తగ్గట్టుగా అవి పెట్టి ఆ ఫోటోలు అమర్చేవాళ్ళం. సాధారణంగా ఏదైనా టూర్లు వెళ్ళినపుడు మాత్రం కెమెరా వాడకం ఎక్కువగా ఉండేది. మన దగ్గర లేకపోతే స్నేహితులది అరువు తీసుకుని వెళ్ళేవాళ్ళం. తరువాత తర్వాత కలర్ ఫోటోలు ప్రవేశించిన కాలంలోనే ఆల్బమ్‌లు కూడా రూపురేఖలు మారాయి.. ప్లాస్టిక్ కవర్లలలాగా వచ్చి ఆ ప్లాస్టిక్ ఫోల్డర్‌లలో పెట్టే వాళ్ళం.
అలా ఆ రోజులు మనం గడిపేస్తే..
ఇప్పుడు.. ఊ.. అంటే ఫోటో.. ఉ ఊ అన్నా కూడా ఫోటోనే..
కెమెరా అవసరమే లేదు.. సెల్ ఫోన్‌లో టక్కు టిక్కు.. టక్కు టిక్కు.. వేలకి మించి ఉంటున్నాయి. ఇక సెల్ఫిష్‌ల వేలంవెర్రి మరీనూ.. మూతులు సున్నాలాగానో, సాగదీసో, బిగించో.. ఆ రెండు వేళ్లు రకరకాలుగా చూపిస్తూ.. సెల్ఫీలు.
ఇప్పటికాలం పెళ్ళిళ్ళలో అయితే.. లక్షల్లో ఉంటోది ఈ ఫోటోలు ఖర్చు. పెళ్లి మాటలు మాట్లాడుకునేటపుడు.. ఆడ, మగ పెళ్లి వారు, సాధారణంగా ప్రయాణం ఖర్చులు, బాజా భజంత్రీలు ఖర్చులు, ఇలాంటివి చెరిసగం పెట్టుకుందాం అనుకునే మాటల్లోనే ఈ ఫోటోగ్రాఫర్ ఖర్చు కూడా చెరిసగం అని ముందస్తుగా అనేసుకుంటున్నారు. ఒక్కొక్క ఆల్బం మోయాలంటే పదికేజీల దాకా ఉంటోంది. మళ్లీ ప్రీ వెడ్డింగ్ ఫోటోలు కొన్ని. పెళ్లి అయాక ఏ ఏడాదికో ఇస్తాడు ఆ ఫోటోగ్రాఫర్. మా బంధువుల పెళ్ళిలో ఒకరు అమ్మాయి తండ్రి.. ‘నేనసలు ఫోటోలు తీయించనండీ.. అసలు తర్వాత ఆ ఆల్బమ్‌లు చూసేవారెంతమంది ఉంటారు? ఏ గూట్లోనో, అటకమీదో దుమ్ముకొట్టుకుని ఉంటాయవి. అనవసర ఖర్చులు తప్ప ఇంకేమీ లేదు.’ అంటూ ఖరాఖండిగా చెప్పాడు. ఒకోసారి అదీ నిజమే అనిపించింది కానీ.. తరువాత తర్వాత మనకి మిగిలే తీపి గుర్తులు అవే కదా! ఎప్పుడైనా పాత ఆల్బమ్‌లు ముందేసుకుని కూర్చుంటే.. అప్పటి సంగతులు, సంఘటనలు, దృశ్యాలు కళ్ళ ముందు ఫోటో రీల్స్ లాగా గిర్రున తిరుగుతాయి కదూ!
కాబట్టి ఉండాలి ఆపాత మధుర స్మృతులు.. అవి సజీవ ఙ్ఙాపకాలు.
అదన్నమాట సంగతి..
కబుర్లు చెపుతున్నది..
కలవల గిరిజా రాణి.
(మళ్ళీ కలుద్దాం)