కలవల కబుర్లు-19

0
2

[ప్రసిద్ధ రచయిత్రి కలవల గిరిజారాణి గారు అందిస్తున్న ఫీచర్ ‘కలవల కబుర్లు’.]

[dropcap]కొ[/dropcap]త్త కొత్త వస్తు వినియోగాలకి, సుఖాలకీ, లగ్జరీలకీ పూర్తిగా అలవాటు పడిపోయాము. ఒకప్పుడు అసలు.. ఏవుండేవని? ఏవీ లేవు.. ఒకవేళ ఏవైనా వున్నా అన్నీ అందుబాటులో వుండేవి కావు.

నా చిన్నతనంలో, సెలవలలో మా మేనమామ గారి ఊరుకి వెళ్ళేవాళ్ళం. అప్పట్లో అది బాగా పల్లెటూరులెండి. ఆ ఊరికి రైలు, బస్సు.. రవాణా సదుపాయం లేదు. కాకినాడ వరకూ రైలు ప్రయాణం. అది కూడా మామూలుగా, జనరల్ బోగీ లో వుండేది మా ప్రయాణం. అందరికీ పడుకోవడానికి బెర్తు సదుపాయాలు లేకపోతే, కిందన బెడ్డింగ్ విప్పదీసి, పరుచుకుని పడుకునే వాళ్ళం. రైళ్ళలో తినే పదార్థాలు కొనుక్కోవడం వుండేదే కాదు. ఇంటి దగ్గర చేసుకుని తీసుకెళ్ళే పులిహోర కానీ పెరుగన్నాలు కానీ వుండేవి. ఇక మంచినీళ్ల సీసాలు అమ్మడాలూ, కొనుక్కోవడాలు అప్పట్లో ఎక్కడున్నాయి? ఇంటి దగ్గర నుండే మర చెంబులు లేదా తాబేటి ఆకారంలో వుండేవి.. వాటిలో నీళ్ళు చల్లగా వుండేవి.. అవి పట్టుకెళ్ళేవాళ్ళం. రైల్లో కిటికీకి దాని బెల్టుని కట్టేసి బయటకి వేలాడకట్టేవాళ్ళం. బయట గాలికి నీళ్ళు చల్లగా వుండేవి. ఏదైనా స్టేషన్ రాగానే పరుగు పరుగున వెళ్ళి నీళ్ళు నింపుకుని వచ్చేవాళ్ళం గుర్తుందా మీకు? ఇప్పుడు స్టేషన్‌లలో అలాంటి నీళ్ళ కుళాయిలే కనపడ్డం లేదు కదూ! ఒకవేళ ఉన్నా.. అవి శుభ్రమైనవి కాదని మనమే వాడడం మానేసాము. ఎక్కడికక్కడ.. బిస్లరీ వాటర్ బాటిల్స్ కొనుక్కోవడమే అవుతోంది. మరి ఇదివరలో ఈ ఆరోగ్య సూత్రాలు వుండేవి కాదు మరి.

మేం వస్తున్నామని తెలిసి.. మమ్మల్ని తీసుకువెళ్ళడం కోసం కాకినాడ స్టేషన్‌కి ఎద్దులబండి పంపేవారు. ఆ ఊరికి బస్సు సౌకర్యం లేదు కదా! బండిలో మెత్తగా కూర్చుందుకు వీలుగా గడ్డి వేసి, పైన జంపఖానా పరచి పంపేవారు. దానిలో మా మామయ్య గారి ఊరు చేరేవారం.. ఊళ్లోకి ప్రవేశించడానికి ముందు చిన్న ఏరు వుండేది. వంతెన లేదు. నడిచివెళ్ళేవారు పంచెలు, చీరలు పైకి ఎగదోపి, నెత్తిన సామాను పెట్టుకుని, పిల్లలని భుజాలకెక్కించుకుని.. బాలెన్స్ చేసుకుంటూ నడుస్తూ వెళ్ళేవారు. ఎద్దుల బండిని కాలవలోనుంచే పోనిచ్చేవాడు బండబ్బాయి. బండిలో నుంచి కాలవ వేపు వంగి, నీళ్లు అందుకుంటూంటే భలే సరదాగా వుండేది. ఒకవేళ వర్షాకాలంలో ఏరు పొంగి ప్రవహిస్తోంటే.. అటుపక్క వారు అటే.. ఇటుపక్క వారు ఇటే.. ఆగిపోక తప్పదు.

ఊళ్లోకి బండి ప్రవేశించగానే.. అరుగుల మీద కూర్చుని ముచ్చట్లు చెప్పుకునే.. అందరూ పలకరించేవారు.. “ఇదేనాండీ రావడం? బావున్నారాండీ?” అనే పలకరింపులు దాటుకుంటూ.. ఇంటి దగ్గరకి చేరేవాళ్ళం. బయట అరుగు మీద బకెట్‌తో నీళ్లు వుండేవి కాళ్లు కడుక్కుని లోపలకి వెళ్ళేవాళ్ళం.

“రండి.. రండి ప్రయాణం బాగా సాగిందా?” అనే కుశలప్రశ్నలు, కాఫీలు అయ్యాక, పెరట్లో.. బావి దగ్గర కట్టెలపొయ్యి మీద రాగి డెగిసాలో వేణ్ణీళ్లు.. బక్కెట్లో పోసుకుని.. అందులో తొరుపుకోడానికి చన్నీళ్లు బావిలో నుండి తోడుకునేవాళ్ళం. తడికెల గదే స్నానాలకి. అప్పట్లో ఆ కరెంటు లేనే లేదసలు. సాయంత్రం.. లాంతర్లు బూడిదతో శుభ్రం చేసుకుని, వెలుతురు వుండగానే భోజనాలు చేసేసేవాళ్ళం. సైజులు వారీగా కంచాలు.. వరసగా పెట్టుకుని.. అరటికాయ వేపుడు ముక్కలు, ఆవకాయ, చారు, పెరుగుబిళ్ళ.. నంచుకుందుకి మామిడి పండు.. ఆ ఆవకాయ పెచ్చు కడిగేసుకుని.. తర్వాత కబుర్లు చెప్పుకుంటూ పడుకునేటపుడు తినేవాళ్ళం. ఆరుబయట మడత మంచాలు వేసుకుని కబుర్లు చెప్పుకుంటూ పెద్దవాళ్లు.. కిందన బొంతలో, పరుపులో వేసుకుని పిల్లలూ.. ఆకాశంలో నక్షత్రాలు లెక్కపెట్టుకుంటూ.. ఒంటికన్ను రాక్షసుడు.. రాజకుమారి కథలో లేకపోతే.. ఏ అమ్మమ్మో, బామ్మో చెప్పే రామాయణ, భారత భాగవత కథలో వింటూ హాయిగా పడుకునేవాళ్ళం. పక్కన కూజాలో చల్లటినీళ్ళుండేవి మధ్యలో తాగడానికి. ప్రతిపక్క పక్కన.. తాటాకు విసినకర్రలుండేవి. పొద్దున్నే పళ్ళు తోముకోవడానికి పందుంపుల్లలూ.. పొయ్యిలో కచికా వుండేవి..

ప్రపంచం ఆధునీకరణలో ఇవన్నీ.. కనుమరుగైపోయి జ్ఞాపకాల రూపంలో మిగిలిపోయాయి. అసలు కరెంటు లేని ఊరు ఇప్పుడు అసలు ఊహించగలమా? అదే ఇప్పటి రోజుల్లో అయితే.. ప్రయాణం చేసి బయటకి రాగానే.. కార్లు.. ఇంట్లో అన్నీ స్విచ్చిలతోనే పనులయిపోతున్నాయి.. గీజర్లూ, ఏసీలూ, ఫ్రిజ్‌లూ, ఒకటేమిటి సమస్తం వస్తువుల మీదనే ఆధారపడిపోయాము. ఎక్కడా శారీరక శ్రమే లేదు. మీటల నొక్కి చేసిన వంట.. తిన్నగా టేబుల్ మీదకి వచ్చేస్తోంది. కుర్చీలో కూర్చుని.. కేవలం చెయ్యి.. కంచంలో నుంచి నోటి దాకా వెళ్ళడానికి మాత్రమే మన శ్రమ ఉపయోగిస్తున్నామేమో.. తర్వాత చెయ్యి కడగడానికి లేవకుండా.. ఫింగర్ బౌల్సే టేబుల్ దగ్గరకి వస్తున్నాయి. అది కాకపోతే.. కుళాయి కింద చేయిపెట్టగానే ఆటోమేటిక్‌గా నీళ్లు వచ్చేస్తాయి.. కుళాయి తిప్పే పని కూడా వుండడం లేదు. అడుగడుగునా సౌకర్యాలు, సౌఖ్యాలూ.. కష్టపడే పనే లేదు.

మొన్న ఆ మధ్య అదే మా మేనమామ గారి ఊరు వెళ్లినపుడు ప్రతీ ఇంటా ఈ ఆధునిక వస్తువులన్నీ చోటు చేసుకోవడం గమనించాను. ఊరి ముందున్న కాలవ మీదకి వంతెన వచ్చేసింది. ఆటోలూ, మోటారు సైకిళ్లు, బస్సులు వచ్చేసి.. ఎద్దుల బండ్లు కనుమరుగైపోయాయి. అరుగుల మీద కూర్చుని పలకరించేవారంతా.. టీవీ సీరయళ్ళకి అతుక్కిపోయారు. అసలు ఆ అరుగులు, పెంకుటిళ్లు, తాటాకు పందిర్ల వసారాలు మాయమైపోయి, పల్లెలలో కూడా మేడలూ, అపార్ట్‌మెంట్‌లూ పైపైకి లేస్తున్నాయి.

ఎంతో అభివృద్ధి సాధించి ఎంతో ముందుకి వెడుతున్నాము కానీ అప్పటి ఆ అనుభూతులూ.. ఆ ఆనందాలూ.. ఏవీ? ఆ ఆప్యాయతలూ.. ఆ అనురాగాలూ ఏవీ? వస్తువులు ముందుకు వచ్చి వాటినన్నిటినీ వెనక్కి తోసేసాయేమో.. కొత్తనీరొచ్చి పాతనీటిని వెనక్కి తోయడం ఇదేగా!

ఇలాంటి కబుర్లు.. మరిన్ని వచ్చే వారం చెప్పుకుందాం. అంతవరకూ సెలవు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here