కలవల కబుర్లు-20

0
2

[ప్రసిద్ధ రచయిత్రి కలవల గిరిజారాణి గారు అందిస్తున్న ఫీచర్ ‘కలవల కబుర్లు’.]

[dropcap]ఈ[/dropcap] ఫేస్బుక్ ఫ్రొఫైల్స్‌కి పెట్టుకునే ఫోటోలు ఉంటాయి చూసారూ.. అయినా వాళ్ళకి వాళ్ళ పర్శనల్ ఫోటోలు పెట్టుకోవడం ఇష్టం ఉండకపోవచ్చు.. కానీ కొందరు తమ ఫోటోలే ఉంచుకుంటారు లెండి. ఏదైనా.. అది మనకెందుకులెండి.. కానీ తరచూ మార్చకుండా ఉంటేనే ఫోటోలని బట్టి, ఫేస్బుక్ పోస్టుల లోనూ, కామెంట్స్ లోనూ వాళ్ళని, చటుక్కున గుర్తు పట్టేయొచ్చు. అలా తమ ఫోటోలు పెట్టుకోలేనివారూ, పెట్టుకోవడం ఇష్టం లేనివారు..

పువ్వుల ఫోటోలో, పసిపిల్లల ఫోటోలో, ప్రకృతి సౌందర్యం చూపించే కొండలో, లోయలో, సెలయేళ్ళో, పిట్టలో, పుట్టలో, చెట్టులో.. ఆకాశమో.. ఇలా రకరకాలుగా కొందరికి ఉంటాయి. మరికొందరు దేముడి ఫోటోలు పెట్టుకుని ఉంటారు. ఇలా ఇంకొందరు వాళ్ళకిష్టమయిన ఫోటోలు ఉంచుకుంటారు. ఆయా ప్రత్యేక రోజుల్లో ఉదాహరణకు స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం అయితే చాలా మంది ఫ్రొఫైల్స్ జాతీయ జెండాలు రంగులతో నిండిపోతాయి. ఏదైనా దుర్ఘటనలైతే ఆ రోజు నలుపు రంగు మచ్చలతో నిరసన చూపిస్తారు.

ఇకపోతే అసలు పేర్లతో ఉండేవారికి గురించి కాదు కానీ.. కొందరి పేర్లు విచిత్రాతి విచిత్రంగా ఉంటూంటాయి. ఉదాహరణకు

‘నా పేరేంటో తెలుసా’ (నువ్వు చెపితేగా తెలిసేది)

‘నేను పెద్ద తోపు’ (సర్లేవోయ్)

‘నేనసలు ఎవరి మాటా వినను’ (మానేయ్ వినకు)

‘అంతా మా ఆవిడిష్టం’ (అంతేగా అంతేగా)

‘నేనూ మా ఆవిడా’ (కానలేదుగా మేము)

‘నేను కొంచెం తేడా’ (ఎందులో)

ఇలా ఉన్నాయా? అని అడక్కండి.. అచ్చం ఇవి కాకపోయినా ఇంచుమించు ఇలానే కనపడుతూంటాయి.

ఇంకా అసలు పేరు కాకుండా..

‘గౌతమీ పుత్ర శాతకర్ణి’

‘పండిత పుత్ర పరమ శుంఠ’

ఇటువంటి తరహాలో మరికొన్ని.

ఇంకో రకం ఏమో..

అప్పట్లో నుదుటి మీదకి జుట్టు ఒక రింగు తిప్పుకుని, టక్ చేసుకునే హీరో గారు.. కోర్టు గుమాస్తా పిలిచినట్లు ఏ పదమైనా మూడుసార్లు అనేవారు గుర్తుందా? ‘పద్మా! పద్మా! పద్మా!’..

ఈ తరహాలో ఒకే పేరుని రెండుగా అంటే.. ‘బేబి బేబి’, ‘రాజా రాజా’, ‘శిరిశిరి’

‘ప్రియా ప్రియా’ (ఈ పేరుతో పిలవాలంటే కొంచెం సిగ్గేస్తుందేమో).. ఇలా వెరైటీలగా ఉంటూంటాయి.

ఇక కొందరి వాల్స్‌లో చూస్తే..

కథలూ, కవితలూ, పద్యాలు వగైరాలు వ్రాసేవారికి వాటితోనే ఉంటాయనుకోండి. సొంత ఫోటోలో, ఫేమిలీ మెంబర్స్ ఫోటోలూ, ఏవైనా ఫంక్షన్‌కి సంబంధించినవే, ఏదైనా యాత్రలకి వెళ్ళినప్పటివో పెట్టుకుంటారు.

కొందరు వేరే వాళ్ళకి ఎత్తుకురావడం.. ఇక్కడ అతికించుకోవడం..

లేదా ఏవో పేజీలనుండి తీసుకొచ్చిన సూక్తి ముక్తావళి, రకరకాల కొటేషన్స్.. లేకపోతే ప్రవచనకారుల ఉపదేశాలూ, ఆరోగ్య సూత్రాలు, వంటలూ.. ఇలా ఒకటికాదు కలగూర గంపలే.. ఇంకొందరు రాజకీయాల పోస్టులు ఏ రోజుకా రోజుకి అప్ డేట్స్ ఇచ్చేస్తారు. వాళ్ళ వాల్సూ వాళ్ళిష్టం అనుకోండి. ..అయినా..

ఇలా పరాయివాళ్ళ ఫ్రొఫైల్స్ నీకెందుకూ అంటారా?

మరి.. ‘చీమా చీమా ఎందుకు కుట్టావే? అంటే.. నా పుట్టలో వేలు పెడితే కుట్టనా?’ అందట..

అలాగా..

గ్రూపులో చేరడానికో లేదా పర్శనల్ ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పెడితేనో.. చూడక తప్పదు కదా! అలా చూసీ చూసీ తెలుసుకున్న సంగతులివన్నీనూ..

అయినా ఇప్పుడు చూడ్డానికి వీల్లేకుండా వాళ్ళ ఫ్రొఫైల్స్‌కి తామెవరో తెలీకుండానే ఉండేలా తాళాలు బిగించుకుంటున్నారు.

అప్పుడు వాళ్ళు పంపిన రిక్వెస్ట్‌లు బుట్టదాఖలేగా!

ఇదిగో ముందే చెపుతున్నాను..

ఈవేల్టికి ఈ టాపిక్ దొరికింది.. అంతే..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here