కలవల కబుర్లు-21

0
4

[ప్రసిద్ధ రచయిత్రి కలవల గిరిజారాణి గారు అందిస్తున్న ఫీచర్ ‘కలవల కబుర్లు’.]

[dropcap]కొం[/dropcap]దరిని వారి వారి ఇంటిపేర్లని బట్టి వారెవరో గుర్తు పట్టొచ్చు.

ఇంకా కొందరిని గుర్తు పట్టాలంటే.. కొన్ని బండ గుర్తులుంటాయి. ఉదాహరణ చెప్పాలంటే… ఎత్తరుగులవారిల్లు.. ఇనపగేటువారిల్లు.. డాబావారిల్లు.. ఇలా అన్నమాట.

అలాగే కాకుండా.. ఇలా కూడా కొందరికి మారుపేర్లు, మనకి మాత్రమే తెలిసేట్టు కొందరికి వుండేవి. అవి అసలు వాళ్ళకి తెలీకూడని పేర్లు.

నా చిన్నతనాన ఇలా మేము పిలుచుకునే కొందరు గుర్తొచ్చారు. ఇదిగో ఇలా.. సరదాగా వారిని గుర్తు చేసుకుందామనీ..

“అమ్మా! ఇందాక, ‘చీపికళ్ళత్తయ్య’ వచ్చిందే! ఏదో పేరంటం అట. నిన్ను పిలవడానికని వచ్చింది. నువ్వు ఇంట్లో లేవని గడపకి బొట్టు పెట్టి వెళ్ళిపోయింది.”

“అవునా! కూర్చోమనకపోయావా? నీకు చెప్పే వెళ్ళాను కదా! ‘ఆరువేళ్ళ మామయ్య’ గారికి (ఆయన కాలికి ఆరువేళ్ళుండేవి) జ్వరం వచ్చి తగ్గిందట. ఈరోజు పథ్యం పెట్టారంటే పలకరించి వద్దామని వెడుతున్నా అని చెప్పాను కదే మొద్దురాచ్చిప్పా! ఇంతకీ ఏ చీపికళ్ళావిడొచ్చిందీ? ”

“రామారావుపేట చీపికళ్ళావిడే.. రేపు కైలాసగౌరి నోము నోచుకుంటున్నారట.. నిన్ను పొద్దున్నే వచ్చెయ్యమన్నారు. సాయం చేయాలట.”

“ఔనా! సరేలే.. నేను పొద్దున్నే మీ నాన్నగారికి ఇంత ఉడకేసి, అటు వైపు వెడతాను. వెడుతూ.. వెడుతూ పిచ్చి దొడ్డమ్మని కూడా తీసుకువెడతాను. మళ్లీ తనొక్కత్తీ రాలేనంటుంది.. (ఆవిడ ఎప్పుడూ అర్థం పర్థం లేని పిచ్చి వాగుడు వాగుతుందని, ఆవిడకి ఆ పేరు వచ్చింది) నువ్వు మధ్యాహ్నం బడి నుంచి వచ్చి ‘బట్టతల పెదనాన్న’ ఇంటికి వెళ్ళు. అన్నం అక్కడ తిందువుగాని.. నేను వచ్చేటప్పుడు నిన్ను తీసుకువస్తాను..”

“అలాగే! సరే కానీ, ఆవిడ నీకు ఏం చెప్పమందంటే.. రేపు నువ్వు వచ్చేటప్పుడు, ఇంకా ‘చూరునీళ్ళ కాఫీ పిన్నినీ’, ‘రింగులజుట్టు’ ఆవిడనీ.. కూడా పిలవమంది.”

“నాకు చెప్పడమెందుకూ? ఆ ‘కళ్ళజోడావిడ’కి చెపితే, వాళ్ళింటి వెనక వాటాల్లోనేగా వీళ్ళుండేది. పిలుస్తుంది కదా! మళ్లీ ఇదో పనొకటా నాకు?”

ఇలా వుండేవి ఆ గమ్మత్తు పేర్లు. ఏదో ఒక విశేషమైన పేరుండేది వాళ్ళని అనుకోవడానికి. మళ్లీ ఆ పేరుతో పిలవము..

‘చూరునీళ్ళ కాఫీ ఆవిడ’ అని ఒకరుండేవారు. వాళ్ళింట్లో కాఫీ నిజంగా చూరునీళ్ళే అన్నమాట. అలా ఇచ్చేది. అందుకని ఆవిడకి ఆ పేరుతో మిగిలిన వాళ్ళు అనుకునేవారు.

వీరి అసలు పేర్లు మర్చిపోతూ వుండేవాళ్ళం. ఇలా మారుపేర్లతోనే అంటూవుండేవాళ్ళం. ..ఒకరింట్లో కుక్కపిల్ల వుందని.. ఆవిడని ‘బొచ్చు కుక్కావిడ’ అని అనేవాళ్ళం.

మరొకావిడ వాళ్ళాయన పెట్రోల్ బంక్‌లో అకౌంటెంట్‌గా చేసేవారు. ఆవిడని ‘పెట్రోలు బంకావిడ’ అనీ, ఇంకొకావిడేమో వాళ్ళాయనకి తెలీకుండా డబ్బులు పోపులడబ్బాలో పెడుతూంటానని ఒకేసారి ఏదో మాటల సందర్భంలో అంది. అప్పటినుండి ఆవిడ పేరు ‘పోపులడబ్బా’ ఇలా వెరైటీ గా వుండేవి పేర్లు.

మా పనమ్మాయి కూడా అది పనిచేసే ఇళ్ళల్లో వాళ్ళకి వింత వింత నామధేయాలు చేసేది. ఒకరింట్లో తనకి ప్రతిరోజూ దోశలే టిఫిను పెట్టేదట.. అందుకని ఆవిడని ‘దోశలమ్మగారు’ అనేది. అలా విని విని మాకు అలవాటైపోయి మేమూ అలాగే అనేవాళ్ళం.

ప్రత్యేకించి మారుపేర్లే పెట్టక్కర్లేదు. కొందరికి కొన్ని పేర్లు అలా ఫైనల్ అయిపోతూంటాయు. అయినా ఒకప్పుడు చాలా మందికి అసలు పేరు ఏదో.. ఎవరికీ తెలిసేది కాదు. ఫలానా ఇంజనీరు గారి భార్య అనో, రవీ వాళ్ళ అమ్మ అనో, అపార్ట్‌మెంట్ అత్తయ్య అనో ఫిక్స్ అయిపోతూంటాయి.

ఇంకా కొంత మందివుంటారు. వారికి.. కొంత మందిని కొన్ని చోట్ల చూస్తేనే గుర్తు పట్టగలరు. ఎప్పుడూ వెళ్లే షాపులలో పలకరించే సేల్స్‌మేన్‌లు కానీ.. కొట్లో అమ్మాయిలని కానీ.. ఆ యూనిఫాంలో ఆ షాపులో వుంటేనే గుర్తుపట్టగలరు.. బయట ఏ రోడ్డు మీదో వాళ్ళు పలకరించినా.. ఎక్కడో చూసినట్టుందే అనిపిస్తుంది కానీ వెంటనే గుర్తు పట్టలేరు. మాకు తెలిసిన ఒకాయన సర్వకాల సర్వావస్ధలలోనూ నెత్తిన బొచ్చుటోపీ పెట్టుకునేవాడు. ఓసారి ఎందుకో పాపం.. టోపీ పెట్టుకోకపోయేసరికి, ఆయన్ని అస్సలు గుర్తు పట్టలేకపోయాము.

మొన్నామధ్య మాస్కుల రోజులలో కూడా అంతే.. ఆ మాస్కు వెనుక ఎవరి ముఖం ఏదో ఎవరికీ తెలిసేది కాదు.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here