[ప్రసిద్ధ రచయిత్రి కలవల గిరిజారాణి గారు అందిస్తున్న ఫీచర్ ‘కలవల కబుర్లు’.]
[dropcap]ఊ[/dropcap]రికే ఏదీ రాదు.. అన్నాడు ఆ బంగారం షాపు ఆయన.
నిజమే కదూ!
ఎవరైనా మనకి ఊరికే ఇస్తున్నారంటే (కొన్ని చోట్ల మాత్రం కాదు) ఏదో ఆశించే ఇస్తారు.
ఆఫీసరు గారికి, తన కిందన పని చేసేవారు ఏ స్వీట్ బాక్సో, మందు పార్టీయో ఉచితంగా ఇస్తే.. ఏ ప్రమోషనో ఆశించే కదా!
అదే తన పై ఆఫీసర్లు.. తనని ఓ రెండు రోజులు ఏ రిసార్టుకో పంపడమో, లేదా మరేదైనా విలువైన బహుమతి ఇస్తే.. తననుండి మరింత పని చేయించుకోవడానికే కదా!
షాపుల్లో.. అప్పుడప్పుడు ఫ్రీ ఆఫర్లు పెట్టి, మనల్ని మోసపుచ్చి.. పాత స్టాకు సరుకుని మనకి అంట గడతారు.
ఫ్రీగా ఇస్తున్నారంటే ఎలాంటివారైనా సరే.. తీసుకోవడానికి ఉవ్విళ్ళూరుతారు. ఇదివరలో నేను ఏదో సర్ఫ్ మూడు కేజీల పేకెట్ కొంటే పెద్ద ప్లాస్టిక్ బకెట్ ఫ్రీ అన్నాడని.. అస్తమానం అదే కొనేదాన్ని. ఇంటి నిండా బకెట్లే బకెట్లు. అయితే..
నాణ్యమైన సర్ఫ్ ఒక కేజీ కొంటే నెల్లాళ్ళు వచ్చేది. ఇప్పుడు ఈ ఫ్రీ మోజులో.. ఈ సర్ఫ్ నెలకు రెండు పేకెట్లు అవసాగింది. అంటే ఆరు కేజీలు పట్టేదన్నమాట. అంటే రెట్టింపు ఖరీదు కూడా అయేదన్నమాట. అంటే బకెట్ ఫ్రీ మోజులో ఉన్నానన్నమాట. అంటే నాణ్యత లేని సరుకుకు, పక్కన ఈ ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ.. అంటూంటే.. ఎంత కాదనుకున్నా, సగటు ఆడదాని మనసుని అటే లాగేలా చేస్తారు కదా ఈ అమ్మకందార్లు.
వందమందిలో తొంభై మందికి పైగానే ఈ ఫ్రీ పిచ్చి వుంటుంది. బొక్క బోర్లా పడిపోవడమే..
ఇక బట్టల కొట్లో ఈ ఉచితాల వెల్లువ చూస్తూనే వున్నాము. తెలిసి తెలిసి గోతిలో పడుతూనే ఉంటాము. Buy one get one అని కనపడితే చాలు.. పొలోమంటూ అటు పరిగెత్తడమే.
రెండింటి ఖరీదూ ఒకదానిమీద వేసేసి మనకి అంటకట్టేస్తున్నాడు అనే ఆలోచనే రాదేం మనకి.
అందుకే అదేదో సినిమాలో ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా తాగేస్తాడు అనే డైలాగు ఇలాంటి ఫ్రీ రాయుళ్ళని చూసే పుట్టుంటుంది.
ఇక హోటల్ కి వెళ్ళామనుకోండి అక్కడ టేబుల్ మీద పెట్టే టిష్యూ పేపర్లూ, సోంపూ వగైరాలు బేగ్ లలో దోపేసేవారు కొందరు.
హోటల్ రూం లలో పెట్టే సబ్బులూ, పేస్టులూ, షాంపూలూ, బ్రష్షులూ రూమ్ ఖాళీ చేస్తూ చేస్తూ పనిలో పనిగా అవీ పడుంటాయిలే అని పడేసుకునేవారు మరికొందరూ.
ఉచితం అనేసరికి కొందరు ఉచితానుచితాలు కూడా మర్చిపోతూంటారు.
ఇరుగు పొరుగు ఇచ్చి పుచ్చుకునే వాటిలో స్వార్థం లేదనే చెప్పుకోవచ్చు. ఏమో! ఒకోసారి అదీ వాళ్ళ అవసరాలూ, పబ్బాలూ గడుపుకోవడానికి ఇలా ఏదో ఒకటి ఉచితముగా ఇచ్చేవారూ ఉన్నారు.
ఇప్పటి దాకా చెప్పుకున్నవి మనుషుల నుండో, షాపుల నుండో కదా!
మనమందరం కూడా ఉచితంగానే పొందుతున్నవి కొన్ని ఉన్నాయి.
మనందరి ఆరోగ్యం కోసం,
ప్రకృతి మనకి ప్రసాదించే గాలి, సూర్యనారాయణ స్వామి ఇచ్చే డి విటమిన్.
ఉచితంగా వస్తున్న వీటిని మనం తప్పకుండా స్వీకరించాలి. ఏసీ గదులలో కూరుకుని కూర్చుండిపోకుండా, ఉదయం, సాయంత్రం ఆరు బయటకి వచ్చి, ఉచితంగా వచ్చే చల్లటి చిరుగాలిని మనసారా ఆస్వాదిస్తూ, గుండెల నిండా పీల్చుకోగలిగితే మన ఆయుష్షు పెరుగుతుంది. అలాగే ప్రభాత సమయంలో సూర్యోదయపు తొలి కిరణాలు మన శరీరాన్ని స్పర్శిస్తే.. ఎటువంటి రోగాలూ దరి చేరవు. ఇవి కేవలం ఉచితం గానే మనకి దొరుకుతాయి. ఇప్పుడు వాటిని తీసుకోలేకపోతే, తర్వాత హాస్పిటల్‌లో చేరి, ఈ ఆక్సిజన్‌ని సిలిండర్లు, సిలిండర్లు డబ్బులు పెట్టి మరీ కొనుక్కోవాలి. అదీ హాయిగా పీల్చలేక, ముక్కులో గొట్టాలు పెట్టించుకుని మరీ పీల్చాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రకృతి ప్రసాదించిన ఉచితాలని తీసుకుందాం.
అయితే.. ఈ ఉచితాలని కూడా ఊరికే అనుభవించకుండా.. మనం ఉచితానుసారంగా తిరిగి ఇవ్వాలి కదా!
ప్రకృతిని పరిరక్షించాలి. మన తర్వాత తరాల వారు కూడా ఈ ఉచితాలని అనుభవించేలా.. పచ్చని మొక్కలు నాటాలి. మహా వృక్షాలు అయేలా చూడాలి. పచ్చదనం, పరిశుభ్రత పాటించాలి. ప్లాస్టిక్ నిర్మూలన చేసి.. ఓజోన్ పొరని కాపాడాలి.
ఇరుగు పొరుగులు ఉచితంగా ఇచ్చేవాటికే మనం తిరిగి వారికి ఏదో ఒకటి ఇవ్వాలి అనుకున్నపుడు.. మనకెంతో ఆరోగ్యాన్ని ఉచితంగా ఇస్తున్న ప్రకృతికి తిరిగి మనమేమీ ఇవ్వకపోతే.. ఏదో సినిమాలో చెప్పినట్లు ‘లావెక్కిపోతాం’ కదా!