కలవల కబుర్లు-26

0
2

[ప్రసిద్ధ రచయిత్రి కలవల గిరిజారాణి గారు అందిస్తున్న ఫీచర్ ‘కలవల కబుర్లు’.]

[dropcap]మా[/dropcap]మూలుగా, అప్పుడప్పుడు ఏ ఆయాసమో, గుండెదడో, బిపీ, సుగర్లు ఎక్కువ తక్కువ కావడాలు సహజమేగా! వాటికి ఒకోసారి మనకే కంగారు పుట్టొచ్చు, లేదా ఇంట్లో వాళ్ళు కంగారు పెట్టొచ్చు. తత్ఫలితంగా ఏదో జనరల్ చెకప్ కోసం డాక్టర్ దగ్గరికి వెడతాం.. కన్సల్టింగ్ ఫీజు వెయ్యీ ఇవ్వగానే..

ముందు చెయ్యి పట్టుకుని చూస్తారు. తర్వాత నాలుక, తర్వాత కళ్ళు, ఆ తర్వాత గాలి పీల్చు, వదులు.. ఇలాంటివీ.. ఆ తర్వాత బిపీ.. ఇత్యాదులు అయ్యాక.. రేపు సుగర్ టెస్టూ.. కొలెస్ట్రాల్ టెస్టు, అబ్డామిన్ స్కానింగూ, ఛెస్ట్ ఎక్స్‌రే గట్రా వగైరాలు చేయించుకుని రిపోర్టు పట్రండి అంటారు.

ఆ! ఆయనకి ఇలా అనడం మామూలేగా! అనుకుంటూనే వుంటాము. “ఎందుకైనా మంచిది చేయించుకుంటే, పోయిన వెయ్యి కాకుండా మరే ఐదువేలు వదులుతుంది అంతేగా! చేయించుకుంటే పోలా.. కొంపతీసి ఏ జబ్బైనా వుంటే ఈ పరీక్షలలో బయటపడుతుంది. ముందుగా జాగ్రత్తలు తీసుకోవచ్చు. మొన్న ఆ సుబ్బారావు గారికి ఇలా పరీక్షలలోనే ఏదో కాన్సర్ మొదటి స్టేజీలో వున్నట్లు తెలిసిందట..” అంటూ ఇంట్లో వాళ్లు ఊదరపెట్టడం మొదలవుతుంది.

వాళ్ళతో డాంభికంగా.. “ఆ.. గాడిదగుడ్డు కాదూ!!” అంటాం కానీ, లోలోపల భయం గుబులు గబులుగా స్టార్ట్ అవుతుంది.

మర్నాడు వెళ్లి, డాక్టర్ గారు చెప్పినవే కాక.. ఏదైనా పేకేజీలో ఏవేం టెస్టులు వుంటాయో అవన్నీ మొత్తం పొద్దున్నించీ.. సాయంత్రం అయేదాకా అక్కడే వుండి ఓ పెద్ద సంచీడు రిపోర్టులు మూట కట్టుకుని వస్తాము. సదరు డాక్టర్ గారి దగ్గరకు మర్నాడు ఈ సంచీ పట్టుకెళ్ళి చూపించగానే, మనకి అర్థం కాని భాషలో వున్న ఆ రిపోర్టులు పైనుండి కిందకి చదివేసి, “బిపీ నార్మలే వుంది. ఏమో ఇప్పుడు లేదని నిర్లక్ష్యం చేస్తే ఎప్పుడో అప్పుడు సడన్‌గా వచ్చేస్తుంది. ఉప్పు తగ్గించండి. సుగర్ లేదు కానీ వచ్చే సూచనలు కనపడుతున్నాయి. మీ వీధి చివరే కాసుకుని కూర్చుంది. ఎప్పుడైనా ఎంటరవుతుంది. సో.. స్వీట్లు మానేయండి.. కొలెస్ట్రాల్ కూడా మీ ఫాదర్‌కి వుందన్నారు కదా! మీరూ జాగ్రత్తగా వుండాలి.. హార్ట్ ప్రస్తుతం బాగానే వుంది. కానీ ఏ సమయంలో ఎటాక్ జరుగుతుందో తెలీదు కదా! లివరూ, కిడ్నీలూ ఓకే.. నో ట్రబుల్.. ప్రస్తుతం మెడిసిన్ అక్కర్లేదు కానీ.. ఓ అరడజను రకం మాత్రలు రాస్తున్నాను.. మూడు నెలలు వాడి మళ్లీ కనపడండి.. రోజూ వాకింగ్ చేయండి..” అని షేక్‌హాండ్ ఇచ్చి.. నెక్స్ట్ అని అరుస్తాడు.

ఇక ఇంటికి వచ్చాక డాక్టర్ గారు చెప్పినది నెమరు వేసుకుంటూ, ఆయన చెప్పిన తిండికి, మందులకీ, వాకింగ్ గట్రాలకి ఓ టైం టేబుల్ వేసుకుంటాం.. డైనింగ్ టేబుల్ పైన మాత్రలు అన్ని కనపడేటట్లు పెట్టుకుని టైమ్ ప్రకారం వేయడం మొదలెడతాం. తిండి కూడా డాక్టర్ చెప్పినట్లు.. ఆయిల్, ఉప్పు, కారం లేకుండా స్పెషల్ తిండి.. రాత్రిళ్ళు పుల్కాలు, ఓట్స్ వగైరాలు మొదలెడతాం. పొద్దున్నే లేవడం.. వాకింగ్‌లూ జాగింగ్‌లూ స్టార్ చేస్తాం.

అయితే.. ఇవన్నీ ఓ వారం పదిరోజులే.. ఆ తర్వాత తర్వాత..

ప్రస్తుతం ఏ జబ్బూ వుందని చెప్పలేదుగా! కంగారేం లేదు అనుకుంటాము. డాక్టర్ చెప్పినది మాత్రం కంటిన్యూ చేయడమనేది మాత్రం జరగదు. ఇంకో పది రోజులు పోయాక ఏడు గంటలకి లేవడం పూరీ కూరలూ, పెరట్టుప్మాలూ లాగించడం మొదలవుతుంది. మూడు నెలలకి తెచ్చుకున్న మాత్రలు.. డేట్ ఎక్సైపైరీ అవడం జరుగుతుంది కానీ వేసుకునేదే వుండదు.

మరీ పీకల మీదకి వచ్చినప్పుడే మనకి హడావుడిలూ, పరుగులు, డాక్టర్లు కొరకు వెతుకులాటలూ, గూగుల్‌లో జబ్బుల గురించి, వైద్యాల గురించీ, మందుల గురించీ.. సెర్చ్‌లూ మొదలవుతాయి.

ఎంతమంది ఔనంటారు?

మరెంత మంది కాదంటారు?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here