[ప్రసిద్ధ రచయిత్రి కలవల గిరిజారాణి గారు అందిస్తున్న ఫీచర్ ‘కలవల కబుర్లు’.]
[dropcap]తి[/dropcap]నడానికేమో మహా ఇష్టం..
చెయ్యడానికేమో మహా కష్టం..
ఇలాంటి వాటిలో మైసూర్ పాక్ మొదటిదైతే.. ఈ బొబ్బట్లు రెండో ప్లేస్‌కి వస్తాయి.
ముందు వేటి గురించి చెప్పుకుందాం?
బొబ్బట్లు వాటి కథా కమామీషు గురించి.. సరేనా?
అప్పటికీ పట్టు వదలని విక్రమార్కురాలి టైపు లోనూ.. ఆడ గజనీ మహమ్మద్ దండయాత్ర లలాగా చేస్తూనే ఉన్నా కానీ.. ఊహూ.. లాభం లేదు.
మా ఇంటి అనుభవజ్ఞులు.. మా ఆస్ధాన బొబ్బట్ల నారీమణులు.. వదినని, చెల్లిని సలహాలు కూడా అడిగాను.
“శనగపప్పు, బెల్లంతో అయితే సూపరూ! అలా కానిచ్చేసేయ్. నా మాట విను”.. అని వదిన అంది.
“సరేలే!! అలా చేసావనుకో, అరడజను డైజిన్ మాత్రలు కూడా మింగాలి. నేను చెప్పినట్టు విని పెసరపప్పు, పంచదారతో చేసెయ్ ఈసారికి” .. అని చెల్లీ..
(నేను ఏదో బోలెడు సార్లు చేసినట్టు.. ఈసారికి అట).. ..
కలలో కూడా కాన్ఫరెన్స్ కాల్ చేసి.. రెండు చెవుల్లోనూ వారి వారి రెసిపీలు ఊదరపెట్టేసినట్టు.. బొబ్బట్టోపదేశాలు చేసి పారేసారు.
వాళ్ళకేం వాళ్ళత్తగార్లు ఆస్తి వీలునామా రాసి ఇచ్చినట్టు.. బొబ్బట్లు చేయడంలో ట్రైనింగ్ ఇచ్చి పోయారు.. మా అత్తగారు అలాంటి వీలునామాలు ఏవీ రాయకుండానే పోయారు.. నా కోడలికి నాలాంటి పరిస్థితి రాకూడదని నా తాపత్రయం.. అందుకే ఈ ప్రయత్నాలు.
ఆ మధ్యన వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి సందర్భంగా చేసిన బూరెలు.. తనకి వీలునామా రాసేసాను.
గభాల్న అనిపించింది.. బూరెల పూర్ణం.. బొబ్బట్లు పూర్ణం సేమ్ టు సేమ్ కదా.. ఎటొచ్చీ తోపులే కదా మారేదీ.. అని ఓ గొప్ప ఐడియా తట్టి, పేద్ద తోపులాగా మొదలెట్టాను.
“పనిలో పని కొంచెం పూర్ణం పక్కన పెట్టి.. నేటి మిగిలిన బూరెల పూర్ణమే.. రేపటి బొబ్బట్స్ పూర్ణం.. అనే సిద్ధాంతం మేరకు.. రేపు బొబ్బట్లు మొదలెడితేనో”.. అని తనతో అనేసరికి..
“అవి మీకు చేయడం రాదుగా.” చటుక్కున అనేసి నాలిక కరుచుకుంది కోడలు.
ఓ సారి గుర్రుగా చూసి.. “చిన్నప్పుడు మా చిన్నత్త చేస్తోంటే నేనేగా సాయం చేసేదాన్ని.. గుర్తుందిలే.. పైగా శనగపప్పు బెల్లంతో సూపరని మా వదిన చెప్పిందిలే” అనేసాను.
“మరి ఈ బూరెల తోపుని ఓ తోపు తోసేయడమేనా?” అంది.
“ఎందుకూ? దాంతో దోసెలేసుకోవచ్చులే.. నీకు అల్లప్పచ్చడితో ఇష్టమేగా..” సర్ది చెప్పేసాను..
బూరెల పూర్ణం.. మర్నాడు బొబ్బట్లపూర్ణంగా రూపాంతరం చేయడానికి.. డబ్బాలో పెట్టి ఫ్రిజ్ లోకి తోసేసాను.
మర్నాడు పొద్దున్నే.. బొబ్బట్లు కోసం మైదాతో తోపు కలిపాను.. పెద్ద తోపులా.. ఆరు నూరైనా.. నూరు ఆరైనా చేయాలనే సంకల్ప బలం గొప్పగా ఉండేసరికి..
మొదలుపెట్టేసా.. పూర్ణం ఆరు ఉండలు అయ్యాయి.. అరిటాకుల మీద చేస్తారని తెలుసు.. అయినా ఆరు బొబ్బట్లకి అరిటాకులెందుకు.. అదో దండగ ఖర్చు.. ప్లాస్టిక్ కవరు మీద మొదలెట్టాను.. ఓం ప్రథమం మొదటిది కవరుకి అతుక్కొని ఊడి రాలేదు.. రెండోది చేతికి అతుక్కొని రానంది.. ముచ్చటగా మూడోది పెనానికి హత్తుకుపోయింది..
అప్పుడు.. నా కోడలు చూసిన చూపుకి నాకు అర్థం అయింది ఏమయిందంటే.. ‘ఇదేనా మీ బొబ్బట్స్ నేర్పరితనం’.. అని.. అనలేదుకానీ.. అన్నట్టే అనిపించేలా.. అనిపించింది.
“తోపులో పూర్ణం చుట్టి ఇమ్మనేది మా చిన్నత్త.. అంతవరకే తెలుసు.. ఇలా కవరు మీద వత్తడం నేర్పలేదు..” అన్నాను..
“ఓ.. అభిమన్యుడికి పద్మవ్యూహం లోకి వెళ్ళడమే తెలుసు.. బయటకి రావడం తెలీదంటారే.. అలాగన్నమాట” అంది.
మురిసి ముక్కలయాను తన తెలివితేటలకి.
చివరకి తోపులో దాగిన పూర్ణంతో.. కుస్తీ పాట్లు పడ్డాక.. ఆకారం దాల్చాయి.
బొబ్బట్లు కాదు కాదు దిబ్బట్లు.
చిన్నపిల్లలు పుల్ల ఐస్క్రీమ్ తింటోంటే మోచేతుల దాకా కారుతున్నట్లు.. తోపులో కలిపిన నూనె నా మోచేతి దాకా పాకుతోంటే..
“అంతా జిడ్డు మయం.. తనువంతా జిడ్డు మయం..” అని పాడుకునే రీతిలో..
స్టౌ.. గట్టు. . పెనం.. మొత్తం నూనె మయం..
ఔను.. చిన్నత్త ఇలాగే తోపు పిండిలో బాగా నూనె కలిపేది.. గుర్తుంది.
అక్కడ నుండి ఇక్కడ దాకా నూనె పాకుతూ వుండేది..
అంతవరకు బాగానే పాకించాను..
ఆ తర్వాతే..
దెబ్బలాడుకుని.. అటో మూలకీ.. ఇటో మూలకీ పోయి కూర్చున్న అత్త కోడళ్ళ లాగా..( మేం కాదు.. మేం కాదు)
తోపో పక్కకి.. పూర్ణమో పక్కకి.. పోయి..
వెరసి దిబ్బొట్లు.. రెడీ అయ్యాయన్నమాట.
అలాగే మరోసారి మైసూర్ పాక్ ప్రయోగం చేసాను. చేసిన తర్వాత వాటిని తినడానికి ఈ కింది సాధనాలూ, పనిముట్లూ అవసరమయాయనుకోండి..
🔪🔪🔪🔪🔪🔪🔪🔪🔪🔪🔪🔪
🔨🔨🔨🔨🔨🔨🔨🔨🔨🔨🔨🔨
ఒకప్పుడు మైసూర్ పాక్ చేసినప్పటి.. నా తీపి గుర్తులు.
మధ్యాహ్న కునికిపాట్లు అలవాటు లేదు..
ఆ టైమ్‌లో వచ్చే..
సీతమ్మవాకిళ్ళూ.. అత్తారిళ్ళూ.. ఆ దారి వైపు అసలెళ్ళనూ..
ఇకపోతే పుస్తకాలు ..
లేకపోతే ముఖపుస్తకాలూ..
కాకపోతే అవీ.. మొహం మొత్తుళ్ళే ఎక్కువ సేపైతే..
ఈ మధ్య.. అందరూ యూట్యూబ్‌లో వంటకాలు అంటున్నారు ఓ చూపేద్దాం.. అనుకుంటూ.. ఆ వేపు ఓ చూపు వేసి సెర్చ్ చేసి.. రీసెర్చ్‌లు కూడా చేసి.. ఓ నిర్ణయానికి వచ్చాను..
బానే ఉంటున్నాయి.. ఈజీగానే చెప్పేస్తున్నారు.. చేసెయొచ్చు..
ఎప్పుడూ వాళ్ళూ వీళ్ళూ చేసిపెడుతోంటే.. తినేసి వేళ్ళు నాక్కోవడమేకానీ.. ఇదెప్పుడూ సొంతంగా చేయలేదు కదా.. అనుకుంటూ
సరే అని ముందుగా మైసూర్ పాక్ మొదలెట్టా..
ఓ పది రెసిపీ లింక్‌లు చూసాక..
ఆ.. ఏముందీ..
శెనగపిండి ఎంతో నెయ్యి అంత.. నెయ్యెంతో పంచదార అంతే..
ఓసోస్.. ఇంతేనా అనుకుని.. మంచి ముహూర్తం చూసుకుని రంగం లోకి దూకేసా..
ముదిరి పాకానపడుతున్న పాకం.. పాక్ సరిహద్దులు దాటిపోతోందేమో అని తీరా మొదలెట్టాక డౌట్ వచ్చింది..
పాకంలో పిండి వేయాలా?
పిండిలో పాకం పొయ్యాలా?
పాకం పిండి.. నెయ్యిలో ముంచాలా? నెయ్యి ఎంత ఫారిన్ హీట్‌ల వేడిలో మరిగించాలీ?
ఇంతకీ నేను చూసినది..
హెబ్బార్ కిచెన్ లోనా?
సంజీవ్ కపూర్‌దా?
అభిరుచిలోనా? ..
వాహ్ చెఫ్ లోనా?
వరుసగా ఇన్ని చూసేసరికి.. ఎందులోది ఫాలో అయి.. మొదలెట్టానో గుర్తు రాలేదు..
మళ్లీ మొదలు.. ఆ యూట్యూబ్ లన్నీ తిరగతిప్పడంలో.. ఈ మైసూర్ పాక్ తిప్పడం మర్చిపోయాను..
చివరకి ఏదో దాంట్లో బుసబుసమని పొంగుతూ.. నెయ్యి బయటకి కక్కాక స్టౌ ఆపమని విన్నట్టు గుర్తు..
ఆ నెయ్యి కక్కుడు ఏమోకానీ బుసలు మాత్రం కొడుతోంది సదరు పాకం..
ఇక ఆపకపోతే బుసలెక్కువయి కాటు వేస్తుందేమో అనే అనుమానంతో.. ఆ పదార్ధాన్ని నెయ్యి రాసిన పళ్ళెం లోకి గుమ్మరించాను..
ఇలా చెయ్యమన్నది మాత్రం బాగా గుర్తుంది..
అయితే.. చల్లారాక వాళ్ళు చాకుతో కొయ్యమన్నారు కానీ.. నేను దాని పెద్దమ్మమ్మ సుత్తితో కొట్టాల్సివచ్చింది..
ఇక్కడో సామెత గుర్తు చేసుకున్నాను.. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి అని..
సినిమాల్లో పెద్ద పెద్ద బండలు పగలకొట్టి.. ఉఫ్ ఉఫ్ ఊదుకుంటూ ఎర్రబడ్డ అరచేతులు చూసుకునే హీరో గుర్తొచ్చాడు..
ఆ లెక్కన.. పగలకొడితే.. మైసూర్ పాక్ కాదు కానీ మైసూర్ పొడి తయారయింది..
ఊ.. బానే వుంది.. ఇది కూడా.. తియ్యగా.. కరకరలాడుతూ.. కరిగిపోతూ.. ఫర్వాలేదు నేనూ ఓ యూట్యూబ్ వంటకం తయారు చేయవచ్చు..
టైటిల్ కూడా.. మైసూర్ పొడి..
ఈ పొడిని ఒక్కసారి పొడిచేసారంటే.. మళ్లీ మళ్లీ పొడుస్తూనే వుంటారు.. అదే మైసూర్ పొడి..
ఇలాగే.. మైసూర్ పాక్ చేయబోయి.. మైసూర్ లడ్డూ.. మైసూర్ హల్వా.. మైసూర్ పాయసం.. ఇలా చేసి చేసి.. మైసూర్ పేరు మీదే వైరాగ్యం వచ్చింది.
ఈ వారానికి ఈ దిబ్బొట్లు.. మైసూర్ పొడి కబుర్లు చాల్లెండి.
Image Source: Internet