Site icon Sanchika

కలవల కబుర్లు-30

[ప్రసిద్ధ రచయిత్రి కలవల గిరిజారాణి గారు అందిస్తున్న ఫీచర్ ‘కలవల కబుర్లు’.]

[dropcap]క[/dropcap]రాగ్రే వసతే వాట్సాపూ
కరమధ్యే ఫేస్బుక్కూ
కరమూలే ఇన్‌స్టాగ్రామూ
ప్రభాతే మొబైల్దర్శనం

~

తూరుపు తెలతెలవారకనే
కనురెప్పలు తెరిచీ తెరవకనే
చూడాలమ్మా వాట్సాపు అచ్చట్లూ
చూసి తరించాలమ్మా ఫేస్బుక్కు ముచ్చట్లూ

~

తొంభై తొమ్మిది శాతం ఇలాగే ఉన్నారు కదూ!!

ఏమంటారు?

ఔనంటారా? కాదంటారా?

ఇలాంటి తొంభై తొమ్మిది శాతం మంది గురించి ఈరోజు చెప్పుకుందాం.

అయినా నిద్రపోతే కదా! తెల్లారింది అనుకోవాలి.

ఛాటింగుల టింగ్ టింగ్ మోతలలో నిద్ర ఎక్కడ నుంచి వస్తుంది?

వీళ్ళకి, పక్కమీద పక్కనే, ఫోను పెట్టుకుని పడుకోకపోతే ప్రపంచం తలకిందులైపోతుంది. ఛార్జింగ్ వైరూ, ప్లగ్గూ కూడా అతి సమీపంలోనే ఉండాలి. మళ్లీ అంత దూరంగా ఛార్జింగ్ పెట్టి వెళ్లి తెచ్చుకోవాలంటే ఒళ్ళు ఒంగదాయే మరి.

తెలతెలవారగానే భగవంతుని నామస్మరణ మాట ఏమో కానీ.. లేచీ లేవగానే.. ఎవరెవరు ఏం మెసేజులు పెట్టారో, చూడాలనే ఆత్రం ఎక్కువయిపోయింది. ఎలాగూ ఎవరో ఒకరు పంపే శుభోదయం కార్డుతో పాటు.. ఏ రోజుకి ఆ రోజు, ఏ లక్ష్మీదేవో, వెంకన్నబాబో, సాయిబాబానో మన ఫోను తెర మీద ప్రత్యక్షమవక మానరు కదా! ఆయా దేవతలను చూడగానే ఆ రోజు ఏం వారమో తెలిసిపోతుంది.

గబగబా ఆ దేవుడికో/దేవతకో మనసులో ఓ దండం పెట్టేసుకుని, ఆ రోజు డ్యూటీ లోకి దిగిపోవడమే దినచర్య వీళ్ళకి. పనిలోపనిగా ఆనాటి దినఫలాలు, తిథి, రాశి, నక్షత్రాలు కూడా వాట్సప్ లలోకి ఎగుమతి, దిగుమతులు అవుతూ వుంటాయి.

వెంటనే, ఆ శుభోదయాల దేవతలనో, ప్రకృతి సౌందర్యాలనో, మనం ఎప్పుడూ ఆచరించని సుభాషితాలనో.. మనకి వచ్చినవే తిరిగి వేరే వేరే వారికి, ఓ స్మైలీ ఇమేజీతో తోసేయడం మొట్టమొదటగా చేసేయాలి. అబ్బో.. అది సామాన్యమైన పని కాదు.. పంపిన వారికి తిరిగి అదే పంపకుండా.. మనకి పంపినవారికి థాంక్యూ చెపుతూ, వారి కోసం మరొకటి పంపుతూ.. సెలెక్ట్ చేసుకోవాలి. కొంతమంది, ‘లేచారా? కాపీలు తాగారా?’ అనే వారికి సమాధానాలు చెపుతూ మరీ పంపాలి. లేకపోతే అలిగి, మళ్లీ మెసేజ్లు పంపరేమో అని భయం.

ఈ శుభోదయాలు పంపకాలు పూర్తయ్యేసరికి మొదటి ఘట్టం ముగిసినట్లే.

ఇంట్లో కుటుంబ సభ్యులకు, ఏనాడూ, లేవగానే చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెప్పరు కానీ, ఊరందరికీ మాత్రం వాట్సాప్‌లో చెప్పి వస్తారు.

కాఫీ టిఫిన్ల ముందు కూర్చుని, వాటి రుచులని ఆస్వాదించకుండా, రకరకాల ఏంగిల్స్‌తో వాటి చేత ఫోజులు పెట్టించి, వాటితో పాటు తాము కూడా కనపడేలా, రకరకాల ఫోజులతో సెల్ఫీలు తీసుకుని,

‘మా పెసరట్టు.. అంటోంది నను తినిపెట్టు’,

‘ఓరోరీ! ఇదిగో మా పూరీ!’

అంటూ కాప్షన్ పెడుతూ.. వాట్సాప్‌లకీ, ఫేస్బుక్‌లకీ ఎగుమతి చేసాక, ‘ఆహా’ ఓహో’ ‘అద్భుతః’ వంటి ఓ నాలుగైదు లైకులు, కామెంట్లూ చూసుకున్నాక కానీ.. ఎదురుగా ప్లేటులో చప్పగా చల్లారిపోయిన పెసరట్టు గుర్తుకు రాదు.

అసలు ఈ వాట్సాప్‌లు రాకముందు, లేకముందు మనం ఎలా వుండేవాళ్ళమో కదా! అని అనిపిస్తుంటుంది.

కొంతమంది వుంటారు.. వాళ్ళకి వాట్సాప్‌లలో ఏ సమాచారం, ఏ వీడియో వచ్చినా.. సెకను కూడా ఆగలేరు. వెంటనే తమకున్న మిగతా గ్రూపులకి తోసేయడమే వీరి పని. వీళ్ళని ముద్దుగా తోపుడుగాళ్ళు అని అనుకుందాము. ఏదీ కూడా కడుపులో దాచుకోలేరు. వాటిని అందుకున్న వారిలో పాపం కొందరు అమాయకులుంటారు. ‘అబ్బ! ఎంత విలువైనది, పనికివచ్చేది పంపాడో.. వాడే కనుక్కున్నట్లు భావించి, ఎంతైనా వాడు భలే తోపుగాడు’ అని మెచ్చుకుంటారు కానీ.. నిజంగా తోపుడుగాడే అనుకోరు.

మరి కొంత మంది జీవిత ధ్యేయం.. కేవలం దేవుళ్ళ సమాచారాలే.. రకరకాల వాట్సాప్‌లలో తిరిగినవీ, తిరుగుతున్నవీ.. ఫలానా దేవాలయంలో విశేషాలూ, ఫలానా స్వామి గారి ప్రబోధాలూ, పూజలూ, అసలొకటి కాదులెండి.. ఏంటేంటో కొత్త కొత్త పూజా విధానాలు గుప్పించి.. వన్ వే రోడ్డులో పంపినవారు పంపినట్లుంటారు. అవి చదివినవారు అసలప్పటికే వాళ్ళు సందేహాలు పుట్టలు.. ఇవి చూసాక గుట్టలు గుట్టలుగా సందేహాలు పుట్టక మానవు. ఇన్నాళ్లు తాము చేసేది తప్పు కాబోలు.. ఇవన్నీ మంచివి కాబోలు.. మళ్లీ వీటన్నిటిలో అత్యుత్తమమైనది ఏది? అనే సవాలక్ష ప్రశ్నలు వస్తాయి.

మరోకోవకి చెందినవారు.. మన ఫేమిలీ గ్రూపుల్లోనో, రిటైర్మెంట్ తీసుకున్నవారి గ్రూప్ లలోనో, వుండే వుంటారు. రెక్కలు వచ్చి పిల్లలు తలో మూలకీ ఎగిరిపోయి వుండుంటారు. మరో వ్యాపకం వుండదేమో.. ఈ వాట్సాప్‌లలో.. ఎక్కడనుండో.. వృద్ధుల కథలో, వెతలో, సుభాషితాలో, పిల్లలు దూరాన వుంటే పెద్దలు పడే వ్యథలో, వృద్ధాశ్రమాల కబుర్లో, కొడుకులు కూతుళ్ళు తెలుసుకోవలసిన బుద్ధులో.. షేర్ చేస్తూ వుంటారు. ఇలా వాళ్ళని నేను తప్పు పట్టడం లేదు కానీ.. వారి పరిస్థితిని బట్టి అర్థం చేసుకోవాలి అంతేనేమో!

ఇలా అన్ని గ్రూపులకీ.. తోసేస్తూండే షేరింగ్ పోస్టులని బట్టి వాళ్ళు అర్థం అయిపోతూంటారు.

వచ్చే వారం మరి కొన్ని వాట్సప్ తోపుళ్ళ గురించి చెప్పుకుందాం.

Exit mobile version