Site icon Sanchika

కలవల కబుర్లు-31

[ప్రసిద్ధ రచయిత్రి కలవల గిరిజారాణి గారు అందిస్తున్న ఫీచర్ ‘కలవల కబుర్లు’.]

[dropcap]మ[/dropcap]నం బావుండాలి. మనతో పాటు పక్కవారు కూడా బావుండాలి

నిజమే కానీ.. ఎందరు ఇలా అనుకుంటున్నారండీ!

ఎంతసేపూ మనకే వుండాలి. మనమే బావుండాలి.

మనమే బాగుపడాలి.

పక్కవారిని తొక్కేయాలి. పైకి ఎదగనీకూడదు, బాగుపడనీకూడదు

తొంభై తొమ్మిది శాతం మంది ఇలాగే వుంటారు కదూ!

ఒకవేళ పక్కవాడు గొప్పగా ఎదిగినా, మెచ్చుకునే ధోరణి కానీ, అభినందించే గుణం కానీ ఏ కోశానా ఉండదు సుమీ!

పక్కవాడికి వున్నదాన్ని, మనకున్నదానితో పోల్చుకుని, మనదే గొప్పదని వాదించేవారు కూడా కోకొల్లలు.

“మీరు ఫలానా చోట అపార్ట్మెంట్ తీసుకున్నారట కదా! అసలక్కడ కొనమని మీకు సలహా ఇచ్చిందెవరండీ బాబూ! మరో పాతికేళ్లు తర్వాత కూడా అక్కడ రేట్లు ఏ మాత్రం పెరగవు. రెంట్లు కూడా రావు. నేనందుకే అటుపక్క అడుగు కూడా పెట్టలేదు. బాగా ఆలోచించి మీరు కొన్న చోట కాకుండా ఇదిగో ఇక్కడ మేము కొనుంటే మీకు ఐదేళ్ళకే, అమ్మారనుకోండి.. మూడింతలు లాభం వస్తుంది. అందుకే మేము ఇక్కడ ముందుచూపుతో రెండు ఫ్లాట్లు బుక్ చేసుకున్నాము.”. అచ్చం ఇలా కాకపోయినా ఇంచుమించు ఇలాగే మీతో కొందరైనా అనే వుంటారు కదూ?

“మేము లాభాల కోసం, కొన్నవాటిని అస్తమానం అమ్మడం కోసం కొనలేదు. ఆ ప్రాంతం నచ్చి కొన్నాము. ప్రశాంతంగా వుంటుంది, పొల్యూషన్ లేదు అందుకే కొనుక్కున్నాము.” అని కనక మీరు అన్నారే అనుకోండి.. ఎంత వింతగా చూస్తారో కదూ మిమ్మల్ని.

“మీ అబ్బాయికి అమెరికాలో ఉద్యోగం వచ్చిందని విన్నాను. అయినా అమెరికా వెళ్ళడం పెద్ద గొప్ప కాదు ఈ రోజుల్లో.. ఆ.. ఇప్పుడు ఇంటి కొకరు వెడుతూనే ఉన్నారు అమెరికా.” అని నిరుత్సాహపరిచేవారికి, “ఔనా! మరి మీ అబ్బాయి వెళ్ళినపుడు ఊరంతా ఎందుకు టముకు కొట్టి మరీ చెప్పారో?” అని అనలేం మనం.

గతంలో ఈ పెద్దమనిషే.. తన  కొడుక్కి వీసా రాగానే భారీ ఎత్తున పార్టీ చేసి.. ఈ ప్రపంచంలో తన కొడుకొక్కడే విమానం ఎక్కి విదేశాలకి వెడుతున్న ఘనుడనీ.. మిగిలిన వారి పిల్లలు ఎందుకూ కొరగానివాళ్ళన్నట్టూ స్పీచుల మీద స్పీచులు ఇచ్చేవాడు.

ఒకటి కాదు ప్రతీ దాంట్లోనూ ఇలా వ్యతిరేకత మాటలే, నెగటివ్ వైబ్రేషన్ వుంటుంది ఇలాంటి వారి చుట్టూనూ.

“మా అమ్మాయికి పెళ్లి కుదిరింది. ఫలానా వారబ్బాయి పెళ్లి కొడుకు” అని చెప్పారే అనుకోండి..

“సంబంధం కుదుర్చుకునే ముందు నాతో ఒక్కమాట చెప్పాల్సింది. ఇప్పుడైనా కొంప మునిగి పోలేదు. ఈ రోజుల్లో పీటల మీద పెళ్ళిళ్ళే ఆగిపోతున్నాయి.. అలాంటిది తాంబూలాలు తీసుకున్నాక కూడా నిర్ణయం మార్చుకోవచ్చు..” అనే అన్నారనుకోండి.. మన గుండె గుభిల్లమనక తప్పదు.

ఎందుకిలా అన్నారా? ఒకవేళ అబ్బాయికి దురలవాట్లు ఏవైనా ఉన్నాయా? లేదా ఉద్యోగం గురించి అబద్ధాలు కానీ చెప్పారా? అత్తగారేమైనా పరమగయ్యాళేమో.. ఇలా పలురకాలుగా మనం ఆలోచించి.. తీరా కనుక్కునేసరికి, అక్కడ వాళ్ళు తెలియచేసిన మేటర్ వింటే, నవ్వాలో, ఏడవాలో, లేదా వాళ్ళని నాలుగు పీకాలో అర్థం కాదు.

ఫలానా ఆ పెళ్లి కొడుకు వాళ్ళ తండ్రి అన్నదమ్ముల్లో ఎవరికీ కూడా మగ సంతానం లేదు.. అదే ఆనవాయితీ ప్రకారం.. ఇప్పుడు మీ అమ్మాయికి కూడా మగ నలుసు పుట్టకపోవచ్చు.. అని అంటే.. ఇక వాళ్ళని ఏమనాలో కూడా తెలీదు.

కానీ, అసలు సంగతి ఏంటంటే, ఆ ఇంటి సంబంధం వీళ్ళమ్మాయికి అనుకుంటే, ఏదో కారణాలతో కుదరలేదు.  ఇప్పుడు మరొకరికి ఆ అదృష్టం పట్టకూడదు అనే దుగ్ధ..

ఇలా వుంటూంటారు జనాలు. పక్కవారికి మంచి జరిగితే  చూడలేరు. చాలా మందికి ఈ అనుభవాలు ఎదురయే వుంటాయి. దాంతో తమ తమ ప్రోగ్రామ్‌లు కానీ, ప్రయాణాలు కానీ, తమ పిల్లలు ఉన్నతిని గూర్చి కానీ చెప్పకుండా సీక్రెట్‌గా దాచుకుంటున్నారు. చెప్పడం వలన ఎదుటివారు సంతోషంగా అభినందించడం మాని.. నెగెటివ్ వైబ్రేషన్ ఎక్కువ చేస్తారనే భయం.

మరి కొందరికి అనుకోకుండా వ్యాపారాల్లో నష్టమో లేదా మరో ఇబ్బందో మరోటో అయిందే అనుకోండి.. ‘అయ్యో పాపం’ అంటూ సానుభూతి చూపించడం మాని.. చేయూత ఇవ్వడం మాని.. పై ఎదురు నాలుగు రాళ్లు వేయడానికి సిద్ధంగా వుంటారు. “మేము ముందునించీ చెపుతూనే వున్నాము.. మామాట వింటేనా? అందుకే ఇలా అయింది. ఇప్పుడు ఏడ్చి లాభం ఏంటి? అనుభవించక తప్పదుగా!” ఇలా ఛాన్స్ వచ్చిందని చెలరేగిపోయే జనాలు మరికొందరు.

రకరకాల మనస్తత్వాలు.. ఎక్కువ మంది ఎదుటివారిని చూసి ఏడ్చేవారే.. ఏమంటారు?

Exit mobile version