కలవల కబుర్లు-34

1
2

[ప్రసిద్ధ రచయిత్రి కలవల గిరిజారాణి గారు అందిస్తున్న ఫీచర్ ‘కలవల కబుర్లు’.]

[dropcap]మొ[/dropcap]న్నామధ్య నా స్నేహితురాలు ఏదో ఫంక్షన్‌కి వెళ్ళడం కోసం, కట్టుకుందికి చీర తీసుకుందామని బీరువా తీసిందట. పై అర నుంచి కింద అర దాకా కుక్కి కుక్కి పెట్టి వున్న చీరల దొంతరలు. ఏది సెలెక్ట్ చేసుకోవాలో ఎంతసేపటికీ నిర్ణయం తీసుకోలేకపోయానని చెప్పింది. అరగంట పైనే ఆ బీరువా ముందు నిలబడిపోయిందట. మనలో మన మాట.. ఈ జబ్బు ఇంచుమించు ప్రతీ స్త్రీ లోనూ వుంటుందనే అనిపిస్తుంది.

ఉండడానికి బోలెడు చీరలు వుంటాయి. కానీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కడదామంటే మాత్రం ఏదీ వుండదు. ఏంటో ఓ పక్కన అస్తమానం కొంటున్నట్టే వుంటుంది.

అసలు కొత్త చీరలు కొనడానికి సందర్భం అంటూ వుంటుందా? మన పుట్టినరోజు, పెళ్ళి రోజు, పిల్లల పుట్టినరోజు, శ్రీవారి పుట్టినరోజు ఇవి కాకుండా, కిట్టీ పార్టీలో థీమ్ ప్రకారం ఏ రంగు కట్టమంటే ఆ రంగు కట్టాలాయే.. ఆ రంగు లేకపోతే కొత్తగా కొనాలాయే.. ఇక ఆ తర్వాత మనకి వుండే పండగలు, అసలు వచ్చే ముఖ్యమైన పండగలు కాకుండా, ఊ అంటే పండగ, ఆ అంటే పండగ, పక్కింట్లో షష్టిపూర్తి అయితే మనం కొత్త చీర, ఎదురింటానిడ కైలాసగౌరి నోము నోచుకుంటే మనం కొత్త చీర, వెనకింటావిడ మనవడు బోర్లాపడి పేరంటం చేసి, బొబ్బట్లు పంచుతూంటే మనం కొత్త చీర. ఇవే కాకుండా ఏం తోచకపోతే షాపింగ్‌కి వెళ్లి కొత్త చీర, స్నేహితురాలి చీరల సెలెక్షన్‌కి వెళ్లి మనం కూడా మరో చీర, ఆన్‌లైన్‌లో చీర.. ఇహ ఇలా చెప్పుకుపోతూంటే దీనికి అంతే లేదు లెండి. సమయం, సందర్భం లేకుండానే ఎగబడి చీరలు కొంటూంటే బీరువా నిండిపోక ఏమవుతుంది? ఇలా కొన్న చీరలు బీరువా నిండా బారులు తీరి వున్నప్పటికీ, మళ్లీ ఏదైనా ఫంక్షన్‌కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు.. ఏ చీర కట్టుకోవాలో అర్థం కాదు.

ఎందుకంటే.. మన ఆడ లేడీస్‌కి, కట్టిన చీర మళ్లీ కట్టాలంటే.. ఎంత బాధగా, వుంటుందో సాటి మహిళగా నేను అర్థం చేసుకోగలను. అప్పటికే ఆ చీర ఏదో సందర్భంలో కట్టేసి, ఫోటోలు తీయించేసుకుని, ఫేస్‌బుక్ లోనూ, వాట్సాప్ స్టేటస్ లోకీ ఎక్కేసి వుంటామాయే! మళ్లీ కట్టుకుంటే ఆ ఫోటోలు చూసినవారందరూ ఏమనుకుంటారు? పాపం ఈవిడ గారికి ఈ చీర తప్ప మరోటి లేదు కాబోలు, మళ్లీ మళ్లీ అదే కట్టుకుంటోంది.. అనుకుంటే, మన పరువేం కాను.

పైగా ఎప్పటికప్పుడు ఫేషన్లు మారిపోతూవుంటాయాయే! ఆ పాత రకాలే కట్టుకుంటే.. వాటిని చూసినవారు, ఈవిడింకా అప్డేట్ కాలేదని అంటే కనుక తలని ఎక్కడ పెట్టుకేవాలో అర్థం కాదు. చీరలు కొనడం ఒక ఎత్తు అయితే, వాటికి మోడల్ జాకెట్లు కుట్టించడం తడిసి మోపెడంత ఖర్చు. జాకెట్ నిండా ఐదువేల రూపాయల పైబడే వర్కులొకటీ! ఓ జాకెట్టు పూర్తయేసరికి పదివేలు పూర్తవాల్సిందే.

అలా ఓ పాతిక ముప్పై ఏళ్ల వెనక్కి వెళ్ళండి. అప్పుడు ఇన్నిన్ని చీరలు వుండేవా? ఉంటే గింటే ఓ రెండు పట్టుచీరలుండేవేమో! ఎన్ని పెళ్ళిళ్ళకయినా అవే చీరలు తిప్పి తిప్పి కట్టుకునేవారు. దాపుడు చీరలు, మంచి చీరలు కూడా వేళ్ళమీద లెక్కపెట్టేలా వుండేవి. వేసవిలో ఓ రెండు మూడు కాటన్ చీరలు తక్కువ రేటుకు కొనుక్కోవడం వాడుకోవడం వుండేదంతే.

ఏ చీరయినా కూడా తక్కువ ఖరీదుకే కొనేవారు. ఇంటిల్లిపాదికీ ఒకే బీరువా వుండేది.

ముఖ్యమైన పండుగలకో, ఏదైనా ప్రత్యేక సందర్భాలలో కానీ చీరలు కొనడమే కానీ.. పిడుక్కీ భిక్షానికీ కూడా కొనే ఆలోచనే వుండేది కాదు.

పాత రోజులతో పోల్చుకుంటే.. ఇప్పుడు ఎంతటి మార్పులు వచ్చేసాయో కదూ! ఇంచుమించుగా ఖరీదుకి కూడా వెనుకంజ వేయడం లేదు. ఎన్నెన్ని డబ్బులు ఇలా చీరలు కొనడంలో పెట్టుబడి పెట్టి బీరువాలలో మూలుగుతున్నాయో కదా అనిపిస్తుంది. ఓ పక్క కట్టుకుందికి సరైన బట్ట లేని బీదలెందరో రోడ్ల మీద కనపడుతూంటారు. ఒకటొకటీ దొంతర్లు పేర్చుకుని కూర్చోపోతే.. వారందరికీ పంచి పెడితే, పుణ్యానికి పుణ్యం, పాపం వారి అవసరాలూ తీర్చినవారిమవుతాము.

అందుకే నేను ఇక కట్టను, వద్దు అనుకున్న బట్టలు, మంచివే.. చీరలని, మనవలకి చిన్నవి అయిపోయిన చొక్కాలు, ఫేంట్లు సంచీలకి సర్ది వుంచుకువి కారులో పెట్టి వుంచేసుకుంటాను. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు నాలుగు రోడ్ల కూడలిలోనూ, సిగ్నల్ పడి కారు ఆగినప్పుడు, అక్కడ బిచ్చగాళ్ళకో, లేదా కారు అద్దాలు తుడిచి చేయి చాపే చిన్న చిన్న పిల్లలకో ఈ బట్టలు, దుప్పట్లు, పంచేస్తూ వుంటాను. ఇళ్ళల్లో పనివారికీ, తక్కువ ఆర్థిక వనరులతో నడపబడే అనాథ ఆశ్రమాలలోనూ, వృద్ధాశ్రమాలలోనూ ఇచ్చేయడమే. అవి వారందరూ కట్టదగినవి , మంచివి మాత్రమే ఇస్తే ఉపయోగపడతాయి.

కొంతమందికి పాపం.. ఇలా దానాలు చేయడానికి చేతులు రావు.

బీరువాలు సర్దినపుడు చూసుకుంటే ఈ చీర బావుందే, మరోసారి ఎప్పుడైనా కడదాము, ఈ డ్రెస్ ఇప్పుడంటే మనం కాస్త లావు అయి సరిపోవడం లేదు.. తర్వాత సన్నబడితే సరిపోతుంది అనుకుంటూ.. తీసేసినవి కూడా మళ్లీ లోపలకి తోస్తూ వుంటాము.

అలా అనుకోకుండా, నిష్కర్షగా గట్టి నిర్ణయం తీసేసుకోవాలి. ఒక సంవత్సరంగా కట్టనవి.. తిరిగి కట్టడం అనుమానమే.. వెంటనే వాటిని రెండే చేతిలోకి కూడా మార్చుకోకుండా అవసరమయిన వారికి ఇచ్చేయాలి.

అయినా మన జీవిత ప్రయాణంలో, మన స్టేషన్ ఎప్పుడు వస్తుందో, మన రైలు మనం ఎప్పుడు దిగిపోతామో తెలీదు. బరువులని, బంధాలని వదిలించేసుకుంటూ వుంటే మంచిదేగా!

ఏదో లెండి! అప్పుడప్పుడు ఇలా వేదాంత ధోరణిలో వచ్చేస్తూంటాయి కబుర్లు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here