Site icon Sanchika

కలవల కబుర్లు-38

[ప్రసిద్ధ రచయిత్రి కలవల గిరిజారాణి గారు అందిస్తున్న ఫీచర్ ‘కలవల కబుర్లు’.]

[dropcap]వ[/dropcap]స్తు వినియోగాలకి, ఆధునికతకి, సౌకర్యాలకి పూర్తిగా అలవాటు పడిపోయాము. అవి లేకపోతే జీవితమే లేదనే అభిప్రాయానికి వచ్చేసాము.

ఒకప్పుడు అసలు.. ఏవుండేవని? ఏవీ లేవు..

ఇదివరలో ఊళ్ళు వెళ్ళాలంటే సరైన రవాణా సదుపాయం వుండేది కాదు. రిజర్వేషన్‌లు చేయించుకుని వెళ్ళడం అసలే తెలీదు. దూర ప్రయాణం అయితే కనుక, బొగ్గుల రైలు బండెక్కి రెండు మూడు రోజులు పాటు వెళ్ళాల్సివచ్చేది. నాకు బాగా గుర్తు.. నా చిన్నతనంలో ఒకసారి మేము విజయవాడ నుంచి ఢిల్లీ వెళ్ళాము. మొత్తం ప్రయాణం మూడు పగళ్ళు రెండు రాత్రులు గడిచింది. దిగే సమయానికి మమ్మల్ని మేము చూసుకుంటే.. నల్లగా బొగ్గు మసితో.. భయంకరంగా తయారయాము. బట్టలు అన్నీ మురికి కొట్టుకుని, కళ్ళలో పడ్డ బొగ్గు నలకలు మంటలు పుడుతూ.. ఆ అనుభవం ఇప్పటికీ గుర్తే. ఒకేసారి రైల్లో సీట్లు లేక, కిందనే బెడ్డింగులు పరుచుకుని పడుకుని ప్రయాణం చేసేవాళ్ళం. ఆర్.టీ.సీ బస్సులు, ప్రవేట్ బస్సులలో సీట్ల కోసం పరుగు తీస్తూ, కిటికీలలో నుంచి దూరిపోయి సీట్ల కోసం సిగపట్లు పడుతూ ఎలా వెళ్ళేవాళ్ళమో కదా అనిపిస్తుంది.

ఇప్పుడు ఎక్కడికక్కడ ప్రయాణం సుఖవంతమై పోయింది. ఏసీ బస్సులు, రైళ్లు.. విమాన ప్రయాణం కూడా ఇంచుమించు అందుబాటులోకి వచ్చేసింది. సప్త సముద్రాలు కూడా ఒక రోజులో దాటి వెళ్ళి పోగలుగుతున్నాము.

రోజులు మారుతున్నకొలదీ మన అలవాట్లు, సదుపాయాలు సమస్తం మారిపోతున్నాయి.

అలాగే అప్పటి ఆప్యాయతలు కూడా కనుమరుగైపోతున్నాయి.

ఈ అపార్ట్‌మెంట్ జీవితాలలో పలకరింపులే మృగ్యమయిపోతున్నాయి.

ఇదే ఆలోచిస్తోంటే నా చిన్నతనం గుర్తొచ్చింది. ప్రతీ ఏటా వేసవి సెలనలలో మా మామయ్య గారింటికి వెళ్ళేవాళ్ళం.

అప్పుడు మమ్మల్ని పికప్ చేసుకుందికి కాకినాడ రైల్వే స్టేషన్‌కి ఎద్దుల బండి పంపేవారు. బండిలో వత్తుగా గడ్డి వేసి, పైన జంపఖానా పరచి పంపేవారు. దానిలో మా మామయ్య గారి ఊరు చేరేవారం.. ఊళ్లోకి ప్రవేశించడానికి ముందు చిన్న కాలువ వుండేది. వంతెన లేదు.. నడిచివెళ్ళేవారికి తాటివంతెనె వుండేది. బాలెన్స్ చేసుకుంటూ నడవాలి. ఎద్దుల బండిని కాలవలోనుంచే పోనిచ్చేవాడు బండబ్బాయి. వంగుని నీళ్లు అందుకుంటూంటే భలే సరదాగా వుండేది. ఊళ్లోకి బండి ప్రవేశించగానే.. అరుగుల మీద కూర్చుని ముచ్చట్లు చెప్పుకునే.. అందరూ పలకరించేవారు.. “ఇదేనాండీ రావడం? బావున్నారాండీ?” అనే పలకరింపులు దాటుకుంటూ.. ఇంటి దగ్గరకి చేరేవాళ్ళం. బయట అరుగు మీద బకెట్‌తో నీళ్లు వుండేవి కాళ్లు కడుక్కుని లోపలకి వెళ్ళేవాళ్ళం.

“రండి.. రండి ప్రయాణం బాగా సాగిందా?” అనే కుశలప్రశ్నలు, కాఫీలు అయ్యాక.. పెరట్లో.. బావి దగ్గర కట్టెలపొయ్యి మీద రాగిడెగిసాలో వేణ్ణీళ్లు.. బక్కెట్లో పోసుకుని.. అందులో తొరుపుకోడానికి చన్నీళ్లు బావిలోనుండి తోడుకునేవాళ్ళం. తడికెలగదే స్నానాలకి. కరెంటు లేనే లేదసలు. సాయంత్రం.. లాంతర్లు బూడిదతో శుభ్రం చేసుకుని, వెలుతురు వుండగానే భోజనాలు చేసేసేవాళ్ళం. సైజులు వారీగా కంచాలు.. వరసగా పెట్టుకుని.. అరటికాయ వేపుడు ముక్కలు, ఆవకాయ, చారు, పెరుగుబిళ్ళ.. నంచుకుందుకి మామిడి పండు.. ఆ ఆవకాయపెచ్చు కడిగేసుకుని.. తర్వాత కబుర్లు చెప్పుకుంటూ పడుకునేటపుడు తినేవాళ్ళం. ఆరుబయట మడత మంచాలు వేసుకుని కబుర్లు చెప్పుకుంటూ పెద్దవాళ్లు.. కిందన బొంతలో, పరుపులో వేసుకుని పిల్లలూ.. ఆకాశంలో నక్షత్రాలు లెక్కపెట్టుకుంటూ.. ఒంటికన్ను రాక్షసుడు.. రాజకుమారి కథలో లేకపోతే.. ఏ అమ్మమ్మో, బామ్మో చెప్పే రామాయణ, భారత భాగవత కధలో వింటూ హాయిగా పడుకునేవాళ్ళం. పక్కన కూజాలో చల్లటినీళ్ళుండేవి మధ్యలో తాగడానికి. ప్రతి పక్క పక్కన.. తాటాకు విసినకర్రలుండేవి. పొద్దున్నే పళ్ళు తోముకోవడానికి పందుంపుల్లలూ.. పొయ్యిలో కచికా వుండేవి..

ప్రపంచం ఆధునీకరణలో ఇవన్నీ.. కనుమరుగైపోయి జ్ఞాపకాల రూపంలో మిగిలిపోయాయి. అసలు కరెంటు లేని ఊరు ఇప్పుడు అసలు ఊహించగలమా? అదే ఇప్పటి రోజుల్లో అయితే.. ప్రయాణం చేసి బయటకి రాగానే.. కార్లు.. ఇంట్లో అన్నీ స్విచ్చిలతోనే పనులయిపోతున్నాయి.. గీజర్లూ, ఏసీలూ, ఫ్రిజ్‌లూ, ఒకటేమిటి సమస్తం వస్తువుల మీదనే ఆధారపడిపోయాము. ఎక్కడా శారీరక శ్రమే లేదు. మీటల నొక్కి చేసిన వంట.. తిన్నగా టేబుల్ మీదకి వచ్చేస్తోంది. కుర్చీలో కూర్చుని.. కేవలం చెయ్యి.. కంచంలో నుంచి నోటి దాకా వెళ్ళడానికి మాత్రమే మన శ్రమ వుపయోగిస్తున్నామేమో.. తర్వాత చెయ్యి కడగడానికి లేవకుండా.. ఫింగర్ బౌల్సే టేబుల్ దగ్గరకి వస్తున్నాయి. అది కాకపోతే.. కుళాయి కింద చేయిపెట్టగానే ఆటోమేటిక్‌గా నీళ్లు వచ్చేస్తాయి.. కుళాయి తిప్పే పని కూడా వుండడం లేదు. అడుగడుగునా సౌకర్యాలు, సౌఖ్యాలూ.. కష్టపడే పనేలేదు.

మొన్న ఆమధ్య అదే మా మేనమామ గారి ఊరు వెళ్లి నపుడు ప్రతీ ఇంటా ఈ ఆధునిక వస్తువులన్నీ చోటు చేసుకోవడం గమనించాను. ఎంతో అభివృద్ధి సాధించి ఎంతో ముందుకి వెడుతున్నాము కానీ అప్పటి ఆ అనుభూతులూ.. ఆ ఆనందాలూ.. ఏవీ? ఆ ఆప్యాయతలూ.. ఆ అనురాగాలూ ఏవీ? వస్తువులు ముందుకు వచ్చి వాటినన్నిటినీ వెనక్కి తోసేసాయేమో..

Exit mobile version