Site icon Sanchika

కలవల కబుర్లు-39

[ప్రసిద్ధ రచయిత్రి కలవల గిరిజారాణి గారు అందిస్తున్న ఫీచర్ ‘కలవల కబుర్లు’.]

[dropcap]‘నా[/dropcap] మతిమరపు మండా, ఎప్పుడూ ఇక్కడే గా పెడతానూ! ఎలా మాయమయిందబ్బా?’

“ఇదిగో.. ఈ కిటికీ గట్టు మీద కుక్కర్ విజిల్ పెడుతూంటాను. ఎవరైనా చూసారా?”  నా పిచ్చి కానీ..  వంటింట్లోకి వీళ్లు ఎప్పుడైనా అడుగు పెడితే కదూ.. చూడడానికి.. అస్తమానం ఆ ఫోన్ లలోనూ, టీవీలోనూ మునిగిపోయుండే ఈ శాల్తీలకి కుక్కర్ కూతలే వినపడవు.. ఇక ఆ విజిల్ ఎక్కడుందో, ఎలా ఉంటుందో తెలిసేడిస్తేగా! నేనే వెతుక్కుని చావాలి. ఈ పనిమనిషి అంట్లు తోముతూ తోముతూ, చెత్తతో పాట డస్ట్ బిన్‌లో కానీ పడెయ్యలేదుకదా?  ఇది అలాంటి రకమే.. తొరతొరగా పని కానిచ్చుకునిపోవాలని హడావుడిగా చేసి చేస్తుంది.

నాకా చేసుకునే ఓపిక, తీరిక లేదని దీన్ని పట్టుకుని వేలాడుతున్నాను.  అడుగంటిన పాలగిన్నెలు, జిడ్డు వదలని బూర్లెమూకుడులు.. మళ్లీ తోముకోవలసిందే. మానిపిద్దామంటే మరోత్తి దొరికిన చావదుగా!

ముందు ఈ కుక్కర్ విజిల్ ఎక్కడ చచ్చిందో.. కుక్కర్ లోనుండి ఆవిరి బయటకి వచ్చేస్తోంది. ఇలా అయితే ఆ పప్పు ఉడికి చావదు. సమయానికి , సాయానికి ఒక్కరు రారు కానీ సవాలక్ష వంకలు మాత్రం పెడతారు.

అయినా ఇంత మతిమరపు వచ్చిందేంటబ్బా! నిన్నటికి నిన్న చారులో పెట్టాల్సి పోపు పక్కనే కాఫీ గిన్నె ఉంటే దాంట్లో పెట్టేసాను. మొన్నేమో గోంగూర పచ్చడి అనుకుని గోరింటాకుని కంచంలో వడ్డించపోయాను. ముసలివాళ్ళకి వృద్ధాప్యంతో పాటు మతిమరపు వస్తుటారు.. మరి నాకు మొన్ననేగా అరవై వచ్చిందీ.. అప్పుడే ఈ మతిమరపేంటో..

సరేకానీ.. ఈ విజిల్ ఎక్కడుందిరా బాబూ! ఇంతలా విసిగిస్తోంది. ఈ కింద గూట్లో ఉందేమో వెతుకుతాను.. ‘అరే! ఇక్కడ దొరికిందే..’ గట్టిగా విజిల్ వేసాను.  ఏంటి? దొరికిందనుకుంటున్నారా? లేదు దొరకలేదు.. కుక్కర్ విజిల్ దొరకలేదు కానీ..  పది రోజుల కితం కనపడకుండా పోయిన నెయ్యి గిన్నె దొరికింది.. విజిల్ కోసం వెతికితే ఇది కనపడింది. ఇంకేం పురాతన వస్తువులు బయటపడతాయో.. కానీ విజిల్ మాత్రం దొరకడం లేదు. ఇదిగో ఎర్రప్లాస్టిక్ డబ్బామూత ఇక్కడ ఉందా?  ఆ డబ్బాలో పక్కింటి సుందరికి పప్పు చక్కలు పెట్టి ఇచ్చి ఆరునెలలయింది. ఇంతవరకూ ఆ డబ్బా తిరిగి ఇవ్వలేదు. అప్పటికీ రెండు మూడుసార్లు గుర్తు చేసాను. ‘ఉట్టి డబ్బా ఎలా ఇమ్మంటావక్కయ్యా? ఏదైనా పెట్టిద్దామని ఉంచా’ అంటుంది. అయినా అదేం చెయ్యనూ చెయ్యదు.. డబ్బా ఇవ్వనూ ఇవ్వదు. దానికి ఇలా మా డబ్బాలు, ప్లేట్లు హస్తగతం చేసుకోవడం అలవాటేగా! ఈ మూత కూడా దానికే ఇచ్చేస్తాను. డబ్బాతో పాటు ఉంచుకోమని. అక్కయ్యా!.. అట అక్కయ్యా! దాని దుంపతెగ.. నాకంటే నాలుగేళ్ళు పెద్దది.. నన్ను అక్కయ్యా అంటుంది చెక్క మొహం అదీనూ..

సుందరి సంగతికేంవచ్చె కానీ.. విజిల్ ఏమయింది రా బాబూ! ఛస్తున్నాను.

ప్రతి ఇంట్లోనూ, ప్రతీ ఇల్లాలికీ వుండే సమస్యే ఇది. హడావుడే కావొచ్చు, కంగారే కావొచ్చు, మతిమరుపే కావొచ్చు..

పెట్టిన వస్తువు పెట్టిన చోట వుండదు. హడావిడిలో ఒకదాని బదులు మరోటి చేసేయడం.. తర్వాత కిందా మీదా పడడం.

మొన్నామధ్య మర్నాటి టిఫిన్‌కి  ఇడ్లీరవ్వ నానేయబోయి బొంబాయి రవ్వ నానేసాను. తర్వాత నెత్తీనోరూ మొత్తికుని ఏం లాభం లెండి.

సరిగ్గా అప్పుడే తెలిసింది ఇలాంటి అవకతవక పనులు చేసినప్పుడు ఫేస్‌బుక్‌లో ఇలా చేసేసాము.. దీనికి విరుగుడు ఏంటీ అని అడిగాం అనుకోండి.. మనలాంటి వాళ్ళేగా అందరూనూ.. పోటీలు పడి సలహాలూ సూచనలు చిట్కాలు ఇచ్చేస్తారు. బొంబాయి రవ్వ ఇడ్లీ, ఊతప్పం, గుంతపొంగణాలు ఇలా చేసేసుకోండి అంటూ చెప్పేసరికి.. నందికేశుని నోము చెల్లించినట్లు.. నానపెట్టిన బొంబాయి రవ్వని ఎలాగోలా చెల్లించేసాననుకోండి.

అలాగే ఈ మతిమరుపుకి కూడా ఏదైనా చిట్కాలు వున్నాయేమో అడగాలి. ఇదివరకటి రోజుల్లో అందరివీ లాండ్‌లైన్ ఫోనులే వుండేవి. మా వాళ్ళందరివీ, స్నేహితులవీ, మా అబ్బాయి హాస్టల్ వార్డెన్ నెంబర్‌తో సహా నాలుక మీద ఆడేవి. మరి ఇప్పుడు సెల్ ఫోన్ నెంబర్లు బారెడు వుంటున్నాయాయే.. ఎంతకని, ఎవరివని గుర్తు పెట్టుకోవాలి. నిజం చెప్పాలంటే నా నెంబరే నాకు గుర్తు లేదు. ఏంటో ఎన్ని సార్లు వల్లె వేసినా గుర్తుండి చావదు. ఏ షాపులో అయినా బిల్లు కౌంటర్ దగ్గర ఫోను నెంబరు అడగడం, నేను తెల్లమొహం వేయడం. తప్పించుకోలేక వాళ్ళ నెంబర్ అడిగి, ఆ నెంబర్‌కి నేను చేసి.. ఇప్పుడు నా నెంబర్ కనపడుతోంది కదా.. నోట్ చేసుకోమని చెపుతూ వుంటాను. చెప్పుకుంటే మీరు నవ్వుతారు కూడా.

ఏంటో కుక్కర్ విజిల్‌తో మొదలుపెట్టి,ఫోను నెంబర్ల దగ్గరకి వెళ్ళిపోయాను. చెప్పాను కదా మతిమరపని.. ఏదో చెబుదామనుకుని ఇంకేదో చెపుతాను.  ఈరోజుకి ఈ కబుర్లు చాల్లెండి.. మళ్లీ వారం వస్తాగా! అప్పుడు మరి కాసిని తెస్తా!

Exit mobile version