కలవల కబుర్లు-40

0
2

[ప్రసిద్ధ రచయిత్రి కలవల గిరిజారాణి గారు అందిస్తున్న ఫీచర్ ‘కలవల కబుర్లు’.]

[dropcap]“అ[/dropcap]మ్మా ఏంటిదీ, పాలలో ఏ పౌడర్ కలిపావూ?” పెద్ద పిల్లాడు చిందులతో కూడిన కేకలు.

“కాంప్లాన్ కలిపానురా! దీనికే ఎందుకలా అరుస్తావూ?”

“ఎన్నిసార్లు చెప్పాలి నీకు, ఐయామ్ నాట్ ఎ కాంప్లాన్ బోయ్. తమ్ముడు కదా రోజూ కాంప్లాన్ తాగేదీ.. ఇది నాకు ఇష్టం లేదు. బూస్ట్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. వాడు తాగేది నాకు కలుపుతావు.. నేను తాగేది వాడికి కలుపుతావు. ఇది తీసేసి నాకు బూస్ట్ కలుపు.” ఆర్డర్లు జారీ చేయడంలో వీడిని మించినవాడు లేడు.

ముందు గదిలో కూర్చుని ఇవన్నీ వింటున్న ఆ ఇంటి, అమ్మమ్మ, బామ్మల ఆలోచనలు వెంటనే, వెనక్కి వెనక్కి తమ చిన్నతనంలోకి వెళ్ళిపోతూంటాయి కదూ!

మా కాలంలో ఇట్టాంటివి ఎరగవమ్మా! మా ఇంట్లో పదిమంది సంతానం. ఏది పెడితే అది నోరు మూసుకుని తినేవాళ్ళం. మాకో ఛాయిస్సూ గట్లాంటివేం వుండేవి కావు. పొద్దున్నే బూస్టులూ, హార్లిక్సులూ ఎక్కడుండి ఏడిసాయీ? ఏదో పెద్దాళ్ళ వరకూ, ఏ పూటకాపూట గిన్నెలో డికాషిను వేసుకుని, కాఫీ నీళ్ళు తాగేవాళ్ళు. అదీ లేకపోతే అందరికీ తరవాణీయేగా. మళ్లీ మధ్యాహ్నం వరకూ కడుపులో చల్లగా పడుండేది.

ఇప్పుడో.. చేసిన టిఫిను చేయకుండా రకరకాలు వచ్చేసాయి. అదీ చేయడం బద్ధకమైతే.. ఆ ఫోనులో ఏదో టిక్కు టిక్కు నొక్కడం.. ఐదు నిమిషాల్లో ఆ సిగ్గీ కుర్రాడు పేకెట్లు తీసుకుని బర్రుమంటూ బెల్లు నొక్కడం.. ఇట్టే అయిపోతోంది. వేడివేడిగా ఇంట్లో చేసుకోడం కూడా అపురూపమైపోతోంది. ఆ బయట తిండి, ఎప్పుడు చేసుంటాడో ఏంటో.. చల్లగా చద్దిది చక్కగా అట్టపెట్టెలో పేక్ చేసి పంపుతాడు. వీళ్ళేమో దాన్ని ఆ ఓవెన్‌లో పెట్టి వేడి చేసుకుని తిన్నంత తినడం, మిగిలింది మర్నాటి కోసం చల్లబీరువాలో దాచుకోవడం.

ఏంటోనమ్మా! ఇవన్నీ మాకైతే తెలీవు.

ఏదైనా పండగ వస్తే , అరిసెలూ, కజ్జికాయలు, లడ్డూలూ, కొబ్బరి బూరెలూ, గవ్వలూ, కరకజ్జం.. ఒకటా రెండా ఎన్ని చేసుకునేవాళ్ళమో.. ఇరుగమ్మ పొరుగమ్మ కూడా వచ్చి తలో చెయ్యి సాయం చేసేవాళ్ళు. కష్టం సుఖం అన్నీ పంచుకునేవాళ్ళం. అప్పట్లో ఇరుగు పొరుగులు కూడా మన కుటుంబ సభ్యులలాగానే వుండేవారు. ఇప్పుడు కుటుంబ సభ్యులే పరాయి వాళ్ళయిపోతున్నారు.

ఈ రోజుల్లో ప్రతీ ఇంటా లింగూ లిటుకూ మంటూ ఉండేది ఇద్దరూ.. ఆ ఇద్దరికి ఇద్దరు పిల్లలు వుంటున్నారు. వుండే ఆ ఇద్దరివీ చెరో టేస్టూ. ఒకడికి బూస్టూ మరోడికి కాంప్లానూ. ఒకడికి ఆలూ ఫ్రై, మరొకడికి బెండీ ఫ్రై. ఒకడికి దోసకాయ పప్పు, మరొకడికి టమోటో పప్పు. ఇది చేస్తే వాడికి కోపం, అది చేస్తే వీడికి కోపం. బానే సాగుతున్నాయి ఆటలు. ఈ తప్పు గారాబం చేసే అమ్మమ్మా, బామ్మలదో, అడిగింది కాదనకుండా కొనిచ్చే అమ్మానాన్నలదో తెలీడం లేదు. ఇంతున్నారో లేదో బ్రాండెడ్ సరుకులు తప్ప మరోటి వాడరు. కాలికి వేసుకునే బూటు నుంచి నెత్తిన పెట్టుకునే హేటు వరకూ కంపెనీ బ్రాండ్ పేరు కనపడుతూ వుండాలి. ఆ చెప్పులే ఒకొక్కరికీ అరడజను పైన జతలు. ఆటలకోటీ, బడికోటీ, బజారుకోటీ, ఊళ్ళు వెళ్ళడానికి మరోరకం, మళ్లీ ఆ ఆటల్లోనే ఆటకో రకం.. ఇలా మేమెప్పుడూ ఎరగమమ్మా!

మా చిన్నతనంలో మాకు ఒకటే జత చెప్పులు వుండేవి. అదీ హవాయి జోళ్ళే. బడికైనా, బజారుకైనా, ఎక్కడికెళ్ళినా అవే జోళ్ళు. అరిగి అరిగి ఆల్చిప్పలయేదాకా అవే పట్టుకుని ఈడుస్తూ వుండేవాళ్ళం. తెగితే, పిన్నీసు పెట్టుకోవడమో..అదీ కుదరకపోతే, అవే చెప్పులకి కొత్త స్ట్రాప్స్ వేయించడమో చేసికునేవాళ్ళం. ఇప్పుడు అయితే ఏ ఇంట్లో చూసినా చెప్పుల స్టాండులు నిండిపోయి ఇంకా కుప్పలు కుప్పలు దొర్లుతూ వుంటున్నాయి.

పిల్లలకి ఇలా ఒక్కొక్కరికి ఒకో రకమైనవి చేసి పెట్టడం ఏ ఇంటా వుండేది కాదు. పొద్దున్నే చద్దన్నాలు తినేసి బడికి పంపేయడమే. మా ఇళ్ళల్లో కనీసం నలుగురైదుగురు పిల్లలైనా వుండేవారు. ఇంకా చెప్పాలంటే పది, పన్నెండు మంది పిల్లలని కన్న తల్లులు కూడా వుండేవారు. ఎలా పెంచారో, ఎలా పెరిగామో ఇప్పుడు తలుచుకుంటూంటేనే ఆశ్చర్యంగా వుంటుంది. ఏ పిల్లాడి పట్లా ప్రత్యేక శ్రద్ధ అనేది వుండేది కాదు. ఒకరకంగా చెప్పాలంటే వాళ్ళకి వాళ్ళే పెరిగిపోయేవారు. పెద్దాడికి కొన్న బట్టలు కానీ, పుస్తకాలు కానీ, అలా తర్వాత వాళ్ళకి అందుతూ వుండేవి. ఇది అన్నయ్య వేసుకున్న చొక్కా, ఇది అక్కయ్య వాడేసిన ఓణీ అనేవారు కాదు. ఇచ్చింది కిమ్మనకుండా వేసుకునేవారు.

ఇప్పుడో మరి.. ఇలా పెదపిల్లాడికి వాడినవి చిన్నాడిని వేసుకోమంటే వాడికి ఎంత నామోషీనో! చచ్చినా ఒప్పుకోడు. అలాగే చిన్న క్లాసుల చదువులకి కూడా ఇప్పుడు లక్షలు లక్షలు పోస్తున్నారు. అవేం చదువులో ఏంటో అర్థం కావడం లేదు.

‘ఇదేంట్రా అబ్బాయీ! మరీ ఇంత అన్యాయం ఏంటిరా? నీకు ఇంజనీరింగ్ నాలుగేళ్ళకీ కలిపి లక్ష రూపాయలు కూడా అవలేదు. నీ కొడుకు రెండో క్లాసుకు రెండు లక్షలా?’ అని అంటే చాలు…

‘అబ్బబ్బా! మళ్లీ మొదలెట్టావా? ఆ రోజులని, ఈ రోజులతో ముడి పెట్టకమ్మా! మారుతున్న కాలంతో పాటు మనమూ మారాలి తప్పదు.’ అంటాడు ఆ కొడుకు.

ప్చ్.. ఏంటో కాలం మారిపోయింది. మరి మేమే ఎందుకింకా ఆ పాత కాలాన్ని పట్టుకుని వేలాడుతున్నామో అర్థం లేదు.

కానీ.. అవన్నీ ఇప్పుడు జరగకపోయినా ఇలా తలుచుకుంటున్నా చాలు.. సంతృప్తిగా వుంటుంది. ఇక మా తర్వాత ఎవరికి తెలుస్తాయిలే ఇవి. మా జ్ఞాపకాలు మాతోనే కరిగిపోతాయి.

ఇలా చెప్పుకుంటూ వెళితే.. ఈ కబుర్లకు ఇక అంతు అనేది వుండదు లెండి. వచ్చే వారం ఇంకేమైనా చెప్పుకుందాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here