[ప్రసిద్ధ రచయిత్రి కలవల గిరిజారాణి గారు అందిస్తున్న ఫీచర్ ‘కలవల కబుర్లు’.]
[dropcap]ఊ[/dropcap]రికే ఇచ్చేవేగా ఉచిత సలహాలూ.. పైసా ఖర్చు వుండదాయే.. తెలిసివదో, తెలీనిదో.. అడిగినా, అడక్కపోయినా చెప్పడం చాలా మందికి అలవాటే..
పర్ సపోజ్ మవం ఏదో మాటల సందర్భంలో మోకాళ్ళ నొప్పి అనే చెప్పామనుకోండి.. సదరు సలహాదారుడు (దారులారు) వరస పెట్టి చెప్పే సలహాలుంటాయి చూడండీ.. ఏ డాక్టరూ కూడా చెప్పడు. వాటిలో నిజాలు కూడా కొన్ని వుంటాయనుకోండి. పోనీ వాళ్ళేమైనా పాటించి, వాటి ఫలితాలను పొంది వుంటే, చెప్పారనడంలో ఒక అర్థం వుంటుంది. పూర్తిగా తెలీకుండానే, అక్కడా ఇక్కడా విన్నవీ, ఎక్కడెక్కడో చదివినవీ, యూట్యూబ్ సమాచారం, ఇలా అన్నీ కలిపి మనకి నెత్తికి ఎక్కించేస్తారు.
“ఇదిగో పొద్దున్నే పారిజాతం ఆకుల కషాయం గ్లాసుడు తాగు. మా ఆడపడుచు ఇలాగే తాగితే.. అదేనోయి పారిజాత కషాయం తాగి, మోకాళ్ళ నొప్పులు దెబ్బకి పారిపోయాయట.”
మరే పుణ్యాత్ములు వచ్చి,
“ఏంటీ? అలోపతీ వైద్యం వాడుతున్నావా? నా మాట విని వెంటనే మానేసెయ్. హోమియోపతిని మించింది మరోటి లేదు. మా మేనత్త అల్లుడు అదే వాడతాడట.”
ఏ ఇరుగమ్మో.. పొరుగమ్మో చెప్పే సలహా..
“మీ మావగారికి పెరాల్సిస్ వచ్చిందటగా? ఫలానా హాస్పిటల్‌లో చేర్పించారటగా? అక్కడ డబ్బులు విపరీతంగా వసూలు చేస్తారు తప్ప ట్రీట్‌మెంట్ అసలు బావుండదు. అసలు మనిషి నయమయి బయటకి రావడం అనుమానమే! నాకు చెప్పుంటే కనుక ఫలానా హాస్పిటల్‌కి వెళ్ళమని చెప్పేదానిని. అక్కడే మా తోడికోడలి కజిన్‌కి ఎదురింటాయన డాక్టర్‌గా చేస్తున్నాడు. ఫీజులో తగ్గింపు కూడా ఇప్పించేదాన్ని కదా!” అనగానే మనకి వళ్ళు మండుతుందా? లేదా? మీరే చెప్పండి.
“మా మావగారు ఇప్పుడు పూర్తి ఆరోగ్యంతో, ఇంటికి వచ్చేసి వారం రోజులయింది. శుభ్రంగా లేచి తిని, తిరుగుతున్నారు? ఈసారి మీ మామగారికో, అత్తగారికో జబ్బు చేస్తే మీ తోడికోడలి కజిన్ ఎదురింటాయన పని చేసే హాస్పిటల్ లోనే జాయిన్ చేసుకోండి.” అని చెప్పి తలుపు ధడేల్మవి వేసుకుని పోదామనిపిస్తుంది కదూ?
అన్నీ అటలే.. ఆడపడుచు వాడిందట, మేనత్త అల్లుడు వాడాడట.. అవన్నీ నేను వాడాలట. సరే, ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసు? కానీ అవన్నీ మన నెత్తిన రుద్దితే ఎలా? మన దారిలో మనకి అనువుగా మనం పోతూ వుంటాము.. అది ఎందుకూ పనికి రానిదన్నట్టు, వాళ్ళు చెప్పిందే నూటికి నూరు పాళ్ళు నిజమైనట్టు చెపుతుంటారు.
మరి కొందరు మహానుభావులుంటారు.
ఎవరికో ఏ హార్ట్ ఎటాకో వచ్చి, ట్రీట్‌మెంట్ కోసం హాస్పటల్‌లో వుంటే ఏ పరామర్శకో వచ్చారనుకోండి.. ఇక వదులుతూవుంటారు వారి స్వీయ అనుభవాలు.
“హార్ట్ ఎటాక్ వచ్చే ముందు నీకు ఎలా అనిపించిందీ? ఏంటీ ముందుగా చెమట్లు పట్టాయా? ఎడం చేయి లాగేసిందా? గుండె పట్టేసిందా? అబ్బో.. అయితే చాలా తిరిగి నువ్వు మామూలు మనిషవడం చాలా కష్టమే. గుండెలో కనీసం నాలుగో ఐదో కన్నాలుండుంటాయి. స్టంటు వేసినా లాభం వుంటుందో? వుండదో? మా పెదనాన్నకి సేమ్ నీలాగే వచ్చింది. ఇక ట్రీట్‌మెంట్ ఏదీ లేదు.. ఇంటికి తీసుకుపొమ్మన్నారు. ఇంటికి వచ్చాక సరిగా మూడు రోజులున్నాడు అంతే.” అనేసరికి, జబ్బు తగ్గుముఖం పట్టిన నయమయిన పేషెంట్‌తో పాటు పక్కనున్నవారికి కూడా వెంటనే హార్ట్ ఎటాక్ రావడం ఖాయం.
ఎక్కడ ఏది మాట్లాడాలో ఏంటో తెలియదేం వీళ్ళకి.
మరో కోవకి చెందినవారు తమదే గొప్ప, అత్యుత్తమం అనుకుని..
“మీ మనవడిని ఫలానా కాలేజీలో చేర్పించారట కదా? అది శుద్ధ వేస్టు కాలేజీ. చేర్పించేముందు నన్ను ఓసారి అడగాల్సింది. మా మనవడిని చేర్పించిన కాలేజీ సిటీలో టాప్ మోస్ట్ అట. అబ్బో! మావాడు ఎన్నో ఎంక్వయిరీలు చేసి మరీ అక్కడే జాయిన్ చేసాడు. అక్కడయితే కాంపస్ సెలెక్షన్‌లు కూడా వున్నాయట. మరి మీ మనవడు చదువు అయాక సెటిల్ అవడం చాలా లేటవుతుంది.” అప్పుడే వాళ్ళ మనవడు జాబ్‌లో సెటిల్ అయిపోయినట్టే కాన్ఫిడెన్స్‌తో ఓ అమ్మమ్మ చెప్పేసరికి ఇవతల బామ్మకి చిర్రెత్తకమానదు.
“హలో గురూ! ఎలా వున్నావు? ఫలానా ఏరియాలో ప్లాట్ తీసుకున్నావని మీ మిసెస్, మా మిసెస్‌కి చెప్పారట. మా మిసెస్ నాకు చెప్పింది. బుద్ధి జ్ఞానం వున్నవాడు ఎవ్వడూ అక్కడ కొనడు. కొనే ముందు నాకొక్క ముక్క చెప్పొచ్చు కదా! అక్కడ స్ధలాల రేట్లు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే వున్నట్టు వున్నాయి. మరో పదేళ్లు తర్వాత కూడా నీ పెట్టుబడి నీకు తిరిగి వస్తుందో రాదో అనుమానమే. నేను చూడు.. ఫలానా చోట మూడు ప్లాట్లు బుక్ చేసాను. కొన్నప్పటికీ ఇప్పటికీ డబుల్ పెరిగింది. తెలివుంటే నాకులాగా చేయాలి.” మీసం తిప్పుకునే ప్రబుద్ధుడుకి ఏం సమాధానం చెప్పాలో తెలీక పాపం మౌనం ఆశ్రయించక తప్పదేమో కదూ!
కానీ, సదరు ప్రబుద్ధుడుకి తెలీని విషయం ఏంటంటే.. తాను తీసుకున్న ప్లాట్‌లు అన్నీ ఏవో గొడవల్లో వున్నవనీ.. త్వరలో వాటికి మంగళం పాడాల్సి వస్తుందనీ.. తాను ఎగతాళి చేసిన వ్యక్తి కొన్న ప్లాటుకి పూర్తి సంరక్షణ వుందనీ, త్వరలోనే అటువేపు బోలెడు పెరిగే ఛాన్స్ వుందనీ తెలీనే తెలీదు. అయినా ఒకవేళ తెలిసినా ఒప్పుకోడుగా.. తనదే రైటని వాదిస్తాడు.
ఇలా ఈ కబుర్లు చెప్పుకుంటూ పోతుంటే.. వీటికి అంతే వుండదు లెండి.. అంతేగా.. అంతే అంతే.